సంవత్సరాల నిరాశాయుత ప్రయత్నాలు
“ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము ఇలా నిశ్చయించుకున్నాము మన జీవిత కాలంలో రెండుసార్లు మానవజాతికి చెప్పలేనంతటి విషాదాన్ని తీసుకువచ్చిన యుద్ధపు బాధ బారినుండి తర్వాతి తరాలవారిని కాపాడాలని, మరియు ప్రాథమిక మానవహక్కులయందు, మానవుని గౌరవప్రతిష్ఠల్లో, స్త్రీపురుషుల మరియు చిన్నాపెద్ద దేశాల సమాన హక్కులలో మరలా విశ్వాసం కల్గించాలి. . .”—ఐక్యరాజ్యసమితి అధికారపత్ర పీఠిక.
అక్టోబరు 24, 1995 ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవ దినము. ఆ అధికార పత్రం ప్రకారంగా వ్యవస్థ యొక్క అసలైన సూత్రాలకూ గమ్యాలకూ 185 ప్రస్తుత సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలి, అవి ఏమిటంటే: అంతర్జాతీయ శాంతి భద్రతను కాపాడడం; ప్రపంచ శాంతికి హాని వాటిల్లజేసే ఉద్ధృత కార్యాలను అణచివేయడం; దేశాల మధ్య స్నేహపూరితమైన సంబంధాలను కల్గివుండేందుకు ప్రోత్సహించడం; జాతి, స్త్రీపురుష భేదం, భాష, లేక మతం అనే తారతమ్యం లేకుండ ప్రజలందరి ప్రాథమిక స్వాతంత్ర్యాలను సంరక్షించడం; అంతేకాకుండ ఆర్థిక, సాంఘిక మరియు సాంస్కృతిక సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పొందడం.
ప్రపంచంలో శాంతి భద్రతలను తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్యసమితి 50 సంవత్సరాలుగా గణనీయమైన ప్రయత్నాలను చేసింది. అది మూడవ ప్రపంచ యుద్ధం జరగకుండా మరియు న్యూక్లియర్ బాంబుల్ని ఉపయోగించి మానవుల్ని పెద్ద మొత్తంలో నాశనం చేయడం పునరావృతమవ్వకుండా నివారించి ఉండవచ్చు. ఐక్యరాజ్య సమితి, కోట్లాదిమంది పిల్లలకు ఆహారం మరియు మందులను అందించింది. అది, ఇతర వస్తువులతో సహా రక్షిత మంచినీటిని మరియు అపాయకరమైన రోగాలకు నిరోధకాలను అందిస్తూ అనేక దేశాల్లో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడేందుకు సహాయపడింది. కోట్లాదిమంది శరణార్థులు మానవత్వపు సహాయాన్ని పొందారు.
అది సాధించినవాటికి గుర్తింపుగా, ఐక్యరాజ్య సమితికి అయిదుసార్లు నోబుల్ శాంతి బహుమతిని బహుకరించడం జరిగింది. అయినప్పటికీ, శోచనీయమైన జీవిత సత్యమేమిటంటే, మనం ఇంకా యుద్ధంలేని లోకంలో జీవించడం లేదు.
శాంతి భద్రత—సాధించలేని లక్ష్యాలు
యాభై సంవత్సరాల ప్రయత్నాల తర్వాత కూడా, శాంతి భద్రతలు ఇంకా సాధించలేని లక్ష్యాలుగానే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఇటీవలిచ్చిన ఓ ప్రసంగంలో, “ఎన్నో ఆశలూ సదవకాశాలు మరియు సాఫల్యాలు గల ఈ శతాబ్దం, ఎంతో వినాశనము మరియు నిరాశ గల యుగంగా కూడా గడిచింది” అని అంటూ తన నిరాశను వ్యక్తపర్చాడు.
ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1994 ముగుస్తుండగా ఇలా పేర్కొంది: “వేలకొలది ప్రజలు మరణిస్తున్న 150 యుద్ధాలు లేక దొమ్మి యుద్ధాలు జరుగుతున్నాయి—లెక్కించి చూస్తే సైనికులకన్నా సామాన్య ప్రజలే ఎక్కువగా మరణిస్తున్నారు మరియు లక్షలాది మంది శరణార్థులౌతున్నారు.” సాయుధ పోరాటం వల్ల 1945 నుండి రెండు కోట్లమంది ప్రజలు తమ జీవితాలను కోల్పోయారని ఐక్యరాజ్య సమితి యొక్క పౌర సమాచార శాఖ నివేదించింది. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారైన మాడిలీన్ ఆల్భైట్, “అనేక విధాల్లో ప్రాంతీయ పోరాటాలు మరింత క్రూరమౌతున్నాయి” అని పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన మరియు భేదాలు వార్తల్లో ప్రతి రోజూ కనిపిస్తున్నాయి. అనేక దేశాలు పరస్పరం స్నేహంగా ఉండే బదులు పరస్పరం సహించుకుంటున్నాయి.
“ఐక్యరాజ్య సమితి 1980ల వరకూ కూడా సదుద్దేశ వైఫల్యానికి సమీపంలో ఉండేది” అని ఐక్యరాజ్య సమితికి బ్రిటన్ రాయబారైన సర్ డేవిడ్ హనే ఒప్పుకున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జర్నల్ బుట్రోస్-బుట్రోస్ ఘాలీ, శాంతిని కాపాడే కార్యవర్తన క్రియలు వచ్చేసరికి సభ్యదేశంలో మరింత అలక్ష్యం మరియు ఉదాసీనత కనిపిస్తున్నాయని వాపోయాడు. అనేకమంది సభ్యులకు “ఐక్యరాజ్య సమితి అత్యంత ప్రాముఖ్యమైనది కాదు” అని ఆయన ముగించాడు.
ప్రచారవ్యవస్థ ప్రభావం
ఐక్యరాజ్య సమితి ఎంతో శక్తివంతంగా కనిపించినప్పటికీ, రాజకీయం మరియు ప్రచారవ్యవస్థ దాని ప్రయత్నాలను తరచూ భంగపర్చాయి. ఐక్యరాజ్య సమితికి దాని సభ్యుల మద్దతు లేకపోతే అది శక్తివిహీనమౌతుంది. అయితే ప్రజల అంగీకారం లేకుండ, అనేకమంది ఐక్యరాజ్య సమితి సభ్యులు దానికి మద్దతునివ్వరు. ఉదాహరణకు, ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం “సొమాలీయా మరియు బోస్నియానందు స్పష్టంగా కనిపించే వైఫల్యాలు, ఈ సంస్థ వ్యర్థమైనదేకాకుండ నిజానికి అపాయకరమైనదని అనేకమంది అమెరికన్లను ఒప్పింపజేశాయి.” ప్రజలకు గల ఈ దృక్పథం, ఐక్యరాజ్య సమితికి అమెరికా అందించే ఆర్థిక సహాయం తగ్గించమని ప్రతిపాదించాలని కొందరు అమెరికా రాజకీయనాయకులను సమ్మతింపజేసింది.
ఐక్యరాజ్య సమితిని తీవ్రంగా విమర్శించే విషయం వచ్చేసరికి వార్తా సంస్థలు వెనకాడడం లేదు. ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ పనులను వర్ణించేటప్పుడు, “పూర్తి అశక్తత,” “అనిర్వాహకమైన,” “అసమర్థత,” మరియు “శక్తిహీనత” వంటి పదాలను విరివిగా ఉపయోగించాయి. “వాస్తవిక ప్రపంచానికి అనుగుణంగా మలుచుకునే పోరాటంలో ఐక్యరాజ్య సమితి నత్తనడక అసలు పెత్తందారీగానే ఉంది” అని ఇటీవల ది వాషింగ్టన్ పోస్ట్ నేషనల్ వీక్లీ ఎడిషన్ పేర్కొంది.
మరో వార్తా పత్రిక, రువాండా నందలి హత్యాకాండ విషయంలో సెక్రెటరీ జనరలైన బుట్రోస్-బుట్రోస్ ఘాలీ వ్యక్తపర్చిన నిరాశతో నిండిన మాటలను ఎత్తి వ్రాసింది. ఆయన ఇలా చెప్పాడు: “అది ఐక్యరాజ్య సమితికి మాత్రమే ఓటమి కాదు; అది అంతర్జాతీయ సమాజానికే ఓటమి. మరియు మనమందరమూ ఈ ఓటమికి బాధ్యులము.” ఐక్యరాజ్య సమితి “శాంతికి అతి గొప్ప అపాయమైన అణ్వస్త్ర ఆయుధాల వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైంది” అని 1993లోని ప్రఖ్యాత దూరదర్శని ప్రత్యేక కార్యక్రమం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి “దశాబ్దాలుగా మాటలు మాత్రమే చెబుతోందని” ఆ దూరదర్శని కార్యక్రమం చెప్పింది.
విస్తారంగా వ్యాపించిన ఈ నిరుత్సాహ భావం ఐక్యరాజ్య సమితి అధికారుల మనస్సుల్లో భారంగా ఉండి, వారి బాధను మరింత అధికం చేస్తుంది. అయితే నిరాశాయుతంగా ఉన్నప్పటికీ, ఐక్యరాజ్య సమితి 50వ వార్షికోత్సవంనాడు అనేకులు తమ అనుకూల దృక్పథాన్ని పునర్నూతనంచేసుకుని సరిక్రొత్త ప్రారంభంకొరకు నిరీక్షిస్తున్నారు. రాయబారియైన అల్బర్ట్ ఐక్యరాజ్య సమితి పొరపాట్లను అంగీకరించినప్పటికీ, “మునుపు మనం ఎక్కడ ఉండేవాళ్లమన్న దాని గురించి మాట్లాడడం మానేసి, మనం ఎక్కడికి వెళుతున్నామన్న విషయాన్ని గూర్చి మాట్లాడాలి,” అని అన్నప్పుడు అనేకుల అభిప్రాయాన్ని ఆమె ప్రతిధ్వనింపజేసింది.
అవును, ఈ లోకం ఎక్కడికి వెళుతోంది? యుద్ధం లేని లోకం ఎన్నడైనా ఉంటుందా? ఉన్నట్లైతే, అందులో ఐక్యరాజ్య సమితి ఏ పాత్రను నిర్వహిస్తుంది? అంతేకాకుండ, మీరు దైవభయం గలవారైతే, ‘అందులో దేవుడు ఏ పాత్రను నిర్వహిస్తాడని’ మీరు అడగాలి.
[4వ పేజీలోని బాక్సు]
నిరాశాయుత ప్రయత్నాలు
యుద్ధాలు, పేదరికం, నేరం, అవినీతి ఉన్నంత కాలం శాంతి భద్రతలు నిలవలేవు. ఐక్యరాజ్య సమితి ఇటీవల ఈ క్రింది గణాంక వివరాలను విడుదల చేసింది.
యుద్ధాలు: “1989 మరియు 1992 మధ్యకాలంలో వివిధ తెగలమధ్య 82 సాయుధ పోరాటాల్లో 79 అంతర్గతమైనవే, అంటే అనేకం వివిధ తెగల మధ్య జరిగినవే; క్షతగాత్రుల్లో 90 శాతంమంది సామాన్య పౌరులే.”—ఐక్యరాజ్య సమితి పౌర సమాచార విభాగం (యుఎన్‌డిపిఐ)
ఆయుధాలు: “48 దేశాల్లోని 95 కంటే ఎక్కువమంది ఉత్పత్తిదారులు, ప్రతి సంవత్సరం 50 లక్షల నుండి 1 కోటి మిలటరీ వ్యతిరేక మందు పాత్రలను తయారు చేస్తున్నారని ఐసిఆర్‌సి [అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ] అంచనా వేస్తుంది.”—శరణార్థుల కొరకైన ఐక్యరాజ్య సమితి ఉన్నత కమీషనర్. (యుఎన్‌హెచ్‌సిఆర్)
“ఆఫ్రికానందు, 18 దేశాల్లో సుమారు మూడు కోట్ల మందు పాత్రలు విస్తరించి ఉన్నాయి.”—యుఎన్‌హెచ్‌సిఆర్.
పేదరికం: “ప్రపంచవ్యాప్తంగా, ప్రతి ఐదుగురిలో ఒకరు అంటే నూరు కోట్లమంది కంటే ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు మరియు 1.3 కోట్ల నుండి 1.8 కోట్ల మంది పేదరిక సంబంధిత కారణాలవల్ల మరణిస్తున్నారని అంచనా వేయబడింది.”—యుఎన్‌డిపిఐ
నేరం: “ప్రపంచవ్యాప్తంగా 1980ల నుండీ నమోదు చేయబడిన నేరాలు 5 శాతం పెరిగాయి; కేవలం అమెరికాలోనే ప్రతి సంవత్సరం 3.5 కోట్ల నేరాలు జరుగుతున్నాయి.”—యుఎన్‌డిపి
అవినీతి: “ప్రజా అవినీతి సర్వసాధారణమైపోతోంది. కొన్ని దేశాల్లో ఆర్థికపరమైన మోసాలు, ఆ దేశంలోని 10 శాతం స్థూల జాతీయోత్పత్తికి సరిసమానంగా ఉంటాయని అంచనా వేయబడింది.”—యుఎన్‌డిపిఐ