కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 1/15 పేజీలు 10-14
  • మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవాను గూర్చిన జ్ఞానము’
  • కోత విస్తారం!
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—1996
  • క్రొత్త పుస్తకం దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఉన్నతపరుస్తుంది
    మన రాజ్య పరిచర్య—1996
  • నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు ఇతరులకు సహాయపడండి
    మన రాజ్య పరిచర్య—1996
  • ఇప్పుడూ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 1/15 పేజీలు 10-14

మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరం

‘యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిగూర్చిన జ్ఞానము నీకు లభించును.’—సామెతలు 2:5.

1. మానవ హృదయం దైవిక ఇంజనీరింగు యొక్క అత్యుత్తమ కృతి అని ఎందుకు చెప్పవచ్చు?

దాదాపు 560,00,00,000 మానవ హృదయాలు ప్రస్తుతం భూమిపై కొట్టుకుంటున్నాయి. ప్రతిరోజూ మీ హృదయం 1,00,000 సార్లు కొట్టుకుంటోంది, 7,600 లీటర్లకు సమానమైన రక్తాన్ని మీ శరీరంలోని 1,00,000 కిలోమీటర్ల రక్త సంచార కోశం గుండా ప్రవహింపజేస్తుంది. ఈ దైవిక ఇంజనీరింగు యొక్క అత్యుత్తమ కృతి పనిచేసినట్లుగా ఏ ఇతర కండరమూ పనిచేయలేదు.

2. అలంకారిక హృదయాన్ని మీరేవిధంగా వర్ణిస్తారు?

2 భూమిపై 560,00,00,000 అలంకారిక హృదయాలు కూడా పనిచేస్తున్నాయి. ఈ అలంకారిక హృదయమందు మన భావోద్రేకాలు, అభిప్రాయాలు, కోరికలు నివసిస్తున్నాయి. అది మన ఆలోచనా వివేచనా చిత్తాలకు పీఠం. ఈ అలంకారిక హృదయం గర్వంగాను లేక వినయంగాను మరియు విచారంగాను లేక ఉల్లాసంగాను మరియు అంధకారంగాను లేక వెలిగింపబడేదిగాను ఉండగలదు.—నెహెమ్యా 2:2; సామెతలు 16:5; మత్తయి 11:29; అపొస్తలుల కార్యములు 14:17; 2 కొరింథీయులు 4:6; ఎఫెసీయులు 1:16-18.

3, 4. సువార్త హృదయాల్ని ఏవిధంగా చేరుతుంది?

3 యెహోవా దేవుడు మానవ హృదయాన్ని చదవగలడు. సామెతలు 17:3 ఇలా చెబుతోంది: “వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.” అయితే, ప్రతి హృదయాన్ని కేవలం చదివి, తీర్పు తీర్చడానికి బదులు, సువార్తతో మానవ హృదయాల్ని చేరడానికి యెహోవా తన సాక్షుల్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇది అపొస్తలుడైన పౌలు యొక్క ఈ మాటలతో పొందికగావుంది: “ప్రభువు [“యెహోవా,” NW] నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై—ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి యున్నది.”—రోమీయులు 10:13-15.

4 భూదిగంతాల వరకు “ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త”ను ప్రకటించి, ప్రతిస్పందించే హృదయాలుగల వారిని కనుగొనడానికి తన సాక్షుల్ని పంపించడం యెహోవాకు ప్రీతికరమైనది. మనం ఇప్పుడు 50,00,000 మందికి పైగా ఉన్నాం అంటే దాదాపు భూమిపైనున్న 1,200 మంది ప్రజలకు ఒక సాక్షి చొప్పున ఉన్నాం. భూమిపైనున్న కోట్లాదిమందిని సువార్తతో చేరుకోవడం సులభమైన విషయమేమీ కాదు. అయినా దేవుడు ఈ పనికి యేసుక్రీస్తు ద్వారా నడిపింపునిస్తున్నాడు, యథార్థ హృదయుల్ని ఆకర్షించుకుంటున్నాడు. ఆవిధంగా, యెషయా 60:22లో వ్రాయబడిన ఈ ప్రవచనం నిజమని రుజువౌతోంది: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును. ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.”

5. జ్ఞానం అంటే ఏమిటి, ప్రాపంచిక జ్ఞానాన్ని గురించి ఏమి చెప్పవచ్చు?

5 ఆ సమయమిదే మరి ఒక విషయం మాత్రం స్పష్టం, అదేంటంటే భూమిపైనున్న కోట్లాదిమందికి జ్ఞానం అవసరం. ప్రాథమికంగా, అనుభవం వల్ల, గమనించడం వల్ల లేదా అధ్యయనం చేయడంవల్ల సంపాదించిన వాస్తవాలతో పరిచయాన్ని కల్గివుండడమే జ్ఞానం. ప్రపంచం ఎంతో జ్ఞానాన్ని ఆర్జించింది. రవాణా సౌకర్యాలు, ఆరోగ్య పరిరక్షణ, సమాచార వ్యవస్థలవంటి రంగాల్లో పురోభివృద్ధి సాధించబడింది. అయితే మానవజాతికి నిజంగా అవసరమైనది ప్రాపంచిక జ్ఞానమేనా? కానేకాదు! యుద్ధం, అణిచివేత, వ్యాధులు మరియు మరణం మానవజాతిని కలతపరుస్తూనే ఉన్నాయి. ఈ ప్రాపంచిక జ్ఞానం తరచూ ఎడారి తుపానుకి రేపబడే ఇసుకను పోలి ఉన్నట్లుగా రుజువుకాగలదు.

6. రక్తానికి సంబంధించి, దేవుని గూర్చిన జ్ఞానం ప్రాపంచిక జ్ఞానంతో ఎలా పోల్చబడింది?

6 దృష్టాంతం: రెండు శతాబ్దాల క్రిందట, ఓ చికిత్సగా శరీరంలోని రక్తాన్ని బయటకు తీయడానికి పాల్పడ్డమనేది ఆచారంగా ఉండేది. అమెరికా మొదటి అధ్యక్షుడైన జార్జి వాషింగ్టన్‌ జీవితపు చివరి ఘడియల్లో పదేపదే ఆయన రక్తం తీయబడింది. ఓ దశలో, ఆయనిలా అన్నాడు: “నన్నిలా ప్రశాంతంగా పోనివ్వండి; నేను ఇంకెంతో కాలం బ్రతకను.” ఆయన చెప్పింది నిజమే, ఆ రోజే అంటే డిశంబరు 14, 1799న మరణించాడు. శరీరంలోని రక్తాన్ని బయటకు తీయడానికి బదులుగా మానవ శరీరంలోనికి రక్తాన్ని ఎక్కించడంపైనే నేడు ప్రాముఖ్యత ఇవ్వబడుతోంది. ఈ రెండు పద్ధతులూ మరణకరమైన సమస్యలతో నిండినవే. అయితే, ఈ కాలమంతటియందూ దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “రక్తమును . . . విసర్జింపవలెను.” (అపొస్తలుల కార్యములు 15:29) దేవుని జ్ఞానం ఎల్లవేళలా సరియైనది, నమ్మదగినది, సమయానుకూలమైనది.

7. పిల్లల్ని పెంచడం విషయంలో సరియైన లేఖన జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానంతో ఎలా పోల్చబడింది?

7 నమ్మదగని ప్రాపంచిక జ్ఞానాన్ని గూర్చిన మరో ఉదాహరణను పరిశీలించండి. సంవత్సరాలుగా మానసిక తత్వశాస్త్రవేత్తలు పిల్లల్ని యథేచ్ఛగా పెరగనివ్వాలని వాదించారు, కాని అలా వాదించేవారిలో ఒకరు, ఇదొక తప్పిదమని తరువాత ఒప్పుకున్నారు. ఈ యథేచ్ఛగా పెరగనివ్వడమే “పిల్లలతో మనం ఇప్పుడు కల్గివున్న సమస్యలకు కనీసం పరోక్షంగా కారణమని” జర్మన్‌ ఫిలలాజికల్‌ అసొసియేషన్‌, ఒకప్పుడు చెప్పింది. ప్రాపంచిక జ్ఞానం గాలికి కొట్టినట్లు ఇటుఅటు ఊగిసలాడినా, కచ్చితమైన లేఖనాధారిత జ్ఞానం నిశ్చలమైనది. పిల్లలకిచ్చే శిక్షణ విషయంలో బైబిలు సమతూకమైన సలహాను ఇస్తోంది. “నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనస్సుకు ఆనందము కలుగజేయును” అని సామెతలు 29:17 చెబుతోంది. అటువంటి క్రమశిక్షణ ప్రేమతో నిర్వహింపబడాలి, ఎందుకంటే పౌలు ఇలా వ్రాశాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”—ఎఫెసీయులు 6:4.

‘యెహోవాను గూర్చిన జ్ఞానము’

8, 9. మానవజాతికి నిజంగా అవసరమైన జ్ఞానాన్ని గురించి సామెతలు 2:1-6 చెబుతున్న దాన్ని మీరెలా వివరిస్తారు?

8 పౌలు విద్యావేత్త అయినప్పటికీ ఆయన ఇలా చెప్పాడు: “మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.” (1 కొరింథీయులు 3:18, 19) మానవజాతికి నిజంగా అవసరమైన జ్ఞానాన్ని దేవుడు మాత్రమే అందించగలడు. దానిని గురించి సామెతలు 2:1-6 ఇలా చెబుతోంది: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు [“బుద్ధికి,” NW] నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై [“అవగాహన కొరకై,” NW] మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు [“అవగాహన చేసుకొంటావు,”NW] దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు [“బుద్ధికి,” NW] తెలివియు [“జ్ఞానము,” NW] వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”

9 మంచి హృదయాలచే ప్రేరేపించబడిన వారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరియైన రీతిలో ఉపయోగించడం ద్వారా బుద్ధిపై అవధానాన్ని నిలుపుతారు. తాము తెలుసుకుంటున్న వాస్తవాల్ని జాగ్రత్తగా అంచనా వేయడం ద్వారా వివేచించేందుకు వారు తమ హృదయాల్ని మరల్చుతారు. నిజానికి, ఓ అంశంలోని విషయాలు ఒకదానికొకటి ఎలా సంబంధం కల్గివున్నాయో చూసే అవగాహనను లేదా సామర్థ్యాన్ని వారు ఆహ్వానిస్తారు. యథార్థ హృదయంగల వ్యక్తులు వెండి కొరకు త్రవ్వినట్లు, దాచబడిన నిధి కొరకు వెదకినట్లుగా కృషిసల్పుతారు. అయితే ప్రతిస్పందించే హృదయాలుగల వారు ఏ గొప్ప నిధిని కనుగొంటారు? అది ‘దేవుని గూర్చిన జ్ఞానమే.’ అదేమిటి? సరళంగా చెప్పాలంటే అది దేవుని వాక్యమైన బైబిల్లో కనుగొనబడిన జ్ఞానమే.

10. మంచి ఆత్మీయ ఆరోగ్యాన్ని అనుభవించాలంటే మనం ఏమి చెయ్యాలి?

10 దేవుని గూర్చిన జ్ఞానం శ్రేష్ఠమైనది, నిలకడయైనది, జీవాన్ని అనుగ్రహించేది. అది ఆత్మీయ ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. పౌలు తిమోతిని ఇలా ఉద్బోధించాడు: “క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్య ప్రమాణమును [“ఆరోగ్యకరమైన పదాల నమూనాను,” NW] గైకొనుము.” (ఇటాలిక్కులు మావి, 2 తిమోతి 1:13) భాషకో పదాల నమూనా ఉంటుంది. అదేవిధంగా, లేఖన సత్యాలను గూర్చిన “స్వచ్ఛమైన భాష” ప్రధానంగా రాజ్యం ద్వారా యెహోవా సర్వాధిపత్య నిరూపణయనే బైబిలు అంశంపై ఆధారపడిన “ఆరోగ్యకరమైన పదాల నమూనా”ను కల్గివుంటుంది. (జెఫన్యా 3:9, NW) మనం ఈ ఆరోగ్యకరమైన పదాల నమూనాను మనస్సులోనూ హృదయంలోనూ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం అలంకారిక హృద్రోగాన్ని అరికట్టి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, మనం బైబిల్ని అనుదిన జీవితంలో అన్వయించుకోవాలి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు”ని ద్వారా దేవుడు చేస్తున్న ఆత్మీయ ఏర్పాట్లను పూర్తిగా ఉపయోగించుకోవాలి. (మత్తయి 24:45-47; తీతు 2:2) మంచి ఆత్మీయ ఆరోగ్యానికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరం అనే విషయాన్ని మనం అన్నివేళలా జ్ఞాపకముంచుకొందాం.

11. దేవుని గూర్చిన జ్ఞానం మానవజాతికి ఎందుకు అవసరమో తెలియజేసే కొన్ని కారణాలు ఏవి?

11 భూమిపైనున్న కోట్లాదిమందికి దేవుని జ్ఞానం ఎందుకు అవసరం అనేదానికిగల ఇతర కారణాల్ని పరిశీలించండి. భూమి, మానవులు ఎలా ఉనికిలోనికి వచ్చారో వాళ్లందరికీ తెలుసా? తెలియదు, వారికి తెలియదు. యావత్‌ మానవజాతీ నిజమైన దేవున్ని ఆయన కుమారున్ని ఎరుగునా? దైవ సర్వాధిపత్యం, మానవ యథార్థతలను గురించి సాతాను లేవనెత్తిన వివాదాంశాల్ని ప్రతి ఒక్కరూ ఎరుగుదురా? ఎరగరనేదే మరలా జవాబు. మనం ఎందుకు వృద్ధులమై మరణిస్తున్నామో సామాన్య ప్రజలు ఎరుగుదురా? ఎరుగరని మరోసారి మనం చెప్తాం. దేవుని రాజ్యం ఇప్పుడు పరిపాలిస్తుందని, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని భూనివాసులు అందరూ గుర్తెరుగుదురా? దుష్ట ఆత్మ శక్తులను గూర్చి వారు ఎరుగుదురా? ఓ సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని ఎలా కల్గివుండాలో అనే దానిని గురించి విశ్వసనీయమైన జ్ఞానాన్ని మానవులు అందరూ కల్గివున్నారా? పరదైసునందలి ఆనందభరితమైన జీవితమే విధేయులైన మానవజాతి కొరకైన మన సృష్టికర్త యొక్క సంకల్పం అని ప్రజలు ఎరుగుదురా? ఈ ప్రశ్నలకు కూడా ఎరుగరనేదే జవాబు. కాబట్టి, మానవజాతికి దేవుని గూర్చిన జ్ఞానం అవసరమనేది స్పష్టం.

12. మనం దేవున్ని “ఆత్మతోను సత్యముతోను” ఎలా ఆరాధించగలం?

12 తన భూ జీవితంలోని చివరి రాత్రి యేసు చేసిన ప్రార్థనలో తాను చెప్పిన దానిని బట్టి కూడా మానవజాతికి జ్ఞానం అవసరం. ఆయన ఇలా చెబుతుండగా వినేందుకు ఆయన అపొస్తలులు ప్రగాఢంగా కదిలింపబడి ఉండవచ్చు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని వారు గైకొనడమే నిత్యజీవం.” (యోహాను 17:3, NW) అలాంటి జ్ఞానాన్ని అన్వయించుకోవడమే దేవునికి అంగీకృతమైన రీతిలో ఆరాధించడానికున్న ఏకైక మార్గం. “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెన”ని యేసు చెప్పాడు. (యోహాను 4:24) విశ్వాస ప్రేమలతో నింపబడిన హృదయాలచే మనం ప్రేరేపించబడినప్పుడు మనం దేవున్ని “ఆత్మతో” ఆరాధిస్తాం. మనం ఆయనను ‘సత్యముతో’ ఎలా ఆరాధిస్తాం? ఆయన వాక్యాన్ని పఠించడం ద్వారానూ ఆయన బయల్పర్చబడిన సత్యం ప్రకారంగా అంటే ‘దేవుని గూర్చిన జ్ఞానం’ ప్రకారంగానూ ఆయనను ఆరాధించడం ద్వారానూ మనమలా చేస్తాం.

13. అపొస్తలుల కార్యములు 16:25-34నందు ఏ సంఘటన వ్రాయబడింది, దాని నుండి మనమేమి నేర్చుకొనగలం?

13 ప్రతి సంవత్సరం వేలాదిమంది యెహోవాను ఆరాధించనారంభిస్తున్నారు. అయితే, ఆసక్తిగల ప్రజలతో బైబిలు పఠనాన్ని దీర్ఘకాలంగా నిర్వహించాలా లేక యథార్థహృదయంగల వ్యక్తులు బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయానికి మరింత తొందరగా రావడం సాధ్యమేనా? సరే, అపొస్తలుల కార్యములు 16:25-34నందు ప్రస్తావించబడిన చెరసాల నాయకుడు, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో ఏం జరిగిందో పరిశీలించండి. పౌలు, సీల ఫిలిప్పీలో ఖైదు చేయబడి ఉండగా, మధ్యరాత్రిలో ఓ పెద్ద భూకంపం మూలంగా చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఖైదీలందరూ తప్పించుకొన్నారని, తాను తీవ్రంగా శిక్షించబడతానని అనుకొని చెరసాల నాయకుడు ఆత్మహత్య చేసుకొనబోతుండగా పౌలు ఆయనతో తామంతా అక్కడే ఉన్నామని తెలియజేశాడు. పౌలు సీలలు “అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని [“యెహోవా,” NW] వాక్యము బోధించిరి.” ఆ చెరసాల నాయకుడూ ఆయన కుటుంబ సభ్యులు పరిశుద్ధ లేఖనాల్లో ఎటువంటి పరిజ్ఞానమూ లేనటువంటి అన్యులు. అయితే, ఆ ఒక్కరాత్రిలోనే వారు విశ్వాసులయ్యారు. అంతేగాక “అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” అవి అసాధారణమైన పరిస్థితులే అయినా క్రొత్తవారికి మూల సత్యాలు బోధింపబడేవి, అటుతరువాత ఇతర విషయాల్ని సంఘ కూటంలో నేర్చుకునేవారు. అలాంటిదే, నేడూ సాధ్యమవ్వాలి.

కోత విస్తారం!

14. తక్కువ కాలంలో ప్రతిభావంతమైన ఎక్కువ బైబిలు పఠనాల్ని నిర్వహించే అవసరత ఎందుకు ఉంది?

14 యెహోవాసాక్షులు తక్కువ కాలంలో ప్రతిభావంతంగా ఎక్కువ బైబిలు పఠనాల్ని నిర్వహించగలిగితే ఎంతో బాగుంటుంది. ఈ విషయంలో వాస్తవమైన అవసరత ఉంది. ఉదాహరణకు, తూర్పు ఐరోపా దేశాల్లో బైబిలు పఠనాల కోసం ప్రజలు వెయిటింగ్‌ లిస్టులో ఉండాల్సిందే. అన్నిచోట్లా పరిస్థితి అదేవిధంగా ఉంది. డొమినికన్‌ రిపబ్లిక్‌నందలి ఒక పట్టణంలో ఐదుగురు సాక్షుల్ని, బైబిలు పఠనాలు కావాలని ఎంతోమంది అడిగారు, అవి వారు నిర్వహించలేనన్ని ఉన్నాయి. వారేమి చేశారు? ఆసక్తిగల వారిని రాజ్యమందిరంలో జరిగే కూటాలకు హాజరవ్వమని, బైబిలు పఠనాల కొరకైన వెయిటింగ్‌ లిస్టులో ఉండమని వారు ప్రోత్సహించారు. భూవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అదే పరిస్థితి ఉంది.

15, 16. దేవుని గూర్చిన జ్ఞానాన్ని మరింత త్వరగా వ్యాప్తి చేయడానికి ఏది దయ చేయబడింది, దానిని గూర్చిన కొన్ని వాస్తవాలు ఏమిటి?

15 పెద్ద ప్రాంతాలు అంటే పెద్ద కోత క్షేత్రాలు దేవుని ప్రజల కొరకు తెరవబడ్తున్నాయి. “కోత యజమా”నియైన యెహోవా అనేకమంది పనివారిని పంపిస్తున్నా, చేయడానికి ఇంకా ఎంతో పనివుంది. (మత్తయి 9:37, 38) గనుక, దేవుని గూర్చిన జ్ఞానాన్ని మరింత త్వరితంగా వ్యాప్తి చేయడానికి, బైబిలు విద్యార్థులు ప్రతి పాఠంతోపాటూ ఆత్మీయ పురోభివృద్ధి చేసుకొనగలిగేలా సంక్షిప్తంగా సిద్ధపర్చబడిన ప్రత్యేక సమాచారాన్ని కలిగివున్న ఒకదాన్ని ‘నమ్మకమైన దాసుడు’ అందజేశాడు కాబట్టి. అది గృహ బైబిలు పఠనాల్ని త్వరగా పూర్తిచేయగల్గే—బహుశ కొన్ని నెలల్లోనే పూర్తి చేయగల్గే ఓ క్రొత్త ప్రచురణ. మరి దాన్ని మన బ్రీఫ్‌కేసుల్లో, హేండ్‌ బేగుల్లో లేక మన జేబుల్లో కూడా సులభంగా పెట్టుకొని తీసుకు వెళ్లవచ్చు! నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పేరు కల్గిన, ఈ 192 పేజీల క్రొత్త పుస్తకాన్ని పొందడానికి “ఆనందమయ స్తుతికర్తలు” అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాలకు హాజరైన లక్షలాదిమంది ఆనందించారు.

16 ఈ జ్ఞానము పుస్తకం కొరకు వివిధ దేశాల్లోని రచయితలు సిద్ధం చేసిన సమాచారాన్ని జాగ్రత్తగా ఖాయం చేయడమైంది. గనుక ఇది అంతర్జాతీయ ఆకర్షణను కల్గివుండాల్సిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మాట్లాడే భాషల్లో ఈ క్రొత్త ప్రచురణను విడుదల చేయడానికి చాలా కాలం పట్టివుంటుందా? లేదు, ఎందుకంటే 192 పేజీల పుస్తకం పెద్ద పుస్తకాలకన్నా ఎంతో త్వరగా అనువదించబడగలదు. అక్టోబరు 1995 నాటికి పరిపాలక సభ యొక్క రచనా కమిటీ ఈ పుస్తకాన్ని ఆంగ్లం నుండి 130 కన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించడానికి అనుమతించింది.

17. జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగించడాన్ని సులభతరం చేసే విషయాలు ఏవి?

17 జ్ఞానము పుస్తకంలోని ప్రతి అధ్యాయమందలి స్పష్టమైన వివరణలు విద్యార్థులు త్వరగా ఆత్మీయ పురోభివృద్ధి చేసుకొనేలా సహాయం చేస్తాయి. ఈ పుస్తకం లేఖనాధార సత్యాల్ని ప్రోత్సాహకరమైన రీతిలో అందిస్తుంది. అది అబద్ధ సిద్ధాంతాల్ని ఖండించడంపై దృష్టిని కేంద్రీకరించలేదు. భాషలోని స్పష్టత, తర్కబద్ధమైన వివరణ, బైబిలు పఠనాల్ని నిర్వహించేందుకు, దేవుని గూర్చిన జ్ఞానాన్ని గ్రహించడానికి ప్రజలకు సహాయపడేందుకు ఈ పుస్తకాన్ని ఉపయోగించడానికి సులభతరం చేస్తాయి. ఎత్తి వ్రాయబడిన లేఖనాలే కాకుండా, చర్చించడానికి సిద్ధపడడంలో విద్యార్థులు చూసుకోవడానికి ఎత్తి వ్రాయబడని బైబిలు వచనాలూ ఉన్నాయి. సమయం అనుమతిస్తే పఠనం జరిగే సమయంలో వీటిని చదవవచ్చు, అయితే ప్రాముఖ్యమైన విషయాల్ని మరుగుపర్చే అదనపు సమాచారాన్ని తీసుకోవడం తెలివైన పనికాదు. బదులుగా, బైబిలు పఠనాల్ని నిర్వహించే వారు ప్రతి అధ్యాయంలోనూ పుస్తకం రుజువు చేస్తున్న దాన్ని వివేచించి, విద్యార్థికి తెలియజేయడానికి ప్రయత్నించాలి. దీని అర్థమేమిటంటే, ప్రధానమైన తలంపులు తన మనస్సులో సుస్పష్టంగా ఉండడానికి బోధకుడు ఆసక్తిదాయకంగా అధ్యయనం చేయాలి.

18. జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగించడాన్ని గూర్చి ఏ సలహాలు ఇవ్వబడ్డాయి?

18 నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే ఈ పుస్తకం శిష్యుల్ని చేసే పనిని ఎలా త్వరితగతం చేయగలదు? ఈ 192 పేజీల పుస్తకాన్ని పోల్చి చూస్తే తక్కువ కాలంలో పఠించవచ్చు, ‘నిత్యజీవమునకు నియమింపబడిన’ వారు దీన్ని పఠించడం ద్వారా, యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందడానికి తగినంత నేర్చుకొనగల్గుతారు. (అపొస్తలుల కార్యములు 13:48) కాబట్టి పరిచర్యలో జ్ఞానము పుస్తకాన్ని బాగా ఉపయోగిద్దాం. ఒక బైబిలు విద్యార్థి గనుక మరో పుస్తకాన్ని చాలావరకు పఠించినట్లైతే, ఆ పుస్తకాన్ని పూర్తి చేయడమే అభ్యాసదాయకమైనదిగా ఉండవచ్చు. అలాకాకపోతే, జ్ఞానము పుస్తకం నుండే బైబిలు పఠనాల్ని ప్రారంభించాలని సలహా ఇవ్వబడ్తుంది. ఈ క్రొత్త ప్రచురణను పఠించడం పూర్తి చేసిన తరువాత, అదే విద్యార్థితో రెండవ పుస్తకంతో పఠనం చేయాల్సిన అవసరం లేదని సలహా ఇవ్వబడుతుంది. సత్యాన్ని హత్తుకొన్నవారు యెహోవాసాక్షుల కూటాలకు హాజరవ్వడం ద్వారానూ అలాగే బైబిల్ని, వివిధ క్రైస్తవ ప్రచురణల్ని తమ స్వంతగా చదవడం ద్వారానూ తమ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకొనగలరు.—2 యోహాను 1.

19. జ్ఞానము పుస్తకంతో బైబిలు పఠనాల్ని నిర్వహించడానికి మునుపు, మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 175 నుండి 218 వరకున్న పేజీల్ని పునర్విమర్శ చేయడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

19 జ్ఞానము పుస్తకం, యెహోవాసాక్షులుగా బాప్తిస్మం పొందాలనే కోరికగల బాప్తిస్మం పొందని ప్రచారకులతో పెద్దలు పునర్విమర్శ చేసే ప్రశ్నలన్నింటికీ ఒక వ్యక్తి జవాబు ఇవ్వడానికి దోహదపడే ఉద్దేశంతో వ్రాయబడింది. గనుక, ఈ క్రొత ప్రచురణతో మీ బైబిలు పఠనాల్ని మీరు ప్రారంభించడానికి మునుపు, మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 175 నుండి 218 వరకున్న పేజీలనందలి ప్రశ్నల్ని పునర్విమర్శ చేయడానికి మీరు కొన్ని గంటలు వెచ్చించాలని సిఫారసు చేయబడింది.a ఇది మీరు బైబిలు పఠనం జరుగుతున్నప్పుడు జ్ఞానము పుస్తకంలోని అలాంటి ప్రశ్నలకు జవాబుల్ని నొక్కి చెప్పడానికి సహాయపడ్తుంది.

20. నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంతో మీరేమి చెయ్యాలని ప్రణాళిక వేసుకుంటున్నారు?

20 అన్నిచోట్లనున్న ప్రజలు ఆ సువార్తను వినాలి. అవును, దేవుని గూర్చిన జ్ఞానం మానవజాతికి అవసరం, దాన్ని వెల్లడిపర్చడానికి యెహోవా తన సాక్షుల్ని కల్గివున్నాడు. ఇప్పుడు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని ద్వారా మన ప్రేమగల పరలోకపు తండ్రి దయచేసిన ఓ క్రొత్త పుస్తకాన్ని మనం కల్గివున్నాం. సత్యాన్ని బోధించడానికి, యెహోవా పరిశుద్ధ నామానికి ఘనతను తేవడానికి మీరు దాన్ని ఉపయోగిస్తారా? నిత్యజీవానికి నడిపించే జ్ఞానం అనేకులకు లభ్యమయ్యేలా చేసేందుకు మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడు.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ వారిచే ప్రచురించబడింది.

మీరెలా ప్రత్యుత్తరమిస్తారు?

◻ అలంకారిక హృదయాన్ని మీరెలా వర్ణిస్తారు?

◻ దేవుని గూర్చిన జ్ఞానం అంటే ఏమిటి?

◻ దేవుని గూర్చిన జ్ఞానం మానవజాతికి ఎందుకు అవసరం?

◻ ఏ క్రొత్త పుస్తకం లభ్యమైంది, దానిని ఉపయోగించడానికి మీరెలా ప్రణాళిక వేసుకుంటున్నారు?

[10వ పేజీలోని చిత్రం]

భూమిపైనున్న కోట్లాదిమందికి దేవుని గూర్చిన జ్ఞానం ఎందుకు అవసరం అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి