“ఆశ్రయపురము”లోనేవుండి, జీవించండి!
“ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను.”—సంఖ్యాకాండము 35:28.
1. ప్రతీకారం తీర్చుకొనే వ్యక్తి ఎవరు, ఆయన త్వరలోనే ఏ చర్య తీసుకుంటాడు?
రక్తం విషయంలో యెహోవా తరపున ప్రతీకారం తీర్చుకొనేవాడైన యేసుక్రీస్తు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. తన దేవదూత సంబంధ పరివారంతో, ఈ ప్రతీకారం తీర్చుకొనేవాడు పశ్చాత్తాపపడకుండా రక్తాపరాధులైవున్న వారందరికి వ్యతిరేకంగా త్వరలోనే చర్య తీసుకుంటాడు. అవును, త్వరగా సమీపిస్తున్న “మహా శ్రమ” సమయంలో దేవుని తీర్పరిగా యేసు సేవచేస్తాడు. (మత్తయి 24:20, 22; యెషయా 26:21) అప్పుడు మానవజాతి తమ రక్తాపరాధం యొక్క పరిణామాలను తప్పించుకోలేదు.
2. నిజమైన ఏకైక ఆశ్రయ స్థానం ఏది, ఏ ప్రశ్నలకు సమాధానం అవసరం?
2 సూచనార్థక ఆశ్రయపురముకు నడిపే దారిపై, తమ జీవాన్ని కాపాడుకోవడానికి పరుగెత్తడమే భద్రతకు మార్గం! ఒకవేళ పురములోకి చేర్చుకోబడితే, అది మాత్రమే నిజమైన ఆశ్రయానికి స్థానం గనుక శరణార్థి అక్కడే ఉండాలి. కాని మీరిలా ఆశ్చర్యపోవచ్చు, ‘మనలో చాలామందిమి ఎన్నడూ ఎవ్వరినీ చంపలేదు గనుక, నిజంగా మనం రక్తాపరాధులమేనా? యేసు ఎందుకు ప్రతీకారం తీర్చుకొనేవాడైయున్నాడు? ఆధునిక దిన ఆశ్రయపురము ఏది? ఎవరైనా ఎన్నడైనా దాన్ని సురక్షితంగా విడిచివెళ్లగలరా?’
నిజంగా మనం రక్తాపరాధులమేనా?
3. భూమిపైనున్న కోట్లాదిమంది రక్తాపరాధంలో భాగం కలిగివున్నారని తెలుసుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలోని ఏ అంశం మనకు సహాయం చేస్తుంది?
3 భూమి పైనున్న కోట్లాదిమంది రక్తాపరాధంలో భాగం కలిగివున్నారని తెలుసుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలోని ఒక అంశం మనకు సహాయం చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులపై రక్తాపరాధం యొక్క ఒక ఉమ్మడి బాధ్యతనుంచాడు. ఎవరైనా హత్య చేయబడినట్లుగా కనుగొనబడి, హంతకుడెవరో తెలియకపోతే, ఆ స్థలానికి సమీపంలో ఉన్న నగరం ఏదో తెలుసుకోవడానికి పెద్దలు చుట్టుపట్లవున్న నగరాలకు మధ్యనున్న దూరాన్ని కొలవాలి. బహుశా రక్తాపరాధం గలదని భావించబడుతున్న ఆ నగర పెద్దలు ఆ దోషాన్ని పరిహరించడానికి, ఏ పనికి పెట్టబడని పెయ్యను తీసుకొని దున్నబడక విత్తబడకనున్న యేటి లోయలోనికి తోలుకొనిపోయి దాని మెడను విరుగతియ్యాలి. ఇది లేవీ యాజకుల ఎదుట చేయబడాలి, ‘ఎందుకంటే ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శించడానికి యెహోవా వారిని ఎంపిక చేసుకున్నాడు.’ ఆ ఊరి పెద్దలు ఆ పెయ్యపై తమ చేతులు కడుగుకొని, “మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయులమీద నిర్దోషియొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని” చెప్తారు. (ద్వితీయోపదేశకాండము 21:1-9) ఇశ్రాయేలీయుల దేశము రక్తంతో కలుషితం కాకూడదని లేదా దాని ప్రజలపైకి ఉమ్మడి రక్తాపరాధం రాకూడదని యెహోవా దేవుని ఇష్టం.
4. మహా బబులోనుకు రక్తాపరాధానికి సంబంధించిన ఏ చరిత్ర ఉంది?
4 అవును, ఉమ్మడి లేక సామాజిక రక్తాపరాధం వంటిది ఒకటుంది. అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనుపైనున్న తీవ్రమైన రక్తాపరాధాన్ని పరిశీలించండి. అంతెందుకు, అది యెహోవా సేవకుల రక్తంతో మత్తిల్లి ఉంది! (ప్రకటన 17:5, 6; 18:24) క్రైస్తవమత సామ్రాజ్య మతాలు సమాధానకర్తయగు అధిపతిని అనుసరిస్తున్నామని చెబుతారు కాని, యుద్ధాలు, మత దండయాత్రలు, మరణకరమైన మత యుద్ధాలు దానిని దేవుని ఎదుట రక్తాపరాధిని చేశాయి. (యెషయా 9:6; యిర్మీయా 2:34) వాస్తవానికి, ఈ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో కోట్లాదిమంది మరణానికి ఎక్కువ అపరాధాన్ని అదే వహించాలి. కాబట్టి, అబద్ధ మతాన్ని హత్తుకొని ఉండేవారు అలాగే మానవ యుద్ధానికి మద్దతునిచ్చేవారు మరియు దానిలో పాల్గొనేవారు దేవుని ఎదుట రక్తాపరాధులు.
5. కొంతమంది ప్రజలు ఇశ్రాయేలులోని పొరబాటున హత్య చేసిన వ్యక్తిలా ఎలా ఉన్నారు?
5 కొంతమంది ప్రజలు కావాలనే లేదా అజాగ్రత్తవల్ల మానవ మరణానికి కారణమయ్యారు. దేవుని చిత్తం అదేనని బహుశా మతనాయకులచే శోధించబడడం వల్ల ఇతరులు సామూహిక హత్యల్లో భాగం వహించారు. మరి ఇతరులు దేవుని సేవకులను హింసించి చంపారు. మనం అలాంటి పనులు చేయకపోయినప్పటికీ, మనకు దేవుని ధర్మశాస్త్రం మరియు చిత్తం తెలియదు గనుక మానవ జీవిత నష్టానికి మనకు కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. మనం పొరబాటున హత్య చేసినవాడైన, ‘అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక పొరబాటున చంపిన’ వానిలా ఉన్నాము. (ద్వితీయోపదేశకాండము 19:4) అలాంటి వ్యక్తులు దయ చూపించమని దేవున్ని వేడుకొని, సూచనార్థక ఆశ్రయపురములోకి పరుగెత్తాలి. లేకపోతే వాళ్లు ప్రతీకారం తీర్చుకొనేవానిని ఎదుర్కోవలసి వస్తుంది.
యేసు ప్రాముఖ్యమైన పాత్రలు
6. యేసు మానవజాతికి సమీప బంధువు అని ఎందుకు చెప్పవచ్చు?
6 ఇశ్రాయేలులో ప్రతీకారం తీర్చుకొనేవాడు హతుని సమీప బంధువై ఉంటాడు. భూమిపై చంపబడిన వారందరి కొరకు, ప్రాముఖ్యంగా యెహోవా యొక్క హతులైన సేవకులందరి తరపున ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రస్తుత దినంలో ప్రతీకారం తీర్చుకొనేవాడు మానవజాతి అంతటికీ సమీప బంధువై ఉండాలి. ఆ పాత్రను యేసుక్రీస్తు పూరించాడు. ఆయన పరిపూర్ణ మానవునిగా జన్మించాడు. యేసు మరణమందు తన పాపరహిత జీవాన్ని విమోచన క్రయధన బలిగా అర్పించాడు, ఆయన పరలోకానికి పునరుత్థానమైన తర్వాత, పాపులైన మరణిస్తున్న ఆదాము సంతానం కొరకు దాని విలువను దేవునికి అందజేశాడు. అలా క్రీస్తు మానవజాతి యొక్క విమోచకుడు, మన సమీప బంధువు అంటే ప్రతీకారం తీర్చుకొనే హక్కుగలవాడయ్యాడు. (రోమీయులు 5:12; 6:23; హెబ్రీయులు 10:12) యేసు తన అడుగుజాడలను అనుసరించే అభిషిక్త అనుచరులకు సహోదరునిగా గుర్తించబడ్డాడు. (మత్తయి 25:40, 45; హెబ్రీయులు 2:11-17) ఆయన భూ సంబంధ ప్రజలుగా ఆయన బలి నుండి ప్రయోజనం పొందేవారికి పరలోక రాజుగా ఆయన “నిత్యుడగు తండ్రి” అవుతాడు. వారు నిరంతరం జీవిస్తారు. (యెషయా 9:6, 7) కాబట్టి యెహోవా తగినట్లుగానే ఈ సమీప బంధువును మానవజాతి తరపున ప్రతీకారం తీర్చుకొనేవానిగా నియమించాడు.
7. గొప్ప ప్రధాన యాజకునిగా, యేసు మానవుల కొరకు ఏమి చేశాడు?
7 యేసు పాపరహితమైన, పరీక్షించబడిన, కనికరంగల ప్రధాన యాజకుడు కూడా. (హెబ్రీయులు 4:15) ఆయన ఆ సామర్థ్యంతో, పాపానికి ప్రాయశ్చిత్తం చేసే తన బలి విలువను మానవజాతికి అన్వయింపజేస్తాడు. ఆశ్రయపురములు ‘ఇశ్రాయేలీయుల కొరకు, పరదేశుల కొరకు, వారి మధ్య నివసించేవారి కొరకు’ స్థాపించబడ్డాయి. (సంఖ్యాకాండము 35:15) కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడు తన బలి విలువను మొదట తన అభిషిక్త అనుచరులైన “ఇశ్రాయేలీయులకు” అన్వయించాడు. ఇప్పుడు అది సూచనార్థక ఆశ్రయపురములో ‘పరదేశులకు’ మరియు ‘వారి మధ్య నివసించువారికి’ అన్వయింపబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ “వేరే గొఱ్ఱెలు” భూమిపై నిరంతరం జీవించడానికి నిరీక్షిస్తారు.—యోహాను 10:16; కీర్తన 37:29, 34.
నేటి ఆశ్రయపురము
8. సూచనార్థక ఆశ్రయపురము అంటే ఏమిటి?
8 సూచనార్థక ఆశ్రయపురము అంటే ఏమిటి? ఆరు ఆశ్రయపురములలో ఒకటి మరియు ఇశ్రాయేలీయుల ప్రధాన యాజకుని గృహమైన హెబ్రోనువంటి భూగోళశాస్త్ర సంబంధమైన స్థలం కాదు. నేటి ఆశ్రయపురము, రక్తం యొక్క పవిత్రతను గూర్చి దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించినందుకు వచ్చే మరణం నుండి మనల్ని కాపాడడానికి ఆయన చేసిన ఏర్పాటు. (ఆదికాండము 9:6) ఇష్టపూర్వకంగానైనా లేదా పొరబాటున అయినా ఆ ఆజ్ఞను అతిక్రమించే ప్రతి ఒక్కరు దేవుని క్షమాపణను, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసముంచడం ద్వారా తమ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని పొందాలి. పరలోక నిరీక్షణలుగల అభిషక్త క్రైస్తవులు మరియు భూ సంబంధమైన ఉత్తరాపేక్షలతో “గొప్ప సమూహము” పాపానికి ప్రాయశ్చిత్తం చేసే యేసు బలి ప్రయోజనాలను తమకు అన్వయించుకొని, సూచనార్థక ఆశ్రయపురములో ఉన్నారు.—ప్రకటన 7:9, 14; 1 యోహాను 1:7; 2:1, 2.
9. తార్సువాడైన సౌలు రక్తాన్ని గూర్చిన దేవుని ఆజ్ఞను ఎలా అతిక్రమించాడు, కాని ఆయన దృక్పథంలో మార్పును ఎలా చూపించాడు?
9 అపొస్తలుడైన పౌలు క్రైస్తవుడు కాకమునుపు రక్తాన్ని గూర్చిన ఆజ్ఞను అతిక్రమించాడు. తార్సు వాడైన సౌలుగా, యేసు అనుచరులను హింసించి, వారిని చంపడానికి అనుమతి కూడా పొందాడు. పౌలు ఇలా చెప్పాడు: “తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.” (1 తిమోతి 1:13; అపొస్తలుల కార్యములు 9:1-19) సౌలుకు పశ్చాత్తాప దృక్పథం ఉండేది, అది ఆ తర్వాత ఆయన చేసిన అనేక విశ్వాస కార్యాల ద్వారా నిరూపించబడింది. కాని సూచనార్థక ఆశ్రయపురములో ప్రవేశించాలంటే విమోచన క్రయధనమందు విశ్వాసముంచడం కంటే ఎక్కువే అవసరం.
10. మంచి మనస్సాక్షిని పొందడం ఎలా సాధ్యం, దాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి?
10 పొరబాటున హత్య చేసిన వ్యక్తి, రక్తం చిందించడం విషయంలో దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కలిగివున్నట్లుగా నిరూపించుకోగలిగితే మాత్రమే ఇశ్రాయేలు యొక్క ఆశ్రయపురములలో ఒకదానియందు ఉండగలుగుతాడు. మంచి మనస్సాక్షిని కలిగివుండడానికి, మనం యేసు బలియందు విశ్వాసముంచి, మన పాపాల గురించి పశ్చాత్తాపపడి, మన విధానాన్ని మార్చుకోవాలి. క్రీస్తు ద్వారా దేవునికి ప్రార్థనాపూర్వకమైన సమర్పణ చేసుకొని, దాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచిస్తూ, మనం మంచి మనస్సాక్షిని కోరడం అవసరం. (1 పేతురు 3:20, 21) ఈ మంచి మనస్సాక్షి మనం యెహోవాతో పరిశుభ్రమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలుకలిగిస్తుంది. దేవుడు కోరే వాటికి తగినట్లుగా ఉంటూ, సూచనార్థక ఆశ్రయపురములో చేయడానికి మనకు అప్పగింపబడిన పనిని చేయడమే ఏకైక మార్గం, ప్రాచీన ఆశ్రయపురములో శరణార్థులు కూడా ధర్మశాస్త్రానికి విధేయులై తమ పని నియామకాలను నెరవేర్చవలసి ఉండింది. యెహోవా ప్రజలకు నేడున్న ప్రాముఖ్యమైన పని రాజ్య వర్తమానాన్ని ప్రకటించడం. (మత్తయి 24:14; 28:19, 20) ఆ పని చేయడం ప్రస్తుత దిన ఆశ్రయపురములో ఉపయోగకరమైన నివాసులుగా ఉండడానికి మనకు సహాయం చేస్తుంది.
11. మనం నేటి ఆశ్రయపురము లోపలే సురక్షితంగా ఉండాలంటే దేన్ని విసర్జించాలి?
11 నేటి ఆశ్రయపురములను విడిచిపెట్టడమంటే మనల్ని మనం నాశనానికి గురిచేసుకోవడమే, ఎందుకంటే ప్రతీకారం తీర్చుకొనేవాడు త్వరలోనే రక్తాపరాధులకందరికి వ్యతిరేకంగా చర్య తీసుకుంటాడు. ఈ సురక్షితమైన నగరం వెలుపల లేదా దాని మైదానాల పొలిమేరల దగ్గర ప్రమాదకరమైన స్థలంలో దొరికిపోవడానికి ఇది సమయం కాదు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసే ప్రధాన యాజకుని బలియందు మనం విశ్వాసాన్ని కోల్పోతే మనం సూచనార్థక ఆశ్రయపురము వెలుపల ఉండిపోతాం. (హెబ్రీయులు 2:1; 6:4-6) ఒకవేళ మనం లోకసంబంధమైన విధానాలను అనుసరిస్తూ, యెహోవా సంస్థలో పూర్తిగా ఇమిడి ఉండకపోతే, లేక మన పరలోక తండ్రి యొక్క నీతియుక్తమైన కట్టడల నుండి దారితప్పిపోతే, మనం కూడా సురక్షితంగా ఉండలేం.—1 కొరింథీయులు 4:4.
ఆశ్రయపురము నుండి స్వతంత్రులగుట
12. మునుపు రక్తాపరాధులుగా ఉన్నవారు సూచనార్థక ఆశ్రయపురములో ఎంతకాలం ఉండాలి?
12 ఇశ్రాయేలులో పొరబాటున హత్య చేసిన వ్యక్తి “ప్రధానయాజకుడు మృతినొందువరకు” ఆశ్రయపురములోనే ఉండాలి. (సంఖ్యాకాండము 35:28) కాబట్టి మునుపు రక్తాపరాధులుగా ఉన్నవాళ్లు సూచనార్థక ఆశ్రయపురములో ఎంతకాలం ఉండాలి? ప్రధానయాజకుడైన యేసుక్రీస్తు సేవలు తమకు ఇక అవసరం ఉండనంతవరకు అందులో ఉండాలి. పౌలు ఇలా చెప్పాడు: “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చు . . . వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.” (హెబ్రీయులు 7:25) పాపం మరియు గత రక్తాపరాధపు మరకలేవైనా ఉన్నంత వరకు, అపరిపూర్ణ మానవులు దేవుని ఎదుట నీతిగల స్థానాన్ని కలిగివుండడానికి ప్రధాన యాజకుని సేవలు అవసరమౌతాయి.
13. ప్రస్తుత దిన “ఇశ్రాయేలీయులు” ఎవరు, వారు “ఆశ్రయపురములో” ఎంతకాలం ఉండాలి?
13 ప్రాచీన ఆశ్రయపురములు “ఇశ్రాయేలీయుల” కొరకు, పరదేశుల కొరకు, వారి మధ్య నివసించువారి కొరకు స్థాపించబడ్డాయని గుర్తుంచుకోండి. “ఇశ్రాయేలీయులు” ఆత్మీయ ఇశ్రాయేలీయులు. (గలతీయులు 6:16) వాళ్లు భూమిపై నివసించినంత కాలం సూచనార్థక ఆశ్రయపురములోనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఇంకా అపరిపూర్ణ శరీరంలోనే ఉన్నారు కాబట్టి వారికి పరలోక ప్రధాన యాజకుని ప్రాయశ్చిత్త విలువ అవసరం. కాని ఈ అభిషిక్త క్రైస్తవులు మరణించి పరలోకంలో ఆత్మసంబంధమైన జీవానికి పునరుత్థానం చేయబడినప్పుడు, వారికి ఇక ప్రధానయాజకుని ప్రాయశ్చిత్త సేవలు అవసరం ఉండవు ఎందుకంటే వారు శరీరాన్ని అలాగే దాన్ని అంటుకొనివున్న రక్తాపరాధాన్ని శాశ్వతంగా విడిచిపెడ్తారు. పునరుత్థానం చేయబడిన అలాంటి అభిషక్తులకు, ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్తం చేసే, భద్రత కలుగజేసే సామర్థ్యం విషయంలో మరణించినట్లే.
14. పరలోక ఉత్తరాపేక్షలుగల వారు ఇప్పుడు నేటి ఆశ్రయపురములోనే ఎందుకు ఉండాలి?
14 పరలోకంలో “క్రీస్తుతోడి వారసు”లుగా ఉండేవారు మరణమందు తమ భూ జీవితాన్ని నమ్మకంగా ముగించే వరకు సూచనార్థక ఆశ్రయపురములోనే ఉండడానికి మరో లేఖనాధార కారణం కూడా ఉంది. వాళ్లు మరణించినప్పుడు, వారు మానవ స్వభావాన్ని శాశ్వతంగా త్యాగం చేస్తారు. (రోమీయులు 8:17; ప్రకటన 2:10) కేవలం మానవ స్వభావం ఉన్న వారికే యేసు బలి వర్తిస్తుంది. కాబట్టి, ఆ ఆత్మీయ ఇశ్రాయేలీయులు “దేవస్వభావమునందు పాలివారగునట్లు” పరలోకంలో నిరంతరం జీవించడానికి ఆత్మ సంబంధమైన ప్రాణులుగా పునరుత్థానం చేయబడినప్పుడు ప్రధాన యాజకుడు వారి విషయంలో మరణిస్తాడు.—2 పేతురు 1:4.
15. ఆధునిక దిన ‘పరదేశులు’ మరియు ‘వారిమధ్య నివసించువారు’ ఎవరు, వారి విషయంలో గొప్ప ప్రధానయాజకుడు ఏమి చేస్తాడు?
15 ఆధునిక దిన ‘పరదేశులు’ మరియు ‘వారి మధ్య నివసించువారి’ విషయంలో, వారు సూచనార్థక ఆశ్రయపురమును విడిచిపెట్టడానికి అనుమతిస్తూ ప్రధాన యాజకుడు ఎప్పుడు ‘మృతి నొందుతాడు?’ గొప్ప సమూహం యొక్క ఈ సభ్యులు మహా శ్రమ తర్వాత వెంటనే ఈ ఆశ్రయపురములో నుండి బయటికి రాలేరు. ఎందుకని? ఎందుకంటే వాళ్లు ఇంకా తమ అపరిపూర్ణ, పాపయుక్తమైన శరీరంలోనే ఉన్నందున, ప్రధాన యాజకుని భద్రత క్రింద ఉండవలసి ఉంటుంది. ఆయన రాజరిక మరియు యాజకత్వ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఆయన ప్రాయశ్చిత్త సేవలను తమకు అన్వయించుకోవడం ద్వారా, వాళ్లు మానవ పరిపూర్ణతను పొందుతారు. వెయ్యేండ్ల ముగింపులో, సాతానును అతని దయ్యాలను కొంత కాలం వరకు విడిచిపెట్టడం ద్వారా తమ యథార్థతను గూర్చిన అంతిమ, శాశ్వత నిర్ణయాత్మకమైన పరీక్ష కొరకు అప్పుడు యేసు వారిని దేవునికి అప్పగిస్తాడు. యెహోవా వారిని నీతిమంతులుగా ప్రకటిస్తాడు. అలా వాళ్లు మానవ పరిపూర్ణత యొక్క సంపూర్ణతకు చేరుకుంటారు.—1 కొరింథీయులు 15:28; ప్రకటన 20:7-10.a
16. మహాశ్రమను తప్పించుకొనేవారికి ప్రధాన యాజకుని ప్రాయశ్చిత్త సేవలు ఎప్పుడు ఇక అవసరం ఉండవు?
16 కాబట్టి, అప్పుడు మహా శ్రమను తప్పించుకొనేవారు, క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలన ముగింపు సమయానికి మానవ పరిపూర్ణతకు తీసుకురాబడే వరకు సూచనార్థక ఆశ్రయపురములోనే ఉండడం ద్వారా వాళ్లు మంచి మనస్సాక్షిని కలిగివుండాలి. పరిపూర్ణులైన మానవులుగా, వారికి ప్రధానయాజకుని ప్రాయశ్చిత్త సేవలు అవసరం ఉండవు మరియు వారు ఆయన భద్రత నుండి వెలుపలికి వస్తారు. అప్పుడు యేసు వారి విషయంలో ప్రధాన యాజకునిగా మరణిస్తాడు, ఎందుకంటే ఆయన ఇక శుభ్రం చేసే తన బలి రక్తం ద్వారా వారి తరపున చర్య తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ సమయంలో వారు సూచనార్థక ఆశ్రయపురమును విడిచిపెడతారు.
17. క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో పునరుత్థానం చేయబడేవారు సూచనార్థక ఆశ్రయపురములో ప్రవేశించి, అక్కడే ఉండడం ఎందుకు అవసరం ఉండదు?
17 యేసు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో పునరుత్థానం చేయబడేవారు సూచనార్థక ఆశ్రయపురములోకి ప్రవేశించి, ప్రధాన యాజకుని మరణం వరకు అక్కడే ఉండాలా? అవసరం లేదు, ఎందుకంటే మరణించడం ద్వారా వారు తమ పాపానికి పరిహారం చెల్లించారు. (రోమీయులు 6:7; హెబ్రీయులు 9:27) అయినప్పటికీ, ప్రధాన యాజకుడు, వారు పరిపూర్ణతకు చేరడానికి వారికి సహాయం చేస్తాడు. వెయ్యేండ్ల పరిపాలన తర్వాత వారు అంతిమ పరీక్షలో విజయవంతంగా సఫలులైతే, భూమిపై నిత్యజీవాన్ని హామీ ఇస్తూ, దేవుడు వారిని నీతిమంతులుగా కూడా ప్రకటిస్తాడు. అయితే, దేవుని కట్టడలకు తగినట్లుగా ఉండడంలో విఫలమవ్వడం, యథార్థపరులుగా అంతిమ పరీక్షలో సఫలులు కాలేకపోయే ఏ మానవులకైనా నిందాకరమైన తీర్పును, నాశనాన్ని తెస్తుంది.
18. యేసు యొక్క రాజరికం మరియు యాజకత్వాలకు సంబంధించి, మానవజాతితో నిరంతరం ఏమి ఉంటుంది?
18 ఇశ్రాయేలు ప్రధాన యాజకులు చివరికి మరణించారు. కాని యేసు “నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడై”నాడు. (హెబ్రీయులు 6:19, 20; 7:3) కాబట్టి మానవజాతికి మధ్యవర్తిత్వం నిర్వహించే ప్రధాన యాజకునిగా యేసు పని ముగియడం ఆయన జీవితానికి ముగింపును తీసుకురాదు. రాజుగా, ప్రధాన యాజకునిగా ఆయన సేవ యొక్క మంచి ప్రభావాలు మానవజాతితో నిరంతరం ఉంటాయి, ఈ స్థానాలలో ఆయన చేసిన సేవలకు మానవులు నిరంతరం ఆయనకు ఋణపడి ఉంటారు. అంతేగాక, యెహోవాకు చేసే స్వచ్ఛారాధనలో యేసు నిరంతరం నాయకత్వం వహిస్తాడు.—ఫిలిప్పీయులు 2:5-11.
మన కొరకు విలువైన పాఠాలు
19. ఆశ్రయపురముల ఏర్పాటు నుండి ద్వేషం మరియు ప్రేమకు సంబంధించి ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు?
19 ఆశ్రయపురముల ఏర్పాటు నుండి మనం వివిధ పాఠాలు నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, తాను చంపిన వ్యక్తి ఎడల మరణకరమైన ద్వేషం గల ఏ హంతకుడూ ఆశ్రయపురములో ఉండడానికి అనుమతించబడడు. (సంఖ్యాకాండము 35:20, 21) కాబట్టి సూచనార్థక ఆశ్రయపురములో ఉండే ఎవరైనా తన సహోదరుని ఎడల తన హృదయంలో ద్వేషం పెరగడానికి ఎలా అనుమతించగలడు? అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.” కాబట్టి మనం “ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది.”—1 యోహాను 3:15; 4:7.
20. సూచనార్థక ఆశ్రయపురములో ఉండేవారు, ప్రతిహత్య చేసేవాని నుండి రక్షణ కొరకు ఏమి చేయాలి?
20 పొరబాటున హత్య చేసిన వ్యక్తి ప్రతీకారం తీర్చుకొనేవాని నుండి రక్షణ కొరకు, ఆశ్రయపురములోనే ఉండి, దాని మైదానాలను దాటి పోకుండా చూసుకోవాలి. సూచనార్థక ఆశ్రయపురములో ఉండే వారి విషయం ఏమిటి? గొప్ప ప్రతీకారం తీర్చుకొనేవాని నుండి భద్రత కొరకు, వారు నగరాన్ని విడిచి వెళ్లకూడదు. వాస్తవానికి, ఒక విధంగా చెప్పాలంటే, మైదానాల పొలిమేర వరకు వెళ్లాలని కలిగే శోధనల గురించి వారు జాగ్రత్తగా ఉండాలి. తమ హృదయాల్లో సాతాను ప్రపంచం ఎడల ప్రేమ పెంపొందకుండా వారు శ్రద్ధ వహించాలి. దీనికి ప్రార్థన మరియు ప్రయత్నం అవసరం కావచ్చు, కాని వారి జీవితాలు దానిపైనే ఆధారపడి ఉన్నాయి.—1 యోహాను 2:15-17; 5:19.
21. నేటి ఆశ్రయపురములో ఉన్నవారు ఏ ప్రతిఫలదాయకమైన పనిని చేస్తున్నారు?
21 ప్రాచీన ఆశ్రయపురములలో పొరబాటున హత్యచేసిన వ్యక్తులు ఫలవంతమైన పనివారిగా ఉండాలి. అలాగే, అభిషిక్తులైన “ఇశ్రాయేలీయులు” కోతపనివారిగా, రాజ్య ప్రచారకులుగా మంచి మాదిరినుంచారు. (మత్తయి 9:37, 38; మార్కు 13:10) నేటి ఆశ్రయపురములలో ‘పరదేశులుగా’ మరియు ‘వారి మధ్యన నివసించువారిగా’, భూసంబంధ ఉత్తరాపేక్షలు గల క్రైస్తవులు ఇంకా భూమిపై మిగిలివున్న అభిషిక్తులతో కలిసి జీవాన్ని రక్షించే ఈ పనిని చేసే ఆధిక్యతను పొందారు. ఇది ఎంతటి ప్రతిఫలదాయకమైన పని! సూచనార్థక ఆశ్రయపురములో నమ్మకంగా పనిచేస్తున్నవారు ప్రతీకారం తీర్చుకొనేవాని చేతుల్లో నిత్య మరణం పొందడాన్ని తప్పించుకొంటారు. బదులుగా దేవుని గొప్ప ప్రధాన యాజకునిగా ఆయన సేవ నుండి నిత్య ప్రయోజనాలను పొందుతారు. మీరు ఆశ్రయపురములో ఉండి నిరంతరం జీవిస్తారా?
[అధస్సూచి]
a కావలికోట (ఆంగ్లం) డిశంబరు 15, 1991, 12వ పేజీలోని, 15, 16 పేరాలను చూడండి.
మీరెలా సమాధానమిస్తారు?
◻ భూమిపైనున్న కోట్లాదిమంది రక్తాపరాధులని ఎందుకు చెప్పవచ్చు?
◻ మానవజాతికి సంబంధించి యేసుక్రీస్తు ఏయే పాత్రలను నిర్వహించవలసి ఉంది?
◻ సూచనార్థక ఆశ్రయపురము ఏది, దానిలోకి ఒకరు ఎలా ప్రవేశించవచ్చు?
◻ సూచనార్థక ఆశ్రయపురము నుండి ప్రజలు ఎప్పుడు స్వతంత్రులౌతారు?
◻ ఆశ్రయపురముల ఏర్పాటు నుండి ఏ విలువైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
యేసుక్రీస్తు ఏ ప్రాముఖ్యమైన పాత్రలను నిర్వహిస్తున్నాడో మీకు తెలుసా?