యుద్ధంలేని లోకం—ఎప్పుడు?
ఐక్యరాజ్య సమితి అధికారపత్రం అక్టోబరు 24, 1945 నందు అమలులోకి వచ్చింది. ప్రపంచశాంతి కొరకు మానవులు క్రితమెన్నడు రూపొందించని ఓ సమగ్ర వ్యూహాత్మక సంస్థయైయున్నది. మొదట్లో తన 51 సభ్య దేశాలతో ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద అంతర్జాతీయ సంస్థగా తయారైంది. అంతేకాకుండ మొట్టమొదటిసారిగా శాంతి భద్రతలు నెలకొల్పేందుకు యుద్ధరహిత లోకాన్ని తెచ్చే సానుకూలత ఒక అంతర్జాతీయ సంస్థకు కలిగింది.
నేడు 185 సభ్య దేశాలతో ఐక్యరాజ్య సమితి మునుపెన్నటికంటే ఎక్కువ బలం కల్గివుంది. అలాగైనట్లైతే, చరిత్రలోకెల్లా అతి శక్తివంతమైన అంతర్జాతీయ సంస్థ దాని మంచి ఉద్దేశాలను ఎందుకు పూర్తిగా నిర్వర్తించలేకపోయింది?
మతం—ఓ గొప్ప అడ్డంకు
ఓ పెద్ద క్లిష్టమైన విషయమేమిటంటే లోక వ్యవహారాల్లో మతం నిర్వర్తించే పాత్ర. నిజమే, ఐక్యరాజ్య సమితి ప్రారంభం నుండి ప్రధానమైన మతాలు దానికి తమ మద్దతునందిస్తామని బహిరంగంగా ప్రకటించాయి. ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవాన్ని సూచిస్తూ, పోప్ జాన్ పాల్ II అది “శాంతిని ప్రబోధించేందుకూ కాపాడేందుకు అతి శ్రేష్ఠమైన ఉపకరణం” అని పేర్కొన్నాడు. అతని ఆలోచనతో మతనాయకుల ప్రపంచ సమాఖ్య ఏకీభవించింది. అయితే, మతానికి మరియు ప్రభుత్వానికి మధ్యనున్న ఈ యుక్త సంబంధం మతం ఐక్యరాజ్య సమితికి ఓ అడ్డంకని మరియు నష్టదాయకమైనదన్న విషయాన్ని మాత్రం దాచలేదు.
శతాబ్దాలుగా, జాతీయ ద్వేషం, యుద్ధాలు మరియు జాతినిర్మూలనాలకు మద్దతునివ్వడంలో లేక అవి అధికమయ్యేలా చేయడంలో మతం ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది. ఇటీవలి సంవత్సరాల్లో, మతాసక్తియనే ముసుగులో, పొరుగువారు ఒకరినొకరు చంపుకున్నారు. బాల్కన్స్‌లోని యుద్ధానికి సంబంధించి “జాతి ప్రక్షాళన” అనే పదం విరివిగా ఉపయోగించబడింది. అయితే, అక్కడివారికి ఒకరి ఎడల ఒకరికి గల విద్వేషం జాతిపై ఆధారితమైనది కాదుకానీ మతపరమైన సంబంధాలపై ఆధారితమైనది, ఎందుకంటే వారిలో అనేకులకు ఒకే విధమైన జాతి ఆవిర్ఛవం ఉంది. అవును, మునుపటి యుగోస్లావియాలోని రక్తపాతానికి మతం అధిక బాధ్యత వహించింది మరియు ఐక్యరాజ్య సమితి దాన్ని ఆపలేకపోయింది.
సరైన విధంగానే, ఓ మత కళాశాల ప్రొఫెసరు ఇటీవల ఇలా అన్నారు: “అంతకంతకు మత యుద్ధాలు పెరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో, అది అసౌకర్యాన్ని కల్గించినా మతాన్ని, జాతి నిర్మూలనను పరీక్షించడం మనం చేయవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం.” ప్రపంచ శాంతి కొరకైన ప్రయత్నాలకు మతం ఎలా విరోధంగా ఉందన్న విషయాన్ని గూర్చిన సరిక్రొత్త జ్ఞానం నేడు స్పష్టమౌతోంది.
1981 ఐక్యరాజ్య సమితి తీర్మానం ఇలా పేర్కొంది: “అసహనపు ప్రత్యక్షతల వల్ల, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మతం లేక విశ్వాసాలను గూర్చి ఇంకా తేడాలు ఉండడం వల్ల చింతించి, అలాంటి అసహనాన్ని అన్ని ఆకృతులలోనుండి అన్ని విధానాలనుండి త్వరగా తీసివేయడానికి మరియు మతం లేక విశ్వాసం ఆధారంగా ఉత్పన్నమయ్యే తేడాలను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను గైకొనేందుకు తీర్మానించడమైనది.”
