మైమోనిడెస్—యూదామతమును పునఃనిర్వచించిన మనిషి
“మోషే నుండి మోసెస్ వరకు, మోసెస్ వంటి వాడెవడునూ లేడు.” ఈ గూఢమైన సామెత 12వ శతాబ్దపు యూదా తత్త్వవేత్తయును, క్రోడీకరించువాడును, తాల్ముద్ మరియు లేఖనాల వ్యాఖ్యాతయునైన మోసెస్ బెన్మైమోన్ యెడల మెప్పును చూపిస్తుందని అనేకమంది యూదులకు తెలుసు, ఈయనను మైమోనిడెస్ అని మరియు రామ్‌బామ్ అని కూడా పిలుస్తారు.a నేడు అనేకులకు మైమోనిడెస్ ఎవరో తెలియదు, అయినా ఆయన రచనలు ఆయన కాలంలో యూదుల, ముస్లిమ్‌ల, మరియు చర్చి ఆలోచనా విధానంపై ఎంతో ప్రభావాన్ని చూపించాయి. ప్రాథమికమైన విధంగా, ఆయన యూదా మతాన్ని పునఃనిర్వచించాడు. మైమోనిడెస్ ఎవరు, అనేకమంది యూదులు అతనిని “రెండవ మోషేగా” ఎందుకు దృష్టిస్తారు?
మైమోనిడెస్ ఎవరు?
మైమోనిడెస్ 1135లో స్పెయిన్నందలి కోర్డొబాలో జన్మించాడు. దాదాపు అతని చిన్నప్పటి మతసంబంధమైన తర్ఫీదునంతా ఆయన తండ్రియైన మైమోన్ ఇచ్చాడు, ఆయన ప్రముఖ రబ్బీల కుటుంబంలోని ప్రఖ్యాతిగాంచిన పండితుడు. అల్మహద్లు 1148లో కోర్డొబాను స్వాధీనం చేసుకున్నప్పుడు యూదులు ఇస్లామ్ మతాన్ని స్వీకరించాలా లేక పారిపోవాలా అనే ఎంపిక చేసుకోవలసి వచ్చింది. దీనితో మైమోనిడెస్ కుటుంబం దీర్ఘకాలం సంచరించవలసి వచ్చింది. వారు 1160లో మొరొకోలోని ఫెజ్‌లో స్థిరపడ్డారు, అక్కడే ఆయన వైద్యునిగా తర్ఫీదును పొందాడు. ఆయన కుటుంబం 1165లో పాలస్తీనాకు పారిపోవలసి వచ్చింది.
అయితే, ఇశ్రాయేలులో పరిస్థితి అస్థిరంగా ఉంది. ఈ చిన్న యూదా సమాజం క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క మత యుద్ధాల నుండి అలాగే ముస్లిమ్ సైన్యాల నుండి ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. “పరిశుద్ధ దేశంలో” ఆరు నెలలు గడవక ముందే, ఐగుప్తునందలి కెయిరోలోని పాతనగరమైన ఫస్టాట్లో మైమోనిడెస్ మరియు కుటుంబం ఆశ్రయం పొందగల్గారు. ఇక్కడే మైమోనిడెస్ సామర్థ్యాలు పూర్తిగా గుర్తించబడ్డాయి. ఆయన 1177లో యూదా సమాజానికి అధినేత అయ్యాడు, 1185లో ప్రఖ్యాతి గాంచిన ముస్లిమ్ నాయకుడైన సాలాదీన్ సభలో వైద్యునిగా ఆయన నియమించబడ్డాడు. మైమోనిడెస్ 1204లో తన మరణం వరకు, ఈ రెండు స్థానాల్లోను కొనసాగాడు. ఆయన వైద్య నిపుణత అనేది ఎంతగా ప్రసిద్ధమైందంటే, అతి సుదూరంగావున్న ఇంగ్లాండునందలి ధైర్యశాలియగు రాజైన రిచర్డ్ కూడా మైమోనిడెస్ను తన వ్యక్తిగత వైద్యునిగా పొందాలని ప్రయత్నించాడని చెప్పబడుతుంది.
ఆయన ఏమి వ్రాశాడు?
మైమోనిడెస్ ప్రతిభావంతుడైన రచయిత. కాందిశీకునిగా ముస్లిమ్‌ల హింస నుండి తప్పించుకునే సమయంలో కమెంటరీ ఆన్ ది మిష్నా అనే తన గ్రంథంలోని ఎక్కువ భాగాన్ని ఆయన సంకలనం చేశాడు.b ఈ అరబిక్ రచన మిష్నాలోని అనేక పదాలను, తలంపులను విశదీకరించింది. కొన్నిసార్లు అది యూదా మతాన్ని గూర్చిన మైమోనిడెస్ తత్త్వశాస్త్ర వివరణలోనికి తప్పుదోవ పట్టేది. సన్హెడ్రీన్ అనే వ్యాసాన్ని వివరిస్తున్న భాగంలో మైమోనిడెస్ యూదా మత విశ్వాసం యొక్క 13 ప్రాథమిక విశ్వాస సూత్రాలను రూపొందించాడు. యూదా మతం క్రమానుసార నియమాలను లేదా విశ్వాసాల ప్రకటనను ఎన్నడూ నిర్వచించలేదు. ఇప్పుడు, మైమోనిడెస్ యొక్క 13 సూత్రాలు యూదుల నియమ సూత్రాల పరంపరకు మాదిరిగా మారింది.—బాక్స్, పుట 23 చూడండి.
మైమోనిడెస్ భౌతికమైన లేదా ఆత్మీయమైన అన్ని విషయాల యుక్తమైన క్రమాన్ని నిర్వచించడానికి ప్రయత్నం చేశాడు. ఆయన హేతుబద్ధమైన రుజువులని, యుక్తమని తలంచే వాటి ఆధారంగా ప్రతి ఒక్కదానికి వివరణలు కావాలని కోరుతూ, అంధ విశ్వాసాన్ని తిరస్కరించాడు. ఈ సహజమైన స్వభావం శ్రేష్ఠమైన పుస్తకాన్ని—మిష్నా తోరాను రచించడానికి నడిపింది.c
మైమోనిడెస్ రోజుల్లో యూదులు “తోరా” లేదా “ధర్మశాస్త్రము” అనేది మోషే వ్రాసిన లిఖిత మాటలనే కాకుండా, ధర్మశాస్త్రాన్ని గూర్చి గురువులు చేసిన వ్యాఖ్యానాలన్నింటిని కూడా సూచిస్తుందని శతాబ్దాలుగా దృష్టించారు. ఈ తలంపులు తాల్ముడ్లోను, తాల్ముడ్ను గూర్చిన రబ్బీల తీర్మానాల్లోను, రచనల్లోను లిఖించబడ్డాయి. ఇంత పెద్ద పరిమాణంలోని, సంస్థీకరించబడని ఈ సమాచారమంతా సగటు యూదుడు తన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే తీర్మానాలను చేయలేని వానిగా చేస్తుందని మైమోనిడెస్ గుర్తించాడు. అనేకులు రబ్బీల సాహిత్యాలన్నింటినీ జీవితాంతం అధ్యయనం చేసుకోలేక పోతున్నారు, దానిలో ఎక్కువ భాగము అరామిక్‌లో వ్రాయబడింది. మైమోనిడెస్ పరిష్కారం ఏంటంటే, ఆచరణాత్మక తీర్మానాలను నొక్కి చెబుతూ ఈ సమాచారాన్ని కూర్చి, ఒక్కో అంశము ప్రకారం వేరుచేసి, మరియు క్రమమైన విధానంలో వాటిని 14 పుస్తకాలుగా సంస్థీకరించటమే. ఆయన దాన్ని ఎంతో ఉన్నతంగా స్పష్టంగా, హెబ్రీ భాషలో ధారాళముగా వ్రాశాడు.
