పారంపర్యాచారం సత్యంతో విభేదించినప్పుడు
ప్రమాదం—ఈ నీరు త్రాగరాదు. మనమలాంటి హెచ్చరికలను ఎన్నోసార్లు చూసే ఉంటాం. విష పదార్థపు కలుషితం వలన “చేదు నీరు”గా అయిందని పిలువబడే దానిచేత కొన్ని నీటి సరఫరాలు విషపూరితమై ఉంటాయి గనుక అనేక ప్రాంతాల్లో ప్రజలు తాము త్రాగే నీరు గురించి శ్రద్ధ కలిగి ఉన్నారు. ఈ కాలుష్యం మూలంగా, “జీవాన్ని నిలిపి, కాపాడే దానిగా” ఉండే బదులు, నీరు “వ్యాధి కలిగించే సూక్ష్మక్రిములను . . . రసాయనిక కాలుష్యాలను అందించే దానిగా” అవ్వగలదని ఒక అధ్యయనం చెబుతుంది.—నీటి కాలుష్యం.
సత్య జలాలను కలుషితం చేయడం
సత్యంతో విభేదించే పారంపర్యాచారాలు కలుషితమైన నీటి సరఫరాలవంటివి. వాస్తవానికి, అబద్ధమైన, తప్పుద్రోవపట్టించే ఆలోచనలు మరియు తత్వాల యొక్క “చేదు నీటితో” కలుషితం చేయబడిన—ఒక తరంనుండి తర్వాత తరానికి అందించబడిన సమాచారం, అభిప్రాయాలు, విశ్వాసాలు లేక ఆచారాలకు—పారంపర్యాచారాలకు మనం అమాయకంగా హత్తుకొని ఉండవచ్చు. కలుషితం చేయబడిన నీటి వలె, ఇవి చెప్పలేనంత హాని—ఆత్మీయ హాని కలిగించగలవు.
మన పారంపర్యాచార మత విశ్వాసాలు బైబిలుపై ఆధారపడి ఉన్నాయని మనం భావించినప్పటికీ, వాటిని జాగ్రత్తగా పరిశీలించడానికి మనందరం సమయాన్ని తీసుకోవాలి. మార్టిన్ లూథర్ ఆనాటి పారంపర్యాచార విశ్వాసాలను హత్తుకుని కాపర్‌నికస్‌ను ఖండించినప్పుడు, తనకు బైబిలు మద్దతు ఉందని అతడు భావించాడని జ్ఞాపకముంచుకోండి. అయినప్పటికీ, “ఘనులైయుండి . . . సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు” నుండిన ప్రాచీన కాలంనాటి బెరయ వారి చక్కని ఉదాహరణను అనుసరించడంలో లూథర్ విఫలుడయ్యాడు.—అపొస్తలుల కార్యములు 17:10, 11.
పారంపర్యాచార విశ్వాసాలు, యేసు కాలంనాటి యూదులలో కొందరికి కలిగించిన హానిని గురించి ఆలోచించండి. వారి పారంపర్యాచారాలు సత్యమైనవని వారు తీవ్రంగా నమ్మారు. యేసు శిష్యులు పారంపర్యాచారాలను ఆచరించడం లేదని వారు ప్రతిఘటించినప్పుడు, ఈ ప్రశ్న వేసి యేసు వారిని సవాలు చేశాడు: “మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?” (మత్తయి 15:1-3) ఏం తప్పు జరిగింది? ప్రవక్తైన యెషయా మాటలను ఉదాహరించినప్పుడు యేసు సమస్యను గుర్తించి చూపాడు: “మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు [దేవుని] వ్యర్థముగా ఆరాధించుచున్నారు.”—ఇటాలిక్కులు మావి, మత్తయి 15:9; యెషయా 29:13.
అవును, దేవునివలన ఉద్భవించిన సత్యాల స్థానంలో, మనుష్య సంబంధమైన ఆలోచనలను, లేక, ఇంకా ఘోరంగా దయ్యాల సంబంధమైన వాటిని పెట్టారు. ఉదాహరణకు, లేఖనములపై అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 1, పేజీ 506 ఇలా వివరిస్తుంది: “ఒక వ్యక్తి, తన ఆస్తిని ‘కొరబాను,’ లేక దేవార్పితమని ఒకసారి ప్రకటిస్తే, తన తలిదండ్రులు ఎంత అవసరతల్లో ఉన్నప్పటికీ, వారి అవసరతలను తీర్చేందుకు అతను వాటిని ఉపయోగించకూడదు, అయితే అతని మరణపర్యంతం అతను ఇష్టపడితే అలాంటి సంపదను తన కొరకు మాత్రం ఉపయోగించుకోవచ్చని ఆ కాలంనాటి పరిసయ్యులు బోధించారు.” సత్యజలాలను కలుషితం చేసిన మానవ బుద్ధి, యూదుల ఆత్మీయతపై చెడు ప్రభావాన్ని చూపింది. అనేకులు, తాము ఎంతో కాలంనుండి ఎదురు చూసిన మెస్సీయను కూడా నిరాకరించారు.
క్రైస్తవమత సామ్రాజ్యం కాలుష్యాన్ని అధికం చేస్తుంది
యేసు మరణం తర్వాత అలాంటి ఆత్మీయ నష్టమే కలిగింది. ఆయన అనుచరులమని చెప్పుకున్న అనేకులు, క్రొత్త బోధలకు మౌఖిక పారంపర్యాచారం ఆధారమని భావించారు. మాక్లింటాక్ మరియు స్ట్రాంగ్ రచించిన సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్, థియోలాజికల్, అండ్ ఎక్లిసియాస్టికల్ లిటరేచర్ ప్రకారం, అలాంటి పారంపర్యాచారం, “మొదటి క్రైస్తవ చర్చీలద్వారా అపొస్తలులు నోటనుండి అందుకోబడిన సూచన, అది అపొస్తలుల కాలంనుండి అందుకొనబడినది, మరి తమ స్వంత కాలంవరకు స్వచ్ఛంగా పరిరక్షింపబడినది” అని క్రైస్తవులమని చెప్పుకునే కొందరు భావించారు.—ఇటాలిక్కులు మావి.
వాస్తవానికి ఈ పారంపర్యాచారాల్లో అనేకం అపరిశుద్ధమైన తప్పుడు ఆలోచనలు. సైక్లోపీడియా వివరిస్తున్న ప్రకారం, ఈ క్రొత్త తత్వాలు “ఇతర పారంపర్యాచారాలకే కాకుండా, వారికి అందుబాటులో ఉన్న అపొస్తలుల కచ్చితమైన వ్రాతలతో కూడా అవి భిన్నంగా ఉన్నాయి.” ఇది అసలు అపేక్షించనిదేమీ కాదు. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “ఆయనను [క్రీస్తు] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.”—కొలొస్సయులు 2:8.
నేడు కూడా, అనేక పారంపర్యాచార విశ్వాసాలు ‘అపొస్తలుల కచ్చితమైన వ్రాతలతో భిన్నంగా ఉన్నాయి.’ త్రిత్వము, నరకాగ్ని, మానవ ప్రాణం యొక్క అమర్త్యత, జాతీయత మరియు విగ్రహారాధన వంటి దయ్యాలచేత ప్రేరేపింపబడిన అనేక సిద్ధాంతాలతో క్రైస్తవమత సామ్రాజ్యం, సత్యజలాలను కలుషితం చేసింది.a (1 తిమోతి 4:1-3) క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క పారంపర్యాచార బోధలుగా మారిన దయ్యాల బోధలకు బలైన ప్రజలు, ఆత్మీయ అనారోగ్యానికి గురయ్యారని చరిత్ర సూచిస్తుంది.—యెషయా 1:4-7 పోల్చండి.
వాస్తవానికి, సత్యాన్ని అలా కలుషితం చేయడం, మానవ ఆవిర్భావంనుండి కొనసాగుతూనే ఉంది. ఏదెనులో తాను ప్రారంభించిన, ప్రజల మనస్సులను అబద్ధాలు, మోసాలతో విషపూరితం చేసే తన ప్రక్రియను సాతాను కొనసాగిస్తూనే ఉన్నాడు. (యోహాను 8:44; 2 కొరింథీయులు 11:3) నోవహు దినంనాటి జలప్రళయం తర్వాత మానవ కుటుంబం భూమంతటా వ్యాపిస్తుండగా, దయ్యాలు ప్రేరేపించిన తత్వాలు, ఆలోచనలతో మానవజ్ఞానం యొక్క చెరువులను ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేయబడిన దానికి అన్ని సంస్కృతుల ప్రజలు బలయ్యారు.
ఆత్మీయ కాలుష్యం యొక్క ప్రభావాలు
అట్టి ఆత్మీయ కాలుష్యం ఏ హానిని కలిగించవచ్చు? కలుషితమైన నీరు మన భౌతిక ఆరోగ్యంపై చూపే ప్రభావాలతో దాన్ని మనం పోల్చవచ్చు. ఒక నిపుణుడు ఇలా చెబుతున్నాడు: “కలుషితమైన నీరు చర్మంపై చూపిన ప్రభావం మూలంగా వచ్చిన సిస్టోసోమియాసిస్‌కు (బిల్‌హార్జియా) [రక్త హీనత, అసౌఖర్యం, సాధారణ అనారోగ్యం చివరకు మరణాన్ని కూడా కలిగించే స్నేల్ జ్వరానికి] దాదాపు 20 కోట్లమంది ప్రజలు గురయ్యారు. వాడుకునే నీరు పరిశుభ్రంగా లేనందువలన యాభై కోట్లమంది ప్రజలకు ట్రకోమా వచ్చింది, అది అంధత్వం వచ్చేందుకుగల ముఖ్య కారణాల్లో ఒకటి. . . . మానవజాతిలో ఇంచుమించు రెండు వందల కోట్లమంది ప్రజలకు శుభ్రమైన త్రాగే నీరు లేదు.” (మన దేశం, గ్రహం) అబద్ధమైన, దయ్యాల బోధలతో కల్తీ అయిన పారంపర్యాచారాలను అనుసరించడం మూలంగా, కోట్లాదిమంది ప్రజలు ఆత్మీయంగా బలహీనమయ్యారు, అంధులయ్యారు, చివరకు మరణించారు కూడా.—1 కొరింథీయులు 10:20, 21; 2 కొరింథీయులు 4:3, 4.
ఉదాహరణకు, యేసుక్రీస్తు మరియు ఆయన తండ్రియైన యెహోవా దేవునికి మధ్యగల సంబంధం విషయంలో అనేకులు గందరగోళం చెందుతున్నారు లేక అంధులయ్యారు. క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోంచి దేవుని పవిత్ర నామమైన యెహోవాను తీసివేయడం, క్రైస్తవులమని చెప్పుకుంటున్న కొందరికి ఒక ఆచారమైంది. జర్నల్ ఆఫ్ బిబ్లికల్ లిటరేచర్‌లో జార్జ్ హోవర్డ్ ఇలా చెబుతున్నాడు: “చతురక్షర పదాన్ని తీసివేయడం, ‘ప్రభువైన దేవుడు’ మరియు ‘ప్రభువైన క్రీస్తు’ మధ్యగల సంబంధాన్ని గురించి తొలి అన్య క్రైస్తవుల్లో గందరగోళాన్ని సృష్టించిందన్నది మా అభిప్రాయం.”
మానవ ప్రాణం అమర్త్యమైనదన్న లేఖనరహితమైన పారంపర్యాచారం కలిగించిన గందరగోళం, మూఢనమ్మకం మరియు భయాన్ని గురించి కూడా ఆలోచించండి. (ప్రసంగి 9:5; యెహెజ్కేలు 18:4 పోల్చండి.) ఎంతమంది ప్రజలు పూర్వికుల ఆరాధనకు బందీలై ఉన్నారు లేక తమకు హాని కలిగించడానికి మృతులు తిరిగి వస్తారన్న ఎడతెగని భయంతో జీవిస్తున్నారు? ప్రజలు తమను మరియు ఇతరులను చంపేందుకు కూడా ఈ విశ్వాసం వారిని ప్రోత్సహించింది.
మరణం తర్వాత తమను విడిచిన ఆత్మలు జీవాంతర లోకంలో కలుస్తాయని అనేకమంది జపానీయులు భావిస్తారు. కాబట్టి, ఆత్మహత్య చేసుకునే తలిదండ్రులు కొంతమంది, తమ పిల్లలను కూడా చంపడం శ్రేష్ఠమని భావించారు. జపానీయుల ఆలోచనా విధానాలను గూర్చిన ఆంగ్ల నిఘంటువు ఇలా వివరిస్తుంది: “జపానులో ఆత్మహత్య ఎల్లప్పుడూ ఖండించబడదు, అయితే ఒకరి ఘోర పాపం యొక్క క్షమాపణకు ఒక అంగీకారయోగ్యమైన మార్గంగా అది పరిగణింపబడుతుంది . . . చివరికి కుటుంబ ఆత్మహత్యలు కూడా జాలితో కూడిన మాటలతో నివేదించబడతాయి.”
పారంపర్యాచారాలను పరీక్షించండి
పారంపర్యాచార విశ్వాసాలను, ఆచారాలను గ్రుడ్డిగా అనుసరించడంలో ఇమిడివున్న ప్రమాదాల దృష్ట్యా, మనమేమి చేయాలి? మొదటి శతాబ్దం చివరి భాగంలో, తన తోటి క్రైస్తవులకు అపొస్తలుడైన యోహాను ఈ సలహా ఇచ్చాడు: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో [నీరు పరిశుభ్రమైనదో కాదో మీరు ఎలా పరీక్షిస్తారో అలాగే] పరీక్షించుడి.” (1 యోహాను 4:1; 1 థెస్సలొనీకయులు 5:21 కూడా చూడండి.) ఒక పారంపర్యాచారం హానికరమైనదో కాదో మీరెలా తెలుసుకుంటారు? మీరు విశ్వసించే దాన్ని పరీక్షించడానికి మీకు ఒక అధికారిక మూలం, పరిశుభ్రతకు ఒక నియమం ఉండాలి.
బైబిలు అలాంటి అధికారిక మూలమే. యేసుక్రీస్తు ఇలా పేర్కొన్నాడు: “సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.” (యోహాను 17:17) ఆయన ఇలా కూడా చెప్పాడు: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించుకాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది.” (యోహాను 4:23) దేవుని ప్రేరేపిత వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా, మానవ మరియు దయ్యాల తత్వాలచేత కలుషితమైన నీరు కాక మీరు సత్యం యొక్క పరిశుభ్రజలాలను పొందుతారు.—యోహాను 8:31, 32; 2 తిమోతి 3:16.
అతి స్వల్ప శాతం ఉన్న కల్తీ కూడా భయంకరమైన పరిణామాలను కలిగి ఉండగలదని జ్ఞాపకముంచుకోండి. ప్రభావాలు చూపబడడానికి ముందు కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు. “రోత నీరు ప్రపంచం యొక్క అత్యంత ప్రమాదకరమైన హంతకి అయ్యింది. దాన్ని ఉపయోగించడం ద్వారా ప్రతిదినం కనీసం ఇరవై ఐదు వేలమంది ప్రజలు చనిపోతున్నారు,” అని ప్రపంచ పరిరక్షక సంఘం యొక్క మాజీ అధ్యక్షుడైన శ్రీధత్ రాంపాల్ చెబుతున్నాడు. ఆత్మీయంగా కలుషితమైన పారంపర్యాచారాలు ప్రమాదకరమైనవి.
మీరు సంవత్సరాలుగా ఆచరిస్తున్న పారంపర్యాచార విశ్వాసాలు సత్యంతో విభేదిస్తున్నాయని మీరు కనుగొంటే, వాటినుండి వేరుపడేంత ధైర్యం మీకు ఉందా? హెచ్చరికలను లక్ష్యపెట్టండి. దేవుని పరిశుద్ధ వాక్యమైన సత్యంతో మీ పారంపర్యాచారాలు సామరస్యం కలిగి ఉన్నాయేమో చూసుకుని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.—కీర్తన 19:8-11; సామెతలు 14:15; అపొస్తలుల కార్యములు 17:11.
[అధస్సూచి]
a అలాంటి బోధలు బైబిలు ఆధారాన్ని కలిగిలేవనే రుజువు కొరకు లేఖనములనుండి తర్కించడము (ఆంగ్లం) చూడండి. ఈ పుస్తకం వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీచే ప్రచురింపబడింది.
[7వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యం యొక్క సత్యం పరిశుద్ధమైన, స్వచ్ఛమైన నీళ్లుగల నదివంటిది