కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 10/15 పేజీలు 23-28
  • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉపమానంలోని వ్యక్తులు
  • మేకలు ఎవరు గొఱ్ఱెలు ఎవరు?
  • ప్రతి గుంపుకు ఏ భవిష్యత్తుంది?
  • అది మనకే భావం కలిగివుంది?
  • సమాంతరాలను గమనించండి
  • క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు, మేకలకు తీర్పు తీరుస్తాడు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • నిజమైన ఆరాధికుల గొప్ప సమూహము—వారు ఎక్కడనుండి వచ్చారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • క్రీస్తు సహోదరులకు నమ్మకంగా మద్దతివ్వడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 10/15 పేజీలు 23-28

మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?

‘గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును.’—మత్తయి 25:32.

1, 2. మేకల మరియు గొఱ్ఱెల ఉపమానం మనకు ఎందుకు ఆసక్తి కల్గి ఉంచాలి?

యేసుక్రీస్తు భూమిమీద నిశ్చయంగా ఓ మహా గొప్ప బోధకుడే. (యోహాను 7:46) ఆయన బోధించే పద్ధతుల్లో ఒకటి ఉపమానాలను లేక దృష్టాంతాలను ఉపయోగించడం. (మత్తయి 13:34, 35) ఎంతో సరళమైనవే అయినా గంభీరమైన ఆత్మీయ మరియు ప్రవచనార్థక సత్యాలను అందించేందుకు ఇవి ఎంతో శక్తివంతమైనవి.

2 మేకలూ గొఱ్ఱెల ఉపమానంలో ప్రత్యేక సామర్థ్యంతో తాను చర్యగైకొనే సమయాన్ని గూర్చి యేసు సూచించాడు: “తన మహిమతో మనుష్యకుమారుడు . . . వచ్చునప్పుడు . . .” (మత్తయి 25:31) “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి” అన్న ప్రశ్నకు ఇచ్చిన జవాబును ఈ దృష్టాంతముతో ముగించాడు కనుక మనకు ఇది ఆసక్తికరం కావాలి. (మత్తయి 24:3) అయితే అది మన కొరకు ఏ భావాన్ని కల్గివుంది?

3. ఆయన ప్రసంగారంభంలో మహాశ్రమ ప్రారంభమైన వెంటనే ఏ పరిణామం సంభవిస్తుందని యేసు చెప్పాడు?

3 మహా శ్రమ ప్రారంభమైన “వెంటనే” మనం ఎదురుచూస్తున్న ప్రాముఖ్యమైన పరిణామాలు సంభవిస్తాయని యేసు ముందే చెప్పాడు. అప్పుడు “మనుష్య కుమారుని సూచన” కనిపిస్తుందని చెప్పాడు. “ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి”న “భూమిమీదనున్న సకల గోత్రముల” వారిపై అది ఎంతో ప్రభావాన్ని కల్గివుంటుంది. మనుష్య కుమారునితో ‘తన దూతలును’ ఉంటారు. (మత్తయి 24:21, 29-31)a మేకలూ గొఱ్ఱెల ఉపమానం విషయమేమిటి? ఆధునిక బైబిళ్లు దాన్ని 25వ అధ్యాయంలో పెడుతున్నాయి కానీ, అది యేసు జవాబులో భాగమే, అది ప్రభావము మహిమతో ఆయన రాకను గూర్చి మరియు “సమస్త జనుల”కు ఆయన తీర్పు తీర్చడం గూర్చి మరిన్ని వివరాలనిస్తుంది.—మత్తయి 25:32.

ఉపమానంలోని వ్యక్తులు

4. మేకలూ గొఱ్ఱెల ఉపమానం ప్రారంభంలో యేసును గూర్చి ఏమి ప్రస్తావించబడింది, ఇంకా ఎవరు ప్రస్తావించబడ్డారు?

4 “మనుష్య కుమారుడు . . . వచ్చునప్పుడు” అని అంటూ యేసు తన ఉపమానాన్ని ప్రారంభిస్తాడు. “మనుష్య కుమారుడు” ఎవరో మీకు తెలిసే ఉండవచ్చు. సువార్త రచయితలు తరచూ ఈ వాక్యాన్ని యేసుకు ఉపయోగించారు. యేసు తాను కూడా ఆలాగే చేశాడు, మరి “ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును” పొందేందుకు “మనుష్యకుమారుని పోలిన యొకడు” మహా వృద్ధుని సమీపించడం చూసిన దానియేలు దర్శనం ఆయన మనస్సులో నిస్సందేహంగావుండవచ్చు. (దానియేలు 7:13, 14; మత్తయి 26:63, 64; మార్కు 14:61, 62) ఈ ఉపమానంలో యేసు ప్రాముఖ్యమైన పాత్రను వహించినప్పటికీ అందులో ఉన్నది ఆయన ఒక్కడు మాత్రమే కాదు. మత్తయి 24:30, 31 నందు ఎత్తి వ్రాసినట్లుగా మనుష్య కుమారుడు ‘ప్రభావముతోను మహిమతోను’ వచ్చునప్పుడు ఆయన దూతలు ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తారని ఈ ప్రసంగ ఆరంభంలో ఆయన చెప్పాడు. అదే విధంగా, తీర్పుతీర్చేందుకు ‘సింహాసనము మీద కూర్చు’న్నప్పుడు యేసుతో దూతలు కూడా ఉంటారని మేకలూ గొఱ్ఱెల ఉపమానం చూపిస్తుంది. (మత్తయి 16:27 పోల్చండి.) అయితే న్యాయాధిపతి మరియు ఆయన దూతలు పరలోకంలో ఉన్నారు కనుక ఆ ఉపమానంలో మానవులను గూర్చి చర్చించడం జరిగిందా?

5. మనం యేసు “సహోదరు”లను ఎలా గుర్తించగలం?

5 ఆ ఉపమానాన్ని ఒకసారి పరిశీలించడం మనం గుర్తించాల్సిన మూడు గుంపులను గూర్చి బయల్పరుస్తుంది. మేకలూ గొఱ్ఱెలకు తోడుగా, మనుష్య కుమారుడు ఓ మూడవ గుంపును చేరుస్తున్నాడు, దాని గుర్తింపు మేకలూ గొఱ్ఱెలను గుర్తించేందుకు ఎంతో అవసరం. యేసు ఈ మూడవ గుంపును తన ఆత్మీయ సహోదరులని పిలుస్తున్నాడు. (మత్తయి 25:40, 45) వారు ఆయనకు నిజమైన ఆరాధికులై ఉండాలి ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు: “పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు.” (మత్తయి 12:50; యోహాను 20:17) దాన్ని మరింత ధ్రువపరుస్తూ, ‘అబ్రాహాము సంతానం’లో భాగమైన క్రైస్తవులను గూర్చి మరియు దేవుని కుమారుల్లోనూ భాగమైన క్రైస్తవులను గూర్చి పౌలు వ్రాశాడు. వీరిని ఆయన “పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన” యేసు ‘సహోదరులు’ అని పిలిచాడు.—హెబ్రీయులు 2:9–3:1; గలతీయులు 3:26, 29.

6. యేసు సహోదరుల్లో “అలులైన” వారు ఎవరు?

6 యేసు తన సహోదరుల్లో “మిక్కిలి అల్పులైన” వారిని గూర్చి ఎందుకు ప్రస్తావించాడు? ఆ మాటలు, అంతకుముందు ఆయన చెబుతుండగా అపొస్తలులు విన్న వాటిని ప్రతిధ్వనిస్తున్నాయి. యేసుకంటే ముందే మరణించడం వల్ల భూనిరీక్షణ గల బాప్తిస్మమిచ్చు యోహానుకు, పరలోక జీవితాన్ని పొందేవారికి మధ్య తేడాను చెప్పేటప్పుడు యేసు ఇలా చెప్పాడు: “బాప్తిస్మమిచ్చు యోహానుకంటె గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోకరాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడు.” (మత్తయి 11:11) పరలోకానికి వెళ్లే కొందరు అంటే అపొస్తలులవలె సంఘంలో అతి ప్రాముఖ్యులై ఉండివుండవచ్చు, మరితరులు తక్కువ అయ్యుండవచ్చు, అయితే వారందరూ యేసు ఆత్మీయ సహోదరులే. (లూకా 16:10; 1 కొరింథీయులు 15:9; ఎఫెసీయులు 3:8; హెబ్రీయులు 8:11) ఆ విధంగా, భూమ్మీది కొందరు అంత ప్రాముఖ్యులుగా కనిపించకపోయినప్పటికీ, వారు ఆయన సహోదరులే మరియు వారు దానికి తగిన రీతిలో చూడబడాలి.

