బైబిలునందలి ప్రార్థనలు సన్నిహితంగా పరిశీలించదగినవి
వ్యాకులతలో ఉన్న ఒక స్త్రీ, ఒక రాజు, మరియు దేవుని స్వంత కుమారుడు చేసిన ప్రార్థనలను ఇప్పుడు మనం సన్నిహితంగా పరిశీలించబోతున్నాము. ప్రతి ప్రార్థనా విభిన్న పరిస్థితులవల్ల ప్రేరేపించబడింది. అయినా, అలాంటి పరిస్థితులు నేడు మనలను ప్రభావితం చేయగలవు. ఈ ఉదాహరణలనుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
‘మీ సేవకురాలనైన నా శ్రమను చూడుము’
ఎడతెగని సమస్యతో మీరు పెనుగులాడుతున్నారా? లేక వ్యాకులతా భారంతో మీరు కృంగిపోతున్నారా? అలాగైతే మీ పరిస్థితి, తన మొదటి బిడ్డయైన సమూయేలును కనకముందు హన్నా పరిస్థితిని పోలినదే. ఆమెకు పిల్లలు లేరు మరియు మరో స్త్రీ ఆమెను దెప్పిపొడిచింది. వాస్తవానికి, హన్నా స్థితి ఆమెను ఎంతగా క్షోభపెట్టి ఆందోళనపర్చిందంటే, దానితో ఆమె తినడం కూడా మానేసింది. (1 సమూయేలు 1:2-8, 15, 16) ఆమె యెహోవాకు మొరపెట్టుకుని, ఈ క్రింది విధంగా విన్నవించుకుంది.
“సైన్యముల కధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును.”—1 సమూయేలు 1:11.
హన్నా సాధారణ విషయాలను మాట్లాడలేదని గమనించండి. (తన కుమారుని దేవునికి సమర్పిస్తాననే) నిర్దిష్టమైన తీర్మానంతో కూడిన (కుమారుని కొరకు) ప్రత్యేక విన్నపంతో ఆమె యెహోవాను సమీపించింది. ఇది మనకు ఏమి నేర్పిస్తోంది?
బాధలో మీరు ఉన్నప్పుడు, ప్రార్థించేటప్పుడు వాటిని నిర్దిష్టింగా చెప్పండి. మీ సమస్య ఏదైనప్పటికీ—అది మీ కుటుంబ పరిస్థితైనా, ఒంటరితనానికి సంబంధించినదైనా లేక అనారోగ్యానికి సంబంధించినదైనా—దాన్ని గూర్చి యెహోవాకు ప్రార్థించండి. మీ సమస్య వాస్తవిక స్వభావాన్ని మరి మీరు ఎలా భావిస్తున్నారన్న విషయాన్ని ఆయనకు వివరించండి. “ప్రతి సాయంత్రం నేను నా సమస్యలను యెహోవాకు విన్నవిస్తాను, కొన్నిసార్లు అవి చాలా ఉంటాయి, అయితే నేను ప్రతి దానిని విశదంగా చెబుతాను” అని లూయిస్ అనే ఒక విధవరాలు చెబుతోంది.
సరియైన పదజాలంతో యెహోవాతో మాట్లాడడం ప్రయోజనాలను తెస్తుంది. అలా చేయడం మన సమస్యలను మనం అర్థంచేసుకునేందుకు సహాయపడుతుంది, అది తర్వాత అంత కఠినం అనిపించదు. స్పష్టమైన ప్రార్థనలు మన వ్యాకులతనుండి మనలను విడిపిస్తాయి. హన్నా ప్రార్థనకు జవాబు రాకముందే ఆమె అభయాన్ని పొందినట్లు భావించింది. మరియు “దుఃఖముఖిగా నుండుట మానెను.” (1 సమూయేలు 1:18) అంతేకాకుండ, నిర్దిష్టంగా ఉండడం మన ప్రార్థనల జవాబును మనం గుర్తించేందుకు మనం మెలుకువగా ఉండేటట్లు చేస్తుంది. “నేను నా ప్రార్థనలను ఎంత కచ్చితమైన మాటలతో చేస్తే, దాని జవాబు అంత స్పష్టంగా ఉంటుంది,” అని జర్మనీలో ఒక క్రైస్తవుడైన బెర్న్‌హార్డ్ చెబుతున్నాడు.
“నేను బాలుడను”
అయితే, తాను అర్హుడను కానని భావించే ఒక పనిని ఒక వ్యక్తి స్వీకరిస్తుంటే అతను మరొక రకమైన వ్యాకులతను అనుభవించవచ్చు. యెహోవా అనుగ్రహించిన బాధ్యతవల్ల మీరు కొన్నిసార్లు కలత చెందుతారా? లేక మీ పనికి మీరు అనర్హులుగా కొందరు మిమ్మల్ని దృష్టిస్తారా? యౌవనుడైన సొలొమోను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించబడినప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. కొందరు ప్రాముఖ్యమైన వ్యక్తులు మరెవరైన సింహాసనంపై ఉంటే బాగుంటుంది అని భావించారు. (1 రాజులు 1:5-7, 41-46; 2:13-22) తన పరిపాలనారంభంలో, ప్రార్థనలో సొలొమోను ఇలా విన్నవించాడు:
“నా దేవా యెహోవా, నీవు . . . నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; . . . నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయచేయుము.”—1 రాజులు 3:7-9.
సొలొమోను తన ప్రార్థనను యెహోవాతో తనకు గల సంబంధంపై, తనకు ఇవ్వబడిన ఆధిక్యతపై, తన పనిని సక్రమంగా నిర్వహించగల తన సామర్థ్యంపై కేంద్రీకరించాడు. అదే విధంగా, మన శక్తికి మించినది అని మనం భావించే ఏ పనైనా మనకు అప్పగించబడినట్లైతే, ఆ పనిని చేసేందుకు మనల్ని సన్నద్ధం చేయమని మనం దేవునికి విన్నవించుకోవాలి. ఈ క్రింది అనుభవాలను పరిశీలించండి:
“వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయంలో మరి గొప్ప బాధ్యతలను చేపట్టమని నన్ను కోరినప్పుడు, అసలు నాకా అర్హతలేదని నేను భావించాను. నాకంటే మంచి అర్హతలుగల, ఎంతో అనుభవంగల ఇతరులున్నారు. చాలా సమయం ప్రార్థనలో గడుపుతూ తర్వాతి రెండు వారాలవరకు నేను సరిగ్గా నిద్రపోలేదు. అది నాకు శక్తిని, అవసరమైన అభయాన్ని ఇచ్చింది” అని యుగ్నే వివరించారు.
పలువురికి సుపరిచితుడైన యౌవన స్నేహితుని ఆకస్మిక విషాదాంత మరణం తరువాత, అంత్యక్రియల ప్రసంగమివ్వమని రాయ్‌ని కోరడం జరిగింది. తప్పకుండా వందలాదిమంది హాజరౌతారు. రాయ్ ఏమి చేశాడు? “శక్తి కొరకు మరియు ప్రయోజనాత్మకమైన ఆలోచనలను వ్యక్తపర్చే మరియు ఓదార్పును అందించే సరైన పదజాలాన్ని కనుగొనేందుకు, నేను ఎన్నడూ అంతగా ప్రార్థించలేదు.”
సృష్టికర్త ‘కార్యములను త్వరపెడు’తుండగా మరియు ఆయన సంస్థ విస్తృతమౌతుండగా, తన సేవకులనేకులకు బాధ్యతలు అప్పగించబడడమొక సహజమైన పరిణామము. (యెషయా 60:22) మీరు ఇంకా ఎక్కువగా భాగం వహించాలని కోరబడినట్లైతే, మీకు అనుభవం, శిక్షణ లేక సామర్థ్య లేమిని యెహోవా భర్తీ చేయగలడనే అభయాన్ని కల్గివుండండి. మీరు కూడా సొలొమోను సమీపించినట్లే దేవున్ని సమీపించండి అప్పుడు ఆ పనిని మీరు నిర్వహించేందుకు ఆయన మిమ్మల్ని సన్నద్ధం చేస్తాడు.
“వారును ఏకమై యుండవలెను”
నేడు ఎదురయ్యే మూడవ పరిస్థితి, ప్రార్థనలో ఒక గుంపుకు ప్రాతినిధ్యం వహించడం. ఇతరుల కొరకు ప్రార్థన చేయమని కోరబడినప్పుడు, మనం దేని గురించి ప్రార్థించాలి? యోహాను 17వ అధ్యాయంలో రాసివున్న యేసు ప్రార్థనను పరిశీలించండి. మానవునిగా తన చివరి సాయంకాలమందు తన శిష్యుల సమక్షంలో ఆయన ఈ ప్రార్థన చేశాడు. తన పరలోక తండ్రికి ఆయన ఎలాంటి విన్నపాలను చేశాడు?
యేసు అందరికీ ఉన్న గమ్యాలను, అందరికీగల నిరీక్షణను నొక్కి చెప్పాడు. యెహోవా దేవుని నామం మహిమపర్చడాన్ని మరియు రాజ్యాన్ని గూర్చి తెలియజేయడాన్ని ప్రస్తావించాడు. లేఖనాధార జ్ఞానంపై ఆధారపడి, తండ్రితో మరియు కుమారునితో వ్యక్తిగత సంబంధాన్ని కల్గివుండే విలువను యేసు నొక్కి చెప్పాడు. లోకం నుండి వేరుగా ఉండే విషయాన్ని గూర్చి ఆయన మాట్లాడాడు, అది తన అనుచరులను వ్యతిరేకతకు సంసిద్ధులను చేసింది. తన శిష్యులను కాపాడి, నిజమైన ఆరాధనలో వారిని ఐక్యపర్చమని కూడా తన తండ్రిని క్రీస్తు కోరాడు.
అవును, యేసు ఐక్యతను నొక్కి చెప్పాడు. (యోహాను 17:20, 21) అదే సాయంకాలం ఇది జరుగక ముందు, శిష్యులు అపరిపక్వతతో పోట్లాడుకున్నారు. (లూకా 22:24-27) అయితే, ప్రార్థనలో క్రీస్తు వారిని నిందించేందుకు ప్రయత్నించలేదు కానీ ఐక్యపర్చేందుకు ప్రయత్నించాడు. అదే విధంగా, కుటుంబము మరియు సంఘ ప్రార్థనలు ప్రేమను పెంపొందించి, వ్యక్తుల మధ్యనున్న ఘర్షణను అధిగమింపజేసేదిగా ఉండాలి. ప్రాతినిధ్యం వహించేవారు ఐక్యత కల్గివుండాలి. —కీర్తన 133:1-3.
వినేవారు చివరిలో “ఆమేన్” లేక “అలా జరుగునుగాక” అని అన్నప్పుడు ఈ ఐక్యత స్పష్టమౌతుంది. ఇది జరిగేందుకు, అక్కడ చెప్పబడిన ప్రతి దాన్ని వారు అర్థం చేసుకోవాలి మరియు దాన్ని అంగీకరించాలి. కనుక, సమకూడిన వారిలో కొందరికి తెలియని విషయాన్ని ప్రార్థనలో ప్రస్తావించడం అసమంజసంగా ఉంటుంది. ఉదాహరణకు, ప్రార్థనలో ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహించే ఒక పెద్ద, తీవ్రంగా అస్వస్థులైన ఆత్మీయ సహోదరుడు లేక సహోదరి కొరకు యెహోవా ఆశీర్వాదాన్ని కోరవచ్చు. అయితే తాను ప్రాతినిధ్యం వహించేవారిలో అనేకులకు ఆ వ్యక్తి తెలిసివుండి, అతని అస్వస్థతను గూర్చి వినివుంటే అలా ప్రార్థించడం మంచిది.
గుంపులోని ప్రతి వ్యక్తి వ్యక్తిగత అవసరతలను, యేసు విడివిడిగా ప్రస్తావించలేదని కూడా గమనించండి. అలా చేయడం అంటే, కేవలం కొద్దిమంది వ్యక్తులకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించినట్లౌవుతుంది. ఏకాంత ప్రార్థనలో, వ్యక్తిగత శ్రద్ధలనేవి సరైన విషయమే, దాన్ని కావల్సినంత విస్తృతంగాను, కోరదగినంత సన్నిహితంగాను చేయవచ్చు.
విస్తృతమైన పరిధిలో సమకూడిన ప్రార్థనలో ప్రాతినిధ్యం వహించినప్పుడు, ఒక వ్యక్తి తన్ను తాను ఎలా సంసిద్ధుని చేసుకోవాలి? అనుభవం గల ఒక క్రైస్తవుడు ఇలా వివరిస్తున్నాడు: “దేని కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి, సహోదరులకు ఏ విన్నపాలు ఉండవచ్చును, వారి పక్షంగా ప్రస్తావించాల్సిన విన్నపాలు ఏమిటని నేను ముందుగానే ఆలోచిస్తాను. కీర్తించే పదజాలంతో సహా నా ఆలోచనలను నా మనస్సులో సరైన క్రమంలో పెట్టుకుంటాను. బహిరంగంగా ప్రార్థించేముందు, సహోదరులకు మర్యాదకరంగా ప్రాతినిధ్యం వహించేందుకు సహాయపడమని కోరుతూ నేను మౌనంగా ప్రార్థిస్తాను.”
మీ పరిస్థితులేమైనప్పటికీ, మీరు ఉన్నటువంటి పరిస్థితిలోనే ఎవరో ఒకరు చేసిన ప్రార్థనను మీరు బహుశ బైబిలునందు కనుగొంటారు. లేఖనాల్లో ఎన్నో రకాల ప్రార్థనలుండడం దేవుని ప్రేమపూర్వకమైన దయకు తార్కాణం. ఈ ప్రార్థనలను చదవడం, ధ్యానించడం మీరు మీ ప్రార్థనలను మెరుగుపర్చుకునేందుకు సహాయపడతాయి.
[5వ పేజీలోని బాక్సు]
బైబిలులోని గణనీయమైన ప్రార్థనలు
యెహోవా ప్రజలు అనేక సందర్భాల్లో ప్రార్థనలను చేశారు. ఈ క్రింది పరిస్థితుల్లో ఒకటి లేక రెండింటికి మీరు అనుకూలంగా ప్రతిస్పందించగలరా?
ఎలీయెజెరే వలె మీకు దేవుని నుండి నడిపింపు అవసరమా?—ఆదికాండము 24:12-14.
యాకోబువలె మీరు ముంచుకొచ్చిన అపాయంలో ఉన్నారా?—ఆదికాండము 32:9-12.
మోషే తెలుసుకున్నట్లు మీరు దేవున్ని మరింతగా తెలుసుకోగోరుతున్నారా?—నిర్గమకాండము 33:12-17.
ఏలీయా వలె మీరు వ్యతిరేకులను ఎదుర్కొంటున్నారా?—1 రాజులు 18:36, 37.
యిర్మీయావలె ప్రకటించడం మీకు కష్టమా?—యిర్మీయా 20:7-12.
దానియేలు అర్థించినట్లే మీరు మీ పాపాలను ఒప్పుకుని, క్షమాపణను అర్థించాలా?—దానియేలు 9:3-19.
యేసు శిష్యులు ఎదుర్కొన్నట్లుగా మీరు హింసను ఎదుర్కొంటున్నారా?—అపొస్తలుల కార్యములు 4:24-31.
వీటిని కూడా చూడండి: మత్తయి 6:9-13; యోహాను 17:1-26; ఫిలిప్పీయులు 4:6, 7; యాకోబు 5:16.
[6వ పేజీలోని బాక్సు]
లోతుగా పాతుకుపోయిన అలవాటుతో పోరాడుతున్నప్పుడు దేన్ని గూర్చి ప్రార్థించాలి
పునరావృతమయ్యే ఒక బలహీనతతో మీరు పోరాడుతున్నారా? బైబిలు నందు లిఖితమైన ప్రార్థనలు మీకు ఎలా ప్రయోజనకరమవ్వగలవు? తన స్వంత బలహీనతల విషయంలో వివిధ సమయాల్లో ప్రార్థించిన దావీదునుండి నేర్చుకోండి.
దావీదు ఇలా పాడాడు: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము.” (కీర్తన 139:23) అసమంజసమైన కోరికలూ భావోద్రేకాలూ ఉద్దేశాలను యెహోవా దేవుడు పరిశీలించాలన్నది దావీదు కోరిక. మరో మాటలో, పాపాన్ని నివారించేందుకు యెహోవా ఇచ్చిన సహాయాన్ని దావీదు పొందాడు.
అయినా దావీదు బలహీనతలు అతన్ని అధిగమించాయి, మరి ఆయన చాలా పెద్ద పాపం చేశాడు. ఇక్కడ మరలా, ప్రార్థన ఆయనకు సహాయపడింది—ఈసారి దేవునితో తన సంబంధాన్ని పునఃస్థాపించుకునేందుకు. కీర్తన 51:2 ప్రకారం దావీదు ఇలా అర్థించాడు: “నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.”
చెడు ఉద్దేశాలను నశింపజేసేందుకు మనం కూడా యెహోవా సహాయంకొరకు వినయంగా ప్రార్థించాలి. ఇది మనలో పాతుకుపోయిన బలహీనతను అధిగమించేందుకు మనకు శక్తిని ప్రధానం చేస్తుంది మరియు మనం పాపం చేయకుండా సహాయపడుతుంది. ఒకవేళ తప్పిపోయినట్లైతే, ఆ పోరాటాన్ని కొనసాగించేందుకు సహాయపడమనే యాచనలతో యెహోవాను మనం మరలా సమీపించాలి.
[7వ పేజీలోని చిత్రాలు]
ఒక గుంపు కొరకు చేసిన ప్రార్థనలు లేఖనాధార నిరీక్షణలను మరియు సామాన్య ఆత్మీయ గమ్యాలనూ నొక్కి చెప్పాలి