మీ వివాహ ప్రమాణానికి తగినట్లు జీవించడం!
వివాహ దినం ఆనందభరితమైన దినం. అది చాలా గంభీరమైన సందర్భం కూడా. పెండ్లి కుమార్తె మరియు పెండ్లి కుమారుడు తమ తర్వాతి జీవితమంతటిపై ప్రభావం చూపే గంభీరమైన వాగ్దానం చేస్తారు. వివాహానికి హాజరైన అతిథులు ఈ గంభీరమైన వాగ్దానానికి సాక్షులు, కాని యెహోవా దేవుడు ప్రధాన సాక్షి.
బైబిలు ప్రత్యేకమైన పద్ధతులను లేక విశేషమైన వివాహ వేడుక విధానాన్ని కోరడం లేదు. అయినప్పటికీ, దాని దైవిక మూలాన్ని గుర్తిస్తూ, మతసంబంధమైన వేడుక సమయంలో వివాహ ప్రమాణాలను ఉపయోగించడం ద్వారా వివాహం సాంప్రదాయబద్ధంగా ఆచరింపబడుతుంది. కొన్ని సంవత్సరాలుగా యెహోవాసాక్షులు ఈ క్రింది వివాహ ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నారు: “—— అను నేను —— అను మిమ్మల్ని నా పెండ్లి (భార్య/భర్త)గా స్వీకరించి, దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం మనమిద్దరం భమ్మీద కలిసి జీవించినంత కాలం, క్రైస్తవ (భార్యల/భర్తల) కొరకు పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా మిమ్మల్ని ప్రేమించి సంరక్షిస్తాను. (పెండ్లి కువర్తె: ప్రగాఢంగా గౌరవిస్తాను.)”a
ఆలోచించవలసిన విషయం
మీరు వివాహం చేసుకోవాలనుకుంటుంటే, వివాహ దినానికి ముందే ఈ ప్రమాణం యొక్క గంభీరతను, భావాన్ని గూర్చి ఆలోచించడం ఎంతో విలువైనదిగా ఉండగలదు. సొలొమోను ఇలా చెప్పాడు: “నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము.” (ప్రసంగి 5:2) మీరు ఇప్పటికే వివాహితులైతే అప్పుడేమిటి? అప్పుడు, మీరు యెహోవా ఎదుట చేసిన గంభీరమైన వాగ్దాన ప్రాముఖ్యత గురించి ధ్యానించడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. మీరు దానికి తగినట్లు జీవిస్తున్నారా? క్రైస్తవులు తమ వాగ్దానాలను గంభీరంగా తీసుకుంటారు. సొలొమోను ఇలా కొనసాగించాడు: “నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము. అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము.”—ప్రసంగి 5:5, 6.
వివాహ ప్రమాణంలోని ఒక్కొక్క వాక్య వివరణను పరిశీలించడం ఈ గంభీరమైన వాగ్దానం యొక్క మీ అవగాహనను తప్పకుండా పెంపొందింపజేస్తుంది.
“—అను నేను మిమ్మల్ని . . . స్వీకరించి”: ఇవి ప్రమాణం యొక్క ప్రారంభ మాటలు. వివాహం చేసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయానికి మీరే వ్యక్తిగతంగా బాధ్యులన్న విషయాన్ని అవి ఉన్నతపరుస్తాయి.
క్రైస్తవ ఏర్పాటు క్రింద, వివాహం చేసుకోవాలన్న లేఖనాధార విధి ఏమీ లేదు. యేసుక్రీస్తు తాను అవివాహితునిగా ఉండిపోయి, ఒంటరిగా ఉండడాన్ని “అంగీకరింపగల” వారు అలా ఉండడం మంచిదని సిఫారసు చేశాడు. (మత్తయి 19:10-12) మరోవైపున, యేసు అపొస్తలులలో అనేకులు వివాహితులు. (లూకా 4:38; 1 కొరింథీయులు 9:5) వివాహం చేసుకోవాలని తీసుకొనే నిర్ణయం వ్యక్తిగతమైనదన్నది స్పష్టం. వివాహం చేసుకోమని మరో వ్యక్తిని బలవంతం చేసే లేఖనాధార అధికారం ఏ మనిషికీ లేదు.
కాబట్టి, వివాహం చేసుకోవడానికి ఎన్నుకోవడం మీ బాధ్యతే. అలాగే, మీరు ఎవరిని వివాహం చేసుకుంటున్నారో వారిని మీరే ఎంచుకున్నారు. ‘నేను —— అను మిమ్మల్ని స్వీకరించి’ అని చెప్పి మీరు వివాహ ప్రమాణం చేసినప్పుడు, అతడు లేక ఆమె సద్గుణాలతో, అలాగే అతని లేక ఆమె లోపాలతో సహా మీరు ఆ వ్యక్తిని స్వీకరిస్తారు లేక అంగీకరిస్తారు.
కొంతకాలానికి, బహుశా మీరు మీ జత యొక్క వ్యక్తిత్వంలోని మునుపు కనిపించని గుణాలను కనుగొనవచ్చు. అప్పుడప్పుడు నిరాశలు కలుగుతాయి. “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 3:23) కాబట్టి మీ జతకు తగినట్లు ఉండాలంటే మీరు సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరం ఉండవచ్చు. ఇది కష్టం కావచ్చు, కొన్నిసార్లు మీరు విడిచిపెట్టాలన్నట్లు భావించవచ్చు. కాని, వివాహ ప్రమాణం యెహోవా సమక్షంలో చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. మీరు సఫలమవ్వడానికి ఆయన సహాయం చేయగలడు.
“నా పెండ్లి (భార్య/భర్త)గా”: మొట్టమొదటి వివాహ సమయంలో, హవ్వను ఆదాముకిచ్చి వివాహం చేసినప్పుడు, యెహోవా దేవుడు ఇలా చెప్పాడు: “వారు ఏక శరీరమైయుందురు.” (ఆదికాండము 2:24; మత్తయి 19:4-6) కాబట్టి ఇద్దరు మానవుల మధ్య ఉండగల అత్యంత సన్నిహిత సంబంధం వివాహ బంధమే. వివాహం మిమ్మల్ని క్రొత్త బంధుత్వంలోకి తెస్తుంది. ఒకరు మీ “పెండ్లి భార్య”గా లేక “పెండ్లి భర్త”గా ఉండడానికి మీరు అంగీకరిస్తారు. అది ఏ ఇతర సంబంధం వంటిదికాదు. ఇతర సంబంధాల్లో ఏ మాత్రం హాని కలిగించని చర్యలు వివాహ ఏర్పాటులో లోతైన గాయం చేయవచ్చు.
ఉదాహరణకు, ఎఫెసీయులు 4:26 నందు కనుగొనబడే లేఖనాధార ఉపదేశాన్ని తీసుకోండి. అక్కడ బైబిలు ఇలా చెబుతుంది: “కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు.” బహుశా మీకు మీ బంధువులతో మరియు స్నేహితులతో ఉన్న సమస్యలను మీరు ఎప్పుడూ అవసరమైనంత త్వరగా పరిష్కరించుకొని ఉండకపోవచ్చు. కాని మీ జత ఇతర ఏ బంధువు లేక స్నేహితుల కంటే సన్నిహితం. మీ జతతో విషయాలను త్వరగా పరిష్కరించుకోవడంలో విఫలమవ్వడం మీ మధ్య నుండే ప్రత్యేకమైన బంధుత్వానికి ప్రమాదం తీసుకురాగలదు.
మీకు మీ జతకు మధ్య ఉన్న అభిప్రాయ భేదం కోపానికి లేక చికాకుకు ఎడతెగని మూలమయ్యేందుకు మీరు అనుమతిస్తారా? అపార్థాలు మరియు కలవరపర్చే పరిస్థితులు చాలా రోజుల వరకు అలాగే ఉంటాయా? మీ ప్రమాణానికి అనుగుణంగా జీవించేందుకు, సమస్యలు తలెత్తినప్పుడు మీ జతతో సమాధానపడకుండా ఒకరోజు కూడా గడవనివ్వకండి. అంటే దీని భావం క్షమించడం, మరచిపోవడం అలాగే మీ స్వంత లోపాలను, తప్పులను అంగీకరించడం.—కీర్తన 51:5; లూకా 17:3, 4.
“దేవుడు ఏర్పాటు చేసిన వివాహ ఏర్పాటు ప్రకారం”: వివాహమంటే, వివాహ ఏర్పాటును స్థాపించిన యెహోవా దేవుని నుండి వచ్చే బహుమానం. (సామెతలు 19:14) ఆయన ఏర్పాటును అనుసరించడంలో విఫలమవ్వడం మీ వివాహ సంతోషానికే కాదుగాని సృష్టికర్తతో మీ సంబంధానికి కూడా ప్రమాదం కలుగజేయగలదు. మరోవైపున, ఆయన ఏర్పాట్లకు విధేయత చూపడం ద్వారా ప్రదర్శించబడే మంచి సంబంధాన్ని భార్యభర్తలిద్దరూ యెహోవాతో ఏర్పరచుకున్నప్పుడు, వారు ఇతరులతోను అలాగే ఒకరితో ఒకరూ సమాధానకరమైన సంబంధాలను కలిగివుంటారు.—సామెతలు 16:7.
“మనమిద్దరం భమ్మీద కలిసి జీవించినంత కాలం”: ఇది దీర్ఘకాల సహచర్యాన్ని సూచిస్తుంది. “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును” అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. (ఆదికాండము 2:24) మీరు కలిసి ఉండాలని యెహోవా ఇష్టపడుతున్నాడు. దేవున్ని కలిసి సేవించండి. ఆయన వాక్యాన్ని కలిసి పఠించండి. కలిసి నడవడానికి, కలిసి కూర్చోడానికి, కలిసి తినడానికి సమయం తీసుకోండి. జీవితాన్ని కలిసి ఆనందించండి!
కొంతమంది జంటలు కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు ప్రతి దినం సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారు. వివాహమైన అనేక సంవత్సరాల తర్వాత కూడా ఇలా కలిసి ఉండడమన్నది వివాహ సంతోషానికి అత్యావశ్యకం.
“పరిశుద్ధ లేఖనాల్లో పొందుపర్చబడిన దైవిక శాసనానికి అనుగుణంగా”: మనం ఎంపిక చేసుకొనే విషయంలో మరియు చర్య తీసుకొనే విషయంలో స్వతంత్రంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వివాహ జీవితాన్ని నియంత్రించే సూత్రాల కష్టతరమైన పట్టిక యొక్క భారం ఆయన మనపై ఉంచలేదు. అయినప్పటికీ, మన మేలు కొరకే ఆయన కొన్ని ఉపదేశాలను అందజేశాడు.
వివాహం గురించి నేడు విస్తృతమైన విధాలైన ముద్రిత సమాచారం ఉంది, అనేకమంది ప్రజలకు తమ స్వంత సిద్ధాంతాలు ఉన్నాయి. కాని జాగ్రత్తగా ఉండండి! వివాహమనే అంశంపై, ప్రచారంలోవున్న సమాచారంలోని అధికభాగం బైబిలుకు వ్యతిరేకంగా ఉంది.
ఒక జంట పరిస్థితుల నుండి మరో జంట పరిస్థితులు భిన్నంగా ఉంటాయని కూడా గుర్తించండి. ఒక విధంగా, వివాహిత జంటలు మంచు పెళ్లల వంటివారు; దూరం నుండి వారు ఒకేలా కనిపించవచ్చు, కాని వాస్తవానికి ప్రతి ఒక్కరు ఇతరులందరి నుండి అసమానంగా, విభిన్నంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం మరియు మీ జత వ్యక్తిత్వం యొక్క కలయిక ప్రపంచంలోని మరే వివాహిత జంట యొక్క వ్యక్తిత్వ కలయికతోను పోల్చలేనిది. కాబట్టి ఇతరుల వ్యక్తిగత దృక్కోణాలను అంగీకరించడానికి తొందరపడకండి. ప్రతి వివాహానికి అన్వయించే మానవ నిర్మిత సూత్రమేదీ లేదు!
దానికి భిన్నంగా, బైబిలు యొక్క ఆజ్ఞలన్నీ సత్యమైనవి, ఆచరణయోగ్యమైనవి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16; కీర్తన 119:151) మీరు బైబిలు చదివి, దాని బోధలను మీ అనుదిన జీవితంలో మార్గదర్శకంగా అంగీకరిస్తే, మీరు మీ వివాహ ప్రమాణానికి తగినట్లు జీవించగలుగుతారు.—కీర్తన 119:105.
“ప్రేమించి”: భర్త కాబోయే వ్యక్తి తన పెండ్లి కుమార్తెను “ప్రేమించి, సంరక్షిస్తాను” అని ప్రమాణం చేస్తాడు. ఈ ప్రేమలో బహుశా వారిద్దరినీ సన్నిహితం చేసిన మానసికాకర్షణతో కూడిన ప్రేమ కూడా ఇమిడి ఉంటుంది. కాని మానసికాకర్షణతో కూడిన ప్రేమ మాత్రమే సరిపోదు. ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు తన జత ఎడల చూపిస్తానని ప్రమాణం చేసే ప్రేమ ప్రగాఢమైనది, సంపూర్ణమైనది.
ఎఫెసీయులు 5:25 ఇలా చెబుతోంది: ‘పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించెను.’ యేసుకు సంఘం ఎడల గల ప్రేమ, స్త్రీ పురుషుల మధ్య నుండే మానసికాకర్షణతో కూడిన ప్రేమ యొక్క వర్గంలోకి ఎంత మాత్రం రాదు. ఈ లేఖనంలో ఉపయోగించబడిన “ప్రేమించుడి” మరియు ‘ప్రేమించెను’ అనే పదాలు సూత్రబద్ధమైన ప్రేమను సూచించే అగాపే అనే పదం నుండి వచ్చాయి. బైబిలు ఇక్కడ, తమ భార్యల ఎడల ఎడతెగని, అచంచలమైన, సహనంతోకూడిన ప్రేమను చూపించాలని భర్తలకు ఆజ్ఞాపిస్తోంది.
అది కేవలం, “నీవు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి భావోద్వేగం కాదు. ఒక భర్త తన క్షేమం కంటే ఎక్కువగా తన భార్య క్షేమాన్ని కోరుతాడు, భార్య తన భర్తను అదే విధంగా ప్రేమిస్తుంది. (ఫిలిప్పీయులు 2:4) మీ జత ఎడల ప్రగాఢమైన ప్రేమను పెంపొందింపజేసుకోవడం మీ వివాహ ప్రమాణానికి తగినట్లు జీవించేందుకు మీకు సహాయం చేస్తుంది.
“సంరక్షిస్తాను”: ఒక నిఘంటువు ప్రకారం, ‘సంరక్షించడం’ అంటే ‘ప్రియంగా ఎంచడం, వాత్సల్యం కలిగి ఉండడం లేక చూపించడం’ అని భావం. మీరు మీ ప్రేమను మాటల ద్వారాను క్రియల ద్వారాను వ్యక్తపర్చాలి! ప్రాముఖ్యంగా భార్య తన భర్త ప్రేమ యొక్క వ్యక్తీకరణలను ఎడతెగక పొందవలసి ఉంటుంది. ఆమె భర్త ఆమె భౌతిక సంబంధమైన అవసరాల గురించి మంచి శ్రద్ధ తీసుకుంటుండవచ్చు, కాని అది మాత్రమే సరిపోదు. తగినంత ఆహారం మరియు సౌకర్యవంతమైన గృహం కలిగివుండి కూడా తమ వివాహ జతచే నిర్లక్ష్యం లేక అలక్ష్యం చేయబడినందుకు ఎంతో అసంతోషంగావున్న భార్యలు ఉన్నారు.
మరో వైపున, తాను ప్రేమింపబడుతున్నానని సంరక్షించబడుతున్నానని తెలుసుకున్న భార్య ఆనందించడానికి తప్పకుండా కారణముంది. అయితే, భర్తల విషయంలో కూడా ఇది నిజమేనని చెప్పవచ్చు. యథార్థమైన ఆప్యాయతా క్రియలచే నిజమైన ప్రేమ ఎంతో అధికమౌతుంది. పరమగీతములో, ప్రేమికుడైన గొఱ్ఱెల కాపరి ఇలా తెలియజేస్తున్నాడు: “సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ [“ఆప్యాయతా క్రియలు,” NW] ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ [“ఆప్యాయతా క్రియలు,” NW] ఎంత సంతోషకరము. నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము!”—పరమగీతము 4:10.
“ప్రగాఢంగా గౌరవిస్తాను”: కొంతమంది పురుషులు శతాబ్దాలుగా స్త్రీలతో దుర్వ్యవహారం చేస్తున్నారు, వారిని హీనపరుస్తున్నారు. నేడు కూడా, ప్రపంచ ఆరోగ్యం అనే పత్రిక ప్రకారం, “ప్రతి దేశంలోనూ ప్రతి సామాజిక మరియు ఆర్థిక తరగతిలోనూ స్త్రీలపై దౌర్జన్యం జరుగుతోంది. అనేక సాంప్రదాయాల్లో భార్యను కొట్టడమన్నది పురుషుని హక్కుగా పరిగణింపబడుతోంది.” అనేకమంది పురుషులు అలాంటి ప్రవర్తన కలిగి ఉండకపోవచ్చు. అయినప్పటికీ, స్త్రీలకు సంబంధించిన అంశాల్లో అనేకమంది పురుషులు నిజమైన ఆసక్తిని చూపడంలో విఫలమౌతున్నట్లు కనిపిస్తుంది. ఫలితంగా, అనేకమంది స్త్రీలు పురుషుల గురించి ప్రతికూల దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు. కొంతమంది భార్యలు ఇలా చెబుతున్నట్లు తెలిసింది, “నేను నా భర్తను ప్రేమిస్తాను, కాని నేను ఆయనను ఎంతమాత్రం గౌరవించలేను!”
అయితే, తన భర్త అప్పుడప్పుడూ తాను ఆశించిన వాటికి తగినట్లు ఉండలేకపోయినా తన భర్తను గౌరవించడానికి ప్రయత్నించే స్త్రీకి యెహోవా దేవుడు విలువనిస్తాడు. ఆయనకు దేవుడిచ్చిన పని లేక స్థానం ఉన్నాయని ఆమె గుర్తిస్తుంది. (1 కొరింథీయులు 11:3; ఎఫెసీయులు 5:23) కాబట్టి తన భర్త ఎడల ప్రగాఢమైన గౌరవం కలిగివుండడం ఆమె యెహోవాకు చేసే ఆరాధనలో, చూపించే విధేయతలో ఒక భాగం. దైవభక్తిగల స్త్రీలు చూపించే విధేయతను దేవుడు అలక్ష్యం చేయడు.—ఎఫెసీయులు 5:33; 1 పేతురు 3:1-6; హెబ్రీయులు 6:10 పోల్చండి.
వివాహంలో గౌరవం అన్నది పరస్పరం చూపించుకొనేదై ఉండాలి మరియు దాన్ని కేవలం అపేక్షించే బదులు లేక కోరే బదులు దాన్ని సంపాదించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, అపహాస్యం చేసే లేక గాయపర్చే మాటలకు వివాహ ఏర్పాటులో తావు లేదు. మీ భర్త గురించి లేక భార్య గురించి అవమానకరమైన వ్యాఖ్యానాలు చేయడం ప్రేమపూర్వకమైనది, గౌరవప్రదమైనది కాదు. మీ జత యొక్క లోపాల గురించి ఇతరులకు తెలియజేయడం ద్వారా లేక వాటి గురించి బహిరంగంగా మాట్లాడడం ద్వారా ఏ మంచీ సాధించబడదు. ఈ విషయంలో, కేవలం పరిహాసం కూడా తీవ్రమైన గౌరవ లోపాన్ని చూపగలదు. ఎఫెసీయులు 4:29, 32 నందలి మాటలు భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తాయి. అక్కడ బైబిలు ఇలా చెబుతుంది: ‘అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి. . . . ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులై యుండుడి.’
మీ వివాహ ప్రమాణానికి యెహోవా ప్రధాన సాక్షియని ఎన్నడూ మరచిపోకండి. ఈ గంభీరమైన వాగ్దానానికి తగినట్లు జీవించడంలో కొనసాగండి, అప్పుడు మీ వివాహం యెహోవా దేవుని స్తుతికి, ఘనతకు మూలం అవుతుంది!
[అధస్సూచీలు]
a స్థానిక చట్టంతో పొందిక కలిగి ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో, ఈ ప్రమాణంలో కొంత మార్పు చేసి ఉపయోగించవలసి ఉంటుంది. (మత్తయి 22:21) అయితే, అనేక దేశాల్లో క్రైస్తవ జంటలు ఈ పై ప్రమాణాన్నే ఉపయోగిస్తారు.
[22వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఒక విధంగా, వివాహిత దంపతులు మంచు పెళ్లల వంటివారు. దూరం నుండి వాళ్లందరూ ఒకేలా కనిపించవచ్చు, కాని వాస్తవానికి ప్రతి జంట విశేషంగా విభిన్నంగా ఉంటారు
[క్రెడిట్ లైను]
Snow Crystals/Dover