మేకలు ఎవరు గొఱ్ఱెలు ఎవరు?

7, 8. గొఱ్ఱెలను గూర్చి యేసు ఏమని చెప్పాడు, కనుక వారిని గూర్చి మనం ఏ నిర్థారణకు రావచ్చు?

7 గొఱ్ఱెలకు తీర్పు తీర్చడం గూర్చి మనం ఇలా చదువుతాము: “[యేసు] తన కుడివైపున ఉన్నవారిని చూచి—నా తండ్రిచేత ఆశీర్వదించబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి; పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు—ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకాహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? ఎప్పుడు రోగివైయుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు—మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.”—మత్తయి 25:34-40.

8 స్పష్టంగా, దయా ఘనతలను పొందగల యేసు యొక్క కుడిపార్శ్వమున ఉండేందుకు అర్హతపొందిన గొఱ్ఱెలు మానవ తరగతిని సూచిస్తున్నాయి. (ఎఫెసీయులు 1:20; హెబ్రీయులు 1:3) వారు ఏమి చేశారు, మరి దాన్ని ఎప్పుడు చేశారు? వారు దయతో, గౌరవంతో మరియు ఉదారంగా ఆయనకు ఆహారపానీయాలనూ, దుస్తులనూ అందించారని మరియు ఆయన అస్వస్థంగా ఉన్నప్పుడు లేక చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకు సహాయపడ్డారని యేసు చెబుతున్నాడు. తాము వీటిని యేసుకు వ్యక్తిగతంగా చేయలేదని గొఱ్ఱెలు చెప్పినప్పుడు, అభిషక్తులైన క్రైస్తవుల్లో శేషించిన తన ఆత్మీయ సహోదరులకు సహాయపడ్డారని ఆయన సూచించాడు తద్వారా ఆ భావంలో వారు ఆయనకు చేశారని చెప్పాడు.

9. వెయ్యేండ్ల కాలంలో ఈ ఉపమానం ఎందుకు అన్వయించబడదు?

9 ఈ ఉపమానం వెయ్యేండ్ల కాలంలో అన్వయించబడదు, ఎందుకంటే అప్పుడు అభిషక్తులు ఆకలి, దాహం, రోగం, లేక చెరను అనుభవించే మానవులుగా ఉండరు. అయితే వారిలో అనేకులు ఈ విధానాంతంలో అలాంటివాటిని అనుభవించారు. సాతాను భూమిమీదికి పడద్రోయబడినప్పటి నుండి, శేషించినవారిపై అవహేళనను, హింసను, మృత్యువును తీసుకురావడం ద్వారా, తన కోపానికి ముఖ్యంగా గురిచేశాడు.—ప్రకటన 12:17.

10, 11. (ఎ) యేసు సహోదరులకు సహాయం చేసే ప్రతిఒక్కరు గొఱ్ఱెల్లో చేరివున్నారని ఆలోచించడం ఎందుకు సహేతుకంకాదు? (బి) గొఱ్ఱెలు ఎవరికి సరిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

10 తన సహోదరుల్లో ఒకరికి చిన్న సహాయం చేసే ప్రతివారూ అంటే బహుశ ఒక రొట్టె ముక్కను లేక ఒక గ్లాసు మంచి నీళ్లనూ ఇచ్చినవారు ఈ గొఱ్ఱెలయ్యేందుకు అర్హులవుతారని యేసు చెబుతున్నాడా? అలాంటి సహాయం మానవత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నది నిజమే, కానీ వాస్తవానికి ఈ ఉపమానపు గొఱ్ఱెల విషయంలో ఇంకా ఎక్కువ ఇమిడి ఉందన్నట్లు అనిపిస్తోంది. ఉదాహరణకు, తన సహోదరుల్లో ఒకరికి ఓ సహాయంచేసిన నాస్తికులనో లేక మత నాయకులనో సూచించడంలేదు. దానికి భిన్నంగా, రెండు సార్లు యేసు ఆ గొఱ్ఱెలను ‘నీతిమంతులు’ అని పిలిచాడు. (మత్తయి 25:37, 46) కనుక కొంతకాలం పాటు క్రైస్తవ సహోదరులకు సహాయపడి అంటే చురుకుగా వారికి మద్దతునిచ్చి, దేవుని ఎదుట నీతియుక్తమైన స్థానాన్ని పొందేంతగా విశ్వాసాన్ని కల్గివున్నవారై ఉండాలి.

11 సంవత్సరాలుగా అబ్రాహాము వంటి అనేకులు ఓ నీతియుక్త స్థానాన్ని అనుభవించారు. (యాకోబు 2:21-23) నోవహు, అబ్రాహాము మరియు ఇతర నమ్మకమైనవారు, దేవుని రాజ్యంలో పరదైసునందు జీవాన్ని పొందే “వేరే గొఱ్ఱె”ల్లో చేరివుంటారు. ఇటీవలికాలంలో ఇంకా లక్షలాదిమంది వేరే గొఱ్ఱెలుగా సత్యారాధనను చేపట్టారు మరియు అభిషక్తులతో “ఒక మంద”లో భాగమయ్యారు. (యోహాను 10:16; ప్రకటన 7:9) భూ నిరీక్షణగల వీరు యేసు సహోదరులను రాజ్యానికి ప్రతినిధులుగా గుర్తించి, అలా వారికి అక్షరార్థంగానూ ఆత్మీయంగానూ సహాయపడ్డారు. వేరే గొఱ్ఱెలు భూమిమీద తన సహోదరులకు చేసిన వాటిని తనకు చేసినట్లుగానే యేసు పరిగణిస్తాడు. బ్రతికివున్న అలాంటివారు, ఆయన జనాంగాలకు తీర్పుతీర్చేందుకు వచ్చినప్పుడు గొఱ్ఱెలుగా తీర్పుతీర్చబడతారు.

12. గొఱ్ఱెలు తాము యేసుకు ఎలా సహాయం చేశామని ఎందుకు అడుగుతారు?

12 మరి వేరే గొఱ్ఱెలు అభిషక్తులతో ఇప్పుడు సువార్తను ప్రకటిస్తూ, వారికి సహాయపడుతున్నట్లైతే, “ప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి?” అని ఎందుకు ప్రశ్నిస్తారు. (మత్తయి 25:37) అందుకు వివిధ కారణాలు ఉండవచ్చు. ఇది ఓ ఉపమానం. దాని ద్వారా, తన ఆత్మీయ సహోదరుల ఎడల ఆయనకు గల ప్రగాఢమైన శ్రద్ధను యేసు కనపరుస్తున్నాడు; ఆయన వారి భావనలను పంచుకుంటాడు, ఆయన వారితో బాధపడతాడు. అంతకు ముందు యేసు ఇలా చెప్పాడు: “మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.” (మత్తయి 10:40) తన సహోదరులకు చేసేది (అది మంచైనా చెడైనా) పరలోకం వరకు చేరుకుంటుందని; అది పరలోకంలో ఆయనకు చేసినట్లేనని కనపరుస్తూ ఈ దృష్టాంతంలో యేసు ఓ సూత్రాన్ని అందిస్తున్నాడు. అంతేకాకుండ, యేసు ఇక్కడ తీర్పుతీర్చడంలో యెహోవా ప్రమాణాన్ని నొక్కిచెబుతున్నాడు, అనుకూలమైనదైనా లేక దండనార్హమైనదైనా దేవుని తీర్పు అన్నది సయుక్తికం న్యాయవంతం. ‘అయ్యో మేము నిన్ను నేరుగా చూసివుంటే ఎంత బాగుండును,’ అని మేకలు సాకులు చెప్పలేరు.

13. మేకలాంటి వారు యేసును “ప్రభువా” అని ఎందుకు పిలుస్తారు?

13 ఈ ఉపమానంలో కనపర్చిన తీర్పు ఎప్పుడు అమలుపర్చబడుతుందన్న విషయాన్ని మనం ఒకసారి గుణగ్రహిస్తే, మేకలు ఎవరు అనే విషయాన్ని గూర్చి మనకు స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది. దాని నెరవేర్పు, “మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొను”నప్పుడు జరుగుతుంది. (మత్తయి 24:29, 30) రాజు సహోదరులను చిన్నచూపు చూసిన మహా బబులోనుపై వచ్చే శ్రమనుండి తప్పించుకున్నవారు ఇప్పుడు ఆ న్యాయాధిపతిని “ప్రభువా” అని దయనీయంగా పిలుస్తారు.—మత్తయి 7:22, 23; ప్రకటన 6:15-17 పోల్చండి.

14. మేకలు గొఱ్ఱెలను యేసు ఏ ఆధారంపై తీర్పుతీరుస్తాడు?

14 మునుపు చర్చికి వెళ్లేవారు, నాస్తికులు లేక ఇతరులు నిరాశతో చెప్పేవాటిని ఆధారం చేసుకుని యేసు తీర్పుతీర్చడు. (2 థెస్సలొనీకయులు 1:8) బదులుగా, “అల్పులైన వీరిలో [తన సహోదరులలో] ఒకని” ఎడలైనా ప్రజలు గతంలో వ్యవహరించిన విధం మరియు వారి వారి హృదయ పరిస్థితిని న్యాయాధిపతి పునఃపరిశీలిస్తాడు. భూమిమీద జీవిస్తున్న అభిషక్త క్రైస్తవుల సంఖ్య తగ్గుతోందన్నది వాస్తవం. అయితే, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసుడు” అయ్యే అభిషక్తులు ఆత్మీయ ఆహారాన్ని నడిపింపును అందిస్తూ ఉన్నంతకాలం, ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోని ప్రజలలోని ఆ యా భాషలు మాటలాడువారిలోని గొప్ప సమూహము’ చేసినట్లుగానే గొఱ్ఱెలు కాబోయేవారు దాసుని తరగతికి మంచి చేసే అవకాశాన్ని కల్గివున్నారు.—ప్రకటన 7:9, 14.

15. (ఎ) అనేకులు తాము మేకలని ఎలా కనపర్చుకున్నారు? (బి) ఒకరు మేకా లేక గొఱ్ఱె అన్న విషయంపై వ్యాఖ్యానించడాన్ని మనం ఎందుకు విడనాడాలి?

15 క్రైస్తవ సహోదరులు మరియు వారితో కలిసిన లక్షలాది మంది వేరే గొఱ్ఱెలు ఒక మందగా ఎలా చూడబడతారు? అనేకమంది ప్రజలు క్రైస్తవ ప్రతినిధులపై దాడిచేసివుండకపోవచ్చు, అలాగే వారు ఆయన ప్రజలను అటు ప్రేమపూర్వకంగా కూడా చూడలేదు. దుష్టలోకాన్నే ఇష్టపడుతూ మేకవంటివారు రాజ్య వర్తమానాన్ని ప్రత్యక్షంగా లేక పరోక్షంగాగానీ విన్నా దాన్ని తిరస్కరిస్తారు. (1 యోహాను 2:15-17) చివరి విశ్లేషణలో, తీర్పును తీర్చేందుకు నియమించబడేది యేసే అన్న విషయంలో సందేహంలేదు. ఎవరు మేకలు ఎవరు గొఱ్ఱెలన్న విషయాన్ని తీర్మానించాల్సింది మనం కాదు.—మార్కు 2:8; లూకా 5:22; యోహాను 2:24, 25; రోమీయులు 14:10-12; 1 కొరింథీయులు 4:5.

ప్రతి గుంపుకు ఏ భవిష్యత్తుంది?

16, 17. గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?

16 యేసు గొఱ్ఱెల విషయంలో తన తీర్పునిచ్చాడు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” “రండి”—ఎంతటి ప్రేమపూర్వకమైన ఆహ్వానం! దేనికొరకు? ‘నీతిమంతులు నిత్యజీవమునకు పోవుదురు’ అని ఆయన చివరిలో వ్యక్తపర్చినట్లుగా నిత్యజీవానికే.—మత్తయి 25:34, 46.

17 తలాంతుల ఉపమానంలో పరలోకంలో ఆయనతో జీవించేవారికి ఏమి అవసరం అన్న విషయాన్ని యేసు చూపాడు, అయితే ఈ ఉపమానంలో రాజ్య పౌరులనుండి ఏమి అపేక్షించబడుతుందనే విషయాన్ని ఆయన చూపుతున్నాడు. (మత్తయి 25:14-23) సూటిగా చెప్పాలంటే, వారు యేసు సహోదరులకు పూర్ణంగా మద్దతునివ్వడం ద్వారా, ఈ గొఱ్ఱెలు ఆయన రాజ్యపు భూ లోకంలో ఓ స్థానాన్ని స్వతంత్రించుకుంటారు. వారు పరదైసు భూమిపై జీవాన్ని అనుభవిస్తారు—అది విమోచనను పొందగల మానవుల “లోకము పుట్టినది మొదలుకొని” దేవుడు ఏర్పాటు చేసిన ఉత్తరాపేక్ష.—లూకా 11:50, 51.

18, 19. (ఎ) మేకలను గూర్చి యేసు ఏ తీర్పులను తీరుస్తాడు? (బి) మేకలు నిత్య బాధను అనుభవించరనే నిశ్చయాన్ని మనం ఎందుకు కల్గివుండగలం?

18 మేకలపై తీర్చబడిన తీర్పు ఎంత భిన్నమైనది! “అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి—శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు; దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు; పరదేశినైయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినైయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును—ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొని యుండుటయైనను, పరదేశివైయుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివైయుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.”—మత్తయి 25:41-45.

19 మేకవంటివారి అమర్త్యమైన ప్రాణములు నిత్యాగ్నిలో బాధననుభవిస్తాయని దాని భావం కాదని బైబిలు విద్యార్థులకు తెలుసు. ఎందుకంటే మానవులే ప్రాణములు; వారిలో వేరే ప్రాణములు లేవు. (ఆదికాండము 2:7; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) మేకలను ‘నిత్యాగ్నికి’ న్యాయాధిపతి తీర్పుతీర్చడం అంటే, భవిష్యత్‌ నిరీక్షణ లేకుండా నాశనమవ్వడమని అతని ఉద్దేశం. దానిలో అపవాదీ వాని దయ్యముల నిత్య నాశనం కూడా ఉంది. (ప్రకటన 20:10, 14) కనుక, యెహోవా న్యాయాధిపతి వేరువేరు తీర్పులను తీరుస్తాడు. అయితే ఆయన తన గొఱ్ఱెలతో “రండి” అని మేకలతో “నన్ను విడిచి . . . పోవుడి” అని చెబుతాడు. గొఱ్ఱెలు ‘నిత్యజీవమును’ పొందుతారు. మేకలు “నిత్యశిక్ష”ను పొందుతారు.—మత్తయి 25:46.b

అది మనకే భావం కలిగివుంది?

20, 21. (ఎ) క్రైస్తవులు చేయాల్సిన ఏ ప్రాముఖ్యమైన పని ఉంది? (బి) నేడు ఏ వేరుపర్చే పని జరుగుతోంది? (సి) మేకలు మరియు గొఱ్ఱెల ఉపమానం నెరవేరడం ప్రారంభమైనప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది?

20 తన ప్రత్యక్షత మరియు ఈ విధానాంతం గూర్చి యేసు ఇచ్చిన జవాబును విన్న నలుగురు అపొస్తలులు పరిశీలించేందుకు ఎంతో ఉంది. వారు మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. (మత్తయి 24:42) మార్కు 13:10 నందు ప్రస్తావించిన సాక్ష్యపు పనిని కూడా వారు చేయాల్సిన అవసరం ఉంది. నేడు యెహోవాసాక్షులు చురుకుగా ఈ పనిలో పాల్గొంటున్నారు.

