సత్యాన్ని కనుగొన్నవారి కొరకు ఆనందం వేచివుంది
ఒక ఫినిష్ దేశస్థుడు అటకపై, యుగాల దైవిక యోజన (ఆంగ్లం) అనే పుస్తకాన్ని కనుగొన్నాడు. వెంటనే అతను దాన్ని చదవడం ప్రారంభించాడు, మరి త్వరలోనే తనకుతాను ఇలా చెప్పుకున్నాడు, ‘ఇదే సత్యం, ఇదే సత్యం.’ అటక మీదినుండి దిగివచ్చిన తర్వాత, తన భార్యతో ఇలా చెప్పాడు, “నేను నిజమైన మతాన్ని కనుగొన్నాను.”
ఈ వ్యక్తి సత్యాన్ని కనుగొన్న విధానాన్ని బట్టి ఈ అనుభవం అసాధారణమైంది. అయినా, అనేకమంది యెహోవాసాక్షులు అలాంటి ప్రతిస్పందనను గూర్చి చెప్పగలరు. సత్యాన్ని కనుగొన్నప్పుడు కలిగిన ఆనందాన్ని గూర్చి వారందరూ మీకు చెప్పగలరు. ఈ క్రింది అనుభవాలు దీన్ని ఉన్నతపరుస్తున్నాయి.
నిజమైన బైబిలు బోధలు ఆనందాన్ని తెస్తాయి
మార్గరిటా కొయినిగర్ జర్మనీనందలి మనిచ్నందు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పెరిగింది. బాంబు వేయబడిన ఇళ్లు, కాలుతున్న ఇళ్లు తరచూ కనిపించే దృశ్యాలే. ఆమె అన్న యుద్ధంలో మరణించాడు. ఆమె కాథోలిక్కు చర్చికి హాజరౌతుండగా జర్మన్ సైనికులకు నాయకుడైన హిట్లర్ కొరకు చేస్తున్న ప్రార్థనలను వింది. యుద్ధం తర్వాత, అమెరికానందు కాలేజీలో చేరేందుకు, విద్యార్థి-వినిమయంలో భాగంగా ఆమెకు ఉపకారవేతనం లభించింది. అక్కడి ప్రజలు తనతో స్నేహంగా ఉన్నారని కనుగొంది, మరి శాంతితో జీవించాలనే సహజ కోరికగల ప్రజలు, యుద్ధ సమయంలో ఒకరిపై ఒకరు అపనమ్మకం పెంచుకుని, ద్వేషించుకునేందుకు వారిని ఏది బలవంతపెడుతోందా అని ఆలోచించేది. మనిచ్నందు, ఆమె యెహోవాసాక్షులను కలిసింది, మరి వాళ్లతో బైబిలును పఠించడం ద్వారా తన ప్రశ్నలకు ఆమె జవాబులను కనుగొంది. ఆమె ఇలా అంటోంది: “దుష్టాత్మలు ఈ పనిలో ఉన్నాయని నాకు బైబిలు నుండి చూపించబడింది. . . . బైబిలు వారిని ‘లోకాధికారులు’ అని పిలుస్తుంది, మరి వాస్తవానికి సాతాను ‘సర్వలోకమునూ మోసపుచ్చుచున్నాడని’ చెబుతోంది. రాజ్యాలు మరియు ప్రజల భక్తిహీన పైశాచిక క్రియలవల్ల తీర్పు తీర్చడమన్న ఈ జవాబు ఎంత సహేతుకంగానూ సంతృప్తికరంగానూ ఉందో కదా!”—ఎఫెసీయులు 6:12; ప్రకటన 12:9.
మార్గరిటా ఇలా కొనసాగిస్తోంది: “భూమిపైనున్న సమస్యలను పరిష్కరించే దేవుని ఏర్పాటును గూర్చి తెలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని తెచ్చింది. లౌకిక బోధకులు చెప్పేట్లుగా, అది ఏ మానవ ఆలోచనవల్ల లేక నిర్వహణవల్ల సంభవించేది కాదు. బదులుగా, భూ విషయాల్లో క్రొత్త పరలోక ప్రభుత్వం ఆధిపత్యాన్ని వహిస్తుందని బైబిలు చూపుతోంది. . . . యేసు ఇలా ప్రార్థించాలని తన శిష్యులకు నేర్పాడు: ‘నీ రాజ్యము వచ్చుగాక.’ . . . ఈ రాజ్యం నిజమైన ప్రభుత్వమని మరి దాని ద్వారా మాత్రమే యథార్థమైన ప్రపంచవ్యాప్త శాంతిని పొందగలమని నేను గ్రహించడం ప్రారంభించాను.” సుమారు 30 సంవత్సరాల పాటు, మార్గరిటా అయిదు ఆఫ్రికా దేశాల్లో మిషనరీగా పనిచేసింది, చివరి 19 సంవత్సరాల్లో, ఓగాడోగో, బుర్కినా ఫాసోనందలి ప్రజలకు సత్యాన్ని ప్రకటించడంలో గడిపింది.
మార్గరిటా అనుభవం అసాధారణమైంది కాదు. యుద్ధ పంక్తిలోని ఇరు పక్షాలవారి క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులు, తాము జయించాలని దేవునికి ప్రార్థించడం చూసిన అనేకులు అలాగే అనుకూలంగా ప్రతిస్పందించారు. మానవ యుద్ధాల్లో దేవుడు ఏ విధంగా కూడా పాల్గొనడని అయితే, “లోకమంతయు దుష్టునియందున్నది” కనుక ఇవి జరుగుతున్నాయన్న బైబిలు వివరణలో సహేతుకత ఉందని యథార్థహృదయులు చూస్తారు. నిజక్రైస్తవులు “ఈ లోక సంబంధులు” కాకుండా ఉండాలి, కాని దాని వ్యవహారాల్లో తటస్థంగా ఉండాలని ఈ సత్యాన్వేషకులు నేర్చుకుంటారు. యెహోవాసాక్షులు అలాంటి స్థానాన్ని వహించరని గ్రహిస్తూ క్రొత్తగా ఆసక్తిగలవారు తాము సత్యాన్ని కనుగొన్నామని విశ్వసిస్తున్నారు. దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతించాడు, త్వరలోనే భూమిపై శాంతియుతమైన మరియు నీతియుక్తమైన పరిస్థితిని తన రాజ్యం ద్వారా ఎలా తీసుకువస్తాడన్న వాటిని గూర్చి అధిక జ్ఞానాన్ని పొందినప్పుడు అలాంటి వారు ఆనందము మరియు నిరీక్షణల్లో అభివృద్ధి చెందుతారు.—1 యోహాను 5:19; యోహాను 17:16; మత్తయి 6:9, 10.
నిజమైన బైబిలు సూత్రాలు ఆనందాన్ని తెస్తాయి
ఈక్వెడార్‌కు చెందిన డాన్యెల్ రొసిరొ, జీవితం అర్థరహితమైందని భావించాడు, కనుక ఆయన త్రాగడం ప్రారంభించాడు. ఆయన వెళ్లే చర్చి, మరణం మరియు నరకాగ్ని కొరకు మాత్రమే ఆయన ఎదురుచూడగలడని బోధించేది. ఆయన దానికి ఇలా ప్రతిస్పందిచాడు, “నేను ఎలాగూ కాలిపోతాను, కనుక నన్ను త్రాగనివ్వండి!” ఎనిమిది మంది సభ్యులు గల కుటుంబం ఆయనకుంది, దానిని ఆయన పోషించడంలేదు. మరి తన భార్య డెల్యాతో ఆయన ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటాడు. ఒక ఆదివారం నాడు యెహోవాసాక్షులు వారిని సందర్శించి బైబిలు పఠనాన్ని ప్రారంభించినప్పుడు గొప్ప మార్పు సంభవించింది. మొట్టమొదటి సారిగా డాన్యెల్ యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశానికి హాజరైనప్పుడు ఆయన సత్యాన్ని కనుగొన్నానని గ్రహించాడు. ఆయన ఇలా అంటున్నాడు: “ఈ సంస్థ నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. ఎంతో మంది ప్రజలు కలిసిమెలిసి ఉంటారు. ఆ గుంపులో మనం ప్రేమను అనుభవించగలం. ఎవరూ పొగ త్రాగలేదు. ఎలాంటి చెడు భాషా మాట్లాడలేదు. . . . అప్పుడు ‘ఇదే సత్యం’ అని అనుకోవడం నాకు జ్ఞాపకముంది. నన్ను ప్రేరేపించింది మరణ భయమో లేక లోకాంత భయమో కాదు. అది సంస్థయొక్క శుద్ధత.”
రొసిరొ కుటుంబమంతా యెహోవాసాక్షులయ్యారు. వారు బైబిలు సూత్రాలను అన్వయిస్తుండగా, వారి కుటుంబ జీవితం, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ప్రారంభమైంది. డెల్యా రొసిరొ ఇలా చెబుతోంది: “నా జీవితంలోని అభివృద్ధి అంతటికీ నేను బైబిలు సత్యానికే రుణపడివున్నాను. దేవుని వాక్యం లేకుండ నా పిల్లలు ఏమైపోయుండేవారో ఎవరికి తెలుసు? మొత్తం ఏడుగురు బాప్తిస్మం తీసుకున్నారు, సమతుల్యంగా ఉన్నారు. సత్యం అంటే నాకు పూర్తిగా క్రొత్త జీవితం, క్రొత్త సంతోషం.
రొసిరొ కుటుంబ అనుభవం అసాధారణమైంది కాదు. మన కాలంలో అనేకులు సమస్యలతో బాధపడుతున్నారు. బైబిలునందు అందించబడిన నైతిక సూత్రాలు మునుపటి తరాల వారు గౌరవించినట్లు నేడు అందరివల్ల గౌరవించబడడంలేదు. అది సహనమనే పేరుతోగానీ లేక మారే కాలంతో పాత నైతిక విలువలు కూడా పాతబడిపోతాయని వారు భావించడం వల్లగానీ అనేక మతాలు ఈ పద్ధతినే అనుసరించాయి. కనుక, ఇతరుల్లా, బైబిలు నడిపింపు లేకుండ రొసిరొలు తడుముకునేందుకు విడిచిపెట్టబడ్డారు. అయితే, అలాంటి సాత్వికులైన ప్రజలు నైతికత మరియు కుటుంబ జీవితం విషయంలో దేవుని దృక్పథాన్ని తెలుసుకున్నప్పుడు, తాము నేర్చుకున్నవాటిని వారు వెంటనే అన్వయిస్తారు. అలా చేయడంవల్ల వారి కథలో మనం మంచి ఫలితాలను చూడగలం.
ఆనందాన్ని అలవర్చుకోవాలి
అయితే, దాని భావం ఒక క్రైస్తవుడు నిత్యానందంలో ఉంటాడని కాదు. స్పష్టంగా, ప్రజలు సహజంగా అనుభవించే కష్టాలను, అంటే నిరుద్యోగ సమస్య, అనారోగ్యం, మరణం వంటి వాటిని క్రైస్తవులు కూడా అనుభవిస్తున్నారు. తమ స్వంత అపరిపూర్ణతతో మరియు బలహీనతలతో కూడా క్రైస్తవులు నిరంతరం పోరాడవల్సి ఉంది. లోతు, సొదొమ పట్టణంలోని “దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధ” పడ్డాడని బైబిలు వృత్తాంతం చెబుతోంది. దుష్ట పరిస్థితులు వర్ధిల్లడం చూస్తున్న నమ్మకస్తులైన క్రైస్తవులు అలాంటి భావాలను నివారించలేరు.—2 పేతురు 2:7, 8.
అయితే, సత్యాన్ని కనుగొన్నవారికి ప్రయోజనం ఉంది. ఉదాహరణకు, చనిపోయిన వ్యక్తి విషయంలో బాధపడుతున్న ఒక విశ్వాసి, ‘నిరీక్షణలేని యితరులవలె దుఃఖపడనవసరం లేదు.’ ఆయన దుఃఖం అంతులేనిది కాదు. ఇతర సమస్యల విషయంలో కూడా అంతే. సత్యాన్ని కనుగొన్నవారికి ప్రస్తుత కష్టాలు తాత్కాలికం మాత్రమే అని తెలుసు. కష్టాల్లో సహించడాన్ని నిరీక్షణ సులభతరం చేస్తుంది. సమతుల్య జీవన విధానం కూడా సహాయపడుతుంది.—1 థెస్సలొనీకయులు 4:13.
పౌలు క్రైస్తవులకు ఈ ఉద్బోధనిచ్చాడు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.” (ఫిలిప్పీయులు 4:4) ఆనందం అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని కల్గివుండకుండా ఉండడం కూడా సాధ్యమని అది చూపుతోంది. ఈ పాత విధానపు వ్యాకులత ఒక ఆటంకంగా ఉండవచ్చు. దానికి తోడు, దేవుని ఆత్మ ఫలాల్లో ఒకటైన ఆనందాన్ని మనం అలవర్చుకోవాలని బైబిలు చెబుతోంది. (గలతీయులు 5:22) సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని మీరు ఎడతెగక తీసుకున్నట్లైతే, అది తెచ్చిన మరియు ఇంకా తెస్తూ ఉన్న ఆత్మీయ సంపదను గూర్చి మీరు జ్ఞాపకముంచుకున్నట్లైతే, మీ ఆనందం తరిగిపోదు. దేవుడు ప్రజల కళ్లనుండి “ప్రతి బాష్పబిందువునూ” తుడిచివేసే, “దుఃఖమైననూ ఏడ్పైననూ వేదనయైనను” ఉండని సమయానికి మనం చేరుకున్నప్పుడు అది మరింత శక్తివంతమౌతుంది.—ప్రకటన 21:4.
[8వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షుల సమావేశాల వద్ద కనిపించే ఆనందం మరియు మంచి సంస్థీకరణకు అనేకులు ముగ్ధులయ్యారు