రాజ్య ప్రచారకుల నివేదిక
యెహోవాను సేవించుటలో మునుపటి శత్రువులు ఐక్యమయ్యారు
“యెహోవాసాక్షుల్ని గురించి విన్నదేదైనాసరే మొదటిసారిగా విన్నది బోస్నీయాలో నేను సైనిక గార్డుగా పనిచేస్తుండగానేనని,” బ్రాన్కో వివరిస్తున్నాడు.a
బ్రాన్కో, గాయపర్చబడిన వారు చికిత్సపొందే ఆసుపత్రి దగ్గర గార్డుగా డ్యూటీలో ఉన్నాడు. డాక్టర్లలో ఒకరు యెహోవాసాక్షులతో బైబిల్ని పఠిస్తుండేవాడు ఒక రాత్రి బ్రాన్కో, షిప్టు డ్యూటీలో ఉన్నప్పుడు, ఆయన బైబిలు గురించి తాను నేర్చుకున్నదానిలో ఎక్కువ భాగాన్ని బ్రాన్కోకు వివరించాడు.
ఆ రాత్రి బ్రాన్కో విన్నది, తాను తన ఆయుధాల్ని వెంటనే క్రింద పారవేసేలా ఆయనను కదిలించింది. ఇంకా ఎక్కువ తెలుసుకొనేందుకు ఆయన సాక్షుల్ని కలుసుకున్నాడు. కొంత కాలం తర్వాత అంటే ఐరోపాలోని మరో దేశానికి వెళ్లిన తరువాత, బ్రాన్కో ఒక రాజ్యమందిరాన్ని వెదకి కనుగొని, యెహోవాసాక్షుల యుగోస్లావియన్ సంఘ కూటానికి హాజరయ్యాడు. అక్కడే బ్రాన్కో స్లోబోడాన్ని కలుసుకున్నాడు.
స్లోబోడాన్ కూడా బోస్నీయా నుండే వచ్చాడు, బ్రాన్కోలాగే అదే యుద్ధంలో స్వచ్ఛందంగా పని చేశాడు కాని శత్రు శిబిరంలో పనిచేశాడు. స్లోబోడాన్ క్రోటియన్లకు వ్యతిరేకంగా సెర్బీనీయుల కొరకు పోరాడాడు. వారిరువురూ కలుసుకొనేటప్పటికి, స్లోబోడాన్ బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షి అయ్యాడు. ఆయన తన మునుపటి శత్రువైన బ్రాన్కోతో బైబిలు పఠనం చేయడానికి ప్రతిపాదన చేశాడు. పఠనం అభివృద్ధి చెందుతుండగా బ్రాన్కో యెహోవాను గురించి మరింతగా తెలుసుకున్నాడు, దేవుని ఎడలగల ఆయన ప్రేమ వృద్ధియైంది. ఇది తన జీవితాన్ని సృష్టికర్తకు సమర్పించుకోవడానికి బ్రాన్కోను ప్రేరేపించింది. అక్టోబరు 1993లో నీటి బాప్తిస్మం ద్వారా ఆయన తన సమర్పణను సూచించాడు.
స్లోబోడాన్ యెహోవాసాక్షుల్లో ఒకనిగా ఎలా అయ్యాడు? ఆయన కొంతకాలం మునుపే బోస్నీయాలోని యుద్ధ ప్రదేశాన్ని విడిచి పెట్టాడు. సాక్షుల సాహిత్యాల్ని కొన్నింటిని ఆయన చదివాడు కాని 1992 తొలిభాగంలో ఇరువురు సాక్షులు ఆయన గృహాన్ని సందర్శించేంత వరకూ దేవుని వాక్యమందలి ఆయన ఆసక్తి పెరగలేదు. ఆయనతో కలిసి బైబిల్ని పఠించడానికి స్లోబోడాన్ను ఆహ్వానించిందెవరు? బోస్నీయా నుండి వచ్చిన మూయో, కాని ఈయన ఒక ముస్లిమ్గా పెరిగాడు. బైబిలు పఠనం అభివృద్ధి చెందుతుండగా, ఒకప్పటి శత్రువులైన మూయో, స్లోబోడాన్లు ఒకరి విశ్వాసాన్ని ఒకరు బలపర్చుకొనేందుకు అనుదినమూ కొంత సమయాన్ని వెచ్చించేవారు.
మునుపటి యుగోస్లావియాలో జరిగిన యుద్ధం, లక్షలాదిమంది ప్రజల జీవితాల్ని బలితీసుకుంది. కాని బ్రాన్కో, స్లోబోడాన్ మరియు మూయోలు, ఒకే యెహోవాసాక్షుల సంఘంలో ఇప్పుడు పూర్తికాల ప్రచారకులుగా పనిచేస్తున్నారు. వారు భాషా, జాతి పోరాటాన్ని అధిగమించారు మరిప్పుడు వారు సృష్టికర్తయైన యెహోవాకు లోబడుతూ శాంతిని అన్వేషిస్తున్నారు.
అయితే అలాంటి మార్పుల్ని తెచ్చిందేమిటి? అది యెహోవా ఎడలగల వారి ప్రేమ, బైబిలు ఎడలగల వారి గౌరవం మరి తమ జీవితాల్లో బైబిలు సత్యాల్ని అన్వయించుకోవాలనే వారి ఆతృతే. పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నట్లుగా “దేవుని వాక్యము సజీవమై బలముగలదై . . . హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధి”స్తుంది.—హెబ్రీయులు 4:12.
[అధస్సూచీలు]
a మారు పేర్లు ఉపయోగించబడ్డాయి.