తమ తీర్మానానికి అనుగుణంగా, 1995వ సంవత్సరాన్ని సహన సంవత్సరమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే, ఉన్న వాస్తవాన్నిబట్టి మాట్లాడాలంటే, మతం వల్ల విభజించబడిన లోకంలో శాంతి భద్రతలను సాధించడం ఎప్పటికైనా సాధ్యమేనా?
మతం యొక్క భవిష్యత్తు
బైబిలు గ్రంథమైన ప్రకటన దానికి జవాబును చెబుతోంది. అది, “రాణి”గా “భూరాజులనేలు” ఓ సూచనార్థకమైన “మహా వేశ్య”ను గూర్చి మాట్లాడుతోంది. ఈ వేశ్య ‘లజ్జాకరమైన సుఖభోగములతో’ జీవిస్తూ లోక ప్రభుత్వాలతో సంబంధంకల్గివుంది. ఈ ప్రభుత్వాలు, ఆ వేశ్య హాయిగా సవారీ చేసే “ఎఱ్ఱని మృగము”గా వర్ణించబడ్డాయి. (ప్రకటన 17:1-5, 18; 18:7) “మహాబబులోను”గా పేరుపొందిన శక్తివంతమైన మరియు అవినీతికరమైన ఈ స్త్రీకి, విగ్రహారాధనా సంబంధిత మతానికి పుట్టినిల్లైన పురాతన బబులోనుగా పేరుపెట్టబడింది. నేడు ఈ వేశ్య, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న ప్రపంచ మతాలన్నింటిని సూచించడం సమంజసమే.
తగిన కాలంలో, దేవుడు ఈ మృగపు సైనిక విభాగములవారి హృదయాల్లో చర్య తీసుకోవాలనే ఉద్దేశాన్ని కలిగిస్తాడని ఈ వృత్తాంతం చెబుతోంది. వారు “ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” (ప్రకటన 17:16)a ఆ విధంగా, అబద్ధ మతాన్ని తీసివేసే పనిలో శక్తివంతమైన దేశాలను ఉపయోగించుకోవడం ద్వారా యెహోవా దేవుడు తానే చొరవ తీసుకుంటాడు. తన ఉన్నతమైన ఆలయాలు మరియు మందిరాలతో సహా ప్రపంచవ్యాప్త మత విధానం పూర్తిగా నాశనం చేయబడుతుంది. శాంతిభద్రతల స్థాపనకు వారికిగల మతపరమైన అడ్డంకు తొలగింపబడుతుంది. అయినప్పటికీ, భూమిపై నిజమైన శాంతి భద్రతలుంటాయా?
అపరిపూర్ణ మానవ స్వభావం
మతాన్ని తొలగించడం నిజంగా యుద్ధంలేని లోకానికి మార్గం సుగమం చేస్తుందనే హామీ ఏమైనావుందా? అలా దీన్ని తీసివేయడం, యుద్ధంలేని లోకానికి తావివ్వగలదా? లేదు. ఐక్యరాజ్య సమితి ఓ సందిగ్థావస్థను ఎదుర్కుంటూనే ఉంటుంది. ఒకవైపున, ప్రజలకు శాంతి భద్రతలు కావాలి. అయితే, మరో వైపున శాంతి భద్రతలు లేకుండా చేసేదీ ప్రజలే. మానవ లక్షణాలైన ద్వేషం, అహంకారం, గర్వం, స్వార్థం మరియు అజ్ఞానం అన్ని వివాదాలకూ యుద్ధాలకూ కారణం.—యాకోబు 4:1-4.
మన దినాల్లోని ప్రజలు “స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు” ఉంటారని బైబిలు ముందుగానే చెప్పింది.—2 తిమోతి 3:1-4.
“అనేక సమాజాల్లో అతి తీవ్రమైన సాంఘిక మరియు నైతిక కొరతను లోకం అనుభవిస్తోంది” అని సెక్రెటరీ జనరలైన బుట్రోస్-బుట్రోస్ ఘాలీ ఒప్పుకున్నారు. ఎంతటి దౌత్య సంబంధమైన పనులైనా మానవ స్వభావానికున్న హానికరమైన లక్షణాలను ప్రభావరహితం చేయలేవు.—ఆదికాండము 8:21 పోల్చండి; యిర్మీయా 17:9.
యేసుక్రీస్తు—సమాధానకర్తయగు అధిపతి
ప్రపంచ శాంతిని తీసుకువచ్చే సామర్థ్యం ఐక్యరాజ్య సమితికి లేదన్నది స్పష్టం. దాని సభ్యులూ మద్దతుదారులందరి లక్ష్యాలు ఎంత ఉన్నతమైనా వారందరూ అపరిపూర్ణ మానవులే. “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు” బైబిలు చెబుతోంది. (యిర్మీయా 10:23) అంతేకాకుండ, దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు: “రాజుల చేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.”—కీర్తన 146:3.
“సమాధానకర్తయగు అధిపతి” అయిన తన కుమారుని ద్వారా యెహోవా దేన్ని సాధిస్తాడన్న విషయాన్ని గూర్చి బైబిలు ముందుగానే చెబుతోంది. యెషయా 9:6, 7 ఇలా పేర్కొంటోంది: “మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరుపెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగు”ను.
యాభై సంవత్సరాల విఫల ప్రయత్నాలతో ప్రపంచ రాజ్యాలు అలసిపోయాయి. అవి త్వరలోనే వేశ్యలాంటి మత సంస్థలను నాశనం చేస్తాయి. అప్పుడు, “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన యేసుక్రీస్తూ, ఆయన పరలోక యుద్ధయోధులూ కలిసి, మానవ ప్రభుత్వాలన్నింటినీ విలీనంచేసి దేవుని సర్వాధిపత్యాన్ని నిరాకరించిన వారిని నాశనం చేస్తారు. (ప్రకటన 19:11-21; దానియేలు 2:44 పోల్చండి.) దీని ద్వారా యెహోవా దేవుడు యుద్ధంలేని ఒక లోకాన్ని తీసుకొస్తాడు.
[అధస్సూచీలు]
a మహాబబులోనును గూర్చి లోతుగా పఠించేందుకు, 1988 నందు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ న్యూయార్క్ ఇంకార్పొరేటెడ్ వారు ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు అనే పుస్తకంలోని 33 నుండి 37 అధ్యాయాలను చూడండి.
[7వ పేజీలోని బాక్సు]
ఐక్యరాజ్య సమితి ఎడల క్రైస్తవ దృక్పథం
బైబిలు ప్రవచనంలో, తరచూ మానవ ప్రభుత్వాలు క్రూర మృగాలుగా సూచించబడ్డాయి. (దానియేలు 7:6, 12, 23; 8:20-22) కనుక, అనేక దశాబ్దాలుగా ప్రకటన 13 మరియు 17 అధ్యాయాల్లోని క్రూరమృగాలను కావలికోట పత్రిక లోక ప్రభుత్వాలుగా గుర్తించింది. అందులో ఐక్యరాజ్య సమితి కూడా ఉంది. అది ప్రకటన 17వ అధ్యాయంలో ఏడు తలలు మరియు పది కొమ్ములుగల ఎర్రని క్రూరమృగంగా చిత్రీకరించబడింది.
అయినప్పటికీ ఈ లేఖనాధార స్థానం, ప్రభుత్వాలూ లేక వాటి అధికారులయెడల ఎటువంటి అగౌరవాన్ని కనపర్చేందుకు ప్రోత్సహించడంలేదు. బైబిలు స్పష్టంగా ఇలా పేర్కొంటోంది: “ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడియున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.”—రోమీయులు 13:1, 2.
తత్ఫలితంగా, కచ్చితమైన రాజకీయ తటస్థతను కల్గివుండే యెహోవాసాక్షులు, మానవ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోరు. వారు ఎన్నడూ విప్లవాలను ప్రోత్సహించరు లేక రాజకీయ ప్రతిఘటన క్రియల్లో పాల్గొనరు. బదులుగా, మానవ సమాజంలో నియమనిబంధనలు కాపాడేందుకు ఏదొక విధమైన ప్రభుత్వం అవసరమని వారు గ్రహిస్తారు.—రోమీయులు 13:1-7; తీతు 3:1.
లోకంలోని ఇతర ప్రభుత్వ విధానాల్ని యెహోవాసాక్షులు ఎలా దృష్టిస్తారో అదే విధంగా ఐక్యరాజ్య సమితిని వారు దృష్టిస్తారు. ఐక్యరాజ్య సమితి దేవుని అనుమతివల్లనే ఇంకా ఉంటోందని వారు అంగీకరిస్తున్నారు. బైబిలుకు అనుగుణంగా, తాము దేవునికి విరుద్ధంగా పాపంచేయకుండా ఉన్నంతవరకు ప్రభుత్వాలన్నింటికీ తగిన గౌరవాన్ని మరియు విధేయతను కనుపరుస్తారు.—అపొస్తలుల కార్యములు 5:29.