ఇప్పుడు మరియు నిరంతరం ఆనందమయంగా ఉండడం
“నేను సృజించుచున్నదానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను.”—యెషయా 65:18.
1. శతాబ్దాలుగా సత్యారాధన వ్యక్తులపై ఎలా ప్రభావం చూపించింది?
శతాబ్దాలుగా అనేకమంది సత్యదేవుడైన యెహోవాను సేవించడంలో ఎంతో ఆనందాన్ని కనుగొన్నారు. సత్యారాధనయందు ఆనందమయంగా ఉన్న అనేకమందిలో దావీదు కేవలం ఒక్కడే. నిబంధన మందసమును యెరూషలేములోనికి తీసికొని రావడాన్ని గూర్చి చెబుతూ, “దావీదును ఇశ్రాయేలీయులందరును ఆర్భాటముతోను బాకా నాదముతోను యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చి”రని బైబిలు తెలియజేస్తుంది. (2 సమూయేలు 6:15) యెహోవాను సేవించడంలోని అలాంటి ఆనందం కేవలం గతించిపోయిన విషయం కాదు. దానిలో మీరూ భాగం వహించగలరు. మరియు కొంగ్రొత్త ఆనందాలు సహితం త్వరలో మీవవుతాయి!
2. తిరిగి వచ్చిన యూదుల విషయంలో యెషయా 35వ అధ్యాయం యొక్క తొలి నెరవేర్పును మించి, మరో నెరవేర్పులో నేడు ఎవరు చేరివున్నారు?
2 గత శీర్షికలో, యెషయా 35వ అధ్యాయంలో వ్రాయబడిన ప్రేరణాత్మకమైన ప్రవచనం యొక్క మొదటి నెరవేర్పును మనం పరిశీలించాం. దీనిని ఓ పునరుద్ధరణ ప్రవచనం అని మనం పిలువడం సరియే, ఎందుకంటే ప్రాచీన కాలంలోని యూదుల విషయంలో జరిగిందదే. ఇది మన కాలంలోనూ అదే విధమైన నెరవేర్పును కల్గివుంది. ఏ విధంగా? ఎలాగంటే, యెహోవా సా.శ. 33 పెంతెకొస్తు నాటినుండి యేసు అపొస్తలులతో మరియు ఇతరులతో అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులతో వ్యవహరిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచిన వారిలో భాగమైన, దేవుని పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన మానవులే వీరు. (గలతీయులు 6:16; రోమీయులు 8:15-17) ఈ క్రైస్తవులు 1 పేతురు 2:9లో “ఏర్పర్చబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలు” అని పిలువబడ్డారని కూడా జ్ఞాపకం చేసుకోండి. ‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురం చేయండి’ అని పేతురు ఆత్మీయ ఇశ్రాయేలీయులకు అప్పగించబడిన పనిని తెలియజేస్తున్నాడు.
మన కాలంలోని నెరవేర్పు
3, 4. యెషయా 34వ అధ్యాయం ఆధునిక కాలాల్లో నెరవేరినప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి?
3 అలాంటి ఒక సమాచారాన్ని ప్రకటించడంలో ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషం స్థిరంగా చురుకుగా లేని ఒక కాలం ఈ శతాబ్ద తొలి భాగంలో ఉండినది. వారు దేవుని అద్భుతమైన వెలుగులో పూర్తిగా ఆనందించలేదు. నిజానికి, వారు ఎంతో చీకటిలో ఉన్నారు. ఎప్పుడలా జరిగింది? మరి దాని గురించి యెహోవా దేవుడేమి చేశాడు?
4 మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో, అంటే 1914లో పరలోకమందు దేవుని మెస్సీయా రాజ్యం స్థాపించబడిన వెంటనే అది జరిగింది. వివిధ దేశాల్లోని చర్చి మత గురువుల మద్దతుతో దేశాలు ఒక దానిపై మరొకటి ఆగ్రహావేశంతో ఉన్నాయి. (ప్రకటన 11:17, 18) దేవుడు, అహంకారపూరిత దేశమైన ఎదోమును తాను వ్యతిరేకించినట్లుగానే దాని ఉన్నతమైన మతగురువుల తరగతితో పాటు భ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యాన్ని వ్యతిరేకించాడు. కాబట్టి, సాదృశ్య ఎదోమైన క్రైస్తవమత సామ్రాజ్యం, యెషయా 34వ అధ్యాయంలోని ఆధునిక-దిన నెరవేర్పును అనుభవించేందుకు సిద్ధంగావుంది. శాశ్వత నిర్మూలనం ద్వారా జరిగే ఈ నెరవేర్పు, ప్రాచీన ఎదోముకు ప్రతికూలంగా ఉండిన ప్రవచనం ఎంత కచ్చితంగా నెరవేరిందో అంత కచ్చితంగానే జరుగుతుంది.—ప్రకటన 18:4-8, 19-21.
