కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/15 పేజీలు 26-29
  • నీతి ఒక జనమును ఘనపరుస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీతి ఒక జనమును ఘనపరుస్తుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆత్మీయ ఇశ్రాయేలు
  • లోకం తేడాను చూడగలదు
  • కొందరెందుకు బహిష్కరించబడ్డారు
  • యెహోవా యొక్క నీతిని ఉన్నతపర్చడం
  • యెహోవా నీతినిబట్టి ఆనందించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా ఇచ్చే క్రమశిక్షణను ఎల్లప్పుడూ అంగీకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పూర్ణహృదయంతో నీతిని ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • నీతిని వెదకడం మనల్ని కాపాడుతుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/15 పేజీలు 26-29

నీతి ఒక జనమును ఘనపరుస్తుంది

ఎన్నో రోజులు వర్షం కురిసిన తర్వాత, నిద్ర లేచి నిర్మలమైన ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తుండడాన్ని చూడడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది! భూమి బలం పుంజుకుంది, ఇప్పుడు గడ్డి విస్తారంగా పెరగగలదు. నీతియుక్తమైన పరిపాలన యొక్క ఆశీర్వాదాలను వివరించడానికి యెహోవా దేవుడు ఒకసారి అలాంటి దృశ్యాన్ని ఉపయోగించాడు. రాజైన దావీదుకు ఆయనిలా చెప్పాడు: “మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.”—2 సమూయేలు 23:3, 4.

దావీదు కుమారుడైన సొలొమోను రాజు యొక్క నీతియుక్తమైన పరిపాలన కాలంలో దేవుని మాటలు సత్యమని నిరూపించబడ్డాయి. బైబిలు ఇలా నివేదిస్తుంది: “సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలువారేమి యూదావారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్షచెట్ల క్రిందను అంజూరపుచెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి.”—1 రాజులు 4:25.

ప్రాచీన ఇశ్రాయేలు దేవుడు ఎన్నుకొనిన జనము. ఆయన వారికి తన కట్టడలనిచ్చి వారు తన మాట వింటే, “భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చి”స్తానని ఆయన వారికి చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 28:1) ఇశ్రాయేలీయుల స్వనీతి కాదుగాని యెహోవా నీతి వారిని ఘనపర్చింది. దేవుడు వారికిచ్చిన ఆజ్ఞలు వారి చుట్టూవున్న జనముల చట్టాలకంటే ఎంతో ఉన్నతమైనవి. ఒక ప్రజగా, వారు ఆ జనములన్నిటిలానే అపరిపూర్ణులుగా ఉన్నారు. కాబట్టి, ఇతర జనములకంటే వారు ఉన్నతంగా ఉండడానికి కారణం యెహోవా యొక్క ఉన్నతమైన ధర్మశాస్త్రం మరియు దానికి వారు కచ్చితంగా కట్టుబడివుండడమే. వారు యెహోవా ఆజ్ఞలకు విధేయులైనప్పుడు, వారు ఆయన అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందారు. రాజైన సొలొమోను తన పరిపాలనా కాలంలో దీన్ని అనుభవించాడు. ఆయనిలా చెప్పగలిగాడు: “నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును.”—సామెతలు 14:34.

తరచూ అవిధేయతా క్రియలు చేయడం ద్వారా ఇశ్రాయేలు జనాంగం అథోస్థితికి తేబడడం దుఃఖకరం. ఆ జనమే అవమానం పాలైంది. చివరికిది, వారికి బదులు ఒక క్రొత్త ఆత్మీయ జనము అనుగ్రహాన్ని పొంది, శాశ్వతంగా నిరాకరింపబడడానికి నడిపింది.—మత్తయి 21:43.

ఆత్మీయ ఇశ్రాయేలు

యెరూషలేమునందు క్రైస్తవ పరిపాలక సభ సమావేశంలో, జన్మతః యూదుడైన యాకోబు ప్రేరేపించబడినవాడై, దేవుడు “అన్యజనులలోనుండి . . . తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొన”దల్చాడని చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 15:14) అపొస్తలుడైన పౌలు ఈ క్రొత్త క్రైస్తవ జనమును “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచాడు. (గలతీయులు 6:16) వారు పిలువబడడంలోని సంకల్పాన్ని గూర్చి పేతురు ఇలా వ్రాశాడు: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసముహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు.” (1 పేతురు 2:9) దేవుని ఎన్నుకొనబడిన ప్రజలుగా వారు లోకంలో జ్యోతులవలె వెలుగవలసివుంది. యెహోవా యొక్క నీతి వారిని ఉన్నతపరుస్తుంది.—ఫిలిప్పీయులు 2:15.

ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయుల ఎంపికను వజ్రాల త్రవ్వకంతో పోల్చవచ్చు. సుసంపన్నమైన వజ్రాలుగల ముడిలోహం వెలికితీయబడినప్పుడు, 3 టన్నుల మట్టికి అది ఒక కారట్‌ (200 మిల్లీగ్రాములు) వరకు మాత్రమే ఉండవచ్చు. వజ్రాలను వేరుచేయడానికి ఒకప్పుడు ఉపయోగించిన పద్ధతిలో, లోహానికి నీళ్లు జతచేసి ఆ మిశ్రమాన్ని జిడ్డుగల బల్లల మీద పారేలా చేయడం ఇమిడి ఉండేది. వజ్రాలు నీటి వికర్షకాలు, అనవసరమైన పదార్థం నీటితోపాటు పారుతుండగా అవి మాత్రం జిడ్డుకు అతుక్కుపోతాయి. ఈ స్థితిలో, వజ్రాలు కరుకుగా ఉంటాయి. అయితే, వాటిని కోసి మెరుగుపెట్టినప్పుడు అవి అన్ని వైపులా వెలుగును ప్రసరింపజేసేవి.

తమ చుట్టూవున్న పదార్థంతో సంబంధంలేకుండా ఉండే నీటి వికర్షకాలైన వజ్రాలవలె, యెహోవా ప్రజలు లోకం నుండి వేరు చేయబడ్డారు. (యోహాను 17:16) మొదట వెలుగులోకి తేబడినప్పుడు వారికి ప్రకాశం ఉండివుండకపోవచ్చు. కాని యెహోవా యొక్క వాక్యం మరియు ఆత్మ వారిలో అంతర్గతంగా ఒక క్రొత్త వ్యక్తిత్వాన్ని సృష్టిస్తుంది గనుక, వాళ్లు ఈ లోకంలో జ్యోతులవలె ప్రకాశిస్తారు. వారు తమ స్వంత నీతిని బట్టి కాదుగాని, యెహోవా నీతినిబట్టి ఉన్నతపర్చబడి, రాజ్య సత్యమనే మహిమాన్విత వెలుగును అన్ని దిశల్లో ప్రసరింపజేస్తారు.

అయినప్పటికీ, సా.శ. మొదటి శతాబ్దపు చివరి భాగంనుండి సంఘాల్లోకి భ్రష్టత్వం ప్రవేశించి అనేకులను ప్రభావితం చేసింది. క్రైస్తవులని పిలువబడేవారు లోకంలోని జనములతో ఐక్యమైపోవడంతో వారు తమ చుట్టూవున్న లోకంనుండి వేరుగా గుర్తించబడడానికి వీలులేకుండా పోయింది.

నేడు ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము యెహోవా అనుగ్రహాన్ని తిరిగి పొందుతోంది. వారు లోకం నుండి తమను తాము వేరుచేసుకొని, “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి” తమను తాము శుభ్రపర్చుకున్నారు. (2 కొరింథీయులు 7:1) యెహోవా ఎదుట పరిశుభ్రంగా నీతిగా ఉండడం ద్వారా, వారు ఆయన నీతిని ఉన్నతపరుస్తారు. ఇది వారిని లోకం యొక్క జనములకు పైగా, అనుగ్రహమనే ఉన్నత స్థానానికి లేవనెత్తింది. వారు రాజ్య సువార్తను ఆసక్తితో ప్రకటించడం మూలంగా, ఒక గొప్ప అంతర్జాతీయ సమూహం యెహోవా యొద్దకు తీసుకురాబడి ఆయన ప్రజలలో ఒక భాగమయ్యింది.—ప్రకటన 7:9, 10.

లోకం తేడాను చూడగలదు

లోకసంబంధమైన అధికారులు కొన్నిసార్లు దేవుని సేవకుల ప్రవర్తనను అభినందిస్తారు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికానందలి ప్రిటోరియా మైదానానికి చెందిన ప్రధాన భద్రతాధికారి, ఆ సౌకర్యాలను తమ వార్షిక సమావేశాల కొరకు ఉపయోగించుకొనే అన్ని జాతులకు చెందిన యెహోవాసాక్షుల ప్రవర్తన గురించి వ్యాఖ్యానించాడు. మిగతా విషయాలతో పాటు ఆయనిలా వ్రాశాడు: “ప్రతి ఒక్కరు మర్యాదపూర్వకంగా ఉండేవారు, ఉన్నారు, ప్రజలు ఒకరితో ఒకరు చక్కగా మాట్లాడుకుంటూ, ఈ కొద్ది రోజుల్లో చూపించబడిన దృక్పథం—అదంతా మీ సంస్థ సభ్యుల స్థాయికి మరియు అందరూ కలిసి ఒకే సంతోషభరితమైన కుటుంబంగా జీవిస్తారనడానికి చిహ్నంగా ఉంది.”

యెహోవా ప్రజలు అలాంటి పెద్ద సమావేశాల్లోనే కాదు తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా వారు ఆయన జనము యొక్క నీతికి దోహదపడతారు. ఉదాహరణకు, వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క దక్షిణాఫ్రికా బ్రాంచికి జోహాన్స్‌బర్గ్‌ నుండి ఒక స్త్రీ వ్రాసిన ఉత్తరంలో ఇలా ఉంది: “గత వారం నేను నా పర్సు నా కారు పైభాగాన ఉండగానే నేను కారు నడుపుకుంటూ వెళ్లిపోయాను. అది జాన్‌ స్మట్స్‌ అవెన్యూ ప్రాంతంలో పడిపోయింది, దానిలోవున్న వాటన్నిటితోసహా మీ సంఘ సభ్యుడైన మిస్టర్‌. ఆర్‌—దాన్ని తీసుకుని నాకు ఫోను చేసి, నాకు దాన్ని తిరిగి అందజేశాడు. . . . ప్రస్తుత కాలంలో అరుదైన లక్షణంగా తయారైన ఈ యథార్థతను నేనెంతో మెచ్చుకుంటున్నాను, మీ సభ్యులు హత్తుకొని ఉండే కట్టడలను విధించినందుకు నేను మీ సంఘాన్ని అభినందిస్తున్నాను.”

అవును, యెహోవా యొక్క నీతియుక్తమైన కట్టడలను హత్తుకొని ఉండడం ద్వారా, ఆయన ప్రజలు లోకం నుండి వేరుగా ఉంటారు. వీరు యెహోవా యొక్క నీతిని ప్రదర్శిస్తారు గనుక, యథార్థ హృదయులు క్రైస్తవ సంఘంవైపుకు ఆకర్షించబడుతున్నారు. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన దానివైపుకు ఆకర్షించబడడం సహజమే. ఉదాహరణకు, స్విట్జర్లాండ్‌నందలి జూరిచ్‌లోని యెహోవాసాక్షుల సమావేశానికి ఒకసారి ఒక క్రొత్త వ్యక్తి వచ్చి, తాను సంఘ సభ్యున్ని కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తన సహోదరి లైంగిక దుర్నీతి మూలంగా బహిష్కరించబడిందని ఆయన వివరించాడు, “చెడు ప్రవర్తనను సహించని” సంస్థలో చేరాలని తాను ఇష్టపడుతున్నానని కూడా తెలియజేశాడు. న్యూ కాథోలిక్‌ ఎన్‌సైక్లోపీడియా కూడా యెహోవాసాక్షులు “ప్రపంచంలోని చక్కగా ప్రవర్తించే వర్గాలలో ఒకరిగా” పేరుపొందారని అంగీకరిస్తుంది.

నీతి ఉన్నతపరుస్తుంది అయితే పాపం ఒకరి మంచి పేరుకు అప్రతిష్ఠ తీసుకురాగలదు, ప్రాముఖ్యంగా గంభీరమైన తప్పు సమాజంలో తెలియబడినప్పుడు అలా జరుగుతుంది. క్రైస్తవ సంఘం కొన్నిసార్లు, అందులోని సభ్యులు ఘోరమైన పాపం చేసినప్పుడు దాని మీదికి తీసుకురాబడిన అవమానాన్ని సహించవలసివస్తుంది. తప్పిదస్థుడు దయాపూర్వకంగా క్రమశిక్షణను పొందాడని, అది లేఖనాధార సూత్రాలతో పొందిక కలిగివుందని చూపించడం ద్వారా సంఘంలోని నమ్మకమైన సభ్యులు సంఘం యొక్క మంచి పేరును కాపాడవచ్చుననే విషయాన్ని గ్రహించవచ్చు. ఎవరైనా పాపం చేస్తూ, పశ్చాత్తాపపడకపోతే అతడు సంఘం నుండి వెలివేయబడతాడు—బహిష్కరించబడతాడు.—1 కొరింథీయులు 5:9-13.

కొందరెందుకు బహిష్కరించబడ్డారు

క్రైస్తవ సంఘం నుండి ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది బహిష్కరించబడుతున్నప్పటికీ, ప్రపంచంలో దాదాపు 50 లక్షలమందిగావున్న సాక్షులలో అది కేవలం కొద్ది శాతం మాత్రమే. క్రైస్తవ సంఘంలోవున్న ఎవరికి వ్యతిరేకంగానైనా ఎందుకలాంటి కఠినమైన చర్య తీసుకోబడాలి? నిర్ణయించాల్సిన అంశాల్లో ఒకటి ఆ తప్పిదం వెనుకనున్న ఉద్దేశం. కాని మరింత ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, జరిగిన గంభీరమైన తప్పు గురించి తప్పిదస్థుడు నిజంగా పశ్చాత్తాపపడుతున్నాడా లేదా అన్నదే. అతడు నిజంగా బాధపడి, యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపానికి క్షమాపణను ఆర్థిస్తూ ఆయనను హృదయపూర్వకంగా ప్రార్థించి, సంఘంలోని బాధ్యతగల పురుషుల సహాయాన్ని కోరితే, అతడు దేవుని అనుగ్రహాన్ని తిరిగి పొంది సంఘంలో ఒక భాగమై ఉండడానికి అతనికి సహాయం లభిస్తుంది.—సామెతలు 28:13; యాకోబు 5:14, 15.

తన తండ్రితో మంచి, దృఢమైన సంబంధం కలిగివున్న బాలుడు తన తండ్రికి బాధ కలిగించేదేదైనా చేసినప్పుడు, ఆ అమూల్యమైన సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి ఇద్దరూ వేగిరపడాలి. అలాగే, మనం మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మనకు ఆయనతో అత్యంత అమూల్యమైన సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి, ఆయనకు బాధ కలిగించేదేదైనా మనం చేసినప్పుడు మన పరలోక తండ్రితో ఆ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడానికి మనం వెంటనే చర్య తీసుకోవాలి.

సంతోషకరంగా, బహిష్కరించబడిన స్థితిలోవున్న కొందరు తప్పిపోయిన కుమారుని ఉపమానాన్ని గుణగ్రహించారు. అందులో యెహోవా, పాపి పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణను కోరితే అలా పశ్చాత్తాపపడిన పాపిని తిరిగి స్వీకరించడానికి సంసిద్ధంగావున్న ప్రేమగల తండ్రితో పోల్చబడ్డాడు. (లూకా 15:11-24) నిజమైన, హృదయపూర్వక పశ్చాత్తాపం మరియు చెడునుండి వైదొలగడం యెహోవా అనుగ్రహాన్ని తిరిగి పొందడానికి, క్రైస్తవ సంఘానికి తిరిగి రావడానికి ఒక మార్గమైయుంది. తమ అపరాధభావం యొక్క భారం క్రింద నలిగిపోయినట్లు భావించిన, పశ్చాత్తాపం చెందిన కొంతమంది తప్పిదస్థులు పశ్చాత్తాపపడి, క్రైస్తవ సంఘం యొక్క ప్రేమపూర్వక వాతావరణానికి తిరిగివచ్చేందుకు చర్యలు గైకొనేలా పురికొల్పబడ్డారు. అలా వారు యెషయా 57:15 నందలి యెహోవా మాటలను గుణగ్రహించగలిగారు.

యెహోవా యొక్క ప్రేమపూర్వక శ్రద్ధ క్రిందికి తిరిగివచ్చే వ్యక్తులను ఆటంకపర్చడానికి, చేసిన పాపాలకు క్షమాపణ లేదని అనిపించేలా చేయాలని సాతాను ఇష్టపడతాడు. కాని క్రీస్తు యేసు యొక్క విమోచనా క్రయధన బలి పశ్చాత్తాపపడే ఎవరి పాపాలనైనా—అవును, చివరికి వారసత్వంగా సంక్రమించిన “లోకమంతటి” పాపాన్నైనా క్షమించడానికి కూడా తగినదే. (1 యోహాను 2:1, 2) విమోచన క్రయధనం క్షమించని ఒక పాపం ఏమిటంటే, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపం, ఇది యూదా ఇస్కరియోతు మరియు అనేకమంది శాస్త్రులు, పరిసయ్యుల ఘోరమైన పాపాలవంటిది, ఇది దేవుని ఆత్మకు వ్యతిరేకంగా కావాలని ఎదురుతిరగడంతో సమానమైనది.—మత్తయి 12:24, 31, 32; 23:13, 33; యోహాను 17:12.

యెహోవా యొక్క నీతిని ఉన్నతపర్చడం

ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషము 1919లో యెహోవా అనుగ్రహానికి తిరిగి తీసుకురాబడినప్పటి నుండి, వారు తమ చుట్టూవున్న లోకానికిపైగా ఎంతో ఎంతో ఉన్నతపర్చబడ్డారు. దీనికి కారణం వారి మంచితనం ఎంతమాత్రం కాదుగాని యెహోవా సూత్రాలకు, కట్టడలకు వారు ఇష్టపూర్వకంగా చూపిన విధేయతే. ఫలితంగా, క్రీస్తు యొక్క “వేరే గొర్రెలు” లక్షలాదిమంది నమ్మకమైన సహవాసులుగా ఆత్మీయ ఇశ్రాయేలుతో సహవాసంలోకి తీసుకురాబడ్డారు. (యోహాను 10:16) దేవుని నీతి సూత్రాలకు ఎంతో దూరంగా ఉన్న లోకంలో ఈ ప్రజలు యెహోవాకు ఘనతా మహిమలను తెస్తారు. అది, దక్షిణాఫ్రికా పత్రికయైన పర్సనాలిటీ ఒకసారి చెప్పినట్లుగా ఇలా ఉంది: “యెహోవాసాక్షులు మంచి లక్షణాలతో వెల్లివిరుస్తున్నట్లు, దాదాపు చెడు నుండి స్వతంత్రులైనట్లు అనిపిస్తుంది.”

దైవభక్తిలేని లోకంలో ఆ ఉన్నత స్థానమందే కొనసాగడానికి, క్రైస్తవ సంఘంలోని ప్రతి సభ్యుడు యెహోవా ఎదుట పరిశుభ్రమైన, నీతియుక్తమైన జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది. బైబిలునందు, యెహోవా యొక్క పరలోక సంస్థ పరిశుభ్రమైన విషయాలతో చిత్రీకరించబడింది. సూర్యున్ని ధరించి, తన పాదాల క్రింద చంద్రున్ని కలిగివున్న అందమైన స్త్రీగా అది కనిపిస్తుంది. (ప్రకటన 12:1) నూతన యెరూషలేము సుందరమైన ఆకృతి గల పరిశుద్ధ పట్టణంగా వర్ణించబడింది. (ప్రకటన 21:2) క్రీస్తు పెండ్లి కుమార్తెనందలి నమ్మకమైన సభ్యులకు “ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు” ఇవ్వబడ్డాయి. (ప్రకటన 19:8) గొప్ప సమూహానికి చెందినవారు “తెల్లని వస్త్రములు ధరించుకొన్నట్లు” కన్పించింది. (ప్రకటన 7:9) ప్రజలు నీతినికోరుకొని పరిశుభ్రమైన సంస్థవైపు ఆకర్షించబడుతున్నారు. దానికి భిన్నంగా, సాతాను సంస్థ అపరిశుభ్రంగా ఉంది. అతని మత విధానం వేశ్యగా చిత్రీకరించబడింది, పరిశుద్ధ పట్టణం వెలుపలున్నవారు అసహ్యంగా, అపరిశుభ్రంగా ఉన్నట్లు వివరించబడింది.—ప్రకటన 17:1; 22:15.

నీతిగలవారికి నిత్యజీవం వాగ్దానం చేయబడింది. యెహోవా నీతిని ఉన్నతపర్చే సమాజంగా కూడిన ప్రజలకు ఈ దుష్టవిధానాంతాన్ని తప్పించుకొనే ఉత్తరాపేక్ష ఉంది. సామెతలు 1:33 నందు దేవుడిలా వాగ్దానం చేస్తున్నాడు: “నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును . . . కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.”

గొప్ప సొలొమోను అయిన క్రీస్తు యేసు నీతితోను యెహోవాయందలి భయంతోను ఆ నూతన లోకాన్ని పరిపాలించేటప్పుడు అది ఎంత ఉల్లాసవంతమైనదిగా ఉంటుందో కదా! (2 పేతురు 3:13) అది సూర్యుడు ప్రకాశించే ఉదయకాల కాంతిలా, మబ్బుల్లేని ఉదయంలా ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ స్వంత ద్రాక్ష మరియు అంజూర చెట్ల క్రింద కూర్చున్నట్లుగా భూనివాసులందరూ సురక్షితంగా ఉంటారు. నీతియుక్తమైన మానవ సమాజం భూమిని సుందరంగా తీర్చిదిద్ది, మన దేవుడైన యెహోవాకు నిత్య స్తుతిని తెచ్చేలా విశ్వంలో తనదైన స్థానాన్ని చేరుకుంటుంది.—మీకా 4:3, 4; యెషయా 65:17-19, 25 కూడా చూడండి.

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి