పోర్చుగల్‌లో బైబిలు సత్యాన్ని వ్యాపింపజేయడం
ఉత్తరాన కామీన్యా నుండి దక్షిణాన వీల రీయాల్ డ సాన్‌టూ ఆన్‌టోన్యూ వరకున్న 800 కిలోమీటర్ల పోర్చుగల్ దగ్గరి అట్లాంటిక్ తీరప్రాంతంలో చేపలను పట్టే వేలకొలది రంగురంగుల పడవలు చుక్కలు పెట్టినట్లు చెల్లాచెదరుగా ఉన్నాయి. పోర్చుగీసు దేశస్థులకు చేపలను ముఖ్య ఆహారంగా అందించేందుకై జాలరులు శతాబ్దాలుగా ‘తమ ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు.’—కీర్తన 107:23.
గత 70 సంవత్సరాలుగా, పోర్చుగల్‌లో మరో రకం చేపలను పట్టడం జరుగుతుంది. యెహోవాసాక్షులు లక్షలాది సూచనార్థక చేపలకు సువార్తను అందించడంలో నిమగ్నమై ఉన్నారు. (మత్తయి 4:19) మే 1995లో రాజ్యప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 44,650గా ఉండేది, అంటే దాదాపు 210 మంది నివాసుల్లో ఒకరు యెహోవాసాక్షి అన్నమాట. కొన్ని నగరాల్లో ఈ నిష్పత్తి దీనిలో సగం ఉంటుంది.
చాలా మంది పనివారున్నందువల్ల అనేక ప్రదేశాల్లోని సాక్ష్య ప్రాంతాలు దాదాపు ప్రతివారం పూర్తి చేయబడుతున్నాయి. కనుక పోర్చుగీసు సాక్షులు తమ బైబిలు నిరీక్షణను ఇతరులతో పంచుకునేందుకు అనేక రకాల అందింపులను ఉపయోగించడంలో మెలకువగా ఉన్నారు. అవును, సాధ్యమయ్యే ప్రతి మార్గంలోను బైబిలు సత్యాన్ని తెలియజేయడంలోని ప్రాముఖ్యతను వారు గుణగ్రహిస్తారు.—1 కొరింథీయులు 9:20-23.
మతసంబంధ విషయాల్లో ఆసక్తికలవారికి సహాయం చేయడం
1991 జనాబా లెక్కల ప్రకారం పోర్చుగల్‌లోని 18 ఏండ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సుగల వారిలో 70 శాతం మంది రోమన్ కాథోలిక్‌లని చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ, ఈ ప్రజలకు బైబిలు పరిజ్ఞానం చాలా తక్కువ. జర్నల్ డి నోటిస్యాస్ అనే వార్తాపత్రిక ఈ విధంగా పేర్కొన్నది: “కాథోలిక్ ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన అనుభవాల్లో ఒకటి బైబిలు పరిజ్ఞానం లేకపోవడమే!” ఎందుకిలా జరుగుతుంది? పోర్చుగీసు వార్తాపత్రికయైన ఎక్స్‌ప్రెస్సో జవాబును చూపిస్తుంది. ఫాటమలోని 500 మంది మతుగురువుల కూటాన్ని గూర్చి నివేదిస్తూ ఆ వార్తాపత్రిక ఈ విధంగా చెబుతుంది: “క్రైస్తవ మతాధికారి అభిప్రాయం ప్రకారం, తనను అనేక ఇతర కార్యక్రమాల నుండి స్వతంత్రం చేసుకోవడం అవసరం, అలా ఆయన కేవలం ‘ప్రకటనదారునిగా’ తన స్థానాన్ని తాను తిరిగి ఏర్పరచుకోగలుగుతాడు. . . . మతగురువు సువార్తను ప్రకటించడానికి తమ పూర్ణప్రాణాన్ని పెట్టినట్లయితే, వేరే ఇతర కార్యాలను చేయడానికి ఆయనకు సమయముండదు.”
దానికి భిన్నంగా పోర్చుగీసులోని యెహోవాసాక్షులు సాధ్యమయ్యే ప్రతి మార్గంలోను బైబిలు సత్యాన్ని ప్రచురం చేయడంలో చాలా నిమగ్నమై ఉంటారు. దాని ఫలితంగా, చాలా మంది యథార్థహృదయులైన కాథోలిక్‌లు బైబిలు జ్ఞానాన్ని పొందుతున్నారు.
