“నేను యెహోవాకు అమూల్యమైన వ్యక్తిని!”
ఈ “అపాయకరమైన కాలము”లలో, యెహోవా యొక్క నమ్మకమైన సేవకులనేకులు నిష్‌ప్రయోజకులమనే భావాలతో నిరంతర పోరాటం సల్పుతున్నారు. (2 తిమోతి 3:1) ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే మన సృష్టికర్త కూడా మనల్ని ప్రేమించడం లేదని మనం భావించేలా చేయడమే సాతాను యొక్క “తంత్రముల”లో ఒకటి! (ఎఫెసీయులు 6:11) తగినట్లుగానే, ఏప్రిల్ 1, 1995 కావలికోట నందు సంఘ పఠనం కొరకు “మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!” మరియు “ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పుట—ఎట్లు?” అనే రెండు శీర్షికలు ఉన్నాయి. యెహోవా మన ప్రయత్నాలను విలువైనవిగా దృష్టిస్తాడని మనకు గుర్తుచేయడానికి ఈ శీర్షికలు రూపొందించబడ్డాయి. అందిన కొన్ని మెప్పుకోలు వ్యాఖ్యానాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
“యెహోవాసాక్షులలో ఒకరిగావున్న నా 27 సంవత్సరాలలో ఏ పత్రికా నన్నింతగా ప్రభావితం చేయలేదు. నేను ఏడుపు ఆపుకోలేకపోయాను—ఈ శీర్షికలు నాకంత ఉపశమనాన్ని కలిగించాయి. ఇప్పుడు నేను యెహోవాచే ఎంతో ప్రేమించబడుతున్నట్లు భావిస్తున్నాను. నా భుజాలపై నుండి పెద్ద భారం తీసివేయబడినట్లుగా ఉంది.”—సి. హెచ్.
“నేను ఈ పత్రికను ఒకే రోజులో నాలుగుసార్లు చదివాను. మీరు ఎందుకూ పనికిరాని వారని నమ్ముతుంటే మీకు ఒక అబద్ధం బోధింపబడింది అని ఆ శీర్షిక చెప్పిన విధానం నాకు నచ్చింది. నేను ఈ శీర్షికను కాపరి సందర్శనాలప్పుడు, ఇంటింటి పరిచర్యలో ఉపయోగించబోతున్నాను.”—ఎమ్. పి.
“యెహోవాను ప్రేమించేవారు కూడా తాము నిష్‌ప్రయోజకులమని, ప్రేమింపబడలేని వారమని భావించేలా చేయడంలో సాతాను చాలా నైపుణ్యం చూపించాడు. యెహోవా మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడని, ఆయన కొరకు మనం చేసే చిన్న చిన్న పనులన్నిటినీ ఆయన మెచ్చుకుంటాడని ‘నమ్మకమైన దాసుని’ ద్వారా గుర్తు చేయబడడం నేను చదివిన అత్యంత ప్రోత్సాహకరమైన వాటిలో ఒకటి. ఈ శీర్షికల్లో మీరు ప్రస్తావించిన భావాలే నాలో ఎన్నో సంవత్సరాలుగా ఉండేవి. యెహోవాచే ప్రేమించబడడానికి అర్హతగలదానినని నేను ఎన్నడూ భావించలేదు, కాబట్టి ఆ ప్రేమను పొందాలనే ప్రయత్నంలో ఎంతో ఎక్కువగా ఆయన సేవ చేయడానికి నేను ప్రయత్నించాను. కాని నేను అపరాధ భావంతో, అవమానంతో పురికొల్పబడ్డాను. కాబట్టి నేను పరిచర్యలో ఎన్ని గంటలు గడిపినప్పటికీ, లేక నేను ఎంతమంది ప్రజలకు సహాయం చేసినప్పటికీ, అది తగినంత కాదన్నట్లు నేను భావించాను. నాలో నేను కేవలం కొరతనే చూశాను. ఇప్పుడు నేను యెహోవాను ప్రేమతో సేవించేటప్పుడు, ఆయన చిరునవ్వు చిందిస్తున్నాడని, నన్ను బట్టి ఆయన గర్విస్తున్నాడని నేను ఊహించుకుంటాను. ఇది ఆయన ఎడల నా ప్రేమ ఎంతో అధికమయ్యేలా, నేను మరింత చేయాలని ఇష్టపడేలా చేస్తుంది. ఇప్పుడు యెహోవాకు నేను చేస్తున్న సేవనుండి నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను.”—ఆర్. ఎమ్.
“అవును, ఇవి నేనింత వరకు చదివిన వాటిలోకెల్లా మన హృదయాన్ని తాకేవిగాను, అత్యంత చక్కని ఎంతో ప్రోత్సాహకరమైన విశేషమైన శీర్షికలు! నేను 55 సంవత్సరాలుగా కావలికోట చదువుతున్నాను, ఎన్నో మహత్తరమైన సంచికలు వెలువడ్డాయి. కాని మనం ‘నిష్‌ప్రయోజకులమని’ మరియు ‘ప్రేమింపబడలేని వారమని,’ యెహోవా ప్రేమను ‘సంపాదించుకోవడానికి’ తగినంత ఎన్నడూ చేయలేమనే మన అనుమానాలను, ఆందోళనలను, భయాలను తగ్గించడానికి ఇంతవరకు మనకున్న దేనినైనా ఈ సంచిక మించిపోతుంది. మన సహోదరులకు ఎంతో అవసరమైన ఆత్మీయ సహాయం ఈ కావలికోటలో ఉంది. కాపరి సందర్శనాలు చేసేటప్పుడు ఈ శీర్షికలను పదే పదే ఉపయోగించాలన్నది నా ఉద్దేశం.”—ఎఫ్. కె.
“మనలో ఆత్మన్యూనతతో లేక స్వయం ద్వేష భావాలతో పోరాడేవారికి, సత్యంలో కొనసాగడానికి తమ బలాన్ని సమకూర్చుకోవడం కష్టం కావచ్చు. ఈ శీర్షిక ఎంత లోతుగా వాత్సల్యాన్ని, అవగాహనను అందజేసిందంటే, అది సూటిగా హృదయానికి ఉపశాంతి కలిగించే, స్వస్థపర్చే తైలము పూసినట్లు ఉంది. కావలికోటలో అలాంటి మాటలు చదవడం మరియు యెహోవా నిస్సందేహంగా అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమైనదో! అపరాధ భావం, అవమానం, లేక భయం ద్వారా తన ప్రజలను పురికొల్పడానికి యెహోవా ప్రయత్నించడని మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. మా కుటుంబంలో ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు ఉన్నందువల్ల ప్రకటన పనిలో నేను భాగం వహించడం ఇటీవల ఎంతో పరిమితం చేయబడినప్పటికీ, నేను చేయగలుగుతున్న దాన్నిబట్టి నేను సంతృప్తిని పొందుతున్నాను. ప్రేమను నన్ను కదిలించే శక్తిగా ఉంచుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు, సేవలో నేను ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు కనుగొంటున్నాను.”—డి. ఎమ్.
“‘మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!’ అనే శీర్షికను చదవడం నేను ఇప్పుడే ముగించాను. ప్రతి పేరా నా కళ్లల్లో నీళ్లు తెప్పించింది. చాలా తక్కువ ప్రేమ చూపిన కుటుంబంనుండి నేను వచ్చాను. నేను హీనపర్చబడ్డాను, అవహేళన చేయబడ్డాను, నవ్వులపాలయ్యాను. కాబట్టి జీవితంలో తొలికాలంలోనే నేను నిష్‌ప్రయోజకున్నని భావించాను. నేను విపత్తును ఎదుర్కొనేటప్పుడు, నన్ను అణిచివేసే నా గతానికి సంబంధించిన దోషపూరిత భావాలు నాకు ఇప్పటికీ కలుగుతాయి. నేను సంఘ పెద్దగా పనిచేయడం మానివేసినప్పుడు, ఎప్పటిలానే నేను దేవుని దృష్టిలో, నా కుటుంబం దృష్టిలో, సంఘంలోని నా సహోదరుల దృష్టిలో విఫలమైనట్లు భావించాను. ఈ భావాలు వెంటనే పోవు, కాని ఒక మోస్తరు సమతూకాన్ని తిరిగి పొందడానికి ఈ సమయోచితమైన శీర్షిక నాకు సహాయం చేసింది. ఇది నా దృక్పథాన్ని మెరుగుపర్చింది.”—డి. ఎల్.
“‘మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!’ అనే శీర్షిక కొరకు మీకు కృతజ్ఞతలు. చిన్నతనంలో దుర్వినియోగానికి గురైన కారణంగా తీవ్రమైన స్వయంద్వేష భావాలతో మరియు నిష్‌ప్రయోజకురాలిననే లోతైన భావాలతో బాధపడుతుంటాను. ఈ వికృతమైన ఆలోచనా విధానాన్ని సాతాను యొక్క కుయుక్తితో కూడిన చర్యగా దృష్టించడం నిశ్చయంగా తగినదే. అది జీవించాలనే కోరికను కూడా తీసివేయగలదు. నేను ప్రేమింపబడలేని దానిననే అబద్ధాన్ని ఎదిరించడానికి నేను నిజంగా ప్రతిరోజు కృషిచేయవలసి ఉంటుంది. మీరు తెలుసుకోగలిగే దానికంటే ఈ శీర్షిక నాకు ఎంతో విలువైనది.”—కె. ఎఫ్.
“నిర్బంధం లేక ఒత్తిడి కంటే ప్రేమ చేత పురికొల్పబడిన క్రియలను యెహోవా మెచ్చుకుంటాడనే తలంపుకు సహోదరులు నేడు ప్రాముఖ్యంగా ప్రతిస్పందిస్తున్నారు. యెహోవా యొక్క ప్రేమపూర్వకమైన, వాత్సల్యపూరితమైన వ్యక్తిత్వాన్ని, వ్యక్తులుగా తన ప్రజలయందు ఆయనకుగల ఆసక్తిని, ఆయన తనను తాను ప్రేమపూర్వకమైన విధంగా లభ్యం చేసుకోవడాన్ని పరిశీలించడం ఎంతో ఉపశమనాన్ని, పురికొల్పును ఇస్తుంది. దీని దృష్ట్యా, ‘మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!’ అనే శీర్షికను మేము అందుకున్న వెంటనే అనేకులు మెప్పుదలను వ్యక్తపర్చారు. యెహోవాతో మరింత వ్యక్తిగతమైన సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఇది అనేకులకు మార్గాన్ని తెరుస్తున్నట్లుగా ఉంది. ఇటీవలి కావలికోట పత్రికల్లో వ్యక్తపర్చబడుతున్న శైలి మరియు శ్రద్ధ ఎడల మెప్పును తెలియజేయాలని నేను నా భార్య ఇష్టపడుతున్నాము. మేము సంఘాలను దర్శిస్తుండగా ఈ అంశాల్లో అనేకం అన్వయించుకోవడానికి మేము కృషిచేస్తున్నాము.”—ఒక ప్రయాణకాపరి నుండి.
“దాదాపు 30 సంవత్సరాలుగా నేను నమ్మకమైన పాఠకురాలిగా ఉన్నాను, కాని ఇంతగా పురికొల్పేది, ఇంతగా ప్రోత్సహించేది ఏదీ నేనింత వరకు చదవలేదు. శక్తివంతమైన, నైపుణ్యంగా అన్వయింపబడిన లేఖనాలు, యెహోవాకు సన్నిహితమయ్యేందుకు నాకు అవకాశమిస్తూ, నా స్వంత భావాల్లో గుప్తంగావున్న అబద్ధాలను పెరికివేయడానికి సహాయం చేశాయి. అనేక సంవత్సరాలు నేను అపరాధ భావం మూలంగా యెహోవాను సేవించాను. విమోచన క్రయధనం మరియు దేవుని ప్రేమ ఎడల నాకు తెలివితో కూడిన అవగాహన మాత్రమే ఉండేది. అలాంటి అంతర్దృష్టిగల మరియు ఆలోచనతోకూడిన శీర్షికల కొరకు మీకు కృతజ్ఞతలు. అలాంటివి ఇంకా ఎక్కువ చదవాలని నేనిష్టపడుతున్నాను.”—ఎమ్. ఎస్.
“సత్యంలో ఉన్న నా 29 సంవత్సరాలన్నిటిలో, నాలో ఇంత కృతజ్ఞతా భావాన్ని, లోతైన భావాలను కలిగించిన శీర్షిక ఏదీ నాకు గుర్తులేదు. నేను ఎంతో ప్రేమగల, శ్రద్ధ చూపించే కుటుంబంలో పెరిగినప్పటికీ, సజీవంగా ఉండడానికి నేను అర్హురాలినని ఎన్నడూ భావించలేదు, ఇక యెహోవాను సేవించడం గురించైతే చెప్పనవసరం లేదు. ఈ శీర్షిక తర్వాత, నేను మోకాళ్లూని వెక్కి వెక్కి ఏడుస్తూ యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేశాను. నేను ఈ శీర్షికను నిత్యం ప్రియమైందిగా ఎంచుతాను. నేను యెహోవాకు అమూల్యమైన వ్యక్తిని అని నేనిప్పుడు గ్రహించాను కాబట్టి నన్ను నేను వేరుగా దృష్టించుకుంటాను.”—డి. బి.