రాజ్య ప్రచారకుల నివేదిక
ఆఫ్రికాలో పిల్లలు సువార్త ప్రకటించుట
యేసు పునరుత్థానమైన తర్వాత కొంతకాలానికి, ఒక ఆఫ్రికా దేశస్థుడు యెరూషలేమును సందర్శిస్తున్నాడు. బైబిలు ఆ వ్యక్తి పేరు తెలియజేయడంలేదు. ఆయన కేవలం “ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న” వ్యక్తిగా మాత్రమే పిలువబడుతున్నాడు. బైబిలులో ఎందుకు ఆయన గురించి చెప్పబడింది? ఎందుకంటే, ఆయనకు “యేసునుగూర్చిన సువార్త” ప్రకటించమని క్రైస్తవ సువార్తికుడైన ఫిలిప్పుకు దూత తెలియజేశాడు. క్రైస్తవ సంఘ సభ్యులుగా రికార్డు చేయబడినవారిలో ఈ ఐతియొపీయుడే మొదటి ఆఫ్రికాదేశస్థుడు.—అపొస్తలుల కార్యములు 8:26-39.
నేడు, ఆఫ్రికాలో లక్షలాదిమంది యెహోవాసాక్షులున్నారు. యేసును గూర్చిన సువార్తను ఇతరులతో పంచుకోవడానికి వారు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. దీనిలో చివరికి చిన్నపిల్లలు కూడా ఒక పాత్ర నిర్వహించవలసి ఉందని ఈ క్రింది అనుభవాలు చూపిస్తాయి.
◻ కెన్యానందలి నైరోబీలో సాండీ, ప్రియా అనే ఇద్దరు 11 సంవత్సరాల అమ్మాయిలు ఇరుగుపొరుగువారు. వాళ్లు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ, కథల పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేవాళ్లు. ప్రియా తల్లిదండ్రులు యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించారు. తన వద్దనున్న పుస్తకాలకు తోడు ప్రియాకు ఇప్పుడు, వాచ్‌టవర్ సంస్థ ప్రచురించిన, తనకు ఎంతో ఇష్టమైన గొప్ప బోధకుడు చెప్పేదానిని వినండి (ఆంగ్లం) వంటిదానితోసహా క్రొత్త పుస్తకాలు కూడా వచ్చి చేరాయి. ఆమె తన గొప్ప బోధకుడు పుస్తకాన్ని తన స్నేహితురాలైన సాండీతో పంచుకుంది, ఆ ఇద్దరమ్మాయిలు దాన్ని క్రమంగా పఠించడం ప్రారంభించారు.
అయితే, సాండీ తల్లి యూనా ఆంగ్లికన్ చర్చికి వెళ్లేది, యెహోవాసాక్షుల వద్దవుండే పుస్తకాలు తన కుమార్తె చదవడం ఆమెకిష్టం లేదు. తల్లి వ్యతిరేకించినప్పటికీ, పఠనం కొనసాగింది. కేవలం ఒకసారి వచ్చి తమ చర్చ వినమని సాండీ ఒక దినము తల్లిని వేడుకుంది. ఆ దినము ఆ అమ్మాయిలు చదివిన అధ్యాయం పేరు “జన్మదినాలను జరుపుకున్న ఇద్దరు వ్యక్తులు.” యూనా విని చాలా ప్రభావితురాలయ్యింది. ఆమె వెంటనే అనేక బైబిలు ప్రశ్నలతో ప్రియా తల్లిని సమీపించింది.
యూనాతో బైబిలు పఠనం చేయడానికి ప్రియా తల్లి ఒక సాక్షిని ఏర్పాటు చేసింది. త్వరలోనే యూనా కూడా తాను నేర్చుకుంటున్నదాన్ని తన సహోద్యోగియైన డాలీతో పంచుకుంది. ఈ మధ్యకాలంలో, పదకొండేళ్ల ప్రియా అభివృద్ధి చెందడం కొనసాగించి, యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో యెహోవా దేవునికి తన సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించడానికి నిర్ణయించుకుంది. అదే సమావేశంలో, ప్రియాకు అత్యంతానందం కలిగేలా యూనా, డాలీ కూడా బాప్తిస్మం తీసుకున్నారు.
◻ యెహోవాసాక్షుల పని నమోదు చేయబడని కొన్ని ఆఫ్రికా దేశాలున్నాయి. అలాంటి ఒక దేశంలో, సాక్షుల మతసంబంధ కార్యాలు మరియు నమ్మకాల ఎడల సహనంతో కూడిన సాధారణ వాతావరణం ఉంది. ఆ దేశంలో ఒక పాఠశాలలో, ఒక ఏడు సంవత్సరాల బాలుడు అతని ఆరు సంవత్సరాల తమ్ముడు—సాక్షుల పిల్లలు—మతసంబంధ ప్రార్థనల సమయంలో వారు భాగం వహించకుండా ఉండేందుకు అనుమతింపబడ్డారు.
ఒకదినము ఒక క్రొత్త ఉపాధ్యాయురాలు ఇతర పిల్లలతోపాటు ఈ అబ్బాయిలు కూడా ప్రార్థనలో భాగం వహించాలని చెప్పింది. పెద్ద అబ్బాయి నిరాకరించి, ఉపాధ్యాయురాలితో దెబ్బలు తిన్నాడు. అతడి తమ్ముడు, ఆరేళ్ల షడ్రక్, ప్రధానోపాధ్యాయున్ని ఆయన కార్యాలయంలో కలవడానికి పట్టుబట్టాడు. ఇతరులతో కలవడానికి వాళ్లు ఎందుకు ఇష్టపడడంలేదని ప్రధానోపాధ్యాయుడు, క్రొత్త ఉపాధ్యాయురాలు అతన్ని అడిగారు. నీ తల్లిదండ్రులు కొడతారని భయపడుతున్నావా అని వాళ్లు అడిగారు. అతడు చక్కని అరబీ భాషలో ఇలా సమాధానమిచ్చాడు: “లేదు, నేను ఆరాధించే దేవుడు గందరగోళానికి దేవుడు కాదుగాని, క్రమానికి దేవుడు. నేను ఇంటి వద్ద యెహోవాసాక్షులలో ఒకడినై, పాఠశాలలో మరో మతాన్ని కలిగివుండలేను!” తత్ఫలితంగా అతనికి మినహాయింపు ఇవ్వబడింది.
అపొస్తలుల కార్యములందు చెప్పబడిన ఐతియొపీయుడైన వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత “సంతోషించుచు తన త్రోవను వెళ్లెను.” (అపొస్తలుల కార్యములు 8:39) అలాగే నేడు, విశాలమైన ఆఫ్రికా ఖండంలో రాజ్య ప్రచారకులు ‘యేసును గూర్చిన సువార్తను ప్రకటించడమనే’ తమ ఆధిక్యతనుబట్టి సంతోషిస్తారు.—అపొస్తలుల కార్యములు 8:35.