కార్లోట నిష్ఠగల కాథోలిక్కు మరియు మతవ్యవస్థలోని యౌవనస్థుల గుంపులోని ఒక సభ్యురాలు. ఆంటోన్యూ అనే సాక్షి పనిచేసే కిండర్‌గార్టెన్‌లో ఆమె ఉపాధ్యాయురాలు కూడాను. క్రమ పయినీరుగా, లేదా పూర్తికాల సేవకునిగా ఆంటోన్యూ మధ్యాహ్న భోజన సమయంలో తన తోటి ఉద్యోగస్థులతో బైబిలు గురించి మాట్లాడడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేసేవాడు. నరకాగ్నిని నమ్మే విషయాన్ని గూర్చి, మరియారాధనను గూర్చి ఒకరోజు కార్లోట ఆయనను అడిగింది. ఈ విషయాలను గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో ఆంటోన్యూ ఆమెకు చూపించాడు, మరి అనేక బైబిలు చర్చలకు ప్రారంభమదే. స్థానిక రాజ్య మందిరంలో కార్లోట మొదటిసారిగా హాజరైనప్పుడు, తాను ఎంతో ముగ్ధురాలైంది. అయితే, ఆమె ఏ మతవ్యవస్థకు చెందినదో దాని కార్యక్రమాల సమయం, కూటాల సమయం ఒకటే. తాను నిర్ణయం తీసుకోవలసి ఉందని ఆమె గుర్తించింది. ఆమె ఏమి చేస్తుంది?
కార్లోట మొత్తం యౌవనస్థుల గుంపంతటినీ సమావేశపరచి, తాను ఎందుకు రాజీనామా ఇవ్వబోతుందో బైబిలు నుండి వివరించింది. ఎంతో జాగ్రత్తగా విన్న స్టెల్ల అనే అమ్మాయి తప్ప మిగిలిన అందరూ ఆమె నిర్ణయాన్ని విమర్శించారు. తరువాత కార్లోట స్టెల్లతో మాట్లాడినప్పుడు, జీవం యొక్క ఆరంభాన్ని గూర్చి, దాని ఉద్దేశాన్ని గూర్చి అనేక ప్రశ్నలను ఆమె అడిగింది. జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా?a అనే పుస్తకాన్ని కార్లోట ఆమెకు ఇచ్చి, ఆమెతో బైబిలు పఠనాన్ని ఆరంభించింది.
ఈలోపు కార్లోట మంచి ఆత్మీయ అభివృద్ధిని సాధించి, 1991 జూన్‌లో బాప్తిస్మం పొంది, ఆరు నెలల తరువాత క్రమ పయినీరుగా సేవ చేయడం మొదలు పెట్టింది. 1992 మేలో ఆమె, ఆంటోన్యూ పెండ్లి చేసికొని ఇద్దరూ కలిసి ఎక్కువ అవసరత ఉన్న పొరుగు సంఘంలో పయినీరు సేవలో కొనసాగుతున్నారు. మరి స్టెల్ల? ఆమె 1993 మేలో బాప్తిస్మం పొంది, ఇప్పుడు క్రమ పయినీరుగా సేవ చేస్తుంది.
యౌవనస్థుడైన ఫ్రాన్సీష్కూ చాలా దైవభక్తిగలవాడు. ప్రతి ఆదివారం ఉదయం పూజకు వెళ్ళేవాడు, మధ్యాహ్నం జపమాలతో జపం చేసేవాడు. పూజా సమయంలో మతగురువుకు సహాయం చేస్తూ పరిచారకునిగా సేవ చేశాడు. ఒకరోజు తనను “పరిశుద్ధునిగా” చేయమని అతడు దేవుని ప్రార్థించాడు కూడా!
ఫ్రాన్సీష్కూ బైబిలు కావాలని నిజంగా కోరుకున్నాడు, ఒకరోజు అతని స్నేహితుడు అతనికి ఒక బైబిలును ఇచ్చాడు. దేవునికి యెహోవా అనే ఒక పేరుందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. (నిర్గమకాండము 6:3; కీర్తన 83:18) అతడు నిర్గమకాండము 20:4, 5 నందు ఆరాధనలో విగ్రహాలను ఉపయోగించడాన్ని దేవుడు నిషేధించాడని చదివినప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాడు! చర్చి నిండా విగ్రహాలుండడాన్ని చూసి, ఈ గందరగోళాన్నంతటినీ అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని అతడు యెహోవాకు ఎడతెగక ప్రార్థన చేశాడు. చాలా రోజుల తరువాత, తాను మునుపటి తోటివిద్యార్థిని కలిసినప్పుడు, అతడు రాత్రి పాఠశాలను ఎందుకు మానేశాడని అడిగాడు.
“నేను ఇంకా మంచి రాత్రి పాఠశాలకు వెళ్తున్నాను” అని అతని స్నేహితుడు జవాబిచ్చాడు.
“అది ఏ పాఠశాల, నువ్వేమి చదువుతున్నావు?” అని ఫ్రాన్సీష్కూ అడిగాడు. స్నేహితుని జవాబు విని అతడు చాలా ఆశ్చర్యపోయాడు.
“యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో బైబిలు పఠిస్తున్నాను. నువ్వు కూడా రావడానికి ఇష్టపడతావా?” అని అతని స్నేహితుడు అన్నాడు.
ఫ్రాన్సీష్కూ కూటానికి మొదటిసారిగా హాజరైనప్పుడు తాను చూసిన దానిని నమ్మలేకపోయాడు—సంతోషంగా నవ్వుతున్న ముఖాలు; ప్రజలు ఒకరితోనొకరు ఆప్యాయతతో స్నేహపూర్వకంగా మాట్లాడుకోవడం; పిల్లలు తమ తలిదండ్రులతో కూర్చుని, అక్కడ చెప్పబడుతున్న దానికి జాగ్రత్తగా అవధానమివ్వడం.
“నేను ఇక్కడ పూర్తిగా అపరిచితుడను, మరి నేను ఆ కుటుంబంలో ఒకనిలాగే భావించాను!” అని ఫ్రాన్సీష్కూ అన్నాడు. అప్పటి నుండి అతడు క్రమంగా కూటాలకు హాజరౌతూ వచ్చాడు. ఫ్రాన్సీష్కూ సంఘంలో పెద్దగా ఇప్పుడు సేవ చేస్తున్నాడు, తన భార్యా మరి ఇద్దరు పిల్లలతో దేవుని వాక్యంలోని రాజ్యాన్ని గూర్చిన గొప్ప వాగ్దానాలనుబట్టి సంతోషిస్తున్నాడు.
బంధువులతో సత్యాన్ని పంచుకోవడం
లిస్బన్ ప్రాంతంలోని మన్‌వెలా అనే క్రమ పయినీరు తన బంధువులతో సహా అందరికీ దయాపూర్వకంగా సాక్ష్యమివ్వడంలో పట్టుదలను చూపించినందుకు, ఆత్మీయ చేపలను ఆమె విస్తారంగా పట్టుకుంది. వారిలో సమరోచిత కళల్లోనూ ఆయుధాల ఉపయోగంలోను తర్ఫీదునొందిన ఆమె స్వంత సహోదరుడు జూజె ఈద్‌వార్‌డూ కూడా ఉన్నాడు. అతడు అనేకసార్లు చట్టాన్ని ఉల్లంఘించి, చివరికి 22 నేరారోపణలపై విచారించబడి, 20 సంవత్సరాలు కారాగార శిక్షవేయబడింది. అతడు ఎంత హింసాత్మకంగా ఉండేవాడంటే, తోటి ఖైదీలు కూడా భయపడేవారు, మరతనిని గట్టి భద్రతా ఏర్పాట్లతో జైలు గదిలో ఒంటరిగా వేశారు.
మన్‌వెలా ఏడు సంవత్సరాలు ఎంతో ఓపికతో జూజె ఈద్‌వార్‌డూను సందర్శించింది, కాని అతడు ఎల్లప్పుడూ ఆమె చెప్పే బైబిలు సందేశాన్ని నిరాకరించేవాడు. చివరికి, జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? అనే పుస్తకం ప్రచురించబడినప్పుడు, అతడు దానిని తీసుకున్నాడు, బైబిలు పఠనం ఆరంభించబడింది. అతడు వెంటనే తన ప్రవర్తనలో ఎంతో మార్పును తెచ్చుకున్నాడు. ఒక వారం తరువాత అతడు 200 మంది ఖైదీలకు వ్యక్తిగత సాక్ష్యమిచ్చాడు, మరుసటి వారం మరో 600 మందికి సాక్ష్యమిచ్చాడు. కారాగారంలోని మిగిలిన గదుల్లో ఉండే ఖైదీలను సందర్శించేందుకు అతడు అనుమతిని కూడా పొందాడు. అతని ప్రవర్తనలో గుర్తించదగిన మార్పునుబట్టి అతని కారాగారశిక్ష 15 సంవత్సరాలకు తగ్గించబడింది. 10 సంవత్సరాలు సేవ చేసిన తరువాత పరివీక్ష మీద విడుదల చేయబడ్డాడు. అప్పటి నుండి ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి, జూజె ఈద్‌వార్‌డూ ఇప్పుడు బాప్తిస్మం పొందిన యెహోవాసాక్షి, అతడు స్థానిక సంఘంలో పరిచర్య సేవకునిగా సేవ చేస్తున్నాడు. నిజంగా ‘తోడేలు గొర్రెపిల్లతో నివసిస్తున్న’ నిజమైన ఓ సంఘటన ఇది!—యెషయా 11:6.
తన కుటుంబానికి సాక్ష్యమివ్వడంలో ఆమె పట్టుదలతో ప్రయత్నం చేయడంవల్ల, యెహోవా సేవలో చురుకైనవారయ్యేందుకు తన భర్తకు మరియు కుటుంబంలోని మరి నలుగురు సభ్యులకు సహాయపడడంలో మన్‌వెలా సంతోషాన్ననుభవించింది. ఆమె భర్త ఇప్పుడు ఒక పరిచర్య సేవకుడు.
“నేను వారిని తన్ని కొరడాతో కొట్టి వెళ్ళగొడతాను”
సాక్షులు మరీయ డూ కార్మోను సందర్శించినప్పుడు, ఆమె లిస్బన్ నగర శివారులో నివసించేది. తాను విన్న విషయం ఆమెకు నచ్చింది, ఇంట్లో తనకొక బైబిలు పఠనం ఉండవచ్చునేమోనని తన భర్త ఆంటోన్యూను అడిగింది. “దాన్ని గూర్చి తలంచనైనా తలంచవద్దు! యెహోవాసాక్షులెవరైనా మన ఇంట నా కంట కనబడితే నేను వారిని తన్ని కొరడాతో కొట్టి వెళ్ళగొడతాను” అని ఆయన జవాబిచ్చాడు. ఆంటోన్యూ కరాటే శిక్షకుడు మరియు ఆయనకు మూడవ డిగ్రీ బ్లాక్ బెల్ట్ ఉంది. కనుక మరీయ డూ కార్మో వేరే ఎక్కడన్నా బైబిలు పఠనాన్ని తీసుకోవాలని తీర్మానించుకుంది.
తరువాత, ఆంటోన్యూ కరాటేలో ఎనిమిది రోజుల కోర్సు కొరకు ఇంగ్లాండుకు వెళ్ళవలసి వచ్చింది, మరీయ డూ కార్మో నా బైబిలు కథల పుస్తకము అనే ప్రచురణను ఎంతో జాగ్రత్తగా ప్యాక్ చేసి, ఆయన సూట్‌కేసులో పెట్టింది.b తన ప్రయాణంలో చాలా సమయం లభించినందున ఆంటోన్యూ ఆ పుస్తకాన్ని చదివాడు. తిరుగు ప్రయాణంలో తుపాను విమానాన్ని గట్టిగా కుదిపివేసింది, విమానం దిగడానికి చాలా కష్టమైపోయింది. ఆంటోన్యూ తన జీవితంలో మొదటిసారిగా యెహోవాకు ప్రార్థన చేశాడు.
ఆంటోన్యూ ఇంటికి చేరుకున్నప్పుడు, ఆయన భార్యతో పఠనాన్ని నిర్వహించిన సాక్షి ఆయనను ఒక కూటానికి ఆహ్వానించాడు. ఆయన అందుకు అంగీకరించాడు, ప్రతిఒక్కరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. బైబిలు పఠనం కొరకు ఏర్పాట్లు చేయబడ్డాయి, కొద్ది కాలంలోనే తాను కొన్ని తీర్మానాలు తీసుకోవలసి ఉందని ఆంటోన్యూ తెలుసుకున్నాడు. దాని ఫలితమేంటంటే, ఆయన కరాటే శిక్షణనివ్వడాన్ని మానివేసి, ఇప్పుడు మరియు మరెన్నటికీ కూడా ఎలా శాంతిగా జీవించాలో తన విద్యార్థులకు బోధించడం మొదలు పెట్టాడు. వారిలో బ్లాక్ బెల్టు గ్రహీత కూడా అయిన ఒక వ్యక్తి ఇప్పుడు బాప్తిస్మం పొందిన క్రైస్తవుడయ్యాడు.
ఆంటోన్యూ విషయానికి వస్తే, ఆయన 1991 ఏప్రిల్‌లో బాప్తిస్మం పొందాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న మరుసటి రోజు ఆయన సహాయ పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆరు నెలల తరువాత, ఆయన క్రమ పయినీరుగా సేవ చేయడం మొదలుపెట్టి, త్వరలోనే ఆయన 12 గృహ బైబిలు పఠనాలను నిర్వహించేవాడు. జూలై 1993లో సంఘంలో ఆయన పరిచర్య సేవకునిగా నియమించబడ్డాడు.
తరచూ పనిచేయబడిన ప్రదేశంలో
ఈ దేశంలోని అనేక ప్రదేశాల్లోని పరిచర్య ప్రాంతం దాదాపు ప్రతివారం పూర్తిచేయబడుతోంది. సాక్షులు “చేపలను పట్టే” కార్యక్రమాలను ఫలవంతంగా ఎలా కొనసాగిస్తున్నారు?
జ్వావూ ప్రతి ఇంట్లోని ప్రతి వ్యక్తితోను మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. ఒక మహిళను సందర్శించినప్పుడు ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆయన అడిగాడు. తన భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు అని, అయితే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నందువల్ల వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సాయంకాలమవుతుంది కనుక వాళ్ళను కలవడం కష్టమని ఆమె జవాబు చెప్పింది. జ్వావూ అక్కడి నుండి ఆ ప్రాంతంలోని ఇతరులను దర్శిస్తూ వెళ్ళాడు. దాదాపు గంటన్నర తరువాత ఒక మనిషి ఆయనను సమీపించాడు.
“మీరు నాతో మాట్లాడాలని అన్నారు. మీకేం కావాలో దయచేసి నాతో చెప్పండి” అని ఆ మనిషి జ్వావూతో అన్నాడు.
“క్షమించండి, మీరెవరో నాకు తెలియదు. మీరెవరు?” అని జ్వావూ ఆశ్చర్యపోతూ జవాబిచ్చాడు.
“నేను ఆంటోన్యూ, నేను ఈ వీధిలోనే ఉంటాను. మా కుటుంబంలోని మిగిలినవారితో మాట్లాడాలని మీరు మా అమ్మతో అన్నారు. కనుక మీకేమి కావాలో తెలుసుకోవాలని వచ్చాను.”
జ్వావూ ఆంటోన్యూకు మంచి సాక్ష్యమిచ్చి, ఆయనతో బైబిలు పఠనమారంభించాడు. రెండవ పఠనం తరువాత, పఠనం వారానికి రెండు సార్లు జరిపితే ఎలావుంటుందని ఆంటోన్యూ అడిగాడు. నాలుగు నెలల్లో, ఆయన జ్వావూతో కలిసి తన స్వంత వీధిలో సువార్తను ప్రకటించనారంభించాడు. మూడు నెలల తరువాత ఆయన బాప్తిస్మం పొందాడు. ఇటీవలే వాళ్ళ అమ్మ కూడా బైబిలు పఠించనారంభించింది. పరిచర్యలో ఇంట్లోని అందరితో మాట్లాడడానికి ప్రయత్నించడం ఎంత ప్రాముఖ్యం!
అలాంటి పులకింపజేసే అనుభవాలు పోర్చుగల్ నీటిలో ఆత్మీయ చేపలు పట్టే పని ఇంకా విస్తారంగా ఉంది అని చూపిస్తున్నాయి. అక్కడి కష్టపడే సాక్షులను అభివృద్ధిచెందుతున్న వేల కొలది బైబిలు పఠనాలతో యెహోవా ఆశీర్వదించాడు. అందరికీ బైబిలు సత్యాన్ని తెలియజేయడానికి వాళ్ళు మరిన్ని మార్గాలను వెదుకుతుండగా, పౌలు ఫిలిప్పీలోని క్రైస్తవులకు వ్రాసిన మాటలు నేటి పోర్చుగల్‌లో నిజంగా నెరవేరుతున్నాయి: “యే విధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు.”—ఫిలిప్పీయులు 1:18.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[23వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
స్పెయిన్
పోర్చుగల్
[24, 25వ పేజీలోని చిత్రం]
పోర్చుగల్‌లోని సాక్షులు బైబిలు సత్యాన్ని తెలియజేసేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు