“వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది”
వినయము అనేది తమ వ్యక్తిగత పరిమితులను గుర్తెరగడం అని నిర్వచింపబడింది; అలాగే పరిశుద్ధత లేక వ్యక్తిగత పవిత్రత. హెబ్రీ మూల క్రియా పదమైన ట్సా·నా, మీకా 6:8లో “దీనమనస్సు కలిగి” ఉండటం అని అనువదించబడింది, ఆ ఒక్క స్థలంలోనే అది ఉపయోగింపబడింది. ఒకరు బిడియముకలిగి, వినయంగా లేక దీనంగా ఉండటమనే భావాన్ని అది స్ఫురింపజేస్తుందని ఎ హీబ్రూ అండ్ ఇంగ్లీష్ లెక్సికన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్ చెబుతుంది. “వినయము” అనే పదం ఐ·డాస్ʹ అనే గ్రీకు పదం యొక్క అనువాదం. (1 తిమోతి 2:9, NW) నైతిక భావంలో ఐ·డాస్ʹ ఉపయోగింపబడినప్పుడు, అది భీతి, భయం, ఇతరుల భావాలు లేక అభిప్రాయంపట్ల లేక తన స్వంత మనస్సాక్షిపట్ల గౌరవం అనే అర్థాన్ని కలిగివుంది అంతేగాక అలా అది సిగ్గు, స్వయం-గౌరవం, స్వాభిమానం, గంభీరత మరియు మితంగా ఉండటమనే భావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అలా, ఐ·డాస్ʹలో సూచింపబడిన అదుపు చేసే ప్రభావంలో ప్రాముఖ్యంగా మనస్సాక్షి ఇమిడివుంది.
దేవుని ఎదుట
ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని గూర్చి సరిగ్గా అంచనావేయడమనే భావనలో వినయాన్ని గురించి లేఖనాలు అనేక సలహాలనిస్తున్నాయి. “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నది” అని ఒక సామెత చెబుతుంది. ఎందుకంటే వినయాన్ని కనపర్చే వ్యక్తి, అహంభావం లేక డంబాలు పలకడం ద్వారా వచ్చే అవమానాన్ని తప్పించుకుంటాడు. (సామెతలు 11:2) ఆయన యెహోవా అంగీకరించే మార్గాన్ని అనుసరిస్తున్నాడు గనుక ఆయన వివేకవంతుడు. (సామెతలు 3:5, 6; 8:13, 14) యెహోవా అలాంటి వ్యక్తిని ప్రేమించి, జ్ఞానాన్ని అందజేస్తాడు. యెహోవా అంగీకారాన్ని ఆర్జించడానికి అవసరమైన వాటిలో ఒకటి, ‘దీనమనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట.’ (మీకా 6:8) యెహోవా ఎదుట తనకున్న స్థానాన్ని సరిగ్గా గుణగ్రహించడం, యెహోవా యొక్క గొప్పతనం, పవిత్రత మరియు పరిశుద్ధత ముందు తన పాపభరిత స్థితిని గుర్తించడం కూడా ఇందులో ఇమిడివున్నాయి. ఒక వ్యక్తి తాను యెహోవా సృష్టి అని గుర్తించుకోవాలని, తాను పూర్తిగా ఆయనపై ఆధారపడి ఉన్నాడని మరియు ఆయన సార్వభౌమాధిపత్యానికి లోబడాల్సి ఉందని కూడా దాని అర్థం. హవ్వ దీన్ని గుణగ్రహించడంలో విఫలమైంది. ఆమె పూర్తి స్వాతంత్ర్యం మరియు స్వయంనిర్ణయం కొరకు ప్రాకుల్లాడింది. ‘మంచి చెడ్డలను ఎరిగినదై దేవతలవలె’ కావాలన్న తలంపును తన మదిలోనుండి తొలగించుకునేందుకు వినయం ఆమెకు సహాయం చేసివుండేది. (ఆదికాండము 3:4, 5) “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి” అని చెబుతూ, అపొస్తలుడైన పౌలు అతినమ్మకం మరియు అహంకారం కలిగివుండవద్దని సలహా ఇస్తున్నాడు.—ఫిలిప్పీయులు 2:12.
దేని గురించి గొప్పలు చెప్పుకోవాలి
గొప్పలు చెప్పుకోవడం వినయానికి వ్యతిరేకం. ఒక నియమమేమంటే: “నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.” (సామెతలు 27:2) యెహోవా స్వంత మాటలు ఇలా ఉన్నాయి: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—యిర్మీయా 9:23, 24; సామెతలు 12:9; 16:18, 19 పోల్చండి.
వినయముగల వారి ఎడల దేవునికిగల శ్రద్ధ
వినయముగల వారి ఎడల దేవునికిగల శ్రద్ధను తెలియజేస్తూ అపొస్తలుడైన పౌలు, సంఘంలోని తన ప్రవర్తన అలాంటి వినయ దృక్పథానికి మాదిరి అని సూచిస్తున్నాడు. కొరింథులోని క్రైస్తవులకు ఆయన ఇలా వ్రాశాడు: “సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. అయితే . . . అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది . . . సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతోగాని జ్ఞానాతిశయముతోగాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవునిశక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.”—1 కొరింథీయులు 1:26–2:5.
లేఖనాల్లో వ్రాయబడివున్న సంగతులను అతిక్రమింపకుడి
తనను తాను సరైన రీతిలో అంచనా వేసుకుంటూ తాను వినయాన్ని కనపరచినట్లే, అందరూ వినయంగా ఉండవలసిన అవసరతను పౌలు తర్వాత తన పత్రికలో నొక్కి చెప్పాడు. కొరింథీయులు అపొల్లో వంటి కొందరు మనుష్యుల విషయంలో, చివరకు పౌలు విషయంలో కూడా గొప్పలు చెప్పుకునే ఉరిలో చిక్కుకుపోయారు. ఇలా చేస్తున్నందున వారు ఆత్మీయ వ్యక్తులు కారు గానీ, శారీరకమైన వారేనని చెబుతూ, పౌలు వాళ్లను సరిదిద్ది ఇలా చెప్పాడు: “సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని [అంటే, మానవులు ఒకరిపట్ల ఒకరు మరియు తమపట్ల తాము కలిగివుండవలసిన దృక్పథం విషయంలో లేఖనాలు నియమించే హద్దులను అతిక్రమించకండి], మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?” ఈ విషయాన్ని మదిలో ఉంచుకోవడం, తన లేక ఇతరుల వంశము, తెగ, రంగు లేక జాతీయత, శారీరక అందం, సామర్థ్యం, జ్ఞానం, మానసిక విజ్ఞానం ఇత్యాది విషయాలను పురస్కరించుకుని అహంభావంగా ఉండకుండా మరియు డంబాలు పలుకకుండా ఆపుతుంది.—1 కొరింథీయులు 4:6, 7.
యేసుక్రీస్తు యొక్క మాదిరి
వినయాన్ని చూపడంలో యేసుక్రీస్తు అతి చక్కని మాదిరి. తాను తన స్వంతగా ఒక్కపనీ చేయలేనని, అయితే తండ్రి చేసేది చూసి దాన్ని మాత్రమే చేయగలనని, తండ్రి తనకంటే గొప్పవాడని ఆయన తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 5:19, 30; 14:28) తనకు చెందని బిరుదులను యేసు అంగీకరించలేదు. ఒక పాలకుడు ఆయనను “సద్బోధకుడా” అని పిలిచినప్పుడు, యేసు ఇలా సమాధానమిచ్చాడు: “నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు.” (లూకా 18:18, 19) యెహోవా దాసులుగా వారు దేవుని సేవలో తాము సాధించిన సంగతులనుబట్టి లేక దేవుని ఎదుట తమ విలువనుబట్టి ఉప్పొంగకూడదని ఆయన తన శిష్యులకు చెప్పాడు. బదులుగా, వారికి నియమింపబడిన పనులను అన్నింటినీ చేసిన తర్వాత, “మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నా”మనే దృక్పథాన్ని వాళ్లు కలిగివుండాలి.—లూకా 17:10.
దానికి తోడు, ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైనున్న పరిపూర్ణ మానవునిగా, తన అపరిపూర్ణ శిష్యులకంటే ఎంతో ఉన్నతుడు మరియు తన తండ్రి నుండి గొప్ప అధికారాన్ని పొందాడు. అయిననూ, తన శిష్యులతో వ్యవహరించేటప్పుడు ఆయన వారి పరిమితులను గుర్తించి దయ చూపాడు. వాళ్లకు తర్ఫీదునిచ్చేటప్పుడు సున్నితంగా వ్యవహరించాడు మరియు వాళ్లతో మర్యాదగా మాట్లాడాడు. ఆ సమయంలో వాళ్లు మోయగల్గిన దానికంటే ఎక్కువ ఆయన వారిపై మోపలేదు.—యోహాను 16:12; మత్తయి 11:28-30; 26:40, 41 పోల్చండి.
వస్త్రధారణ మరియు ఇతర విషయాల్లో
సంఘంలో సరైన ప్రవర్తన అనుసరింపబడే విషయంలో పర్యవేక్షించేందుకు అధ్యక్షుడైన తిమోతికి ఉపదేశాన్నిస్తూ, పౌలు ఇలా చెప్పాడు: “స్త్రీలును అణుకువయు [“వినయము,” NW] స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమోతి 2:9, 10) అపొస్తలుడు ఇక్కడ “తగుమాత్రపు వస్త్రముల”ను సిఫారసు చేస్తున్నాడు గనుక ఆయన శుభ్రంగా మరియు మంచిగా, చక్కగా కనిపించడానికి వ్యతిరేకంగా సలహా ఇవ్వడంలేదు. అయితే ఆయన, తమ వైపుకు లేక తమ స్తోమత వైపుకు అవధానాన్ని మళ్లించేలా ఆడంబరంగా వస్త్రాలు ధరించడం మరియు తమ అలంకరణ విషయంలో అతిగా ఆసక్తి కలిగి ఉండటం యొక్క అయుక్తతను చూపుతున్నాడు. పౌలు చెప్పిన మాటల్లో, ఇతరుల భావాలపట్ల గౌరవం, స్వయంగౌరవం మరియు స్వాభిమానం ఈ మూడింటితో కూడిన వినయం ఇమిడివుంది. క్రైస్తవుల వస్త్రధారణ అసభ్యంగా, సంఘంలో నైతికంగా సరైనవని భావించబడే వాటికి తగని దానిగా ఉండి, అలా కొందరికి అభ్యంతరకరంగా, విభ్రాంతి కలిగించే విధంగా ఉండకూడదు. దుస్తులను గూర్చిన ఈ సలహా, క్రైస్తవునికి ఉన్న ఇతర వస్తు సంపదను సరైన రీతిలో ఉపయోగించుకోవడం, యెహోవాకుగల దృక్పథంపై అదనపు వెలుగును ప్రసరింపజేస్తుంది.
అవివేకమైన క్రియలు మరియు దృక్పథాలనుండి వినయం మనల్ని కాపాడుతుంది. సామెత చెబుతున్నట్లు, వినయమన్నది నిజంగా జ్ఞానయుక్తమైన మార్గం.