కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/15 పేజీలు 19-22
  • శిష్యులను చేయడంలో ఆనందాన్నెలా కనుగొనడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శిష్యులను చేయడంలో ఆనందాన్నెలా కనుగొనడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “గొఱ్ఱెలు” కాగలవారిని గుర్తించడం
  • బైబిలు పఠనాలను ప్రారంభించడం
  • ఆసక్తిని సజీవంగా ఉంచడం
  • యెహోవా ఎడల ప్రేమను పెంపొందింపజేయడం
  • ఆచరణాత్మకమైన సహాయాన్ని ప్రతిపాదించండి
  • సహించడానికి వారిని బలపర్చండి
  • శిష్యుల్ని చేయడం ప్రయాసకు ఎందుకు తగినది
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సంఘమంతా సహాయం చేయవచ్చు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • శిష్యుల్ని చేసే పనిలో మీరు సహాయపడగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ‘మీరు వెళ్లి శిష్యుల్ని చేయండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/15 పేజీలు 19-22

శిష్యులను చేయడంలో ఆనందాన్నెలా కనుగొనడం

ఒక వ్యక్తి పొందగల గొప్ప ఆనందాల్లో ఒకటి దేవుని జత పనివానిగా ఉండడం. నేడు దేవుని పనిలో, నీతిని కోరే ప్రజలను క్రైస్తవ సంఘంలోకి తీసుకురావడం, వారు ఇప్పుడు క్రైస్తవులుగా జీవించడానికి మరియు నూతన లోకంలోకి కాపాడబడేందుకు కూడా తర్ఫీదునివ్వడం చేరివున్నాయి.—మీకా 4:1-4; మత్తయి 28:19, 20; 2 పేతురు 3:13.

లాటిన్‌ అమెరికాలో 1980 నాటి నుండి పది లక్షలమంది ప్రజలు యేసు క్రీస్తు శిష్యులు కావడాన్ని చూడడం యెహోవాసాక్షులకు గొప్ప ఆనందాన్ని కలుగజేసింది. బైబిలును గౌరవించి విశ్వసించే అనేకులుగల ఈ ఫలవంతమైన క్షేత్రంలో, కొంతమంది పూర్తికాల పరిచారకులు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొనేందుకు చాలామందికి సహాయపడగలిగారు. ఎంతో అనుభవం ఉన్నందున, శిష్యులను చేయడంలోగల ఆనందాన్ని గూర్చి బహుశా వారు మనకు కొంత చెప్పగల్గవచ్చు. మీరు నివసిస్తున్న ప్రాంతంలో శిష్యులను చేయడంలో ఆనందాన్ని కనుగొనడానికి వారి సలహాలు కొన్ని మీకు సహాయం చేయవచ్చు.

