తీర్పు సింహాసనం ఎదుట మీరు ఎలా నిలుచుంటారు?
“తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.”—మత్తయి 25:31.
1-3. న్యాయం విషయంలో ఆశాభావ దృక్పథాన్ని కల్గివుండేందుకు మనకు ఏ కారణాలున్నాయి?
‘అపరాధా లేక నిరపరాధా?’ కొన్ని కోర్టు కేసులను గూర్చిన నివేదికలను విన్నప్పుడు అనేకులు ఇలా ఆలోచిస్తారు. న్యాయాధిపతులూ న్యాయ నిర్ణయ సభ్యులు యథార్థంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు, కానీ సామాన్యంగా న్యాయం నిలుస్తుందా? న్యాయాన్నివ్వడంలో మీరు అన్యాయం అనుచితాలను గూర్చి వినలేదా? లూకా 18:1-8 నందున్న ఉపమానంలా అలాంటి అన్యాయం క్రొత్తేమీ కాదని మనం చూస్తాం.
2 మానవ న్యాయం విషయంలో మీ అనుభవం ఎలావున్నా, చివరిలో యేసు చెప్పినవాటిని గమనించండి: “దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; . . . అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమ్మీద విశ్వాసము కనుగొనునా?”
3 అవును, తన సేవకులు చివరికి న్యాయం పొందేలా యెహోవా చూస్తాడు. యేసు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇందులో ఇమిడివున్నాడు, ఎందుకంటే మనం ప్రస్తుత దుష్టవిధానంలోని “అంత్యదినములలో” జీవిస్తున్నాము కనుక. భూమ్మీదినుండి దుష్టత్వాన్ని తీసివేసేందుకు యెహోవా తన శక్తిమంతుడైన కుమారుని ఉపయోగించుకుంటాడు. (2 తిమోతి 3:1; 2 థెస్సలొనీకయులు 1:7, 8; ప్రకటన 19:11-16) మేకలూ గొఱ్ఱెల ఉపమానమని తరచు అనబడే యేసు ఇచ్చిన చివరి దృష్టాంతం నుండి ఆయన వహించే పాత్రను గూర్చి మనం జ్ఞానాన్ని పొందగలం.
4. మేకలూ గొఱ్ఱెల ఉపమానపు సమయాన్ని గూర్చి మనం ఎలా అర్థంచేసుకున్నాము, అయితే మనం ఈ ఉపమానానికి ఎందుకు అవధానమిస్తాము? (సామెతలు 4:18)
4 ఆ ఉపమానం యేసు 1914లో రాజుగా కూర్చుని ఆ నాటినుండి తీర్పులను—అంటే, గొఱ్ఱెల్లాంటి ప్రజలకు నిత్యజీవితం, మేకలవంటివారికి నిత్య నాశనం అని తీర్చడాన్నే సూచిస్తోందని ఎంతకాలంగానో మనం భావిస్తున్నాము. అయితే ఈ ఉపమానాన్ని పునఃపరిశీలించడం దాని సమయం మరియు అది దేన్ని దృష్టాంతపరుస్తుంది అన్న విషయాలను గూర్చి సరిచేయబడిన అవగాహనను అందిస్తుంది. ఈ క్రొత్త అవగాహన మన ప్రకటన పని ప్రాముఖ్యతను మరియు దాని ఎడల ప్రజల ప్రతిస్పందనను మరింత బలపరుస్తుంది. ఈ ఉపమానాన్ని గూర్చి అధిక అవగాహన కొరకు ఆధారాన్ని చూసేందుకు రాజులు న్యాయాధిపతులుగా యెహోవా యేసుక్రీస్తులిరువురిని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.
సర్వోన్నత న్యాయాధిపతిగా యెహోవా
5, 6. యెహోవాను రాజుగానూ న్యాయాధిపతిగానూ దృష్టించడం ఎందుకు సమంజసం?
5 అన్నింటిమీద అధికారంతో యెహోవా విశ్వాన్ని పరిపాలిస్తాడు. ఆది అంతం లేకుండ ఆయన ‘సకలయుగములలో రాజు.’ (1 తిమోతి 1:17; కీర్తన 90:2, 4; ప్రకటన 15:3) ఆయన శాసనాలు లేక నియమాలు చేసి వాటిని అమలుపర్చే అధికారం గలవాడు. అయితే ఆయన అధికారంలో ఆయన ఓ న్యాయాధిపతి. యెషయా 33:22 ఇలా అంటోంది: “యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును.”