మిష్నా తోరా ఎంతటి ఆచరణాత్మకమైన మార్గదర్శి అంటే, అది తాల్ముడ్ స్థానాన్ని పూర్తిగా తీసుకుంటుందేమోనని యూదా నాయకులు భయపడ్డారు. అయితే, ఆ పుస్తకాన్ని తిరస్కరించినవారు కూడా దాని మహత్తరమైన పాండిత్యమును ఒప్పుకున్నారు. ఉన్నతంగా సంస్థీకరించబడిన ఈ నియమం విప్లవాత్మకమైన సాధనయే, అది సగటు మానవుడు ఇక ఏ మాత్రం చెప్పించుకోనవసరం లేని ఇముడ్చుకోనవసరం లేని విధంగా యూదా వ్యవస్థకు కొత్త ఊపిరినిచ్చింది.
తర్వాత, మైమోనిడెస్ మరొక పెద్ద పుస్తకం—ది గైడ్ ఫర్ ది పర్ప్లెక్స్డ్ కూడా వ్రాయడం ఆరంభించాడు. గ్రీకు మహాకావ్యాల అరబిక్ అనువాదముతో అనేకమంది యూదులు అరిస్టోటిల్ మరియు మరితర తత్త్వవేత్తలతో పరిచితులయ్యారు. తత్త్వశాస్త్రంతో బైబిలు పదాల అక్షరార్థ భావాన్ని పొందుపరచడం కష్టమని కనుగొని కొందరు అయోమయంలో పడ్డారు. ది గైడ్ ఫర్ ది పర్ప్లెక్స్డ్లో మైమోనిడెస్ అరిస్టోటిల్ను గొప్పగా ప్రశంసించాడు, ఆయన బైబిలు మరియు యూదా మత సారాంశాన్ని తత్త్వశాస్త్ర తలంపులకు మరియు తర్కశాస్త్రానికి పొందికగా ఉండే విధంగా వివరించడానికి ప్రయత్నించాడు.—1 కొరింథీయులు 2:1-5, 11-16 పోల్చండి.
మైమోనిడెస్ ఈ పెద్ద పుస్తకాలను, మరితర మత రచనలనే కాక, వైద్యశాస్త్ర మరియు ఖగోళశాస్త్ర రంగాల్లోను అధికారికంగా వ్రాశాడు. ఆయన విజయవంతమైన రచనలకు మరొక కారణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్సైక్లోపీడియా జూడైకా ఈ విధంగా వ్యాఖ్యానిస్తుంది: “లేఖారచనలో మైమోనిడెస్ లేఖలు చరిత్రను సృష్టించాయి. ఆయన మొదటి యూదా విలేఖరి, ఆయన ఉత్తరాలు విస్తృతంగా భద్రపరచబడ్డాయి. . . . ఆయన లేఖలు ఆయన చదువరుల హృదయాలను మనస్సులను ఆకట్టుకున్నాయి, ఆయన వారికి తగినట్లుగా ఉండేలా తన శైలిని మార్చేవాడు.”
ఆయన ఏమి బోధించాడు?
మైమోనిడెస్ తన 13 విశ్వాస సూత్రాల్లో, విశ్వాసాన్ని స్పష్టంగా సంక్షేపంగా వర్ణించాడు, అందులో కొన్ని లేఖనాధారమైనవి. అయినను, ఏడు, తొమ్మిది సూత్రాలు మెస్సీయాగా యేసుయందు లేఖనాధార విశ్వాసమనే సారాంశానికి విరుద్ధంగా ఉన్నాయి.d క్రైస్తవమత సామ్రాజ్యంలోని త్రిత్వంవంటి మతభ్రష్ట బోధలను, మతయుద్ధాల్లో జరిగిన రక్తపాతంతో ఉదాహరించబడిన పచ్చి వేషధారణను తీసుకుంటే, యేసు మెస్సీయాయేనా అనే వివాదాన్ని గూర్చి మైమోనిడెస్ మరెక్కువగా పరిశోధించక పోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.—మత్తయి 7:21-23; 2 పేతురు 2:1, 2.
మైమోనిడెస్ ఈ విధంగా వ్రాస్తున్నాడు: “[క్రైస్తవత్వం] కన్నా పెద్ద అభ్యంతర కారణం ఉండగలదా? ప్రవక్తలందరూ మెస్సీయాను గూర్చి ఇశ్రాయేలు విమోచకుడును మరియు దాని రక్షణకర్తయునని వర్ణించారు . . . [దానికి విరుద్ధంగా క్రైస్తవత్వం,] యూదులందరూ కత్తివాత చంపబడడానికి, వారి శేషము చెల్లాచెదరవ్వడానికి, అవమానించబడడానికి, తోరా మార్చబడడానికి, లోకంలోని అధిక సంఖ్యాకులు పాపం చేయడానికి, ప్రభువును గాక ఒక దేవుని సేవించడానికి కారణమయ్యింది.”—మిష్నే తోరా, “ది లాస్ ఆఫ్ కింగ్స్ అండ్ దేర్ వార్స్,” అధ్యాయం 11.
మైమోనిడెస్కు ఎంతో గౌరవం చూపించబడినప్పటికీ, అనేక మంది యూదులు ఆయన ముక్కుసూటిగా మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి ఆయనను నిర్లక్ష్యం చేయడానికే ఇష్టపడ్డారు. మర్మమైన యూదా మత ప్రభావం పెరుగుతున్న కొలది, యూదుల్లో జ్యోతిశ్శాస్త్రం మరింత ప్రసిద్ధి చెందుతున్నది. మైమోనిడెస్ ఇలా వ్రాశాడు: “జ్యోతిశ్శాస్త్రంలో మిళితమై, జ్యోతిశ్శాస్త్రజ్ఞులు నిశ్చయించిన ఘడియల ప్రకారం తమ పనులను చేసుకునేవాడు లేదా తమ ప్రయాణాలకు పథకం వేసుకునేవాడు కొరడాతో కొట్టబడాలి . . . ఈ విషయాలన్నీ అబద్ధాలు, మోసపూరితమైనవి . . . ఈ విషయాల్లో నమ్మేవాడు ఎవరైనా . . . మూఢుడు మరియు వివేకం లేనివాడు.”—మిష్నా తోరా, “లాస్ ఆఫ్ ఐడొలేట్రీ” అధ్యాయం 11, లేవీయకాండము 19:26; ద్వితీయోపదేశకాండము 18:9-13 పోల్చండి.
మైమోనిడెస్ మరొక ఆచరణను కూడా చాలా నిష్ఠూరంగా విమర్శించాడు: “[రబ్బీలు] వ్యక్తులు, సమాజాలు తమ కొరకు డబ్బు చెల్లించాలని నియమించారు. అది తమ బాధ్యతయని, సముచితమేనని వ్యక్తులు మరియు సమాజాలు మరీ వెర్రిగా తలంచేలా చేశారు . . . ఇదంతా తప్పు. తోరాలో గాని [తాల్ముడ్] జ్ఞానుల మాటల్లో గాని ఈ నమ్మకానికి మద్దతునిచ్చే ఒక్క పదం కూడా లేదు.” (కమెంటరీ ఆన్ ది మిష్నా, అవొట్ 4:5) ఈ రబ్బీలకు భిన్నంగా, మైమోనిడెస్ ఎన్నడూ మతపరమైన సేవలకు డబ్బు తీసుకోకుండా తనను తాను పోషించుకోడానికి వైద్యునిగా కష్టించి పనిచేశాడు.—2 కొరింథీయులు 2:17; 1 థెస్సలొనీకయులు 2:9 పోల్చండి.
యూదా మతం మరియు ఇతర విశ్వాసాలు ఎలా ప్రభావితమయ్యాయి?
యెరూషలేములోని హెబ్రీ విశ్వవిద్యాలయంలోని ఆచార్యుడు యషైయిహు లైబోవిట్స్ ఇలా అన్నాడు: “పూర్వీకుల మరియు ప్రవక్తల యుగం నుండి నేటి ప్రస్తుత యుగం వరకున్న యూదా చరిత్రలో మైమోనిడెస్ అతి శక్తిమంతుడైన వ్యక్తి.” ఎన్సైక్లోపీడియా జూడైకా ఇలా చెబుతుంది: “యూదా మత భవిష్యత్తు అభివృద్ధిపై గల మైమోనిడెస్ ప్రభావం అంచనా వేయజాలనంతటిది. . . . సి. చిర్నావిట్స్ ఇలా కూడా చెబుతున్నారు, మైమోనిడెస్ లేకపోతే, యూదా మతం వివిధ తెగలుగా మరియు విశ్వాసాలుగా ఛిన్నాభిన్నమైపోయేదే . . . విభిన్న దృక్పథాలను ఏకం చేయడం ఆయన సాధించిన మహత్కార్యము.”
యూదుల తలంపులను, క్రమమైన సహేతుకమైన తన స్వంత తలంపులను పునఃసంస్థీకరించడం ద్వారా మైమోనిడెస్ యూదామతాన్ని పునఃనిర్వచించాడు. విద్వాంసులు మరియు ప్రజలు ఈ నిర్వచనాన్ని మరింత ఆచరణాత్మకమైనదిగాను, ఆకర్షణీయంగాను ఉన్నట్లు కనుగొన్నారు. చివరికి అతని వ్యతిరేకులు కూడా మైమోనిడెస్ వివరించిన విధానాన్ని చాలా వరకు అంగీకరించారు. అనంతమైన వ్యాఖ్యానాలపై ఆధారపడవలసిన అవసరత నుండి యూదులను స్వతంత్రులుగా చేయడమే ఆయన రచనల ఉద్దేశమైనప్పటికి, త్వరలోనే ఆయన రచనలను గురించి దీర్ఘ వ్యాఖ్యానాలు వ్రాయబడ్డాయి.
ఎన్సైక్లోపీడియా జూడైకా ఇలా వ్యాఖ్యానిస్తుంది: “మైమోనిడెస్ . . . మధ్య యుగాల్లోని అగ్రగణ్యుడైన యూదా తత్త్వవేత్త, గైడ్ ఆఫ్ ది పర్ప్లెక్స్డ్ అనే ఆయన పుస్తకం యూదుడు రచించిన తత్త్వ సంబంధ పుస్తకాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది.” ది గైడ్ ఫర్ ది పెర్ప్లెక్స్డ్ అరబిక్‌లో వ్రాయబడినా, మైమోనిడెస్ జీవిత కాలంలోనే అది హెబ్రీ భాషలోనికి అనువదించబడింది, ఆ తర్వాత ఐరోపా అంతటా పఠనానికి లభ్యం చేస్తూ, లాటిన్లోకి వెంటనే అనువదించబడింది. దాని ఫలితంగా, మైమోనిడెస్ చేసిన అరిస్టోటిల్ తత్త్వశాస్త్రంతో యూదా తలంపుల అనుపమమైన సంశ్లేషణం త్వరలోనే క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క తలంపుల ముఖ్యప్రవాహంలోనికి ప్రవేశించింది. ఆ కాలంనాటి క్రైస్తవమత సామ్రాజ్యంలోని ఆల్బర్టస్ మాగ్నస్ మరియు థామస్ అక్వినాస్ వంటి విద్వాంసులు తరచూ మైమోనిడెస్ అభిప్రాయాలను సూచించేవారు. ఇస్లాం పండితులు కూడా ప్రభావితులయ్యారు. తర్వాత ఆర్థడోడ్స్ యూదా మతం నుండి పూర్తిగా వేరయ్యేలా బారుక్ స్పినోజా వంటి యూదా తత్త్వవేత్తలను కూడా మైమోనిడెస్ తత్త్వశాస్త్ర వివరణ ప్రభావితం చేసింది.
మైమోనిడెస్ను హేతువాద కాలానికి ముందున్న హేతువాద వ్యక్తిగా ఎంచవచ్చు. విశ్వాసమనేది సహేతుకతకు అనుగుణ్యంగా ఉండాలన్న ఆయన పట్టు ఇప్పటికీ విలువైన సూత్రమే. మతపర అంధత్వానికి వ్యతిరేకంగా శక్తివంతంగా మాట్లాడడానికి ఈ సూత్రం ఆయనను నడిపింది. అయితే, క్రైస్తవమత సామ్రాజ్యపు చెడు మాదిరి, అరిస్టోటిల్ తత్త్వశాస్త్ర ప్రభావము తరచూ బైబిలు సత్యానికి పొందికైన నిర్ధారణకు రావడం నుండి ఆయనను పూర్తిగా నివారించాయి. మైమోనిడెస్ సమాధిపై వ్రాయబడిన—“మోషే నుండి మోసెస్ వరకు, మోసెస్ వంటి వాడెవనూ లేడు” అనే వ్యాఖ్యానాన్ని అందరూ ఒప్పుకోకపోయినప్పటికీ, యూదా మత వ్యవస్థను ఆయన పునఃనిర్వచించాడు అని ఒప్పుకోవలసిందే.
[అధస్సూచీలు]
a “రామ్‌బామ్” అనేది ఒక హెబ్రీ సంక్షిప్త పదము, అది “రబ్బీ మోసెస్ బెన్ మైమోన్” అనే పదముల మొదటి అక్షరములతో ఏర్పడిన నామము.
b మిష్నా అనేది యూదులు మౌఖిక నియమమని తలస్తున్న దాని ఆధారితమైన రబ్బీల వ్యాఖ్యానాల సేకరణ. అది సా.శ. రెండవ శతాబ్దాంతంలోను, మూడవ శతాబ్ద ఆరంభంలోను లిఖిత రూపమున పెట్టబడింది. అది తాల్ముద్కు ఆరంభమయ్యింది. అదనపు సమాచారము కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్కార్పొరేటెడ్ ప్రచురించిన యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్, పుట 10 చూడండి.
c మిష్నా తోరా అనే పేరు ఒక హెబ్రీ పదము, అది ద్వితీయోపదేశకాండము 17:18 నుండి వచ్చింది, అంటే ధర్మశాస్త్ర ప్రతి, లేదా పునరుక్తి అని అర్థము.
d యేసు వాగ్దాన మెస్సీయా అనే రుజువు కొరకైన అదనపు సమాచారం కొరకు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్, ఇన్కార్పొరేటెడ్ ప్రచురించిన యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? అనే బ్రోషూర్, పుటలు 24-30 చూడండి.
[23వ పేజీలోని బాక్సు]
మైమోనిడెస్ యొక్క 13 విశ్వాస సూత్రాలుe
1. దేవుడే అన్నింటి సృష్టికర్త మరియు పరిపాలకుడు. ఆయన మాత్రమే అన్నింటిని చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు.
2. దేవుడు ఒక్కడే. ఆయన వంటి వాడు ఎవడును లేడు.
3. దేవునికి శరీరం లేదు. భౌతిక ధర్మాలు ఆయనకు వర్తించవు.
4. దేవుడే ఆది మరియు అంతము.
5. దేవునికి మాత్రమే ప్రార్థన చేయడం సముచితం. ఒకరు మరెవరికీ, మరి దేనికి ప్రార్థించలేరు.
6. ప్రవక్తల మాటలన్నీ సత్యము.
7. మోషే ప్రవచనం సంపూర్ణముగా సత్యం. ఆయనకు పూర్వమైనా, తరువాతైనా ప్రవక్తలందరిలో ఆయనే ప్రముఖుడు.
8. ఇప్పుడు మన దగ్గరున్న తోరా అంతా మోషేకివ్వబడినదే.
9. తోరా మార్చబడదు, ఇక మరొకదాన్ని దేవుడెన్నడూ ఇవ్వడు.
10. దేవునికి మానవులందరి చర్యలు, తలంపులు తెలుసు.
11. దేవుని ఆజ్ఞలను గైకొనువారికి ఆయన ప్రతిఫలమిస్తాడు, మరియు ఆయనకు వ్యతిరేకంగా అతిక్రమించువారిని శిక్షిస్తాడు.
12. మెస్సీయా వస్తాడు.
13. మృతులు తిరిగి జీవానికి తేబడతారు.
[అధస్సూచీలు]
e మైమోనిడెస్ కమెంటరీ ఆన్ ది మిష్నా (సన్హెద్రీన్ 10:1) అనే తన పుస్తకంలో ఈ సూత్రాలను నిర్వచించాడు. తర్వాత యూదా మతం వాటిని అధికారిక నియమాలుగా స్వీకరించింది. యూదుల ప్రార్థనా పుస్తకంలో కనిపిస్తున్న సమాచారం క్లుప్తంగా వ్రాయబడింది.
[21వ పేజీలోని చిత్రసౌజన్యం]
Jewish Division / The New York Public Library / Astor, Lenox, and Tilden Foundations