దేవున్ని సేవించడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?
“నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును (యెహోవా NW) ప్రేమింపవలెను.”—మార్కు 12:30.
1, 2. ప్రకటనాపని సంబంధంగా ఏ పులకింపజేసే విషయాలు సాధించబడుతున్నాయి?
ఒక స్వయంచలన శకటం (ఆటోమోబైల్) యొక్క అసలైన విలువ దాని ఆకారాన్ని బట్టి మాత్రమే నిర్ణయింపబడదు. సమంగా వేయబడిన పెయింట్ దాని బాహ్యరూపాన్ని ఇనుమడింపజేయవచ్చు, మరి నునుపైన ఆకృతి బావి కొనుగోలుదారున్ని ఆకర్షించవచ్చు; అయితే, వాహనాన్ని నియంత్రించే ఇతర ఉపకరణాలతో పాటు దాన్ని ముందుకు నెట్టే ఇంజిన్వంటి, వెంటనే కనిపించని విషయాలే అత్యంత ప్రాముఖ్యమైనవి.
2 ఒక క్రైస్తవుడు దేవునికి చేసే సేవ విషయం కూడా ఇంతే. యెహోవాసాక్షులు దైవిక పనులను అత్యధికంగా చేస్తారు. ప్రతి సంవత్సరం దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో నూరుకోట్లకంటే ఎక్కువ గంటలు వెచ్చింపబడుతున్నాయి. అంతేకాకుండా లక్షలాది బైబిలు పఠనాలు నిర్వహించబడుతున్నాయి, మరి బాప్తిస్మం తీసుకుంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంది. ఒకవేళ మీరు సువార్త ప్రచారకులైతే, చాలా కొద్ది భాగం మాత్రమే అనిపించినప్పటికీ ఈ ఉత్తేజకరమైన గణాంకాలలో మీరు కూడా భాగం కలిగి ఉన్నారు. “మీరు చేసిన కార్యమును, . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు,” అన్న అభయాన్ని మీరు కలిగి ఉండవచ్చు.—హెబ్రీయులు 6:10.
3. క్రియలే కాకుండా క్రైస్తవులకు ఇంకా ఏమి కూడా ప్రాముఖ్యము, మరి ఎందుకు?
3 అయితే, సామూహికంగానైనా లేక వ్యక్తిగతంగానైనా మన సేవ యొక్క అసలైన విలువ సంఖ్యలలో మాత్రమే లెక్కించబడదు. సమూయేలుకు చెప్పబడినట్లు, “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) అవును, మనం లోపల ఏమైయున్నామో దేవుడు దాన్నే పరిగణలోకి తీసుకుంటాడు. క్రియలు ప్రాముఖ్యమన్న విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. దైవభక్తిగల క్రియలు యెహోవా బోధను అలంకరిస్తాయి మరి బావి శిష్యులను ఆకర్షిస్తాయి. (మత్తయి 5:14-16; తీతు 2:10; 2 పేతురు 3:12) అయినప్పటికీ, మన క్రియలు విషయాన్నంతటినీ తెలియజేయవు. ఎఫెస్సీ సంఘం మంచి కార్యాలను గూర్చిన నివేదికలు కలిగివున్నప్పటికీ, పునరుత్థానమైన యేసు వారి విషయమై చింత కలిగి ఉండడానికి కారణముంది. “నీ క్రియలను . . . నేనెరుగుదును,” అని ఆయన వారికి చెప్పాడు. “అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.”—ప్రకటన 2:1-4.
4. (ఎ) దేవునికి మనం చేసే సేవ ఏ విధంగా ఆచార విధిగా మారగలదు? (బి) స్వయం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది?
4 ప్రమాదం పొంచి ఉంది. కొద్ది కాలానికి, దేవునికి మనం చేసే సేవ ఆచారవిధిగా మారగలదు. ఒక క్రైస్తవ స్త్రీ, తన పరిస్థితిని ఇలా వివరించింది: “నేను సేవకు వెళ్లేదాన్ని, కూటాలకు వెళ్లేదాన్ని, పఠించేదాన్ని, ప్రార్థించేదాన్ని—కానీ నేను ఎప్పుడూ ఏ భావోద్రేకాలు లేకుండా, అదంతా యాంత్రికంగా చేసే దాన్ని.” దేవుని సేవకులు “పడద్రోయబడినను” లేక ‘దీనంగా’ ఉన్ననూ వారు ప్రయాసపడి పని చేసినప్పుడు వారిని అభినందించవలసిందే. (2 కొరింథీయులకు 4:9; 7:6) అయినప్పటికీ, మన క్రైస్తవ క్రమం ఒక గాడిలో పడిపోతే, సూచనార్థకంగా చెప్పాలంటే లోపలున్న ఇంజిన్‌కు ఏమైందని తొంగిచూడాలి. అత్యంత శ్రేష్ఠమైన స్వయంచలన శకటాలకు కూడా నియతకాలిక నిర్వహణ అవసరం; అదే విధంగా, క్రైస్తవులందరూ క్రమంగా స్వయం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. (2 కొరింథీయులకు 13:5) ఇతరులు మన క్రియలను చూడగలరు, కానీ మన కార్యాలను ఏది ప్రేరేపిస్తుందో వారు చూడలేరు. గనుక, మనలో ప్రతి ఒక్కరం ‘దేవున్ని సేవించడానికి నన్ను ఏది పురికొల్పుతుంది?’ అన్న ప్రశ్నపై అవధానం నిలపాలి.
సరైన ప్రేరణకు అవరోధాలు
5. ఆజ్ఞలన్నింటిలోకెల్లా ప్రధానమైనది ఏదని యేసు చెప్పాడు?
5 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞల్లో అన్నిటికంటే ఏది ప్రధానమైనదని అడిగినప్పుడు, బాహ్య ఆకారాన్ని కాదుగానీ అంతరంగ ఉద్దేశంపై అవధానాన్ని నిలిపిన ఈ ఆజ్ఞనే యేసు ఉదాహరించాడు: “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును [యెహోవా NW] ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.” (మార్కు 12:28-30) దేవునికి మనం చేసే సేవను పురికొల్పే శక్తి ఏమై ఉండాలో యేసు ఆ విధంగా తెలియజేశాడు—అదే ప్రేమ.
6, 7. (ఎ) సాతాను కుటుంబ వలయంపై ఏ విధంగా మోసకరంగా దాడి చేశాడు మరియు ఎందుకు? (2 కొరింథీయులు 2:11) (బి) దైవిక అధికారం ఎడల ఒకరి దృక్పథాన్ని పెంపకం ఎలా ప్రభావితం చేయగలదు?
6 ప్రాముఖ్య లక్షణమైన ప్రేమను పెంపొందింపజేసుకోగల మన సామర్థ్యానికి అడ్డంకులు వేయాలని సాతాను చూస్తాడు. దాన్ని సాధించడానికి అతడు అవలంబించిన ఒక పద్ధతి, కుటుంబ వలయంపై దాడి చేయడమే. ఎందుకని? ఎందుకంటే, ప్రేమను గూర్చిన మన మొదటి మరియు శాశ్వత ప్రభావాలు అక్కడే ఏర్పడతాయి. బాల్యంలో నేర్చుకున్నది పెద్ద వయస్సులో విలువైనదిగా ఉంటుందన్న బైబిలు సూత్రం సాతానుకు బాగా తెలుసు. (సామెతలు 22:6) ప్రేమను గురించిన మన భావనను తొలివయస్సులోనే వక్రీకరించాలని అతడు మోసకరంగా యత్నిస్తాడు. చాలామంది ప్రేమ నిలయాలవంటి వాటిలో కాక, ద్వేషము, క్రోధము, దూషణల రణక్షేత్రాలవంటి గృహాల్లో పెరిగేలా చేయడం ద్వారా తన సంకల్పం సరిగ్గా నెరవేరేలా, ‘ఈ యుగ సంబంధమైన దేవునిగా’ సాతాను చూస్తాడు.—2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 4:31, 32; 6:4; కొలొస్సయులు 3:21.
7 ఒక తండ్రి తన పితృత్వ పాత్రను నిర్వహించే పద్ధతి ‘అతని పిల్లలు మానవ మరియు దైవిక అధికారం ఎడల రాబోవు కాలంలో కనబరచే దృక్పథంపై ఎంతో ప్రభావం కల్గియుండగలదు,’ అని నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము అనే పుస్తకం తెలియజేసింది.a కఠినుడైన తండ్రి యొక్క నిరంకుశాధికారం క్రింద పెరిగిన, ఒక క్రైస్తవుడు ఇలా అంగీకరిస్తున్నాడు: “యెహోవాకు విధేయత చూపడం నాకెంతో సులభం; ఆయనను ప్రేమించడం మాత్రం ఎంతో కష్టతరం.” దేవుని దృష్టిలో “బలులు అర్పించుట కంటెను ఆజ్ఞను గైకొనుట . . . శ్రేష్ఠము’ గనుక, విధేయత ప్రాముఖ్యమైనదన్నది నిజమే. (1 సమూయేలు 15:22) అయితే కేవలం విధేయత చూపడమే కాకుండా, మన ఆరాధనను పురికొల్పే శక్తిగా యెహోవా ఎడల ప్రేమను అలవర్చుకోడానికి మనకు ఏది సహాయం చేయగలదు?
‘క్రీస్తు ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుంది’
8, 9. యేసు యొక్క విమోచన క్రయధన బలి యెహోవా ఎడల మన ప్రేమను ఎలా పురికొల్పాలి?
8 యేసుక్రీస్తు యొక్క విమోచన క్రయధన బలి ఎడల మెప్పు కలిగి ఉండటమే, యెహోవా ఎడల హృదయపూర్వక ప్రేమను అలవర్చుకోడానికి బలమైన ప్రేరణ. “మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.” (1 యోహాను 4:9) ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకుని, గుణగ్రహిస్తే, ఈ ప్రేమ అనే క్రియ ప్రేమ అనే ప్రతిక్రియను ఉత్పన్నం చేస్తుంది. “[యెహోవా] మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.”—1 యోహాను 4:19.
9 మానవుని రక్షకునిగా సేవించాల్సిన తన నియామకాన్ని యేసు ఇష్టపూర్వకంగా అంగీకరించాడు. “ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము.” (1 యోహాను 3:16; యోహాను 15:13) యేసు యొక్క స్వయం-త్యాగ ప్రేమ, మనలో మెప్పుతో కూడిన ప్రతిస్పందనను కలిగించాలి. ఉదాహరించాలంటే: మీరు మునిగిపోవడాన్నుండి రక్షింపబడ్డారు అనుకుందాం. మీరు ఇంటికి వెళ్లి, ఆరబెట్టుకుని, ఇక దాని గురించి మర్చిపోతారా? అలా ఎన్నటికీ చేయరు! మిమ్మల్ని రక్షించిన ఆ వ్యక్తికి మీరు ఎంతో రుణపడి ఉన్నట్లు భావిస్తారు. ఎంతైనా మీరు ఆ వ్యక్తికి మీ జీవాన్ని అప్పుపడి ఉన్నారు. మరి యెహోవా దేవునికి మరియు యేసుక్రీస్తుకు మనం ఏమైనా తక్కువ రుణపడి ఉన్నామా? విమోచన క్రయధనం లేకపోతే, మనలో ప్రతి ఒక్కరం పాప మరణాల్లో మునిగిపోయే వాళ్లమే అని చెప్పవచ్చు. బదులుగా, ఈ ప్రేమపూర్వక మహాకార్యం వలన, భూ పరదైసులో నిత్యం జీవించగల ఉత్తరాపేక్ష మనకు ఉంది.—రోమీయులు 5:12, 18; 1 పేతురు 2:24.
10. (ఎ) విమోచన క్రయధనాన్ని మనం వ్యక్తిగతంగా ఎలా అన్వయించుకోగలం? (బి) క్రీస్తుకున్న ప్రేమ మనలనెలా ప్రేరేపిస్తుంది?
10 విమోచన క్రయధనాన్ని గురించి ఆలోచించండి. “నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను,” అని పౌలు అన్వయించుకున్నట్లు, దాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోండి. (గలతీయులు 2:20) అలా ధ్యానించడం హృదయపూర్వక ప్రేరేపణను కలిగిస్తుంది, ఎందుకంటే పౌలు కొరింథీయులకు ఇలా వ్రాశాడు: ‘క్రీస్తు ప్రేమ మనలను ప్రేరేపించుచున్నది; ఏలాగనగా . . . జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెను.’ (2 కొరింథీయులు 5:14, 15) క్రీస్తు ప్రేమ “మనల్ని ప్రభావితం చేస్తుంది” అని ద జెరూసలేమ్ బైబిల్ చెబుతుంది. మనం క్రీస్తు ప్రేమను గురించి ధ్యానించినప్పుడు, మనం ప్రేరేపించబడతాము, లోతుగా కదిలింపబడతాము, ప్రభావితం చేయబడతాము కూడా. అది మన హృదయాలను స్పృశించి మనల్ని క్రియాశీలులను చేస్తుంది. జె. బి. ఫిలిప్స్ యొక్క అనువాదం దాన్నిలా స్పష్టపరుస్తుంది, “మన క్రియలకు మూలకారకం క్రీస్తు ప్రేమే.” పరిసయ్యుల ఉదాహరణ ద్వారా చూపబడినట్లు, మరే ఇతర విధమైన ప్రేరణ మనలో నిత్యం నిలిచే ఫలాలను ఉత్పన్నం చేయదు.
“పరిసయ్యుల . . . పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి”
11. మతపరమైన క్రియల ఎడల పరిసయ్యుల దృక్పథాన్ని వర్ణించండి.
11 పరిసయ్యులు దేవుని ఆరాధనలోని జీవాన్నంతటినీ హరించివేశారు. దేవునియెడల ప్రేమ కలిగి వుండడాన్ని నొక్కి చెప్పేబదులు, వారు క్రియలు ఆత్మీయతకు కొలబద్దలని నొక్కివక్కాణించారు. విస్తారమైన నియమాలలో వారి నిమగ్నత వారు పైకి నీతిమంతులుగా కనిపించేలా చేసింది, అయితే లోపల మాత్రం వారు “చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండి” ఉన్నారు.—మత్తయి 23:27.
12. యేసు ఒక మనిషిని స్వస్థపర్చిన తర్వాత, పరిసయ్యులు హృదయ కాఠిన్యంగల వారమని ఎలా కనపర్చుకున్నారు?
12 ఒక సందర్భంలో, ఊచచెయ్యి ఉన్న ఒక మనిషిని యేసు కనికరంతో స్వస్థపర్చాడు. తనకు నిస్సందేహంగా ఎంతో శారీరక మరియు భావోద్రేక అసౌకర్యాన్ని కలిగించిన ఆ అనారోగ్యం రెప్పపాటులో స్వస్థపర్చబడటం ద్వారా ఈ మనిషి ఎంతగా సంతోషించి ఉంటాడో కదా! అయిననూ, పరిసయ్యులు అతనితోపాటు ఆనందించలేదు. బదులుగా, యేసు విశ్రాంతిదినాన సహాయం చేశాడనే పరిభాషపై ఆధారపడి వారు అసంబద్ధమైన విమర్శను చేశారు. ధర్మశాస్త్రాన్ని గురించిన తమ పారిభాషిక భావవివరణలో నిమగ్నమైన వారై, పరిసయ్యులు ధర్మశాస్త్రం యొక్క అసలు భావాన్ని పూర్తిగా విస్మరించారు. “వారి హృదయకాఠిన్యమునకు” యేసు దుఃఖపడ్డాడంటే ఆశ్చర్యపోనవసరం లేదు! (మార్కు 3:1-5) అంతే కాకుండా, ఆయన తన శిష్యులనిలా హెచ్చరించాడు: “పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.” (మత్తయి 16:6) వారి క్రియలు మరియు దృక్పథాలు మన మేలు కొరకు బైబిలునందు బహిర్గతం చేయబడ్డాయి.
13. పరిసయ్యుల ఉదాహరణలో మన కొరకు ఏ పాఠం ఉంది?
13 క్రియలను గురించిన సహేతుకమైన దృష్టిని మనం కలిగివుండాలని పరిసయ్యుల ఉదాహరణ మనకు బోధిస్తుంది. “క్రియలులేని విశ్వాసము మృతము” గనుక క్రియలు ప్రాముఖ్యమైనవన్నది నిజమే. (యాకోబు 2:26) అయితే, ఇతరులు ఏమై ఉన్నారు అనే దాన్నిబట్టి కాక ఇతరులు ఏమి చేస్తున్నారు అనే దాన్నిబట్టి వారిని తీర్పుతీర్చే స్వభావం అసంపూర్ణ మానవులకు ఉంది. కొన్నిసార్లు, మనల్ని మనం కూడా అలాగే తీర్పు తీర్చుకుంటాం. క్రియలే మన ఆత్మీయత యొక్క మూల విషయమన్నట్లు, మనం మన పని విధానంపట్ల అత్యంతాసక్తి కలిగి ఉండవచ్చు. మన ఉద్దేశాలను పరీక్షించుకోవడం యొక్క ప్రాముఖ్యతను మనం మర్చిపోగలం. (2 కొరింథీయులు 5:12 పోల్చండి.) ధర్మశాస్త్రం యొక్క అక్షరాలకు లోబడి దాని భావానికి విరుద్ధంగా ప్రవర్తించే, “దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగు” వారిగా, సంకుచిత వ్యక్తులుగా మనం అవ్వవచ్చు.—మత్తయి 23:24.
14. పరిసయ్యులు అశుభ్రమైన కప్పు లేక గిన్నెవలె ఎలా ఉన్నారు?
14 ఒక వ్యక్తి యెహోవాను నిజంగా ప్రేమిస్తే, దైవభక్తి క్రియలు సహజంగానే వస్తాయన్న విషయాన్ని పరిసయ్యులు గ్రహించలేదు. ఆత్మీయత లోపలనుండి బయటికి ప్రవహిస్తుంది. “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము,” అని అంటూ యేసు, ఈ విషయంలో పరిసయ్యుల తప్పుడు ఆలోచనా విధానాన్ని బట్టి వారిని ఖండితంగా దూషించాడు.—మత్తయి 23:25, 26.
15. యేసు పైపై కన్పించే వాటికన్నా లోపల చూస్తాడని చూపే ఉదాహరణలను సూచించండి?
15 ఒక కప్పు, పాత్ర, లేక నిర్మాణం యొక్క పై రూపం వాటి గురించి కొంత మాత్రమే తెలియజేస్తుంది. యేసు శిష్యులు యెరూషలేము దేవాలయ సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు, అయితే దానిలోపల జరుగుతున్న దాన్నిబట్టి యేసు దాన్ని “దొంగల గుహ” అని పిలిచాడు. (మార్కు 11:17; 13:1) దేవాలయం విషయంలో నిజమైనదే, క్రైస్తవమత సామ్రాజ్య చరిత్ర చూపుతున్నట్లు లక్షలాది మంది నామకార్థ క్రైస్తవుల విషయంలో కూడా నిజం. తన నామంలో “అద్భుతములు” చేసిన కొందరిని “అక్రమము చేయువారు” అని తీర్పు తీరుస్తానని యేసు చెప్పాడు. (మత్తయి 7:22, 23) దానికి పూర్తి భిన్నంగా, దాదాపు ఎన్నిక లేనంత తక్కువ డబ్బును దేవాలయం వద్ద చందా వేసిన ఒక విధవరాలిని గురించి ఆయనిలా చెప్పాడు: “కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెను . . . యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను.” (మార్కు 12:41-44) అసమంజసమైన తీర్పులా? కానే కాదు. రెండు సందర్భాల్లోనూ, యేసు యెహోవా దృక్పథాన్ని ప్రతిబింబించాడు. (యోహాను 8:16) ఆయన, క్రియల వెనుకనున్న ఉద్దేశాలను చూసి, వాటి ప్రకారం తీర్పుతీర్చాడు.
“ఎవని సామర్థ్యము చొప్పున వానికి”
16. మన కార్యకలాపాలను ఇతర క్రైస్తవుని కార్యకలాపాలతో పోల్చి చూసుకోవలసిన అవసరం ఎందుకు లేదు?
16 మన ఉద్దేశాలు సరైనవైతే, ఎడతెగక పోల్చి చూసుకోవలసిన అవసరమే లేదు. ఉదాహరణకు, పరిచర్యలో ఇతర క్రైస్తవుడు వెచ్చించినన్ని గంటలను వెచ్చించడానికి, లేక ప్రకటన పనిలో అతను సాధించిన వాటికి సరిపోయేలా పోటీపడి కృషి చేయడం ద్వారా ఏమీ సాధించలేము. యెహోవాను ఇతరుల వాటితోకాక మీ హృదయంతో, మనస్సుతో, ఆత్మతో మరియు బలముతో ప్రేమించాలని యేసు చెప్పాడు. ఒక్కో వ్యక్తి యొక్క సామర్థ్యాలు, శక్తి మరియు పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ మీ పరిస్థితి అనుమతిస్తే, మీరు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడపడానికి, బహుశా పూర్తికాల పయినీర్ సేవకునిగా అయ్యేందుకు ప్రేమ మిమ్మల్ని పురికొల్పుతుంది. అయితే, మీరు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పరిచర్యలో మీరు గడపాలనుకునేంత సమయాన్ని మీరు గడపలేక పోవచ్చు. నిరుత్సాహపడకండి. దేవునికి చూపే విశ్వాస్యత గంటల్లో కొలవబడదు. స్వచ్ఛమైన ఉద్దేశాలు కలిగివుండి, ఆనందించేందుకు మీరు కారణాన్ని కలిగి ఉంటారు. పౌలు ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.”—గలతీయులు 6:4.
17. తలాంతుల ఉపమానాన్ని మీ స్వంత మాటల్లో క్లుప్తంగా చెప్పండి.
17 మత్తయి 25:14-30 నందు నివేదించబడిన, తలాంతులను గురించిన యేసు ఉపమానమును పరిశీలించండి. దూరదేశానికి ప్రయాణించబోతున్న ఒక వ్యక్తి తన దాసులను పిలిపించి వారికి తన ఆస్తిని అప్పగించాడు. “ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికి” ఇచ్చాడు. తన దాసులతో లెక్క చూసుకోడానికి యజమాని తిరిగి వచ్చినప్పుడు, అతడేమి కనుగొన్నాడు? ఐదు తలాంతులు ఇవ్వబడిన దాసుడు మరి ఐదు తలాంతులను సంపాదించాడు. అదే విధంగా, రెండు తలాంతులు ఇవ్వబడిన దాసుడు మరి రెండు తలాంతులను సంపాదించాడు. ఒక తలాంతు ఇవ్వబడిన దాసుడు దాన్ని భూమిలో పాతిపెట్టి, తన యజమాని ఆస్తిని పెంచేందుకు ఏమీ చేయలేదు. ఆ పరిస్థితిని యజమాని ఎలా సరిచూచాడు?
18, 19. (ఎ) రెండు తలాంతులు ఇవ్వబడిన దాసున్ని ఐదు తలాంతులు ఇవ్వబడిన దాసునితో యజమాని ఎందుకు పోల్చలేదు? (బి) మెప్పుకోలు మరియు పోల్చడాన్ని గురించి తలాంతుల ఉపమానం మనకు ఏమి నేర్పుతుంది? (సి) మూడవ దాసుడు కఠినంగా ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు?
18 మొదటిగా, ఐదు మరియు రెండు తలాంతులు ఇవ్వబడిన దాసులను పరిశీలిద్దాము. యజమాని ఈ దాసులలో ఇద్దరినీ, “భళా, నమ్మకమైన మంచి దాసుడా” అని అన్నాడు. ఐదు తలాంతులు ఇవ్వబడిన దాసుడు కేవలం రెండు మాత్రమే సంపాదించి ఉంటే ఆయన ఆ దాసున్ని అలా అని ఉండే వాడా? అనకపోయి ఉండేవాడు! మరో ప్రక్కన, రెండు తలాంతులను సంపాదించిన దాసున్ని, ‘నీవు ఐదు ఎందుకు సంపాదించలేదు? నీ తోటి దాసున్ని చూడు, అతడు నా కొరకు ఎంత సంపాదించాడో!’ అని ఆయన అనలేదు. యేసుకు చిత్రీకరణగావున్న వాత్సల్యపూరితుడైన ఆ యజమాని పోల్చి చూడలేదు. ఆయన తలాంతులను “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” అప్పగించాడు, ప్రతి ఒక్కరు ఇవ్వగల్గిన దానికంటే ఆయన ఎక్కువేమి అపేక్షించలేదు. ఇద్దరూ తమ యజమాని కొరకు పూర్ణాత్మతో పని చేశారు గనుక ఇద్దరు దాసులకు సమానమైన మెప్పుకోలు లభించింది. మనమందరం దీనినుండి నేర్చుకోవచ్చు.
19 నిజమే, మూడవ దాసుడు మెచ్చుకోబడ లేదు. వాస్తవానికి, అతడు వెలుపటి చీకటిలోనికి తోసివేయబడ్డాడు. కేవలం ఒక తలాంతు మాత్రమే ఇవ్వబడినందున, ఐదు తలాంతులు ఇవ్వబడిన దాసుని అంత ఎక్కువ ఉత్పత్తి చేయాలని అతనినుండి అపేక్షించబడి ఉండేదికాదు. అయితే అతడు ప్రయత్నించనే లేదు! అతనికి లభించిన కఠినమైన తీర్పు, అతనికున్న ‘చెడ్డ మరియు సోమరియైన’ హృదయాన్నిబట్టి చివరకు లభించింది, యజమానిపట్ల ప్రేమ లోపించిందని అది చూపుతుంది.
20. యెహోవా మన పరిమితులను ఎలా దృష్టిస్తాడు?
20 మనమందరం ఆయనను మన పూర్ణబలముతో ప్రేమించాలని యెహోవా అపేక్షిస్తున్నాడు, అయినప్పటికీ “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసి కొనుచున్నాడు” అంటే అదెంత హృదయాన్ని సంతోషపర్చే విషయమో గదా! (కీర్తన 103:14) ‘యెహోవా హృదయాలను పరిశీలిస్తున్నాడు’ కానీ గణాంకాలను కాదని సామెతలు 21:2 చెబుతుంది. మనం అదుపు చేయలేని ఆర్థిక, శారీరక, భావోద్రేక, లేక మరితరమైనవి ఏవైనప్పటికీ ఆ పరిమితులను ఆయన అర్థం చేసుకుంటాడు. (యెషయా 63:9) అదే సమయంలో, మనకున్న సామర్థ్యాలన్నింటినీ సంపూర్ణంగా ఉపయోగించాలని ఆయన మననుండి అపేక్షిస్తున్నాడు. యెహోవా పరిపూర్ణుడు, కానీ తన అసంపూర్ణ ఆరాధికులతో వ్యవహరించేటప్పుడు ఆయన వారినుండి పరిపూర్ణతను కోరడు. ఆయన తాను వ్యవహరించే పద్ధతిలో నిర్హేతుకంగా కానీ, లేక ఆయన అపేక్షించడంలో అసహజంగా కానీ లేడు.
21. దేవునికి మనం చేసే సేవ ప్రేమ చేత పురికొల్పబడినదైతే, ఏ మంచి ఫలితాలు వస్తాయి?
21 యెహోవాను మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో మరియు బలముతో ప్రేమించడం “సర్వాంగహోమములన్నిటికంటెను బలులకంటెను అధికము.” (మార్కు 12:33) మనం ప్రేమ చేత పురికొల్పబడితే, అప్పుడు దేవుని సేవలో మనం చేయగల్గినదంతా చేయగలం. ప్రేమతో సహా దైవిక లక్షణాలన్నీ “మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును” అని పేతురు వ్రాశాడు.—2 పేతురు 1:8.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రచురించినది.
పునఃసమీక్షలో
◻ దేవునికి మనం చేసే సేవను పురికొల్పే శక్తి ఏదై ఉండాలి?
◻ యెహోవాకు సేవ చేయడానికి క్రీస్తు ప్రేమ మనలనెలా ప్రేరేపిస్తుంది?
◻ పరిసయ్యుల ఏ నిమగ్నతను మనం నివారించాలి?
◻ ఇతర క్రైస్తవుని సేవతో మన సేవను పోల్చుకోవడం ఎందుకు అవివేకం?
[16వ పేజీలోని చిత్రాలు]
వ్యక్తుల సామర్థ్యాలు, శక్తి మరియు పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి