ప్రేమతో వారలా చేశారు
కెనడాలోనున్న నమ్మకస్థురాలు, అతిథి ప్రియురాలు అయిన ఒక విధవరాలు యౌవనురాండ్రైన నలుగురు కుమార్తెలను నిజ క్రైస్తవులుగా పెంచుతుంది. ఆమె ఇంటికి విస్తృతమైన మరమ్మత్తులు చేయవలసిన అవసరం ఉందని సంఘంలోని పెద్దలు గమనించారు. తానే ఆ పని చేసుకోవాలంటే ఆమెకు తగినంత డబ్బుగాని, నైపుణ్యంగాని లేవు. కాబట్టి, 1 తిమోతి 5:9, 10 నందున్న సూత్రంతో పొందికగా, ఆమె కొరకు ఆ పని చేసిపెట్టడానికి పెద్దలు జ్ఞానయుక్తంగా ఏర్పాట్లు చేశారు. ఎలా?
ఆ విధవరాలు, ఆమె పిల్లలు ఐదు రోజులు వేరే చోట ఉండేలా ఏర్పాట్లు చేయబడ్డాయి. సంఘంలోని 80 కంటే ఎక్కువమంది వస్తువులను, డబ్బును, సమయాన్ని ఇవ్వడం ద్వారా హృదయపూర్వక మద్దతునిచ్చారు. ఆ కుటుంబం వెళ్లిపోయిన వెంటనే, ఆసక్తిగల పనివాళ్లు తేనెటీగల్లాగ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి యొక్క వెలుపలి భాగమంతా మరమ్మత్తు చేయబడింది. గోడలకు ఉన్న రంధ్రాలను పూడ్చి, పెయింటు వేయబడింది. నేలంతా చదును చేయబడి క్రొత్తగా చేయబడింది. నేలపై క్రొత్త బండలు, తివాసి వేయబడ్డాయి. అవసరమైన విద్యుత్ సంబంధ ఏర్పాట్లన్నీ పునఃస్థాపించబడ్డాయి. పాతవైపోయిన సామానుకు బదులు క్రొత్తవి తీసుకురాబడ్డాయి. కేవలం ఐదు రోజుల్లో అంతా పునర్నూతనం చేయబడింది!
ఆ పని యొక్క ఉత్సాహపూరిత వాతావరణం ఇరుగుపొరుగున పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సాక్షుల ప్రయత్నాలు చూసి 80 సంవత్సరాల ఒక పొరుగింటాయన పెయింటు వేసే తన బ్రష్ తీసుకుని వచ్చి సహాయం చేస్తానన్నాడు. స్వచ్ఛంద సేవకుల్లో ఒకరి యజమాని, వంటగదిలో పొయ్యి కొరకు వెంటిలేషన్ పరికరాన్ని ఉచితంగా ఇచ్చాడు. మరో యజమాని వంటగది కొరకు క్రొత్త అలమారాలను విరాళంగా ఇచ్చాడు. ఒక వ్యక్తి ఎంతగా ప్రభావితుడయ్యాడంటే, ఆయన యెహోవాసాక్షుల గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఇష్టపడ్డాడు. అతడు మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ఆసక్తితో తీసుకున్నాడు.
ఆ విధవరాలు, ఆమె పిల్లలు తిరిగి వచ్చాక వారి ముఖాలపై ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అప్పుడు ఎంతో కన్నీళ్లు, నవ్వులు, హత్తుకోవడం జరిగింది, క్రైస్తవ ప్రేమ మరియు భావనల మరచిపోలేని ఘట్టం. వాస్తవానికి, సంఘంలోని అవసరత గల సభ్యుల ఎడల నిజమైన ప్రేమ, శ్రద్ధ చూపించడం నిజ క్రైస్తవత్వానికి ఒక చిహ్నం, ఎందుకంటే పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము.”—గలతీయులు 6:10.