కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 8/1 పేజీలు 25-29
  • పట్టుదలకు లభించే ప్రతిఫలాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పట్టుదలకు లభించే ప్రతిఫలాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పట్టుదల యొక్క ఉదాహరణలు
  • యెహోవా ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను’ అనుగ్రహిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • సహనం, పట్టుదలవల్ల సంతోషకరమైన ఫలితాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • “ఓపిక కలిగియుండుడి”
    మన రాజ్య పరిచర్య—1999
  • పట్టుదల ద్వారా సాఫల్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 8/1 పేజీలు 25-29

పట్టుదలకు లభించే ప్రతిఫలాలు

ఆమె సా.శ. 32వ సంవత్సరంలో ఫెనికయనందు నివసించిన గ్రీసు దేశస్థురాలైన స్త్రీ. ఆమె కుమార్తె తీవ్రంగా అస్వస్థురాలైయుంది, ఆ స్త్రీ తన కుమార్తె స్వస్థత నొందాలని ఎంతో ఆతురత కలిగివుంది. తమ ప్రాంతాన్ని ఒక అపరిచితుడు—రోగులను స్వస్థపర్చే శక్తులున్నాయని పేరుపొందిన ఒక విదేశీయుడు—దర్శిస్తున్నాడని విని, ఆయనను దర్శించి సహాయం కొరకు ఆయనను అర్థించాలని ఆమె నిశ్చయించుకుంది.

ఆయనను కలిసిన తర్వాత, ఆమె ఇలా వేడుకుంటూ మోకాళ్లూనింది: “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి బహు బాధపడుచున్నది.” ఆ విధంగా, గ్రీసు దేశస్థురాలైన స్త్రీ తన కుమార్తెను స్వస్థపర్చమని యేసును వేడుకుంది.

ఇది చేయడానికి ఆమెకు కావలసిన ధైర్యాన్ని మరియు దీనత్వాన్ని మీరు ఊహించగలరా? యేసు కొంత అధికారం మరియు పేరు కలిగి ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండెను, తనను గూర్చిన వివరాలు ఎవరూ తెలుసుకోవడం తనకు ఇష్టం లేదని ఆయన మునుపు తెలియజేసి ఉండెను. ఆయన తన అపొస్తలులకు ఎంతో అవసరమైన విశ్రాంతిని కొంత పొందవచ్చని, అన్యులైన అవిశ్వాసుల మధ్య పనిచేయకూడదని వారిని ఫెనికయకు తీసుకొని వెళ్లియుండెను. అంతేగాక, యేసు ఒక యూదుడు, ఆమె అన్యురాలు, నిరాకరింపబడిన ప్రజలైన అన్యులతో సహవాసాన్ని యూదులు అసహ్యించు కోవడం గురించి ఆమెకు నిస్సందేహంగా తెలుసు. అయినా, తన బిడ్డకు స్వస్థత కలిగేలా చేయాలనే ఆమె దృఢంగా నిశ్చయించుకుంది.

ఆ స్త్రీ ఆ సమయంలో సహాయం కోరడాన్ని మాన్పించాలని యేసు ఆయన శిష్యులు ప్రయత్నించారు. మొదట్లో, యేసు ఆమెతో ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత, ఆమె పట్టుదలతో పదే పదే చేసిన విన్నపాల మూలంగా అపొస్తలులు ఉద్రేకంగా యేసుతో ఇలా అన్నారు: “ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుము.”

కాని ఆమె తనకు తగిన సమాధానం దొరికే వరకు విడిచిపెట్టలేదు. బదులుగా, ఆమె యేసుకు మ్రొక్కి, “ప్రభువా నాకు సహాయము చేయుము” అని వేడుకుంది.

ఇశ్రాయేలు కుమారుల ఎడల గల తన ప్రాథమిక బాధ్యతను ఎత్తిచూపిస్తూ, అదే సమయంలో, ఆమె విశ్వాసాన్ని నిశ్చయతను పరీక్షిస్తూ, యేసు వాత్సల్యపూరితంగా ఆమెకిలా వివరించాడు: “[ఇశ్రాయేలు] పిల్లలరొట్టె తీసికొని కుక్క పిల్లలకు [అన్యులకు] వేయుట యుక్తము కాదు.”

