మీ వెలుగు ప్రకాశింపనియ్యండి!
ఆ వృద్ధుడు వాగ్దాన మెస్సీయను చూసే సమయం చివరికి రానే వచ్చింది! తాను ‘యెహోవా యొక్క క్రీస్తును చూడక మునుపు తాను మరణము పొందడని’ దైవిక ప్రకటన ద్వారా సుమెయోనికి తెలుసు. (లూకా 2:26) అయితే సుమెయోను ఆలయంలోనికి ప్రవేశించగానే మరియ యోసేపులు ఆయన చేతుల్లో పసివాడైన యేసును పెట్టడం, ఎంతటి పులకరింత కలుగజేసిందో కదా! ఆయన ఇలా చెబుతూ దేవునిని స్తుతిస్తున్నాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు . . . వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను . . . సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.”—లూకా 2:27-32; యెషయా 42:1-6, పోల్చండి.
యేసు తన 30వ యేట బాప్తిస్మం పొందినప్పటి నుండి తన మరణ పర్యంతమూ ప్రపంచానికి ఓ “వెలుగు”గా నిరూపించుకున్నాడు. ఏయే రీతుల్లో? దేవుని రాజ్యాన్ని గురించి మరి ఆయన సంకల్పాల్ని గురించి ప్రకటించడం ద్వారా ఆయన ఆత్మీయ వెలుగును ప్రకాశింపజేశాడు. ఆయన అబద్ధమత బోధల్ని కూడా బయల్పర్చి, చీకటి సంబంధమైన పనుల్ని స్పష్టంగా గుర్తించాడు. (మత్తయి 15:3-9; గలతీయులు 5:19-21) అందుకే యేసు సరిగానే ఇలా చెప్పగలిగాడు: “నేను లోకమునకు వెలుగును.”—యోహాను 8:12.
సా.శ. 33లో యేసు చంపబడ్డాడు. అంతటితో వెలుగు ఆరిపోయిందా? కచ్చితంగా ఆరిపోలేదు! భూమిపై ఉన్నప్పుడు యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: ‘మనుష్యుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి.’ (మత్తయి 5:16) అదే ప్రకారంగా, యేసు మరణం తర్వాత ఆయన అనుచరులు వెలుగును ప్రకాశింపజేస్తున్నారు.
యేసును అనుకరిస్తూ, ప్రకటించే పనిలో పాల్గొనడం ద్వారా క్రైస్తవులు నేడు యెహోవా వెలుగును ప్రకాశింపజేస్తున్నారు. వారు, క్రైస్తవ జీవన విధానంలోని ప్రకాశవంతమైన మాదిరికర్తలుగా తమ్మును రుజువు చేసుకోవడం ద్వారా “వెలుగు సంబంధులవలె నడుచు”కొంటారు.—ఎఫెసీయులు 5:10.