స్వనీతిని గూర్చి జాగ్రత్తపడుడి!
మొదటి శతాబ్దంలో, దేవుని యొక్క నీతియుక్తమైన ఆరాధికులని పరిసయ్యులకు మంచి పేరు ఉండేది. వారు లేఖనాలలో అత్యంతాసక్తిగల విద్యార్థులుగా ఉండి, తరచూ ప్రార్ధించేవారు. కొంతమంది ప్రజలు వారిని దయగలవారిగా, సహేతుకమైనవారిగా దృష్టించేవారు. యూదా చరిత్రకారుడైన జోసీఫస్ ఇలా వ్రాశాడు: “పరిసయ్యులు ఒకరి ఎడల ఒకరు అనురాగం కలిగివుండేవారు, సమాజంతో సామరస్యమైన సంబంధాలను పెంపొందించుకొనేవారు.” ఆ కాలంలో వారు యూదా సమాజంలో ఎంతో గౌరవింపబడినవారు, ఉన్నతంగా ఎంచబడినవారు కావడంలో ఆశ్చర్యం లేదు!
అయితే, నేడు “పరిసయ్యుల సంబంధమైన” అనే పదం సద్భక్తిగల, స్వనీతిమంతమైన, ఇతరులకన్నా పరిశుద్ధమైన, అతిభక్తిగల, పెదవులతో సేవచేసేవారు వంటి అగౌరవమైన పదాలతో జతచేయబడుతుంది. పరిసయ్యులు తమ మంచి పేరును ఎందుకు కోల్పోయారు?
ఎందుకంటే, అనేకమంది యూదులవలె కాకుండా, యేసు క్రీస్తు పరిసయ్యుల బాహ్య రూపాన్నిబట్టి మోసపోలేదు. ఆయన వారిని “సున్నముకొట్టిన సమాధుల”తో పోల్చాడు. “అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి.”—మత్తయి 23:27.
నిజమే, బహిరంగ స్థలాల్లో నిలబడివున్నప్పుడు వారు సుదీర్ఘమైన ప్రార్థనలు చేసేవారు, కాని యేసు చెప్పినట్లుగా, కేవలం ఇతరులు చూడాలనే వారలా చేసేవారు. వారి ఆరాధన కేవలం కపటముతో కూడినది. వారు విందులలో అగ్ర స్థానాలను సమాజమందిరాల్లో అగ్రపీఠములను ఇష్టపడేవారు. యూదులందరూ తమ వస్త్రాలకు చెంగులు కలిగివుండవలసి ఉండగా, చాలా పెద్ద చెంగులు కలిగివుండడం ద్వారా ప్రజలను ముగ్ధుల్ని చేయాలని పరిసయ్యులు ప్రయత్నించేవారు. రక్షరేకులుగా కట్టుకున్న వెడల్పయిన లేఖనాలుగల డబ్బాలను వారు గర్వంగా చూపించుకొనేవారు. (మత్తయి 6:5; 23:5-8) వారి వేషధారణ, వారి దురాశ, వారి దురహంకారం చివరికి వారికి అవమానాన్ని తెచ్చాయి.
దేవుడు పరిసయ్యులను నిరాకరించడాన్ని యేసు ఇలా తెలియజేశాడు: “వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే.” (మత్తయి 15:7-9) వారి నీతి నిజంగా స్వనీతియై ఉండినది. అర్థం చేసుకొనదగినట్లుగానే, యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “పరిసయ్యుల . . . పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.” (లూకా 12:1) నేడు మనం కూడా స్వనీతిని గూర్చి “జాగ్రత్త”పడాలి, లేక మత సంబంధమైన వేషధారులుగా తయారు కాకుండా జాగ్రత్త వహించాలి.
అలా చేయడంలో, ఒక వ్యక్తి హఠాత్తుగా స్వనీతిమంతుడు కాడని మనం గుర్తించాలి. బదులుగా, ఇలాంటి దృక్పథం కొంత కాలపరిమితిలో క్రమంగా వృద్ధిచెందుతుంది. ఒక వ్యక్తి తెలియనిరీతిగానే పరిసయ్యుల కోరదగని లక్షణాలను ఏర్పరచుకోవచ్చు.
అధికయోగ్యతనే దృక్పథం
మనం “జాగ్రత్త” వహించవలసిన లక్షణాలు కొన్ని ఏవి? స్వనీతిమంతులైన వ్యక్తులు సాధారణంగా “తాము ఎన్నడూ తప్పుచేయలేదన్నట్లుగా మాట్లాడతారు, నిలబడతారు, చూస్తారు” అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ అండ్ ఎతిక్స్ వివరిస్తుంది. స్వనీతిమంతులు గొప్పలు చెప్పుకుంటారు, తమ గురించి తాము ఉన్నతంగా చెప్పుకుంటారు, పరిసయ్యులకు కూడా ఈ పెద్ద సమస్యే ఉండేది.
పరిసయ్యుల సంబంధమైన ఈ దృక్పథాన్ని యేసు ఒక ఉపమానంతో ఇలా వివరించాడు: “ప్రార్థనచేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి—దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.” దానికి భిన్నంగా సుంకరి దీనంగా తన తప్పులను ఒప్పుకొని, గొప్పలు చెప్పుకొనే పరిసయ్యునికంటే ఎక్కువ నీతిమంతునిగా నిరూపించుకున్నాడు. “తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు” వారిని ఉద్దేశించి యేసు ఈ ఉపమానం చెప్పాడు.—లూకా 18:9-14.
మన సహజ సామర్థ్యాలు లేక అనుకూలతలను బట్టి అపరిపూర్ణ మానవులమైన మనం కొన్నిసార్లు మనమే ఇతరులకంటే శ్రేష్ఠులమని భావిస్తాము. కాని క్రైస్తవులు అలాంటి తలంపులను వెంటనే తొలగించుకోవాలి. క్రైస్తవ జీవనంలో మీకు అనేక సంవత్సరాల అనుభవం ఉండి ఉండవచ్చు. మీరు నైపుణ్యం గల బైబిలు బోధకులై ఉండవచ్చు. లేదా పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించేందుకు మీరు అభిషేకం నొందినవారిగా ఉండవచ్చు. సంఘంలో కొందరు పూర్తికాల సేవకులుగా, పెద్దలుగా, లేక పరిచారకులుగా ప్రత్యేకమైన ఆధిక్యతలను కలిగివుండవచ్చు. మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి, ‘యెహోవా నాకు ఇచ్చిన దాన్ని నన్ను నేను ఇతరుల కంటే ఉన్నతునిగా చేసుకోవడానికి నేను ఉపయోగించుకుంటే యెహోవా ఎలా భావిస్తాడు?’ తప్పకుండా ఇది ఆయనకు అప్రీతికరమైనదే.—ఫిలిప్పీయులు 2:3, 4.
దేవుడు తనకిచ్చిన సామర్థ్యాలు, ఆధిక్యతలు, లేక అధికారాన్ని బట్టి ఒక క్రైస్తవుడు అధికయోగ్యతనే దృక్పథాన్ని ప్రదర్శిస్తే, వాస్తవానికి అతడు దేవుని మహిమను, ఆయన మాత్రమే పొందవలసిన ఘనతను దోచుకుంటున్నట్లే. “తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొన” వద్దని బైబిలు క్రైస్తవులకు స్పష్టంగా ఉపదేశిస్తోంది. అది మనల్నిలా కోరుతుంది: “ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చువాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులైయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.”—రోమీయులు 12:3, 16.
“తీర్పుతీర్చకుడి”
ఒక బైబిలు సర్వసంగ్రహ నిఘంటువు చెప్పేదాని ప్రకారం, స్వనీతిమంతుడైన వ్యక్తి “తాను నైతికంగా సరైనవాడినని లేదా చట్టబద్ధమైన అవసరతల అసలైన భావాన్ని దృష్టిలోకి తీసుకోకుండా నిక్కచ్చిగా వాటిని హత్తుకొని ఉన్నందుకు తాను దేవుని ఎదుట సరైన స్థానాన్ని కలిగివున్నానని తనను తాను పరిగణించుకుంటాడు.” స్వనీతిమంతులు “ఇతరులలో దుష్టత్వం కొరకు వెదకడంలోనే తమ సమయాన్నంతా గడిపే అతి మతసంబంధమైన ప్రజలని” మరో పుస్తకం వివరిస్తుంది.
పరిసయ్యులు ఇదే అపరాధం చేశారు. చివరికి మానవులు కల్పించిన వారి సూత్రాలు దేవుని సూత్రాలు, కట్టడల కంటే ప్రాముఖ్యమైనవిగా అనిపించేవి. (మత్తయి 23:23; లూకా 11:41-44) వారు తమను తాము న్యాయాధిపతులుగా నియమించుకొని, తమ స్వనీతితో కూడిన ప్రమాణాలకు సరితూగలేని ఎవరినైనా దూషించడానికి అలవాటుపడ్డారు. వారి అహంకార దృక్పథం, విపరీతమైన వారి స్వాభిమానం ఇతర ప్రజలను అదుపు చేయవలసిన అవసరతను కలిగించింది. యేసును అదుపు చేయలేకపోయిన వారి అశక్తత వారికి ఆగ్రహం కలిగించింది, అందుకని వారు ఆయనను హత్య చేయాలని పథకం చేశారు.—యోహాను 11:47-53.
ఎప్పుడూ తప్పుల గురించి చూస్తూ, తన చుట్టూవున్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తూ, కాపలాకాస్తూ మనపై తనను తాను న్యాయాధిపతిగా నియమించుకునే ఎవరి సహవాసంలో ఉండడమైనా ఎంతో చికాకు కలిగించేదిగా ఉండగలదు. నిజంగా, తన అభిప్రాయాలను స్వయం నిర్మిత సూత్రాలను ఇతరులపై రుద్దే అధికారం సంఘంలో ఎవరికీ లేదు. (రోమీయులు 14:10-13) అనుదిన జీవనంలోని అనేక అంశాలు వ్యక్తిగత నిర్ణయం తీసుకోవలసినవని సమతూకంగల క్రైస్తవులు గుర్తిస్తారు. ప్రాముఖ్యంగా పరిపూర్ణులుగా, అధికారం చేసేవారిగా ఉండాలనే దృక్పథం గలవారు ఇతరులకు తీర్పుతీర్చకూడదు.
నిజమే, యెహోవా యొక్క భూ సంస్థ సరైన విధంగా పనిచేసేందుకు దోహదపడే నిర్దేశక సూత్రాలు కలిగివుండే అధికారం క్రైస్తవ సంఘానికి ఉంది. (హెబ్రీయులు 13:17) కాని కొందరు ఈ నిర్దేశక సూత్రాలను వక్రీకరించారు లేదా తమ స్వంత సూత్రాలను కలిపారు. ఒక ప్రాంతంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని విద్యార్థులందరూ, ప్రసంగించేటప్పుడు సూట్లు వేసుకొని తమ జాకెట్‌లకు గుండీలు పెట్టుకోవాలి. అలా చేయలేకపోయిన విద్యార్థి భవిష్యత్తులో ప్రసంగాలు ఇచ్చేందుకు అనర్హునిగా ఎంచబడతాడు. అలాంటి కఠినమైన నియమాలను పెట్టే బదులు, అవసరమున్నప్పుడు దయాపూర్వకంగా వ్యక్తిగతమైన నడిపింపునివ్వడం మరింత సహేతుకంగా, దేవుని వాక్య స్ఫూర్తికి అనుగుణంగా ఉండదా?—యాకోబు 3:17.
ఒకవేళ ఒక క్రైస్తవుడు అనేక వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొంటుంటే, అతడు ఆత్మీయత కొరవడినవాడై ఉండవచ్చుననే లాంటి దృక్పథాన్ని కూడా స్వనీతి పెంపొందింపజేయగలదు. నమ్మకస్థుడైన యోబు గురించి స్వనీతిమంతులైన ఎలీఫజు, బిల్దదు, జోఫరు కచ్చితంగా అలాగే తలంచారు. పరిస్థితిని గూర్చిన పూర్తి వివరాలు వారికి తెలియదు, గనుక తప్పుచేశాడని యోబును నిందించడం వారి పక్షాన గర్వించడమైయుంటుంది. యోబు శ్రమలను గూర్చిన వక్రీకరింపబడిన వారి అర్ఘనిర్ధారణను బట్టి యెహోవా వారిని శిక్షించాడు.—యోబు 4, 5, 8, 11, 18, 20 అధ్యాయాలు చూడండి.
తప్పుదోవపట్టిన ఆసక్తి
తరచూ స్వనీతి మరియు ఆసక్తి పరస్పర సంబంధం గలవైయుంటాయి. అపొస్తలుడైన పౌలు మతసంబంధమైన ఆసక్తిగల యూదులు ‘దేవుని యందు ఆసక్తిగలవారైనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచూ దేవుని నీతికి లోబడలేదు’ అని అన్నాడు. (రోమీయులు 10:2, 3) పరిసయ్యునిగా పౌలు అత్యధికమైన ఆసక్తి కలిగి ఉండేవాడు, అయినప్పటికీ ఆయన ఆసక్తి తప్పుదోవపట్టినది, యెహోవా నీతిపై ఆధారపడినది కాదు.—గలతీయులు 1:13, 14; ఫిలిప్పీయులు 3:6.
తగినరీతిలో బైబిలు ఇలా ఉపదేశిస్తుంది: “అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసికొందువు?” (ప్రసంగి 7:16) ఒక సంఘంలో ఒక క్రైస్తవుడు మనస్సాక్షి గలవానిగా ప్రారంభించవచ్చు, కాని అతని మనస్సాక్షి మరియు ఆసక్తి స్వనీతిగా మారిపోవచ్చు. యెహోవా నీతికి బదులు మానవ జ్ఞానంచే నడిపించబడితే, మతసంబంధమైన ఆసక్తి ఇతరులను నొప్పించగలదు. ఎలా?
ఉదాహరణకు, తలిదండ్రులు ఇతరుల ఆత్మీయ అవసరతల గురించి శ్రద్ధ తీసుకోవడంలో అధికంగా నిమగ్నమైపోయి, తమ స్వంత కుటుంబ అవసరతలనే నిర్లక్ష్యం చేయవచ్చు. లేదా తలిదండ్రులు అత్యంత ఆసక్తి కలిగివుండి, తమ పిల్లలు చేయగలిగినదానికంటే వారి నుండి ఎక్కువ కోరవచ్చు. (ఎఫెసీయులు 6:4; కొలొస్సయులు 3:21) కొంతమంది పిల్లలు అలాంటి నిర్హేతుకమైన కోరికలకు తగినట్లుగా ఉండలేక ద్వంద జీవితాన్ని గడపడం ద్వారా ప్రతిస్పందిస్తారు. సహేతుకమైన తండ్రి తన కుటుంబం యొక్క పరిమితులను పరిగణలోకి తీసుకొని తగిన మార్పులను చేస్తాడు.—ఆదికాండము 33:12-14 పోల్చండి.
అత్యధికమైన ఆసక్తి, ఇతరులతో వ్యవహరించేందుకు మనకు ఎంతో అవసరమైన యుక్తి, సానుభూతి, కనికరం వంటివి లేకుండా కూడా చేయగలదు. రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికి ఒక వ్యక్తి ఎంతో కష్టపడుతుండవచ్చు. అయితే అలా అత్యధికమైన ఆసక్తిని చూపించడంలో అతడు ప్రజలను నొప్పించవచ్చు. పౌలు ఇలా చెప్పాడు: “ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.”—1 కొరింథీయులు 13:2, 3.
దీనులకు దేవుడు కృపచూపిస్తాడు
స్వనీతి పెంపొందక ముందే దాని ప్రమాదాన్ని గుర్తించవలసిన అవసరత క్రైస్తవులుగా మనకుంది. మనం అహంకార దృక్పథాన్ని, ఇతరులకు తీర్పుతీర్చే అలవాటును, మానవ జ్ఞానంపై ఆధారపడిన అంధ ఆసక్తిని విసర్జించాలి.
పరిసయ్యుల వంటి దృక్పథాల గురించి మనం “జాగ్రత్త” కలిగివుండి, స్వనీతిమంతులుగా ఇతరులకు తీర్పుతీర్చే బదులు, మన స్వంత దృక్పథాలు మరియు కోరికలపై దృష్టినుంచుకోవడం మంచిది. నిజమే, యేసు పరిసయ్యులకు తీర్పు తీర్చి, నిత్య నాశనాన్ని పొందదగిన “సర్పసంతానమని” వారిని ఖండించాడు. కాని యేసు ప్రజల హృదయాలను చదవగలడు. మనం చదవలేము.—మత్తయి 23:33.
మనం మన స్వనీతిని కాక దేవుని నీతిని వెదకుదాము. (మత్తయి 6:33) అప్పుడే మనం యెహోవా కృపను పొందగలం, ఎందుకంటే బైబిలు మనందరికీ ఇలా ఉపదేశిస్తోంది: “ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”—1 పేతురు 5:5.