క్రైస్తవ స్త్రీలు సన్మానం, గౌరవం పొందనర్హులు
“పురుషులారా, . . . యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, . . . జ్ఞానముచొప్పున వారితో కాపురము చేయుడి.”—1 పేతురు 3:7.
1, 2. (ఎ) బావిదగ్గర సమరయ స్త్రీతో యేసు జరిపిన సంభాషణ ఎట్టి శ్రద్ధను పురికొల్పింది, ఎందుకు? (అథఃస్సూచి కూడ చూడండి.) (బి) సమరయ స్త్రీకి ప్రకటించుట ద్వారా యేసు ఏమి ప్రదర్శించాడు?
సా.శ. 30వ సంవత్సరం చివర్లో ఓ మధ్యాహ్నం సుఖారను పట్టణానికి దగ్గర్లోగల ఒక పాతబావి దగ్గర, స్త్రీలనాదరించడాన్ని తానెట్లు భావించాడో యేసు బయల్పరచాడు. ఆయన ఉదయమంతా పర్వత ప్రాంతమైన సమరయలో ప్రయాణించి, అలసిపోయి ఆకలిదప్పులతో ఆ బావినొద్దకు చేరాడు. ఆయన ఆ బావి ప్రక్కన కూర్చొనియుండగా, నీళ్లు చేదుకోవడానికి ఓ సమరయ స్త్రీ అక్కడికి రాగా, యేసు “నాకు దాహమునకిమ్మని” ఆమె నడిగాడు. విస్మయంతో ఆమె ఆయనవైపు తేరిచూసి, “యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావు”? అని అడిగింది. ఆ తర్వాత, శిష్యులు ఆహారం కొని తిరిగివచ్చినప్పుడు, యేసు ఆ “స్త్రీతో మాటలాడుట చూచి” ఆశ్చర్యపడ్డారు.—యోహాను 4:4-9, 27.
2 ఆ స్త్రీ అడిగిన ప్రశ్నను, శిష్యుల చింతను పురికొల్పినదేమి? ఆమె సమరయ స్త్రీ మరియు యూదులు సమరయులతో ఎట్టి వ్యవహారాల్ని కలిగివుండేవారు కారు. (యోహాను 8:48) అయితే అట్టిచింతకు స్పష్టంగా మరో కారణంకూడ ఉంది. ఆ కాలంలో, పురుషులు స్త్రీలతో బహిరంగముగా మాట్లాడుటను రబ్బీల ఆచారము అడ్డగించింది.a అయిననూ యేసు బాహాటముగా సద్భావముగల ఈ స్త్రీకి ప్రకటించి, తానే మెస్సీయనని కూడ ఆమెకు బయల్పరచాడు. (యోహాను 4:25, 26) అలా యేసు స్త్రీలను అవమానించిన వాటితోసహా లేఖనరహితమైన ఆచారాలకు తాను కట్టుబడి ఉండనని చూపాడు. (మార్కు 7:9-13) దానికి భిన్నముగా, తాను చేసిన మరియు బోధించిన వాటిద్వారా యేసు స్త్రీలను సన్మానించి, గౌరవించాలని ప్రదర్శించాడు.
యేసు స్త్రీలనెలా ఆదరించాడు
3, 4. (ఎ) తన వస్త్రం ముట్టిన స్త్రీ విషయంలో యేసు ఎలా ప్రతిస్పందించాడు? (బి) క్రైస్తవ పురుషులకు, ప్రత్యేకంగా అధ్యక్షులకు యేసు ఎలా ఒక మంచిమాదిరి ఉంచాడు?
3 స్త్రీలతో యేసు వ్యవహరించిన విధానంలో ప్రజలయెడల ఆయనకున్న కనికరం ప్రతిబింబించబడింది. ఒక సందర్భంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఓ స్త్రీ జనసమూహమందు యేసుకొరకు వెదకింది. ఆచారబద్ధంగా పరిస్థితి ఆమెను అపవిత్రురాల్ని చేసింది, అందుకని ఆమె అక్కడ ఉండకూడదు. (లేవీయకాండము 15:25-27) అయితే ఆమె ఎంతగా నిరాశచెందినదంటే ఆమె యేసు వెనుకే వచ్చింది. ఆయన వస్త్రాన్ని ముట్టిన మరుక్షణమే ఆమె స్వస్థతపొందింది! యాయీరు కుమార్తె బహుగా జబ్బుపడినందున అతని ఇంటికివెళ్లే మార్గంలో ఉన్ననూ యేసు ఆగాడు. తననుండి ప్రభావము బయలువెళ్లెనని గ్రహించి ఆయన తనను ముట్టిన వారికొరకు చుట్టూ కలియజూశాడు. చివరకు, ఆ స్త్రీ భయపడుతూ వచ్చి ఆయనయెదుట సాగిలపడింది. జనసమూహంలో ఉన్నందుకు లేదా తన అనుమతిలేకుండా తన వస్త్రాన్ని ముట్టుకున్నందుకు యేసు ఆమెను గద్దిస్తాడా? దానికి భిన్నంగా, ఆయనెంతో వాత్సల్యతలో దయతో ఉన్నట్టు ఆమెచూసింది. “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను,” అని ఆయన అన్నాడు. ఈ ఒక్క సందర్భంలోనే యేసు ఒక స్త్రీని “కుమారీ” అని సూటిగా సంబోధించాడు. ఆ మాట ఆమెనెంతగానో ఓదార్చియుండవచ్చు!—మత్తయి 9:18-22; మార్కు 5:21-34.
4 యేసు ధర్మశాస్త్రాన్ని దాని బాహ్యరూపంకంటే మరిలోతుగా చూశాడు. దాని నిజభావాన్ని మరియు కరుణ, కనికరాల అవసరతను ఆయన చూశాడు. (మత్తయి 23:23 పోల్చండి.) రోగియైన ఆ స్త్రీ నిరాశాజనకమైన పరిస్థితుల్ని గమనించి ఆమె విశ్వాసంతో కదలిరావడాన్ని యేసు పరిగణలోనికి తీసుకున్నాడు. అలా ఆయన క్రైస్తవ పురుషులకు, ప్రత్యేకంగా సంఘాధ్యక్షులకు ఓ మంచి మాదిరినుంచాడు. వ్యక్తిగత సమస్యలనో లేదా ప్రత్యేకంగా ఓ క్లిష్టమైన లేదా పరీక్షా పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పెద్దలు ఆమె అప్పటికప్పుడు పలికిన మాటలకంటే లేదా చేసిన క్రియలకంటే మరియెక్కువ చూడడానికి ప్రయత్నించాలి మరియు పరిస్థితుల్ని ఉద్దేశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. అట్టి పరిజ్ఞానం గద్దించుటకు, సరిదిద్దుటకు బదులు ఓపిక, అర్థంచేసుకొనుట, కనికరం అవసరమని సూచించవచ్చు.—సామెతలు 10:19; 16:23; 19:11.
5. (ఎ) రబ్బీల ఆచారాలు స్త్రీలను ఏ విధంగా నిర్బంధించాయి? (అథఃస్సూచి చూడండి.) (బి) యేసు పునరుత్థానాన్ని మొదట చూసిన, దానినిగూర్చి సాక్ష్యమిచ్చిన వారెవరు?
5 యేసు భూమ్మీదున్న కాలంలో రబ్బీల ఆచారాల చెరలోనున్న స్త్రీలు చట్టపరమైన సాక్షులుగా ఉండకుండా నిర్బంధింపబడ్డారు.b సా.శ. నీసాను 16 ఉదయం యేసు మృతుల్లోనుండి పునరుత్థానుడైన తర్వాత కొద్దిసమయానికే ఏం జరిగిందో ఆలోచించండి. పునరుత్థానుడైన యేసును ఎవరు మొదట చూస్తారు, వారి ప్రభువు లేపబడెనని ఇతర శిష్యులకు ఎవరు సాక్ష్యమిస్తారు? వారెవరనగా ఆయన చనిపోయే పర్యంతము ఆయన వ్రేలాడదీయబడిన ప్రాంత పరిసరాల్లో ఉన్న స్త్రీలే.—మత్తయి 27:55, 56, 61.
