కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/15 పేజీలు 24-27
  • హిమాలయాలకంటే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • హిమాలయాలకంటే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • నేపాల్‌—పర్వత రాజ్యం
  • చిన్న ప్రారంభాలు
  • కష్టాలున్నప్పటికీ విస్తరణ
  • నేటి నేపాల్‌
  • హిమాలయాలకంటే ఉన్నతస్థానానికి అధిరోహించడం
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/15 పేజీలు 24-27

హిమాలయాలకంటే ఎత్తైన పర్వతాన్ని అధిరోహించడం

హిమాలయాలు! ఆ మాటలు మీ మనస్సులోకి ఏ ఊహను తెస్తున్నాయి? హోరున వీచే గాలులతో సంభ్రమాశ్చర్యము కలిగించే మంచు పర్వత శిఖరాలా? భూమిమీదనున్న పర్వతాలలో ఎత్తైన పర్వతం మీద నిలుచోవడంవల్ల ఏదో సాధించామన్న ఉత్సాహమా? మనలో అనేకులకు, నేపాల్‌నందలి హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం అసంభవం. అయితే, నేడు, నేపాల్‌నందలి అనేక మంది ప్రజలు హిమాలయలకంటే ఎంతో ఎత్తైన పర్వతాన్ని అధిరోహిస్తున్నారు! ఆ ఉన్నతమైన పర్వతంపైకి ప్రయాణించే వివరాలను తెలుసుకునేముందు, చిన్నదైనప్పటికీ అందమైన నేపాల్‌ రాజ్యాన్ని ఒకపరి పరికిద్దాం.

నేపాల్‌—పర్వత రాజ్యం

నేపాల్‌ రాజ్యం చాలా అసహజమైంది ఎందుకంటే, ఉన్న కొన్ని రాచరిక దేశాల్లో అది ఒకటి అంతేకాకుండ అది లౌకిక రాజ్యం కాదుగాని, అది మతపరమైన రాజ్యం. ప్రపంచమంతటిలో నేపాల్‌ ఒక్కటే హిందూ రాజ్యం. రెండు కోట్ల మంది నివాసుల్లో అధిక శాతం మంది హిందువులే. అయితే, దాని ప్రజల జాతి ఆవిర్భవంలో ఎంతో తేడా ఉంది. ఉత్తర, పర్వత ప్రాంతంలో జీవించేవారు ముఖ్యంగా టిబెట్‌, బర్మా నుండి వచ్చినవారు అయితే, దక్షిణ మైదాన ప్రాంతంలోని ప్రజలలో ఎక్కువ మంది భారతీయ ఆర్యుల చరిత్రను గలవారు. నేపాలీ భాష ఆ దేశపు అధికారిక భాష, మరి వారిలో 60 శాతం మంది ప్రజల మాతృభాష అదే. మిగిలినవారు 18 కంటే ఎక్కువ విభిన్నమైన జాతుల భాషలను మాట్లాడుతారు.

నేపాల్‌ కాస్త దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, తూర్పు నుండి పడమటికి 880 కిలోమీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణంవరకు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర సరిహద్దుగా ఉన్న సంభ్రమాశ్చర్య హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్‌ శిఖరం కూడా ఉంది, ఇది 8,848 మీటర్ల ఎత్తుండి ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన శిఖరం మరియు 8,000 మీటర్లుగల ఎనిమిది ఇతర శిఖరాలున్నాయి. మధ్య నేపాల్‌నందు చిన్న పర్వతాలు మరియు సరస్సులూ లోయలూ ఉన్నాయి. దక్షిణంలో ఆవలివైపున, అంటే ఇండియా సరిహద్దులో టెరాయి అనే సారవంతమైన ముఖ్య వ్యవసాయ ప్రాంతముంది.

మధ్య ప్రాంతంలో ఉన్న రాజధానియైన ఖాట్మండు నిజంగానే సందర్శకులకు ఆనందమయ స్థలం. అది, ఎత్తైన పర్వతాలూ పార్కులూ అక్కడే ఉన్న అనేక చూడదగిన ప్రాంతాలపై నుండి విమానయానం చేసే ఏర్పాటుంది. నేపాల్‌ కొన్నిసార్లు దేవతల లోయ అని పిలువబడుతుంది ఎందుకంటే ఆ ప్రజల జీవితాల్లో మతం ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేకులు హిమాలయాలకంటే ఎత్తైన ‘పర్వతాన్ని’ అధిరోహించేందుకు గల కారణాల్లో ఒకటి, మతము.

సుమారు 2,700 సంవత్సరాలకు పూర్వం, హెబ్రీ ప్రవక్తైన యెషయా ఇలా చెప్పేందుకు పురికొల్పబడ్డాడు: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిరపర్వతము పర్వత శిఖరమున స్థిరపరచ . . . బడును. . . . జనములు గుంపులు గుంపులుగా వచ్చి . . . యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.” (యెషయా 2:2, 3) ఇక్కడ, ఉన్నతపర్చబడిన సృష్టికర్త మరియు విశ్వ సర్వోన్నతపరిపాలకుడైన యెహోవా యొక్క స్వచ్ఛమైన ఆరాధన, పర్వతాలవంటి ఆరాధనా విధాలన్నిటికంటే పైగా ఉన్నతపరచబడిన పర్వతానికి పోల్చడం జరిగింది. అది, సత్యం ఎడల ఆసక్తిగల ప్రజలు యెహోవా మార్గాలను గూర్చి తెలుసుకునేందుకు సహాయపడే ప్రపంచవ్యాప్త విద్యా కార్యక్రమపు విషయం. ఈ పని నేపాల్‌నందు ఎలా ప్రారంభమైంది?

చిన్న ప్రారంభాలు

రెండవ ప్రపంచ యుద్ధంనందలి బ్రిటిష్‌ సైన్యంలోని ఓ సైనికుడు నిజమైన మతం కొరకు అన్వేషిస్తూ ఉండేవాడు. నేపాలీ హిందూ మతానికి చెందిన ఆయన తలిదండ్రులు కాథోలిక్కులుగా మారారు. ఆయన ఎదుగుతుండగా, విగ్రహారాధనలోని బుద్ధిహీనతను గమనించాడు, నరకాగ్ని సిద్ధాంతం వంటి బోధలను తృణీకరించి, ప్రొటెస్టంట్‌ చర్చీల విశ్వాసాలను పరిశీలించడం ప్రారంభించాడు. అయితే ఆయన తృప్తి చెందలేదు.

జపాను దేశీయులు ఈ సైనికుణ్ణి అప్పటి బర్మాలోని రంగూనుకు ఖైదీగా తీసుకుపోయినప్పుడు, తన సత్యారాధన యొక్క అన్వేషణను కొనసాగించేందుకు ఆ (లేబరు క్యాంపు) నిర్బంధ శ్రామిక శిబిరంలోని కష్టాలనుండి బయటపడేలా చూడమని ఆయన ప్రార్థించాడు. తర్వాత, తనను పట్టుకున్న వ్యక్తులనుండి ఎలాగో తప్పించుకుని, ఓ పాఠశాల ఉపాధ్యాయుని సహాయాన్ని పొందాడు. వాళ్ల ఇంట్లోనే, జె. ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ వ్రాసిన మరణించినవారు ఎక్కడ ఉన్నారు? (ఆంగ్లం) అనే చిన్న పుస్తకాన్ని కనుగొన్నాడు. సత్యపు ధ్వనిని గ్రహించి, 1947 నందు రంగూనులో యెహోవాసాక్షులు పఠించేందుకు ఆహ్వానించినప్పుడు ఆయన ఎంతో ఆసక్తితో అంగీకరించాడు. కొన్ని నెలల్లోనే, ఆయన బాప్తిస్మము తీసుకున్నాడు ఆ తర్వాత కొద్దికాలానికే యౌవనురాలైన ఆయన భార్యకూడా బాప్తిస్మం పొందింది. ఈశాన్య పర్వతాల్లోని తమ స్వగ్రామమైన కలింపోంగ్‌లో స్థిరనివాసమేర్పర్చుకునేందుకు వారు ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ వారికి ఇద్దరు కుమారులు జన్మించారు, అక్కడే వారు విద్యనభ్యసించారు. మార్చి 1970నందు వారు ఖాట్మండుకు వెళ్లారు.

నేపాల్‌ రాజ్యాంగము మతమార్పిడిని నిషేధించింది. విదేశీ మతమని పిలువబడేదేదైనా ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తే ఏడు సంవత్సరాల ఖైదును అనుభవించాల్సి ఉంటుంది మరి అలాంటి ఓ మతంలో చేరే ఒక వ్యక్తికి పెద్ద మొత్తంలో జరిమానా విధించబడడమేకాకుండ మూడు సంవత్సరాల జైలు శిక్షను కూడా విధిస్తారు. కనుక సాక్ష్యమిచ్చే పనిని జాగ్రత్తగా చేయవల్సి ఉంది. అక్కడ ఇంటింటి పరిచర్య చేయడమంటే, ఒక ఇంట్లో మాట్లాడి మరో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక ఇంట్లో మాట్లాడడం అన్నమాట. అనియత సాక్ష్యము సువార్తను వ్యాపింపజేయడంలో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని నిర్వహించిందన్న విషయం స్పష్టమౌతుంది.

ఫలితాలు చాలా నెమ్మదిగా వచ్చాయి. ఒక కోటి జనాబాతో, ఆ ప్రాంతం చాలా నిరుత్సాహకరంగా అనిపించింది. ఈ ఒక్క కుటుంబం తన స్నేహితులకు, పరిచయస్తులకు, యజమానులకు మరియు తోటి ఉద్యోగులకు సాక్ష్యమివ్వడం ద్వారా సత్యపు విత్తనాలు నాటబడ్డాయి. వారు తమ ఇంట్లో క్రమంగా కూటాలను నిర్వహించారు మరియు ఆసక్తిగలవారిని తమతో చేరడానికి ఆహ్వానించారు. చివరికి, మార్చి 1974 నందు, నాలుగు సంవత్సరాలవరకు ఎడతెగకుండా నాటడం మరియు నీళ్లు పోయడంవల్ల, నేపాల్‌లోని మొట్టమొదటి ఫలం లభించింది. మరి అది ఓ ఊహించని మూలం నుండి!

ఒక ఇంటిని సందర్శించినప్పుడు, రాజ కుటుంబ సభ్యుని కార్యదర్శియైన ఓ ధనవంతునితో ఒక ప్రచారకుడు మాట్లాడాడు. “నా కొడుకుతో మాట్లాడండి,” అన్నాడు ఆ వ్యక్తి. ఆ కుమారుడు బైబిలును పఠించేందుకు అంగీకరించాడు. అతను జూద గృహంలో పనిచేసేవాడు కనుక, కొంతకాలానికి అతను తన ఉద్యోగాన్ని మార్చుకున్నాడు. హిందూ భక్తిపరుడైన అతని తండ్రి, అతనిని వ్యతిరేకించాడు. అయినప్పటికీ, ఈ యౌవనుడు యెహోవాతట్టున నిలుచున్నాడు. దాని పరిణామం? తర్వాత అతని తండ్రి అతనిని వ్యతిరేకించడం మానుకున్నాడు, మరి ఓ గుంపు సన్నిహిత సంబంధులు బైబిలు సత్యాన్ని అంగీకరించారు. ఇతను నేడు ఓ క్రైస్తవ సంఘంలో పెద్దగా సేవచేస్తున్నాడు.

ఆత్మీయంగా బలంగా ఉండేందుకు మరియు క్రమంగా కూడుకోవాలి అన్న లేఖనాధార ఆజ్ఞను లక్ష్యపెట్టేందుకు ఖాట్మండునందలి చిన్న గుంపు ఒక ఇంట్లో క్రమంగా కూటాలను జరుపుకునేది. అయితే ఎక్కువగా, సహోదరులు పెద్ద కూటలకు హాజరుకాలేకపోయేవారు. అలా చేయగల స్తోమతగలవారు, సమావేశాలకు హాజరయ్యేందుకు ఇండియాకు ప్రయాణం సాగించేవారు—పర్వతాలమీదుగా అది సుదీర్ఘమైన ఖర్చుతోకూడిన ప్రయాణం.

పూర్తి జిల్లా సమావేశ కార్యక్రమమంతా, మునుపు వారు కూటాలు జరుపుకునే ఇంట్లోనే నిర్వహించడం ఎంత ఆనందమయమైన సందర్భమో కదా! ఇండియా బ్రాంచిలోని ఒక సభ్యునితోసహా నలుగురు సహోదరులు కార్యక్రమాన్నంతటినీ నిర్వహించడాన్ని ఊహించుకోండి! బైబిలు నాటకం కూడా ఏర్పాటు చేయబడింది. అదెలా? ఇండియాలో జరిగిన డ్రస్‌ రిహార్సల్‌ సమయంలోని స్లైడ్స్‌ తీయడం జరిగింది. నేపాల్‌నందు, ఈ స్లైడ్స్‌ను తెరపై చూపించారు, దానితో పాటు రికార్డుచేసిన మాటలను వినిపించారు. ప్రేక్షకులు దాన్ని ఎంతో ఇష్టపడ్డారు. ఎంత మంది ప్రేక్షకులున్నారు? పద్దెనిమిది మంది ప్రజలు!

ప్రకటించేపనిలో ఆ దేశం వెలుపల నుండి వచ్చే సహాయం చాలా పరిమితంగా ఉండేది. మిషనరీ పని అసాధ్యంగా ఉండేది మరియు విదేశీయులకు లౌకిక పని లభించడం అంత సులభం కాదు. అయితే ఇండియాకు చెందిన ఇద్దరు సాక్షులు ఖాట్మండులో అనేక సంవత్సరాలు గడిపి, క్రొత్తగా ప్రారంభమైన సంఘాలను బలపర్చేందుకు సహాయపడుతూ, నేపాల్‌నందు వేరు వేరు సమయాల్లో ఉద్యోగాలను పొందారు. ఖాట్మండునందు 1976 కల్లా 17 మంది రాజ్య ప్రచారకులుండేవారు. సహోదరులు 1985 నందు తమ స్వంత రాజ్య మందిరాన్ని నిర్మించుకున్నారు. అది పూర్తి కావడంతో, సాంవత్సరిక జిల్లా సమావేశాలూ, అలాగే ఇతర సమావేశాలూ క్రమంగా జరగడం ప్రారంభమయ్యాయి. ఏకాంతంగా ఉన్న ఆ పర్వత ప్రాంతంలో ఆ హాలు నిజంగానే స్వచ్ఛారాధనకు కేంద్రంగా ఉంది.

కష్టాలున్నప్పటికీ విస్తరణ

ఆ తొలి సంవత్సరాల్లో ప్రచార పనిని ఎంతో జాగ్రత్తతో జరిగించడంవల్ల అధికారులు ఎక్కువగా గమనించలేదు. అయితే, 1984 చివరికల్లా నిషేధాలు విధించడం ప్రారంభమైంది. ఒక సహోదరుడు మరియు ముగ్గురు సహోదరులు తమ పరిచర్యను కొనసాగించకుండానే హెచ్చరికతో వారిని విడిచిపెట్టారు. ఒక గ్రామంలో, తమ ఇళ్లలో బైబిలు పఠనాలను నిర్వహించబడుతుండగా తొమ్మిదిమంది అరెస్టుచేయబడ్డారు. వారిలో ఆరుగురు 43 రోజులు కారాగారంలో బంధించబడ్డారు. ఇతర అరెస్టులనేకం చేయబడ్డాయి, కానీ చట్టబద్ధమైన చర్య ఏదీ తీసుకోబడలేదు.

ఇటీవల అంటే 1989 నందు ఒక సంఘ పుస్తకపఠనం వద్దనున్న సహోదర సహోదరీలందరూ అరెస్టు చేయబడ్డారు, మూడు రోజులవరకూ అక్కడ ఉంచబడ్డారు ఆ తర్వాత విడుదల చేశారు. కొన్నిసార్లు, తాము ఇక ప్రకటించమని వ్రాసివున్న ఒక వాఙ్మలంపై సంతకం చేయమని వారు కోరబడేవారు. వారందుకు నిరాకరించారు. మరికొందరు, ప్రకటిస్తుండగా మరలా పట్టుబడితే దాని వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడివుండాలని వాజ్ఞ్మూలంపై సంతకం చేసిన తర్వాతే విడిపించబడ్డారు.

అలాంటి కష్టాలున్నప్పటికీ, సహోదరులు రాజ్య సువార్తను ఉత్సాహంతో ప్రకటిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత అంటే, 1985 నందు, ప్రకటించే వారి సంఖ్యలో 21 శాతం అభివృద్ధి కనిపించింది. ముప్పై అయిదు మంది ప్రచారకులు స్వచ్ఛమైన ఆరాధనను గూర్చి ఇతరులతో మాట్లాడుతూ నెలకు సగటున 20 గంటలను వెచ్చించారు.

సమయం గడిచే కొలది, నేపాల్‌నందలి రాజకీయ మార్పుల హోరు గాలి వీచడం ప్రారంభమైంది. యెహోవాసాక్షులు అపాయకరమైనవారు కారని ప్రభుత్వాధికారులు గ్రహించడం ప్రారంభించారు. వాస్తవానికి, వారి బైబిలు విద్యాభ్యాస పని వారిపై ప్రయోజనకరమైన, నిర్మాణాత్మకమైన ప్రభావాన్ని కల్గివుంది, అది వారిని మరింత శ్రేష్ఠమైన పౌరులనుగా చేసింది. యెహోవా ఆరాధికులయ్యేందుకుగల అర్హతల్లో నిజాయితీ, కష్టపడి పనిచేయడం మరియు సరైన నైతిక ప్రవర్తన ప్రాముఖ్యమైనవని అధికారులు గమనించారు.

మునుపు భక్తిపరురాలైన ఒక హిందూ స్త్రీ సాక్షి అయ్యి, రక్త మార్పిడిని నిరాకరించడం మంచి సాక్ష్యాన్నిచ్చింది. ఆమె తీర్మానాత్మక మరియు పూర్ణ జ్ఞానంగల నిర్ణయానికి వైద్యులు ఆశ్చర్యపోయారు. భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషూరునుండి సత్యాన్ని నేర్చుకునేందుకు ఆమె సహాయం పొందింది. ఆమె కుటుంబంనుండి ఎంతో వ్యతిరేకత అపహాస్యాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమెకు 70 ఏండ్లు పైబడుతుండగా 1990 నందు ఆమె బాప్తిస్మం పొందింది. కొంత కాలం తర్వాత ఆమె కాలు విరిగింది, అంతేకాకుండ ఆమె ఇతర సమస్యలతో బాధపడుతూ, చివరికి ఆమెకు ఒక పెద్ద శస్త్రచికిత్సను కూడా చేయవల్సివచ్చింది. రక్త మార్పిడిని అంగీకరించమని వైద్యులూ బంధువులు తెచ్చిన ఒత్తిడిని ఆమె రెండువారాల వరకూ తాళుకుని నిలిచింది. చివరికి, శస్త్రచికిత్సా బృందం రక్తం లేకుండా విజయవంతంగా శస్త్రచికిత్సను చేసింది. ఇప్పుడు ఆ సహోదరి ఎక్కువగా కదలలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ నమ్మకమైన సహోదరి ప్రతిరోజు తన గేటువద్ద కూర్చుని, దారిని వెళ్లేవారిని తనతో కూర్చుని సంతోకరమైన సువార్తను వినమని ఆహ్వానిస్తుంది.

నేటి నేపాల్‌

నేడు నేపాల్‌లోని పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సహోదరుల్లాగే యెహోవాసాక్షులు మంచి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఒకరిద్దరు సూచనార్థక పర్వతారోహకులు ఈ సత్యారాధనా పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించిన నాటినుండి, అనేకమంది ప్రజలు, ‘యెహోవా పర్వతాన్ని ఎక్కుదాము రండి’ అని చెప్పారు. ప్రకటించే పనిలో 1989 కల్లా ప్రతి నెల సగటున 43 మంది భాగంవహించేవారు మరియు ఆ సంవత్సరం 204 మంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినానికి హాజరయ్యారు.

అప్పుడు, వాగ్దానం చేసినట్లుగా, యెహోవా తన గృహంలోనికి సత్యాన్వేషకులను చేర్చడాన్ని త్వరితం చేయడం ప్రారంభించాడు. (యెషయా 60:22) మరి కొంత కాలానికే ఖాట్మండునందు రెండవ సంఘం ప్రారంభమైంది, మరి ఇప్పుడు రాజధాని వెలుపల రెండు ఐసొలేటెడ్‌ గ్రూపులున్నాయి. ఏప్రిల్‌ 1994 నందు, 153 క్రైస్తవులు పరిచర్యపనిని రిపోర్టు చేశారు, అంటే అయిదు సంవత్సరాలుకూడా గడవకముందే 350 శాతం అభివృద్ధి అన్నమాట! వారు ఆసక్తిగల ప్రజలతో 386 గృహ బైబిలు పఠనాలను నిర్వహించారు. పందొమ్మిదివందల తొంభైనాలుగు జ్ఞాపకార్థదిన సమయంలో, 580 మంది హాజరవ్వడం ఎంతో ఉప్పొగింపజేసింది. ప్రత్యేక దిన సమావేశానికి, 635 మంది హాల్లో కిక్కిరిసి కూడుకున్నారు, 20 మంది బాప్తిస్మం తీసుకునేందుకు ముందుకు వచ్చారు. కనుక ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు అనుభవిస్తున్న గొప్ప పెరుగుదల ఈ చిన్ని నేపాల్‌నందుకూడా జరుగుతోంది.

ఇటీవలి సంవత్సరాల్లో నేపాలీ భాషలో ప్రచురించబడుతున్న ప్రచురణల మొత్తం కూడా ఎంతో అధికమైంది, అవి దీనులైనవారు సత్యాన్ని గట్టిగా హత్తుకునేటట్లు సహాయపడుతుంది. ఇండియా బ్రాంచి కార్యాలయంలో అనువాద పనితనం మరియు కంప్యూటర్ల ఉపయోగంలో శిక్షణను పొందిన అనువాదకులు నేడు ఖాట్మండునందు పూర్తికాలం సేవిస్తున్నారు. అభివృద్ధికి సిద్ధపర్చబడిన ఈ నేపాల్‌ యొక్క దైవపరిపాలనా పర్వతారోహకులు ముందుకు వెళుతూనే ఉన్నారు.

హిమాలయాలకంటే ఉన్నతస్థానానికి అధిరోహించడం

మీరు కూడా హిమాలయాలకంటే ఉన్నతమైన పర్వతాన్ని ఎక్కే ఆనందాన్ని పొందగలరు. అలా చేయడం వల్ల, నేపాల్‌నందున్న వారితోనే కాకుండ, “ప్రతి జనము, ప్రతి వంశము, ప్రజలు, ఆ యా భాషలు మాటలాడు వారితో” లక్షలాది మందితో పాటు మీరూ చేరతారు. (ప్రకటన 7:9) నేపాల్‌నందున్నటువంటి అత్యున్నతమైన పర్వతాలచే సృష్టికర్త బోధించబడడాన్ని వారితోపాటు మీరూ అనుభవిస్తారు. సృష్టికర్త “విషయాన్ని చక్కపర్చడాన్ని” మీరు చూస్తారు, అంతేకాకుండ శుభ్రపర్చబడిన మరియు అందమైన భూమిలో నిత్యం జీవించేందుకు మీరు ఎదురుచూడగలుగుతారు.—యెషయా 2:4 NW.

[24వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఖాట్మండు

ఎవరెస్ట్‌ శిఖరం

[25వ పేజీలోని చిత్రం]

ఖాట్మండులో రాజ్యమందిరం వెలుపల

[26వ పేజీలోని చిత్రం]

బైబిలు పఠనాలనుండి నేపాల్‌ దేశస్థులనేకులు ప్రయోజనం పొందుతున్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి