మీకు కనిపించేవాటికి మించినవి చూడండి!
మంచి భౌతిక కంటిచూపు అనేది ఒక ఆశీర్వాదం. నిజానికి, తమకున్న కొన్ని మాత్రమే కంటిచూపుకన్నా విలువైనవని చాలా మంది ప్రజలు ఒప్పుకుంటారు. అయినప్పటికీ, మంచి భౌతిక కంటిచూపును మించిన, క్రైస్తవులకు ఎక్కువ విలువైన కంటి చూపును గూర్చి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. “మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము” అని పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 4:17) నిజంగా, అది అదృశ్యమైనవాటిని చూసేందుకు ఒకరిని సమర్థులను చేసే ఎంతో ప్రత్యేక తరహా దృష్టియై ఉంటుంది! మనం దానిని ఆత్మీయ తరహా 20/20 దృష్టి అని పిలువవచ్చు.
ఎందుకవసరం?
తొలి శతాబ్దంలోని క్రైస్తవులు ఈ తరహా ఆత్మీయ కంటిచూపు యొక్క నిజమైన అవసరతలో ఉండేవారు. వారు ఎన్నో కష్టాల్లో తమ క్రైస్తవ పరిచర్యను కొనసాగించేవారు. పౌలు ఈ విధంగా తెలియజేశాడు: “ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము.”—2 కొరింథీయులు 4:8, 9.
అలాంటి పరిస్థితులున్నప్పటికీ, నమ్మకస్థులైన శిష్యులు స్థిరంగా నిలబడ్డారు. దేవునియందలి బలమైన నమ్మకంతో, పౌలు చెప్పినట్లు వారు చెప్పగలిగారు: “కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు.” అయినప్పటికి, ఈ ప్రతిదిన నవీకరణకు ఏది కారణమైంది? పౌలు ఈ విధంగా చెబుతూ వెళ్ళాడు: “మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు.”—2 కొరింథీయులు 4:16-18.
వారి ముందుంచబడిన తేజోవంతమైన ప్రతిఫలాన్ని గూర్చిన వారి దృష్టిని మసకబారనీయడానికి సమస్యలను కష్టాలను హింసలను—ఎటువంటి శ్రమలనైనా అనుమతించకూడదని పౌలు తన ఆత్మీయ సహోదరులను ప్రోత్సహించాడు. వారు క్రైస్తవ జీవితము యొక్క సంతోషకరమైన ప్రతిఫలంపై దృష్టినుంచుతూ తమ ప్రస్తుత పరిస్థితులకు మించినవాటిని చూడాలి. యుద్ధంలో సాగిపోవాలనే తీర్మానాన్ని ప్రతిరోజు నూతనపరుచుకునేందుకు వారికి సహాయపడినదదే. నేడు క్రైస్తవులు అలాంటి మంచి ఆత్మీయ కంటి చూపు యొక్క అంతే అవసరతలో ఉన్నారు.
ప్రస్తుత శ్రమలను క్షణికంగా దృష్టించండి!
ఇష్టమున్నా లేకపోయినా, మనం చూడడానికి ఇష్టపడని వాటిని ప్రతి రోజు చూస్తాం. అద్దంలో చూస్తే, భౌతిక శరీరంపై భౌతిక అపరిపూర్ణతను సూచించే మనకిష్టంలేని మచ్చలు, గాట్లు తప్పకుండా కనబడతాయి. మనం దేవుని వాక్యమనే అద్దంలోనికి చూసినప్పుడు, మనలోని, అలాగే ఇతరులలోని ఆత్మీయ లోపాలు మరియు మచ్చలు కనిపిస్తాయి. (యాకోబు 1:22-25) దినపత్రికను చూసినప్పుడు లేదా దూరదర్శిని తెరను చూసినప్పుడు అవినీతి, క్రూరత్వం మరియు విషాదాంతాల వృత్తాంతాలు వెంటనే మన దృష్టికి వచ్చి మనకు దుఃఖాన్ని కలిగిస్తాయి.
మనం చూస్తున్న విషయాలనుబట్టి మనం నిరాశచెందాలని లేదా దారి తప్పి, విశ్వాసంలో సడలిపోవాలని సాతాను ఇష్టపడతాడు. ఇలా సంభవించడాన్ని మనమెలా తప్పించుకోగలం? “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” అని వ్రాస్తూ పేతురు మనకు సిఫారసు చేసినట్లు మనం తప్పనిసరిగా యేసు ఉంచిన మాదిరిని అనుసరించాలి. (1 పేతురు 2:21) క్రైస్తవ జీవితంలోని ప్రతి అంశంలోనూ యేసు పరిపూర్ణ మాదిరియై ఉన్నాడు.
పేతురు యేసును మనకు మాదిరిగా సూచిస్తూ యేసు సహించాడని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. నిజానికి, భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఎంతో సహించాడు. మానవజాతి సృష్టించబడినప్పుడు మానవులు ఏమై ఉండాలని దేవుడు ఉద్దేశించాడో యెహోవా యొక్క “ప్రధాన శిల్పి”గా ఆయనకు కచ్చితంగా తెలుసు. (సామెతలు 8:30, 31) కానీ ఇప్పుడు, పాపం మరియు అపరిపూర్ణత వారెలా మారడానికి కారణమయ్యాయో ఆయన ప్రత్యక్షంగా చూశాడు. ఆయన ప్రతిరోజు ప్రజల అపరిపూర్ణతలను బలహీనతలను చూశాడు, మరి వాటితో ఆయన వ్యవహరించవలసి వచ్చింది. అది ఆయనకు నిజంగా పరీక్షగా ఉండవచ్చు.—మత్తయి 9:36; మార్కు 6:34.
యేసు ఇతరుల శ్రమలను చూడడమే కాక, తన స్వంత శ్రమలను అనుభవించాడు కూడా. (హెబ్రీయులు 5:7, 8) అయితే, ఆయన పరిపూర్ణమైన ఆత్మీయ కంటిచూపుతో, వాటికి మించినవాటిని అంటే, తన యథార్థతా నడవడినిబట్టి అమర్త్య జీవితానికి ఉన్నతపర్చబడడమనే బహుమానాన్ని చూడగలిగాడు. బాధించబడిన మానవజాతిని దిగజారిపోయిన పరిస్థితి నుండి యెహోవా మొదట ఉద్దేశించిన పరిపూర్ణతకు తీసుకువచ్చే ఆధిక్యత మెస్సీయా రాజుగా ఆయనకు ఉంటుంది. అదృశ్యమైన బావి నిరీక్షణలపై తన కంటిని కేంద్రీకరించడం, ఎడతెగక శ్రమలు కనిపిస్తున్నప్పటికీ, దైవిక సేవలో ఆనందాన్ని అనుభవించేందుకు ఆయనకు సహాయపడింది. “ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు” అని పౌలు తరువాత వ్రాశాడు.—హెబ్రీయులు 12:2.
యేసు ఎన్నడూ కష్టాలను, శ్రమతో కూడిన పరిస్థితులను తనను నిరాశపరచేందుకు, దారి తప్పించేందుకు, విశ్వాసంలో సడలి పోయేందుకు అనుమతించలేదు. ఆయన శిష్యులముగా మనం ఆయన ఉన్నతమైన మాదిరిని సన్నిహితంగా అనుకరించాలి.—మత్తయి 16:24.
నిత్యం నిలిచే అదృశ్యమైనవాటిపై శ్రద్ధ కేంద్రీకరించండి!
సహించడానికి యేసును శక్తిమంతునిగా చేసిన దానిని గూర్చి పౌలు మాట్లాడుతూ, “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని వ్రాసినప్పుడు, మనమెలా నడుచుకోవాలో కూడా ఆయన చూపించాడు. (హెబ్రీయులు 12:1, 2) అవును, క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా, ఆనందభరితంగా సాగించేందుకు మనముందు వెంటనే ఉన్న దానికి మించిన దానిని చూడాలి. కాని, మనం యేసు వైపుకు ‘స్థిరంగా చూడడం’ ఎలా, మరియు దానివల్ల మనకేమి కలుగుతుంది?
ఉదాహరణగా, 1914లో యేసు రాజయ్యాడు, మరి ఆయన పరలోకం నుండి పరిపాలిస్తున్నాడు. నిజమే, ఇదంతా మన భౌతిక నేత్రాలకు అదృశ్యమే. అయినప్పటికీ, మనం యేసు వైపుకు ‘స్థిరంగా చూసి’నట్లయితే, ప్రస్తుత దుష్ట విధానానికి అంతం తెచ్చేందుకు, సాతానును అతని దయ్యాల దళాలను నిష్క్రియా పాశాల్లోకి పంపివేసేందుకు చర్యలను గైకొనడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని చూడడానికి మన ఆత్మీయ కనుదృష్టి మనకు సహాయపడుతుంది. ఇంకా ముందుకు చూసినట్లయితే, ‘మరణము ఇక ఉండని, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండని, మొదటి సంగతులు గతించిపోయే’ అద్భుతమైన క్రొత్త లోకాన్ని మన ఆత్మీయ కనుదృష్టి చూపిస్తుంది.—ప్రకటన 19:11-16; 20:1-3; 21:4.
అలా, మనం ప్రతిరోజు ఎదుర్కోవలసిన తాత్కాలిక శ్రమలచేత భారం మోపబడే బదులు, నిత్యమైన వాటిపై మన దృష్టిని ఎందుకు కేంద్రీకరించకూడదు? విశ్వాసమనే నేత్రాలతో మలినం చేయబడిన ఈ భూమిపైనున్న రోగాన్ని, పేరాశను దాటి ఆరోగ్యవంతులైన, సంతోషం గల, శ్రద్ధగల ప్రజలతో నిండిన పరదైసును ఎందుకు చూడకూడదు? మన భౌతిక దోషాలను ఆత్మీయ దోషాలను దాటి క్రీస్తు విమోచనా క్రయధన బలి ప్రయోజనం ద్వారా వాటినుండి శాశ్వతంగా విడిపించబడడాన్ని ఎందుకు చూడకూడదు? యుద్ధం, నేరం మరియు హింసలవల్ల కలిగే రక్తపాతం నుండి దృష్టిని మరల్చి, యెహోవా యొక్క శాంతియందు, నీతియందు ఉపదేశించబడే క్రొత్తగా పునరుత్థానం పొందే వారిని ఎందుకు చూడకూడదు?
అంతేకాక, యేసును ‘స్థిరంగా చూడడం’లో రాజ్యం అదృశ్యమైనప్పటికీ, అది ఇప్పటికే భూమిపైనున్న దేవుని ప్రజల మధ్య సాధించిన ఐక్యత, శాంతి, ప్రేమ, సహోదర అనురాగం మరియు ఆత్మీయ సమృద్ధిపై శ్రద్ధ కేంద్రీకరించడం కూడా ఇమిడి ఉంది. జర్మనీలోని ఒక క్రైస్తవ స్త్రీ దైవిక బోధ వలన ఐక్యమవ్వడం అనే వీడియోను చూసిన తరువాత, ఈ విధంగా వ్రాసింది: “ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదర సహోదరీలు ఈ నిమిషంలోనూ యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నారని గుర్తుంచుకోవడానికి ఈ వీడియో నాకు సహాయపడుతుంది. హింసతోను ద్వేషంతోను నిండిన లోకంలో మన సహోదర ఐక్యత అనేది ఎంత ప్రశస్తమైనదో!”
యెహోవా, యేసు, నమ్మకస్థులైన దేవదూతలు మరియు లక్షలాది మంది తోటి క్రైస్తవులు మీ ప్రక్కన నిలబడడాన్ని మీరు కూడా “చూస్తున్నారా”? అలాగైతే, మిమ్మల్ని నిరుత్సాహపరచి, క్రైస్తవ సేవలో ‘నిష్ఫలులు’ కావడానికి కారణం కాగల “ఐహిక విచారము”ను గూర్చి మీరు అధికంగా తలంచరు. (మత్తయి 13:22) కనుక దేవుడు స్థాపించిన రాజ్యంపై, ఇప్పుడును భవిష్యత్తులోను కలిగే ఆశీర్వాదాలపై మీ ఆత్మీయ నేత్రాలను కేంద్రీకరించడం ద్వారా యేసు వైపుకు ‘స్థిరంగా చూడండి.’
అదృశ్యమైన దానిని చూడడానికి జీవించి ఉండండి!
దేవుని శాశ్వత క్రొత్త లోకానికి మరియు నాశనమౌతున్న ప్రస్తుత పాత లోకానికి మధ్యగల పూర్తి వ్యత్యాసాన్ని చూడడం ద్వారా మనం నేడు విశ్వాసమనే నేత్రాల ద్వారా మాత్రం చూడగలవాటిని అక్షరార్థంగా చూసే అర్హతగలవారిగా మనం ఎంచబడేలా మనం నడుచుకునేందుకు మనం కదిలించబడాలి. పునరుత్థానం చేయబడే అనేకులు తాము నిద్రలేచినప్పుడు తాము చనిపోక ముందు చూసిన లోకానికి ఎంతో భిన్నంగా ఉండే నీతియుక్తమైన పరదైసు భూమిని చూసినప్పుడు తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు. వారికి అభివాదం చేయడానికి, యెహోవా చేసినవాటిని వారికి చెప్పడానికి మనం బ్రతికి ఉండడం ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించండి!—యోవేలు 2:21-27 పోల్చండి.
అవును, మంచి ఆత్మీయ కంటిచూపు ఎంత ప్రశస్తమైనది, దానిని చైతన్యవంతంగా ఉంచుకోవడం కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమైనది! మనం క్రమంగా వ్యక్తిగతంగా బైబిలు చదవడంలో నిమగ్నమవ్వడం ద్వారా, క్రైస్తవ కూటాలకు హాజరు కావడం ద్వారా, బైబిలు ఆధారిత నిరీక్షణను గూర్చి ఇతరులతో మాట్లాడడం ద్వారా, అంతకన్నా ముఖ్యంగా, దైవిక నడిపింపు కొరకు ప్రార్థన చేయడం ద్వారా మనమది చేయవచ్చు. ఇది మన ఆత్మీయదృష్టిని చైతన్యవంతంగా స్పష్టంగా ఉంచుతూ మనకు కనిపిస్తున్న వాటికి మించినవి చూసేందుకు మనకు సహాయం చేస్తుంది!