21 అయితే మేకలూ గొఱ్ఱెల ఉపమానాన్ని గూర్చిన ఈ నూతన అవగాహన మనకు ఏ భావాన్ని కల్గివుంది? ప్రజలు ఇప్పటికీ ఏదొక ప్రక్కకు వెళ్తున్నారు. కొందరు ‘నాశనానికి నడిపించే విశాలమార్గంలో’ ఉన్నారు అయితే ఇతరులు ‘జీవానికి నడిపించే ఇరుకు మార్గంలో’ కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. (మత్తయి 7:13, 14) అయితే ఉపమానంలో చిత్రించబడిన మేకలూ గొఱ్ఱెలపై యేసు ప్రకటించబోయే అంతిమ తీర్పు మున్ముందుంది. మనుష్య కుమారుడు న్యాయాధిపతి పాత్రలో వచ్చినప్పుడు, అనేకమంది నిజమైన క్రైస్తవులు—వాస్తవానికి సమర్పిత గొఱ్ఱెల “గొప్ప సమూహము”—“మహా శ్రమ” చివరి భాగంనుండి నూతన లోకంలోకి ప్రవేశించేందుకు అర్హతను పొందుతారు. ఆ ఉత్తరాపేక్ష ఇప్పుడు ఆనందానికి కారణం కావాలి. (ప్రకటన 7:9, 14) మరో వైపు, “సమస్త జనాంగముల” నుండి అనేకమంది మొండి మేకలని నిరూపించుకున్నవారైయుంటారు. వారు “నిత్యశిక్షకు . . . పోవుదురు.” భూమికి ఎంతటి ఉపశమనం!

22, 23. ఉపమానం ఇంకా భవిష్యత్తులో నెరవేరాల్సి ఉంది కనుక, మన ప్రకటనాపని నేడు ఎందుకు ప్రాముఖ్యం?

22 ఉపమానంలో వర్ణించబడిన తీర్పు సమీప భవిష్యత్తులో ఉండగా, ఇప్పుడు కూడా ప్రాముఖ్యమైనదొకటి జరుగబోతోంది. ప్రజల్లో వేర్పాటును కలుగజేసే జీవాన్ని రక్షించే వర్తమానాన్ని ప్రకటించడంలో క్రైస్తవులమైన మనము పాల్గొంటున్నాము. (మత్తయి 10:32-39) పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమీయులు 10:13, 14) దేవుని నామంతో మరియు ఆయన రక్షణ సమాచారంతో మన బహిరంగ ప్రకటన 230 పైగా దేశాల్లో ప్రజలను చేరుతోంది. క్రీస్తు అభిషక్త సహోదరులు ఈ పనిని ఇంకా వేగిరం చేస్తున్నారు. సుమారు 50 లక్షల వేరే గొఱ్ఱెలు ఇప్పుడు వారితో చేరారు. మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, యేసు సహోదరులు ప్రకటించే సమాచారానికి ప్రతిస్పందిస్తున్నారు.

23 మనం ఇంటింట మరియు అనియతంగా ప్రకటించడంవల్ల ఈ వర్తమానాన్ని అనేకులు తెలుసుకున్నారు. యెహోవాసాక్షులను గూర్చి మరియు మనం ప్రాతినిధ్యం వహించడాన్ని గూర్చి మనకు తెలియని విధాల్లో తెలుసుకోగలరు. తీర్పు సమయం ఆసన్నమైనప్పుడు, సమాజపు బాధ్యతను మరియు కుటుంబ ప్రతిష్ఠను యేసు ఎంత మట్టుకు పరిగణిస్తాడు? మనం చెప్పలేము మరియు దాన్ని గూర్చి ఊహించడం వ్యర్థం. (1 కొరింథీయులు 7:14 పోల్చండి.) నేడు అనేకులు దేవుని ప్రజలు చెప్పినవాటిని పెడచెవిన పెట్టి, అపహసించి లేక వారిని హింసించడంలో పాల్గొంటారు. కాబట్టి, ఇది అతి నిర్ణయాత్మక కాలం; అలాంటి వారు యేసు మేకలుగా తీర్పుతీర్చేవారిగా వృద్ధి చెందవచ్చు.—మత్తయి 10:22; యోహాను 15:20; 16:2, 3; రోమీయులు 2:5, 6.

24. (ఎ) మన ప్రకటనా పనికి వ్యక్తులు ప్రతిస్పందించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఈ పఠనం మీరు మీ పరిచర్య విషయంలో వ్యక్తిగతంగా ఏ దృక్పథాన్ని కల్గివుండేందుకు సహాయపడింది?

24 అయితే అనేకులు అనుకూలంగా ప్రతిస్పందిస్తారు, దేవుని వాక్యాన్ని పఠిస్తారు మరియు యెహోవాకు సాక్షులౌతారు. ఇప్పుడు మేకల్లా కనిపించే వారు మారి గొఱ్ఱెలాంటివారుకావచ్చు. క్రీస్తు సహోదరుల్లోని శేషించినవారికి ప్రతిస్పందిస్తూ వారికి చురుకుగా మద్దతునిచ్చేవారు, యేసు తీర్పుతీర్చేందుకు కూర్చున్నప్పుడు అంటే సమీప భవిష్యత్తులో ఆయన కుడిపార్శ్వమున ఉండేందుకు ఆధారాన్నందించే రుజువును ఇప్పుడు ఇస్తున్నారు. వీరు ఇప్పుడు ఆశీర్వదించబడుతున్నారు మరియు ఆశీర్వదించబడతారు. ఆ విధంగా, ఈ ఉపమానం మనం మరింత ఆసక్తితో క్రైస్తవ పరిచర్యలో పనిచేసేందుకు మనలను పురికొల్పాలి. ఆలస్యం కాకముందే, మనం రాజ్య సువార్తను ప్రకటించేందుకు మనకు వీలున్నంతమట్టుకు చేసేందుకు మనం ఇష్టపడాలి మరియు ఆ విధంగా ఇతరులు ప్రతిస్పందించేందుకు మనం అవకాశమివ్వాలి. ఆ తర్వాత తీర్పుతీర్చడం యేసు పని, అది శిక్షవిధించేటువంటిదైనా అనుకూలమైనదైనా అది ఆయన బాధ్యతే.—మత్తయి 25:46.

[అధస్సూచీలు]

a కావలికోట ఫిబ్రవరి 15, 1994 16-21 పేజీలు చూడండి.

b ఎల్‌ ఎవాన్‌హెలియో దె మాతియో ఇలా వ్రాస్తున్నది: “నిత్యజీవం కచ్చితమైన జీవం; దానికి విరుద్ధమైనది కచ్చితమైన శిక్ష. గ్రీకు విశేషణం ఎయినోస్‌ కాలనిడివిని సూచించడం లేదుగానీ ప్రాముఖ్యంగా అది ఎలాంటిది అన్నదాన్ని సూచిస్తుంది. కచ్చితమైన శిక్ష ఏమిటంటే, నిత్య మృత్యువు.”—రిటైరైన ప్రొఫెసర్‌ హ్వాన్‌ మాటియోస్‌ (పొంటిఫికల్‌ బిబ్లికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, రోమ్‌) మరియు ప్రొఫెసర్‌ ఫెర్నాండో కమచో (సైద్ధాంతిక క్రేందం, సెవిల్‌), మాడ్రిడ్‌, స్పెయిన్‌ 1981.

మీకు జ్ఞాపకముందా?

◻ మేకలు మరియు గొఱ్ఱెల ఉపమానానికి భవిష్యత్‌ అన్వయింపు ఉందని మత్తయి 24:29-31 మరియు మత్తయి 25:31-33 మధ్య ఏ సమాంతరాలు, కనపరుస్తున్నాయి మరియు అది ఎప్పుడు నెరవేరుతుంది?

◻ యేసు సహోదరులలో “మిక్కిలి అల్పులైన” వారు ఎవరు?

◻ “నీతిమంతులు” అని యేసు ఉపయోగించిన పదం, ఎవరిని సూచిస్తున్నది ఎవరిని సూచించడంలేదని గుర్తించేందుకు మనకు ఎలా సహాయపడుతుంది?

◻ ఉపమానం భవిష్యత్తులో నెరవేరినప్పటికీ, మన ప్రకటనాపని ఇప్పుడెందుకు ప్రాముఖ్యం మరియు అత్యవసరం?

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

సమాంతరాలను గమనించండి

మత్తయి 24:29-31 — మత్తయి 25:31-33

మహాశ్రమ ప్రారంభమైన తర్వాత, మనుష్యకుమారుడు వస్తాడు — మనుష్యకుమారుడు వస్తాడు

గొప్ప మహిమతో వస్తాడు — మహిమతో వస్తాడు మరియు మహిమాన్విత సింహాసనంపై కూర్చుంటాడు

ఆయనతో దూతలు ఉండడం — దూతలు ఆయనతో రావడం

భూమిమీది అన్ని తెగలవారు ఆయనను చూస్తారు — జనాంగాలన్ని సమకూర్చబడడం; మేకలకు తీర్పుతీర్చబడుతుంది చివరికి (మహాశ్రమ ముగుస్తుంది)

[క్రెడిట్‌ లైను]

Garo Nalbandian

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి