సుఖదుఃఖాల్లో దేవుని సేవలో ఐక్యమగుట
మీషెల్ మరియు బాబెట్ మ్యులర్ చెప్పినది
“మీకు నేను దుర్వార్త తెచ్చాను” అని వైద్యుడన్నాడు. “ఆఫ్రికాలో మీ మిషనరీ జీవితాన్ని గురించి మీరు మర్చిపోవచ్చు.” నా భార్య బాబెట్ వైపు చూస్తూ, “మీకు రొమ్ము క్యాన్సర్ ఉంది” అని అన్నాడు.
మాటలకందనంతగా మేము నిర్ఘాంతపోయాము. మా మనస్సుల్లో ఎన్నో విషయాలు మెదిలాయి. వైద్యుని దగ్గరకు ఈ సందర్శనం ఆఖరి పరీక్ష మాత్రమే అయ్యుంటుందని మేము అనుకున్నాము. పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌కు తిరుగు ప్రయాణానికి మా టికెట్లు కొనుగోలు చేయబడ్డాయి. ఆ వారంలోగా మేము అక్కడ ఉండగలమని ఆశించాము. 23 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో, మేము సుఖదుఃఖాలను అనుభవించాము. కలవరపడి భయకంపితులమై, మేము ఇప్పుడు క్యాన్సర్‌కు విరుద్ధంగా పోరాటానికి మమ్మల్ని మేము సన్నద్ధులం చేసుకున్నాము.
మనం మొదటి నుండి మొదలెడదాం. మీషెల్ 1947 సెప్టెంబరులో జన్మించాడు, బాబెట్ 1945 ఆగస్టులో జన్మించింది. మేము ఫ్రాన్స్‌లో పెరిగాము, 1967లో వివాహం చేసుకున్నాం. మేము పారిస్‌లో కాపురముండేవారం. 1968 తొలి భాగంలో, ఒకరోజు ఉదయం బాబెట్ పనికి వెళ్ళడం ఆలస్యమైంది. ఒక స్త్రీ ఇంటికి వచ్చి, ఆమెకు ఒక మత సంబంధ బ్రోషూరును ప్రతిపాదించింది; ఆమె దాన్ని తీసుకుంది. అప్పుడు ఆ స్త్రీ ఇలా అన్నది: “నేను నా భర్తను తీసుకుని, మీతోను మీ భర్తతోను మాట్లాడడానికి మళ్ళీ తిరిగి రావచ్చునా?”
బాబెట్ తన ఉద్యోగం గురించి ఆలోచిస్తుంది. ఆ స్త్రీ వెళ్ళిపోవాలని ఆమె కోరుకుంటుంది, అందుకే ఆమె ఇలా అన్నది: “సరే, సరే.”
మీషెల్ వివరిస్తున్నాడు: “మతంలో నాకు ఆసక్తి లేదు, కానీ బ్రోషూరు నా దృష్టిని ఆకర్షించింది, మరి నేను దాన్ని చదివాను. కొద్ది రోజుల తరువాత, ఆ స్త్రీ, జాస్‌లన్ లమ్వాన్, తన భర్త క్లాడ్‌తో తిరిగి వచ్చింది. బైబిలును ఉపయోగించడంలో ఆయన మహా నిపుణుడు. నా ప్రశ్నలన్నింటికీ ఆయన దగ్గర జవాబులున్నాయి. నేను గాఢంగా ప్రభావితం చేయబడ్డాను.
“బాబెట్ ఒక మంచి కాథోలిక్కు, కానీ ఆమె వద్ద బైబిలు లేదు, అలా బైబిలు లేకపోవడం కాథోలిక్కులకు అసాధారణం కాదు. దేవుని వాక్యాన్ని చూడడానికి, చదవడానికి ఆమె చాలా ఉత్తేజితురాలైంది. మాకు నేర్పించబడ్డ అనేక మతసంబంధమైన ఆలోచనలు తప్పని, మా పఠనం ద్వారా మేము నేర్చుకున్నాము. మేము నేర్చుకుంటున్న విషయాల్ని గురించి మా బంధువులతో స్నేహితులతో మేము మాట్లాడడం మొదలు పెట్టాము. 1969 జనవరిలో మేము బాప్తిస్మం పొంది యెహోవాకు సాక్షులమయ్యాము. దాని తర్వాత వెంటనే, మా బంధువులు మరియు స్నేహితులలో తొమ్మిది మంది బాప్తిస్మం పొందారు.”
ప్రచారకులు అవసరమైన చోట సేవ చేయడం
మా బాప్తిస్మం అయిన వెంటనే, మేమిలా అనుకున్నాము: ‘మనకు పిల్లలెవరూ లేరు. పూర్తికాల సేవను ఎందుకు చేపట్టకూడదు?’ అందువలన 1970లో మా ఉద్యోగాలను విడిచిపెట్టి, క్రమ పయినీర్ల జాబితాలో చేరి, ఫ్రాన్స్ మధ్యలోని నెవర్స్ దగ్గర మాన్యీ-లార్మ్ అనే చిన్న పట్టణానికి మారాము.
అది చాలా కష్టతరమైన నియామకమైయుండెను. బైబిలును పఠించాలని కోరుకునే ప్రజలను కనుగొనడం చాలా కష్టంగా ఉండినది. మేము లౌకిక ఉద్యోగం పొందలేకపోయాము, అందువలన మా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది. కొన్నిసార్లు మా దగ్గర తినడానికి బంగాళాదుంపలు మాత్రమే ఉండేవి. శీతాకాలంలో ఉష్ణోగ్రత సున్నా సెల్సియస్‌కు క్రిందుగా 22 డిగ్రీలకు పడిపోయేది. మేమక్కడ గడిపిన కాలాన్ని చిక్కిపోయిన ఆవుల కాలంగా పిలిచాము.—ఆదికాండము 41:3.
కానీ యెహోవా మమ్మల్ని పోషించాడు. ఒకరోజు మా దగ్గర ఆహారం దాదాపు అయిపోయినప్పుడు, బాబెట్ సహోదరివద్ద నుండి తపాలామనిషి, జున్ను ఉన్న ఒక పెద్ద డబ్బాను బట్వాడా చేశాడు. ఇంకొక రోజు ప్రకటనా పని నుండి మేము ఇంటికి తిరిగివచ్చినప్పుడు, మమ్మల్ని చూడడానికి 500 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన కొంతమంది స్నేహితులను కనుగొన్నాము. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో విని, ఈ సహోదరులు వారి రెండు కార్లను మాకొరకు ఆహారంతో నింపుకొని తెచ్చారు.
ఒకటిన్నర సంవత్సరం తరువాత, సొసైటీ మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాల వరకు, మేము నెవర్స్‌లో పని చేశాము, తరువాత ట్రాయ్స్‌లో, తరువాత ఆఖరికి మోంటీన్యీ లేమెట్స్‌లో పని చేశాము. మీషెల్, 1976లో నైరృతీ ఫ్రాన్స్‌లో ప్రాంతీయ కాపరిగా సేవ చేసేందుకు నియమించబడ్డాడు.
రెండు సంవత్సరాల తర్వాత, ప్రాంతీయ కాపరుల కొరకు ఒక పాఠశాల జరుగుతున్న సమయంలో, వాచ్ టవర్ సొసైటీ మమ్మల్ని మిషనరీలుగా విదేశానికి వెళ్ళమని ఆహ్వానిస్తూవున్న ఒక ఉత్తరాన్ని మేము అందుకున్నాము; మేము చాడ్ మరియు బుర్కీన ఫాసోల [అప్పట్లో అప్పర్ వోల్టా] మధ్య దేన్నైనా ఎన్నుకోవచ్చని ఆ ఉత్తరంలో ఉంది. మేము చాడ్‌ను ఎన్నుకొన్నాము. మమ్మల్ని టాహిటి బ్రాంచి క్రింద పని చేయమని నియమిస్తూవున్న ఇంకొక ఉత్తరాన్ని త్వరలోనే మేము అందుకున్నాము. మేము ఆఫ్రికా కొరకు అడిగాము, అదొక పెద్ద ఖండం, కానీ త్వరలోనే ఒక చిన్న ద్వీపంలో మమ్మల్ని మేము కనుగొన్నాము!
దక్షిణ పసిఫిక్‌లో సేవ చేయడం
టాహిటి దక్షిణ పసిఫిక్‌లోని ఒక అందమైన ఉష్ణమండల ద్వీపం. మేము అక్కడికి చేరుకున్నప్పుడు, దాదాపు వందమంది సహోదరులు విమానాశ్రయంలో మమ్మల్ని కలవడానికి అక్కడ ఉన్నారు. వారు మమ్మల్ని పూలదండలతో ఆహ్వానించారు, మరి ఫ్రాన్స్‌నుండి సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత మేము అలసిపోయివున్నా, మేము చాలా సంతోషంగా ఉన్నాము.
మేము టాహిటికి చేరుకున్న నాలుగు నెలల తరువాత, ఎండు కొబ్బరికాయల సరుకుతో నిండివున్న ఒక చిన్న పడవను ఎక్కాము. ఐదు రోజుల తరువాత మేము మా క్రొత్త నియామకానికి చేరుకున్నాము—మార్క్విసాస్ దీవులలోని నూకు హివా ద్వీపం. దాదాపు 1,500 మంది ప్రజలు ఆ ద్వీపంలో నివసిస్తున్నారు, కానీ సహోదరులెవ్వరు లేరు. కేవలం మేమే.
ఆ సమయంలో పరిస్థితులు అనాగరికంగా ఉండేవి. కాంక్రీటు, వెదురుతో చేయబడిన ఒక చిన్న ఇంటిలో మేము నివసించాము. అక్కడ విద్యుత్తు లేదు. అప్పుడప్పుడు పనిచేసే నీటి కుళాయి మాకుంది, కానీ నీళ్ళు బురదగా వచ్చేవి. ఎక్కువగా, మేము తొట్టిలో నిండిన వాన నీటినే వాడాము. అక్కడ రోడ్లు వేయబడ లేదు, కేవలం మట్టి కాలిబాటలే ఉండేవి.
ద్వీపంలోని సుదూర ప్రాంతాలకు చేరడానికి, మేము గుర్రాలను అద్దెకు తీసుకోవలసి వచ్చేది. జీనులు చెక్కతో చేయబడివుండేవి—బాబెట్ ఇంతకు ముందెన్నడూగుర్రంపై సవారీ చేయలేదు గనుక ప్రాముఖ్యంగా ఆమెకు అలా చాలా అసౌకర్యంగా ఉండేవి. దారికడ్డంగా పడివున్న బొంగులను నరకడానికి మేము ఒక పెద్ద కత్తి తీసుకెళ్ళే వాళ్ళం. ఫ్రాన్స్‌లోని జీవితానికి దీనికి ఎంతో తేడావుంది.
కేవలం మేమిద్దరమే హాజరైనా, మేము ఆదివారపు కూటాలను జరిపేవాళ్ళం. మేమిద్దరమే ఉన్నాం కాబట్టి, మొదట్లో మేము ఇతర కూటాలు జరుపుకునే వారము కాదు. దానికి బదులుగా మేము సమాచారాన్ని కలిసి చదివేవాళ్ళం.
కొన్ని నెలల తరువాత, ఆ విధంగా కొనసాగించడం మంచిది కాదని మేము నిర్ణయించుకున్నాము. మీషెల్ వివరిస్తున్నాడు: “‘మనం సరైన బట్టలు వేసుకోవాలి. నీవు అక్కడ క్రింద కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను. నేను ప్రార్థనతో ప్రారంభిస్తాను, తరువాత మనం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటాలను జరుపుకుందాము. గదిలో మనిద్దరమే ఉన్నాం కాబట్టి, నేను ప్రశ్నలను అడుగుతాను, నీవు జవాబులు చెబుతావు’ అని నేను బాబెట్‌తో అన్నాను. మేము అలా చేయడం మంచిదయ్యింది ఎందుకంటే, సంఘం లేనప్పుడు ఆత్మీయంగా మాంద్యంగా తయారవ్వడం సులభమే.”
ప్రజలు మా క్రైస్తవ కూటాలకు వచ్చేలా చేయడానికి సమయం పట్టింది. మొదటి ఎనిమిది నెలల వరకు మేమిద్దరమే ఉండేవాళ్ళం. తరువాత ఒకరు, ఇద్దరు, లేదా కొన్నిసార్లు ముగ్గురు వ్యక్తులు మాతో కలిసేవారు. ఒక సంవత్సరం, వార్షిక ప్రభు రాత్రి భోజన ఆచరణను కేవలం మేమిద్దరమే ప్రారంభించాము. పది నిమిషాల తరువాత, కొంతమంది ప్రజలు వచ్చారు, అందువలన నేను ఆగి ప్రసంగాన్ని మరలా ప్రారంభించాను.
నేడు, మార్క్విసాస్ దీవుల్లో 42 మంది ప్రచారకులు మరియు 3 సంఘాలు ఉన్నాయి. పనిలో అత్యధిక భాగం మా తరువాత వచ్చినవారు చేసినా, మేము అంతకు క్రితమెప్పుడో కలిసిన ప్రజలు ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారయ్యారు.
మన సహోదరులు అమూల్యమైన వారు
నూకు హివాలో మేము ఓర్పును నేర్చుకున్నాము. అత్యంత మౌలిక అవసరాల కొరకు కాక మేము ప్రతిదానికీ వేచివుండాల్సి వచ్చేది. ఉదాహరణకు మీకొక పుస్తకం కావాల్సివస్తే, మీరు దానికొరకు వ్రాయాలి, తరువాత అది రావడానికి రెండు లేక మూడు నెలలు వేచివుండాలి.
మన సహోదరులు అమూల్యమైన వారు అన్నది మేము నేర్చుకున్న మరో పాఠం. టాహిటి సందర్శించి ఒక కూటానికి హాజరై సహోదరులు పాడడం విన్నప్పుడు మేము కన్నీళ్ళు వచ్చేంతగా కదిలించబడ్డాము, కొంతమంది సహోదరులతో వ్యవహరించడం కష్టమనేది నిజమే అయ్యుండవచ్చు. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు సహోదరులతో కలిసివుండడం ఎంత బాగుంటుందో మీరు తెలుసుకుంటారు. 1980లో మేము టాహిటికి తిరిగి వెళ్ళి సర్క్యూట్ పనిలో సేవచేయాలని సొసైటీ నిర్ణయించింది. అక్కడ, సహోదరుల ప్రేమపూర్వకమైన ఆతిథ్యం, ప్రకటనా పనియెడల వారికున్న ప్రేమ వలన మేమెంతో ప్రోత్సహించబడ్డాము. టాహిటిలో సర్క్యూట్ పనిలో మేము మూడు సంవత్సరాలు గడిపాము.
ద్వీపం నుండి ద్వీపానికి
తరువాత మేము మరొక పసిఫిక్ ద్వీపమైన రైటేలో ఒక మిషనరీ గృహానికి నియమించబడ్డాము, అక్కడ మేము దాదాపు రెండు సంవత్సరాలున్నాము. రైటే తరువాత, మేము టూమోటూ ద్వీప సమూహంలో సర్క్యూట్ పనికి నియమించబడ్డాము. మేము అక్కడి 80 ద్వీపాల్లోని 25 ద్వీపాలను పడవలో వెళ్ళి దర్శించాము. బాబెట్‌కు అది కష్టతరంగా ఉండింది. పడవలో ప్రయాణించిన ప్రతీసారి, ఆమె అస్వస్థురాలైంది.
బాబెట్ అంటుంది: “అది ఘోరంగా ఉండింది! పడవపై గడిపిన కాలమంతా నేను అస్వస్థతతో ఉన్నాను. సముద్రంపై మేము ఐదు రోజులుంటే, ఐదు రోజులూ నేను అస్వస్థురాలినే. మందులేవీ నాకు పని చేయలేదు. అయినా, నాకు అస్వస్థత ఉన్నప్పటికీ, ఆ మహాసముద్రం అందంగా ఉందనుకున్నాను. అది అద్భుతమైన దృశ్యం. డాల్ఫిన్లు పడవతో పందెం వేసుకొనేవి. మీరు మీ చేతులతో చప్పట్లు కొట్టినప్పుడు అవి నీటిలోనుండి పైకి ఎగిరేవి!”
ఐదు సంవత్సరాల సర్క్యూట్ పని తరువాత, రెండు సంవత్సరాలకొరకు మేము టాహిటికి మరలా నియమించబడ్డాము, మేము మరలా ప్రకటనా పని చేయడంలో ఆనందించాము. మా సంఘం ఒకటిన్నర సంవత్సరంలో 35 నుండి 70 ప్రచారకులుగా రెండింతలైంది. మేము బైబిలు పఠనం నిర్వహించిన పన్నెండుమంది మేము విడిచి వెళ్ళడానికి కొద్దిగా ముందు బాప్తిస్మం పొందారు. వారిలో కొందరు ఇప్పుడు సంఘంలో పెద్దలు.
మొత్తమంతా కలిపి మేము దక్షిణ పసిఫిక్‌లో 12 సంవత్సరాలు గడిపాము. అప్పుడు సంఘాలు బలంగావున్నందున వారికిక ఆ ద్వీపంలో మిషనరీలు అవసరం లేదని చెబుతున్న ఒక ఉత్తరాన్ని మేము సొసైటీ నుండి అందుకున్నాం. మేము టాహిటికి చేరుకున్నప్పుడు అక్కడ 450 ప్రచారకులున్నారు, మేము విడిచినప్పుడు 1,000కి పైగా ఉన్నారు.
ఆఖరికి ఆఫ్రికాకు!
మేము ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్ళాము, ఒకటిన్నర నెల తరువాత సొసైటీ మాకు క్రొత్త నియామకం ఇచ్చింది—పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్. ఆఫ్రికాకు వెళ్ళాలని మేము 13 సంవత్సరాల క్రితమే కోరుకున్నాము, అందువలన మేము చాలా సంతోషించాము.
1990, నవంబరు 3న మేము బెనిన్‌కు చేరుకున్నాము మరి రాజ్య ప్రచార కార్యాలపై 14 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత అక్కడికి చేరుకున్న మొదటి మిషనరీలలో మేమున్నాము. అది చాలా ఉత్తేజంగా ఉండింది. జీవనం పసిఫిక్ ద్వీపాలలోని వంటిదే కావడం మూలాన స్థిరపడడంలో మాకే సమస్యా ఎదురవ్వలేదు. ప్రజలు చాలా స్నేహపూర్వకంగాను అతిథిప్రియులుగానూ ఉన్నారు. వీధిలో ఎవరినైనా మీరు ఆపి మాట్లాడవచ్చు.
మేము బెనిన్‌కు చేరిన కేవలం కొద్ది వారాల తరువాత బాబెట్ తన రొమ్ములో ఒక గడ్డను గమనించింది. అందువలన మేము క్రొత్తగా స్థాపించబడిన బ్రాంచి కార్యాలయం దగ్గరున్న ఒక చిన్న చికిత్సాలయానికి వెళ్ళాము. వైద్యురాలు ఆమెను పరీక్షించి ఆమెకు చాలా త్వరలోనే శస్త్రచికిత్స అవసరమని చెప్పింది. ఆ తరువాతి రోజు మేము ఇంకొక చికిత్సాలయానికి వెళ్ళాము, అక్కడ ఫ్రాన్స్‌కు చెందిన గైనకాలజిస్టు అయిన ఒక యూరోపియన్ వైద్యురాలిని కలిశాము. ఆమె కూడా, బాబెట్ శస్త్రచికిత్స పొందగలిగేలా మేము త్వరగా ఫ్రాన్స్‌కు వెళ్ళవలసిందేనని చెప్పింది. రెండు రోజుల తరువాత మేము ఫ్రాన్స్‌కు వెళ్ళే విమానంలో ఉన్నాము.
బెనిన్‌ను విడిచిపెడుతున్నందుకు మాకు చాలా దుఃఖంగా ఉంది. ఆ దేశంలోని నవీకరించబడిన మత స్వాతంత్ర్యంతో, సహోదరులు క్రొత్త మిషనరీలను కలిగివుండడంలో అత్యుత్సుకతను అనుభవించారు, మరి మేము అక్కడ ఉండడంలో ఆహ్లాదాన్ని పొందాము. అందువలన ఆ దేశంలో కేవలం కొద్దివారాలే ఉన్న తరువాత విడిచి వెళ్ళవలసి వచ్చినందుకు మేమెంతో కలత చెందాము.
మేము ఫ్రాన్స్‌కు చేరుకున్నప్పుడు, శస్త్రవైద్యుడు బాబెట్‌ను పరీక్షించిన తరువాత ఆమెకు శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించాడు. వైద్యులు త్వరగా చర్యగైకొని, ఒక చిన్న శస్త్రచికిత్స చేసి ఆ తరువాతి రోజు బాబెట్‌ను ఆసుపత్రినుండి విడుదల చేశారు. ఆ విషయం దీనితో సమాప్తమైందని మేము అనుకున్నాము.
ఎనిమిది రోజుల తరువాత, మేము శస్త్రవైద్యుని కలుసుకున్నాము. అప్పుడే ఆయన, బాబెట్‌కు రొమ్ము క్యాన్సర్ ఉందన్న వార్తను వెలువరించాడు.
ఆ సమయంలో ఆమె ఎలా భావించిందన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, బాబెట్ అంది: “మొదట, నేను మీషెల్ కన్నా తక్కువ కలత చెందాను. కానీ ఆ దుర్వార్త తరువాతి రోజు, నాలో భావాలేమీ లేవు. నేను ఏడవలేకపోయాను. నేను నవ్వలేకపోయాను. నేను మరణించబోతున్నానని అనుకున్నాను. నాకైతే క్యాన్సర్ అంటే మరణంతో సమానం. నా దృక్పథం ఏమంటే, మనం చేయవలసిందేదో అది చేయాలి.”
క్యాన్సర్‌తో పోరాటం
మేమా దుర్వార్త శుక్రవారం విన్నాము, మరి బాబెట్‌కు రెండవ శస్త్రచికిత్స కొరకు మంగళవారం నిర్ధారించబడింది. మేము బాబెట్ అక్కతో ఉంటున్నాము, కానీ ఆమె కూడా అస్వస్థురాలే గనుక ఆమె ఉంటున్న చిన్న అపార్టుమెంటులో ఉండలేకపోయాము.
మేమెక్కడికి వెళ్ళగలమా అని ఆలోచించాము. అప్పుడు మేము ఇంతకుముందు బస చేసిన ఈవ్ మరియు బ్రీజీట్ మర్ద అనే దంపతులను జ్ఞాపకం చేసుకున్నాము. ఈ దంపతులు మా ఎడల ఎంతో ఆతిథ్యాన్ని కనబరచారు. కాబట్టి మేము ఈవ్‌ను ఫోనులో పలకరించి బాబెట్‌కు శస్త్రచికిత్స అవసరమైందని చెప్పి మరి మేమెక్కడ బస చేయాలన్న విషయం తెలియడం లేదని చెప్పాము. మీషెల్‌కు ఉద్యోగం అవసరముందని కూడా చెప్పాము.
ఈవ్ మీషెల్‌కు ఆయన ఇంట్లో పని ఇచ్చాడు. అనేకమైన దయాపూర్వక క్రియలద్వారా సహోదరులు మాకు మద్దతిచ్చి మమ్మల్ని ప్రోత్సాహపరచారు. వారు మాకు ఆర్థికంగా కూడా సహాయం చేశారు. బాబెట్ వైద్య ఖర్చులను సొసైటీ భరించింది.
అది పెద్ద శస్త్రచికిత్సయైవుండెను. వైద్యులు శోషరస గ్రంధులు మరియు రొమ్ము తీసివేయవలసివచ్చింది. వారు వెంటనే కెమోథెరపీ ప్రారంభించారు. ఒక వారం తరువాత, బాబెట్ ఆసుపత్రి విడిచిపెట్టగలిగింది కానీ క్రమమైన చికిత్సకొరకు ప్రతీ మూడు వారాలకు ఒకసారి తిరిగి రావలసి వచ్చేది.
బాబెట్ చికిత్సపొందుతున్న సమయంలో, సంఘంలోని సహోదరులు ఎంతో సహాయకరంగా ఉన్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మరొక సహోదరి గొప్ప ప్రోత్సాహకరంగా ఉండినది. ఆమె బాబెట్‌కు, ఏమి ఎదురుచూడవచ్చో చెప్పింది మరి తనకు ఎంతో ఆదరణను ఇచ్చింది.
అయినాగానీ, మేము భవిష్యత్తు ఎడల వ్యాకులతతో ఉన్నాము. దీనిని వివేచించిన మీషెల్ మరియు ఝానెట్ సెలెర్యీ భోజనానికి ఒక ఉపాహారగృహానికి మమ్మల్ని తీసుకెళ్ళారు.
మేము మిషనరీ సేవను విడిచిపెట్టవలసి వస్తుందనీ మేము మరలా ఆఫ్రికాకు ఎప్పటికీ తిరిగి వెళ్ళలేమనీ వారికి చెప్పాము. అయితే, సహోదరుడు సెలెర్యీ అన్నాడు: “ఏమిటీ? మీరు విడిచిపెట్టాలని ఎవరు చెప్పారు? పరిపాలక సభా? ఫ్రాన్స్‌లోని సహోదరులా? ఎవరు చెప్పారలా?”
“అలాగని ఎవరూ చెప్పలేదు” నేను ప్రత్యుత్తరమిచ్చాను, “నేను చెబుతున్నాను.”
“లేదు, లేదు!” సహోదరుడు సెలెర్యీ అన్నాడు. “మీరు తిరిగి వెళ్తారు!”
కెమోథెరపీ తరువాత రేడియేషన్ 1991, ఆగస్టు ఆఖరుకల్లా ముగించబడింది. మేము ఆఫ్రికాకు తిరిగి వెళ్తే ఫరవాలేదని, అయితే బాబెట్ క్రమమైన పరీక్షల నిమిత్తం వెనక్కి ఫ్రాన్స్‌కు వెళ్తూ ఉంటే మంచిదని వైద్యులు చెప్పారు.
తిరిగి బెనిన్‌కు
కాబట్టి మిషనరీ సేవ కొరకు తిరిగి వెళ్ళేందుకు అనుమతిని అడుగుతూ మేము బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయానికి ఉత్తరం వ్రాశాము. వారి ప్రత్యుత్తరాన్ని వినడానికి మేము ఆతురతతో ఉన్నాము. రోజులు నెమ్మదిగా గడిచాయి. ఆఖరికి, మీషెల్ ఇక ఎంతమాత్రం వేచివుండలేకపోయాడు, అందువలన ఆయన బ్రూక్లిన్‌కు టెలిఫోన్ చేసి మా ఉత్తరం అందిందో లేదో అడిగాడు. వారు దాన్ని పరిగణనలోనికి తీసుకున్నారని చెప్పారు—మేము బెనిన్‌కు తిరిగి వెళ్ళగలము! మేము యెహోవాకు ఎంత కృతజ్ఞులమైవున్నామో!
ఈ వార్త విషయమై ఆనందించేందుకు మర్ద కుటుంబము గొప్ప వేడుకను ఏర్పాటు చేసింది. 1991 నవంబరులో మేము బెనిన్‌కు తిరిగివెళ్ళాము, అక్కడి సహోదరులు ఒక విందు చేసి మమ్మల్ని ఆహ్వానించారు.
బాబెట్ ఇప్పుడు బాగున్నట్లు కన్పిస్తుంది. మేము ఫ్రాన్స్‌కు నిర్ణీత సమయంలో పూర్తి వైద్య పరీక్షల నిమిత్తం తిరిగి వెళ్ళాము, వైద్యులకు క్యాన్సర్ జాడ కన్పించలేదు. మా మిషనరీ నియామకం తిరిగి చేపట్టడానికి మేమెంతో ఉల్లసించాము. బెనిన్‌లో మా అవసరం ఉందని అవగతం చేసుకున్నాము, మరి యెహోవా మా పనిని ఆశీర్వదించాడు. మేము తిరిగి వెళ్ళినప్పటినుండి 14 మంది వ్యక్తులు బాప్తిస్మం తీసుకునేందుకు మేము సహాయం చేశాము. వారిలో ఐదుగురు ఇప్పుడు క్రమ పయినీర్లు, ఒకరు పరిచర్య సేవకునిగా నియమించబడ్డాడు. మా చిన్న సంఘం అభివృద్ధిచెంది రెండు సంఘాలుగా విభాగించబడడం కూడా మేము చూశాము.
సంవత్సరాలుగా, భార్యాభర్తలుగా మేము యెహోవాను సేవించాము, ఎన్నో ఆశీర్వాదాలను అనుభవించాము మరి ఎంతో మంది మహత్తరమైన వ్యక్తులను తెలుసుకోగలిగాము. అయితే కష్టకాలాలను విజయవంతంగా సహించడానికి మేము యెహోవా వలన తర్ఫీదు పొందాము మరియు బలపరచబడ్డాము కూడా. యోబు వలె, విషయాలు అలా ఎందుకు జరుగుతున్నాయో అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు, కానీ యెహోవా అన్ని సమయాల్లోనూ మాకు సహాయం చేయడానికి ఉన్నాడని మాకు తెలియలేదు. అది దేవుని వాక్యం చెప్పిన రీతిలోనే ఉంది: “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు.”—యెషయా 59:1.
[23వ పేజీలోని చిత్రం]
బెనిన్‌లో సాంప్రదాయిక దుస్తులను వేసుకున్న మీషెల్ మరియు బాబెట్ మ్యులర్
[25వ పేజీలోని చిత్రం]
ఉష్ణమండల టాహిటిలో పాలినేషియన్ల మధ్య మిషనరీ పని