“ఆనందమయ స్తుతికర్తల” సమావేశం—మీరు అక్కడ ఉంటారా?
ఆనందం! ఆ పదం క్రొత్తగా వినిపిస్తుందా, ఈ కష్టాలతో నిండిన లోకంలో వింతగా అనిపిస్తుందా? కచ్చితంగా వార్తాపత్రికలు ఆనందానికి ఎక్కువ కారణాలనివ్వవు. జాతి పోరాటం, వ్యాప్తిచెందివున్న ఆకలి, నిరుద్యోగం, ప్రమాదకరమైన కాలుష్యం, రాజకీయ అస్థిరత, నేరం—ఇలాంటివన్నీ హృదయాన్ని ఆనందంతో నింపవు, కాదంటారా?
నేడు అనేకమంది ప్రజలు జీవితం నుండి తాము పొందగలిగిన సంతోషాన్నంతటినీ పొందుతారు. కాని ఆనందం? “సంతోషకరమైన స్థితి; ఉత్సాహం” అని ఆనందం వర్ణించబడింది. అనేకులు ఆ నిజమైన ఆనందాన్ని అనుభవించలేదు. ఒకవేళ వాళ్లు అనుభవించినా అది తరచూ తాత్కాలికమైనదై ఉంటుంది.
అయినప్పటికీ, మన కాలం కొరకు నిరీక్షిస్తూ, బైబిలు ఇలా ప్రవచించింది: “ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—ఆలకించుడి నా సేవకులు సంతోషించెదరు . . . నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు.” (యెషయా 65:13, 14) అదెలా జరుగుతుంది?
దానికి సమాధానం కనుగొనేందుకు, 1995లో జరిగే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాలలో ఒకదానికి హాజరు అవ్వమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఆ సమావేశాల ముఖ్యాంశం “ఆనందమయ స్తుతికర్తలు,” ఉచితంగా హాజరు కావచ్చు. మూడు రోజుల సమావేశ కార్యక్రమంలో బైబిలు ఆధారిత ప్రసంగాలు, ప్రదర్శనలు, చర్చలు, మరెన్నో ఉంటాయి. కార్యక్రమమంతటిలో, ఆనందం అనే ముఖ్యాంశం ఉన్నతపర్చబడుతుంది.
అమెరికాలో సమావేశాలు జూన్లో ప్రారంభమై, ప్రపంచవ్యాప్త నగరాలలో 1996 తొలిభాగం వరకు కొనసాగుతాయి. తప్పకుండా, మీకు సమీపంలో ఒకటి ఉంటుంది. మీ ప్రాంతంలో నివసించే యెహోవాసాక్షులను ఎందుకు అడగకూడదు? మీరు అక్కడ ఉండాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.