మీరీ అడ్డంకులను అధిగమించగలరు!
ఒక జంబోజెట్ విమానం వందలాదిమంది ప్రయాణికుల్ని, టన్నులకొలది సరకును మోసుకెళుతుంది. మరి అంత మహాబరువున్న విమానం ఎలా గాల్లోకి ఎగురగలదు? కేవలం, లిఫ్ట్ అనే ప్రక్రియ ద్వారానే.
విమానం రన్‌వేమీద వేగంగా పరుగెత్తినప్పుడు, వంపుగానున్న దానిరెక్కలకు పైగా క్రిందుగా వేగంగా గాలి దూసుకెళుతుంది. ఇది లిఫ్ట్ అనే ఎగిరే శక్తిని పుట్టిస్తుంది. అలా కావల్సినంత శక్తి ఉత్పత్తి అయినప్పుడు, విమానం భూమినుండి పైకిలేచి గాల్లోకి ఎగురుతుంది. అధిక బరువువేయబడిన విమానం నిశ్చయంగా గాల్లోకి ఎగరడానికి కావల్సినంత లిఫ్ట్‌ను ఉత్పత్తి చేయలేదు.
మనం కూడ అధికబరువుగల వారిగా తయారుకావచ్చు. శతాబ్దాల పూర్వం రాజైన దావీదు తన ‘దోషములు మోయలేని బరువువలె ఉన్నాయని’ చెప్పాడు. (కీర్తన 38:4) అదేవిధంగా, జీవన చింతలతో కృంగిపోకుండా ఉండడాన్ని గూర్చి యేసుక్రీస్తు హెచ్చరించాడు. (లూకా 21:34) ప్రతికూల తలంపులు, భావాలు “ఎగరడం” కష్టమనిపించేంతగా మనల్ని కృంగదీయగలవు. మీరావిధంగా కృంగారా? లేక మీరింకా ఆత్మీయంగా అభివృద్ధిపొందుటకు ఏదైనా అడ్డంకును మీరనుభవించారా? అట్లయిన, మీకేది సహాయపడవచ్చును?
మీరు విసుగుచెందారా?
నేటి సామాన్య ఫిర్యాదగు విసుగు యెహోవా ప్రజలైన కొందరికి సహితం ఓ మానసిక అడ్డంకుగా తయారుకావచ్చు. ప్రత్యేకంగా యౌవనస్థులు విసుగు తెప్పించేవని తామనుకొనే కొన్ని పనుల్ని అలక్ష్యంచేసే భావం కలిగివున్నారు. క్రైస్తవ కూటాలను గూర్చి మీరావిధంగా కొన్నిసార్లు భావించారా? అట్లయిన, మీరు కూటాలకు హాజరుకావడాన్ని ఉత్తేజకరంగా చేయుటకు మీరేమి చేయగలరు?
కూటాల్లో ఇమిడియుండుట కీలకం. యౌవనుడైన తిమోతికి పౌలు ఇలా వ్రాశాడు: “దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:7, 8) వ్యాయామ పుస్తకమందు సిఫారసు చేయబడిన కసరత్తులు చేయకపోతే ఆ పుస్తకం మనకు విసుగు కల్గించేదిగా, అల్పవిలువ గలదిగా ఉంటుంది. క్రైస్తవ కూటాలు మన మనస్సుల్ని సాధకం చేయడానికి రూపించబడ్డాయి, మనం సిద్ధపడి వాటిలో భాగంవహిస్తే ఆ సాధన జరుగుతుంది. ఇలా ఇమిడియుండుట కూటాల్ని మరింత ప్రతిఫలదాయకంగా, ఆసక్తికరంగా చేస్తుంది.
దీనిని గూర్చి, మారా అనే పేరుగల ఒక యౌవన క్రైస్తవ స్త్రీ ఇట్లన్నది: “నేను కూటాలకు సిద్ధపడకపోతే, వాటి ఫలం నేననుభవించలేను. అయితే, నేను ముందుగా సిద్ధపడినప్పుడు నా హృదయం, మనస్సు మరెక్కువ గ్రహించేవిగా ఉంటాయి. కూటాలు మరి అర్థవంతంగా తయారౌతాయి, వ్యాఖ్యానించడానికి నేను ఎదురుచూస్తాను.”
ఆలకించడానికి నేర్చుకొనుట కూడ సహాయంచేస్తుంది. ఓ మంచి సంగీతాన్ని ఆలకించడం సులభం, అది మరుక్షణమే మనోహరమౌతుంది. అయితే సంతృప్తినిచ్చేవన్నీ అలా మరుక్షణమే ఫలమిచ్చేవిగా ఉండవు. కూటాల కార్యక్రమంలో చెప్పబడిన విషయాల్ని శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే మనం సంతృప్తి పొందుతాం. రేచెల్ అనే పేరుగల ఓ క్రైస్తవురాలిలా అంది: “ప్రసంగీకుడు ఉల్లాసవంతముగా లేనప్పుడు, ఏకాగ్రత నిలపడం నాకు చాలాకష్టం. అప్పుడు నాకున్న నియమమేమంటే, ‘ప్రసంగం ఎంత తక్కువ ఆసక్తిగా ఉంటే, అంత ఎక్కువగా నేను ఏకాగ్రత నిలపాలి.’ . . . లేఖనాలనుండి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందుటకు ప్రయత్నిస్తూ నేను వాటిపై ప్రత్యేక శ్రద్ధచూపుతాను.” ఆలకించడానికి మనం రేచెల్‌వలే మనల్నిమనం అదుపులో పెట్టుకోవాలి. సామెతల గ్రంథమిలా చెబుతోంది: “నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము. వివేకముగల నా బోధకు చెవియొగ్గుము.”—సామెతలు 5:1.
కూటాల్లో అందజేయబడు సమాచారం కొంతవరకు పదేపదే చెప్పేదిగా ఉండవచ్చు. ఇది అవసరం! దేవుని సేవకులందరికి క్రమంగా జ్ఞాపకం చేయడం అవసరం. లొంగని కోరికలు, లోపభరితమగు జ్ఞాపకశక్తిగల అసంపూర్ణ శరీరానికి, లభ్యమగు సమస్త సహాయం అవసరం. ‘తోటి విశ్వాసులు ఆ సంగతులు ఎరిగియుండి, సత్యమందు స్థిరపడియున్ననూ అట్టివాటిని కొన్నింటిని వారికి జ్ఞాపకముచేయుటకు’ అపొస్తలుడైన పేతురు సిద్ధముగా ఉండెను. (2 పేతురు 1:12) “ప్రతి శాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికితెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు” అని యేసుకూడ వివరించాడు. (మత్తయి 13:52) ఆ విధంగా, మన కూటాలు మనమెరిగిన లేఖన తలంపుల్ని, లేదా ‘పాతనిధుల్ని’ వెలుపలికి తెస్తున్నా, మనల్ని ఆనందపరచే కొన్ని ‘క్రొత్తనిధులు’ ఎల్లప్పుడూ ఉంటాయి.
కూటాలనుండి పూర్తి ప్రయోజనం పొందడానికి తీర్మానించుకొనియుండుట ఫలితంగా నిజమైన ఆత్మీయ ప్రోత్సాహం లభించగలదు. “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:3 NW, అథఃస్సూచి) కూటాల్లో అందజేయబడు ఆరోగ్యదాయకమైన ఆత్మీయాహారంపట్ల అట్టి దృక్పథం కలిగివుండుట విసుగును తరిమికొడుతుంది.—మత్తయి 24:45-47.
ఒక చెడ్డమాదిరినిబట్టి నిరుత్సాహపడుట
మీ సంఘమందలి ఎవరి ప్రవర్తన ద్వారానైనా మీరు కలతచెందారా? ‘ఒక సహోదరుడు అలా ప్రవర్తించి సంఘమందు ఇంకా మంచి స్థానంలో ఎలావుండగలడు?’ అని బహుశ మీరు ఆలోచించియుండవచ్చును. అట్టి తలంపులు మానసిక అడ్డంకుగా పనిచేసి, దేవుని ప్రజలతో మనం కలిగివుండగల ఆహ్లాదకరమైన సహవాస విలువను మనం గ్రహించకుండా చేస్తాయి.—కీర్తన 133:1.
కొలొస్సయి సంఘంలోని కొందరు సభ్యులు బహుశ అటువంటి సమస్యనే కలిగివుండిరి. పౌలు వారినిలా వేడుకున్నాడు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) నిజమైన కారణంతో ఇతరులు ఫిర్యాదుచేసేలా కొలొస్సయి క్రైస్తవులు కొందరు చెడ్డగా ప్రవర్తించియుండవచ్చని పౌలు గుర్తించాడు. కాబట్టి అప్పుడప్పుడు మన సహోదరసహోదరీల్లో ఒకరు ఏదైనా ఒక క్రైస్తవ లక్షణంలో తప్పిపోతే మనం అసాధారణంగా ఆశ్చర్యపడకూడదు. గంభీరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి యేసు సరియైన సలహానిచ్చాడు. (మత్తయి 5:23, 24; 18:15-17) అయితే అనేక సమయాల్లో, మనం తోటి విశ్వాసుల పరిమితుల్ని సహించి వారిని ఊరకనే క్షమించేవారిగా ఉండవచ్చు. (1 పేతురు 4:8) వాస్తవానికి, అలాచేయడం మనకు, ఇతరులకు ప్రయోజనకరమై యుండగలదు. ఎందుకు?
“ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును” అని సామెతలు 19:11 చెబుతున్నది. కోపం, పగ రేగుటకనుమతించే బదులు క్షమించుట ఎంత శ్రేష్ఠమోగదా! తన ప్రేమగల స్వభావానికి పేరుపొందిన సాల్వడార్ అనే పెద్ద ఇలా చెప్పాడు: “ఒక సహోదరుడు నన్ను చెడ్డగా చూసినప్పుడు లేదా నిర్దయగా ఏదైనా మాట్లాడినప్పుడు నన్ను నేనిలా ప్రశ్నించుకుంటాను: ‘నా సహోదరునికి నేనెలా సహాయం చేయగలను? ఆయనతో నాకున్న అమూల్యమైన సంబంధం పోగొట్టుకోకుండా నేనెలా తప్పించుకోగలను?’ చెడు పలకడం ఎంత సులభమో నేనెప్పుడు గుర్తుంచుకుంటాను. ఎవరైనా అనాలోచితంగా మాట్లాడితే అతడు తానన్న మాటల్ని వెనక్కు తీసుకుని పునఃప్రారంభించడం ఆదర్శప్రాయమైన పరిష్కారమౌతుంది. అయితే అది అసాధ్యం, కాబట్టి నేను ఆ పిమ్మట శ్రేష్ఠమైన పనిగా ఆ వ్యాఖ్యానాన్ని లక్ష్యపెట్టను. అది నా సహోదరుని నిజ వ్యక్తిత్వానికి ప్రతిబింబమని కాకుండ అతని అసంపూర్ణతవల్ల బయటపడిందని భావిస్తాను.”
ఇలా చెప్పడం చేయడంకన్నా చాలా సులభమని మీరు భావించవచ్చు. అయితే మన ఆలోచనను నిర్దేశించే విధానంపై ఎంతో ఆధారపడివుంటుంది. “ఏవి రమ్యమైనవో (ప్రేమించయోగ్యమైనవో NW) . . . వాటిమీద ధ్యానముంచుకొనుడి” అని పౌలు సలహా ఇచ్చాడు. (ఫిలిప్పీయులు 4:8) “ప్రేమించయోగ్యమైన” అంటే అక్షరార్థంగా “అనురాగాన్ని ప్రేరేపించునది” అని అర్థం. ప్రజల్లోని సద్విషయాల్ని చూడమని యెహోవా మనల్ని కోరుతున్నాడు, వాటిపై దృష్టినిలుపుట పగకు బదులు అనురాగాన్ని ప్రేరేపిస్తుంది. ఈ విషయంలో ఆయనే మనకొక సర్వోన్నత మాదిరినుంచుతున్నాడు. “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల, ప్రభువా, ఎవడు నిలువగలడు?” అని చెబుతూ కీర్తనల రచయిత మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.—కీర్తన 103:12; 130:3.
నిజమే, కొన్ని సార్లు ఒక సహోదరుని ప్రవర్తన నిరుత్సాహకరంగా ఉండవచ్చు, అయితే మన తోటి ఆరాధికుల్లో అత్యధికులు క్రైస్తవ జీవితానికి శోభాయమానమైన మాదిరిగా ఉన్నారు. దీనిని మనం గుర్తుంచుకుంటే, దావీదువలె మనమూ సంతోషముగా ‘యెహోవాకు మెండుగా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాము, అనేకుల మధ్యను ఆయనను స్తుతిస్తాము.’—కీర్తన 109:30.
సాక్షిగా ఉండుట మరీకష్టమనిపిస్తుందా?
విచారకరముగా, మరో మానసిక అడ్డంకునుబట్టి కొందరింకనూ యెహోవాను స్తుతించుట కారంభించలేదు. యెహోవాసాక్షులుకాని అనేకమంది పురుషులు బాధ్యతగా తమ కుటుంబాల్ని పోషిస్తూ, క్రైస్తవ పరిచర్యలో తమ భార్యలకూ మద్దతునిస్తున్నారు. వారు స్నేహభావం కలిగి, సంఘంయెడల శ్రద్ధ చూపవచ్చును గాని దేవుని సేవకులుగా సమర్పించుకోవడానికి వెనుదీస్తున్నారు. వారినలా ఏది వెనుకకు లాగిపట్టుకుంటుంది?
ఈ భర్తలు తమ భార్యలు దైవపరిపాలనా కార్యమందు తీరికలేకుండా ఉండుట గమనించి, సాక్షిగా ఉండుట బహుభారమని భావిస్తారు. లేదా తామెన్నటికీ ఇంటింటి ప్రచారపనిలో పాల్గొనలేమని వారు బహుశ భయపడతారు. వారి దృక్కోణంలో బాధ్యతలు ఆశీర్వాదాల్ని కప్పివేసేవిగా కన్పిస్తాయి. ఆ మానసిక అడ్డంకు ఎందుకు? అనేకమంది బైబిలు విద్యార్థులు నేర్చుకుని సత్యాన్ని క్రమేపి అన్వయించుకుంటారు. అయితే అవిశ్వాసులైన భర్తలు ఆ క్రైస్తవ బాధ్యతల్ని అంగీకరించేలా ప్రేరణపొందక ముందే తరచు వారికవేమిటో బహుగా తెలిసేవుంటాయి.
ఇట్టి స్థితిలోవుండిన మాన్వెల్ ఇలా వివరిస్తున్నాడు: “దాదాపు పది సంవత్సరాలపాటు నేను నా భార్యతోకూడ సమావేశాలకు కూటాలకు వెళ్లాను. యథార్థంగా చెప్పాలంటే, లోకస్థులకంటే సాక్షుల సహవాసాన్ని నేను కోరుకున్నాను, ఆలాగే నాకు చేతనైనప్పుడు వారికి సహాయపడటం నాకు సంతోషకరంగా ఉండేది. వారిమధ్యగల ప్రేమకు నేను ముగ్ధుణ్ణయ్యాను. అయితే ఇంటింటికి వెళ్లడమనేది నాకో పెద్ద అడ్డంకుగా ఉండేది, తోటి ఉద్యోగులు ఆటపట్టిస్తారని నేను భయపడేవాణ్ణి.
“నా భార్య నాయెడల చాలా ఓపిక చూపేది, బైబిలు పఠించమని నన్ను బలవంతం చేయడానికి ఆమెన్నడూ ప్రయత్నించలేదు. ఆమె, పిల్లలు వీరిరువురు వారి మంచి మాదిరి ద్వారానే ముఖ్యంగా ‘ప్రకటించారు.’ సంఘపెద్ద, హోసె నా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఆయనిచ్చిన ప్రోత్సాహమే చివరకు నేను గంభీరంగా పఠించడం ఆరంభించేలా చేసింది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత, నా ముఖ్యమైన అడ్డంకు నా మానసిక అడ్డంకేనని నేను గ్రహించాను. యెహోవాను సేవించడానికి నేనొకసారి తీర్మానించుకున్న తర్వాత, నా భయాల్ని అధిగమించడంలో ఆయన సహాయాన్ని అనుభవించాను.”
మాన్వెల్‌వంటి భర్తలు తమ మానసిక అడ్డంకును అధిగమించునట్లు భార్యలు, క్రైస్తవ పెద్దలు ఎట్లు సహాయపడగలరు? బైబిలు పఠనం మెప్పునుపెంచి దేవుని చిత్తం చేయుటకు ఓ కోరికను వృద్ధిచేయవచ్చును. నిజమే, విశ్వాసమభ్యసించుటకు, ముందున్న నిరీక్షణలో నమ్మకముంచుటకు పూర్ణముగా వృద్ధిచెందిన లేఖన జ్ఞానమే ఆధారంగా ఉంటుంది.—రోమీయులు 15:13.
అటువంటి భర్తలు బైబిలు పఠనం అంగీకరించుటకేది సహాయపడుతుంది? తరచు సంఘమందలి జ్ఞానంగల ఓ సహోదరుని స్నేహం ఆ భర్త ఒక నిర్ణయానికి వచ్చేలా సహాయంచేసే కారకముగా ఉండగలదు. బహుశ ఒక పెద్ద లేదా మరో అనుభవంగల సహోదరుడు ఆ భర్తని పరిచయం చేసుకోవచ్చు. అలా ఒకసారి మంచి సంబంధమేర్పడిన తర్వాత, ఇక కావల్సిందల్లా ఎవరైనా ఆయనతో పఠించడానికి ముందుకు రావడమేకావచ్చు. (1 కొరింథీయులు 9:19-23) ఈలోగా, వివేచనగల క్రైస్తవ భార్య అవిశ్వాసియైన తన భర్త ఒత్తిడికి లోనుకాకుడదనే విషయాన్ని గ్రహిస్తూనే అతనితో కొద్దికొద్దిగా ఆత్మీయ సంగతుల్ని పంచుకోవచ్చు.—సామెతలు 19:4.
ఓ వ్యక్తి ఒకసారి ఆత్మీయబలం పుంజుకున్నాడంటే, మహా పర్వతాల్లాంటి సమస్యలు చిన్న మట్టిముద్దల్లా మారిపోతాయని మాన్వెల్ తన అనుభవం ద్వారా నేర్చుకున్నాడు. తనను సేవించాలని కోరుకునే వారిని యెహోవా బలపరస్తాడు. (యెషయా 40:29-31) దేవుని బలముతో, పరిపక్వతగల సాక్షుల మద్దతుతో అడ్డంకులు తొలగింపబడవచ్చును. ఆ విధంగా పూర్ణాత్మ సేవ మరింత ప్రీతికరమౌతుండగా, ఇంటింటి సేవ దిగులు పడనక్కర్లేనిదిగా, తోటి ఉద్యోగులు జడిపించనివారిగా తయారౌతారు.—యెషయా 51:12; రోమీయులు 10:10.
ఉరవడిని కాపాడుకొనుట
మనం విచారించిన ఆ మూడు అడ్డంకుల్లాంటి అడ్డంకుల్ని అధిగమించుట సాధ్యమే. విమానం గాల్లోకి ఎగిరేటప్పుడు, సాధారణంగా ఇంజన్లనుండి అత్యధిక యాంత్రికశక్తి, అలాగే విమాన సిబ్బందినుండి అవిభాగిత శ్రద్ధ అవసరం. పైకి ఎగిరేటప్పుడు మామూలుగా ఎగిరే ఏ సమయంలోకంటే ఎక్కువ ఇంధనాన్ని ఇంజను ఖర్చుచేస్తుంది. అదే విధంగా, ప్రతికూల తలంపుల్ని, భావాల్ని ఛేదించడానికి అత్యధిక ప్రయత్నము, ఏకాగ్రత అవసరం. ఆరంభించుట అతి కష్టమైన స్థితిగాయుండవచ్చు, కాని ఒక్కసారి వేగం అందుకుంటే అభివృద్ధి సులభమౌతుంది.—2 పేతురు 1:10 పోల్చండి.
లేఖన ప్రోత్సాహాన్ని సత్వరమే లక్ష్యపెట్టుట ఎడతెగని అభివృద్ధిని కాపాడుతుంది. (కీర్తన 119:60) సంఘం సహాయం చేయుటకు కోరుకుంటుందనే అభయాన్ని మనం కలిగివుండగలము. (గలతీయులు 6:2) అయితే, యెహోవా దేవుని మద్దతు అన్నింటికంటే ప్రాముఖ్యమైన విషయం. దావీదు చెప్పినట్లుగా, “ప్రభువు [యెహోవా NW] స్తుతినొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.” (కీర్తన 68:19) ప్రార్థనలో మన బరువుదించుకున్నప్పుడు, మన భారం తేలికౌతుంది.
కొన్నిసార్లు, విమానం వర్షపు వాతావరణాన్ని, మబ్బుతెరల్ని వెనుకవిడిచి ఆకాశమంతా వెలుగునిండిన సూర్యకాంతిలోకి ఎగిరివెళ్తుంది. మనంకూడ ప్రతికూల తలంపుల్ని వెనుక విడిచిపెట్టగలము. దైవ సహాయంతో మనమా మబ్బుతెరల్ని దాటి ప్రపంచవ్యాప్తంగానున్న యెహోవా ఆరాధికుల తేజోవంతమైన, సంతోషదాయకమైన కుటుంబ వాతావరణంలో ఉల్లసించగలము.
[23వ పేజీలోని చిత్రాలు]
యెహోవా సహాయంతో, మనం మానసిక అడ్డంకుల్ని అధిగమించగలము