“పాత నిబంధన” లేక “హెబ్రీ లేఖనాలు”—ఏది?
నేడు క్రైస్తవ మత సామ్రాజ్యంలో, బైబిలు యొక్క హెబ్రీ/అరామిక్ మరియు గ్రీకు భాషలోని భాగాలను వర్ణించడానికి “పాత నిబంధన” మరియు “క్రొత్త నిబంధన” అనే పదాలను వాడడం సాధారణ అలవాటు. అయితే ఈ పదాలను ఉపయోగించడానికి ఏదైనా బైబిలు ఆధారం ఉందా? మరి ఏ కారణాల వల్ల యెహోవాసాక్షులు సాధారణంగా తమ ప్రచురణలలో వాటిని ఉపయోగించడాన్ని వర్జిస్తారు?
నిజమే, కింగ్ జేమ్స్ వర్షన్, అలాగే మార్టిన్ లూథర్ మొదటి అనువాదమైన జర్మన్ సెప్టెంబర్టెస్టమెంట్ (1522) వంటి మరితర పాత అనువాదాల ప్రకారం, 2 కొరింథీయులు 3:14 నిజంగా ఈ ఆచరణకు మద్దతునిస్తున్నట్లు కనిపిస్తుంది. కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ వచనం ఈ విధంగా చదవబడుతుంది: “అయితే వారి మనస్సులు గ్రుడ్డివయ్యాయి: ఎందుకంటే, క్రీస్తునందు ఆ ముసుగు తీసివేయబడినప్పటికీ, నేటి వరకు పాత నిబంధనను చదువునప్పుడు అదే ముసుగు తీసివేయబడకుండా ఉంది.”
అయితే, ఇక్కడ అపొస్తలుడు “పాత నిబంధన” అని సాధారణంగా పిలువబడే 39 పుస్తకాలను గూర్చి మాట్లాడుతున్నాడా? ఇక్కడ “నిబంధన” అని అనువదించబడిన గ్రీకు పదము డయాథెకె. ప్రఖ్యాతిగాంచిన జర్మన్ వేదాంత సర్వసంగ్రహ నిఘంటువైన టేయోలోజిషె రేయోలెన్క్లోపాడీ 2 కొరింథీయులు 3:14ను గూర్చి వ్యాఖ్యానిస్తూ, ఆ వచనంలోని ‘పాత డయాథెకెను చదువునప్పుడు,’ అనేది తరువాతి వచనంలోని “మోషే గ్రంథాన్ని చదవడం” వంటిదేనని చెప్పింది. అలాగే ‘పాత డయాథెకె’ మోషే ధర్మశాస్త్రాన్ని లేదా పంచగ్రంథాన్ని సూచిస్తుంది. ఇది క్రైస్తవుల పూర్వపు ప్రేరేపిత లేఖన సమిష్టిని నిజంగా సూచించదు.
అపొస్తలుడు హెబ్రీ లేఖనాల్లో ఒక భాగం మాత్రమైన, పంచగ్రంథంలో మోషే వ్రాసిన పాత ధర్మశాస్త్ర ఒడంబడికను సూచిస్తున్నాడు; ఆయన హెబ్రీ మరియు అరామిక్ లేఖనాలన్నిటిని సూచించడం లేదు. అంతేకాక, సా.శ. మొదటి శతాబ్దంలోని ప్రేరేపిత క్రైస్తవ లేఖనాలన్నీ కూడా ఒక “క్రొత్త నిబంధనగా” రూపొందుతాయని ఆయన సూచించడం లేదు, ఎందుకంటే, ఈ పదం బైబిలులో ఎక్కడా కనిపించడం లేదు.
ఇక్కడ పౌలు ఉపయోగించిన డయాథెక్ అనే గ్రీకు పదం యొక్క అసలు అర్థం “ఒడంబడిక” అని కూడా గమనించవలసి ఉంది. (అదనపు సమాచారం కొరకు 1984లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇన్కార్పొరేటెడ్ ప్రచురించిన రెఫరెన్సులతో కూడిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం), అనుబంధం (అపెన్డిక్స్) 7E, పుట 1585 చూడండి.) అనేక ఆధునిక అనువాదాలు “పాత నిబంధన” అనడంకన్నా మరింత సరైన విధంగా “పాత ఒడంబడిక” అని చదవబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో “నేషనల్ కాథోలిక్ రిపోర్టర్” ఈ విధంగా చెప్పింది: “‘పాత నిబంధన’ అనే పదం తప్పనిసరిగా అల్పమైనది మరియు వాడుకలో లేనిది అనే భావాన్ని సృష్టిస్తుంది.” అయితే, బైబిలు అనేది నిజంగా ఒకే పుస్తకం, దాని ఏ భాగం వాడుకలో లేనిది లేదా “పురాతనమైనది” కాదు. దాని సందేశం హెబ్రీ భాషా భాగంలోని మొదటి పుస్తకం నుండి, గ్రీకు భాషా భాగంలోని చివరి పుస్తకం వరకు పొందికగా ఉంది. (రోమీయులు 15:4; 2 తిమోతి 3:16, 17) కాబట్టి తప్పుడు ఊహలపై ఆధారపడిన ఈ పదాలను వర్జించడానికి మనకు సరైన కారణాలున్నాయి, మరియు “హెబ్రీ లేఖనములు” మరియు “క్రైస్తవ గ్రీకు లేఖనములు” అనే మరింత సరైన పదాలను ఉపయోగించడానికి మనం ఇష్టపడతాము.