6, 7. (ఎ) సమాధినొద్దకు వచ్చిన స్త్రీలకు యేసు ఏమిచెప్పాడు? (బి) స్త్రీలు చెప్పిన సాక్ష్యానికి యేసుయొక్క పురుష శిష్యులు ఎలా ప్రతిస్పందించారు, దీనినుండి ఏమి నేర్చుకోవచ్చు?
6 వారంలో మొదటిరోజు తెల్లవారుజామునే మగ్దలేనే మరియ, ఇతర స్త్రీలు యేసు శరీరానికి సుగంధద్రవ్యాలు పూయడానికి సమాధినొద్దకు వెళ్లారు. సమాధి ఖాళీగా కనబడినవెంటనే, మరియ ఈ విషయాన్ని పేతురు యోహానులకు చెప్పడానికి పరుగెత్తుకొనిపోయెను. ఇతర స్త్రీలు అక్కడే ఉన్నారు. ఆ వెంటనే ఒక దేవదూత వారికి కనబడి యేసు లేపబడెనని తెలిపాడు. “త్వరగావెళ్లి . . . ఆయన శిష్యులకు తెలియజేయుడని” ఆ దూత వారికాజ్ఞాపించాడు. ఆ వార్త చెప్పాలని ఈ స్త్రీలు వడిగా వెళుతుండగా యేసే స్వయంగా వారికి కన్పించి, “మీరువెళ్లి, నా సహోదరులకు . . . తెలుపుడని” చెప్పాడు. (మత్తయి 28:1-10; మార్కు 16:1, 2; యోహాను 20:1, 2) దేవదూత సందర్శనాన్ని ఎరుగని మగ్దలేనే మరియ దుఃఖంతో ఖాళీ సమాధినొద్దకు తిరిగివచ్చింది. ఇక్కడ యేసు ఆమెకు కనబడి, ఆమె చివరికి తనను గుర్తించిన తర్వాత ఇట్లన్నాడు: “నా సహోదరులయొద్దకు వెళ్లి—నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము.”—యోహాను 20:11-18; మత్తయి 28:9, 10 పోల్చండి.
7 పేతురుకు, యోహానుకు లేదా పురుషులైన శిష్యుల్లో మరొకరికి యేసు మొదట కనబడగల్గి ఉండేవాడే. కాని, తన పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షుల్ని చేయడంద్వారా, దానినిగూర్చి పురుషులైన తన శిష్యులకు సాక్ష్యమిమ్మని ఆజ్ఞాపించుటద్వారా ఆయన ఈ స్త్రీలను అనుగ్రహించాలని ఇష్టపడ్డాడు. ఆ పురుషులు మొదట ఎలా స్పందించారు? వృత్తాంతమిలా చెబుతోంది: “వారిమాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.” (లూకా 24:11) స్త్రీలు చెప్పినందునా అంగీకరించుట కష్టమని వారు ఆ సాక్ష్యాన్ని నమ్మలేకపోయింది? కొంతకాలానికి, యేసు మృతులనుండి పునరుత్థానమయ్యాడనేందుకు మెండుగా రుజువులు దొరికాయి. (లూకా 24:13-46; 1 కొరింథీయులు 15:3-8) నేడు తమ ఆత్మీయ సహోదరీల సూచనలను తీసుకోవడం ద్వారా క్రైస్తవ పురుషులు జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తారు.—ఆదికాండము 21:12 పోల్చండి.
8. స్త్రీలతో తన వ్యవహార విధానముద్వారా యేసు ఏమి బయల్పరచాడు?
8 స్త్రీలతో యేసు వ్యవహర విధానాన్ని గమనించుట నిజంగా హృద్యమైన విషయం. స్త్రీలతో వ్యవహరించుటలో సదా కనికరం, పూర్ణ సమతుల్యత కలిగి ఆయనెన్నడూ వారిని హెచ్చించలేదు లేదా చిన్నబుచ్చలేదు. (యోహాను 2:3-5) వారి మర్యాదను హరించి, దేవుని వాక్యాన్ని నిరర్థకం చేసిన రబ్బీల ఆచారాల్ని ఆయన త్రోసిపుచ్చాడు. (మత్తయి 15:3-9 పోల్చండి.) స్త్రీలను గౌరవమర్యాదలతో ఆదరించుట ద్వారా, యెహోవాదేవుడు వారెలా ఆదరింపబడాలని భావిస్తున్నాడో యేసు తాజాగా బయల్పరచాడు. (యోహాను 5:19) క్రైస్తవ పురుషులు అనుకరించుటకు కూడ యేసు శోభగల మాదిరి ఉంచాడు.—1 పేతురు 2:21.
స్త్రీలను గూర్చిన యేసు బోధలు
9, 10. స్త్రీలను గూర్చిన రబ్బీల ఆచారాల్ని యేసు ఎలా త్రోసిపుచ్చాడు మరియు విడాకుల్ని గూర్చి పరిసయ్యులు ప్రశ్న లేవదీసిన తర్వాత ఆయనేమి చెప్పాడు?
9 తన క్రియలద్వారానే కాకుండ తన బోధలద్వారా కూడ యేసు రబ్బీల ఆచారాల్ని త్రోసిపుచ్చి స్త్రీలను గౌరవించాడు. ఉదాహరణకు విడాకులను, వ్యభిచారాన్ని గూర్చి ఆయన బోధించిన దానిని విచారించండి.
10 “ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?” అని విడాకులను గురించి యేసును ప్రశ్నించడం జరిగింది. మార్కు వృత్తాంతం ప్రకారం యేసు ఇలా చెప్పాడు: “తన భార్యను [వ్యభిచారము నిమిత్తమే తప్ప] విడనాడి మరియొకతెను పెండ్లి చేసికొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లిచేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగును.” (మార్కు 10:10-12; మత్తయి 19:3, 9) సరళముగా చెప్పబడిన ఆ మాటలు స్త్రీలను గౌరవించాయి. అదెలా?
11. “వ్యభిచారము నిమిత్తమే తప్ప” అని యేసు పలికిన మాటలు వివాహబంధాన్ని గూర్చి ఏమి సూచించాయి?
11 మొదటిది, “వ్యభిచారము నిమిత్తమే తప్ప” (ఈ మాటలు మత్తయి సువార్తలో ఉన్నాయి), అనే మాటలద్వారా యేసు వివాహబంధాన్ని తేలికగా దృష్టించకూడదని లేదా సుళువుగా తెంచకూడదని సూచించాడు. భార్య ఓ భోజన పదార్ధాన్ని పాడుచేసినా లేక ఓ క్రొత్తవ్యక్తితో మాట్లాడినా అట్టి చిన్నవిషయాల ఆధారంగా విడాకులివ్వడాన్ని సాధారణ రబ్బీల బోధ అనుమతించింది. అంతెందుకు, భర్త దృష్టికి మరింత ఆకర్షణీయమైన స్త్రీ కనబడితే కూడ విడాకులు అనుమతింపబడేది! ఒక బైబిలు విద్వాంసుడిలా వ్రాస్తున్నాడు: “యేసు మాట్లాడినప్పుడు . . . వివాహానికి ఉండాల్సిన స్థితికి దానిని ఉద్ధరించుటకు ప్రయత్నించుటద్వారా తాను స్త్రీలవైపున్నట్లే గట్టిగా మాట్లాడాడు.” నిజానికి, వివాహము స్త్రీకి భద్రతా భావం కల్గించగల ఒక శాశ్వతకాల కూడికైయుండాలి.—మార్కు 10:6-9.
12. “ఆమె విషయమై వ్యభిచరించువాడగును” అనే మాటలద్వారా, యేసు ఏ భావాన్ని ప్రవేశపెడుతుండెను?
12 రెండవది, “ఆమె విషయమై వ్యభిచరించువాడగును” అనే మాటద్వారా, రబ్బీల న్యాయస్థానాలు గుర్తించని అంశాన్ని అనగా భర్త తన భార్య విషయమై వ్యభిచరించుటను గూర్చిన భావాన్ని యేసు తెలిపాడు. ది ఎక్స్‌పోజిటర్స్ బైబిల్ కామెంట్రీ ఇలా వివరిస్తోంది: “యూదామత రబ్బీల వ్రాతల ప్రకారం ఓ స్త్రీ విశ్వాసఘాతుకం మూలంగా తన భర్త విషయమై వ్యభిచరించునదౌతుంది; మరియు పురుషుడు వేరొకని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొనుట ద్వారా, అతని విషయంలో వ్యభిచరించు వాడౌతాడు. అయితే పురుషుడేమి చేసిననూ ఎన్నడూ తన భార్య విషయమై వ్యభిచరించువాడు కానేరడు. భార్యకు వలెనే భర్తనుకూడా అదే నైతిక బాధ్యత క్రింద ఉంచుట ద్వారా యేసు స్త్రీల హోదాను, మర్యాదను ఉన్నతిజేశాడు.”
13. విడాకుల విషయంలో క్రైస్తవ విధానమందు స్త్రీపురుషులిరువురికీ ఒకే కట్టడ ఉంటుందని యేసు ఎలాచూపాడు?
13 మూడవది, “తన పురుషుని విడనాడి” అనే మాటద్వారా నమ్మకద్రోహియైన భర్తకు విడాకులిచ్చే హక్కును యేసు గుర్తించాడు. ఈ వాడుక తెలిసియున్ననూ ఆ కాలమందలి యూదాచట్టం క్రింద సామాన్యమై ఉండలేదు.c “స్త్రీ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు, అయితే పురుషునికి అతని ఇష్టం చొప్పున మాత్రమే విడాకులు ఇవ్వాలి” అని చెప్పబడింది. కాని యేసుచెప్పిన ప్రకారం క్రైస్తవ విధానంలో స్త్రీపురుషులిద్దరికి ఒకేవిధమైన కట్టడ అన్వయిస్తుంది.
14. తన బోధలద్వారా, యేసు ఏమి ప్రతిబింబించాడు?
14 యేసు బోధలు స్పష్టముగా స్త్రీల సంక్షేమంయెడల ప్రగాఢమైన శ్రద్ధను వెల్లడించాయి. కాబట్టి, కొందరు స్త్రీలు తమ ఆస్తుల్ని ఉపయోగించి ఆయనకు ఉపచారము చేసేంతగా యేసునెందుకు ప్రేమించారో అర్థంచేసుకొనుట అంత కష్టమేమీ కాదు. (లూకా 8:1-3) “నేనుచేయు బోధ నాదికాదు; నన్ను పంపిన వానిదే” అని యేసు అన్నాడు. (యోహాను 7:16) తన బోధ ద్వారా యేసు స్త్రీలయెడల యెహోవాకున్న వాత్సల్యపూర్వకమైన శ్రద్ధను ప్రతిబింబించాడు.
‘వారిని సన్మానించుడి’
15. భర్తలు తమ భార్యల్ని ఆదరించుటను గూర్చి అపొస్తలుడైన పేతురు ఏమివ్రాశాడు?
15 స్త్రీలతో యేసు వ్యవహార విధానాన్ని అపొస్తలుడైన పేతురు స్వయంగా గమనించాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పేతురు భార్యలకు ప్రేమపూర్వక సలహాయిచ్చి ఆ పిమ్మట ఇలా వ్రాశాడు: “అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానముచొప్పున వారితో కాపురము చేయుడి.” (1 పేతురు 3:7) ‘వారిని సన్మానించుడి’ అని అనడంలో పేతురు భావమేమి?
16. (ఎ) “సన్మానం” అని తర్జుమా చేయబడిన గ్రీకు నామవాచకం యొక్క అర్థమేమి? (బి) రూపాంతరమప్పుడు యెహోవా యేసునెలా సన్మానించాడు, దీనినుండి మనమేమి నేర్చుకుంటాము?
16 ఒక నిఘంటుకారుడు చెప్పిన ప్రకారం, “సన్మానం” అని తర్జుమా చేయబడిన గ్రీకు నామవాచకానికి (టైమ్) “మూల్యం, విలువ, మర్యాద, గౌరవం” అని భావం. ఈ గ్రీకుపద రూపాలు “సత్కారములు” “అమూల్యము” అని అనువదింపబడ్డాయి. (అపొస్తలుల కార్యములు 28:10; 1 పేతురు 2:7) రెండవ పేతురు 1:17లో అదే పదరూపాన్ని పేతురు ఉపయోగించడాన్ని మనం పరీక్షిస్తే ఎవరినైనా సన్మానించుట అంటే ఏమిటో మనం లోతుగా గ్రహిస్తాం. అక్కడాయన యేసు రూపాంతరాన్ని పేర్కొంటూ ఇలా చెప్పాడు: “ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేనానందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందెను.” యేసు రూపాంతరమప్పుడు, యేసును ఆమోదిస్తూ యెహోవా తన కుమారుణ్ణి ఘనపర్చాడు, ఇతరులు వింటుండగా దేవుడు ఆ విధంగాచేశాడు. (మత్తయి 17:1-5) కాబట్టి, తన భార్యను సన్మానించు పురుషుడు ఆమెను అవమానపర్చడు లేదా చిన్నబుచ్చడు. బదులుగా, అతడు తన మాటలు, క్రియలద్వారా—ఏకాంతమందు లేదా అందరియెదుట—ఆమెను ఘనపరస్తున్నానని ప్రదర్శిస్తాడు.—సామెతలు 31:28-30.
17. (ఎ) క్రైస్తవ భార్యకు సన్మానమెందుకు తగినదైయున్నది? (బి) దేవుని దృష్టిలో స్త్రీకంటే తనకెక్కువ విలువుందని పురుషుడెందుకు భావించకూడదు?
17 క్రైస్తవ భర్తలు తమ భార్యలకు ఈ సన్మానం ‘ఇవ్వాలని’ పేతురు చెబుతున్నాడు. దయతలచి కాదుగాని తమ భార్యలకు ఇవ్వాల్సిందే అన్నట్లు దానినివ్వాలి. భార్యలెందుకు అట్టి సన్మానానికి అర్హులు? ఎందుకంటే “జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని” పేతురు వివరిస్తున్నాడు. సా.శ. మొదటి శతాబ్దంలో, పేతురు వ్రాసిన పత్రిక నందుకున్న స్త్రీపురుషులందరు క్రీస్తుతోడి వారసులుగా పిలువబడినవారే. (రోమీయులు 8:16, 17; గలతీయులు 3:28) సంఘంలో వారికి ఒకే రకమైన బాధ్యతలు లేకుండెను, అయితే చివరకు వారు పరలోకమందు క్రీస్తుతోకూడ పరిపాలనలో భాగం వహిస్తారు. (ప్రకటన 20:6) నేడు కూడ, దేవుని ప్రజల్లో అత్యధికులకు భూసంబంధమైన నిరీక్షణగల ఏ క్రైస్తవ పురుషుడైననూ తనకు సంఘంలో ఉండగల ఆధిక్యతల్నిబట్టి తనకు దేవుని దృష్టిలో స్త్రీలకన్నా ఎక్కువ విలువున్నదని భావించుట గంభీరమైన తప్పిదంగా ఉంటుంది. (లూకా 17:10 పోల్చండి.) యేసు బలిపూర్వక మరణం స్త్రీపురుషులిరువురికీ ఒకే విధమైన, అనగా నిత్యజీవ దృష్టితో పాపమరణాల దోషశిక్షనుండి విడిపింపబడే అవకాశాన్ని తెరచినందున, దేవునియెదుట స్త్రీపురుషులు సమానమైన ఆత్మీయ స్థానాన్ని కలిగివున్నారు.—రోమీయులు 6:23.
18. తన భార్యను సన్మానించాలనే ఏ బలమైన కారణాన్ని పేతురు భర్తకి ఇస్తున్నాడు?
18 “[తన] ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు” భర్త తన భార్యనెందుకు సన్మానించాలో దానికిగల మరో బలమైన కారణాన్ని పేతురు ఇస్తున్నాడు. “అభ్యంతరము” అనుమాట గ్రీకు క్రియాపదం (ఎన్‌కోప్టొ) నుండి వచ్చింది, దీనికి అక్షరార్థముగా “తెంచుట” అని భావం. వైన్ వ్రాసిన ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్ న్యూ టెస్ట్‌మెంట్ వర్డ్స్ ప్రకారము అది “రహదారిని పాడుచేయడం ద్వారా, లేక దారిలో చమత్కారంగా అడ్డుపెట్టి వ్యక్తులకు అవరోధం కల్గించుటకు ఉపయోగింపబడింది.” కాబట్టి, తన భార్యను సన్మానింపని భర్త తన ప్రార్థనలకు దేవుడు ఆలకించడానికి మధ్యదారిలో అవరోధాన్ని కనుగొనగలడు. దేవుని సమీపించుటకు తానయోగ్యుడని ఆ పురుషుడు భావించవచ్చు, లేదా యెహోవా ఆలకించడానికి సుముఖంగా ఉండకపోవచ్చు. స్పష్టముగా, పురుషులు స్త్రీల నాదరించే విధానమందు యెహోవా గొప్ప శ్రద్ధ కలిగివున్నాడు.—విలాపవాక్యములు 3:44 పోల్చండి.
19. పరస్పర గౌరవంతో స్త్రీపురుషులు సంఘంలో ఎలా కలిసి సేవచేయవచ్చు?
19 సన్మానించే బాధ్యత కేవలం భర్తలమీదే లేదు. భర్త తన భార్యకు ఘనతనిస్తూ ప్రేమగా ఆదరించాలి, ఆలాగే భార్య విధేయతతో, ప్రగాఢమైన గౌరవం చూపిస్తూ తన భర్తను సన్మానించాలి. (1 పేతురు 3:1-6) అంతేకాకుండ, ‘ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడని’ పౌలు క్రైస్తవుల కుపదేశించాడు. (రోమీయులు 12:10) ఇది సంఘమందలి స్త్రీపురుషులు పరస్పర గౌరవంతో సేవచేయాలని వారికివ్వబడిన పిలుపైయుంది. అట్టి స్ఫూర్తి నిలిచివున్నప్పుడు నాయకత్వం వహించేవారి అధికారాన్ని బలహీనపరచే విధంగా క్రైస్తవ స్త్రీలు మాట్లాడరు. బదులుగా, వారు పెద్దలకు మద్దతునిచ్చి వారికి సహకరిస్తారు. (1 కొరింథీయులు 14:34, 35; హెబ్రీయులు 13:17) తమ వంతుగా, క్రైస్తవ అధ్యక్షులు “తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యౌవన స్త్రీలను” ఆదరిస్తారు. (1 తిమోతి 5:1, 2) జ్ఞానయుక్తంగా, పెద్దలు తమ క్రైస్తవ సహోదరీలు చెప్పే విషయాల్ని దయాపూర్వకంగా ఆలోచిస్తారు. ఆ విధంగా, ఒక సహోదరి దైవపరిపాలనా శిరస్సత్వానికి తన గౌరవాన్ని కనపర్చినప్పుడు లేదా ఒక సహోదరి ప్రాంతీయ సేవాయేర్పాటుకు సంబంధించిన ఒకానొక సమస్యవంటి శ్రద్ధ చూపాల్సిన ఏదైనా అంశాన్ని సూచించినప్పుడు పెద్దలు ఆమె ప్రశ్నను లేక సమస్యను సంతోషంగా పరిగణలోనికి తీసుకుంటారు.
20. లేఖన వృత్తాంతం ప్రకారం స్త్రీలెలా ఆదరింపబడాలి?
20 ఏదెనులో పాపం ప్రవేశించిన దగ్గరనుండి, అనేక సంస్కృతుల్లో స్త్రీలు అవమానకర స్థానానికే నెట్టివేయబడ్డారు. అయితే వారికట్టి అనుభవమే కలగాలని యెహోవా మొదట ఉద్దేశించలేదు. స్త్రీల విషయంలో ఎలాంటి సాంస్కృతిక అభిప్రాయాలున్నా, హెబ్రీ మరియు గ్రీకు లేఖనాల వృత్తాంతము స్పష్టముగా దైవిక స్త్రీలు గౌరవమర్యాదలతో ఆదరింపబడాలని చూపిస్తున్నవి. ఇది వారి దైవానుగ్రహమైన అర్హత.
[అధస్సూచీలు]
a ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్‌సైక్లోపీడియా ఇలా వివరిస్తున్నది: “పురుష అతిథులతో కలిసి స్త్రీలు భుజించలేదు మరియు పురుషులు స్త్రీలతో మాట్లాడటం అడ్డగింపబడెను. . . . బహిరంగముగా స్త్రీతో సంభాషించడం మహాపరాధముగా ఉండెను.” యూదుల మిష్నా, అనగా రబ్బీల బోధల సంగ్రహగ్రంథమిలా సలహాయిచ్చింది: “స్త్రీజాతితో ఎక్కువ మాట్లాడకూడదు. . . . స్త్రీజాతితో ఎక్కువగా మాట్లాడువాడు తనకు కీడు తెచ్చుకుని, ధర్మశాస్త్ర పఠనాన్ని నిర్లక్ష్యంచేస్తాడు అలా చివరికి గెహెన్నా పాలవుతాడు.”—ఆబోత్ 1:5.
b క్రీస్తు కాలంలో పాలస్తీనా (ఆంగ్లం) అనే పుస్తకమిలా చెబుతోంది: “కొన్ని విషయాల్లో స్త్రీ దాసికి సమాన స్థాయిలో ఉంచబడేది. ఉదాహరణకు, తన భర్త మరణాన్ని ధృవీకరించుట మినహా ఆమె న్యాయసభలో సాక్ష్యమివ్వగల్గేది కాదు.” లేవీయకాండము 5:1ని ఎత్తిచూపుతూ ది మిష్నా ఇలా వివరిస్తోంది: “[ధర్మశాస్త్రమందలి] ‘సాక్ష్యపు ఒట్టు’ పురుషులకేగాని స్త్రీలకు అన్వయించదు.”—షెబ్బౌత్ 4:I.
c రాజైన హేరోదు సహోదరియగు సలోమే తన భర్తకు “తమ వివాహాన్ని రద్దుచేసే పత్రం” పంపింది, “అయితే అది యూదామత చట్టంతో ఏకీభవించదు. ఎందుకంటే అలా చేయడానికి పురుషుణ్ణి (మాత్రమే) మేమనుమతించాము” అని మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడైన జోసీఫస్ వ్రాస్తున్నాడు.—యూదుల ప్రాచీన కాలాలు, XV, 259 [vii, 10].
మీ జవాబేమి?
◻ యేసు స్త్రీలను గౌరవమర్యాదలతో ఆదరించాడని ఏ ఉదాహరణలు ప్రదర్శిస్తున్నవి?
◻ యేసు బోధలెలా స్త్రీల గౌరవాన్ని కనపరుస్తున్నాయి?
◻ భర్త తన క్రైస్తవ భార్యనెందుకు సన్మానించాలి?
◻ సన్మానం చూపాలనే ఏ బాధ్యతను క్రైస్తవులందరు కలిగివున్నారు?
[17వ పేజీలోని చిత్రం]
పునరుత్థానం తర్వాత, యేసు మొదట దైవభక్తిగల స్త్రీలకు కనబడి దీనినిగూర్చి తన సహోదరులకు సాక్ష్యమివ్వుడని వారి కాజ్ఞాపించాడు