“మీ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవ”
“సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి అంగీకారమైన యాగంగా మీ శరీరాలను, మీ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవను సమర్పించుకొనుడి.”—రోమీయులు 12:1 NW.
1, 2. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడాన్ని నేర్చుకోవడం, ఎలా ఒక క్రొత్త భాషపై పట్టుసాధించడం వంటిదై ఉంటుంది?
మీరు ఒక క్రొత్త భాషను నేర్చుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? ఒకవేళ ప్రయత్నించి ఉంటే, అది చాలా కష్టమైన పనియని మీరు నిస్సందేహంగా అంగీకరిస్తారు. ఎంతైనా, కేవలం క్రొత్త పదాలను నేర్చుకోవడం కంటే అందులో ఎక్కువే ఇమిడి ఉంది. భాషను ప్రావీణ్యంగా ఉపయోగించాలంటే దాని వ్యాకరణంపై పట్టు సాధించాల్సిన అవసరం కూడా ఉంటుంది. పదాలు ఒకదానికొకటి ఎలా సంబంధిస్తాయో మరి అవి సంపూర్ణ భావాలుగా ఏర్పడేందుకు ఎలా సంయోజనం చేయబడతాయో మీరు గ్రహించాలి.
2 దేవుని వాక్య జ్ఞానాన్ని మనం పొందడంలో కూడా ఇది నిజమే. కొన్ని ఎన్నుకున్న లేఖన భాగాలను నేర్చుకోవడం కంటే ఎక్కువే ఇమిడి ఉంది. సూచనార్థకంగా చెప్పాలంటే, మనం బైబిలు వ్యాకరణాన్ని కూడా నేర్చుకోవాలి. లేఖనాలు ఒకదానికొకటి ఎలా సంబంధిస్తాయో మరి అవి అనుదిన జీవితంలో అన్వయించుకోగల సూత్రాలుగా ఎలా పని చేస్తాయో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మనం అలా “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండ”గలము.—2 తిమోతి 3:17.
3. దేవునికి చేసే సేవ విషయంలో, సా.శ. 33లో ఏ మార్పు వచ్చింది?
3 మోషే ధర్మశాస్త్ర నియమం యొక్క ఏర్పాటులో, యథార్థత చాలామట్టుకు సముచితంగా నిర్వచించబడిన నియమాలకు కచ్చితంగా లోబడటం ద్వారా ప్రదర్శించబడగల్గేది. అయితే, సా.శ. 33లో యెహోవా ధర్మశాస్త్రాన్ని, తన కుమారుడు చంపబడిన ‘హింసాకొయ్యకు మేకులతో కొట్టి,’ దాన్ని నిరర్థకం చేశాడు. (కొలొస్సయులు 2:13, 14) దాని తర్వాత, అర్పించాల్సిన బలులను గూర్చిన మరియు పాటించాల్సిన నియమాలను గూర్చిన సుదీర్ఘమైన చిట్టా దేవుని ప్రజలకు ఇవ్వబడలేదు. బదులుగా, వారికిలా చెప్పబడింది: “సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి అంగీకారమైన యాగంగా మీ శరీరాలను, మీ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవను సమర్పించుకొనుడి.” (రోమీయులు 12:1 NW) నిజమే, క్రైస్తవులు దేవుని సేవలో తమ పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో మరియు శక్తితో తమను తాము వెచ్చించుకోవాలి. (మార్కు 12:30; కీర్తన 110:3 పోల్చండి.) “మీ వివేచనాశక్తితో పరిశుద్ధ సేవను” అర్పించడమంటే దాని భావమేమిటి?
4, 5. యెహోవాను మన వివేచనాశక్తితో సేవించడంలో ఏమి ఇమిడి ఉంది?
4 “వివేచనాశక్తి” అనే పదబంధం, “హేతుబద్ధం” లేక “ప్రజ్ఞగల” అన్న అర్థానిచ్చే లా·గి·కోస్ʹ అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. దేవుని సేవకులు బైబిలు ద్వారా తర్ఫీదు పొందిన మనస్సాక్షిని ఉపయోగించాల్సిందిగా కోరబడ్డారు. తమ నిర్ణయాలను అసంఖ్యాక పూర్వస్థాపిత నియమాలపై ఆధారితం చేసే బదులు, క్రైస్తవులు బైబిలు సూత్రాలను జాగ్రత్తగా తూచిచూడాలి. వారు బైబిలు యొక్క “వ్యాకరణాన్ని,” లేక దాని వేర్వేరు సూత్రాలు ఒకదానితో ఒకటి ఎలా సంబంధాన్ని కల్గి ఉన్నాయనే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా, వారు తమ వివేచనాశక్తితో సమతూకంగల నిర్ణయాలు చేయవచ్చు.
5 క్రైస్తవులకు ఏ నియమాలు లేవని దీని అర్థమా? ఎంత మాత్రం కాదు? క్రైస్తవ గ్రీకు లేఖనాలు విగ్రహారాధన, లైంగిక దుర్నీతి, హత్య చేయడం, అబద్ధమాడటం, అభిచారం, రక్తాన్ని దుర్వినియోగపర్చడం వంటి మరితర విభిన్న పాపాలను స్పష్టంగా నిషేధించాయి. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8) అయిననూ, బైబిలు సూత్రాలను నేర్చుకోవడానికి మరి అన్వయించుకోవడానికి, ఇశ్రాయేలీయులనుండి అపేక్షించబడిన దానికంటే ఎంతో ఎక్కువ స్థాయిలో మనం మన వివేచనాశక్తిని ఉపయోగించాలి. ఒక క్రొత్త భాషను అర్థం చేసుకోవడంలోవలెనే దీనికి కూడా సమయం మరియు ప్రయత్నం కావాలి. మన వివేచనాశక్తిని ఎలా వృద్ధిపర్చుకోవచ్చు?
మీ వివేచనాశక్తిని అలవర్చుకోవడం
6. బైబిలును పఠించడంలో ఏమి ఇమిడి ఉంది?
6 మొదటిగా, మనం బైబిలు యొక్క శ్రద్ధగల విద్యార్థులమవ్వాలి. దేవుని ప్రేరేపిత వాక్యం “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) ఒక సమస్యకు జవాబు, కేవలం ఒక బైబిలు వచనంలోనే చూపబడి ఉంటుందని మనం ఎప్పుడు అపేక్షించకూడదు. బదులుగా, ఒక ప్రత్యేకమైన పరిస్థితి లేక సమస్యపై వెలుగు ప్రసరించే అనేక లేఖనాలను తీసుకుని మనం వివేచించాల్సి ఉంటుంది. ఆ విషయంపై దేవుని ఉద్దేశం కొరకు మనం తీవ్రంగా పరిశోధించాల్సిన అవసరం ఉంటుంది. (సామెతలు 2:3-5) “వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును,” గనుక మనకు వివేకం కూడా అవసరం. (సామెతలు 1:5) వివేకంగల వ్యక్తి ఒక విషయం యొక్క విభిన్న అంశాలను వేర్పరచి, ఒకదానితో ఒకటి కలిగివున్న సంబంధాన్ని తెలుసుకోగలడు. ఒక పజిల్‌ను చేసినట్లు, తాను పూర్తి చిత్రాన్ని చూడగలిగేలా వివేకంగల వ్యక్తి దాని ముక్కలన్నిటినీ ఒక దగ్గర క్రమంగా పెడతాడు.
7. క్రమశిక్షణకు సంబంధించిన బైబిలు సూత్రాల విషయంలో తలిదండ్రులెలా వివేచింపగలరు?
7 ఉదాహరణకు, తలిదండ్రులుగా ఉండటాన్ని గురించి ఆలోచించండి. సామెతలు 13:24 చెప్పేదేమంటే, తన కుమారున్ని ప్రేమించు తండ్రి “వానిని శిక్షించును.” కేవలం ఈ ఒక్క లేఖనాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, కఠినమైన, ఎడతెగని దండనను అది న్యాయబద్ధం చేయడానికి దాన్ని తప్పుగా అన్వయింపజేయవచ్చు. అయిననూ, “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి,” అని కొలొస్సయులు 3:21 సమతూకపర్చే సలహాను అందిస్తుంది. తమ వివేచనాశక్తిని ఉపయోగించి, ఈ సూత్రాలను సమన్వయపర్చే తలిదండ్రులు “అవినీతి చర్య” అని పిలువబడగల రీతిలో దండించరు. వారు తమ పిల్లలను ఆప్యాయతతో, అర్థం చేసుకుని, గౌరవంగా చూస్తారు. (ఎఫెసీయులు 6:4) అలా, తలిదండ్రులుగా ఉండటంలో లేక బైబిలు సూత్రాలు ఇమిడియున్న వేరే ఏ విషయంలోనైనా, దానికి సంబంధించిన అంశాలనన్నింటినీ తూచి చూడటం ద్వారా మనం మన వివేచనాశక్తిని వృద్ధిపర్చుకోవచ్చు. ఈ విధంగా, దేవుని ఉద్దేశం ఏమై ఉంది మరి అదెలా సాధించబడుతుంది అనే దాన్ని, బైబిలు సూత్రాల “వ్యాకరణాన్ని” మనం తెలుసుకోగలము.
8. వినోదం విషయంలో కర్కశమైన, మూర్ఖమైన దృక్పథం అవలంబించుకోవడాన్ని మనమెలా మానుకోగలము?
8 మన వివేచనాశక్తిని అభివృద్ధిపర్చుకోడానికి గల రెండవ మార్గం, కర్కశమైన, మూర్ఖమైన దృక్పథాన్ని అవలంబించుకోవడాన్ని మానుకోవడం. నిర్హేతుకమైన దృష్టికోణం మన వివేచనాశక్తి వృద్ధియగుటను అడ్డగిస్తుంది. వినోదం విషయాన్ని పరిగణించండి. “లోకమంతయు దుష్టునియందున్నదని,” బైబిలు చెబుతుంది. (1 యోహాను 5:19) లోకంచే ఉత్పత్తి చేయబడిన ప్రతి పుస్తకం, చలనచిత్రం, లేక దూరదర్శిని కార్యక్రమం దుష్టమైనదని, సాతానుకు సంబంధించినదని దాని అర్థమా? అలాంటి దృక్పథం సహేతుకమైనది కాదు. నిజమే, కొందరు దూరదర్శిని, చిత్రాలు, లేక లోక సాహిత్యాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని ఎంపిక చేసుకోవచ్చు. అది వారి హక్కు, దాని విషయమై వారిని విమర్శించకూడదు. అయితే అలాంటి కఠినమైన స్థానాన్ని వహించాలని వారు కూడా ఇతరులను ఒత్తిడి చేయకూడదు. మన వేడుక లేక వినోదం విషయంలో జ్ఞానవంతంగా ఎంపిక చేసుకోగల వారిగా ఉండేందుకు సహాయపడవలసిన బైబిలు సూత్రాలను తెలియజేస్తూ సొసైటీ శీర్షికలను ప్రచురించింది. ఈ నడిపింపునిచ్చే సూత్రాలను మీరిపోయి, ఈ ప్రపంచ వినోదంలోని ఎక్కువ వాటిలో అందించబడుతున్న అవినీతికరమైన ఆలోచనా విధానం, నీచమైన దౌర్జన్యం, లేక అభిచారం వంటి వాటికి మనల్ని మనం ఎక్కువగా లొంగిపోనిస్తే అది ఎంతో అజ్ఞానమైన విషయం. నిజంగా, వినోదాన్ని జ్ఞానవంతంగా ఎంపిక చేసుకోవాలంటే, మనం దేవుని ఎదుట మరియు మనుష్యుల ఎదుట మంచి మనస్సాక్షిని కలిగి ఉండేలా బైబిలు సూత్రాలను అన్వయించుకోడానికి మన వివేచనాశక్తిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.—1 కొరింథీయులు 10:31-33.
9. ‘పూర్తి వివేచన’ అంటే ఏమిటి?
9 నేటి వినోదంలోని చాలా భాగం క్రైస్తవులకు తగినది కాదు.a కాబట్టి, మొదటి శతాబ్దంలోని “సిగ్గులేనివారై”యుండిన కొందరి వలె ఉండకుండా ఉండేందుకు మనం మన హృదయాలకు “చెడుతనమును అసహ్యించు”కోవడాన్ని నేర్పాలి. (కీర్తన 97:10; ఎఫెసీయులు 4:17-19) అలాంటి విషయాలను గురించి వివేచించడానికి, మనకు ‘కచ్చితమైన జ్ఞానము మరియు పూర్తి వివేచన’ అవసరము. (ఫిలిప్పీయులు 1:9) ‘వివేచన’ అని అనువదించబడిన గ్రీకు పదం, “సున్నితమైన నైతిక గ్రాహ్యత” అనే భావాన్నిస్తుంది. ఆ పదం, దృష్టి వంటి అక్షరార్థ మానవ ఇంద్రియాలను సూచిస్తుంది. వ్యక్తిగత నిర్ణయం అవసరమయ్యే, వినోదం లేక మరే విషయాన్ని గురించైనా, మనం నిక్కచ్చిగా సూచింపబడుతున్న మంచి చెడు విషయాలను మాత్రమే కాక, మధ్యస్థమైన వాటిని కూడా గ్రహించగలిగేలా మన నైతిక బుద్ధి కేంద్రీకరించబడాలి. అదే సమయంలో, మనం బైబిలు సూత్రాలను నిర్హేతుకమైన స్థాయిలో అన్వయిస్తూ, మన సహోదరులందరూ అలాగే చేయాలని పట్టుబట్టడం వంటివి మానుకోవాలి.—ఫిలిప్పీయులు 4:5.
10. కీర్తన 15లో ప్రతిబింబించబడిన యెహోవా యొక్క వ్యక్తిత్వాన్ని మనమెలా అర్థం చేసుకోగలము?
10 మన వివేచనాశక్తిని అభివృద్ధిపర్చుకోడానికి మూడవ మార్గమేమంటే, యెహోవా యొక్క ఆలోచనా విధానాన్ని తెలుసుకుని, దాన్ని మన హృదయాల్లో ప్రగాఢంగా పొందుపర్చుకోవడమే. తన వాక్యంలో, యెహోవా తన వ్యక్తిత్వాన్ని మరియు ప్రమాణాలను తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు, కీర్తన 15లో, తన గుడారంలో అతిథిగా ఉండేందుకు యెహోవా ఎలాంటి వ్యక్తిని ఆహ్వానిస్తాడో దాని గురించి మనం చదువుతాము. అలాంటి వ్యక్తి నీతిననుసరిస్తాడు, తన హృదయంలోని సత్యాన్ని మాట్లాడతాడు, తన వాగ్దానాలకు కట్టుబడి నమ్మకంగా ఉంటాడు, ఇతరులనుండి స్వార్థపూరితలాభాన్ని అపేక్షించడు. ఈ కీర్తనను చదివేటప్పుడు, ‘ఈ లక్షణాలు నన్ను వర్ణిస్తున్నాయా? తన గుడారంలో అతిథిగా ఉండేందుకు యెహోవా నన్ను ఆహ్వానిస్తాడా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యెహోవా యొక్క మార్గాలు మరియు ఆలోచనా విధానానికి మనం సమన్వయంగా మారుతున్న కొలది మన గ్రహణ శక్తులు పటిష్టమౌతాయి.—సామెతలు 3:5, 6; హెబ్రీయులు 5:14.
11. పరిసయ్యులు “న్యాయమును దేవుని ప్రేమను” ఎలా విడిచిపెట్టారు?
11 ప్రాముఖ్యంగా ఈ విషయంలోనే పరిసయ్యులు ఘోరంగా విఫలమయ్యారు. పరిసయ్యులకు ధర్మశాస్త్రం యొక్క పారిభాషిక రచన గురించి తెలుసు కానీ దాని “వ్యాకరణాన్ని” వారు గ్రహించలేకపోయారు. వారు ధర్మశాస్త్రం యొక్క వేవేల వివరణలను ఒప్పజెప్పగలరు, అయితే దాని గ్రంథకర్త యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడంలో వారు విఫలమయ్యారు. “మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు,” అని యేసు వారితో అన్నాడు. (లూకా 11:42) తమ కఠినమైన మనస్సులతో మరియు నిర్దయ హృదయాలతో పరిసయ్యులు తమ వివేచనాశక్తిని ఉపయోగించడంలో విఫలమయ్యారు. విశ్రాంతిదినాన వెన్నులు తుంచి గింజలు తిన్నందుకు వారు యేసు శిష్యులను విమర్శించినప్పుడు వారి అసంగత తర్కం వెల్లడయ్యింది; అయిననూ, అదే దినంలో కొద్ది సమయం తర్వాత యేసును హతమార్చేందుకు పన్నాగం పన్నినప్పుడు వారి మనస్సాక్షి వారిని కించింతైనా గద్దించలేదు!—మత్తయి 12:1, 2, 14.
12. ఒక వ్యక్తిగా యెహోవాతో మనం మరింత సమన్వయం ఎలా కలిగి ఉండగలము?
12 మనం పరిసయ్యులనుండి భిన్నంగా ఉండాలని ఇష్టపడతాము. ఒక వ్యక్తిగా యెహోవాతో మనం మరింత సమన్వయం కలిగి ఉండేందుకు దేవుని వాక్యాన్ని గూర్చిన మన జ్ఞానం మనకు సహాయం చేయాలి. మనం దాన్నెలా చేయగలం? బైబిలు యొక్క లేక బైబిలు ఆధారిత సాహిత్యం యొక్క కొంత భాగాన్ని చదివిన తర్వాత, ఇటువంటి ప్రశ్నలను గురించి ఆలోచించడం ద్వారా కొందరికి సహాయం లభించింది, ‘యెహోవాను గురించి మరియు ఆయన లక్షణాలను గురించి ఈ సమాచారం నాకు ఏమి బోధిస్తుంది? ఇతరులతో నా వ్యవహారాలలో యెహోవా యొక్క లక్షణాలను నేనెలా కనపర్చగలను?’ అలాంటి ప్రశ్నలను గురించి ధ్యానించడం మన వివేచనాశక్తిని అభివృద్ధిపర్చుతుంది మరి “దేవునిపోలి నడుచు”కోవడానికి మనకు సహాయం చేస్తుంది.—ఎఫెసీయులు 5:1.
దేవునికి మరియు క్రీస్తుకు దాసులు కానీ, మనుష్యులకు కాదు
13. పరిసయ్యులు నైతిక నిరంకుశులుగా ఎలా ప్రవర్తించారు?
13 తమ సంరక్షణలో ఉన్నవారు తమ వివేచనాశక్తిని ఉపయోగించడానికి పెద్దలు అనుమతించాలి. సంఘ సభ్యులు మనుష్యులకు దాసులు కారు. “నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును,” అని పౌలు వ్రాశాడు. (గలతీయులు 1:10; కొలొస్సయులు 3:23, 24) దానికి భిన్నంగా, దేవుని కంటే మనుష్యుల అంగీకారాన్ని సంపాదించడం అత్యంత ప్రాముఖ్యమని ప్రజలు విశ్వసించాలని పరిసయ్యులు ఇష్టపడ్డారు. (మత్తయి 23:2-7; యోహాను 12:42, 43) తమ స్వంత నియమాలను ఏర్పరచి వాటికి ఇతరులు ఎంత చక్కగా సరితూగుతారో తీర్పు తీర్చే నైతిక నిరంకుశులుగా పరిసయ్యులు తమను తాము నియమించుకున్నారు. పరిసయ్యులను అనుకరించిన వారు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించడంలో బలహీనులయ్యారు, తద్వారా మనుష్యులకు దాసులయ్యారు.
14, 15. (ఎ) మంద యొక్క తోటి పనివారిగా పెద్దలు తమని తాము ఎలా చూపించుకోగలరు? (బి) మనస్సాక్షిని గురించిన విషయాలతో పెద్దలు ఎలా వ్యవహరించాలి?
14 మంద ప్రాముఖ్యంగా తమకు లెక్క ఒప్పజెప్పనవసరం లేదని క్రైస్తవ పెద్దలకు నేడు తెలుసు. ప్రతి క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు తన స్వంత భారాన్ని తామే మోయాలి. (రోమీయులు 14:4; 2 కొరింథీయులు 1:24; గలతీయులు 6:5) అది సరైనది. వాస్తవానికి, మందలోని సభ్యులు కేవలం నడిపించబడుతున్నందుకు లోబడుతూ, మనుష్యులకు దాసులు అయితే, ఈ మనుష్యులు లేనప్పుడు వారేం చేస్తారు? పౌలు ఫిలిప్పీయులనుబట్టి ఆనందించేందుకు కారణాన్ని కలిగి ఉన్నాడు: “మీరెల్లప్పుడును విధేయులైయున్నప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.” వారు నిజంగా పౌలుకు కాదు క్రీస్తుకే దాసులై ఉన్నారు.—ఫిలిప్పీయులు 2:12.
15 కాబట్టి, మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో, పెద్దలు తమ సంరక్షణలో ఉన్నవారి కొరకు నిర్ణయాలు తీసుకోరు. వారు ఒక విషయంలో ఇమిడి ఉన్న బైబిలు సూత్రాలను వివరించి, ఆ తర్వాత ఇమిడి ఉన్న వ్యక్తులు తమ స్వంత వివేచనాశక్తిని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోడానికి అనుమతిస్తారు. ఇది గంభీరమైన బాధ్యత, అయినప్పటికీ అది, ఆ వ్యక్తి తానే వహించవలసింది.
16. సమస్యలతో వ్యవహరించడానికి ఇశ్రాయేలులో ఏ పద్ధతి ఉంది?
16 ఇశ్రాయేలుకు నడిపింపునివ్వడానికి యెహోవా న్యాయాధిపతులను ఉపయోగించిన కాలాన్ని పరిగణించండి. “ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను,” అని బైబిలు మనకు చెబుతుంది. (న్యాయాధిపతులు 21:25) అయిననూ తన ప్రజలు నడిపింపును పొందడానికి యెహోవా మార్గం ఏర్పాటు చేశాడు. ప్రశ్నలు మరియు సమస్యల విషయంలో పరిపక్వమైన సహాయాన్ని అందించగల పెద్దవయస్కులైన పురుషులు ప్రతి పట్టణంలో ఉండేవారు. దానికి తోడు, లేవీయులైన యాజకులు ప్రజలను దేవుని ధర్మశాస్త్రంలో విద్యావంతులను చేయడం ద్వారా మంచికి కారకులుగా పని చేశారు. అత్యంత కష్టతరమైన విషయాలు తలెత్తినప్పుడు, ప్రధాన యాజకుడు ఊరీము, తుమ్మీముల సహాయంతో దేవున్ని సంప్రదించగల్గేవాడు. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) ఇలా వ్యాఖ్యానిస్తుంది: “దేవుని ధర్మశాస్త్రం యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని, దాన్ని అన్వయించుకొని ఈ ఏర్పాట్లను ఉపయోగించుకున్న వ్యక్తి మనస్సాక్షికి సరైన నడిపింపు ఉండేది. అతడు అటువంటి సందర్భంలో ‘తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం’ చెడుకు దారి తీయదు. ప్రజలు ఇష్టపూర్వకమైన లేక అయిష్టపూర్వకమైన దృక్పథాన్ని మరియు ప్రవర్తనను చూపడానికి యెహోవా అనుమతించాడు.”—సంపుటి 2, 162-3 పేజీలు.b
17. తమ స్వంత ప్రమాణాల ప్రకారం కాకుండా దేవుని ప్రమాణాల ప్రకారం తాము సలహా ఇస్తున్నామని పెద్దలెలా కనపర్చగలరు?
17 ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులు మరియు యాజకులవలె, సంఘ పెద్దలు సమస్యలకు పరిపక్వమైన సహాయాన్ని అందిస్తారు మరియు విలువైన సలహాను ఇస్తారు. కొన్ని సమయాల్లో, వారు ‘సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించి, గద్దించి, బుద్ధి’ చెప్పడం కూడా చేస్తారు. (2 తిమోతి 4:2) వారు తమ స్వంత ప్రమాణాల ప్రకారం కాక దేవుని ప్రమాణాల ప్రకారం అలా చేస్తారు. పెద్దలు మాదిరికరంగా ఉండి, హృదయాలను చేరుకోడానికి కృషిచేస్తే ఇది ఎంత ప్రభావవంతంగా ఉంటుంది!
18. పెద్దలు హృదయాలను చేరడం, ప్రాముఖ్యంగా ఎందుకు ప్రభావవంతమైనది?
18 హృదయం మన క్రైస్తవ కార్యకలాపం యొక్క “ఇంజిన్.” అందుకే “హృదయములోనుండి జీవధారలు బయలుదేరును,” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 4:23) హృదయాలను కదిలించగల పెద్దలు, సంఘంలోని వారు దేవుని సేవలో తాము చేయగల దాన్నంతటినీ చేయడానికి తదనుగుణ్యంగా పురికొల్పబడ్డారని కనుగొంటారు. వారు ప్రతీసారి ఇతరులచేత ప్రేరేపించబడవలసిన అవసరం ఉన్న వారివలె కాక చొరవ తీసుకునే వారిగా ఉంటారు. యెహోవాకు బలవంతపు విధేయత అక్కరలేదు. ప్రేమతో నిండిన హృదయంనుండి వచ్చే విధేయత ఆయనకు కావాలి. మందలోని వారు తమ వివేచనాశక్తిని అభివృద్ధిపర్చుకోడానికి సహాయం చేయడం ద్వారా పెద్దలు అటువంటి హృదయ-ప్రేరేపిత పరిచర్యను ప్రోత్సహించగలరు.
‘క్రీస్తు మనస్సును’ అలవర్చుకొనుట
19, 20. మనం క్రీస్తు మనస్సును వృద్ధిపర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యము?
19 పేర్కొనబడినట్లుగా, కేవలం దేవుని నియమాలను తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. “నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును” అని కీర్తనల గ్రంథకర్త వేడుకొన్నాడు. (కీర్తన 119:34) యెహోవా తన వాక్యంలో ‘క్రీస్తు మనస్సును’ బయల్పర్చాడు. (1 కొరింథీయులు 2:16) యెహోవాను తన వివేచనాశక్తితో సేవించిన వానిగా, యేసు మన కొరకు పరిపూర్ణ మాదిరిని ఉంచాడు. ఆయన దేవుని నియమాలను మరియు సూత్రాలను అర్థం చేసుకున్నాడు, వాటిని ఆయన లోపం లేకుండా అన్వయించుకున్నాడు. ఆయన ఉదాహరణను పఠించడం ద్వారా, మనం “దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగల” వారిమి కాగలము. (ఎఫెసీయులు 3:17-19) నిజమే, యేసు గురించి మనం బైబిలు నుండి నేర్చుకున్నది కేవలం అనేక విషయాలను తెలుసుకోవడం కంటే ఎంతో ఎక్కువే; యెహోవా తానే ఎలాంటివాడు అనే దాన్ని కూడా అది స్పష్టంగా చూపిస్తుంది.—యెహాను 14:9, 10.
20 అలా, మనం దేవుని వాక్యాన్ని చదివే కొలది, విషయాలను గూర్చిన యెహోవా ఆలోచనా విధానాన్ని గుర్తెరిగి సమతూకమైన నిర్ణయాలను చేయగలము. దాని కొరకు ప్రయాసపడాలి. యెహోవా వ్యక్తిత్వం మరియు ప్రమాణాలకు మనల్నిమనం జవాబుదారులను చేసుకుంటూ, మనం దేవుని వాక్యం యొక్క శ్రద్ధగల విద్యార్థులం కావాలి. చెప్పాలంటే మనం క్రొత్త వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాము. అయిననూ, అలా చేసే వారు “సజీవమైన, పరిశుద్ధమైన, దేవునికి అంగీకారమైన యాగంగా [తమ] శరీరాలను, [తమ] వివేచనాశక్తితో పరిశుద్ధ సేవను సమర్పించుకొనుడి” అన్న పౌలు సలహాను అనుసరించిన వారౌతారు.—రోమీయులు 12:1 NW.
[అధస్సూచీలు]
a అందులో దయ్యాల సంబంధ, ఫోర్నోగ్రాఫిక్, లేక సాడిస్టిక్ అంశాలుగల వినోదం, అలాగే క్రైస్తవులు అంగీకరించలేని విచ్చలవిడియైన లేక చెడిన తలంపులను ప్రోత్సహించే కుటుంబ కథా వినోదమని పిలువబడేవి ఇమిడి ఉన్నాయి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇంకార్పొరేటెడ్, ప్రచురించినది.
మీరేమి నేర్చుకున్నారు?
◻ దేవునికి చేసే సేవ విషయంలో, సా.శ. 33లో ఏ మార్పు వచ్చింది?
◻ మనం మన వివేచనాశక్తిని ఎలా అలవర్చుకోగలం?
◻ మందలోని వారు దేవునికి మరియు క్రీస్తుకు దాసులు అయ్యేలా పెద్దలు ఎలా సహాయం చేయగలరు?
◻ మనం ‘క్రీస్తు మనస్సును’ ఎందుకు అలవర్చుకోవాలి?
[23వ పేజీలోని చిత్రం]
తమ వివేచనాశక్తిని ఉపయోగించడానికి పెద్దలు ఇతరులకు సహాయం చేస్తారు