తన జాతిని గూర్చి ఆయన చేసిన ప్రతికూల పోలికకు అభ్యంతరపడడానికి బదులు, ఆమె దీనంగా ఇలా సమాధానమివ్వడం ద్వారా తన విన్నపాన్ని కొనసాగించింది: “నిజమే ప్రభువా, కుక్క పిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా.”

గ్రీసు దేశస్థురాలైన ఆ స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకోవడం ద్వారా మరియు ఆమె విన్నపాలకు అనుగుణంగా చర్య తీసుకోవడం ద్వారా యేసు ఆమె పట్టుదలకు తగిన ప్రతిఫలాన్నిచ్చాడు. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె పూర్తిగా స్వస్థత పొంది ఉండడం చూచినప్పుడు ఎంత సంతోషించి ఉంటుందో ఊహించండి!—మత్తయి 15:21-28; మార్కు 7:24-30.

ఆ మొదటి శతాబ్దపు స్త్రీవలెనే, యెహోవాను ప్రీతిపర్చి ఆయన అనుగ్రహాన్ని పొందేందుకు మనం చేసే ప్రయత్నాలలో మనం పట్టుదల కలిగివుండవలసిన అవసరముంది. గ్రీసు దేశస్థురాలైన స్త్రీ విషయంలో వలెనే, “మేలు చేయుటయందు” మనం కలిగివుండే పట్టుదల ఎంతో ఆశీర్వదింపబడుతుందని బైబిలు మనకు అభయమిస్తుంది.—గలతీయులు 6:9.

పట్టుదల అంటే ఏమిటి? అదెందుకు అవసరం? ఈ లక్షణాన్ని పోగొట్టుకొని లొంగిపోవడానికి ఏ విషయాలు కారణం కాగలవు? మన సృష్టికర్త మరియు తండ్రియైన యెహోవాను సేవించడంలో మనం ఇప్పుడు పట్టుదల కలిగి ఉంటే, మనం ఏ ప్రతిఫలాలను పొందగలమని ఎదురుచూడవచ్చు?

“పట్టుదల” అనే క్రియాపదాన్ని ఒక నిఘంటువు “అడ్డంకులు, హెచ్చరికలు, లేక అవాంతరాలు ఎదురైనప్పటికీ ఏదైనా ఒక సంకల్పాన్ని, స్థితిని, లేక కార్యాన్ని స్థిరంగా మరియు దృఢంగా చేపట్టడం. . . . ఉనికిలో కొనసాగడం; మిగిలి ఉండడం” అని నిర్వచిస్తుంది.

యెహోవా చిత్తాన్ని చేయడంలో ఆయన సేవకులు పట్టుదల కలిగి ఉండాలని బైబిలు పదేపదే పురికొల్పుతుంది. ఉదాహరణకు, “రాజ్యమును . . . మొదట వెదకుడి,” “మేలైనదానిని చేపట్టుడి,” “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి,” మరియు మేలు చేయుటయందు “విసుక” వద్దు అని మనకు చెప్పబడింది.—మత్తయి 6:33; 1 థెస్సలొనీకయులు 5:21; రోమీయులు 12:12; గలతీయులు 6:9.

అనుదిన జీవిత విషయాల్లో, మనమందరం కొనసాగేందుకు కలిగివుండవలసిన మరియు పెంపొందింపజేసుకోవలసిన లక్షణం పట్టుదల. అది లేకుండా మనం నిజమైన, నిత్య విలువ గలిగినదేదీ పొందలేము. లేచి నిలబడి మొదటి తప్పటడుగులు వేయడానికి ప్రయత్నించే బిడ్డ ఉదాహరణను పరిశీలించండి. ఒక్కరోజులోనే లేచి నిలబడి సులభంగా నడవడం నేర్చుకొనే శిశువులు అరుదుగా ఉంటారు. బిడ్డలుగా మనమందరం నడవడంలో చివరికి కొంత విజయాన్ని సాధించే ముందు బహుశా అనేకసార్లు ప్రయత్నించి విఫలమైవుంటాము. మొదటి సారి పడినప్పుడే ప్రయత్నించడం మానుకోవడానికి మనం నిశ్చయించుకొనివుంటే ఏమి జరిగి ఉండేది? మనం ఇప్పటికీ మన చేతులు, మోకాళ్లతో ప్రాకుతూ ఉండి ఉండేవాళ్లము! తగిన గమ్యాలను చేరడానికి, నైపుణ్యాలు మరియు ఆత్మాభిమానం వంటి వాటిలో సరైన అభివృద్ధులను సాధించేందుకు పట్టుదల అత్యవసరం. ఒక పేరు పొందిన సామెత ఇలా ఉంది: “విజయమొందేవారు విడిచిపెట్టరు, విడిచిపెట్టేవారు విజయమొందరు.”

ప్రత్యేక సామర్థ్యాలవల్ల లేక నైపుణ్యాల వల్ల విజయం కచ్చితం కాదని ఎంతో కాలంగా పయినీర్లుగా ఉన్నవారు గుర్తిస్తారు. దానికి పట్టువిడువని గుణము, యెహోవా చిత్తాన్ని సంపూర్ణంగా చేయాలనే నిశ్చయత, తాత్కాలిక అవాంతరాలు మరియు నిరుత్సాహ సమయాల్లో ధైర్యం అవసరం. దేవుని ఆశీర్వాదాలలో నిరంతరం భాగం వహించాలనే లక్ష్యాన్ని స్పష్టంగా దృష్టిలో ఉంచుకోవాలి.

అవును, యెహోవా అనుగ్రహాన్ని పొందాలని మరియు జీవపు పరుగు పందెంలో గెలవాలని ప్రయత్నించే మనందరికీ పట్టుదల, దృఢ నిశ్చయత, సహనం అవసరం. ఈ లక్షణాలు లేకుంటే మనం యెహోవా అనుగ్రహాన్ని, నిజ జీవిత ప్రతిఫలాన్ని కోల్పోయే సాధ్యత ఉంది.—కీర్తన 18:20; మత్తయి 24:13; 1 తిమోతి 6:18, 19.

తన ఇతర బాధ్యతలలో కంటే ఆత్మీయ కార్యకలాపాల్లో పట్టుదల కలిగి ఉండడం క్రైస్తవునికి తరచూ ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన కుటుంబపు శారీరక అవసరతల గురించి శ్రద్ధ వహించడానికి లౌకిక ఉద్యోగం వద్ద కష్టపడి పనిచేస్తుండ వచ్చు, కాని తన భార్యా పిల్లలతో క్రమమైన బైబిలు పఠనాన్ని నిర్వహించడంలో అతడు ‘మరీ అలసిపోయి’ ఉండవచ్చు. క్రైస్తవ కార్యాల్లో పట్టుదల కలిగివుండడాన్ని ఏ కారణాలు అనేకులకు మరింత కష్టాన్ని కలిగిస్తాయి?

ఒక కారణం నిరుత్సాహం, ఇది మన స్వంత వ్యక్తిగత వైఫల్యాలు మరియు బలహీనతల వల్ల ఏర్పడుతుంది. మనం మన పొరపాట్ల గురించి ప్రతికూలంగా తలస్తే, యెహోవా మన పాపాలన్నిటినీ ఎన్నటికీ క్షమించలేడని భావిస్తూ నిరాశ చెంది విడిచిపెట్టవచ్చు.

లైంగిక దుర్నీతి, అవినీతి, ద్వేషం వంటివాటితో నిండిన లోకసంబంధమైన వాతావరణం మరో కారణం. (1 యోహాను 2:15, 16) లోక ప్రభావం పాడుచేయగల లేక నాశనం చేయగల “మంచి అలవాట్లలో” క్రైస్తవ పట్టుదల ఒకటి.—1 కొరింథీయులు 15:33.

ప్రకటనా పనిలో మనం కలిగివుండే పట్టుదల ప్రజలు మన పరిశుద్ధ సేవ ఎడల చూపించే వ్యతిరేకత లేక నిర్లక్ష్యత చేత బలహీనపర్చబడగలదు. నిరాశతో, మన ప్రాంతంలో ఉన్న ప్రజలకు సత్యం అవసరం లేదని మనం నిర్దారించుకోవచ్చు. ఇది మనం, ‘ప్రయోజన మేమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకొనేలా, పరిచర్య అనే మన ప్రత్యేక ఆధిక్యతను విడిచిపెట్టేలా చేయవచ్చు.

స్వయం నిమగ్నత అనే లోకసంబంధమైన భావంవల్ల కూడా మనం ప్రభావితం కావచ్చు. ఇతరులందరు హాయిగా ఆనందిస్తుంటే లేక కష్టపడకుండా ఉంటే, మనమే ఎందుకు పోరాడాలి, త్యాగం చేయాలి?—మత్తయి 16:23, 24 పోల్చండి.

యెహోవా చిత్తాన్ని చేయడంలో పట్టుదల కలిగివుండేందుకు, మనం క్రైస్తవ వ్యక్తిత్వాన్ని ధరించి, శరీరానుసారంగా కాదుగాని ఆత్మానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది. (రోమీయులు 8:4-8; కొలొస్సయులు 3:10, 12, 14) ఒక విషయం ఎడల యెహోవా దృక్పథాన్ని కలిగివుండడం మనం మన ప్రాముఖ్యమైన ఆత్మీయ కార్యకలాపాలను కొనసాగించడానికి మనకు సహాయం చేస్తుంది.—1 కొరింథీయులు 16:13.

పట్టుదల యొక్క ఉదాహరణలు

తీవ్రమైన శ్రమల్లోను తన ఎడల నమ్మకంగా, విశ్వాసంగా మిగిలిపోయిన సేవకుల పురికొల్పే మాదిరులను యెహోవా మనకు అందజేశాడు. వాటిని పరిశీలించడం ద్వారా, మనం క్రైస్తవ పట్టుదలను ఎలా పెంపొందింపజేసుకొని కలిగివుండవచ్చో, అది ఎందుకు విలువైనదో మనం తెలుసుకుంటాము.

యెహోవా నామాన్ని మహిమపర్చేందుకు ఎంతో వేదనననుభవించిన యేసు అత్యంత గొప్ప మాదిరి. పట్టుదలతో కూడిన ఆయన భక్తి కార్యాలను శ్రద్ధగా పఠించమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది: “ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.”—హెబ్రీయులు 12:1-3.

జీవం కొరకైన పరుగుపందెం స్వల్ప దూరం నిడివిగల పరుగు పందెం కాదుగాని అది బహు దూరపు పరుగు పందెం. అందుకే మనకు క్రీస్తు వంటి పట్టుదల అవసరం. పరుగుపందెంలోని చాలా భాగం వరకు గమ్యం లేక లక్ష్యం మనకు కనిపించకపోవచ్చు. పూర్తి, కష్టభరితమైన పరుగంతటిలో మనం దాన్ని మానసికంగా చేరగలిగేలా గమ్యం మన మనస్సు దృష్టిలో స్పష్టంగా ఉండాలి. యేసుకు అలాంటి మానసిక రూపం ఆయన ఎదుట ఉండేది, అదేమిటంటే, “తనయెదుట ఉంచబడిన ఆనందము.”

నేడు క్రైస్తవులకు ఈ ఆనందంలో ఇంకా ఏమి ఇమిడివుంది? ఒకటేమిటంటే, కొంతమందికి పరలోకంలో అమర్త్యమైన జీవం మరియు అనేకులకు భూమిపై నిత్యజీవమనే ప్రతిఫలం. అంతేగాక అది, యెహోవా హృదయానికి ఆనందం తేగలిగాను, దేవుని నామాన్ని ఘనపర్చడంలో కొంత భాగం వహించాను అని తెలుసుకోవడం వల్ల ఒకరికి కలిగే సంతృప్తికరమైన భావన కూడా.—సామెతలు 27:11; యోహాను 17:4.

ఆ ఆనందంలో, యెహోవాతో సన్నిహితమైన సంతోషకరమైన సంబంధం కూడా చేరివుంది. (కీర్తన 40:8; యోహాను 4:34) పరుగు పందాన్ని విడిచిపెట్టకుండా సహనంతో పరుగెత్తడానికి ఒకరికి కావలసిన శక్తిని ఇస్తూ, అలాంటి సంబంధం బలపర్చేదిగా, జీవాన్ని కాపాడేదిగా ఉంటుంది. అంతేగాక, తన సేవకులపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా యెహోవా ఆ సంబంధాన్ని ఆశీర్వదిస్తాడు, అది ఆనందం మరియు ఆనందకరమైన కార్యం అధికమవ్వడానికి కారణమౌతుంది.—రోమీయులు 12:11; గలతీయులు 5:22.

పట్టుదలతో కూడిన యోబు విశ్వాస మాదిరిని పరిశీలించడం ప్రయోజనకరం. ఆయన అపరిపూర్ణుడు, తన పరిస్థితి గురించి ఆయనకు పరిమితంగానే తెలుసు. గనుక ఆయన కొన్నిసార్లు స్వయం సమర్థన, నిరాశ వంటి మానసిక స్థితిలోకి జారిపోయేవాడు. అయితే, యెహోవా ఎడల తన యథార్థతను కాపాడుకొనేందుకు, ఎన్నడూ యెహోవాను విడువకుండా ఉండేందుకు ఆయన తదేకంగా దృఢ నిశ్చయతను ప్రదర్శించాడు. (యోబు 1:20-22; 2:9, 10; 27:2-6) యోబుకు ఆత్మీయ మరియు వస్తుదాయకమైన ఆశీర్వాదాలను, నిత్యజీవ నిరీక్షణను ఇవ్వడం ద్వారా యెహోవా ఆయన పట్టుదలతో కూడిన భక్తికి ప్రతిఫలాన్నిచ్చాడు. (యోబు 42:10-17; యాకోబు 5:10, 11) యోబు వలె ఇప్పుడు మనం మన జీవితంలో ఎంతో బాధను, నష్టాన్ని అనుభవించవచ్చు కాని మన నమ్మకమైన సహనానికి యెహోవా ఆశీర్వాదం లభిస్తుందని కూడా మనం నిశ్చయత కలిగివుండవచ్చు.—హెబ్రీయులు 6:10-12.

ఆధునిక కాలాల్లో, యెహోవా చిత్తాన్ని చేయడంలో యెహోవాసాక్షులు సమైక్యంగా క్రైస్తవ పట్టుదలను ప్రదర్శించారు. ఉదాహరణకు, వారి పట్టుదలతో కూడిన ఇంటింటి పరిచర్య, ఇతర బహిరంగ ప్రకటనా పనులు ప్రపంచమంతటి ఆసక్తిని వారివైపుకు వారి వర్తమానంవైపుకు మళ్లించాయి. వ్యతిరేకత మరియు శ్రమలు ఉన్నప్పటికీ సువార్తను ప్రకటించడంలో వారు కలిగివున్న ఆసక్తి మరియు నిశ్చయతలను ప్రచార మాధ్యం అనేక విధాలుగా ఉదాహరించింది. వాటిలో ఒకటి ఇలా అని చమత్కరించింది కూడా “యెహోవాసాక్షులను ఎవ్వరూ తప్పించుకోలేరు!”—మత్తయి 5:16.

పరిచర్యలో అధిక ఫలాలు కలిగేలా చేయడం ద్వారా తన సాక్షులుచేసే పట్టుదలతో కూడిన ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదించాడు. ఇటలీలోని కొంతమంది శక్తిమంతులైన సాక్షుల అనుభవాన్ని గమనించండి, అక్కడ పూర్వం 1960వ పడిలో 5,30,00,000 మంది ప్రజలుగల దేశానికి 10,000 సాక్షులు ప్రకటిస్తుండేవారు. అక్కడ 6,000 మంది ఉండే ఒక పట్టణంలో సాక్షులు లేరు. దర్శిస్తున్న సహోదరులు తమ పరిచర్యకు వ్యతిరేకమైన ప్రతిస్పందనను పొందారు.

ప్రకటించడానికి సహోదరులు అక్కడికి వెళ్లిన ప్రతిసారి, పట్టణంలోని అనేకమంది స్త్రీలు, పురుషులు కూడా మగపిల్లలను పోగుచేసి సాక్షుల వెంట వెళ్లి ఈలలు వేస్తూ గోలచేస్తూ వారిని అనుసరించమని ప్రోత్సహించేవారు. కొంత సమయం తర్వాత, సహోదరులు ఆ స్థలాన్ని విడిచి మరో పట్టణానికి వెళ్లేందుకు బలవంతపెట్టబడేవారు. ఈ పట్టణ వాసులందరికీ కనీసం ఒక్కసారైనా పూర్తిగా సాక్ష్యమివ్వాలనే ప్రయత్నంలో, బాగా వర్షం కురిసే దినాల్లోనే ప్రకటించాలని సహోదరులు నిర్ణయించుకున్నారు, ఎందుకంటే అప్పుడైనా ఆ యౌవనస్థులు బాధించరనే నిరీక్షణతో అలా నిర్ణయించుకున్నారు. ఆ పట్టణ ప్రజలు, కేవలం ప్రచారకులకు ఇబ్బంది కలిగించడానికే తడవడం ఇష్టంలేనట్లు వారు గమనించారు. ఈ విధంగా మంచి సాక్ష్యం ఇవ్వబడింది. ఆసక్తిగల ప్రజలు కనుగొనబడ్డారు. క్రొత్త బైబిలు పఠనాలు ప్రారంభించబడ్డాయి. ఫలితంగా, ఆ చిన్న పట్టణంలో అభివృద్ధి చెందుతున్న సంఘం స్థాపించబడడమే కాదు, వర్షాలు పడని దినాల్లో కూడా ప్రకటనా పని జరగడం ప్రారంభమయ్యింది. ఆ ప్రాంతంలోను, ఇటలీ అంతటిలోను తన సాక్షుల పట్టుదలను యెహోవా ఆశీర్వదించడం కొనసాగించాడు. ఇప్పుడు ఆ దేశంలో 2,00,000 కంటే ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు.

మంచి చేయడంలో చూపబడే పట్టుదలకు గొప్ప ప్రతిఫలాలు లభిస్తాయి. దేవుని ఆత్మ ద్వారా, మానవ చరిత్రలో అసాధారణమైయున్న కార్యాన్ని యెహోవాసాక్షులు సాధించగలుగుతున్నారు, అదేమిటంటే ఇంటింటి వద్ద లేదా ఇతర విధాలుగా కోట్లాదిమందికి రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించడం. (జెకర్యా 4:6) యెహోవా భూ సంస్థ యొక్క అద్భుతమైన పెరుగుదల మరియు ప్రాముఖ్యత వంటివాటిలో బైబిలు ప్రవచనం నెరవేర్చబడడాన్ని వారు ఆనందంగా చూశారు. (యెషయా 54:2; 60:22) వారు దేవుని ఎదుట మంచి మనస్సాక్షిని కలిగివుంటారు, వారు నిత్యజీవ నిరీక్షణను బట్టి ఆనందిస్తారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, వారు సృష్టికర్తయైన యెహోవా దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగివుంటారు.—కీర్తన 11:7.

[25వ పేజీలోని చిత్రాలు]

గ్రీసు దేశస్థురాలైన ఈ స్త్రీ దీనమైన పట్టుదలకు యేసు ప్రతిఫలమిచ్చాడు

[26వ పేజీలోని చిత్రం]

నేడు క్రైస్తవుల ఎదుట ఉంచబడిన ఆనందంలో పరదైసునందలి జీవితం కూడా చేరివుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి