శాంతి సాధ్యమేనా?
“మానవజాతికి సంబంధించిన విచారకరమైన సత్యమేమంటే ఎక్కడో ఒకచోట ఎప్పుడూ యుద్ధం జరుగుతుండడమే.” ఈ నిరాశావాద దృక్పథం, ఇటీవల న్యూస్‌వీక్ పత్రికలో ఒక పాఠకుని నుండి వచ్చిన ఉత్తరమందు వెల్లడియైంది. దానితో మీరు ఏకీభవిస్తారా? యుద్ధం అనివార్యమేనా, శాంతి దుస్సాధ్యమేనా? చారిత్రక వాస్తవాల్ని బట్టి మనం పరిశీలించినట్లైతే, ఈ రెండు ప్రశ్నలకు అవునని జవాబు చెప్పడం ఏమంత కష్టంకాదు. వృత్తాంతాలు తెలియజేస్తున్నంత వరకూ మానవజాతి ఒక యుద్ధం తరువాత మరో యుద్ధంలో మునిగి తేలుతోంది, మానవులు ఒకరినొకరు చంపుకోవడానికి మరింత నైపుణ్యవంతమైన రీతుల్ని పెంపొందింపజేస్తుండగా పోరాటాలు మరీ వినాశదాయకంగా తయారయ్యాయి.
ఈ 20 వ శతాబ్దమేమీ మినహాయింపబడలేదు. నిజానికిది, మునుపెన్నడూ జరగనన్ని రక్తసిక్తమైన యుద్ధాల్ని చూసింది, అయినా ఇది మరొక క్రొత్త విషయాన్ని కూడా చూసింది. జపాన్‌పై రెండు అణు బాంబులను వేయడంతో యాభై ఏళ్ల క్రిందట అమెరికా అణుయుగాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుండీ ఈ ఐదు దశాబ్దాల్లో, మానవజాతిని అనేక పర్యాయాలు నాశనం చేయగల్గే పెద్ద అణ్వాయుధ భాండాగారాల్ని దేశాలు నిర్మించాయి. చివరకు అణ్వాయుధాలు ఉండడమే మానవులు భయంతో యుద్ధాల్లో పాల్గొనకుండా చేస్తాయా? వాస్తవాలు వాటంతటవే జవాబునిస్తున్నాయి. 1945 నుండి ఇప్పటి వరకూ అణు బాంబులు వేయనప్పటికీ అనేక లక్షలమంది యుద్ధాల్లో మరణించారు.
మానవజాతి ఎందుకింత యుద్ధ ప్రియమైనది? ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా చారిత్రాత్మకంగా యుద్ధానికి నడిపిన మానవ సమాజం యొక్క కొన్ని విషయాల్ని తెలియజేస్తోంది. అందులో మతసహనం లేకపోవడం, జాతి వైషమ్యాలు, సాంస్కృతిక వైవిధ్యాలు, (సామ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ వంటి) భిన్నమైన సిద్ధాంతాలు, జాతీయవాదం, జాతి సార్వభౌమాధిపత్యాన్ని గూర్చిన సిద్ధాంతాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రజాంగీకృత సైనికవాదం ఉన్నాయి. ఆ పట్టికను మీరు చదివినప్పుడు, సమీప భవిష్యత్తులో వాటిలో ఏదైనా మారుతుందని మీరు అనుకుంటున్నారా? దేశాలు తమ సార్వభౌమాధిపత్యాన్ని కాపాడుకోవడానికి అంత దృఢ నిశ్చయాన్ని కల్గివుండకుండా ఉంటాయా? మానవులు జాత్యాభిమానాన్ని విడనాడతారా? మత ప్రామాణ్యవాదులు మూఢత్వాన్ని విడనాడతారా? ఇది అసంభవం.
అయితే ఏదో ఒకరోజు విషయాలన్నీ కుదుటబడతాయని, శాశ్వతమైన శాంతి ఉంటుందనే నిరీక్షణే లేదా? ఉంది, నిరీక్షణ ఉంది. ఈ కల్లోలిత ప్రపంచంలో, ఈనాడు సహితం శాంతిని కనుగొనడం సాధ్యమే. లక్షలాదిమంది కనుగొన్నారు కూడా. ఈ ప్రజల్లోని కొందరిని గూర్చి మీకు చెప్పనివ్వండి, మీ విషయంలో వారి అనుభవాల భావమేమిటో చూడండి.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Background cover and page 32: Reuters/Bettmann
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Reuters/Bettmann