మహా భయంకరమైన యెహోవా దినం సమీపించింది
“యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.”—మలాకీ 3:16.
1, 2. భయాన్ని కల్గించే ఏ దినమును గూర్చి మలాకీ ముందుగానే హెచ్చరించాడు?
భయంకరం! ఆగస్టు 6, 1945 దినారంభములో ఓ గొప్ప పట్టణం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. సుమారు 80,000 మంది మరణించారు! లక్షలాది మందికి తీవ్రంగా గాయపడ్డారు! రగిలే మంటలు! అణ్వస్త్ర బాంబు ఈ విపత్తుకు కారణమైంది. ఆ వినాశన సమయంలో యెహోవాసాక్షులకు ఏమైంది? హిరోషిమాలో ఒక్క సాక్షి మాత్రమే ఉండేవాడు—తన క్రైస్తవ తటస్థతవల్ల పటిష్టమైన జైలు గోడల వెనుకనున్నాడు. జైలు తునాతునకలయ్యింది కానీ, మన సహోదరునికి ఏ హాని కలుగలేదు. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆటంబాంబు ప్రేలుడువల్ల బైటికి నెట్టబడ్డాడు—బహుశ ఆ బాంబు సాధించిన మంచి విషయం అదొక్కటే.
2 ఆ బాంబు ప్రేలుడు చాలా భయానకంగా ఉంది కాని, మనముందున్న “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినముతో” పోలిస్తే అది మరుగునపడుతుంది. (మలాకీ 4:5) అవును, గతంలో భయానకమైన దినాలు ఉన్నాయి, కానీ యెహోవా దేవుని ఈ దినం వాటన్నిటికీ మించినది.—మార్కు 13:19.
3. జలప్రళయానికి వెళుతున్న “అందరు” మరియు నోవహు కుటుంబానికి మధ్య ఎలాంటి తేడాను గమనించాల్సి ఉంది?
3 నోవహు దినముల్లో “భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి,” మరి దేవుడు ఇలా ప్రకటించాడు: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.” (ఆదికాండము 6:12, 13) మత్తయి 24:39 నందు వ్రాసివున్నట్లుగా, ప్రజలు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి” అని యేసు చెప్పాడు. అయితే, “నీతిని ప్రకటించిన” నమ్మకస్థుడైన నోవహు, దేవునికి భయపడే తన కుటుంబంతో సహా ఆ జలప్రళయాన్ని తప్పించుకున్నాడు.—2 పేతురు 2:5.
4. సొదొమ గొమొఱ్ఱాలు ఎలాంటి హెచ్చరికా ఉదాహరణను అందించాయి?
4 “ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును . . . వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను” అని యూదా 7 చెబుతోంది. ఆ దైవభక్తి లేని ప్రజలు, అతి హేయమైన కుళ్లుపట్టిన జీవిత విధానం వల్ల మరణించారు. లైంగిక ప్రవృత్తిగల ఈ ఆధునిక లోకపు సమాజాలకు అది ఒక హెచ్చరికగా ఉండనివ్వండి! అయితే, దేవునికి భయపడిన లోతు, అతని కుమార్తెలు ఆ వినాశన సమయంలో సజీవులుగా కాపాడబడ్డారు, త్వరగా సమీపించే మహాశ్రమల కాలంలో యెహోవా ఆరాధికులు కూడా అలాగే కాపాడబడతారు.—2 పేతురు 2:6-9.
5. యెరూషలేము మీద తీర్చబడిన తీర్పు ద్వారా మనం ఏమి నేర్చుకోగలము?
5 తర్వాత, యెరూషలేము, ఒకప్పుడు “రమ్యమైన యెత్తుగల చోట” ఉన్న మహిమాన్విత పట్టణాన్ని మట్టుపెట్టేందుకు దాడిచేసే సేనలను యెహోవా ఉపయోగించిన హెచ్చరికా ఉదాహరణలను పరిశీలించండి. (కీర్తన 48:2) ఈ విషాదకరమైన సంఘటనలు మొదట సా.శ.పూ. 607 నందు మరియు సా.శ. 70 నందు మరలా సంభవించాయి, దానికి కారణం దేవుని ప్రజలు నిజమైన ఆరాధనను విడిచిపెట్టడమే. సంతోషకరంగా యెహోవా యథార్థ సేవకులు రక్షించబడ్డారు. సా.శ. 70 నందలి (క్రింద చిత్రీకరించిన విపత్తు), “దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు,” అని వర్ణించబడింది. అది ఒకేసారి మతభ్రష్ట యూదా విధానాన్నంతటినీ తీసివేసింది మరియు ఆ విషయంలో అది “ఇక ఎన్నడును కలుగబోదు.” (మార్కు 13:19) అయితే ఇప్పుడు ఇలా దైవిక తీర్పు తీర్చబడడం, లోక విధానాన్నంతటినీ భయపెడుతున్న ‘మహాశ్రమలకు’ ఒక ముంగుర్తు మాత్రమే.—ప్రకటన 7:14
6. యెహోవా విపత్తులను ఎందుకు అనుమతిస్తాడు?
6 అంతమంది ప్రాణాలు పోయే తీవ్రమైన విపత్తులను దేవుడు ఎందుకు అనుమతించాలి? నోవహు విషయంలో, సొదొమ గొమొఱ్ఱా విషయంలో మరియు యెరూషలేము విషయంలో భూమిపై తమ జీవిత విధానాన్ని పాడు చేసుకున్నవారిని, అక్షరార్థమైన కాలుష్యంతోనూ నైతిక పతనంతోనూ ఈ అందమైన గ్రహాన్ని పాడుచేసినవారిపైన మరియు మత భ్రష్టులైన లేక నిజమైన ఆరాధనను తృణీకరించిన వారిపైనే యెహోవా తన తీర్పును తీర్చాడు. లోకమంతటిపై అమలుపర్చబడి, అందరూ ఇమిడివున్న తీర్పు కడవరి దశలో మనం ఈనాడు ఉన్నాము.—2 థెస్సలొనీకయులు 1:6-9.
“అంత్యదినములలో”
7. (ఎ) పురాతన దైవిక తీర్పులు దేని విషయంలో ప్రవచనార్థకమైనవి? (బి) ఏ మహిమాన్విత ఉత్తరాపేక్ష ముందుంది?
7 పూర్వ కాలంలోని ఆ నాశనాలు 2 పేతురు 3:3-13 నందు వర్ణించిన భయంకరమైన మహా శ్రమకు ప్రవచనార్థకమైనవి. అపొస్తలుడు ఇలా చెబుతున్నాడు: ‘అంత్యదినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచుందురని మొదట తెలిసికొనుడి.’ తర్వాత నోవహు దినముపై కేంద్రీకరిస్తూ పేతురు ఇలా వ్రాశాడు: “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” దాని వెంటనే అన్నిటికంటే మహాశ్రమలు, ఎప్పటినుండో ఎదురుచూస్తున్న మెస్సీయ రాజ్య ప్రభుత్వం క్రొత్త రూపాన్ని పొందుతుంది—అదే, ‘క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వాటియందు నీతి నివసించును.’ ఎంత ఆనందమయ ఉత్తరాపేక్షో కదా!
8. లోక సంఘటనలు ముగింపుకు ఎలా పయనిస్తున్నాయి?
8 మన 20వ శతాబ్దంలో, లోక సంఘటనలు క్రమంగా ఓ ముగింపుకు చేరుకున్నాయి. హిరోషిమా నాశనం దైవచిత్తం వల్ల కలుగలేదుగానీ, లోకాంతమును గూర్చి యేసు ప్రవచించిన “భయోత్పాతములలో” ఒక భాగంగా సంభవించాయి. (లూకా 21:11) ఇప్పటికి కమ్ముకున్న కారుమేఘం వంటి అణ్వస్త్ర భయాన్ని మానవ జాతిపై అది ప్రయోగించింది. ఆ విధంగా, నవంబరు 29, 1993 నాటి ది న్యూయార్క్ టైమ్స్ నందు ఇలా వ్రాసివుంది: “తుపాకీలకు కాస్త చిలుము పట్టివుండవచ్చు కానీ అణ్వస్త్రాలు మాత్రం ఇంకా పాలిష్ చేసేవున్నాయి.” ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ, మతాంతర మరియు తెగాంతర యుద్ధాలు భయానకమైన పంటను కోశాయి. మునుపటి కాలంలో ఎక్కువగా సైనికులే చనిపోయేవారు. నేడు, తమ స్వగ్రామాలను విడిచిపెట్టి శరణార్థులుగా పారిపోయిన లక్షలాదిమందే కాకుండ యుద్ధాల్లో మరణించేవారిలో 80 శాతం సామాన్య ప్రజానికమే ఉంది.
9. మతనాయకులు లోకంతో తమ స్నేహాన్ని ఎలా కనపర్చారు?
9 యుద్ధాలు మరియు రక్తపాత విప్లవాల్లో చురుకుగా మత నాయకులు పాల్గొనడం ద్వారా మరియు ఎడతెగకుండా తాము “లోకముతో స్నేహము” చేస్తున్నామని తరచూ చూపారు, చూపుతూనే ఉన్నారు. (యాకోబు 4:4) యుద్ధాయుధాలను అధికమొత్తంలో ఉత్పత్తి చేసి, మాదక ద్రవ్య సామ్రాజ్యాన్ని సృష్టించే వర్తకలోకంలోని అత్యాశపరులైన ప్రముఖులతో కొందరు చేరారు. ఉదాహరణకు, దక్షిణమెరికా మాదక ద్రవ్య విక్రయదారునిలో ప్రముఖుని హత్యను గూర్చి చెబుతూ ద న్యూయార్క్ టైమ్స్ ఇలా పేర్కొంది: “చట్టబద్ధమైన వ్యాపార సంపద అని చెప్పుకోవడం వెనుక మరియు సహాయం చేసేవాడనే ముసుగు వెనుక తన మాదక ద్రవ్య వ్యాపారాన్ని దాచుకుని, తరచూ రోమన్ కాథోలిక్ మతగురువులతో చేరి తన స్వంత రేడియో షోను తానే సమర్పించేవాడు.” మాదకద్రవ్యానికి అలవాటు పడిన లక్షలమంది జీవితాలను నాశనం చేసేందుకు తోడుగా, ఈ మాదకద్రవ్య విక్రయ ప్రముఖుడు వేలమంది హత్యలను స్వయంగా జరిపించాడు అని ద వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. లండన్‌లోని ద టైమ్స్ ఇలా చెప్పింది: “బాధితుని అంత్యక్రియల మాస్ మరోచోట జరుగుతున్న సమయంలోనే . . . కృతజ్ఞతలు చెల్లించేందుకు హంతకులు తరచూ ప్రత్యేక మాస్ కొరకు డబ్బునిస్తారు.” ఎంతటి దుర్మార్గత!
10. లోక పరిస్థితులు మరి దారుణమవ్వడాన్ని మనం ఎలా దృష్టించాలి?
10 దయ్యాలవల్ల ప్రేరేపించబడిన మనుష్యులు ఈ భూమిపై ఇంకా ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకురాబోతున్నారో ఎవరికి తెలుసు? మొదటి యోహాను 5:19, “లోకమంతయు దుష్టుడైన” అపవాదియగు సాతాను “యందున్నదని” పేర్కొంటోంది. నేడు “భూమి సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” (ప్రకటన 12:12) అయితే, సంతోషకరంగా “ప్రభువు [యెహోవా NW] నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును” అని రోమీయులు 10:13 మనకు హామీనిస్తోంది.
తీర్పులో దేవుడు సమీపిస్తాడు
11. ఇశ్రాయేలునందలి ఏ పరిస్థితులు మలాకీ ప్రవచనానికి నడిపించాయి?
11 మానవజాతి సమీప భవిష్యత్తు విషయంలో, జరగబోయే వాటిని మలాకీ ప్రవచనం స్పష్టీకరిస్తోంది. పురాతన హెబ్రీ ప్రవక్తల చిట్టాలో మలాకీ చివరన ఉన్నాడు. సా.శ.పూ. 607 నందు యెరూషలేము నాశనాన్ని ఇశ్రాయేలు అనుభవించింది. అయితే 70 సంవత్సరాల తర్వాత ఆ జనాంగాన్ని యెహోవా తిరిగి వారి స్వస్థలానికి తేవడంలో కనికరంతో కూడిన వాత్సల్యాన్ని కనపర్చాడు. అయితే, వంద సంవత్సరాల్లో ప్రజలు మరలా మతభ్రష్టత్వం దుష్టత్వంలోకి దిగజారిపోవడం కొనసాగింది. ప్రజలు యెహోవా నీతియుక్త కట్టడలను అలక్ష్యంచేస్తూ, గ్రుడ్డివి, కుంటివి, మరియు జబ్బుపట్టిన జంతువులను బలికొరకు తీసుకు రావడం ద్వారా ఆయన నామాన్ని అగౌరవపర్చేవారు. వారు అన్య స్త్రీలను వివాహం చేసుకునేందుకు తమ యౌవనకాలంలోని భార్యకు విడాకులిచ్చారు.—మలాకీ 1:6-8; 2:13-16.
12, 13. (ఎ) అభిషక్త యాజక తరగతికి ఏ శుద్ధీకరణ అవసరమైంది? (బి) శుద్ధీకరణ నుండి గొప్ప సమూహము కూడా ఎలా ప్రయోజనాన్ని పొందుతుంది?
12 శుద్ధీకరించే పని అవసరమైంది. అది మలాకీ 3:1-4 నందు వర్ణించబడింది. ప్రాచీన ఇశ్రాయేలు, యెహోవా ఆధునిక దిన సేవకులు శుద్ధీకరించబడాలి, కనుక మలాకీ వివరించిన శుద్ధీకరించే పని వారికి అన్వయించబడగలదు. మొదటి ప్రపంచయుద్ధం దాని ముగింపుకు చేరుకునే సమయానికి బైబిలు విద్యార్థులుగా అప్పట్లో పిలువబడే సాక్షులు, లౌకిక విషయాల్లో వారు తమ తటస్థతను కచ్చితంగా నిలుపుకోలేదు. యెహోవా, తన ఆరాధికుల చిన్నగుంపును లోకపు మురికినుండి శుభ్రపర్చేందుకు 1918 నందు తన “నిబంధన దూత” అయిన యేసుక్రీస్తును తన ఆత్మీయ ఆలయ ఏర్పాటుకు పంపించాడు. ప్రవచనార్థకంగా యెహోవా ఇలా అడిగాడు: “ఆయన [దూత] వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటివాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు [అభిషక్త యాజక గుంపు] నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.” శుద్ధీకరించబడిన ప్రజలుగా, వారు అదే చేశారు!
13 అభిషక్త యాజక గుంపులో కేవలం 1,44,000 మంది మాత్రమే ఉన్నారు. (ప్రకటన 7:4-8; 14:1, 3) అయితే, నేడు ఇతర సమర్పిత సేవకుల విషయమేమిటి? ఇప్పుడు లక్షలకు పెరుగుతూ ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకు కొని, వాటిని తెలుపు చేసుకోవడం’ ద్వారా లోక విధానములనుండి శుద్ధీకరించబడిన “గొప్పసమూహముగా” వీరు తయారౌతున్నారు. (ప్రకటన 7:9, 14) ఆ విధంగా, గొఱ్ఱెపిల్లైన యేసుక్రీస్తు విమోచన క్రయధనంలో విశ్వాసంకల్గివుండడం ద్వారా వారు యెహోవా యెదుట స్వచ్ఛమైన స్థానాన్ని కల్గివుండగల్గుతున్నారు. మహా శ్రమల కాలమంతటిలో అంటే యెహోవా మహా భయంకరమైన దినమందు వారు రక్షించబడతారని వారికి వాగ్దానం చేయబడింది.—జెఫన్యా 2:2, 3.
14. దేవుని ప్రజలు నేడు నవీన స్వభావాన్ని ఎలా అలవర్చుకోగలరు?
14 యాజక శేషంతో సహా ఈ గొప్ప సమూహము దేవుడు ఇంకా చెప్పే మాటలను వినాలి: “తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్రమీదను వ్యభిచారులమీదను అప్రమాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదును . . . యెహోవానైన నేను మార్పులేనివాడను.” (మలాకీ 3:5, 6) లేదు, యెహోవా కట్టడలు మారలేదు, కనుక యెహోవా భయంలో తన ప్రజలు నేడు అన్ని విధాలైన విగ్రహారాధనను త్యజించాలి మరియు క్రైస్తవ వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటుండగా యథార్థంగానూ నిజాయితీగానూ మరియు ఉదారంగానూ ఉండాలి.—కొలొస్సయులు 3:9-14.
15. (ఎ) యెహోవా ఏ దయాపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాడు? (బి) మనం యెహోవాను ‘దోచుకోవడం’ ఎలా నివారించగలము?
15 తన నీతియుక్త మార్గాల నుండి తప్పిపోయిన వారితో యెహోవా ఇలా చెబుతూ ఓ ఆహ్వానాన్ని అందిస్తున్నాడు: “మీరు నాతట్టు తిరిగిన యెడల నేను మీతట్టు తిరుగుదును.” “మేము దేనివిషయములో తిరుగుదుమని” వీరు ప్రశ్నిస్తే ఆయన ఇలా జవాబిస్తున్నాడు: “మీరు నాయొద్ద దొంగిలితిరి.” “దేనివిషయములో మేము నీయొద్ద దొంగిలితిమని” అడిగే తర్వాతి ప్రశ్నకు జవాబుగా, తన ఆలయ సేవ కొరకు వారు తమ వద్ద ఉన్న శ్రేష్ఠమైన వాటిని తీసుకురాకపోవడం వల్ల దొంగిలారని యెహోవా చెబుతున్నాడు. (మలాకీ 3:7, 8) యెహోవా ప్రజల్లో భాగమైన వారిగా, మనం మన శక్తిసామర్థ్యాల్లో, వస్తుపర విషయాల్లో శ్రేష్ఠమైన వాటిని యెహోవా సేవకు అందించాలని మనం కోరుకోవాలి. ఆ విధంగా, దేవున్ని దోచుకునే బదులు, మనం ‘రాజ్యమును నీతిని మొదట వెదుకుదాము.’—మత్తయి 6:33.
16. మలాకీ 3:10-12 నందు మనం ఏ ప్రోత్సాహాన్ని కనుగొనగలం?
16 మలాకీ 3:10-12 సూచించినట్లుగా స్వయం సేవ, వస్తుపరమైన లోక విధానాలను వెనుకకు నెట్టేవారికి గొప్ప ప్రతిఫలముంది. అక్కడ ఇలా ఉంది: “దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” మెప్పుగల వారందరికీ యెహోవా ఆత్మీయ సంపదను మరియు ఫలాలను ఇస్తాడన్న వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇంకా ఇలా చెబుతున్నాడు: “అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరును మిమ్మును ధన్యులందురు.” దేవునికి కృతజ్ఞులైన భూవ్యాప్త లక్షలాదిమంది ప్రజల విషయంలో ఇది నిజం కాదా?
జీవ గ్రంథంలోని యథార్థతను కాపాడుకునేవారు
17-19. (ఎ) రువాండానందలి అల్లకల్లోలం అక్కడున్న మన సహోదరులపై ఎలాంటి ప్రభావాన్ని కనపర్చింది? (బి) ఈ నమ్మకమైనవారు ఏ విశ్వాసంతో కొనసాగారు?
17 ఈ తరుణంలో, రువాండానందలి మన సహోదర సహోదరీల యథార్థతపై మనం వ్యాఖ్యానించవచ్చు. వారు ఎల్లప్పుడూ యెహోవా ఆత్మీయ ఆరాధనా గృహానికి శ్రేష్ఠమైన ఆత్మీయ అర్పణలను తెచ్చారు. ఉదాహరణకు, 1993 డిశంబరునందు జరిగిన “దైవిక బోధ” జిల్లా సమావేశంలో 2,080 మంది రాజ్య ప్రచారకులతో కలిసి 4,075 మంది హాజరయ్యారు. అక్కడ 230 మంది నూతన సాక్షులు బాప్తిస్మం పొందారు మరి తర్వాతి నెలలో వీరిలో సుమారు 150 మంది సహాయ పయినీరు సేవను చేశారు.
18 ఏప్రిల్ 1994నందు మతపర విద్వేషం చెలరేగినప్పుడు, దాని రాజధానియైన కిగాలీలోని పట్టణాధ్యక్షుడు ఆయన కుటుంబమంతటితో సహా 180 మంది సాక్షులు చనిపోయారు. కిగాలీనందలి వాచ్‌టవర్ సొసైటి కార్యాలయంలోని ఆరుగురు అనువాదకులు, అంటే నలుగురు హుటువారు ఇద్దరు టుట్సీవారు ఉన్నారు, చివరికి టుట్సీవారు సరిహద్దుకు పారిపోయి మరణించేంతవరకూ తీవ్రమైన భయంతో వారు అనేక వారాలు పనిచేస్తూనే ఉన్నారు. చివరికి, తమ కంప్యూటర్ పరికరాల్లో మిగిలినవాటిని తీసుకుని, మిగిలిన నలుగురు జైరీలోని గోమాకు పారిపోయి అక్కడ వారు, కిన్యార్వాన్‌డా భాషలోకి కావలికోటను అనువదించడంలో యథార్థంగా కొనసాగారు.—యెషయా 54:17.
19 ఈ శరణార్థి సహోదరులు, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వస్తుపరమైన అవసరతలకు ముందుగా ఎల్లప్పుడూ ఆత్మీయ ఆహారాన్ని అడిగారు. గొప్ప త్యాగనిరతితో, అనేక దేశాలనుండి ప్రేమపూర్వక సహోదరులు సామాగ్రిని అందించారు. నోటి మాట ద్వారా మరియు ఒత్తిళ్లలోను తమ క్రమబద్ధత ద్వారా ఈ శరణార్థులు అద్భుతమైన సాక్ష్యాన్నిచ్చారు. వారు నిజంగానే యెహోవా ఆరాధనకు తమవద్ద ఉన్న శ్రేష్ఠమైనవాటిని తీసుకువస్తూనే ఉన్నారు. రోమీయులు 14:8 నందు పౌలు మాటల్లో వ్యక్తపర్చబడినట్లుగా వారు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు: “మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమై యున్నాము.”
20, 21. (ఎ) యెహోవా జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడలేదు? (బి) ఎవరి పేర్లు గ్రంథములో కనిపిస్తాయి, మరి ఎందుకు?
20 ఆయనను యథార్థంగా సేవించేవారందరిని గూర్చి యెహోవా జ్ఞాపకముంచుకుంటాడు. మలాకీ ప్రవచనం ఇలా చెబుతోంది: “అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.”—మలాకీ 3:16.
21 యెహోవా నామాన్ని గౌరవించడంలో మనం దైవ భయాన్ని కనపర్చడం ఎంత ప్రాముఖ్యమో కదా! అలా చేస్తే, ఈ లోక విధానానికి మెప్పుతో మద్దతునిచ్చేవారిలా మనం ప్రతికూల తీర్పును అనుభవించం. ప్రకటన 17:8 ‘జీవగ్రంథములో వారి పేరు వ్రాయబడిలేదు’ అని చెబుతోంది. యెహోవా జీవ గ్రంథంలో ప్రథమంగా వ్రాయబడిన పేరు, జీవానికి ముఖ్య మధ్యవర్తియైన దేవుని స్వంత కుమారుడైన యేసుక్రీస్తుదే. మత్తయి 12:21 ఇలా ప్రకటిస్తోంది: “ఈయన నామమందు అన్యజనములు నిరీక్షించెదరు.” యేసు విమోచన క్రయధనమందు విశ్వాసముంచువారందరికీ అది నిత్యజీవాన్ని తప్పక ఇస్తుంది. యేసు నామంతో మన వ్యక్తిగత నామాలను చేర్చడం ఎంతటి ఆధిక్యత!
22. యెహోవా తీర్పును తీర్చినప్పుడు ఏ తేడా స్పష్టమౌతుంది?
22 దేవుని సేవకులు తీర్పు దినాన్ని ఎలా ఎదుర్కొనగలరు? మలాకీ 3:17, 18 నందు యెహోవా ఇలా జవాబు చెప్పాడు: “తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని . . . అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” విభాగించడం అందరికీ స్పష్టంగా ఉంటుంది: దుష్టులు నిత్య నాశనానికి మరియు నీతిమంతులు రాజ్యంలో నిత్యజీవం పొందేందుకు అంగీకారాన్ని పొందుతారు. (మత్తయి 25:31-46) అలా గొర్రెవంటి వ్యక్తుల గొప్ప సమూహము మహాభయంకరమైన యెహోవా దినంనుండి తప్పించుకుంటారు.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ బైబిలు కాలాల్లో యెహోవా ఏ తీర్పులను తీర్చాడు?
◻ పురాతన కాలాలకు, నేటి పరిస్థితులు ఎలా సమాంతరంగా ఉన్నాయి?
◻ మలాకీ ప్రవచన నెరవేర్పుగా ఏ శుద్ధీకరణ సంభవించింది?
◻ దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నాయి?