చూడండి! న్యూయిలో ఒక రాజ్య మందిరం
న్యూజీలాండుకు 2,160 కిలోమీటర్లు ఈశాన్యంగావున్న న్యూయి దక్షిణ పసిఫిక్‌లోని ఒక చిన్న పగడపు దీవి. ఒక ప్రయాణ బ్రోషూరు ప్రకారం, న్యూయి అనే పేరు రెండు పదాల నుండి వస్తుంది, న్యూ అంటే “కొబ్బరి చెట్టు” అని భావం, యి అంటే “అదిగో,” లేక “చూడండి” అని భావం. బ్రోషూరు ఇలా తెలియజేస్తుంది: “ఇతిహాసం ప్రకారం, మొదటి ప్రవాస పాలినేషియన్‌లు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ పెరిగిన కొబ్బరి చెట్లను చూసి ఈ మాటలు పలికారు.”
నేడు, న్యూయిలోని యెహోవాసాక్షులు సందర్శకులతో ఇలా చెప్పడానికి గర్విస్తున్నారు, “ఎ! ఫాలె హె కవుటూ మౌటాలూ!” దాని భావం, “చూడండి! మా రాజ్య మందిరం!” ఈ మందిరం గురించి వారికి అంత లోతైన భావాలు ఎందుకున్నాయి? ప్రాముఖ్యంగా వారు తామే దాని నిర్మాణకులైనప్పుడు, ప్రతిచోటావున్న యెహోవాసాక్షులూ తమ రాజ్యమందిరాల గురించి గర్విస్తున్నారు. కాని, విశాలమైన దక్షిణ పసిఫిక్ మధ్యనున్న మారుమూల ద్వీపంలో రాజ్య మందిరాన్ని నిర్మించడం పూర్తిగా వేరే విషయం. న్యూయి కేవలం 260 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగివుంది, మొత్తం ద్వీపంలో 2,300 మంది ప్రజలు మాత్రమే ఉన్నారు.
రాజ్య మందిరాన్ని ఎవరు నిర్మిస్తారు అన్న ప్రశ్న వచ్చింది. న్యూయిలోనున్న ఒకే ఒక్క సంఘంలో కేవలం 32 మంది సాక్షులే ఉన్నారు. అవసరమైన ప్రధాన పరికరాలైన ట్రక్కులు, బుల్‌డోజర్లు, క్రేనులు ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. అంతేగాక ఉక్కు, కాంక్రీటు బ్లాకులు, పై కప్పు, ఎలక్ట్రికల్ మరియు ప్లమింగ్ వస్తువులు, శబ్ద పరికరాలు, కుర్చీలు వంటి అవసరమైన నిర్మాణ సామాగ్రి న్యూజీలాండు నుండి తెప్పించుకోవాలి, అదీ ప్రతి ఐదు వారాలకొకసారి మాత్రమే పనిచేసే రవాణా సౌకర్యం ద్వారా తెప్పించుకోవాలి. చివరికి, ద్వీపంలోని కొండ ప్రాంతం నిర్మాణాన్ని కష్టతరం చేయవచ్చు మరియు మందిరం ఉష్ణమండల తుపానులను తట్టుకొనగలిగేలా నిర్మించవలసి ఉంటుంది. వాస్తవానికి, అది ఎవరికైనా భయంగొల్పే కార్యమే!
అయితే, ఇక్కడ ఒక పెద్ద తేడా ఉంది. యెహోవాసాక్షులకు రాజ్యమందిరం స్థానిక సత్యారాధనకు కేంద్రం, కాబట్టి వారు సహాయ నడిపింపుల కొరకు యెహోవా దేవుని వైపు చూస్తారు. (కీర్తన 56:11; 127:1) ఆక్లాండులోని న్యూయి వాసుల సంఘంలోని సభ్యులతో సహా న్యూజీలాండు నందలి క్రైస్తవ సహోదరులు నిర్మాణ ప్రాజెక్టుకు హృదయపూర్వక మద్దతునిస్తూ, న్యూయిలోని సాక్షుల చిన్న గుంపుకు సహాయం చేయడానికి వచ్చారు.
కొనసాగాలనే నిర్ణయం
న్యూయి యొక్క నిర్మాణ ప్రాజెక్టులో భాగం వహించాలనే ఆసక్తి గలవారి కొరకు, న్యూజీలాండులోని రోటొరువానందు రాజ్య మందిర నిర్మాణ స్థలంవద్ద 1994 జూన్‌లో ఒక పిలుపు వెలువడింది. ఆశ్చర్యకరంగా, 200 మంది క్రైస్తవ సహోదర సహోదరీలు స్వచ్ఛంద సేవకు వచ్చారు. వీరిలో వడ్రంగివారు, ఉక్కు పనిచేసేవారు, ప్లమర్లు, పైకప్పు వేసేవారు, తాపీపనివారు, రంగులు వేసేవారు, ఎలక్ట్రీషియన్లు, శబ్ద పరికరాలకు సంబంధించిన పనివారు, కాంక్రీటు పనివారు, ఇటుకలు పేర్చేవారు, కూలివారు మొదలైన వారితో సహా 80 మంది వ్యక్తులు ఎంపిక చేసుకోబడ్డారు.
సహోదరులు యెహోవాయందు నమ్మకముంచి, నమూనాలు తయారు చేసుకుని ముందుకు కొనసాగారు. న్యూయి సంఘంలోని ఇద్దరు పెద్దల్లో ఒకరైన స్థానిక వ్యాపారస్థుడు, అవసరమైన సామాగ్రినంతా రవాణా చేయడానికి ఏర్పాట్లు చేయడం ప్రారంభించాడు. తమ స్వంత ఖర్చులపై స్వచ్ఛంద సేవ చేయడానికి సముద్రాంతర ప్రాంతాల నుండి వచ్చిన పనివారి కొరకు ప్రత్యేకమైన విమానయాన ఛార్జీలు/వసతి ఖర్చులు ఏర్పాటు చేయబడ్డాయి, నిర్మాణ తేదీలు నిర్ణయించబడ్డాయి. ప్రాజెక్టు 20 రోజుల్లో ముగియాలి, 1995 మార్చి 4 నుండి మార్చి 23 నాటికి, అంటే రాజ్య మందిర సమర్పణ నాటికి ముగియాలి.
పనులు చక్కబెట్టడానికి ఒక వారం ముందుగా న్యూజీలాండు నుండి వచ్చిన ప్రాజెక్టు డైరెక్టరు, “నేను స్థలాన్ని చూసినప్పుడు నాకు మొదటిసారిగా విపరీతమైన చింత కలిగింది, భూమంతా కొండ ప్రాంతంగా ఉంది, కేవలం పునాదులు వేయడానికే రెండు వారాలు పడుతుంది” అన్నాడు. కాని తాను స్థానిక సాక్షులను తక్కువ అంచనా వేశానని ఆయన తర్వాత అంగీకరించాడు. ఆయనిలా అన్నాడు, “న్యూయి సహోదరులకు కొండల గురించి బాగా తెలుసు, పెద్ద ముక్కలు విరిగి పడేలా కొండను ఎక్కడ కొట్టాలో వారికి తెలుసు.” పునాదులు రెండు రోజుల్లో వేయబడ్డాయి!
మార్చి 4న విమానం నిండా న్యూజీలాండు సాక్షుల మొదటి గుంపు వచ్చింది, కాంక్రీటు పని జరిగింది. ఆ తర్వాత మిగతా పనివారు ఒకరి తర్వాత ఒకరు నిర్మాణ స్థలానికి చేరడంతో, ప్రాజెక్టు యొక్క వివిధ స్థాయిలు ముగిశాయి. పని రోజులు ఉదయం ఏడుగంటలకు, బైబిలు దినవచనం యొక్క క్లుప్తమైన చర్చతో ప్రారంభమయ్యేది. ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు కొంతమంది సహోదరులు రోజుకు పన్నెండు గంటల చొప్పున పని చేశారు. చివరికి, మార్చి 23 నాటికి నేల చదును చేయబడింది. ఒక మామిడి చెట్టు మీది ఆకర్షణీయమైన బోర్డు ఆ భవనాన్ని “యెహోవాసాక్షుల రాజ్య మందిరం” అని సూచించింది.
సహకార ఆతిథ్యాల స్ఫూర్తి
ప్రాజెక్టు విజయానికి దోహదపడిన ఒక ప్రముఖ కారణం ఏమిటంటే, న్యూయి ప్రజల సహకారం. స్థానిక గ్రామస్థులు సహోదరుల స్ఫూర్తిని బట్టి ఉత్తేజితులై, ఆహారం మరియు డబ్బు విరాళంగా ఇచ్చారు. మందిర నిర్మాణాన్ని అనేకులు తమ ప్రాజెక్టుగా దృష్టించారు. ప్రభుత్వ అధికారులు, వ్యాపారస్తులు తాము చేయవలసిన దానికంటే ఎక్కువ సేవలనే అందించారు. అవసరమైన పరికరాలు అందజేయబడ్డాయి, కర్రపని కర్మాగారం కూడా వారికి లభించింది. అవసరమైన సామాగ్రి తగిన సమయానికి అందేలా చూడడానికి రవాణా కంపెనీ తమ ఓడల మార్గాలను కూడా సవరించుకుంది.
తమ గృహాలను, వస్తువులను ఇష్టపూర్వకంగా పంచుకున్న న్యూయి సాక్షుల కష్టాన్ని, ఆతిథ్యాన్ని సందర్శకులు నిజంగా మెచ్చుకున్నారు. నిర్మాణ పనివారిలో ఒక స్త్రీ, “స్థానిక సహోదరీలు ఎంతో మంచివారు” అని చెప్పింది. ప్రతి రోజు వేడి వేడి మధ్యాహ్న భోజనమే కాకుండా, సహోదరీలు ప్రతి ఉదయం ఆరున్నరకు ఫలహారం కూడా వండి వడ్డించేవారు. ఆహారం సిద్ధం చేయడానికి కొందరు ఉదయం నాలుగున్నరకు నిద్రలేచేవారు. నిర్మాణపనివారిలోని ఒక స్త్రీ ఇలా అంది: “మాకు మా ఇళ్లలోకంటే ఇక్కడ న్యూయిలో మంచి జీవన పరిస్థితులు లభించాయనుకుంటా.”
మార్చి 10న న్యూయి స్టార్ అనే దినపత్రిక మొదటి పేజీలో “న్యూయిలో మొదటి రాజ్య మందిరం” అనే శీర్షికతోపాటు, న్యూజీలాండు దేశస్థులు మరియు న్యూయి నివాసులు నిర్మాణ స్థలంలో పని చేస్తున్న చిత్రాన్ని వేసి ఈ సంఘటన గురించి నివేదించింది. మందిరం 280 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగివుందని, దానిలో 70 నుండి 100 మంది ప్రజలు కూర్చోవడానికి వీలవుతుందని తెలియజేసింది. శీర్షిక ఇంకా ఇలా జత చేసింది: “ఆ కార్యాన్ని వాస్తవానికి రెండు [వారాల్లో] ముగించవచ్చు, కాని ఈ సందర్భంలో అది పొడిగించబడింది. ఈ స్థితిలో, పని ప్రారంభమైన కేవలం రెండు రోజుల్లోనే, సమయానికంటే ముందే పునాదులు, ఫ్రేములు, వాసాలు, పై కప్పు వేయబడ్డాయి.”
న్యూయి ద్వీపంపైనున్న వారందరూ ప్రాజెక్టును ఒకసారి చూసి, దాని నుండి గుణపాఠం నేర్చుకోవాలనే కోరికను ఒక స్థానిక వ్యాపారస్థుడు వ్యక్తపర్చాడు. మనం ప్రేమ సహకారాలతో ఏమి చేయవచ్చో ఇది ప్రతి ఒక్కరికి చూపిస్తుందని తాను నిరీక్షిస్తున్నానని ఆయన చెప్పాడు.
సమర్పణకు 204 మంది వచ్చారు. రాజ్య మందిర నిర్మాణాన్ని న్యూయి సహోదరసహోదరీలు మరియు పిల్లలు ఒక పాట, నృత్యం ద్వారా చూపించిన ఒక ప్రత్యేక ప్రదర్శన హాజరైన వారందరికీ ఎంతో పురికొల్పేదిగా ఉంది. నిర్మాణ జట్టుకు, ఈ కార్యాన్ని సాధించడానికి మనస్సులను, హృదయాలను, చేతులను పురికొల్పిన ఆయన ఆత్మను బట్టి యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయబడ్డాయి.—యెషయా 40:28-31.