ఆశ్రయపురములు—దేవుని దయాపూర్వక ఏర్పాటు
“పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు . . . ఆశ్రయమైయుండును.”—సంఖ్యాకాండము 35:15.
1. జీవం మరియు రక్తాపరాధం గురించి దేవుని దృక్కోణం ఏమిటి?
యెహోవా దేవుడు మానవ జీవాన్ని పరిశుద్ధమైనదిగా పరిగణిస్తున్నాడు. రక్తంలో జీవం ఉంది. (లేవీయకాండము 17:11, 14) భూమిపై జన్మించిన మొదటి మానవుడైన కయీను, తన తమ్ముడైన హేబెలును హత్య చేయడం ద్వారా తనపైకి రక్తాపరాధం తెచ్చుకున్నాడు. తత్ఫలితంగా, దేవుడు కయీనుతో ఇలా చెప్పాడు: “నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది.” హత్యా స్థలంలో నేలను తడిపిన రక్తము మౌనముద్రను దాల్చినా, క్రూరంగా త్రుంచివేయబడిన జీవానికి శక్తివంతమైన సాక్ష్యంగా ఉంది. హేబెలు రక్తం న్యాయం తీర్చమని దేవున్ని కోరింది.—ఆదికాండము 4:4-11.
2. జలప్రళయం తర్వాత, జీవం ఎడల యెహోవాకున్న గౌరవం ఎలా నొక్కి తెలియజేయబడింది?
2 నీతిమంతుడైన నోవహు మరియు ఆయన కుటుంబం భూవ్యాప్త జలప్రళయాన్ని తప్పించుకొని ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత మానవ జీవం ఎడల దేవునికున్న గౌరవం నొక్కి తెలియజేయబడింది. ఆ సమయంలో యెహోవా మానవ ఆహారంలో జంతు మాంసాన్ని కూడా చేర్చాడు, కాని రక్తాన్ని మాత్రం చేర్చలేదు. ఇంకా ఆయనిలా ఆజ్ఞాపించాడు: “మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును; ప్రతినరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆదికాండము 9:5, 6) హతుని కనుగొన్న తర్వాత, ప్రతిహత్య చేసేందుకు హతుని సమీప బంధువుకున్న హక్కును యెహోవా గుర్తించాడు.—సంఖ్యాకాండము 35:19.
3. జీవం యొక్క పవిత్రత గురించి మోషే ధర్మశాస్త్రం ఎలా నొక్కి తెలియజేసింది?
3 ప్రవక్తయైన మోషే ద్వారా ఇశ్రాయేలీయులకివ్వబడిన ధర్మశాస్త్రంలో, జీవం యొక్క పవిత్రత పదే పదే నొక్కి తెలియజేయబడింది. ఉదాహరణకు, దేవుడిలా ఆజ్ఞాపించాడు: “నరహత్య చేయకూడదు.” (నిర్గమకాండము 20:13) గర్భిణీ స్త్రీ విషయంలో సంభవించిన మరణకరమగు ఆపద గురించి మోషే ధర్మశాస్త్రం చెప్పిన దానిలో కూడా జీవం ఎడల గల గౌరవం స్పష్టపర్చబడింది. ఇద్దరు పురుషుల మధ్య జరుగుతున్న ఘర్షణ ఫలితంగా ఆమెకు గాని, ఆమె గర్భస్థ శిశువుకుగాని ప్రాణాంతకమైన ఆపద సంభవిస్తే, న్యాయాధిపతులు పరిస్థితులను, ఎంత మేరకు కావాలని చేశారు అనేది పరిశీలించాలని, కాని దానికి పరిహారం మాత్రం “ప్రాణమునకు ప్రాణము,” లేదా జీవానికి జీవం అని ధర్మశాస్త్రం తెలియజేసింది. (నిర్గమకాండము 21:22-25) అయితే, ఇశ్రాయేలీయుడైన హంతకుడు తన దౌర్జన్యపూరిత చర్య ఫలితంగా ఏర్పడే పరిణామాలను తప్పించుకోగలడా?
హంతకులకు రక్షక స్థానమా?
4. ఇశ్రాయేలు వెలుపల, గతంలో ఏ శరణార్థ స్థలాలుండేవి?
4 ఇశ్రాయేలు కాని ఇతర జనాంగాలలో, హంతకులకు మరియు ఇతర నేరస్థులకు అభయగృహం లేదా శరణార్ధస్థలం కేటాయించబడేది. ప్రాచీన ఎఫెసులో అర్తెమిదేవి ఆలయం వంటి స్థలాలు అలాంటివే. అలాంటి స్థలాల గురించి ఇలా నివేదించబడింది: “కొన్ని ఆలయాలు నేరస్థులకు సంరక్షక స్థలాలుగా ఉండేవి; శరణార్థ స్థలాల సంఖ్యను పరిమితం చేయడం కూడా తరచూ అవసరమయ్యేది. ఏథెన్సులో అలాంటి కొన్ని శరణార్థ స్థలాలను మాత్రమే చట్టం ఆశ్రయపురములుగా గుర్తించింది (ఉదాహరణకు, తెసస్ ఆలయాన్ని బానిసల కొరకు); తిబెరు కాలంలో, ఆలయాల్లో ఉండే నేరస్థుల సంఘాలు ఎంతో ప్రమాదకరమైనవిగా తయారవ్వడంతో, (22వ సంవత్సరంలో) శరణమిచ్చే హక్కు కేవలం కొన్ని పట్టణాలకే పరిమితం చేయబడింది.” (ది జువిష్ ఎన్‌సైక్లోపీడియా, 1909, రెండవ సంపుటి, 256వ పేజీ) ఆ తర్వాత, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు శరణార్థ స్థలాలుగా తయారయ్యాయి, కాని ఇది అధికారాన్ని పౌర అధికారుల నుండి యాజకత్వానికి బదిలీ చేస్తూ, సరైన న్యాయం జరుగకపోవడానికి కారణమైంది. చర్చి శరణార్థ స్థలాలు చేస్తున్న దుర్వినియోగం చివరికి ఈ ఏర్పాటును నిర్మూలించడానికి నడిపించింది.
5. ఎవరైనా హత్య చేయబడినప్పుడు, దయ చూపించడానికి నిర్లక్ష్యాన్ని ఒక సాకుగా తీసుకోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించదనడానికి ఏ సాక్ష్యాధారం ఉంది?
5 ఇశ్రాయేలీయులలో, కావాలని హత్య చేసినవారికి అభయగృహం లేక శరణార్థ స్థలం కేటాయింపబడేది కాదు. దేవుని బలిపీఠం వద్ద సేవ చేసే లేవీయుడైన యాజకుడైనప్పటికీ, కావాలని హత్య చేస్తే శిక్షించడానికి తీసుకుపోబడేవాడు. (నిర్గమకాండము 21:12-14) అంతేగాక, ఎవరైనా చంపబడినప్పుడు, నిర్లక్ష్యం వల్ల జరిగినదాని ఎడల దయచూపించడానికి ధర్మశాస్త్రం అనుమతించేదికాదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన క్రొత్త ఇంటి పైకప్పు చుట్టు పిట్టగోడ కట్టించాలి. లేకపోతే, ఎవరైనా ఆ కప్పుపై నుండి పడి మరణిస్తే, రక్తాపరాధం ఆ ఇంటిమీదికి వస్తుంది. (ద్వితీయోపదేశకాండము 22:8) అంతేగాక, ఆ ఎద్దు పొడిచేదని ఎద్దు యజమానికి తెలిసినప్పటికీ, ఆ వ్యక్తి దాన్ని కట్టుదిట్టంగా ఉంచుకోకపోతే, అది ఎవరినైనా చావపొడిస్తే, ఆ ఎద్దు యజమాని రక్తాపరాధి అవుతాడు, అతనికి మరణశిక్ష విధించబడగలదు. (నిర్గమకాండము 21:28-32) దొంగను ఎవరైనా చచ్చేలా కొడితే, ఆ దొంగను చూసి గుర్తించేలా ఒకవేళ అది పగటిపూట జరిగితే కొట్టినవాడు రక్తాపరాధి అవుతాడు, జీవం ఎడల దేవునికున్న ఉన్నతమైన భావానికి ఇది మరో సాక్ష్యాధారం. (నిర్గమకాండము 22:2, 3) కాబట్టి, పరిపూర్ణంగా సమతూకం చేయబడిన దేవుని కట్టడలు, ఉద్దేశపూర్వకంగా హత్య చేసినవారు మరణకరమగు శిక్షను పొందకుండా తప్పించుకోవడానికి అనుమతించవన్నది స్పష్టమౌతుంది.
6. ప్రాచీన ఇశ్రాయేలులో ‘జీవానికి జీవం’ అనే చట్టం ఎలా నెరవేర్చబడేది?
6 ప్రాచీన ఇశ్రాయేలులో ఒక హత్య జరిగినట్లయితే, హతుని రక్తానికి న్యాయం తీర్చబడవలసిందే. హంతకుడు “రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకొను” వాని ద్వారా చంపబడినప్పుడు, ‘జీవానికి జీవం’ అనే చట్టం సరిగా నెరవేర్చబడుతుంది. (సంఖ్యాకాండము 35:19, NW) ప్రతీకారం తీర్చుకొనేవాడు హతుని సమీప బంధువైన పురుషుడై ఉంటాడు. కాని పొరబాటున హత్యచేసిన వారి మాటేమిటి?
యెహోవా దయాపూర్వక ఏర్పాటు
7. పొరబాటున ఎవరినైనా హత్య చేసినవారి కొరకు దేవుడు ఏ ఏర్పాటు చేశాడు?
7 అనుకోకుండా లేక పొరబాటున ఎవరినైనా హత్యచేసిన వారికొరకు, దేవుడు ప్రేమపూర్వకంగా ఆశ్రయపురములను ఏర్పాటు చేశాడు. వీటి గురించి, మోషేకిలా చెప్పబడింది: “నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. మీరు యొర్దాను దాటి కనానుదేశములోనికి వెళ్లిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకు వాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు [“రక్తం విషయంలో ప్రతీకారం తీర్చుకొనువాడు,” NW] రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురములుండవలెను. వాటిలో యొర్దాను ఇవతల మూడు పురములను ఇయ్యవలెను, కనాను దేశములో మూడు పురములను ఇయ్యవలెను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు . . . ఆశ్రయమైయుండును.”—సంఖ్యాకాండము 35:9-15.
8. ఆశ్రయపురములు ఎక్కడ నెలకొల్పబడ్డాయి, వాటిని చేరడానికి పొరబాటున హత్య చేసినవారికి ఎలా సహాయం అందజేయబడేది?
8 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు, వారు విధేయతగా ఆరు ఆశ్రయపురములను స్థాపించారు. వీటిలో మూడు పురములు—కెదెషు, షెకెము, హెబ్రోను—యొర్దాను నదికి పడమటివైపున ఉండేవి. యొర్దానుకు తూర్పు వైపున గోలాను, రామోతు, బేసెరు ఆశ్రయపురములు ఉండేవి. మంచి స్థితిలో ఉండే మార్గాలుగల అనువైన స్థలంలో ఈ ఆరు ఆశ్రయపురములు ఉండేవి. ఈ మార్గాల వెంబడి తగిన స్థలాల్లో, “ఆశ్రయం” అనే పదం వ్రాసివున్న సూచనలుండేవి. ఈ సూచనలు ఆశ్రయపురము ఎటువైపు ఉందో చూపించేవి, పొరబాటున హత్యచేసిన వ్యక్తి తన జీవాన్ని కాపాడుకోవడానికి సమీపంలో ఉన్నదాని దగ్గరకు పరుగెత్తేవాడు. అక్కడ అతడు ప్రతీకారం తీర్చుకొనేవాని నుండి రక్షణ పొందగలిగేవాడు.—యెహోషువ 20:2-9.
9. యెహోవా ఆశ్రయపురములను ఎందుకు ఏర్పాటు చేశాడు, అవి ఎవరి ప్రయోజనార్థం ఏర్పాటు చేయబడ్డాయి?
9 దేవుడు ఆశ్రయపురములను ఎందుకు ఏర్పాటు చేశాడు? నిరపరాధ రక్తంతో దేశం కలుషితం గావించబడకుండేలా, ప్రజలపైకి రక్తాపరాధం రాకుండేలా అవి ఏర్పాటు చేయబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 19:10) ఎవరి ప్రయోజనం కొరకు ఆశ్రయపురములు ఏర్పాటు చేయబడ్డాయి? ధర్మశాస్త్రం ఇలా తెలియజేసింది: “పొరబాటున ఒకని చంపిన యెవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ ఆరు పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించువారికిని ఆశ్రయమైయుండును.” (సంఖ్యాకాండము 35:15) దయ చూపిస్తూ, అదే సమయంలో నిష్పక్షపాతంగా మరియు యథార్థంగా న్యాయం తీర్చడానికి, (1) స్థానిక ఇశ్రాయేలీయులలో, (2) పరదేశులలో, లేదా (3) వారి మధ్య నివసిస్తున్న వారిలో పొరబాటున హత్యచేసిన వారి కొరకు ఆశ్రయపురములను స్థాపించమని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు.
10. ఆశ్రయపురములు దేవుడు చేసిన దయాపూర్వక ఏర్పాటని ఎందుకు చెప్పవచ్చు?
10 పొరబాటున హత్యచేసిన వ్యక్తి కూడా దేవుని యొక్క ఈ ఆజ్ఞ ప్రకారం మరణశిక్ష పొందాలన్నది గమనించదగిన విషయం: “నరుని రక్తము చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును.” కాబట్టి, యెహోవా దేవుడు చేసిన దయాపూర్వక ఏర్పాటు మూలంగా మాత్రమే, పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురములలో ఒకదానిలోకి పారిపోగలడు. స్పష్టంగా, ప్రతీకారం తీర్చుకొనేవాని నుండి పారిపోయే వాని ఎడల ప్రజలు సాధారణంగా కనికరం చూపేవారు, ఎందుకంటే తాము కూడా పొరబాటున అలాంటి తప్పే చేస్తే, ఆశ్రయం మరియు దయ అవసరం కాగలవని వారందరికీ తెలుసు.
ఆశ్రయం కొరకు పారిపోవడం
11. ప్రాచీన ఇశ్రాయేలులో, ఒక వ్యక్తి అనుకోకుండా తోటి పనివాన్ని చంపితే, అతడు ఏమి చేయవచ్చు?
11 ఒక ఉపమానం, ఆశ్రయం కొరకైన దేవుని దయాపూర్వక ఏర్పాటు ఎడల మీ మెప్పును పెంపొందింపజేయగలదు. ప్రాచీన ఇశ్రాయేలులో మీరొక కట్టెలు కొట్టే వ్యక్తి అనుకోండి. ఒకవేళ మీ గొడ్డలి పిడి ఊడి, ఎగిరివెళ్లి తోటి పనివానికి తగిలిందనుకోండి. మీరేం చేస్తారు? ఈ పరిస్థితి కొరకే ధర్మశాస్త్రం ఒక ఏర్పాటు చేసింది. నిస్సందేహంగా, దేవుడు చేసిన ఈ ఏర్పాటు నుండి మీరు ప్రయోజనం పొందుతారు: “[ఒక ఆశ్రయపురానికి] పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక, పొరబాటున వాని చంపిన యెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయిన యెడల, . . . ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.” (ద్వితీయోపదేశకాండము 19:4-6) అయితే, మీరు ఒక ఆశ్రయపురానికి వెళ్లినప్పటికీ, జరిగిన దాని బాధ్యత నుండి మీరు పూర్తిగా స్వతంత్రులు కారు.
12. పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురానికి చేరిన తర్వాత ఏ పద్ధతి అవలంబించబడుతుంది?
12 మీరు ఆదరంగా స్వీకరించబడినప్పటికీ, మీరు ఆశ్రయపుర ద్వారం వద్ద పెద్దలతో మీ ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పవలసి ఉంటుంది. పురములోకి ప్రవేశించిన తర్వాత, హత్య జరిగిన స్థలం ఏ చట్టపరిధిలోకి వస్తుందో ఆ పరిధిలోని పురద్వారం దగ్గరనున్న ఇశ్రాయేలు సంఘానికి ప్రాతినిథ్యం వహించే పెద్దల ఎదుట న్యాయవిచారణకు మీరు వెళ్లవలసి ఉంటుంది. అక్కడ మీరు మీ నిర్దోషత్వాన్ని రుజువు చేసుకొనే అవకాశం మీకు లభిస్తుంది.
హంతకులకు న్యాయవిచారణ జరిగేటప్పుడు
13, 14. హంతకుని న్యాయవిచారణ సమయంలో పెద్దలు నిశ్చయపర్చుకోవలసిన కొన్ని విషయాలు ఏవి?
13 సమాజపు ద్వారమునొద్ద పెద్దల ఎదుట న్యాయవిచారణ జరిగేటప్పుడు, మీ గత ప్రవర్తనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడడాన్ని మీరు నిస్సందేహంగా కృతజ్ఞతతో గమనిస్తారు. మరణించిన వ్యక్తితో మీకున్న సంబంధాన్ని పెద్దలు జాగ్రత్తగా తూచిచూస్తారు. మీరు ఆ వ్యక్తిని ద్వేషిస్తూ, అతని కొరకు పొంచివుండి అతన్ని కావాలని చచ్చేలా కొట్టారా? అలాగైతే పెద్దలు మిమ్మల్ని ప్రతీకారం తీర్చుకొనేవానికి అప్పగించాలి, అప్పడు మీరు మరణిస్తారు. ‘ఇశ్రాయేలీయుల మధ్య నుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలసిన’ ధర్మశాస్త్రం కోరేదాని గురించి బాధ్యతగల ఈ పురుషులకు తెలిసి ఉంటుంది. (ద్వితీయోపదేశకాండము 19:11-13) పోల్చదగినట్లుగా, నేడు ఒక న్యాయ విచారణలో, క్రైస్తవ పెద్దలు లేఖనాలను బాగా ఎరిగి ఉండాలి, తప్పు చేసిన వ్యక్తి గత దృక్పథాన్ని మరియు ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటూ అదే సమయంలో వారు లేఖనాలకు అనుగుణంగా చర్య గైకొనాలి.
14 దయాపూర్వకంగా పరిశోధిస్తూ, పుర పెద్దలు మరణించిన వ్యక్తిని మీరు పగతో వెంటాడి హత్య చేశారా అనేది తెలుసుకోవాలనుకుంటారు. (నిర్గమకాండము 21:12, 13) మీరు అతన్ని చాటున పొంచివుండి కొట్టారా? (ద్వితీయోపదేశకాండము 27:24) ఆ వ్యక్తి ఎడల మీరు ఎంతో ఆగ్రహం కలిగివుండి, అతన్ని చంపడానికి మీరు ఏదైనా కుయుక్తితో కూడిన పథకం వేశారా? అలాగైతే, మీరు మరణించడానికి అర్హులు. (నిర్గమకాండము 21:14) ప్రాముఖ్యంగా, మరణించిన వ్యక్తికీ మీకు మధ్యన శత్రుత్వం లేదా ద్వేషం ఉండినదా అన్నది పెద్దలు తెలుసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 19:4, 6, 7; యెహోషువ 20:5) మీరు నిర్దోషులని తెలుసుకొని పెద్దలు మిమ్మల్ని ఆశ్రయపురానికి పంపించారనుకుందాము. మీపై చూపబడిన దయకు మీరెంత కృతజ్ఞత కలిగివుంటారో కదా!
ఆశ్రయపురములో జీవితం
15. పొరబాటున హత్య చేసిన వ్యక్తి నుండి ఏమి కోరబడుతుంది?
15 పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురములోనే ఉండాలి లేదా దాని వెలుపలి గోడల నుండి వెయ్యి మూరల (దాదాపు 1,450 అడుగులు) లోపలే ఉండాలి. (సంఖ్యాకాండము 35:2-4) ఒకవేళ అతడు ఆ పరిధిని దాటి వెళ్లితే, అతడు ప్రతీకారం తీర్చుకొనే వ్యక్తిని ఎదుర్కోవచ్చు. ఆ పరిస్థితుల్లో, ప్రతిహత్య చేసే వ్యక్తి తనపై శిక్షరానక్కర లేకుండానే ఆ హంతకున్ని చంపివేయగల వాడైయుంటాడు. అయితే ఆ హంతకుడు మాత్రం నిర్బంధింపబడడు లేక చెరసాలలో వేయబడడు. ఆశ్రయపుర నివాసిగా, అతడు ఒక వృత్తిని నేర్చుకొని పనిచేస్తూ, సమాజానికి ఉపయోగకరమైన సభ్యునిగా సేవచేయాలి.
16. (ఎ) పొరబాటున హత్యచేసిన వ్యక్తి ఎంతకాలం ఆశ్రయపురములోనే ఉండాలి? (బి) ప్రధాన యాజకుని మరణం, పొరబాటున హత్యచేసిన వ్యక్తి ఆశ్రయపురమును విడిచివెళ్లడాన్ని ఎందుకు సాధ్యపరుస్తుంది?
16 పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఎంతకాలం ఆశ్రయపురములో ఉండాలి? బహుశా తన మిగిలిన జీవితమంతా కావచ్చు. ఏమైనప్పటికీ, ధర్మశాస్త్రం ఇలా తెలియజేసింది: “ప్రధానయాజకుడు మృతినొందువరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ప్రధానయాజకుడు మృతినొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్లవచ్చును.” (సంఖ్యాకాండము 35:26-28) ప్రధాన యాజకుని మరణం, పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఆశ్రయపురమును విడిచిపెట్టి వెళ్లడానికి ఎందుకు అనుమతిస్తుంది? ఎందుకంటే, ప్రధానయాజకుడు దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకడు. ఆయన మరణం ఎంత గమనించదగిన విషయం అవుతుందంటే, అది ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో తెలిసిపోతుంది. ఆశ్రయపురములలో ఉన్న శరణార్థులందరూ, ప్రతీకారం తీర్చుకొనేవాని చేతుల్లో పడతామనే ప్రమాదం నుండి స్వతంత్రులై తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఎందుకు? ఎందుకంటే, హంతకున్ని చంపడానికి ప్రతీకారం తీర్చుకొనే వ్యక్తికున్న అవకాశం ప్రధాన యాజకుని మరణంతో పోతుందని దేవుని ధర్మశాస్త్రం తెలియజేసింది, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని తర్వాత ఏ బంధువైనా చంపి పగతీర్చుకోవాలని చూస్తే, అతడు హంతకుడౌతాడు, హత్య చేసినందుకు చివరికి తగిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
నిలిచివుండే ప్రభావాలు
17. పొరబాటున హత్య చేసిన వ్యక్తిపై విధించబడిన నిర్బంధాలు ఏ ప్రభావాలను కలుగజేయగలవు?
17 పొరబాటున హత్య చేసిన వ్యక్తిపై విధించబడిన నిర్బంధాల వల్ల కలిగే ప్రభావాలు ఏమై ఉండగలవు? ఒకరి మరణానికి తాను కారణమయ్యానన్న దానికి అవి జ్ఞాపికలుగా ఉంటాయి. ఇకమీదట అతడు మానవ జీవాన్ని పవిత్రమైనదిగా దృష్టించవచ్చు. అంతేగాక, తాను దయాపూర్వకంగా చూడబడ్డానని అతడు ఎన్నడూ మరచిపోడు. దయ పొందినవానిగా అతడు తప్పకుండా ఇతరుల ఎడల దయ కలిగివుంటాడు. ఆశ్రయపురములను ఏర్పాటు చేయడం వాటి నిర్బంధాలన్నిటితో సహా, సామాన్య ప్రజలకు కూడా ప్రయోజనం చేకూర్చేది. అదెలా? తాము మానవ జీవం గురించి అజాగ్రతగా లేక నిర్లక్ష్యంగా ఉండకూడదన్నది తప్పకుండా వారిపై ఎంతో ప్రభావం చూపి ఉండవచ్చు. ప్రమాదవశాత్తు మరణం సంభవించడానికి కారణం కాగల అజాగ్రత్తను విసర్జించవలసిన అవసరత గురించి క్రైస్తవులకు గుర్తుచేయబడుతుంది. అప్పుడు కూడా, ఆశ్రయపురముల గురించి దేవుడు చేసిన దయాపూర్వక ఏర్పాటు, దయ చూపించడం తగినదైనప్పుడు దయ చూపడానికి మనల్ని కదిలించాలి.—యాకోబు 2:13.
18. ఆశ్రయపురముల కొరకు దేవుడు చేసిన ఏర్పాటు ఏయే విధాలుగా ప్రయోజనకరమైనది?
18 ఆశ్రయపురముల గురించి యెహోవా దేవుడు చేసిన ఏర్పాటు మరితర విధాలుగా కూడా ప్రయోజనకరమైనదే. న్యాయస్థానం ఎదుట న్యాయవిచారణకు ఉన్న హంతకున్ని పట్టుకోవడానికి ప్రజలు నిఘా గుంపులుగా ఏర్పడరు. బదులుగా, వారు అతన్ని నిర్దోషియైన హంతకునిగా పరిగణించి, అతడికి భద్రత కలుగజేయడానికి సహాయం కూడా చేసేవారు. అంతేగాక, ప్రజల నుండి ఆర్థిక మద్దతును పొందుతూ, తరచూ ఇతర తప్పిదస్థుల సన్నిహిత సహవాసం వల్ల మరింత ఘోరమైన నేరస్థులుగా తయారయ్యే స్థలాలైన చెరసాలల్లో, సంస్కరణ కారాగారాల్లో హంతకులను ఉంచేందుకు చేయబడిన ప్రస్తుత కాలంలోని ఏర్పాట్లకు ఆశ్రయపురముల ఏర్పాటు పూర్తి వ్యతిరేకంగా ఉండేది. ఆశ్రయపురముల ఏర్పాటులో, ఎక్కడి నుండైతే వాటిలో ఉండేవారు తరచూ తప్పించుకోవాలని చూస్తారో, ఎంతో ఖర్చుతో కూడిన ప్రాకారములు, ఇనుప చువ్వలు గల ఆ చెరసాలలను నిర్మించడం, వాటి బాగోగులు చూసుకోవడం, వాటిని కాపాడడం వంటివి అనవసరమై ఉండెను. నిజానికి, హంతకుడే “చెరసాలను” వెతుక్కుంటూ వచ్చి, సూచించబడిన కాలంలో అక్కడే ఉంటాడు. తోటి మానవులకు ప్రయోజనకరమైనదేదైనా చేస్తూ, అతడు పనిచేసేవాడై కూడా ఉంటాడు.
19. ఆశ్రయపురముల గురించి ఏ ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?
19 పొరబాటున హత్య చేసిన హంతకుల రక్షణార్థం యెహోవా ఇశ్రాయేలులో ఆశ్రయపురములను ఏర్పాటు చేయడం నిజంగా దయాపూర్వకమైనది. ఈ ఏర్పాటు కచ్చితంగా జీవం ఎడల గౌరవాన్ని పెంపొందింపజేసింది. అయితే, ప్రాచీన ఆశ్రయపురములు ఇరవయ్యవ శతాబ్దంలో జీవిస్తున్న ప్రజలకు భావాన్ని కలిగివున్నాయా? మనం యెహోవా దేవుని ఎదుట రక్తాపరాధులమై, ఆయన దయ మనకవసరమని గుర్తించకుండా ఉండగలమా? ఇశ్రాయేలు యొక్క ఆశ్రయపురములలో మన కొరకు ఏదైనా ఆధునిక దిన విశేషత ఉందా?
మీరెలా సమాధానమిస్తారు?
◻ మానవ జీవాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు?
◻ పొరబాటున హత్య చేసినవారి కొరకు దేవుడు ఏ దయాపూర్వక ఏర్పాటును చేశాడు?
◻ పొరబాటున హత్యచేసిన వ్యక్తి ఆశ్రయపురములోకి ఎలా వెళ్లగలడు, ఆయన అక్కడే ఎంతకాలం ఉండాలి?
◻ పొరబాటున హత్యచేసిన వ్యక్తిపై విధించబడిన నిర్బంధాలు ఏ ప్రభావాలను కలిగించగలవు?
[12వ పేజీలోని చిత్రం]
ఇశ్రాయేలు యొక్క ఆశ్రయపురములు అనువుగా నెలకొల్పబడ్డాయి
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
కెదెషు — యొర్దాను నది — గోలాను
షెకెము — యొర్దాను నది — రామోతు
హెబ్రోను — యొర్దాను నది — బేసెరు