6 వాదాలూ వివాదాంశాలకు యెహోవా న్యాయాధిపతియని దేవుని సేవకులు ఎన్నడో గుర్తించారు. ఉదాహరణకు, సొదొమ గొమొఱ్ఱాల దుష్టత్వాలకు గల రుజువులను ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు’ పరిశీలించిన తర్వాత, దానిలో నివసించేవారు నాశనం చేయబడాలని తీర్పుతీర్చాడు మరియు ఆ నీతియుక్త తీర్పును అమలుపర్చాడు. (ఆదికాండము 18:20-33; యోబు 34:10-12) యెహోవా తన తీర్పులను ఎల్లప్పుడూ అమలుపర్చగల నీతియుక్తమైన న్యాయాధిపతియని అది మనకు కచ్చితంగా హామీనిస్తుంది!
7. ఇశ్రాయేలుతో వ్యవహరించేటప్పుడు యెహోవా న్యాయాధిపతిగా ఎలా ప్రవర్తించాడు?
7 ప్రాచీన ఇశ్రాయేలు నందు, కొన్నిసార్లు యెహోవా నేరుగా తీర్పుతీర్చేవాడు. ఆ నాడు ఓ పరిపూర్ణ న్యాయాధిపతి విషయాలను నిర్ణయిస్తున్నాడని తెలుసుకోవడం మీకు ఓదార్పుకరంగా ఉండి ఉండేది కాదా? (లేవీయకాండము 24:10-16; సంఖ్యాకాండము 15:32-36; 27:1-11) దేవుడు, తీర్పుతీర్చేందుకు నియమాలుగా, అన్ని విధాలా మంచివైన ‘న్యాయ విధులను’ కూడా అందించాడు. (లేవీయకాండము 25:18, 19; నెహెమ్యా 9:13; కీర్తన 19:9, 10; 119:7, 75, 164; 147:19, 20) ఆయన “అందరి న్యాయాధిపతి” కనుక అది మనందరి మీద ప్రభావం చూపుతుంది.—హెబ్రీయులు 12:23.
8. దానియేలు ఎలాంటి యుక్తమైన దర్శనం చూశాడు?
8 ఈ విషయాన్ని గూర్చి సాక్ష్యాన్నిస్తూ మనకు “ప్రత్యక్షసాక్షి” ఉన్నాడు. ప్రభుత్వాలకూ లేక సామ్రాజ్యాలకు సూచనయైన భయంకరమైన క్రూరమృగాల దర్శనం ప్రవక్తైన దానియేలుకు ఇవ్వబడింది. (దానియేలు 7:1-8, 17) ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా . . . ఉండెను.” (దానియేలు 7:9) దానియేలు సింహాసనాలనూ ‘మహా వృద్ధుడొకడు [యెహోవా] కూర్చుండడాన్ని’ చూశాడని గమనించండి. ‘ఇక్కడ దానియేలు దేవుడు రాజు కాబోతున్నాడనే సాక్ష్యమిస్తున్నాడా,’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
9. సింహాసనంపై ‘కూర్చోవడం’ అంటే ఒక అర్థమేమిటి? ఉదాహరణలివ్వండి.
9 ఎవరో సింహాసనంపై “కూర్చు”న్నారు అని మనం చదివినప్పుడు, అతను రాజు కాబోతున్నాడని మనం అనుకోవచ్చు, ఎందుకంటే బైబిలు కొన్నిసార్లు అలాంటి భాషను ఉపయోగించింది. ఉదాహరణకు: “అతడు [జిమ్రీ] సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే . . . ” (1 రాజులు 16:11; 2 రాజులు 10:30; 15:12; యిర్మీయా 33:17) మెస్సీయను గూర్చిన ఓ ప్రవచనం ఇలా చెప్పింది: “అతడు . . . సింహాసనాసీనుడై యేలును.” కాబట్టి, ‘సింహాసనాసీనుడు’ కావడం అంటే రాజుకావడం అన్నమాట. (జెకర్యా 6:12, 13) సింహాసనంపై కూర్చునేవానిగా యెహోవా వర్ణించబడ్డాడు. (1 రాజులు 22:19; యెషయా 6:1; ప్రకటన 4:1-3) ఆయన ‘యుగయుగములకు రాజు.’ అయినప్పటికీ, సర్వాధిపత్యంలో ఓ నూతన విషయాన్ని నొక్కి చెప్పాడు కనుక, మరలా తన సింహాసనంపై కూర్చుంటున్నట్లుగా ఆయన రాజు అయ్యాడని ఆయనను గూర్చి చెప్పవచ్చు.—1 దినవృత్తాంతములు 16:1, 31; యెషయా 52:7; ప్రకటన 11:15-17; 15:3; 19:1, 2, 6.
10. ఇశ్రాయేలీయుల రాజుల ప్రాముఖ్యమైన పని ఏమిటి? ఉదహరించండి.
10 అయితే ఇక్కడ ఓ కీలకాంశం ఉంది: ప్రాచీన రాజుల ప్రాముఖ్యమైన పని వాదాలను వినడం, తీర్పుతీర్చడం. (సామెతలు 29:14) ఇద్దరు స్త్రీలు ఒకే బిడ్డను కావాలని కోరినప్పుడు సొలొమోను ఇచ్చిన జ్ఞానయుక్తమైన తీర్పును జ్ఞాపకముంచుకోండి. (1 రాజులు 3:16-28; 2 దినవృత్తాంతములు 9:8) వారి ప్రభుత్వ కట్టడాల్లో ఒకటి ‘ఆయన తీర్పుతీర్చే సింహాసనా మంటపము,’ అది “తీర్పు మంటపము” అని కూడా పిలువబడింది. (1 రాజులు 7:7) “న్యాయము తీర్చుటకై సింహాసనములు . . . స్థాపించబడియున్నవి” అని యెరూషలేము వర్ణించబడింది. (కీర్తన 122:5) స్పష్టంగా, ‘సింహాసనంపై కూర్చోవడం’ అంటే న్యాయాధికారాన్ని అమలుపర్చడం అనే భావం కూడా ఉంది.—నిర్గమకాండము 18:13; సామెతలు 20:8.
11, 12. (ఎ) దానియేలు 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన యెహోవా కూర్చోవడంలో ఉన్న భావమేమిటి? (బి) యెహోవా తీర్పుతీర్చేందుకు కూర్చుంటాడనేందుకు ఇతర లేఖనాలు ఎలా ధృవపరుస్తున్నాయి?
11 ‘మహా వృద్ధుడొకడు కూర్చోవడాన్ని’ దానియేలు చూసిన ఆ సన్నివేశానికి మనమిప్పుడు మరలా వెళదాం. దానియేలు 7:10, NW ఇంకా ఇలా చెబుతోంది: “న్యాయసభ కూర్చుండగా తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరవబడెను.” అవును, లోక పరిపాలనను గూర్చి తీర్పుతీర్చేందుకూ మరియు మనుష్య కుమారుడు పరిపాలించేందుకు అర్హుడని తీర్పుతీర్చేందుకు మహా వృద్ధుడు కూర్చున్నాడు. (దానియేలు 7:13, 14) మనుష్య కుమారునితో పరిపాలించేందుకు తీర్పుతీర్చబడినవారిని ‘మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చె’ను అని మనం చదువుతాము. (దానియేలు 7:22) చివరికి ‘న్యాయసభ కూర్చుని’ చివరి ప్రపంచాధిపత్యంపై ప్రతికూల తీర్పును తీర్చింది.—దానియేలు 7:26 NW.a
12 కాబట్టి, దేవుడు ‘సింహాసనంపై కూర్చుని’ ఉండడాన్ని దానియేలు చూడడం ఆయన తీర్పుతీర్చేందుకు వస్తున్నాడన్న భావాన్ని కల్గివుంది. దానికి ముందు దావీదు ఇలా పాడాడు: “నీవు [యెహోవా] నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు.” (కీర్తన 9:3, 7) మరి యోవేలు ఇలా వ్రాశాడు: “నలుదిక్కులనున్న అన్య జనులకు తీర్పు తీర్చుటకై నేను [యెహోవా] యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికి రావలెను.” (యోవేలు 3:12; యెషయా 16:5ను పోల్చండి.) యేసు మరియు పౌలు, వాదాన్ని వినేందుకు ఓ మానవుడు కూర్చుని తీర్పుతీర్చిన పరిస్థితుల్లో ఉన్నారు.b—యోహాను 19:12-16; అపొస్తలుల కార్యములు 23:3; 25:6.
యేసు స్థానం
13, 14. (ఎ) యేసు రాజు అవుతాడనేందుకు దేవుని ప్రజలకు ఏ అభయముండెను? (బి) యేసు సింహాసనంపై ఎప్పుడు కూర్చున్నాడు మరియు ఆయన సా.శ. 33 నుండి ఆయన ఏ భావంలో పరిపాలించడం ప్రారంభించాడు?
13 యెహోవా రాజు మరియు న్యాయాధిపతి. మరి యేసు విషయమేమిటి? ఆయన జననాన్ని ప్రకటించిన దూత ఇలా చెప్పాడు: “ప్రభువైన [“యెహోవా,” NW] దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. . . . ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:32, 33) దావీదు రాజరికానికి యేసే శాశ్వత వారసుడు. (2 సమూయేలు 7:12-16) ఆయన పరలోకంనుండి పరిపాలిస్తాడు, ఎందుకంటే దావీదు ఇలా చెప్పాడు: “ప్రభువు నా ప్రభువుతో [యేసుతో] సెలవిచ్చినవాక్కు—నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.”—కీర్తన 110:1-4.
14 అది ఎప్పుడు జరుగుతుంది? మానవునిగా ఉన్నప్పుడు యేసు రాజుగా పరిపాలించలేదు. (యోహాను 18:33-37) సా.శ. 33లో ఆయన మరణించాడు, పునరుత్థానమయ్యాడు, పరలోకానికి వెళ్లాడు. హెబ్రీయులు 10:12 ఇలా చెబుతోంది: “ఈయన . . . పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి . . . దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.” యేసుకు ఏ అధికారముంది? “సమస్తమైన అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, . . . ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున [దేవుడు] కూర్చుండబెట్టుకొనియున్నాడు.” (ఎఫెసీయులు 1:20-22) ఎందుకంటే అప్పుడు యేసుకు క్రైస్తవులపై రాజ్యాధికారం ఉండేది కనుకనే, యెహోవా “ఆయన మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను” అని పౌలు వ్రాయగల్గాడు.—కొలొస్సయులు 1:13; 3:1.
15, 16. (ఎ) సా.శ. 33 నందు యేసు దేవుని రాజ్యపు రాజు కాలేదని ఎందుకు చెబుతాము? (బి) దేవుని రాజ్యంలో యేసు పరిపాలనను ఎప్పుడు ప్రారంభించాడు?
15 అయితే ఆ సమయంలో, జనాంగాలపై యేసు రాజుగాగానీ లేక న్యాయాధిపతిగాగానీ పనిచేయలేదు. దేవుని రాజ్యంలో రాజుగా పనిచేసేందుకు ఎదురుచూస్తూ ఆయన దేవుని ప్రక్కన కూర్చున్నాడు. పౌలు ఆయనను గూర్చి ఇలా వ్రాశాడు: “నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనిని గూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?”—హెబ్రీయులు 1:13.
16 యేసు వేచివుండే కాలం, అదృశ్యపరలోకంలో ఆయన దేవుని రాజ్యానికి పాలకుడైన 1914 నందు అంతమైందనేందుకు యెహోవాసాక్షులు ఎంతో రుజువును ప్రచురించారు. ప్రకటన 11:15, 18 ఇలా చెబుతోంది: “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలును.” “జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను.” అవును, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రాజ్యాలు ఒకదానిపై మరియొకటి కోపాన్ని కనపర్చాయి. (లూకా 21:24) 1914 నుండి మనం చూసిన యుద్ధాలూ భూకంపాలూ తెగుళ్లు ఆహారకొరతలూ మరియు అలాంటి సంఘటనలూ నేడు యేసు దేవుని రాజ్యమందు పరిపాలిస్తున్నాడని మరియు లోకాంతం సమీపంలో ఉందని నిశ్చయపరుస్తున్నాయి.—మత్తయి 24:3-14.
17. ఇంతవరకు మనం ఏ ప్రాముఖ్యమైన విషయాలను స్థాపించాము?
17 ఓ క్లుప్తమైన పునఃసమీక్ష: దేవుడు రాజుగా సింహాసనంపై కూర్చున్నాడని, కానీ మరో భావంలో ఆయన సింహాసనంపై తీర్పుతీర్చేందుకు కూర్చొనగలడని చెప్పవచ్చును. సా.శ. 33 నందు యేసు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మరి ఇప్పుడు ఆ రాజ్యానికి ఆయన రాజు. అయితే ఇప్పుడు రాజుగా పరిపాలిస్తున్న యేసు న్యాయాధిపతిగా కూడా సేవచేస్తాడా? ప్రత్యేకంగా ఈ సమయంలో మనం అందులో ఎందుకు ఆసక్తిని కల్గివుండాలి?
18. యేసు కూడా న్యాయాధిపతి అవుతాడనేందుకు ఏ రుజువుంది?
18 న్యాయాధిపతులను నియమించే హక్కుగల యెహోవా, తన ప్రమాణాలకు సరితూగే వానిగా యేసును ఎన్నుకున్నాడు. ఆత్మీయంగా సజీవులైన ప్రజలను గూర్చి మాట్లాడినప్పుడు యేసు దీన్ని చూపాడు: “తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు.” (యోహాను 5:22) అయితే, న్యాయంలో యేసు వహించే పాత్ర అలాంటి తీర్పుకంటే ఎంతో ఉన్నతమైనది, ఎందుకంటే ఆయన మృతులకూ సజీవులకూ న్యాయాధిపతి. (అపొస్తలుల కార్యములు 10:42; 2 తిమోతి 4:1) పౌలు ఒకసారి ఇలా ప్రకటించాడు: “తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును [దేవుడు] నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”—అపొస్తలుల కార్యములు 17:31; కీర్తన 72:2-7.
19. యేసు న్యాయాధిపతిగా కూర్చున్నాడనడం ఎందుకు సరైనది?
19 యేసు తన మహిమాన్వితమైన సింహాసనంపై ఓ న్యాయాధిపతి యొక్క ప్రధాన పాత్రలో కూర్చుంటాడని తేల్చిచెప్పడాన్ని మనం న్యాయంగా చెప్పగలమా? అవును. యేసు అపొస్తలులతో ఇలా చెప్పాడు: “(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.” (మత్తయి 19:28) నేడు యేసు ఆ రాజ్యానికి రాజైనప్పటికీ, మత్తయి 19:28 నందు ప్రస్తావించిన అతని తదుపరి కార్యాల్లో, వెయ్యేండ్లకాలంలో సింహాసనంపై కూర్చుని తీర్పుతీర్చడం ఇమిడివుంది. ఆ సమయంలో ఆయన యావత్ మానవజాతికి తీర్పుతీరుస్తాడు, నీతిమంతులకూ అనీతిమంతులకు తీర్పుతీరుస్తాడు. (అపొస్తలుల కార్యములు 24:15) మన కాలాలనూ మరియు మన జీవితాలనూ సూచించే యేసు ఉపమానాల్లో ఒకదానివైపు మనం మన అవధానాన్ని మళ్లించినప్పుడు దీన్ని మనస్సులో ఉంచుకోవడం సహాయకరంగా ఉంటుంది.
ఉపమానం ఏమి చెబుతోంది?
20, 21. మన కాలానికి సంబంధించిన దేన్ని యేసు అపొస్తలులు ఆయనను అడిగారు, మరి అది ఏ ప్రశ్నకు నడిపించింది?
20 యేసు చనిపోవడానికి కొద్ది కాలం ముందు ఆయన అపొస్తలులు ఆయనను ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:3) ‘అంతము వచ్చే’ ముందు భూమ్మీద జరుగబోయే ప్రాముఖ్యమైన పరిణామములను గూర్చి యేసు ముందుగానే చెప్పాడు. ఆ అంతానికి కొద్ది ముందుగా, “మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట” జనాంగములు చూస్తాయి.—మత్తయి 24:14, 29, 30.
21 అయితే, మహిమతో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆ జనాంగముల ప్రజలు ఏమి అనుభవిస్తారు? “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును” అనే మాటలతో ప్రారంభమయ్యే, మేకలూ గొఱ్ఱెల ఉపమానం నుండి మనం దాన్ని కనుగొందాము.—మత్తయి 25:31, 32.
22, 23. మేకలూ గొఱ్ఱెల ఉపమానం, 1914 నందు నెరవేరడం ప్రారంభంకాలేదని ఏ అంశాలు సూచిస్తున్నాయి?
22 మనం ఎంతో కాలంగా అర్థంచేసుకున్నట్లుగా, 1914 నందు యేసు రాజ్యాధికారంతో కూర్చున్నప్పటి సమయానికి ఈ ఉపమానం అన్వయించబడగలదా? మత్తయి 25:34 ఆయనను రాజు అని పేర్కొంటోంది, కనుక 1914 నందు యేసు రాజు అయినప్పటినుండి ఈ ఉపమానం సహేతుకంగా అన్వయించబడగలదు. అయితే దాని వెంటే ఆయన ఏ తీర్పునుతీర్చాడు? అది ‘అన్ని జనాంగముల’ తీర్పుకాదు. బదులుగా, “దేవుని ఇంటి”వారమని చెప్పుకునే వారిపై ఆయన అవధానం మరలుతుంది. (1 పేతురు 4:17) మలాకీ 3:1-3 ప్రకారంగా, యెహోవా దూతగా భూమ్మీది శేషించబడినవారిని న్యాయబద్ధముగా పరిశీలించేందుకు యేసు వచ్చాడు. ‘దేవుని ఇల్లు’ అని అబద్ధముగా చెప్పుకొనిన క్రైస్తవమత సామ్రాజ్యంపై తీర్పుకుకూడా అదే సమయం.c (ప్రకటన 17:1, 2; 18:4-8) అయితే ఆ సమయంలో లేక ఆ సమయం నుండి సమస్త జనాంగాల ప్రజలను గొర్రెలుగా లేక మేకలుగా తీర్పుతీర్చేందుకు యేసు కూర్చున్నాడని ఏదీ సూచించడంలేదు.
23 ఉపమానంలో యేసు కార్యాలను విశ్లేషిస్తే, చివరికి సమస్త జనాంగాలకు తీర్పు తీరుస్తాడని గమనిస్తాము. అలాంటి తీర్పు, గత దశాబ్దాలుగా చనిపోతున్న వ్యక్తులను నిత్య నాశనానికి లేక నిత్య జీవానికి తీర్పుతీరుస్తున్నాడన్నట్లుగా, అలాంటి తీర్పు అనేక సంవత్సరాల వరకు కొనసాగుతుందని ఆ ఉపమానం కనపర్చడంలేదు. ఈ ఆధునిక కాలంలో మరణించిన అనేకమంది ప్రజలు మానవజాతి సామాన్య సమాధిలోకి వెళ్లినట్లుగానే ఉంది. (ప్రకటన 6:8; 20:13) అయితే, జీవించి ఉండి తన న్యాయ తీర్పును ఎదుర్కొనే ‘సమస్త జనాంగముల’ ప్రజలకు యేసు తీర్పు తీర్చే కాలాన్ని ఈ ఉపమానం సూచిస్తుంది.
24. మేకలూ గొఱ్ఱెల ఉపమానం ఎప్పుడు నెరవేరుతుంది?
24 మరో మాటల్లో, మనుష్య కుమారుడు మహిమతో వచ్చేటప్పటి భవిష్యత్ పరిస్థితిని ఈ ఉపమానం సూచిస్తోంది. అప్పుడు జీవించి ఉన్న ప్రజలకు తీర్పు తీర్చేందుకు ఆయన కూర్చుంటాడు. వారు తమను తాము ఏమని కనపర్చుకున్నారో దాని మీద ఆయన తీర్పు ఆధారపడివుంటుంది. ఆ సమయంలో “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో” స్పష్టంగా నిర్ణయించబడుతుంది. (మలాకీ 3:1, 8) తీర్పు ప్రకటించడం మరియు దాన్ని అమలుపర్చడం పరిమిత సమయంలో జరుగుతుంది. ఆయా వ్యక్తులను గూర్చి స్పష్టమైనవాటి ఆధారంగా యేసు న్యాయవంతమైన నిర్ణయాలనిస్తాడు.—2 కొరింథీయులు 5:10 కూడా చూడండి.
25. మత్తయి 25:31, మనుష్య కుమారుడు మహిమాన్విత సింహాసనంపై కూర్చోవడాన్ని గూర్చి మాట్లాడుటలో దేన్ని వర్ణిస్తోంది?
25 కాబట్టి, మత్తయి 25:31 నందు ప్రస్తావించినట్లుగా, తీర్పు తీర్చేందుకు యేసు ‘తన మహిమగల సింహాసనంపై కూర్చోవడం,’ ఈ శక్తివంతమైన రాజు జనాంగములపై తీర్పును ప్రకటించి అమలుపర్చే భవిష్యత్ కాలానికి అన్వర్తిస్తుందని భావం. అవును, యేసు ఇమిడియున్న మత్తయి 25:31-33, 46 తీర్పు దృశ్యం నందలి దానియేలు 7వ అధ్యాయంలోని సన్నివేశానికి పోలినది, అక్కడ మహావృద్ధుడైన పరిపాలిస్తున్న రాజు న్యాయాధిపతిగా తన పాత్రను నిర్వహించేందుకు కూర్చున్నాడు.
26. ఉపమానం యొక్క ఏ నూతన వివరణ దృష్టిలోకి వస్తోంది?
26 మేకలూ గొఱ్ఱెల ఉపమానాన్ని ఈ విధంగా అర్థంచేసుకోవడం, మేకలూ గొఱ్ఱెల గూర్చిన తీర్పు భవిష్యత్తుకు చెందినదని సూచిస్తోంది. అది మత్తయి 24:29, 30 నందు ప్రస్తావించబడిన “మహా శ్రమ” సంభవించిన తర్వాత మరియు మనుష్య కుమారుడు ‘తన మహిమలో’ వచ్చిన తర్వాత జరుగుతుంది. (మార్కు 13:24-26 పోల్చండి.) ఆ తర్వాత, దుష్టవిధానమంతా దాని అంతానికి చేరుకున్నప్పుడు యేసు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి, తీర్పును చెప్పి, దాన్ని అమలుపరుస్తాడు.—యోహాను 5:30; 2 థెస్సలొనీకయులు 1:7-10.
27. యేసు చివరి ఉపమానాన్ని గూర్చి ఏమి తెలుసుకోవడంలో మనం ఆసక్తిని కల్గివుండాలి?
27 మేకలూ గొఱ్ఱెలు ఎప్పుడు తీర్పుతీర్చబడతాయి అన్న విషయాన్ని చూపిస్తూ, ఇది యేసు ఉపమానం ఎప్పుడు నెరవేరుతుందన్న దాన్ని గూర్చిన అవగాహనను స్పష్టపరుస్తుంది. అయితే ఆసక్తిగా రాజ్య సువార్తను ప్రకటించేవారిని అదెలా ప్రభావితం చేస్తుంది? (మత్తయి 24:14) అది మన పనిని తక్కువ ప్రాధాన్యం గలదానిగా చేస్తుందా లేక అది మరింత భారమైన బాధ్యతను తెస్తుందా? దీని వల్ల మనమెలా ప్రభావితమౌతామన్న విషయాన్ని మనం తదుపరి శీర్షికలో చూద్దాము.
[అధస్సూచీలు]
a “న్యాయ సభ” అని దానియేలు 7:10, 26 నందు అనువదించబడిన పదం ఎజ్రా 7:26 మరియు దానియేలు 4:37; 7:22 వచనాల్లోనూ కనిపిస్తుంది.
b క్రైస్తవులు ఒకరినొకరు న్యాయస్థానాలకు తీసుకువెళ్లడాన్ని గూర్చి పౌలు ఇలా అడిగాడు: “కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని న్యాయాధిపతులను చేస్తారా [అక్షరార్థంగా, “కూర్చుండబెట్టుదురా”]?”—1 కొరింథీయులు 6:4, NW.
c వాచ్‌టవర్ బైబిలు అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇన్‌కార్పొరేటెడ్ వారు ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలోని 56, 73, 235-45, 260 పేజీలను చూడండి.
మీకు జ్ఞాపకముందా?
◻ యెహోవా రాజుగానూ న్యాయాధిపతిగానూ ఎలా పనిచేస్తాడు?
◻ ‘సింహాసనంపై కూర్చోవడం’ విషయంలో ఏ రెండు అర్థాలున్నాయి?
◻ మత్తయి 25:31 సమయాన్ని గూర్చి మేము మునుపు ఏమని చెప్పాము, కానీ సరిదిద్దబడిన దృష్టికోణానికి ఏ ఆధారముంది?
◻ మత్తయి 25:31 నందు సూచించినట్లుగా, మనుష్యకుమారుడు సింహాసనంపై ఎప్పుడు కూర్చుంటాడు?