“గొఱ్ఱెలు” కాగలవారిని గుర్తించడం

యేసు తన శిష్యులను ప్రకటించడానికి పంపిస్తున్నప్పుడు వారితో ఇలా చెప్పాడు: “మీరు ఏపట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణ” చేయుడి. (మత్తయి 10:11) మీరు ప్రజలను సందర్శిస్తున్నప్పుడు, ఎవరికి ఆత్మీయంగా సహాయం చేయవచ్చో మీరెలా గుర్తించగలరు? 50 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పూర్తికాల సేవకునిగావున్న ఎడ్‌వర్డ్‌ ఇలా చెబుతున్నాడు: “వారు ఆసక్తితో కూడిన తమ ప్రశ్నల ద్వారా, లేఖనాల నుండి సమాధానాలు ఇవ్వబడినప్పుడు తమ సంతృప్తిని వ్యక్తపరచడం ద్వారా దాన్ని తెలియజేస్తారు.” కోరల్‌ ఇంకా ఇలా తెలియజేస్తోంది: “ఒక వ్యక్తి నాకు తన వ్యక్తిగత సమస్యను లేక చింతను చెప్పుకున్నాడంటే, అది సహాయం కొరకైన అభ్యర్థనే. వాచ్‌టవర్‌ సొసైటీ ప్రచురణల్లో సహాయకరమైన సమాచారాన్ని కనుగొనడానికి నేను ప్రయత్నిస్తాను. అలాంటి వ్యక్తిగత ఆసక్తి తరచూ బైబిలు పఠనానికి నడిపిస్తుంది.” అయినప్పటికీ, యథార్థవంతులను ఎల్లప్పుడూ సులభంగా గుర్తించలేము. లూయిజ్‌ ఇలా తెలియజేస్తున్నాడు: “ఎంతో ఆసక్తిగల వారిగా కనిపించినవారు అసలు ఆసక్తిలేనివారిగా మారారు, కాని మొదట్లో వ్యతిరేకించినట్లు కనిపించినవారు బైబిలు నిజంగా ఏమి చెబుతుందో విన్నప్పుడు మారారు.” లాటిన్‌ అమెరికా దేశస్థులు అనేకులు బైబిలును గౌరవిస్తారు గనుక, ఆయన ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు: “బైబిలు ఏమి బోధిస్తుందో నేను చూపించిన వెంటనే వారు దాన్ని అంగీకరిస్తే వారు ఆత్మీయ సహాయాన్ని పొందగలవారని నేను గుర్తిస్తాను.” అలాంటి “అర్హులైన” వారికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయడం నిజమైన ఆనందాన్ని సంతృప్తిని తెస్తుంది. దీన్ని మీరెలా చేయగలరు?

బైబిలు పఠనాలను ప్రారంభించడం

సాధారణంగా, బైబిలు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేసేందుకు, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిచే’ తయారు చేయబడిన బైబిలు పఠన సహాయకాలను ఉపయోగించడం శ్రేష్ఠమైన మార్గం. (మత్తయి 24:45) మీరు అలాంటి బైబిలు పఠన సహాయకాల విలువ ఎడల మెప్పుదలను ఎలా పెంపొందింపజేసుకోగలరు? ఎడ్‌వర్డ్‌ ఇలా చెబుతున్నాడు: “ప్రజల పరిస్థితులు, వ్యక్తిత్వాలు, దృక్కోణాలు ఎంతో తేడాగా ఉంటాయి గనుక, పఠనాలను ప్రారంభించే తీరును మారుస్తూ ఉండడానికి నేను ప్రయత్నిస్తాను.” మీరు ప్రతి ఒక్కరితోను ఒకే పద్ధతిని ఉపయోగించలేరు.

కొందరితో, బైబిలు పఠన పుస్తకాన్ని పరిచయం చేసే ముందు లేఖనాలకు సంబంధించిన కొన్ని అనియత చర్చలను చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ, ఒక మిషనరీ జంట ఇలా నివేదించారు: “మేము సాధారణంగా మొదటి దర్శన సమయంలోనే పఠనాన్ని ప్రతిపాదిస్తాము.” అలాగే, సమర్పించుకొనేందుకు 55 మందికి సహాయం చేసిన ఒక సాక్షి ఇలా చెబుతోంది: “నేను బైబిలు పఠనాలను మొదలు పెట్టే ముఖ్య పద్ధతి ఏమిటంటే, నేరుగా పరదైసు భూమిపై మీరు నిరంతరము జీవించగలరు అనే పుస్తకంలోని సమాచారాన్ని పరిశీలించడమే.” ఏదైనా పఠించడమనే తలంపును కొందరు ఇష్టపడకపోయినప్పటికీ, తమకు జీవితంలో సహాయం చేయగలదని నమ్మిన దేనినైనా పఠించడానికి ఇతరులు ఆసక్తి కలిగివుంటారు. ఇంటి వద్ద ఉచిత బైబిలు తరగతుల ప్రతిపాదన వీరికి ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమంది మిషనరీలు ఈ ప్రతిపాదనను వివరించి, ఇలా చెబుతారు: “మేము దానినెలా చేస్తామో నేను చూపాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే, మీరు కొనసాగించవచ్చు. మీరు వద్దనుకుంటే, అది మీ ఇష్టం.” దాన్ని అలా ప్రతిపాదించినప్పుడు, అంగీకరించడానికి ప్రజలు భయపడరు.

ఆర్థికంగా విద్యాపరంగా తక్కువ స్థాయిలోవున్న అనేకులకు సహాయం చేసిన మరో సాక్షి ఇలా తెలియజేస్తుంది: “బైబిలు పఠనాలను ప్రారంభించడంలో ప్రాముఖ్యంగా కరపత్రాలు ఉపయోగకరంగా ఉన్నట్లు నేను కనుగొన్నాను.” పూర్తికాల బోధకులు తాము ఏ ప్రచురణను ఉపయోగించినప్పటికీ, ప్రాముఖ్యంగా బైబిలుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి ప్రయత్నిస్తారు. కరోలా ఇలా చెబుతుంది: “మొదటి పఠనంలో, ముఖ్య విషయాలు స్పష్టమయ్యేలా నేను కేవలం చిత్రాలను, దాదాపు ఐదు లేఖనాలను ఉపయోగిస్తాను, అప్పుడు బైబిలు కష్టమైనదిగా అనిపించదు.”

ఆసక్తిని సజీవంగా ఉంచడం

అభివృద్ధి చెందడమన్న భావనను ప్రజలు ఇష్టపడతారు, కాబట్టి జెన్నిఫర్‌ ఇలా సిఫారసు చేస్తోంది: “పఠనాన్ని చైతన్యవంతంగా చేయండి. అభివృద్ధికరంగా కొనసాగేలా చూడండి.” ఒక్కవారం కూడా తప్పిపోకుండా పఠనాన్ని క్రమంగా నిర్వహించడం తాము అభివృద్ధి చెందుతున్నామన్న భావన కలిగివుండడానికి వారికి సహాయం చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన ఒక ప్రత్యేక పయినీరు, తక్కువ విద్య గలవారు కూడా అభివృద్ధి సాధించగలిగేలా వివరణలను సరళీకరించడం, ముఖ్యాంశాలపై కేంద్రీకరించడం వంటివాటి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “మా గ్రామంలో, విత్తనాలు నాటిన తర్వాత నేలపై నీళ్లు చిలకరించవలసి ఉంటుంది. మేము పొలాలను నీటితో నింపితే, నేల గట్టిగా తయారై విత్తనాలు బయటికి చొచ్చుకు రాలేక చనిపోతాయి. అలాగే, క్రొత్తగా ఆసక్తిగల వారిని మీరు అనేక విషయాలతో ముంచెత్తినట్లయితే, అది చాలా కష్టమనిపించి, వాళ్లు మానుకుంటారు.” విషయాలు తెలుసుకోవాలని ఆసక్తిగల ప్రజలు కూడా తాము అవగాహన చేసుకోవడంలో అభివృద్ధి సాధించాలంటే ఒకసారి ఒకే విషయంపై కేంద్రీకరించడానికి నేర్చుకోవాలి. యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు.”—యోహాను 16:12.

ఆసక్తిని సజీవంగా ఉంచడానికి మరో మార్గం ఏమిటంటే, మీరు సందర్శించే వారిని మీరు వెళ్లిపోయాక కూడా దేవుని వాక్యం గురించి ఆలోచించడం కొనసాగించమని ప్రోత్సహించడమే. యోలాండ ఇలా సిఫారసు చేస్తోంది: “ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకుండా విడిచి పెట్టండి. బైబిలులోని ఒక భాగాన్ని చదవడం లేక వారికి సంబంధించిన ఒక అంశాన్ని పరిశోధించడం వంటి ఏదైనా పనిని వారికి ఇవ్వండి.”

యెహోవా ఎడల ప్రేమను పెంపొందింపజేయడం

మీరు మీ విద్యార్థులు ‘వినువారు మాత్రమేకాక వాక్యప్రకారము ప్రవర్తించువారిగా’ తయారు కావడానికి సహాయం చేసినప్పుడు మీ ఆనందం అధికమౌతుంది. (యాకోబు 1:22) మీరది ఎలా చేయగలరు? నిజ క్రైస్తవులు యెహోవా ఎడల ప్రేమచే పురికొల్పబడతారు. మెక్సికోకు చెందిన పెడ్రో ఇలా వివరిస్తున్నాడు: “తమకు తెలియని వ్యక్తిని ప్రజలు ప్రేమించలేరు, కాబట్టి పఠనారంభం నుండి నేను వారికి బైబిలులోనుండి దేవుని పేరును తెలియజేసి, యెహోవా లక్షణాలను నొక్కి తెలియజేయడానికి అవకాశాల కొరకు ఎదురు చూస్తాను.” సంభాషణలో, యెహోవా ఎడల మీ భావాలను వ్యక్తపర్చడం ద్వారా ఆయన ఎడల మెప్పుదలను మీరు పెంపొందింపజేయవచ్చు. ఎలిజబెత్‌ ఇలా చెబుతుంది: “నేను ఎల్లప్పుడు యెహోవా మంచితనం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. పఠనం జరిగేటప్పుడు నేను ఒక అందమైన పువ్వునో, చక్కని పక్షినో, లేక ఆటలాడుతున్న పిల్లికూననో చూసినప్పుడు, అది యెహోవా పని అని ఎల్లప్పుడూ చెబుతాను.” “మీకు తెలిసినట్లుగానే, దేవుడు వాగ్దానం చేసిన నూతన లోకం గురించి వాస్తవమన్నట్లుగా మాట్లాడండి, నూతన లోకంలో ఏమి చేయడం వారికిష్టమో అడగండి” అని జెన్నిఫర్‌ సలహా ఇస్తుంది.

యెహోవా గురించి తాను తెలుసుకుంటున్న దానిని గురించి ఒక వ్యక్తి మెప్పుకోలుగా ధ్యానించినప్పుడు, అది ఆయన హృదయంలోకి చొచ్చుకుపోయి, చర్య గైకొనడానికి ఆయనను ప్రేరేపిస్తుంది. కాని ఆయన దాన్ని గుర్తుంచుకోకపోతే ధ్యానించలేడు. ప్రతిసారి పఠనం ముగిసిన తర్వాత మూడు లేక నాలుగు విషయాలను క్లుప్తంగా పునఃపరిశీలించడం జ్ఞాపకముంచుకోవడానికి దోహదపడుతుంది. అనేకమంది బైబిలు బోధకులు, క్రొత్తవారు తమ బైబిలు వెనుక భాగంలో ఒక చిన్న నోట్‌తోపాటు కీలకమైన లేఖనాలు కలిపి వ్రాసుకోనేలా చూస్తారు. ఇంగ్లాండుకు చెందిన ఒక మిషనరీ పునఃపరిశీలన యొక్క మరో ప్రయోజనాన్నిలా వివరిస్తోంది: “సమాచారం వారికి ఎలా ప్రయోజనకరంగా ఉందో నేను వారిని అడుగుతాను. ఇది, వారు యెహోవా మార్గాలు, సూత్రాల గురించి మెప్పుకోలుగా ధ్యానించేలా చేస్తుంది.”

గిలియడ్‌ యొక్క మూడవ తరగతి నుండి పట్టభద్రురాలైన ఒక నమ్మకమైన సాక్షి ఇలా చెబుతోంది: “మనం ఉత్సాహంగా ఉండాలి. మనం బోధిస్తున్నది మనం నమ్ముతున్నామని మన విద్యార్థులు గ్రహించాలి.” సంతోషభరితమైన “క్రియను చేయు” వారిగా మిమ్మల్ని తయారు చేసిన విశ్వాసాన్ని మీరు వ్యక్తపర్చినట్లయితే, అది ఇతరులకు సోకేదిగా ఉండగలదు.—యాకోబు 1:25.

యెహోవాను సేవించేందుకు అనేకులకు సహాయం చేసిన ఒక సాక్షి ఇలా చెబుతుంది: “ప్రజలు తమ ప్రార్థనలకు సమాధానాలను గుర్తించడానికి నేను వారికి సహాయం చేసినప్పుడు వారు దేవునికి సన్నిహితులయ్యారని భావిస్తున్నట్లు నేను కనుగొన్నాను. నేను నా స్వంత అనుభవం నుండి వారికి ఉదాహరణలు తెలియజేస్తాను, వాటిలో ఒకటి ఇలా ఉంది, నేను నా సహ పయినీర్‌, పయినీర్లుగా క్రొత్త నియామకానికి వచ్చినప్పుడు, మా దగ్గర కేవలం కొన్ని కూరగాయలు, ఒక ప్యాకెట్టు మార్గరైన్‌ మాత్రం ఉన్నాయి, డబ్బు అసలు లేదు. మేము ఆ రాత్రి భోజనానికి వాటిని ముగించి, ‘ఇక రేపటికి మనకు ఏమిలేదు’ అనుకున్నాము. మేము దాని గురించి ప్రార్థన చేసి పడుకున్నాము. ఉదయాన్నే స్థానిక సాక్షి వచ్చి తనను తాను పరిచయం చేసుకొని, ‘యెహోవా పయినీర్లను పంపించాలని నేను ప్రార్థించాను. ఇప్పుడు నేను దినంలోని ఎక్కువ భాగం మీతో పాటు ఉండవచ్చు, కాని నేను దూరంగా గ్రామంలో నివసిస్తున్నాను కాబట్టి నేను భోజనం మీతో కలిసి తినవలసిందే, అందుకని నేను మనందరి కొరకు నాతోపాటు ఆహారం తెచ్చాను’ అని చెప్పింది. అది ఎక్కువ మోతాదులో ఉన్న మాంసము మరియు కూరగాయలు. మనం యెహోవా రాజ్యాన్ని మొదట వెదికితే ఆయన మనల్ని ఎన్నడూ విడువడని నేను ఎప్పుడూ నా విద్యార్థులకు చెబుతాను.”—మత్తయి 6:33.

ఆచరణాత్మకమైన సహాయాన్ని ప్రతిపాదించండి

క్రీస్తు శిష్యులనుగా తయారు చేయడంలో బైబిలు పఠనాన్ని నిర్వహించడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. అనేక సంవత్సరాలపాటు ప్రయాణ కాపరిగా సేవచేసిన ఒక మిషనరీ ఇలా చెబుతున్నాడు: “వారితో సమయం గడపండి. పఠనం ముగిసిన వెంటనే అక్కడి నుండి హడావుడిగా వెళ్లిపోకండి. యుక్తమనిపిస్తే ఆగి, కొద్దిసేపు మాట్లాడండి.” “జీవం ఇమిడి ఉంది గనుక నేను వారి విషయంలో ఆసక్తి చూపిస్తాను. వారు నా పిల్లలే అన్నట్లు నేను అనేకసార్లు వారి గురించి చింతిస్తాను” అని ఎలిజబెత్‌ చెబుతోంది. ఇతర సాక్షులు ఈ సలహాలనిచ్చారు: “వారు అస్వస్థతగా ఉన్నప్పుడు వారిని సందర్శించండి.” “ఉదాహరణకు, ప్రాంతీయ పరిచర్యలో మీరు వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇతర సాక్షులను వారికి పరిచయం చేయడానికి వారిని కొంచెం సేపు దర్శించండి.” ఈవా ఇలా చెబుతోంది: “వ్యక్తి యొక్క పూర్వాపరాలను జీవితంలోని పరిస్థితిని అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. ఇలాంటివి, ప్రజలు సత్యానికి ప్రతిస్పందించే దానిపై ప్రభావం చూపి వారి అభివృద్ధిని అడ్డగించగలవు. వారు తమ సమస్యల గురించి మాట్లాడేందుకు నమ్మకం కలిగివుండేలా వారికి స్నేహితులై ఉండండి.” “వ్యక్తి ఎడల నిజమైన ఆసక్తి కలిగివుండడం ప్రాముఖ్యం, ఎందుకంటే సత్యం ఆయన జీవితంలో తెచ్చే మార్పులు కొన్నిసార్లు ఆయన తన కుటుంబాన్ని, స్నేహితులను కోల్పోవడానికి కారణమౌతుంది. సాధారణంగా, విద్యార్థి మనం ఎక్కడ నివసిస్తున్నామన్నది తెలుసుకోవడం మరియు మన వద్దకు ఏ సమయంలోనైనా రావచ్చునన్న నిశ్చయత కలిగివుండడం మంచిది” అని కూడా కారల్‌ చెబుతోంది. సంఘాన్ని తన క్రొత్త కుటుంబంగా దృష్టించడానికి ఆయనకు సహాయం చేయండి.—మత్తయి 10:35; మార్కు 10:29, 30.

“ఆచరణాత్మకమైన సహాయాన్ని అందజేయడానికి మెలకువగా ఉండండి. కూటాలలో వారి వద్ద కూర్చుని పిల్లలను చూసుకోవడంలో వారికి సహాయం చేయండి” అని యోలాండ చెబుతుంది. తమ పిల్లలకు ఎలా శిక్షణనివ్వాలో, తమ పరిశుభ్రతా ప్రమాణాలను ఎలా మెరుగుపర్చుకోవాలో, కూటాల కొరకు వ్యాఖ్యానాలను ఎలా సిద్ధపడాలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగాలు ఎలా ఇవ్వాలో క్రొత్తవారికి చూపించడం ఇదంతా శిష్యుల్ని చేసే పనిలో భాగమే. మరో సహోదరి ఇంకా ఇలా చెబుతోంది: “పరిచర్య కొరకు క్రొత్తవారికి తర్ఫీదివ్వడం ప్రాముఖ్యం. తర్ఫీదు యొక్క ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, కొంతమందిలో ప్రకటన పని అంటే భయం ఉండిపోయి, యెహోవాను సేవించడంలోని వారి ఆనందాన్ని కోల్పోయి సహనం కలిగివుండడంలో విఫలులౌతారు.” కాబట్టి ఇంటింటి పనిలో, పునర్దర్శనాలు చేయడంలో, బైబిలు పఠనాలు ప్రారంభించడంలో జాగ్రత్తతో కూడిన తర్ఫీదునివ్వండి. మీ సహాయ నడిపింపులతో మీ విద్యార్థి అభివృద్ధి సాధించడాన్ని మీరు చూసినప్పుడు మీ ఆనందం అధికమౌతుంది.

సహించడానికి వారిని బలపర్చండి

“విద్యార్థి బాప్తిస్మం పొందిన వెంటనే పఠనాన్ని నిర్లక్ష్యం చేసే వైఖరి ఉంది” అని శిష్యుల్ని చేయడంలో అనుభవంగల స్త్రీ హెచ్చరిస్తోంది. క్రొత్తగా బాప్తిస్మం పొందిన క్రైస్తవుడు ఎంతమాత్రం ఆత్మీయ పరిపక్వత కలిగివుండడని బోధకుడు మరియు విద్యార్థి ఇద్దరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. తన విశ్వాసమందు, దేవుని ధర్మశాస్త్రం ఎడల తన మెప్పుదలయందు, యెహోవా ఎడల తన ప్రేమయందు ఆయన ఎంతో ఎదుగవలసి ఉంది. ఆయన అభివృద్ధి చెందడం కొనసాగించగలిగేలా మంచి వ్యక్తిగత పఠన అలవాట్లను పెంపొందింపజేసుకోమని ప్రోత్సహించడం ప్రాముఖ్యం.—1 తిమోతి 4:15.

క్రొత్త వ్యక్తి అభివృద్ధి చెంది, సహోదరుల సహవాసంలో ఆతిథ్యమిచ్చే సభ్యునిగా తయారవ్వడానికి సహాయం అవసరమౌతుండవచ్చు. సహోదరులతో ఆయన సన్నిహితమౌతున్న కొలది వారి అపరిపూర్ణతలతో వ్యవహరించడానికి ఆయనకు నడిపింపు అవసరం కావచ్చు. (మత్తయి 18:15-35) నైపుణ్యంగల బోధకునిగా తయారవ్వడానికి, తన స్వంత పరిశోధనను చేసుకోవడానికి ఆయనకు సహాయం అవసరం అవుతుండవచ్చు. ఒక మిషనరీ ఇలా చెబుతోంది: “ఒక విద్యార్థి బాప్తిస్మం పొందిన తర్వాత బోధకురాలిగా తన సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలని కోరుకుంది, కాబట్టి నాతో ఇలా చెప్పింది, ‘నేను వచ్చే వారం ఒక క్రొత్త పఠనం నిర్వహించాలి, కాని నేను పఠించిన తొలి అధ్యాయాలను నేను మళ్లీ జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది. నేను లేఖనాలు మరియు ఉపమానాలను గురించిన వివరణలను వ్రాసుకుని, నా పఠనానికి వెళ్లినప్పుడు వాటిని ఉపయోగించగలిగేలా, దయచేసి ఈ అధ్యాయాలను ఒక్కోసారి ఒక అధ్యాయం చొప్పున మీరు మళ్లీ నాతో పఠిస్తారా?’ ఆమె చక్కని బోధకురాలయ్యింది, ఒక సమావేశంలో ఆమె విద్యార్థులు నలుగురు బాప్తిస్మం తీసుకున్నారు.”

శిష్యుల్ని చేయడం ప్రయాసకు ఎందుకు తగినది

“శిష్యుల్ని చేయడం అంటే యెహోవాకు ఎక్కువమంది స్తుతికర్తలు అవుతున్నారని భావం. సత్యాన్ని అంగీకరించే వారికి అది జీవం” అని పామెలా చెబుతుంది. “ఇతరులకు సత్యం నేర్పించడం నాకెంతో ఇష్టం—అది ఎంతో చక్కనిది! తమ జీవితాల్లో మార్పులు చేసుకుంటూ, యెహోవా ఆత్మ లేకపోతే అసాధ్యం అనిపించే అడ్డంకులను అధిగమిస్తూ విద్యార్థులు కొద్దికొద్దిగా ఎదగడాన్ని ఒకరు చూడవచ్చు. యెహోవాను ప్రేమించడం ఆరంభించిన అనేకులు నా ప్రియమైన స్నేహితులయ్యారు.”

జర్మనీకి చెందిన ఒక మిషనరీ ఇలా చెబుతోంది: “శిష్యులు కావడానికి నేను సహాయం చేసిన వారిని నేను గుర్తు చేసుకున్నప్పుడు, నేను నమ్మలేనంతగా దేవుని సేవకులుగా ఎంతో అభివృద్ధి సాధించిన ఎంతో మొహమాటంగల కొంతమందిని నేను చూస్తాను. దాటలేని అడ్డంకులను స్పష్టంగా యెహోవా సహాయంతో అధిగమించే కొంతమంది ప్రజలను నేను చూస్తాను. ఒకప్పుడు విభాగింపబడివున్న కుటుంబాలు, ఇప్పుడు బాధ్యతగల తలిదండ్రులతో ఆనందభరితమైన పిల్లలుగల ఐక్య కుటుంబాలుగా ఉండడం నేను చూస్తున్నాను. ప్రజలు యెహోవాను స్తుతిస్తూ, అర్థవంతమైన జీవితాలు గడుపుతూ ఉండడం నేను చూస్తున్నాను. ఇదీ శిష్యులను చేయడంలోని ఆనందం.”

అవును, శిష్యులను చేసే పనిలో యెహోవా దేవునితో జతపనివారిగా ఉండడం ఎనలేని ఆనందానికి మూలం. మిషనరీల మరియు పయినీర్ల అనుభవాలు దీన్ని నిరూపించాయి. సలహాలను పాఠించి, దాని కొరకు పూర్ణ ప్రాణముతో పనిచేస్తే మీరూ అదే ఆనందాన్ని, సంతృప్తిని కనుగొనవచ్చు. యెహోవా ఆశీర్వాదంతో మీ ఆనందం పరిపూర్ణమౌతుంది.—సామెతలు 10:22; 1 కొరింథీయులు 15:58.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి