మీ వ్యాపారం కొరకు మీరు చెల్లించవలసిన మూల్యం ఎంత?
ఒక దక్షిణమెరికా దేశ అధ్యక్షుని భార్య తన కుటుంబ సభ్యులు స్థాపించిన నకిలీ వ్యాపార సంస్థలతో చేసిన కాంట్రాక్టులకు లక్షల డాలర్లను వెచ్చిస్తుందని నిందించబడింది. ఇండియాలోని 38 సంవత్సరాల స్టాక్‌బ్రోకర్, 1.6 అరబ్ డాలర్ల బ్యాంకింగ్ మరియు స్టాక్ మార్కెట్ కుంభకోణంలో చట్టవిరుద్ధంగా ఇమిడి ఉన్నందున నిర్బంధింపబడి తన విలాసవంతమైన భవనం నుండి, తన 29 కార్ల నుండి తీసుకొనిపోబడ్డాడు. ఫిలిప్పైన్స్నందు ఒక ద్వీపంలో దాని నివాసులందరికీ చట్టవిరుద్ధంగా చేతితుపాకీలను తయారు చేయడమే జీవనోపాధి. ఈ లాభదాయకమైన వ్యాపారంలో నిలిచి ఉండాలంటే, వారు జోక్యం కలిగించుకోవద్దని అధికారులకు వాడుకచొప్పున లంచం ఇస్తారని నివేదించబడింది.
అవును, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో అపనమ్మకం మరియు మోసం అత్యధికమౌతున్నాయి. దానిలో ఇమిడివున్న ప్రజలు తరచూ తమ స్థానాన్ని, గౌరవాన్ని మరియు డబ్బును మూల్యంగా చెల్లించవలసివుంటుంది.
మీ విషయం ఏమిటి? మీరు వ్యాపారం చేస్తున్నారా? లేక ఒక వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? దాని కొరకు మీరు ఏ మూల్యం చెల్లించవలసి ఉంటుంది? తప్పకుండా, వ్యాపారంలో ఇమిడి ఉండడమంటే మీరు ఏదైనా కొంత చెల్లించవలసి ఉంటుంది. అది తప్పకుండా చెడ్డదే అయివుండనవసరం లేదు. అయితే, వ్యాపార రంగంలోకి ప్రవేశించడానికి ముందు లేక ముందే స్థాపించబడిన దాన్ని గూర్చి నిర్ణయాలు చేసుకునే ముందు చెల్లించవలసిన మూల్యాన్ని అంచనా వేసుకోవడం జ్ఞానయుక్తమైనది. (లూకా 14:28) మీరు పరిగణలోకి తీసుకోగోరే కొన్ని మూల్యాలను 31వ పేజీనందలి బాక్సు చూపిస్తుంది.
స్పష్టంగా, వ్యాపారంలో చేరి ఉండడం సులభమేమి కాదు. ఒక క్రైస్తవునికి, పరిగణలోకి తీసుకోవలసిన ఆత్మీయ మరియు నైతిక బాధ్యతలుంటాయి. మీరు చెల్లించవలసిన మూల్యాలను చెల్లించి, ఆత్మీయంగా సమతూకం కలిగివుండగలరా? కొన్ని మూల్యాలు మీరు నైతికంగా అంగీకరించగలవాటిని మించిపోయి ఉన్నాయా? ఏ మూల్యాలను చెల్లించడాన్ని అంగీకరించవచ్చో, వేటిని అంగీకరించకూడదో నిర్ణయించుకోవడానికి సహాయం చేసే కొన్ని సూత్రాలు ఏవి?
డబ్బును దాని స్థానంలో ఉంచండి
ఒక వ్యాపారాన్ని నడిపించడానికి డబ్బు అవసరం, ఒకరి కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడే డబ్బును వ్యాపారం తీసుకురాగలదని నిరీక్షించబడుతుంది. కాని, డబ్బుకు సంబంధించిన లక్ష్యాలు సులభంగా తప్పుదోవ పట్టవచ్చు. దురాశ ఒక కారణం కావచ్చు. అనేకమంది ప్రజలకు, డబ్బు ఇమిడివున్నచోట మిగతా అన్ని విషయాలు అంత ప్రాముఖ్యమైనవికావు. అయినప్పటికీ, బైబిలు పుస్తకమైన సామెతల గ్రంథాన్ని వ్రాసిన రచయితలలో ఒకరైన ఆగూరు, ఇలా చెప్పినప్పుడు సమతూకంగల దృక్పథాన్ని వ్యక్తపర్చాడు: “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.” (సామెతలు 30:8) జీవించడానికి తగినంత మోతాదుతో సంతృప్తి కలిగివుండడం యొక్క విలువను ఆయన గుర్తించాడు—వ్యాపారంలో కొందరు చెప్పేలా “డబ్బు చేసుకోవాలని” అతనిష్టపడలేదు.
అయితే, బంగారు అవకాశమని పిలువబడే ఆ అవకాశం వచ్చినప్పుడు దురాశ ఈ సూత్రాన్ని మరచిపోయేలా చేయగలదు. ఒక వర్ధమాన దేశంలోని యెహోవాసాక్షుల ఒక ప్రయాణకాపరి అలాంటి ఒక విషయాన్ని గూర్చి నివేదించాడు. పెట్టుబడి అవసరమైన ఒక కంపెనీ పెట్టుబడిదారులు తమ డబ్బును త్వరగా, బహుశ కేవలం కొన్ని నెలలలో రెండింతలు చేసుకోవచ్చుననే భావనను కలుగజేసింది. సుళువుగా డబ్బు చేసుకోవచ్చనే ఈ అవకాశం అనేకులు పెట్టుబడి పెట్టేలా చేసింది. ప్రయాణకాపరి ఇలా చెబుతున్నాడు: “కొందరు దానిలోకి ప్రవేశించాలని చాలా ఆసక్తి కలిగివున్నారు. వారు విషయాన్ని తగినట్లుగా పరిశోధించలేదు, [పెట్టుబడి పెట్టేందుకు] వారు డబ్బు అప్పు తీసుకున్నారు.”
దానికి విరుద్ధంగా, ఇద్దరు వ్యక్తులు పెట్టుబడి పెట్టడానికి ముందు ఈ కంపెనీ కార్యాలయాన్ని పరిశీలించడానికి వెళ్లారు. దాని ఉత్పత్తి సౌకర్యాలను చూస్తామన్న వారి విన్నపం నిరాకరించబడింది. ఇది, కంపెనీ గౌరవాన్ని వారు శంకించేలా చేసింది. వారికిది ఒక భద్రతగా పనిచేసింది, ఎందుకంటే, కొన్ని వారాల్లో, స్పష్టంగా ఒక మోసపూరితమైన పథకం బయల్పర్చబడింది, ప్రజలు నిర్బంధించబడ్డారు. మొదట పరిశీలించి చూడనివారు దీనికి ఏ మూల్యం చెల్లించవలసి వచ్చిందో ఆలోచించండి. వాళ్లు కేవలం డబ్బునే కాదు, వాళ్లకు డబ్బిచ్చిన స్నేహితులను కూడా కోల్పోయి ఉండవచ్చు, ఎందుకంటే వారి పథకం విఫలమయ్యింది గనుక వారు తిరిగి వీళ్లకు డబ్బు కట్టలేరు. డబ్బు విషయాల్లో, సామెతలు 22:3లోని ఈ సూత్రాన్ని అన్వయించుకోవడం ఎంత జ్ఞానయుక్తం: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు!”
మీ మాటకు కట్టుబడి ఉండండి
వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు రాకపోతే అప్పుడేమిటి? అలా చేయడం తనకు లాభకరం కానప్పుడు కూడా తన ఒప్పందాలకు కట్టుబడివుండే వ్యక్తిని కీర్తన 15:4 ఇలా మెచ్చుకుంటుంది: “అతడు ప్రమాణముచేయగా నష్టము కలిగినను మాట తప్పడు.” పరిస్థితులు బాగున్నప్పుడు తన మాటకు కట్టుబడి ఉండడం సులభమే. కాని ఆర్థికంగా నష్టం కలిగేటప్పుడు అది ఒక యథార్థతా పరీక్ష కాగలదు.
యెహోషువ కాలంనాటి ఒక బైబిలు సంబంధ మాదిరిని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు సమాజ ప్రధానులు తమతో నిబంధనచేసి, తమ్మును నాశనం చేయకుండేలా గిబియోనీయులు పరిస్థితులను కల్పించారు. నిజానికి, వాళ్లు ఇశ్రాయేలీయులకు ఒక ప్రమాదంగా పరిగణింపబడే జనాంగంలో భాగమైవున్నారు. వారి పన్నాగం బయటపడినప్పుడు, “సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు.” (యెహోషువ 9:18) ఈ గుంపు శత్రు ప్రాంతము నుండి వచ్చినప్పటికీ, తమ మాటకు కట్టుబడి ఉండడం ప్రాముఖ్యమని సమాజ ప్రధానులు భావించారు. ఇది యెహోవాను ప్రీతిపర్చిందని తరువాతి సంఘటనలు చూపిస్తాయి.—యెహోషువ 10:6-11.
సంగతులు మీరు ఎదురు చూసినట్లు జరుగకపోయినప్పటికీ మీరు మీ వ్యాపార ఒప్పందాలు మరియు కాంట్రాక్టులకు కట్టుబడి ఉంటారా?a అలా చేయడం మిమ్మల్ని, ఎల్లప్పుడూ తన మాటకు కట్టుబడి ఉండే యెహోవావలె చేస్తుంది.—యెషయా 55:11.
యథార్థంగా ఉండండి
ఈనాటి వ్యాపార ప్రపంచంలో యథార్థత ఉనికిలోలేని జీవి కాకపోయినప్పటికీ, ప్రమాదంలోవున్న జీవి వంటిది. మీవంటి వ్యాపారాల్లో ఉన్న ఇతరులు తమ లాభాలను పెంచుకోవడానికి అవినీతికరమైన మార్గాలను అవలంభించవచ్చు. వారు వ్యాపార ప్రకటన చేయడంలో నమ్మకద్రోహంగా ఉండవచ్చు. వారు మరో కంపెనీ పేరును దొంగిలించి, తమ వస్తువులపై దాన్ని వేసుకోవచ్చు. లేదా వారు ఒక తక్కువ రకం ఉత్పాదనను మేలు రకం దానిగా అందజేయవచ్చు. ఇవన్నీ అవినీతి యొక్క రూపాలు. వాటిని చేసేవారు “భక్తిహీనులు,” ఆసాపు చెప్పినట్టు వారు స్పష్టంగా మోసకరమైన మార్గంలో “ధనవృద్ధి చేసికొందురు.”—కీర్తన 73:12.
ఒక క్రైస్తవునిగా మీరు చట్టవిరుద్ధమైన విధానాలను అవలంబిస్తారా? లేక బదులుగా, ఇటువంటి బైబిలు సూత్రాలచే నడిపించబడతారా: “మేమెవనికి అన్యాయము చేయలేదు, ఎవనిని చెరుపలేదు, ఎవనిని మోసము చేయలేదు”; “కుయుక్తిగా నడుచుకొనకయు, . . . అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము”; “వేరువేరు తూనికె రాళ్లు యెహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు”? (2 కొరింథీయులు 4:2; 7:2; సామెతలు 20:23) గుర్తుంచుకోండి, అవినీతి యొక్క మూలకారకుడు మరెవరోకాదు అపవాదియగు సాతాను, “అబద్ధమునకు జనకుడు.”—యోహాను 8:44.
కొందరిలా అభ్యంతరం చెప్పవచ్చు: ‘ఇతరులు చేసినట్లు అవినీతికరమైన పద్ధతులను ఉపయోగించనిదే వ్యాపారంలో ఉండడం కష్టం.’ ఇక్కడే ఒక క్రైస్తవుడు యెహోవాయందలి తన విశ్వాసాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. ఏదైనా మూల్యం చెల్లించవలసి వచ్చినప్పుడు యథార్థత పరీక్షించబడుతుంది. అవినీతిగా ఉండకపోతే ఒక వ్యక్తి జీవించలేడంటే, తనను ప్రేమించేవారి గురించి దేవుడు శ్రద్ధ వహించడని చెప్పినట్లే అవుతుంది. దేవుడు తన సేవకులకు ఏ దేశంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా కావలసినవి ఇవ్వగలడని యెహోవాయందు నిజమైన విశ్వాసంగల వ్యక్తికి తెలుసు. (హెబ్రీయులు 13:5) నిజమే అవినీతిమంతుల కంటే కొంత తక్కువ డబ్బుతో తృప్తిపడవలసి రావచ్చు కాని ఇది, దేవుని ఆశీర్వాదం పొందడానికి చెల్లించదగిన మూల్యం కాదంటారా?
అవినీతి అనేది విసిరిన వ్యక్తి యొద్దకే తిరిగివచ్చెడు ఆయుధము వంటిదని గుర్తుంచుకోండి. ఒక వ్యాపారస్థుడు నిజాయితీగా లేడని తెలిస్తే, కొనుగోలుదారులు మరియు పంపిణీదారులు తరచూ అతన్ని విడిచిపెట్టాలని చూస్తారు. అతడు వారిని ఒకసారి మోసపుచ్చగలడేమో, కాని అదే చివరిసారి కాగలదు. మరోవైపున, యథార్థవంతుడైన వ్యాపారస్థుడు సాధారణంగా ఇతరుల గౌరవాన్ని పొందుతాడు. ‘అది అందరూ చేస్తున్నారు, కాబట్టి ఫరవాలేదు’ అనే తప్పుడు తర్కంచే ప్రభావితం చెందకుండా ఉండేందుకు జాగ్రత్త వహించండి. బైబిలు సూత్రం ఇలా ఉంది: “దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు.”—నిర్గమకాండము 23:2.
ఒకవేళ ఎంతో కాలంగా మీ వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తి తోటి క్రైస్తవుడు కాడు గనుక ఎల్లప్పుడూ బైబిలు సూత్రాలను అంటిపెట్టుకుని ఉండడనుకోండి. ఏదైనా లేఖన విరుద్ధమైనది జరుగుతున్నప్పుడు దీన్ని మీ బాధ్యతను తప్పించుకోవడానికి ఒక సాకుగా ఉపయోగించడం సరైనదేనా? ఆదాము మరియు సౌలు వంటి ఉదాహరణలను జ్ఞాపకముంచుకోండి. పాపాన్ని నివారించే బదులు, వారు ఇతరుల ఒత్తిడికి లొంగిపోయి ఆ తర్వాత తమ సహచరులను నిందించారు. వారు ఎంత ఎక్కువ మూల్యాన్ని చెల్లించారు?—ఆదికాండము 3:12, 17-19; 1 సమూయేలు 15:20-26.
తోటి విశ్వాసులతో సరైన విధంగా వ్యవహరించండి
తోటి యెహోవా ఆరాధికులతో వ్యాపార వ్యవహారాలలోకి ప్రవేశించేటప్పుడు చెల్లించవలసిన మూల్యాలను పరిశీలించవలసి ఉందా? ప్రవక్తయైన యిర్మీయా తన స్వంత ఊరైన అనాతోతులో తన తండ్రి తోడబుట్టినవాని కుమారుని నుండి ఒక పొలం కొన్నప్పుడు, ఆయన కేవలం అతనికి డబ్బిచ్చి గౌరవపూర్వకమైన ఒప్పందంచేసి ఊరుకోలేదు. బదులుగా ఆయనిలా చెప్పాడు: “నేను క్రయపత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచితిని.” (యిర్మీయా 32:10) అలాంటి వ్రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవడం ఒకవేళ పరిస్థితులు మారితే తర్వాత అపార్థాలకు దారితీయడాన్ని నివారించగలవు.
కాని ఒక క్రైస్తవ సహోదరుడు మిమ్మల్ని వ్యాపారంలో మోసగించాడనుకోండి, అప్పుడేమిటి? మీరు ఆయనను కోర్టుకీడ్చాలా? ఈ విషయంలో బైబిలు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పౌలు ఇలా అడిగాడు: “మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా?” ఒక సమస్య వెంటనే సంతృప్తికరంగా పరిష్కరించబడకపోతే అప్పుడేమిటి? పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “ఒకనిమీద ఒకడు వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తులనపహరింపబడనిచ్చుట మేలు కాదా?” క్రైస్తవులు కోర్టులో వ్యాజ్యెమాడుతున్నారని బయటివారు వింటే అది క్రైస్తవ సంస్థపై ఎంతటి మచ్చను కలిగించగలదో ఒక్కసారి ఆలోచించండి! అలాంటి సందర్భాలలో, సహోదరుని ఎడల ప్రేమకంటె డబ్బు ఎడల ప్రేమ బలమైనదయ్యిందా? లేక ఒకరి గౌరవం పూర్తిగాపోయి, పగతీర్చుకోవడం మనస్సులో ప్రధానంగా ఉందా? అలాంటి సందర్భాల్లో కోర్టుకు వెళ్లడంకంటే నష్టపోవడమే మంచిదని పౌలు యొక్క సలహా చూపిస్తుంది.—1 కొరింథీయులు 6:1, 7; రోమీయులు 12:17-21.
అయితే సంఘంలోనే అలాంటి వివాదాలను తీర్చుకోవడానికి ఒక లేఖనాధార మార్గం ఉంది. (మత్తయి 5:37; 18:15-17) సిఫారసు చేయబడిన చర్యలను గైకొనడంలో, ఇమిడివున్న సహోదరులకు సహాయం చేసేందుకు క్రైస్తవ పెద్దలు దానికి సంబంధించిన వారికందరికి కొంత సహాయకరమైన ఉపదేశాన్ని ఇవ్వగలరు. అలాంటి చర్చల సమయంలో బైబిలు సూత్రాలను అంగీకరించడం సులభంగా అనిపించవచ్చు, కాని ఇవ్వబడిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా మీరు విన్నారని ఆ తర్వాత నిజంగా చూపిస్తారా? అలా చేయడానికి దేవుని ఎడల మరియు తోటి క్రైస్తవుల ఎడల గల ప్రేమ మనల్ని పురికొల్పుతుంది.
నిస్సందేహంగా, వ్యాపారంలో ఉండడానికి తప్పకుండా మీరు కొంత చెల్లించవలసి ఉంటుంది. దానికి మీరు చెల్లించేది కారణ సహితంగా ఉంటుందని నిరీక్షిద్దాము. ఏవైనా నిర్ణయాలను లేక ప్రశ్నించదగిన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, డబ్బుకంటే విలువైన విషయాలు జీవితంలో ఎన్నో ఉన్నాయని మనస్సులో ఉంచుకోండి. డబ్బును దాని స్థానంలో ఉంచడం ద్వారా, మాటకు కట్టుబడి ఉండడం ద్వారా, యథార్థంగా ఉండడం ద్వారా, వ్యాపార సహచరులతో క్రైస్తవ విధానంలో వ్యవహరించడం ద్వారా, వ్యాపారానికి అవసరమైన దానికంటే ఎక్కువ సమయాన్ని మరియు డబ్బును మనం చెల్లించవలసి రాకుండా జాగ్రత్త వహించగలము, అదే సమయంలో, మనం మన స్నేహాలను, మంచి మనస్సాక్షిని, యెహోవాతో చక్కని సంబంధాన్ని కాపాడుకోగలము.
[అధస్సూచీలు]
a వ్యాపారంలో ఒకరు తమ మాటకు కట్టుబడడంలో ఆధునిక దిన మాదిరి కొరకు, తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1988 నందలి 11-13 పేజీలలోగల “నా మాట నా బంధం” అనే శీర్షికను చూడండి.
[31వ పేజీలోని బాక్సు]
మీ వ్యాపారం వల్ల మీరు చెల్లించవలసివచ్చే మూల్యాలు
సమయం: ఏదైనా ఒక కంపెనీ కొరకు పనిచేయడంకంటే తమ స్వంత వ్యాపారాన్ని చూసుకోవడం దాదాపు ఎప్పుడూ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలకు తక్కువ సమయాన్ని మిగుల్చుతూ, ఇది మీ పట్టికకు అవాంతరం కలిగిస్తున్నదా? అనుకూలమైన విధంగా, దేవుని చిత్తాన్ని చేయడంలో ఎక్కువ సమయాన్ని గడపగలిగేలా మీరు మీ పనులను ఏర్పాటు చేసుకోగలరా? అలాగైతే, మంచిదే. కాని, జాగ్రత్తగా ఉండండి! ఇది చెయ్యడం, చెప్పడమంత సుళువు కాదు.
డబ్బు: డబ్బు సంపాదించుకోవడానికి డబ్బు అవసరం. మీ వ్యాపారానికి ఏ పెట్టుబడి అవసరం? మీ వద్ద ఇప్పటికే డబ్బు ఉందా? లేక మీరు అప్పు తీసుకోవాలా? కొంత పోగొట్టుకోవడాన్ని మీరు భరించగలరా? లేక మీరు అపేక్షించినట్లు సంగతులు జరుగకపోతే, మీరు చెల్లించవలసినది మీ తాహతును మించి ఉండగలదా?
స్నేహితులు: అనుదిన వ్యవహారాలలో ఉత్పన్నమయ్యే సమస్యల మూలంగా, అనేకమంది అనుభవజ్ఞులైన వ్యాపారస్థులు వ్యాపారం కొరకు తమ స్నేహితులను కోల్పోవలసి వచ్చింది. స్నేహితులను చేసుకునే సాధ్యత ఉన్నప్పటికీ, సంబంధాలు దెబ్బతినే సాధ్యత కూడా అంతే వాస్తవం. ఈ స్నేహితులు మన క్రైస్తవ సహోదరులయితే అప్పుడేమిటి?
ఒక మంచి మనస్సాక్షి: నేటి ప్రపంచంలో వ్యాపార సంబంధమైన సాధారణ విధానం ఇలా ఉంది, “కనికరంలేని పోటీ” లేక “నేనెలా లాభం పొందగలను?” ఒక ఐరోపా సర్వే ప్రకారం విద్యార్థులలో 70 శాతం కంటే ఎక్కువమందికి, వ్యాపార జీవితంలో నైతికతలకు చాలా తక్కువ లేక అసలు స్థానమే లేదు. మోసం, అవినీతి, ప్రశ్నించదగిన వ్యాపార ఆచారాలు సాధారణ విషయాలయ్యాయంటే దానిలో ఆశ్చర్యంలేదు. మీరు కూడా ఇతరులవలె చేయడానికి శోధింపబడతారా?
యెహోవాతో మీ సంబంధం: వ్యాపారంలో దేవుని ఆజ్ఞలకు, సూత్రాలకు వ్యతిరేకంగావున్న ఏ చర్యయైనా, అది వ్యాపార విషయాల్లో సర్వసాధారణమైనదైనప్పటికీ, ఒక వ్యక్తికి తన సృష్టికర్తతో గల సంబంధాన్ని పాడుచేస్తుంది. దీనికి ఆయన తన నిత్యజీవ ఉత్తరాపేక్షను మూల్యంగా చెల్లించవలసి రావచ్చు. స్పష్టంగా, వస్తుదాయకమైన లాభం ఎంత వచ్చినప్పటికీ, ఒక యథార్థ క్రైస్తవుడు చెల్లించవలసి వచ్చే ఈ మూల్యం అతనికి మరీ ఎక్కువకాదా?
[31వ పేజీలోని చిత్రాలు]
ఆ తర్వాత రాగల అపార్థాలను నివారించేందుకు ఏది సహాయం చేయగలదు? గౌరవపూర్వకమైన ఒప్పందమా లేక ఒక వ్రాతపూర్వక ఒప్పందమా?