డబ్బాలోపెట్టిన భోజనం సాక్ష్యమిచ్చుట
జపాన్నందలి కోబ్నందు గత జనవరిలో భూకంపం వచ్చిన తర్వాతి దినాల్లో, భూకంపానికి గురైన ప్రాంతంలోని ప్రజలకు ఆహారం దొరకడం చాలా కష్టమైంది. అయినప్పటికీ, యెహోవాసాక్షులకు వారి స్నేహితుల దయాపూర్వకమైన సహాయం వల్ల, ఆహారం తక్కువ కాలేదు. భూకంపం వచ్చిన తర్వాత రెండు లేక మూడు రోజుల వరకు, దగ్గరలో ఉన్న సంఘాలు అన్నం పొట్లాలను అందజేశాయి. త్వరలోనే, శ్రద్ధగల స్నేహితులు భోజనాన్ని డబ్బాల్లో పెట్టి అందజేశారు. భూకంపానికి గురైన వారి ఎడల శ్రద్ధను వ్యక్తపర్చే నోట్సును అనేకులు అలా డబ్బాల్లో పెట్టిన భోజనాలకు జతచేశారు. ప్రతి భోజనం “ఉప్పగా” తయారయ్యేదని ఆ భోజనాలను పొందిన వారు చెప్పారు, ఎందుకంటే ఆ నోట్సును చదివినప్పుడు వాళ్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
అవసరంలో ఉన్నవారితో యెహోవాసాక్షులు తమ ఆహారాన్ని పంచుకున్నారు. తాను పనిచేసే కంపెనీలోనే పనిచేసే సాక్షికాని తోటి ఉద్యోగితో కలిసి కారులో ప్రయాణిస్తూ ఒక సాక్షి తన భోజనాన్ని తింటున్నాడు. తాను పొందిన భోజనపు డబ్బాల్లో ఒకదాన్ని అతడు ఆ వ్యక్తికిచ్చాడు.
“ఈ భోజనం డబ్బాను ఎక్కడ కొన్నావు?” అని అతని సహోద్యోగి అడిగాడు. సాక్షుల సహాయ పని గురించి సహోదరుడు వివరించాడు. “నేను చాలా రోజుల నుండి కూరగాయలు తినలేదు. నేను వాటిలో కొన్ని దాచుకొని నా కుటుంబం కొరకు తీసుకువెళతాను,” అని ఆ వ్యక్తి మెప్పుకోలుగా చెప్పాడు.
మూడవసారి ఇలా జరిగినప్పుడు, ఆ సహోద్యోగి 3,000 యన్లు (దాదాపు 35 అమెరికన్ డాలర్లు) సాక్షికిచ్చి, ఇలా చెప్పాడు: “మీ పనుల గురించి నాకు తెలుసు, కాబట్టి దయచేసి మీ పని కొరకు నన్ను కొంత విరాళం ఇవ్వనివ్వండి. మీరు నాతో మీ భోజనాన్ని పంచుకోవడాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నిజంగా, మీ స్నేహితులు ఎంతో మంచివాళ్లు.”