5. మన కాలంలో యెషయా 35వ అధ్యాయం ఏ రకమైన నెరవేర్పు కలిగివుంది?
5 ఆనందాన్ని నొక్కి చెబుతున్న యెషయా ప్రవచనంలోని 35వ అధ్యాయాన్ని గూర్చిన విషయమేమిటి? అది కూడా మన కాలంలో నెరవేరింది. అదెలా? ఒక రకమైన చెర నుండి జరిగిన ఆత్మీయ ఇశ్రాయేలీయుల పునరుద్ధరణలో అది నెరవేరింది. ఇప్పటికీ సజీవంగా ఉన్న అనేకుల జీవితకాలంలో జరుగుతున్న వాస్తవాల్ని, అంటే నిజానికి ఇటీవలి దైవపరిపాలనా చరిత్ర ఇమిడివున్న దానిని మనం పరిశీలిద్దాం.
6. ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషం చెరపట్టబడిన స్థితిలోనికి వెళ్లిందని ఎందుకు చెప్పగలం?
6 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సాపేక్షికంగా కొద్దికాలం పాటు, ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషం సంపూర్ణంగా పరిశుభ్రంగా, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండలేదు. వారిలో కొందరు సిద్ధాంతపరమైన తప్పులతో కళంకితులయ్యారు, యుద్ధం చేస్తున్న దేశాలకు మద్దతు ఇవ్వాలనే ఒత్తిడికి గురైనప్పుడు యెహోవా పక్షంగా స్పష్టమైన స్థానాన్ని తీసుకోకుండా రాజీ పడ్డారు. ఆ యుద్ధ సంవత్సరాల్లో అన్ని రకాలైన హింసల్ని వారు అనుభవించారు, వారి బైబిలు సాహిత్యాలు సహితం అనేక చోట్ల నిషేధించబడ్డాయి. చివరకు, అత్యంత ప్రముఖులైన సహోదరులలో కొందరు అబద్ధ ఆరోపణలపై దోషులుగా తీర్పుతీర్చబడి, చెరసాలలో వేయబడ్డారు. సింహావలోకనం చేస్తే, దేవుని ప్రజలు స్వేచ్ఛగా ఉండడానికి బదులు ఒక భావంలో చెరపట్టబడిన స్థితిలో ఉండిరని గ్రహించడం కష్టమేమీ కాదు. (యోహాను 8:31, 32 పోల్చండి.) వారు తీవ్రమైన ఆత్మీయ దృష్టిమాంద్యం కలిగివుండిరి. (ఎఫెసీయులు 1:16-18) వారు దేవుని స్తుతించడంలో కొంతవరకు మూగవారిగావుండడం మూలంగా వారు ఆత్మీయంగా ఫలించనివారయ్యారు. (యెషయా 32:3, 4; రోమీయులు 14:11; ఫిలిప్పీయులు 2:11) బబులోనులో చెరపట్టబడిన ప్రాచీన యూదుల స్థితికి ఇది ఎంత సమాంతరంగా ఉందో మీరు చూశారా?
7, 8. ఏ రకమైన పునరుద్ధరణను ఆధునిక దిన శేషం అనుభవించారు?
7 అయితే దేవుడు తన ఆధునిక సేవకులను అదే స్థితిలో విడిచిపెడతాడా? లేదు, యెషయా ద్వారా ప్రవచింపబడినట్లుగానే, ఆయన వారిని పునరుద్ధరించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా ఆత్మీయ పరదైసులో వర్థిల్లడానికి మరి ఆరోగ్యంగా ఉండడానికి ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషం పునరుద్ధరింపబడడంతో యెషయా 35వ అధ్యాయంలోవున్న ఇదే ప్రవచనం మన కాలంలో ఒక విశిష్టమైన నెరవేర్పును కలిగివుంది. పౌలు, యెషయా ప్రవచనంలోని ఈ భాగాన్ని మనం ఆత్మీయంగా అన్వయించుకోవడంలోని కచ్చితత్వాన్ని ధ్రువపరుస్తూ, యెషయా 35:3ను హెబ్రీయులు 12:12లో ఒక అలంకారిక భావంలో అన్వయించాడు.
8 యుద్ధానంతర కాలంలో ఆత్మీయ ఇశ్రాయేలీయుల అభిషిక్త శేషం అలంకారికంగా తామున్న చెరనుండి విడుదలయ్యారు. యెహోవా వారిని విమోచించడానికి గొప్ప కోరెషు అయిన యేసుక్రీస్తును ఉపయోగించాడు. అలా ఈ శేషం, యెరూషలేములోని అక్షరార్థ ఆలయాన్ని పునర్నిర్మించడానికి తమ స్వదేశానికి వెళ్లిన ప్రాచీన యూదుల శేషంయొక్క పనికి పోల్చదగిన పునర్నిర్మాణ పనిని చేయగల్గారు. అంతేకాకుండా, ఆధునిక కాలంలోని ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయులు పచ్చదనంతో నిండివున్న ఆత్మీయ పరదైసును అంటే అలంకారిక ఏదెను తోటను సాగుచేసి, ఉత్పత్తిచేయడం మొదలుపెట్టగలిగారు.
9. యెషయా 35:1, 2, 5-7 వచనాల్లో వర్ణింపబడిన దానిని పోలినది మనకాలంలో ఎలా పురోభివృద్ధి చెందింది?
9 పై విషయాన్ని మనస్సులో ఉంచుకొని యెషయా 35వ అధ్యాయాన్ని మరొకసారి పరిశీలిద్దాం, మరి మొదటిగా యెషయా 35:1, 2 వచనాల్ని చూడండి. ఎండిన భూమివలె కన్పించినది, నిజంగా పుష్పించనారంభించి ప్రాచీనకాల షారోను మైదానాల వలె ఫలభరితంగా మారింది. తర్వాత యెషయా 35:5 నుండి 7 వచనాలను చూడండి. శేషంయొక్క, అంటే ఇప్పటికీ సజీవంగా ఉండి యెహోవా సేవలో చురుకుగా ఉన్న అనేకుల అవగాహనా నేత్రాలు తెరువబడ్డాయి. వారు 1914లోనూ అటు తరువాతను జరిగినవాటి భావాన్ని బాగా గ్రహించగల్గారు. శేషంతోపాటూ ఇప్పుడు సేవచేస్తున్న “గొప్ప సమూహము”గా తయారైన మనలోని అనేకులపై కూడా అది ప్రభావాన్ని కల్గివుంది.—ప్రకటన 7:9.
నెరవేర్పులో మీరూ భాగమేనా?
10, 11. (ఎ) యెషయా 35:5-7 వచనాల నెరవేర్పులో మీరు ఎలా చేరివున్నారు? (బి) ఈ మార్పుల్ని గురించి మీరు వ్యక్తిగతంగా ఎలా భావిస్తారు?
10 ఉదాహరణకు మిమ్మల్నే తీసుకోండి. యెహోవాసాక్షులతో మీరు సహవాసం చేయడానికి మునుపు, మీరు బైబిల్ని క్రమంగా చదివేవారా? చదివితే, మీరు ఎంత మేరకు అవగాహన చేసుకున్నారు? ఉదాహరణకు ఇప్పుడు మీకు మృతుల స్థితిని గూర్చిన వాస్తవం తెలుసు. ఈ విషయంలో ఆసక్తిగల ఎవరితోనైనా ఆదికాండము 2వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయం, మరి యెహెజ్కేలు 18వ అధ్యాయాల్లోని సంబంధిత లేఖనాలను అలాగే అనేక ఇతర లేఖనాలను మీరు బహుశా చూపించగలరు. అవును, అనేక విషయాలను గూర్చి లేక వివాదాంశాలను గూర్చి బైబిలు చెబుతున్న దానిని మీరు అర్థం చేసుకొని ఉండవచ్చు. సరళంగా చెప్పాలంటే బైబిలు మీకు అర్థమౌతుంది, మీరు దానిలోని ఎంతో భాగాన్ని ఇతరులకు వివరించగలరు, నిస్సందేహంగా మీరు అలా చేశారు కూడా.
11 అయినా, ‘బైబిలు సత్యాన్ని గూర్చి నాకు తెలిసిందంతా నేనెలా నేర్చుకున్నాను? యెహోవా ప్రజలతో పఠనము చేయక మునుపు, ప్రస్తావించబడిన లేఖన భాగాలన్నింటినీ నేను కనుగొనగల్గానా? వాటి భావాన్ని నేను అర్థం చేసుకొన్నానా మరి వాటి ప్రాముఖ్యతను గూర్చి నేను సరియైన నిర్థారణలకు రాగల్గానా?’ అని మనలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నలకు బహుశా లేదు అనేదే నిష్కపటమైన జవాబు. అలాంటి వ్యాఖ్యానానికి ఎవరూ అభ్యంతరపడకూడదు, అయితే ఈ లేఖనాలు మరియు వీటి భావం విషయంలో ప్రాథమికంగా మీరు గ్రుడ్డివారై ఉండిరని చెప్పవచ్చు. అలా కాదా? అవి బైబిలులోనే ఉన్నాయి, అయితే మీరు వాటిని వివేచించలేక పోయారు లేక వాటి భావాన్ని గ్రహించలేక పోయారు. అయితే మీ కన్నులు ఆత్మీయంగా ఎలా తెరవబడ్డాయి? అభిషిక్త శేషంపై యెషయా 35:5ను నెరవేర్చడంలో యెహోవా చేసిన దానినిబట్టే అది జరిగింది. దాని ఫలితంగా మీ కన్నులు తెరవబడ్డాయి. మీరు ఇక ఎంతమాత్రం ఆత్మీయ చీకటిలో లేరు. మీరు చూడగలరు.—ప్రకటన 3:17, 18, పోల్చండి.
12. (ఎ) అద్భుతమైన భౌతిక స్వస్థత కొరకైన సమయం ఇది కాదని మనమెందుకు చెప్పగలం? (బి) సహోదరుడైన ఎఫ్. డబ్ల్యు. ఫ్రాంజ్‌కు సంభవించిన విషయం యెషయా 35:5వ వచనం మన కాలంలో నెరవేరిన తీరును ఎలా వివరించింది?
12 బైబిలులో మరియు శతాబ్దాలుగా దేవుడు కలిగివున్న వ్యవహారాల విషయంలో శ్రద్ధగల విద్యార్థులకు, భౌతిక సంబంధమైన స్వస్థతా అద్భుతాలు జరిగేందుకు చరిత్రలో ఇది సమయం కాదని తెలుసు. (1 కొరింథీయులు 13:8-10) కాబట్టి యేసు క్రీస్తు తాను దేవుని ప్రవక్తయైన మెస్సీయానని రుజువు చేసుకోవడానికి గ్రుడ్డివారి కన్నులు తెరుస్తాడని మనం అపేక్షించం. (యోహాను 9:1-7, 30-33) లేదా బధిరులైన వారందరికీ మరలా ఆయన వినికిడి శక్తినివ్వడం లేదు. అభిషిక్తులలో ఒకడును, వాచ్‌టవర్ సొసైటీ యొక్క ఆ నాటి అధ్యక్షుడునైన ఫ్రెడ్రిక్ డబ్ల్యు. ఫ్రాంజ్ తన 100వ ఏడు దగ్గరపడినప్పుడు దాదాపు అంధుడు మరియు ఆయన ఒక వినికిడి యంత్రాన్ని ఉపయోగించవలసి వచ్చింది. కొన్ని సంవత్సరాలపాటు ఆయన తనంతట తాను చదువుకోలేకపోయాడు; అయితే యెషయా 35:5లో ఉట్టిపడుతున్న భావమందు గ్రుడ్డివానిగా లేక చెవిటివానిగా ఆయనను ఎవరు పరిగణించగలరు? ఆయన అతి సునిశితమైన ఆత్మీయ దృష్టి ప్రపంచవ్యాప్తంగానున్న దేవుని ప్రజలకు ఒక ఆశీర్వాదమైంది.
13. దేవుని ఆధునిక కాల ప్రజలు ఏ పునరుద్ధరణను లేక మార్పును అనుభవించారు?
13 లేక మీ నాలుక విషయమేమిటి? దేవుని అభిషిక్తులు ఆత్మీయ చెరలో ఉన్న కాలంలో వారు మౌనంగా ఉండి ఉండవచ్చు. కాని దేవుడు ఒక్కసారిగా ఆ పరిస్థితిని మార్చినప్పుడు స్థాపించబడిన దేవుని రాజ్యాన్ని గూర్చి ఆయన భవిష్యత్ వాగ్దానాలను గూర్చి వారు తెలుసుకొనిన దానినిబట్టి వారి నాలుకలు సంతోషంతో కేకలు వేయనారంభించాయి. మీ నాలుకలు మౌనంగా ఉండకుండా చేసేందుకు కూడా వారు సహాయపడివుండవచ్చు. గతంలో ఇతరులతో బైబిలు సత్యాన్ని గూర్చి మీరెంతగా మాట్లాడారు? మీరు ఒకానొక సమయంలో ‘పఠనం చేయడాన్ని నేనానందిస్తున్నాను గాని తెలియని వ్యక్తులతో మాట్లాడ్డానికి నేనెన్నడూ వెళ్లలేను’ అని అనుకొని ఉండవచ్చు. అయితే, “మూగవాని నాలుక” ఇప్పుడు ‘ఆనందంతో కేకలు వేస్తుంది’ అనేది నిజం కాదంటారా?—యెషయా 35:6.
14, 15. మన కాలంలో ‘పరిశుద్ధ మార్గంలో’ అనేకులు ఏ విధంగా నడిచారు?
14 బబులోను నుండి విమోచించబడిన ప్రాచీనకాల యూదులు తమ స్వదేశానికి రావడానికి సుదీర్ఘ ప్రయాణం చేశారు. మన కాలంలో అది దేనికి సామ్యంగా ఉంది? యెషయా 35:8ని చూడండి: “అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గమనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము.”
15 ఆత్మీయ చెరనుండి వారు విడుదలైనప్పటి నుండి, అభిషిక్త శేషం ఇప్పుడు వేరే గొర్రెల్లోని లక్షలాదిమందితో పాటు మహాబబులోనులో నుండి అలంకారిక రాజమార్గంలోనికి అంటే ఆత్మీయ పరదైసులోనికి నడిపించే పరిశుభ్రమైన పరిశుద్ధ మార్గంలోనికి వచ్చారు. ఈ పరిశుద్ధ మార్గం కొరకు యోగ్యులయ్యేందుకు మరి ఈ మార్గంలో ఉండేందుకు మనం ప్రతి ప్రయత్నాన్ని చేస్తున్నాం. మిమ్మల్ని గూర్చి ఆలోచించండి. మీ నైతిక ప్రమాణాలు మరి మీరు అంటిపెట్టికొని ఉన్న సూత్రాలు మీరు లోకంలో ఉన్నప్పటి కన్నా ఇప్పుడు మరెంతో ఉన్నతమైనవిగా లేవంటారా? మీ ఆలోచనావిధానం మరియు ప్రవర్తన దేవుని వాటికి తగినట్లుగా ఉండేందుకు మీరు అధిక ప్రయత్నం చేయరా?—రోమీయులు 8:12, 13; ఎఫెసీయులు 4:22-24.
16. పరిశుద్ధ మార్గంలో నడుస్తుండగా మనం ఏ పరిస్థితుల్ని అనుభవించగలం?
16 మీరు ఈ పరిశుద్ధ మార్గంలో కొనసాగుతుండగా, మృగప్రాయపు మనుష్యులను గూర్చిన భయాన్నుంచి మీరు ప్రాథమికంగా విడుదలయ్యారు. నిజమే, ఈ ప్రపంచంలోని అత్యాశపరులైన లేక విద్వేషపూరితులైన ప్రజలు అలంకారికంగా మిమ్మల్ని సజీవంగా మ్రింగివేయకుండా జాగ్రత్తపడవలసి ఉంది. ఎల్లప్పుడూ ఇతరులతో తాము వ్యవహారించే విషయంలో అనేకులు క్రూరంగావుంటారు. దేవుని ప్రజలు ఎంత భిన్నంగా ఉంటారో కదా! అక్కడ మీరు సురక్షితమైన వాతావరణంలో ఉన్నారు. నిజమే, మీ తోటి క్రైస్తవులేమీ పరిపూర్ణులు కాదనుకోండి; కొన్నిసార్లు ఒకరు ఓ పొరపాటు చేయవచ్చు లేక అభ్యంతరం కలిగించవచ్చు. అయినా మీ సహోదరులు మిమ్మల్ని గాయపర్చాలని లేక నాశనం చేయాలని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం లేదని మీకు తెలుసు. (కీర్తన 57:4; యెహెజ్కేలు 22:25; లూకా 20:45-47; అపొస్తలుల కార్యములు 20:29; 2 కొరింథీయులు 11:19, 20; గలతీయులు 5:15) బదులుగా, వారు మీయందు ఆసక్తిని చూపుతున్నారు; వారు మీకు సహాయం చేశారు; వారు మీతోపాటు సేవచేయాలని కోరుకుంటున్నారు.
17, 18. ఏ భావంలో ఇప్పుడు ఓ పరదైసు ఉనికిలో ఉంది, మరి ఇది మనపై కలిగివున్న ప్రభావం ఏమిటి?
17 కాబట్టి, మనం యెషయా 35వ అధ్యాయాన్ని, యెషయా 35:1-8వచనాల ప్రస్తుత నెరవేర్పును మనస్సునందుంచుకొని చూడగలం. ఆత్మీయ పరదైసుగా సరిగ్గా పిలువబడిన దానిని మనమిప్పటికే కనుగొన్నామనుట సుస్పష్టంగా లేదా? లేదు, అది పరిపూర్ణమైనది కాదు—ఇంకా అలా కాలేదు. అయినప్పటికినీ యెషయా 35:2వ వచనమందు ప్రస్తావించబడినట్లుగానే ఇక్కడ మనమిప్పటికే “యెహోవా మహిమను, మనదేవుని తేజస్సును” చూడగల్గుతున్నందున అది నిజంగా ఒక పరదైసే. మరి అక్కడి ప్రతిఫలమేమిటి? మరి యెషయా 35:9వ వచనం రెండవ భాగం ఇలా చెబుతోంది: “యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.” మనం అన్యమత సంస్థలనుండి బయటికి రావడం మరి దేవుని అనుగ్రహం క్రింద పరిశుద్ధారాధనను చేపట్టడం నిజంగా ఆనందమయమైన ప్రేరేపణే.
18 సత్యారాధనతో ముడిపెట్టబడిన ఆనందం పెరుగుతూనే ఉంటుంది, లేదంటారా? క్రొత్తగా ఆసక్తి కలిగినవారు మార్పులు చేసుకొని బైబిలు సత్యమందు వేరుపారడాన్ని మీరు చూస్తున్నారు. యౌవనులు ఎదిగి, సంఘంలో ఆత్మీయ పురోభివృద్ధి చేసుకోవడాన్ని మీరు గమనిస్తున్నారు. బాప్తిస్మాలు తీసుకోవడం జరుగుతుంది, మీకు తెలిసిన వారు బాప్తిస్మం తీసుకోవడాన్ని మీరు చూస్తారు. అవి ఆనందించడానికి అంటే నేడు మరింతగా ఆనందించడానికి తగిన కారణాలు కావా? అవును, మన ఆత్మీయ స్వాతంత్ర్యంలో మరి పరదైసు పరిస్థితులలో మనతో ఇతరులు చేరడం ఎంత ఆనందకరమో కదా!
నెరవేర్పు ఇంకా ముందుంది!
19. యెషయా 35వ అధ్యాయం ఏ నిరీక్షణతో కూడిన అపేక్షతో మనల్ని నింపుతోంది?
19 యెషయా 35వ అధ్యాయాన్ని దాని మొదటి నెరవేర్పుగా యూదులు తిరిగిరావడానికి సంబంధించి, మరి నేటి ఆత్మీయ నెరవేర్పుకు సంబంధించి మనమింతవరకూ పరిశీలించాం. అయితే అది అంతటితోనే ముగిసిపోలేదు. మరి ఇంకెంతో ఉంది. అది పునరుద్ధరించబడనైవున్న భూమిపైని అక్షరార్థ పరదైసు పరిస్థితులను గూర్చి బైబిలు ఇచ్చిన అభయంతో ముడిపెట్టబడివుంది.—కీర్తన 37:10, 11; ప్రకటన 21:4, 5.
20, 21. యెషయా 35వ అధ్యాయం యొక్క మరో నెరవేర్పు ఇంకా ఉంటుందని విశ్వసించడమనేది ఎందుకు సహేతుకమైనది మరియు లేఖనాధారమైనది?
20 పరదైసు యొక్క వివిధ వర్ణనలను ఇచ్చి, ఆ తర్వాత ఆత్మీయ విషయాలకే ఆ నెరవేర్పులను పరిమితం చేయడం యెహోవాకు అసంగతంగా ఉంటుంది. నిజమే, ఆత్మీయ నెరవేర్పులు ప్రాముఖ్యమైనవి కావని ఇది తెలియజేయడం లేదు. మనం అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సమాధానకరమైన జంతువుల మధ్య ఉన్నప్పటికీ, మన చుట్టూ ఆత్మీయంగా మలినపర్చబడిన మనుష్యులు, పశుప్రాయులుగా ప్రవర్తించే మానవులు ఉంటే అక్షరార్థమైన పరదైసు స్థాపించబడినా అది మనల్ని తృప్తిపర్చదు. (తీతు 1:12 పోల్చండి.) అవును, ఆత్మీయ పరదైసే అతి ప్రాముఖ్యమైనది గనుక అదే మొదట రావాలి.
21 అయినప్పటికీ, రాబోయే పరదైసు మనమిప్పుడు అనుభవిస్తున్న, భవిష్యత్తులో మరెక్కువగా అనుభవించబోయే ఆత్మీయ విషయాలతోనే ముగిసిపోదు. యెషయా 35వ అధ్యాయంలోని ప్రవచనాలవంటి వాటికి అక్షరార్థమైన నెరవేర్పు కొరకు ఎదురు చూడడానికి మనం సహేతుకమైన కారణాన్ని కలిగివున్నాం. ఎందుకు? ఎందుకంటే, యెషయా 65వ అధ్యాయంలో యెషయా “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” గూర్చి ప్రవచించాడు. అపొస్తలుడైన పేతురు యెహోవా దినము తరువాత జరగబోయే దానిని గురించి వర్ణించినప్పుడు ఆ లేఖనాన్ని అన్వయించాడు. (యెషయా 65:17,18; 2 పేతురు 3:10-13) యెషయా వర్ణించిన ఘట్టాలన్నీ “క్రొత్తభూమి” వాస్తవమైనప్పుడు నిజంగా జరుగుతాయని పేతురు సూచించాడు. గృహాల్ని నిర్మించడం, వాటిలో నివసించడం; ద్రాక్షాతోటలను నాటడం, వాటి ఫలాల్ని తినడం; ఒకని చేతి పనినిబట్టి అధికంగా సంతోషించడం; తోడేలు గొర్రెపిల్ల కలిసి నివసించడం; మరి భూవ్యాప్తంగా ఏ హాని జరుగకపోవడం వంటి మీకు పరిచయమున్న వివరణలు అందులో చేరివున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, దీర్ఘకాల జీవితం, భద్రత గల గృహాలు, సమృద్ధిగా పౌష్ఠికాహారం, సంతృప్తికరమైన పని, జంతువుల మధ్య సమాధానం మరియు జంతువులకు మనుష్యులకు మధ్య సమాధానం ఉంటాయి.
22, 23. యెషయా 35వ అధ్యాయం యొక్క భవిష్యత్ నెరవేర్పులో ఆనందించడానికి ఏ ఆధారముంది?
22 ఆ ఉత్తరాపేక్ష మిమ్మల్ని ఆనందంతో నింపదా? అది ఆనందంతో నింపుతుంది, ఎందుకంటే దేవుడు మనల్ని అలా జీవించడానికే సృష్టించాడు. (ఆదికాండము 2:7-9) కాబట్టి మనం పరిశీలించిన యెషయా 35వ అధ్యాయంలోని ప్రవచనానికి సంబంధించినంత వరకూ దాని భావం ఏమిటి? ఆనందంతో కేకలు వేయడానికున్న అదనపు కారణాన్ని మనం కలిగివున్నామనేదే దాని భావం. అక్షరార్థమైన ఎడారులు ఎండిన భూములు పుష్పించి మనం ఆనందించడానికి కారణమౌతాయి. అప్పుడు నీలివర్ణ నేత్రాలు లేక గోధుమవర్ణ నేత్రాలు లేక రమణీయమైన ఏ వర్ణంగల నేత్రాలుండీ కూడా ఇప్పుడు అంధులుగా ఉన్న ప్రజలు మరల చూడగల్గుతారు. బధిరులైన మన తోటి క్రైస్తవులు లేక మనలో వినడానికి ఎంతో ప్రయాసపడుతున్న వారు సహితం స్పష్టంగా వినగల్గుతారు. దేవుని వాక్యాన్ని చదువుతుండగా, వివరిస్తుండగా వినే సామర్థ్యాన్ని ఉపయోగించడం అలాగే చెట్లనుండి వచ్చే ఆహ్లాదకరమైన గాలుల శబ్దాల్ని, పిల్లల నవ్వును పక్షుల కిలకిలారావాన్ని వినడం ఎంత ఆనందదాయకమో కదా!
23 ఇప్పుడు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారితో పాటు అంగహీనులు కూడ ఏవిధమైన నొప్పి లేకుండా నడువగలరని కూడా దాని భావం. అది ఎంతటి ఉపశమనమో కదా! ఎడారుల గుండా అక్షరార్థమైన కాలువలు ప్రవహిస్తాయి. మనం ఉప్పొంగే జలములను చూస్తాం, ఉబుకుతున్న శబ్దాన్ని వింటాం. మనం అక్కడకు నడిచి వెళ్లి పచ్చటి గడ్డిని తుంగగడ్డి మొక్కల్ని తాకగలుగుతాము. అది నిజంగా పునరుద్ధరించబడిన పరదైసు అవుతుంది. ఒక సింహం లేక అలాంటి వన్య మృగం దగ్గర నిర్భయంగా నిలబడివుండే ఆనందం విషయమేమిటి? మనలో అందరూ ఆ దృశ్యాన్ని ఇప్పటికే అవలోకించి ఆనందించినందున దానిని గూర్చి వర్ణింప మొదలుపెట్టనవసరం కూడా లేదు.
24. యెషయా 35:9వ వచనంలోని ఉద్ఘాటనతో మీరెందుకు ఏకీభవిస్తారు?
24 యెషయా మనకు ఇలా అభయమిస్తున్నాడు: “యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు వారి తలలమీద నిత్యానందముండును.” కాబట్టి, ఆనందంతో కేకలు వేయడానికి మనకు కారణముందని మనం ఒప్పుకోగలం. మన ఆత్మీయ పరదైసులో తన ప్రజల కొరకు యెహోవా ఇప్పటికే చేస్తున్న దానినిబట్టి, అతి సమీపంలోనే ఉన్న అక్షరార్థ పరదైసులో మనం ఎదురు చూడగల్గే వాటినిబట్టి ఆనందిస్తాం. ఆనందమయులైన వారిని గూర్చి—మనల్ని గూర్చి—యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “ఆనందసంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.”—యెషయా 35:9.
మీరు గుర్తించారా?
◻ యెషయా 35వ అధ్యాయం ఏ రెండవ నెరవేర్పును కలిగివుండినది?
◻ యెషయా ప్రవచించిన అద్భుతమైన మార్పులకు ఆత్మీయ సారూప్యమేది?
◻ ఈ ప్రవచనం యొక్క నెరవేర్పులో మీరే విధంగా భాగం వహించారు?
◻ యెషయా 35వ అధ్యాయం మనల్ని భవిష్యత్ నిరీక్షణతో నింపుతోందని మనమెందుకు చెప్పగలం?
[15వ పేజీలోని చిత్రం]
1918 జూన్‌లో ప్రముఖులైన ఏడుగురు సహోదరులు నిర్బంధంలో ఉంచబడిన న్యూయార్క్, బ్రూక్లిన్‌లోని రేమండ్ స్ట్రీట్ జైలు
[16వ పేజీలోని చిత్రం]
సహోదరుడైన ఫ్రాంజ్ తన చివరి సంవత్సరాల్లో దాదాపు అంధుడైనా, ఆత్మీయ దృష్టి తేటగానే ఉంది
[17వ పేజీలోని చిత్రం]
ఆత్మీయ ఎదుగుదల మరియు పురోభివృద్ధి ఆనందానికి కారణాలు