కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/15 పేజీలు 10-14
  • తన గుర్తును విడిచిపెట్టిన ఓ ముద్రణకర్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తన గుర్తును విడిచిపెట్టిన ఓ ముద్రణకర్త
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మెరుగుపర్చబడిన వల్గేట్‌
  • ఆస్థాన ముద్రణకర్త
  • సంస్కరణోద్యమము సోర్బోన్‌ వేదాంత శాఖకు పోటీ
  • సోర్బోని దాడిచేయడం
  • వేదాంతులు ఆయన బైబిళ్ళను నిషేధించారు
  • వేషధారియని నిందించబడ్డాడు
  • వలసపోయిన ముద్రణకర్త
  • మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు చరిత్రాత్మక అనువాదపు ఉపకరణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మనుగడ కొరకై ఫ్రెంచి బైబిలు పోరాటం
    తేజరిల్లు!—1998
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/15 పేజీలు 10-14

తన గుర్తును విడిచిపెట్టిన ఓ ముద్రణకర్త

బైబిల్లో మీకు ఒక వాక్యం అవసరం కానీ అది ఎక్కడ ఉందో మీకు జ్ఞాపకం రాకుండా పోయిందా? అయితే, కేవలం ఒక్క పదాన్ని మాత్రమే జ్ఞాపకముంచుకుని, బైబిలు పదవిషయ కోశము ద్వారా మీరు దాన్ని కనుగొనగలరు. లేక లేఖనాన్ని సూచించిన కొన్ని క్షణాల్లోనే హాజరైన వందలాది మంది లేక వేలాది మంది తమ బైబిళ్లను తెరవగల ఓ క్రైస్తవ కూటానికి మీరు హాజరైవుండవచ్చు.

ఈ రెండు సందర్భాల్లోనూ, మీకు తెలియని ఒక వ్యక్తికి మీరు ఏదో రుణపడివుంటారు. మీ బైబిలు పఠనాన్ని అతను సులభతరం చేశాడు, మరి మనకు నేడు సరైన బైబిళ్లు ఉండేలా అతను తన వంతును నిర్వహించాడు. అనేక బైబిళ్ల రూపాన్ని కూడా ఆయన ప్రభావితం చేశాడు.

ఆ వ్యక్తి రాబర్‌ ఏట్యన్‌.a ఆయన ఒక ముద్రణకర్తకు జన్మించిన ముద్రణకర్త, ఫ్రాన్స్‌నందు పారిస్‌లో 16వ శతాబ్ద తొలిభాగంలో జీవించాడు. అది పునరుజ్జీవనం మరియు సంస్కరణ యుగం. ముద్రణాలయం ఆ రెండింటికీ ఒక మాధ్యమమైంది. ప్రఖ్యాత ముద్రణకారుడైన హెన్రీ ఏట్యన్‌ రాబర్‌ తండ్రి, పునరుజ్జీవన సమయంలో వెలువడిన చక్కని పుస్తకాలను ముద్రించాడు. ఆయన పనిలో పారిస్‌ విశ్వవిద్యాలయం మరియు దాని సైద్ధాంతిక పాఠశాల—సోర్బోన్‌—కొరకు చేసిన పుస్తకాల్లో విద్యాసంస్థలకు సంబంధించిన మరియు బైబిలు సంబంధిత పుస్తకాలు కూడా ఉన్నాయి.

అయినా, మనం ఆయన కుమారుడైన రాబర్‌ ఏట్యన్‌పై మన దృష్టిని సారిద్దాం. ఆయన తొలి విద్యను గూర్చి అంతపెద్దగా తెలియదు. కానీ చిన్నతనంనుండే, ఆయన లాటిన్‌లో ప్రావీణ్యతను సంపాదించాడు, మరి త్వరలోనే గ్రీకు, హెబ్రీ భాషలనుకూడా నేర్చుకున్నాడు. తన తండ్రి నుండి, రాబర్‌ ముద్రణ కళను నేర్చుకున్నాడు. ఆయన 1526నందు హెన్రీ ముద్రణాలయానికి అధికారం వహించినప్పుడు, ఉన్నత భాషా సూత్రాల విద్వాంసుడని రాబర్‌ ఏట్యన్‌ అప్పటికే పేరు సంపాదించాడు. ఆయన లాటిన్‌ విమర్శనాత్మక ప్రచురణలనూ ఇతర వేదాంత పుస్తకాలనూ ప్రచురించినప్పటికీ, ప్రథమంగానూ మరియు నిర్వివాదంగానూ ఆయనకు బైబిలంటే మహా ఇష్టం. పురాతన లాటిన్‌ పుస్తకాలకు ముందుగానే చేసినట్లుగా, లాటిన్‌ బైబిలును కూడా అలాగే చేయాలనే కుతూహలంతో, అయిదవ శతాబ్దపు జెరోమ్‌ లాటిన్‌ వల్గేట్‌ బైబిలు మూలపాఠాన్ని ఇంచుమించు ఏది తప్పకుండా ఉన్నది ఉన్నట్లు ముద్రించేందుకు పూనుకున్నాడు.

మెరుగుపర్చబడిన వల్గేట్‌

జెరోమ్‌, మూల హెబ్రీ మరియు గ్రీకు బైబిలునుండి అనువదించాడు, అయితే ఏట్యన్‌ కాలంకల్లా, వల్గేట్‌ ఒక వేయి సంవత్సరాల వరకు ఉనికిలో ఉంది. తరాల తరబడి వల్గేట్‌ను ఎత్తిరాయడం వల్ల ఎన్నో తప్పులు, మార్పులు చొరబడ్డాయి. అంతేకాకుండ, మధ్య యుగాల సమయంలో మధ్యయుగ సంబంధిత గాథలూ దండాన్వయ గద్య భాగాలూ బూటకపు ప్రక్షిప్తాంశాల మాటలు బైబిలులోని దైవ ప్రేరేపిత వాక్యాలను కప్పిపుచ్చాయి. ఇవి బైబిలు సమాచారంతో ఎంతగా కలిసిపోయాయంటే, వాటిని ప్రేరేపిత వ్రాతలుగా అంగీకరించడం ప్రారంభించారు.

నిజమైనవికాని వాటన్నింటినీ పూర్తిగా తొలగించేందుకు, పురాతన సాహిత్యాలను పఠించేందుకు ఉపయోగించే మూల పాఠ నిర్ణయ విమర్శ పద్ధతులను ఏట్యన్‌ ఉపయోగించాడు. అందుబాటులో ఉన్న పురాతన మరియు శ్రేష్ఠమైన వ్రాతప్రతులను ఆయన వెదికి కనుగొన్నాడు. పారిస్‌లోనూ దాని చుట్టుప్రక్కల, ఇవరూ మరియు సొయిసన్స్‌ వంటి ప్రాంతాల్లోనూ, ఆయన అనేక వ్రాతప్రతులను వాటిలో ఒకటి సుమారు 6వ శతాబ్దానికి చెందిన వ్రాతప్రతులను బహిరంగపర్చాడు. ఎక్కువ ప్రామాణికత ఉన్న గద్యభాగంగా కనిపించేవాటినే ఎన్నుకుంటూ ఏట్యన్‌ వివిధ లాటిన్‌ గద్యభాగాలను ఒక్కొక్కటే జాగ్రత్తగా పోల్చాడు. ప్రతిఫలం ఏమిటంటే, 1528నందు ఏట్యన్‌ బైబిలు మొదటిసారిగా ప్రచురించబడింది మరియు బైబిలు మూలపాఠ ప్రామాణికతను శుద్ధీకరించేందుకు అది ప్రాముఖ్యమైన మెట్టయ్యింది. ఏట్యన్‌ మెరుగుపర్చిన ఎడిషన్లు తర్వాత వచ్చాయి. ఆయనకు ముందున్నవారు వల్గేట్‌ను సరిచేసేందుకు ప్రయత్నించారు, కాని ప్రయోజనకరమైన విమర్శనాత్మక సమాచారాన్ని అందించిన సంపుటిలలో అదే మొదటిది. మార్జిన్లలో, అనుమానాస్పద భాగాలను ఎక్కడైతే విడిచిపెట్టాడో లేక ఒక మాటకంటే ఎక్కువ ఎక్కడైతే ఉండగల సాధ్యత ఉందో వాటిని గూర్చి ఆయన ప్రస్తావించాడు. ఈ సవరణలకు అధికారాన్నిచ్చిన మూల వ్రాతప్రతులను ఆయన అందులో పెట్టాడు.

