కల్లోలిత ప్రపంచంలో వారు శాంతిని కనుగొన్నారు
ఈ పత్రిక ముఖపత్రంపైనున్న చిత్రం బోస్నీయా హెర్జ్గొవినన్లనందలి తీవ్రమైన యుద్ధ దృశ్యాన్ని వర్ణిస్తోంది. అలాంటి ప్రదేశంలో శాంతి ఉండగలదా? ఉంది అనేదే ఆశ్చర్యకరమైన జవాబు. ఆ విషాదభరితమైన ప్రదేశంలో రోమన్ కాథోలిక్కు, ఈస్ట్రన్ ఆర్థడక్స్, ముస్లిమ్ మతశాఖలు భూమి కోసం పోరాటాన్ని సల్పుతుండగా, అనేకమంది వ్యక్తులు శాంతి కోసం ఎదురు చూస్తున్నారు, కొంతమంది దానిని కనుగొన్నారు.
డొరెమ్ కుటుంబీకులు సరజివా నివాసులు మరియు వారు యెహోవాసాక్షులు. ఆ నగరంలోని కల్లోలితాలన్నింటి మధ్య వారు తమ పొరుగువారితో దేవుని రాజ్య సువార్తను పంచుకోవడానికి తరచూ సందర్శించేవారు. (మత్తయి 24:14) ఎందుకు? ఎందుకంటే ఈ రాజ్యం వాస్తవమైనదని, పరలోకంలో ఇది ఇప్పటికే స్థాపించబడిందని మరియు ఇదే శాంతి కొరకు మానవజాతి యొక్క శ్రేష్ఠమైన, ఏకైక నిరీక్షణయని డొరెమ్ కుటుంబీకులకు తెలుసు. అపొస్తలుడైన పౌలు “సమాధాన [“శాంతి,” NW] సువార్త” యని పిలిచిన దానియందు యెహోవాసాక్షులు పూర్ణనమ్మకాన్ని కల్గివున్నారు. (ఎఫెసీయులక 2:17) బొజొ, హెన్ డొరెమ్లాంటి ప్రజల మూలంగా బోస్నీయా హెర్జ్గొవినన్లలో అనేకులు శాంతిని కనుగొంటున్నారు.
నిజమైన శాంతి రానైవుంది
డొరెమ్ కుటుంబీకుల గురించి చెప్పడానికి ఎంతో ఉంది. అయినా, మొదటిగా దేవుని రాజ్యమందు నమ్మకాన్ని పెంపొందించుకొన్న మరో దంపతుల గురించి మాట్లాడుకుందాం. వారిపేర్లు ఆర్థర్, అరెనా. వారూ వారి పిల్లలూ మునుపటి సోవియట్ యూనియన్ ప్రాంతంలోని ఓ గణతంత్ర దేశంలో జీవించేవారు. అంతర్యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఆర్థర్ ఓ పక్షం తరపున పోరాడాడు. అయినా కొద్దికాలానికే, ‘నా పొరుగువారైన ఈ ప్రజలకు వ్యతిరేకంగా నేనెందుకు పోరాడాలి?’ అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఆయన ఆ దేశాన్ని విడిచిపెట్టి, అనేక కష్టాల్ని ఎదుర్కొన్న తరువాత, పసిపిల్లలున్న తన కుటుంబంతో ఇష్టోనియా చేరుకున్నాడు.
సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఆర్థర్ యెహోవాసాక్షుల్ని కలుసుకున్నాడు, దేవుని రాజ్యాన్ని గూర్చి తాను తెలుసుకొనిన దాన్ని బట్టి ప్రభావితుడయ్యాడు. అతి త్వరలో దేవుని రాజ్యం మానవజాతిని పరిపాలించే ఏకైక పరిపాలనాధిపత్యం కావడమే యెహోవా చిత్తం. (దానియేలు 2:44) అటుతరువాత భూమి ఇక అంతర్యుద్ధాలు లేక అంతర్జాతీయ పోరాటాలు లేని ఓ శాంతికరమైన స్థలమౌతుంది. ఆ కాలాన్ని గూర్చి యెషయా ఇలా ప్రవచించాడు: “నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు; సముద్రము జలముతో నిండియున్నట్టు, లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.”—యెషయా 11:9.
బైబిలు పఠన సహాయక పుస్తకంలోని శాంతియుతమైన బావి భూమిని గూర్చిన చిత్రకారుని ఊహా చిత్రాన్ని ఆ యెహోవాసాక్షి ఆర్థర్కి చూపించినప్పుడు, తాను అలాంటి ప్రదేశంలోనే జీవించేవాడినని ఆయన తెలియజేశాడు. అయితే, ఇప్పుడది అంతర్యుద్ధంలో నాశనమయ్యింది. ఇష్టోనియాలో ఆర్థర్, ఆయన కుటుంబం యెహోవాసాక్షులతో బైబిలు పఠనం చేయడం ద్వారా దేవుని రాజ్యాన్ని గూర్చి మరింత తెలుసుకుంటున్నారు.
కల్లోలాల మధ్య శాంతి
కీర్తన 37:37 (NW) ఇలా చెబుతోంది: “నిర్దోషిని కనిపెట్టండి, యథార్థవంతున్ని చూడండి, వాని భవిష్యత్తు శాంతిమయంగా ఉంటుంది.” వాస్తవానికి, దేవుని దృష్టికి నిర్దోషి మరియు యథార్థవంతుడు అయినవాని శాంతి అతని భవిష్యత్తుకు మాత్రమే పరిమితం కాదు. అతడు దానిని ఇప్పుడు కూడా అనుభవిస్తాడు. అదెలా సాధ్యమౌతుంది? పాల్ అనే పేరుగల వ్యక్తి యొక్క అనుభవాన్ని పరిశీలించండి.
వాస్తవానికి పాల్ పొరుగునున్న దేశాన్నుండి వలసవచ్చినా, నైరుతి ఇతియోపియానందు మారుమూలనున్న ఓ శరణార్థ శిబిరంలో ఆయన జీవిస్తున్నాడు. ఒక నూనె కర్మాగారంలో పనిచేస్తున్న ఓ యెహోవాసాక్షిని తన స్వదేశమందు ఆయన కలుసుకున్నాడు, ఆ యెహోవాసాక్షి బైబిలు పఠన సహాయక పుస్తకమైన నిత్యజీవమునకు నడుపు సత్యము ను ఈయనకు ఇచ్చాడు.a ఆ సాక్షిని పాల్ మరెన్నడూ కలుసుకోకపోయినా, ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పఠించాడు. అంతర్యుద్ధం ఆయనను ఇతియోపియాలోని ఓ శరణార్థ శిబిరానికి నడిపించింది, అక్కడ ఆయన తాను నేర్చుకొనిన దాని గురించి ఇతరులతో మాట్లాడాడు. ఓ చిన్న గుంపు దీన్ని సత్యమని అంగీకరించింది. తాము నేర్చుకొనిన దాని ఆధారంగా, వారు త్వరలోనే శిబిరంలోవున్న ఇతరులకు ప్రకటించడం ప్రారంభించారు.
సహాయాన్ని అర్థిస్తూ పాల్ వాచ్‌టవర్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి వ్రాశాడు. ఆడిస్ అబాబా నుండి పంపబడిన ఓ పరిచారకుడు, తన కొరకు 35 మంది వేచివుండడం, దేవుని రాజ్యాన్ని గూర్చి మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. క్రమంగా సహాయం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
పాల్వంటి ప్రజలు శాంతిని అనుభవిస్తారని ఎలా చెప్పవచ్చు? వారి జీవితాలేమీ సులభతరమైనవి కావుగాని వారికి దేవునియందు విశ్వాసం ఉంది. ఈ ప్రపంచపు కల్లోలాలకు గురైనప్పుడు, వారు ఈ బైబిలు సలహాను అన్వయించుకుంటారు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” తత్ఫలితంగా, ఈనాడు అరుదుగా కన్పించే తృప్తిని వారు కల్గివున్నారు. ఫిలిప్పీ సంఘానికి అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటలు వారికి అన్వయించబడతాయి: “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము [“దేవుని శాంతి,” NW] యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” నిశ్చయంగా, “శాంతికి దేవుడు” అయిన యెహోవాతో వారు సన్నిహిత సంబంధాన్ని అనుభవిస్తారు.—ఫిలిప్పీయులు 4:6, 7, 9.
ప్రస్తుత శాంతి
దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు బైబిల్లో ‘శాంతికర్తయగు అధిపతి’ అని పిలువబడ్డాడు. (యెషయా 9:6) ఆయన గురించి ప్రాచీనకాల ప్రవక్త ఇలా చెప్పాడు: “వాస్తవానికి ఆయన జనులతో శాంతిని గూర్చి మాట్లాడును; సముద్రం నుండి సముద్రం వరకు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన పరిపాలనాధిపత్యం ఉంటుంది.” (జెకర్యా 9:10, NW) ఇలాంటి ప్రేరేపిత పలుకులు హోసే అనే పేరుగల వ్యక్తి జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి.
ఒకప్పుడు హోసే చెరసాలలో ఉండేవాడు. ఆయనో ఉగ్రవాది, పోలీసు క్వార్టర్సును పేల్చడానికి సన్నాహాలు చేస్తుండగా అరెస్టు చేయబడ్డాడు. హింస మాత్రమే, తన దేశంలోని పరిస్థితుల్ని మెరుగుపర్చేలా ప్రభుత్వాన్ని బలవంతం చేయగలదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆయన చెరసాలలో ఉండగా, యెహోవాసాక్షులు ఆయన భార్యతో బైబిలు పఠనం చేయడం ప్రారంభించారు.
హోసే విడుదలైన తరువాత, ఆయన కూడా బైబిల్ని పఠించాడు, త్వరలోనే కీర్తన 85:8 లోని (NW) ఈ మాటల్ని ఆయన అన్వయించుకోవడం ప్రారంభించాడు: “[నిజ] దేవుడైన యెహోవా మాట్లాడే దానిని నేను వింటాను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శాంతిని గూర్చి మాట్లాడతాడు.” అయినా, ఆ వచనం ఓ హెచ్చరికతో ఇలా ముగిస్తోంది: “వారు మరల ఆత్మ విశ్వాసం వైపు మరలకుందురు గాక.” కాబట్టి, యెహోవా యొక్క శాంతిని అన్వేషించువాడు స్వతంత్రంగా లేక ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించే అహంకారాన్ని కల్గి ఉండకూడదు.
నేడు, హోసే మరియు ఆయన భార్య క్రైస్తవ పరిచారకులు. వారు యెహోవా రాజ్యం వైపు అంటే హోసే ఇంతకు మునుపు గృహనిర్మిత బాంబులచే పరిష్కరించడానికి ప్రయత్నించిన సమస్యలకు పరిష్కారంవైపు ఇతరుల్ని నడిపిస్తున్నారు. “యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును,” అని చెబుతున్న బైబిల్ని వారు నమ్మడానికి ఇష్టపడ్తున్నారు. (కీర్తన 85:12) నిజానికి హోసే, తాను నాశనం చెయ్యాలని ఉద్దేశించిన పోలీసు క్వార్టర్సును ఇటీవల సందర్శించాడు. ఎందుకని? అక్కడున్న కుటుంబాలతో దేవుని రాజ్యం గురించి మాట్లాడ్డానికే.
శాంతియుతమైన ప్రజలు
కీర్తన 37:10, 11 వచనాల్లో బైబిలు ఇలా చెబుతోంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము [“అధిక శాంతిని,” NW] కలిగి సుఖించెదరు.” ఎంతటి అద్భుతమైన ఉత్తరాపేక్షో కదా!
అయినా, యెహోవా యొక్క శాంతి “దీనుల” కు మాత్రమేనని గమనించండి. శాంతిని అన్వేషించేవారు శాంతియుతంగా ఉండడం నేర్చుకోవాల్సి ఉంటుంది. న్యూజీలాండ్‌లో నివసిస్తున్న కెత్ విషయంలో జరిగిందిదే. కెత్ “దృఢకాయుడూ చురుకైన వ్యక్తిత్వం గలవాడూ కలహప్రియుడు, తర్కనాపరుడు.” ఆయన ఓ ముఠా సభ్యుడు మరియు నిజానికి దుర్గంలా ఉండే ఇంటిలో నివసించేవాడు, అది బలవంతంగా ప్రవేశించేవారిని నిరోధించడానికి తోటల్లో మూడు కాపలా కుక్కలు ప్రహరా తిరుగుతున్న ఇల్లు. ఆయన ఆరుగురి పిల్లలకు తల్లియైన ఆయన భార్య ఆయనకు విడాకులిచ్చింది.
కెత్ యెహోవాసాక్షుల్ని కలుసుకున్నప్పుడు, సువార్త ఆయనపై ఎంతో ప్రభావాన్ని చూపింది. త్వరలోనే ఆయన, ఆయన పిల్లలు సాక్షులతోపాటూ కూటాలకు హాజరయ్యేవారు. ఆయన, నడుం వరకున్న తన పొడవాటి జుట్టు కత్తిరించుకున్నాడు, తన మునుపటి సహావాసులతో దేవుని రాజ్యాన్ని గూర్చి మాట్లాడడం ప్రారంభించాడు. వీరిలో కొందరు కూడా బైబిల్ని పఠించడం ప్రారంభించారు.
ప్రపంచమంతటానున్న యథార్థహృదయులైన లక్షలాదిమంది ప్రజలవలె, కెత్ అపొస్తలుడైన పేతురు యొక్క ఈ మాటల్ని అన్వయించుకొనడం ప్రారంభించాడు: “జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు . . . కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును [“శాంతిని,” NW] వెదకి దాని వెంటాడవలెను.” (1 పేతురు 3:10, 11) కెత్ మునుపటి భార్య ఆయన్ని మరలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంది, ఆయన ఇప్పుడు ‘శాంతిని వెదకి వెంటాడడాన్ని’ నేర్చుకుంటున్నాడు.
యెహోవా యొక్క శాంతి అనేకమందికి జీవాన్ని రక్షించేదై ఉంది. ఇందులో మునుపటి రష్యాలో జన్మించిన ఒకప్పటి అథ్లెట్ కూడా చేరి ఉన్నాడు. ఇతడు ఒలింపిక్ ఆటల పోటీలో పతకాలను గెలుచుకున్నా, భ్రమతొలగి మాదక ద్రవ్యాలకు, త్రాగుడుకి అలవాటు పడ్డాడు. సైబీరియానందు లేబరు శిబిరంలో మూడేళ్లు శిక్ష అనుభవించడం, ఓడలో దొంగ ప్రయాణం చేసి కెనడా వెళ్లడం, మాదక ద్రవ్యాల అలవాటు మూలంగా రెండు సార్లు మృత్యుముఖం చేరుకోవడం వంటి ప్రధాన సంఘటనలు చేరివున్న 19 ఏండ్లు గడిచిపోయిన తరువాత, జీవితంలో వాస్తవమైన సంకల్పాన్ని కనుగొనడానికి సహాయం కొరకు దేవున్ని ప్రార్థించాడు. రష్యాభాష మాట్లాడే యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని చేయడం తన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ఆయనకు సహాయపడింది. ఈనాడు ఈయన, లక్షలాదిమంది ఇతరులవలె దేవునితోనూ తనతోనూ శాంతిని కనుగొన్నాడు.
పునరుత్థాన నిరీక్షణ
చివరగా, సరజివాలోని బొజొ, హెనా డొరెమ్ వైపు అవధానాన్ని మళ్లిద్దాం. ఈ దంపతులకు మాగ్దలేనా అనే ఐదేండ్ల కుమార్తె ఉండేది. గత జూలై నెలలో ముగ్గురూ తమ ప్రకటనాపనిలో మరోసారి భాగం వహించడానికి తమ ఇంటినుండి వెళ్తున్నప్పుడు వారంతా షెల్ ప్రేలుడులో చంపబడ్డారు. ఇతరులకు వారు ప్రకటించిన శాంతి విషయం ఏమిటి? వారి జీవితాల్ని బలితీసుకున్న షెల్ ఇది నిజమైన శాంతికాదని చూపించిందా?
కానేకాదు! ఈ విధానంలో విషాద సంఘటనలు సంభవిస్తాయి. ప్రజలు బాంబులు లేదా షెల్స్చే చంపబడ్తున్నారు. ఇతరులు రోగాలు లేక ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. వృద్ధాప్యంవల్ల అనేకమంది మరణిస్తున్నారు. దేవుని యొక్క శాంతిని అనుభవిస్తున్నవారు మినహాయించబడరుగాని, అలాంటి సంఘటనల సంభవనీయత వారిని నిరీక్షణ లేకుండా విడిచిపెట్టదు.
తన స్నేహితురాలైన మార్తకు యేసు ఇలా వాగ్దానం చేశాడు: “పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును.” (యోహాను 11:25) యెహోవాసాక్షులందరివలె, డొరెమ్ కుటుంబీకులు దీన్ని విశ్వసించారు. తాము మరణించినట్లైతే, నిజంగా శాంతికరమైన స్థలం కాబోయే భూమిపై తాము పునరుత్థానం చేయబడతామనే విశ్వాసాన్ని డొరెమ్ కుటుంబీకులు కల్గివున్నారు. యెహోవా దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయె” ను.—ప్రకటన 21:4.
తాను మరణించడానికి మునుపు, తన అనుచరులతో యేసు ఇలా చెప్పాడు: “నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను . . . మీ హృదయములను కలవరపడనియ్యకుడి.” (యోహాను 14:27) అలాంటి శాంతినే కల్గివుండిన, పునరుత్థానమందు నిశ్చయంగా దానిని మరింతగా అనుభవించనైవున్న డొరెమ్ కుటుంబీకుల్నిబట్టి మేము ఆనందిస్తున్నాం. శాంతికి దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్న వారందర్నిబట్టి మేము ఆనందిస్తున్నాం. అలాంటివారు శాంతికరమైన మనస్సుని కల్గివున్నారు. వారు దేవునితో శాంతిని అనుభవిస్తున్నారు. వారు ఇతరులతో శాంతిని పెంపొందించుకుంటున్నారు. వారు శాంతియుతమైన భవిష్యత్తునందు నమ్మకాన్ని కల్గివున్నారు. అవును, వారు కల్లోలిత ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ శాంతిని కనుగొన్నారు. నిశ్చయంగా, ఆత్మతోను సత్యంతోను దేవునిని ఆరాధిస్తున్న వారందరూ శాంతిని అనుభవిస్తారు. మీరు కూడా అలాంటి శాంతిని కనుగొనవచ్చు.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడింది.
[7వ పేజీలోని చిత్రం]
వారు కల్లోలిత ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ శాంతిని కనుగొన్నారు