ఏట్యన్‌, 16వ శతాబ్దానికి చాలా క్రొత్తవైన అనేక ఇతర విషయాలను ప్రవేశపెట్టాడు. ఆయన అనుమానాస్పద పుస్తకాలు మరియు దేవుని వాక్యం మధ్యవున్న తేడాను చూపాడు. ఆయన అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని, సువార్తల తర్వాత పౌలు ఉత్తరాలకూ ముందుగా పెట్టాడు. ప్రతి పేజీ పైన, నిర్దిష్టమైన భాగాలను పాఠకులు కనుగొనేందుకు సహాయంగా కొన్ని ముఖ్యమైన పదాలను ఉంచాడు. నేడు సహజంగా రన్నింగ్‌ హెడ్‌ అని పిలువబడే దానికి ఇది అతి తొలి మాదిరి. జర్మనీలో ప్రారంభమైన దళసరి, లేక పెద్ద అచ్చును ఉపయోగించే బదులు, ఇప్పుడు వాడుకలోనున్న తేలికైన మరియు సులభంగా చదవగల రోమన్‌ అచ్చుతో పూర్తి బైబిలును అచ్చువేసిన ప్రథముల్లో ఏట్యన్‌ ఒకడు. కొన్ని భాగాలను స్పష్టీకరించేందుకు ఆయన అనేక క్రాస్‌ రెఫరెన్సులనూ భాషాశాస్త్ర సమాచారాన్ని అందించాడు.

అనేకమంది అధికారులు, ఉన్నత మతాధికారులూ ఏట్యన్‌ బైబిలును మెచ్చుకున్నారు ఎందుకంటే అది ముద్రితమైన ఏ ఇతర వల్గేట్‌ సంపుటి కంటే ఎంతో మెరుగైంది. అందానికీ, పనితనానికి, ఉపయుక్తతకూ ఆయన సంపుటి ఒక ప్రమాణికమైంది, మరి త్వరలోనే ఐరోపానందంతా అనుకరించబడసాగింది.

ఆస్థాన ముద్రణకర్త

“తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును,” అని సామెతలు 22:29 చెబుతోంది. ఏట్యన్‌ యొక్క క్రొత్త విధాల పనితనం మరియు భాషా సామర్థ్యం ఫ్రాన్స్‌ రాజైన ప్రాన్సిస్‌ I గమనించాడు. ఏట్యన్‌, లాటిన్‌, హెబ్రీ మరియు గ్రీకు భాషల్లో రాజు కొరకు ముద్రించేవాడయ్యాడు. ఫ్రెంచ్‌ ముద్రణకళలో మచ్చుతునకలుగా ఇప్పటికీ నిలిచివున్న వాటిని ఏట్యన్‌ ఉత్పత్తిచేశాడు. ఫ్రాన్స్‌నందు మొట్ట మొదటిగా మరియు చక్కటి పూర్తి హెబ్రీ బైబిలును ఆయన 1539లో ముద్రించడం ప్రారంభించాడు. పదిహేను వందల నలభైలో ఆయన తన లాటిన్‌ బైబిల్లో చిత్రాలను చేర్చాడు. మధ్య యుగాలకు సహజమైన బైబిలు సంఘటనల అసాధారణ ఆధునిక కాల్పనిక చిత్రాలకు బదులుగా, ఏట్యన్‌ పురావస్తుశాస్త్రపు రుజువు లేక బైబిలులోనే కనిపించే కొలతలు లేక వివరణలకనుగుణమైన చిత్రాలను అందించాడు. ఈ చెక్క బ్లాక్‌ ప్రింట్లు నిబంధనా మందసం, ప్రధాన యాజకుని వస్త్రాలు, గుడారం, సొలొమోను ఆలయం వంటి విషయాలను వివరంగా చిత్రీకరించింది.

రాజు వ్రాతప్రతుల సమకూర్పును ముద్రించేందుకు ఆయన ఆర్డర్‌ చేసిన ప్రత్యేక గ్రీకు అచ్చును ఉపయోగించి, ఏట్యన్‌ మొట్టమొదటిగా క్రైస్తవ గ్రీకు లేఖనాల విమర్శనాత్మక సంపుటిని సృష్టించాడు. ఏట్యన్‌ గ్రీకు మూలపాఠంలోని మొదటి రెండు సంపుటిలు, డెసిడీరియస్‌ ఎరాస్మస్‌ కృతి కంటే అంత మెరుగైనవి కాకపోయినప్పటికీ, 1550 నందలి మూడవ సంపుటిలో ఏట్యన్‌ 5వ శతాబ్దంలోని కోడెక్స్‌ బిజే మరియు సెప్టుజెంట్‌ బైబిలుతో సహా పార్శ్వసంబంధముగలవాటిని మరియు రెఫరెన్సులను చేర్చాడు. ఏట్యన్‌ సంపుటి ఎంతగా అంగీకృతమైందంటే, 1611కు చెందిన కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌తో సహా తర్వాతి భాషాంతరాలు ఆధారపడిన టెక్స్‌టస్‌ రెసెప్ట్‌స్‌, లేక అంగీకృతమైన మూలపాఠం ఆధారితమైంది.

సంస్కరణోద్యమము సోర్బోన్‌ వేదాంత శాఖకు పోటీ

లూథర్‌, మరియు ఇతర సంస్కరణకర్తల ఆలోచనలు ఐరోపానందంతా వ్యాపిస్తుండగా, ప్రజలు చదివేవాటిని వ్యవస్థాబద్ధం చేయడం ద్వారా వారి ఆలోచనలను తన ఆధీనం చేసుకునేందుకు కాథోలిక్‌ చర్చి ప్రయత్నించింది. జూన్‌ 15, 1520 నందు పోపు లియో X ఒక శ్రీముఖాన్ని జారీచేసి, కాథోలిక్కు దేశంలో “సంప్రదాయ విరుద్ధమైన” ఏ పుస్తకాన్ని కూడా ముద్రించడం, అమ్మడం, లేక చదవడం చేయకూడదని ఆదేశించాడు మరియు లౌకిక అధికారులు తమ పాలన ఉన్న ప్రాంతాల్లో ఈ శ్రీముఖాన్ని అమలుపర్చాలని ఒత్తిడి చేశాడు. ఇంగ్లాండ్‌నందు, రాజైన హెన్రీ VII, పరిశోధించే పనిని కాథోలిక్‌ బిషప్పైన కథ్‌బర్ట్‌ టన్‌స్టల్‌కి అప్పగించాడు. అయినప్పటికీ, ఇంచుమించు ఐరోపా అంతటిలో సైద్ధాంతిక విషయాల్లో పోపు తర్వాత తిరుగులేని అధికారం, పారిస్‌ విశ్వవిద్యాలయపు సోర్బోని వేదాంతుల శాస్త్ర విభాగానిదే.

కాథోలిక్‌ మత ఛాందస్సతకు సోర్బోని నోరుగా పని చేసింది. శతాబ్దాలవరకూ అది కాథోలిక్‌ విశ్వాసానికి రక్షణగా దృష్టించబడేది. అన్ని విమర్శనాత్మక వల్గేట్‌ అనువాదాలూ సంపుటిలూ “చర్చికి నిరుపయోగమేకాకుండ హానికరమైనవని” పరిగణిస్తూ వాటన్నింటినీ సోర్బోని పరిశోధకులు నిషేధించారు. లేఖనాధారంకాని చర్చి సిద్ధాంతాలూ ఆచారాలూ పారంపర్యాలపై సంస్కరణకర్తలు తమ అనుమానాన్ని వ్యక్తపరుస్తున్న సమయంలో ఇది ఆశ్చర్యకరం కాదు. అయినప్పటికీ, ప్రామాణికమైన బైబిలును సరిగ్గా అనువదించడం కంటే, చర్చి స్థాపించిన సిద్ధాంతాలే మరి ప్రాముఖ్యమని సోర్బోని నందలి వేదాంతులు దృష్టించారు. ఒక వేదాంతి ఇలా చెప్పాడు: “సిద్ధాంతాలు ఒక్కసారి వచ్చాక, లేఖనాలనేవి ఒక గోడను నిర్మించిన తర్వాత తీసివేసిన మంచె వంటివౌతాయి.” శాస్త్ర విభాగంలోని అనేకులకు హెబ్రీ మరియు గ్రీకు తెలియకపోయినప్పటికీ, ఏట్యన్‌ పరిశీలనలనూ మరియు బైబిలు నందు ఉపయోగించిన పదాల అసలు భావాలను పరిశోధించే ఇతర పునరుజ్జీవన వేదాంతులను ఏవగింపుతో దృష్టించేవారు. ఒక సోర్బోని ప్రొఫెసర్‌, “గ్రీకు మరియు హెబ్రీల జ్ఞానాన్ని వ్యాపింపజేయడం, ఒక రకంగా అన్ని మతాల నాశనానికి నడిపించగలదు” అని కూడా చెప్పేందుకు సాహసించాడు.

సోర్బోని దాడిచేయడం

ఏట్యన్‌ తొలి వల్గేట్‌ విభాగ విమర్శలో సఫలమైనప్పటికీ, అది వివాదం లేకుండా మాత్రం లేదు. గత 13వ శతాబ్దంలో, విశ్వవిద్యాలయపు అధికారిక బైబిలుగా వల్గేట్‌ స్థాపించబడింది మరియు అనేకమంది ప్రజలు దాని మూలపాఠంలో ఒక్క తప్పు కూడా లేదని దృష్టించేవారు. శాస్త్రవిభాగం, గౌరవనీయ సిద్ధాంతియైన ఎరాస్మస్‌ వల్గేట్‌పై చేసిన పనికి ఆయనను ఖండించారు. మామూలు ముద్రణకర్త, అధికారిక సమాచారాన్ని మార్చేందుకు సాహసించడం కొందరిని భయబ్రాంతులను చేసింది.

అన్నిటికంటే ప్రాముఖ్యంగా, వేదాంతులను మరింత కలవరపర్చినది ఏట్యన్‌ మార్జిన్‌లోని సమాచారమే. ఈ సమాచారం, వల్గేట్‌ మూలపాఠం యొక్క యథార్థతపై అనుమానాన్ని రేపుతుంది. కొన్ని భాగాలను స్పష్టీకరించాలనే ఏట్యన్‌ కోరిక సైద్ధాంతిక లోకంలోకి చొరబడ్డాడని ఆయన నిందించబడేందుకు కారణమయ్యింది. తన సమాచారం కేవలం చిన్న తాత్పర్యాలని లేక భాషాశాస్త్ర స్వభావంగలదని చెప్పుకుంటూ తనపై మోపిన నిందను ఆయన తృణీకరించాడు. ఉదాహరణకు, “నరకం” [లాటిన్‌, ఇన్‌ఫెర్నమ్‌] అని ఆదికాండము 37:35నందు ఉపయోగించిన పదాన్ని, దుష్టులు శిక్షించబడే స్థలంగా అర్థంచేసుకోకూడదని అది వివరించింది. ఆయన ఆత్మ అమర్త్యాన్ని మరియు మధ్యవర్తిత్వం వహించగల “సెయింట్‌ల” శక్తిని కాదన్నాడని బోధనా విభాగము తప్పుగా నిందించింది.

అయితే ఏట్యన్‌కు రాజు మెప్పు, రక్షణ ఉన్నాయి. ఫ్రాన్సిస్‌ I పునరుజ్జీవనము పరిశీలనలో ఎంతో ఆసక్తిని కనపర్చాడు, ప్రత్యేకంగా తన ఆస్థాన ముద్రణకర్త పనిలో ఎక్కువ ఆసక్తిని కనపర్చాడు. నివేదించబడినట్లుగా, ఫ్రాన్సిస్‌ I ఏట్యన్‌ను సందర్శించేవాడు, మరి ఒక మూలపాఠంలో ఏట్యన్‌ చివరి మార్పులు చేస్తుండగా ఓపికతో ఆయన వేచివున్నాడు. రాజు మద్దతుతో, ఏట్యన్‌ సోర్బోనిని ఎదుర్కోగల్గాడు.

వేదాంతులు ఆయన బైబిళ్ళను నిషేధించారు

అయితే, 1545 నందు, ఏట్యన్‌పై సోర్బోని విద్యావిభాగం పూర్తిగా ఆగ్రహించేలా సంఘటనలు కారణమయ్యాయి. సంస్కరణకర్తలకు వ్యతిరేకంగా ఐక్య విధానాన్ని ఉంచడంలోని ప్రయోజనాలను చూస్తూ కొలోన్‌ (జర్మనీ), లొవేయిన్‌ (బెల్జియమ్‌) మరియు పారిస్‌నందలి కాథోలిక్‌ విశ్వవిద్యాలయాలు సాంప్రదాయకంకాని బోధల నిషేధంతో కలుస్తామని తొలుత అంగీకరించాయి. నిషేధించబడిన పారిస్‌ పుస్తకాల పట్టికలో ఏట్యన్‌ బైబిలు కనిపించకపోవడంలో తమ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతూ లొవెయిన్‌ విశ్వవిద్యాలయపు వేదాంతులు సోర్బోనికు వ్రాసినప్పుడు, అలాంటి వాటిని చూసివుంటే తాము తప్పకుండా అలాగే చేద్దుమని సోర్బోని అబద్ధంగా తిరిగి ఉత్తరం రాసింది. విద్యావిభాగంలో ఉన్న ఏట్యన్‌ శత్రువులు, లొవెయిన్‌ మరియు పారిస్‌ విద్యావిభాగం కలిసి ఇచ్చే సాక్ష్యాలు, తన ముద్రణకర్త తప్పులు చేశాడని ఫ్రాన్సిస్‌ Iని ఒప్పించేందుకు సరిపోతాయని భావించారు.

ఈ మధ్యలో, తన శత్రువుల ఉద్దేశాలను గూర్చి హెచ్చరించబడిన ఏట్యన్‌ వారికంటే ముందే రాజు దగ్గరికి వెళ్లాడు. సిద్ధాంతులు వారు కనుగొన్న తప్పుల చిట్టాను అందిస్తే దాన్ని సిద్ధాంతుల సవరణలతో ముద్రిస్తానని మరియు అమ్ముడుపోయే ప్రతి బైబిలుతోనూ దీన్ని చేరుస్తాననీ చెప్పాడు. ఈ పరిష్కారం రాజు అనుగ్రహాన్ని పొందింది. తన ఆస్థాన పూజారి పెయిరీ డూ శాష్టెల్‌తో ఈ విషయాన్ని పరిశీలించమని చెప్పాడు. అక్టోబరు 1546 నందు, ఏట్యన్‌ బైబిళ్లు, “మన విశ్వాసాన్ని తృణీకరించేవారికి ఆహారమని మరియు ఇటీవలి సాంప్రదాయవిరుద్ధతకూ మద్దతునిచ్చేవిగా ఉన్నాయని” మరియు “పూర్తిగా నిర్మూలించబడేందుకు, నాశనం చేయబడేందుకు” తగిన తప్పులతడకలని డూ శాష్షెల్‌కు వ్రాశారు. దానితో ఒప్పింపబడని రాజు, ఏట్యన్‌ బైబిళ్లతో అచ్చు వేయబడేందుకుగాను నిషేధాలను ఇవ్వమని ఇప్పుడు తానుగా ఆ విద్యావిభాగాన్ని ఆజ్ఞాపించాడు. వారు అలా చేస్తామని వాగ్దానంచేశారు, అయితే తప్పులుగా భావించేవాటి వివరణాత్మక పట్టికను అందించకుండా ఉండేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు.

మార్చి 1547 నందు ఫ్రాన్సిస్‌ I మరణించాడు, మరి ఆయనతో సోర్బోని శక్తికి వ్యతిరేకంగా అతి శక్తివంతమైన తన మిత్రుణ్ణి ఏట్యన్‌ కోల్పోయాడు. హెన్రీ II సింహాసనాన్ని అధిష్టించినప్పుడు, ఆ విద్యావిభాగం తన నిషేధాలను అందించాలనే తన తండ్రి ఆజ్ఞను తిరిగి జారీచేశాడు. అయినా, రాజకీయ గమ్యాలకొరకు జర్మన్‌ యువరాజులు రిఫార్మేషన్ను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించి, ఫ్రాన్స్‌ను కాథోలిక్కుగా ఉంచడం మరియు దాని నూతన రాజు ఆధ్వర్యంలో దాన్ని ఐక్యంగా ఉంచడాన్ని పోలిస్తే, ఆస్థాన ముద్రణకర్త బైబిళ్ల లాభ నష్టాల ఎడల హెన్రీ II అంత శ్రద్ధచూపలేదు. డిశంబరు 10, 1547 నాడు, తమ నిషేధాల పట్టికను వేదాంతులు తయారుచేసేంతవరకూ ఏట్యన్‌ బైబిళ్ళ అమ్మకాన్ని నిషేధించాలని రాజు ఆంతరంగిక సంఘం నిర్ణయించింది.

వేషధారియని నిందించబడ్డాడు

సాంప్రదాయవిరుద్ధ కేసులతో వ్యవహరించేందుకుగాను క్రొత్తగా స్థాపించబడిన ప్రత్యేక కోర్టుకు ఏట్యన్‌ కేసును అప్పగించడానికి విద్యావిభాగం ఇప్పుడొక కారణాన్ని కనుగొంది. తాను అపాయంలో ఉన్నాడని ఏట్యన్‌కు ఎవ్వరూ జ్ఞాపకం చేయవల్సిన అవసరంలేదు. దాన్ని అమలుపర్చిన రెండు సంవత్సరాలకే, అది షాంబ్రే అర్డాంట్‌ అని, లేక “మండే గది” అని పేరు పొందింది. ఏట్యన్‌ ఇంటి ముందటి గదినుండి కేవలం కొంత దూరాన ఉన్న ప్లాస్‌ మోబర్‌ ప్రాంతం వద్ద, కొందరు ముద్రణకర్తలూ పుస్తక అమ్మకందార్లతో సహా దాదాపు 60 మందిని మరణకొయ్యపైకి ఎక్కించడం జరిగింది. ఏట్యన్‌కు వ్యతిరేకంగా చిన్న రుజువునైనా సంపాదించేందుకు ఆయన ఇంటిని పదేపదే వెతికారు. ఎనభై కంటే ఎక్కువ మంది సాక్షులను ప్రశ్నించారు. ఆయన సాంప్రదాయ విరుద్ధుడని నిరూపించగల్గే సమాచారాన్ని అందించేవారికి ఆయన సామాగ్రిలో నాల్గవవంతు ఇస్తామని వాగ్దానం చేశారు. అయినప్పటికీ, వారు సంపాదించగల ఏకైక రుజువు ఏట్యన్‌ తన బైబిళ్ళలో బహిరంగంగా ప్రచురించినవే.

మరలా విద్యా విభాగపు నిషేధాల పట్టికను తన ఆంతరంగిక పరిషత్తుకు ఇవ్వమని రాజు ఆదేశించాడు. అవిధేయులుగా, ‘సాంప్రదాయ వ్యతిరేకమైంది అని వారు నిందించేవాటిని వ్రాతరూపంలో వ్యక్తపర్చే అలవాటు వేదాంతులకు లేదని, అయితే నోటి మాట ద్వారా మాత్రమే జవాబిస్తారు, మరి దాన్ని మీరు నమ్మాలి, లేదా వ్రాతకు అంతే ఉండదు’ అని విద్యావిభాగం జవాబిచ్చింది. హెన్రీ దానికి సమ్మతించాడు. చివరి నిషేధం అమలుపర్చబడింది. ఏట్యన్‌ ముద్రించిన బైబిలు సంబంధిత ప్రతి పుస్తకంకూడా నిషేధించబడింది. ఆయన ప్లాస్‌ మోబర్‌ జ్వాలలను తప్పించుకున్నప్పటికీ, తన పుస్తకాలను పూర్తిగా నిషేధించే మరియు భవిష్యత్తులో ఇంకా బాధించబడే అవకాశం వల్ల ఆయన ఫ్రాన్స్‌ను విడిచివెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

వలసపోయిన ముద్రణకర్త

నవంబరు 1550 నందు, స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు ఏట్యన్‌ వెళ్లాడు. ఫ్రాన్స్‌నందు, వల్గేట్‌ తప్ప వేరే ఏ బైబిలును ప్రచురించడమైనా చట్టవిరుద్ధమైనదిగా ఆ విద్యావిధానం చేసింది. ఆయన ఇష్టంవచ్చింది ప్రచురించుకునే స్వేచ్ఛతో, సమాంతర వరుసల్లో రెండు లాటిన్‌ (వల్గేట్‌ మరియు ఎరాస్మస్‌), వర్షన్లతో సహా ఏట్యన్‌ తన గ్రీకు “క్రొత్త నిబంధనను” 1551లో ప్రచురించాడు. ఎరాస్మస్‌ లాటిన్‌ మూలపాఠానికి సమాంతరంగా గ్రీకు లేఖనాల ఫ్రెంచి అనువాదంతో 1552 నందు ఆయన దీన్ని అమలుపర్చాడు. ఈ రెండు సంపుటిలయందు, బైబిలు గ్రంథభాగాన్ని సంఖ్యలున్న వచనాలుగా విడదీసే పద్ధతిని ఏట్యన్‌ ప్రవేశపెట్టాడు—నేడు విశ్వవ్యాప్తంగా ఉపయోగించే పద్ధతి అదే. వచనాలను విభాగించేందుకు ఇతరులు ఎన్నో వివిధ పద్ధతులను మునుపు ఉపయోగించినప్పటికీ, ఏట్యన్‌ పద్ధతి అంగీకృతమైనదైంది. వచనాలుగా విడదీసి అందించిన 1553లోని తన ఫ్రెంచ్‌ బైబిలు మొట్టమొదటి పూర్తి బైబిలు.

యెహోవా అనే దేవుని వ్యక్తిగత నామాన్ని హెబ్రీ లేఖనాలన్నిటిల్లోనూ ఉపయోగించడంలో కూడా, 1557లోని రెండు వర్షన్ల ఏట్యన్‌ లాటిన్‌ బైబిలు గణనీయమైందే. రెండవ కీర్తన మార్జిన్‌లో, హెబ్రీ చతురక్షర పదానికి (יהוה) బదులుగా అదోనై అనే పదాన్ని ఉపయోగించడం పూర్తిగా యూదుల అంధవిశ్వాసంపై ఆధారపడివుందని మరి దాన్ని తృణీకరించాలని ఆయన తెలిపాడు. ఈ సంపుటిలో, హెబ్రీలోని పూర్తి భావాన్ని పొందేందుకు చేర్చబడే లాటిన్‌ పదాలను సూచించేందుకు ఏట్యన్‌ ఐటాలిక్కులను ఉపయోగించాడు. ఈ పద్ధతి తర్వాత ఇతర బైబిళ్లలో ఉపయోగించబడింది, ఆధునికంగా నొక్కి తెలిపే విషయాన్ని ఐటాలిక్కుల్లో పెట్టడం చూసి అలవాటైన నేటి పాఠకులను తరచూ అయోమయపాలుచేసే పారంపర్యమే అది.

తాను నేర్చుకున్నవాటిని ఇతరులకు అందుబాటు చేసే దృఢసంకల్పంతో, ఏట్యన్‌ తన జీవితాన్ని పరిశుద్ధ లేఖనాల ప్రచురణకు సమర్పించాడు. దేవుని వాక్యానికి విలువనిచ్చే వారు, ఆయన ప్రయత్నాలకూ మరియు మొదట వ్రాయబడినట్లుగా వెలిబుచ్చేందుకు ఎంతగానో శ్రమపడి పాటుపడిన వారి కష్టానికి కృతజ్ఞులై ఉండాలి. ప్రాచీన భాషలను గూర్చిన సరైన జ్ఞానాన్ని మనం అధికంగా పొందినప్పుడు మరియు పాతవైన, మరింత నిర్దిష్టమైన దేవుని వాక్యపు వ్రాతప్రతులను కనుగొన్నప్పుడు వారు ప్రారంభించిన పద్ధతి కొనసాగుతుంది. తన మరణానికి కేవలం కొద్దికాలం ముందు (1559), ఏట్యన్‌ గ్రీకు లేఖనాల క్రొత్త అనువాదంపై పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను ఇలా ప్రశ్నించారు: “దాన్ని ఎవరు కొంటారు? దాన్ని ఎవరు చదువుతారు?” దానికి ఆయన పూర్తి విశ్వాసంతో ఇలా జవాబిచ్చాడు: ‘దైవభక్తిగల జ్ఞానయుక్త ప్రజలందరూ.’

[అధస్సూచీలు]

a లాటిన్‌ భాషలో అతని పేరు స్టెఫానస్‌ అని మరియు ఆంగ్లికన్‌లో అతని పేరు స్టీవెన్స్‌ కూడా పిలువబడుతున్నాడు.

[10వ పేజీలోని చిత్రం]

తరాలుగా బైబిలు విద్యార్థులకు రాబర్‌ ఏట్యన్‌ ప్రయత్నాలు సహాయపడ్డాయి

[క్రెడిట్‌ లైను]

Bibliothèque Nationale, Paris

[12వ పేజీలోని చిత్రం]

ఏట్యన్‌ ఇచ్చిన బోధనాత్మక చిత్రాలు తరాలవరకు అనుకరించబడ్డాయి

[క్రెడిట్‌ లైను]

Bibliothèque Nationale, Paris

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి