కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 2/15 పేజీలు 27-30
  • సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిలో ఒక పాఠం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిలో ఒక పాఠం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రతికూల ఉపదేశమివ్వడంలో ఒక పాఠం
  • ఉపదేశం ఎలా ఇవ్వాలి
  • కష్టతరమైన పరిస్థితులలో ప్రవర్తించకూడని విధాలు
  • యెహోవా అతని గాయాన్ని మాన్పాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • వేరేవాళ్లకు సలహా ఇవ్వడానికి యోబు పుస్తకం సహాయం చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యోబు యొక్క ప్రతిఫలం—నిరీక్షణకు ఒక మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యోబు యెహోవా నామాన్ని ఘనపర్చాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 2/15 పేజీలు 27-30

సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిలో ఒక పాఠం

యోబుకున్న అన్ని సమస్యలను, ఇంతవరకు కేవలం కొద్దిమంది మాత్రమే ఎదుర్కోవలసి వచ్చింది. కొద్ది సమయంలోనే, ఆయన తన సంపదను, జీవనోపాధిని కోల్పోవడం వల్ల, తన పిల్లలందరి దుఃఖకరమైన మరణం వల్ల, చివరికి చాలా బాధాకరమైన వ్యాధి వల్ల కృంగిపోయాడు. స్నేహితులు మరియు బంధువులచే వెలివేయబడ్డాడు, “దేవున్ని దూషించి మరణము కమ్మని” ఆయన భార్య ఆయనను పురికొల్పింది.—యోబు 2:9; 19:13, 14.

అయితే, అలాంటి శ్రమలను ఎదుర్కొంటున్న ఎవరికైనా యోబు విశేషమైన ప్రోత్సాహానికి మూలం. ఆయన శ్రమ యొక్క అనుకూలమైన ఫలితం, మనం వ్యక్తిగత లాభంకంటే నిజమైన దైవభక్తితో పురికొల్పబడినప్పుడు, కష్టాలు ఉన్నప్పటికీ సహనం కలిగివుండడం యెహోవా హృదయాన్ని ఆనందపరుస్తుందని చూపిస్తుంది.—యోబు 1, 2 అధ్యాయాలు; 42:10-17; సామెతలు 27:11.

ఈ బైబిలు వృత్తాంతము, సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే దానిలో విలువైన పాఠాలను కూడా కలిగివుంది. శ్రమలను ఎదుర్కొంటున్నవారికి ఎలా ఉపదేశించాలి, ఎలా ఉపదేశించకూడదు అనే ప్రభావవంతమైన మాదిరులను అందజేస్తుంది. అంతేగాక, యోబు యొక్క స్వంత అనుభవం, మనం కష్టతరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మనం సమతూకంగా ప్రతిస్పందించడానికి సహాయం చేయగలదు.

ప్రతికూల ఉపదేశమివ్వడంలో ఒక పాఠం

దురదృష్టకర సమయంలో సానుభూతి చూపించడానికి బదులు, పుండు మీద కారం చల్లే వ్యక్తికి ‘యోబును ఓదార్చ వచ్చినవాడు’ అనే పదం పర్యాయ పదమయ్యింది. కాని యోబు యొక్క ముగ్గురు సహచరులు తమకై తాము తగిన విధంగా పేరు సంపాదించుకున్నప్పటికీ, వారి ఉద్దేశాలు పూర్తిగా చెడ్డవని మనం ధృవీకరించకూడదు. వారి పొరపాటైన దృక్పథాలకు అనుగుణ్యంగా, యోబుకు సహాయం చేయాలని వారికి కొంతమేరకు ఉండివుండవచ్చు. వారు ఎందుకు విఫలమయ్యారు? యోబు యథార్థతను పాడుచేయాలని నిశ్చయించుకున్న సాతాను ఉపకరణాలుగా వారు ఎలా తయారయ్యారు?

పాపం చేసే వారికే శ్రమ వస్తుందనే తప్పుడు ఊహపై వారు దాదాపు తమ ఉపదేశాన్నంతటిని ఆధారం చేసుకున్నారు. తన మొదటి ప్రసంగంలో ఎలీఫజు ఇలా అన్నాడు: “నిరపరాధియైన యొకడు ఎప్పుడైన నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా? నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు.” (యోబు 4:7, 8) నిరపరాధులకు కష్టాలు రావని ఎలీఫజు పొరపాటుగా విశ్వసించాడు. యోబు అనేక శ్రమలలో ఉన్నాడు గనుక ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటాడని ఆయన తర్కించాడు.a అలాగే బిల్దదు, జోఫరు కూడా యోబు తన పాపాల గురించి పశ్చాత్తాపపడాలని నొక్కిచెప్పారు.—యోబు 8:5, 6; 11:13-15.

దైవిక జ్ఞానానికి బదులు వ్యక్తిగత ఉద్దేశాలను వ్యక్తం చేయడం ద్వారా యోబు యొక్క సహచరులు అతన్ని మరింత బాధపర్చారు. ‘దేవునికి తన సేవకులయందు విశ్వాసం లేదని,’ యోబు నీతిమంతుడా కాదా అన్నది యెహోవాకు నిజంగా అవసరం లేదని కూడా ఎలీఫజు అన్నాడు. (యోబు 4:18; 22:2, 3) అంతకంటే మరింత నిరుత్సాహకరమైన లేక మరింత అసత్యమైన వ్యాఖ్యానాన్ని ఊహించడం కష్టం! ఆశ్చర్యపడనక్కర్లేని విధంగా, యెహోవా ఈ అపనింద గురించి ఆ తర్వాత ఎలీఫజును మరియు అతని సహచరులను దూషించాడు. ఆయనిలా అన్నాడు: “మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు.” (యోబు 42:7) అయితే మరింత నష్టం కలుగజేసే ప్రకటన ఇంకా రానైయుంది.

చివరికి ఎలీఫజు సూటియైన నిందలు మోపేంతవరకు కూడా వెళ్లాడు. తాను అపరాధినని యోబు అంగీకరించేలా అతడు చేయలేకపోయాడు గనుక, యోబు చేసివుండవచ్చునని ఆయన భావించిన పాపాలను సృష్టించాలని అతడు ప్రయత్నించాడు. ఎలీఫజు ఇలా అడిగాడు: “నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.” (యోబు 22:5-7) ఈ నిందలు పూర్తిగా నిరాధారమైనవి. యోబు “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై”న వ్యక్తియని యెహోవా తానే వర్ణించాడు.—యోబు 1:8.

తన వ్యక్తిగత యథార్థతపై చేయబడుతున్న ఈ దాడులకు యోబు ఎలా ప్రతిస్పందించాడు? స్పష్టంగా, అవి అతడికి కొంతవరకు బాధను, నిరాశను కలిగించాయి, కాని ఈ నిందలు అసత్యమని నిరూపించాలనే దృఢ నిశ్చయత కలిగేలా కూడా చేశాయి. వాస్తవానికి, అతడు తనను తాను ఎంతగా ఉన్నతపర్చుకోవడం ప్రారంభించాడంటే, ఒకవిధంగా, అతడు యెహోవాను ఆయన స్థానాన్ని బట్టి నిందించడం ప్రారంభించాడు. (యోబు 6:4; 9:16-18; 16:11, 12) ఇమిడివున్న నిజమైన అంశాలు మరుగునపడిపోయాయి, యోబు నీతిమంతుడైన వ్యక్తా, కాదా అనే అంశం వ్యర్థమైన చర్చగా తయారయ్యింది. ఈ నాశనకరమైన ఉపదేశ అంకము నుండి క్రైస్తవులు ఏ పాఠాలను నేర్చుకోవచ్చు?

1. ఒక సహోదరుని సమస్యలు ఆయన చేసుకున్న దానివల్లే వచ్చాయని ఒక ప్రేమగల క్రైస్తవుడు మొదట్లోనే నమ్మడు. నిజమైనవైనా లేక ఊహించినవైనా, పూర్వపు పొరపాట్లను గూర్చిన కఠినమైన విమర్శ, ధైర్యం కోల్పోకుండా కొనసాగడానికి పోరాడుతున్న వ్యక్తిని పూర్తిగా నిరుత్సాహపర్చగలదు. ధైర్యము చెడినవారిని ‘ఓదార్చడం’ అవసరం కాని తిట్టడం కాదు. (1 థెస్సలొనీకయులు 5:14) అధ్యక్షులు “గాలికి మరుగైనచోటువలె” ఉండాలని యెహోవా కోరుతున్నాడు కాని, ఎలీఫజు, బిల్దదు, జోఫరు వంటి ‘అబద్ధ ఆదరణకర్తలుగా’ ఉండాలని కాదు.—యెషయా 32:2; యోబు 16:2.

2. స్పష్టమైన సాక్ష్యం లేకుండా మనమెన్నడూ నిందించకూడదు. ఎలీఫజు చేసినటువంటి వినికిడి మాటలు లేక ఊహలు ఉపదేశం ఇవ్వడానికి సరైన ఆధారాలు కావు. ఉదాహరణకు, ఒక పెద్ద, ఒక తప్పుడు నింద వేసినట్లయితే, అతడు బహుశా తన విశ్వసనీయతను కోల్పోవచ్చు, మానసిక వేదన కలిగించవచ్చు. అలాంటి తప్పుదోవ పట్టిన ఉపదేశాన్ని వినడాన్ని బట్టి యోబు ఎలా భావించాడు? “శక్తిలేనివానికి నీవు ఎంత సహాయము చేసితివి?” అనే వ్యంగ్యమైన వ్యాఖ్యానంతో అతడు తన కోపానికి తావిచ్చాడు. (యోబు 26:2) ఒక శ్రద్ధగల అధ్యక్షుడు సమస్యను ఇంకా హీనం చేయడు కాని, ‘వడలిన చేతులను బలపరచును.’—హెబ్రీయులు 12:12.

3. ఉపదేశం వ్యక్తిగత ఉద్దేశాలపై కాదుగాని, దేవుని వాక్యంపై ఆధారపడి ఉండాలి. యోబు సహచరుల వాదములు తప్పైనవి, నాశనకరమైనవి. యోబును యెహోవాకు సన్నిహితం చేయడానికి బదులు, ఆయనను ఆయన పరలోకపు తండ్రి నుండి వేరు చేసే అడ్డంకు ఉందని ఆయన అనుకునేలా వారు చేశారు. (యోబు 19:2, 6, 8) మరో వైపున, బైబిలును నైపుణ్యంగా ఉపయోగించడం విషయాలను సరిచేయగలదు, ఇతరులను ప్రోత్సహించగలదు, నిజమైన ఓదార్పునివ్వగలదు.—లూకా 24:32; రోమీయులు 15:4; 2 తిమోతి 3:16; 4:2.

యోబు గ్రంథం కొన్ని అవరోధాలను గుర్తించడానికి క్రైస్తవులకు సహాయం చేస్తుంది, ప్రభావవంతమైన ఉపదేశాన్ని ఎలా ఇవ్వాలనేదానికి ఉపయోగకరమైన పాఠాన్ని కూడా ఇస్తుంది.

ఉపదేశం ఎలా ఇవ్వాలి

యోబు యొక్క ముగ్గురు సహచరులు ఇచ్చిన ఉపదేశం నుండి ఎలీహు యొక్క ఉపదేశం, అది కలిగివున్న సంగతుల విషయంలోను, ఎలీహు యోబుతో వ్యవహరించిన దాని విషయంలోను పూర్తి వేరుగా ఉంది. అతడు యోబు పేరును ఉపయోగించి, అతనితో స్నేహితునిలా మాట్లాడాడు కాని, యోబు యొక్క న్యాయాధిపతిగా కాదు. “యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము. దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే.” (యోబు 33:1, 6) యోబు యొక్క నీతియుక్తమైన చర్యను బట్టి అతన్ని ఎలీహు త్వరగా మెచ్చుకున్నాడు కూడా. అతడు యోబునిలా ధైర్యపర్చాడు: “నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను.” (యోబు 33:32) ఉపదేశాన్ని దయాపూర్వకమైన మాదిరిలో ఇవ్వడమే గాక ఇతర కారణాలనుబట్టి కూడా ఎలీహు విజయవంతమయ్యాడు.

ఇతరులు మాట్లాడడం ఆపేవరకు సహనంతో ఎదురుచూడడం ద్వారా ఎలీహు ఉపదేశం ఇవ్వడానికి ముందు అంశాన్ని చక్కగా గ్రహించుకోగలిగాడు. యోబు నీతియుక్తమైన వ్యక్తి అన్నది నిజమే అయితే యెహోవా ఆయనను ఎందుకు శిక్షించాడు? ఎలీహు ఇలా అన్నాడు: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నీతిమంతులను ఆయన చూడకపోడు.”—యోబు 34:10; 36:7.

యోబు యొక్క నీతి నిజంగా ముఖ్యాంశమైయుండెనా? ఎలీహు యోబు ధ్యాసను ఒక అసమతుల్యమైన దృక్కోణం వైపుకు మరల్చాడు. ఆయనిలా వివరించాడు: “దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుచున్నావు కదా, ఆకాశము వైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.” (యోబు 35:3, 5) మేఘాలు మన కంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లే, యెహోవా మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతమైనవి. ఆయన పనులు చేసే విధానాన్ని మనం తీర్పు తీర్చే స్థితిలో లేము. ఎలీహు ఇలా ముగించాడు: “అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు. తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏ మాత్రమును లక్ష్యపెట్టడు.”—యోబు 37:24; యెషయా 55:9.

ఎలీహు యొక్క సరైన ఉపదేశం యోబు యెహోవా నుండే స్వయంగా మరింత ఉపదేశం పొందడానికి మార్గం ఏర్పరచింది. వాస్తవానికి, 37వ అధ్యాయమందు వ్రాయబడివున్న “దేవుని యొక్క ఆశ్చర్యకరమైన పనులను” గూర్చిన ఎలీహు యొక్క పునర్విమర్శకు, 38 నుండి 41 అధ్యాయాలలో వ్రాయబడివున్నట్లు యోబుతో యెహోవా మాట్లాడిన మాటలకు మధ్య అద్భుతమైన సారూప్యం ఉంది. సాక్ష్యాధారంగా, ఎలీహు విషయాలను యెహోవా దృక్కోణం నుండి చూశాడు. (యోబు 37:14) ఎలీహు యొక్క చక్కని మాదిరిని క్రైస్తవులు ఎలా అనుకరించగలరు?

ఎలీహు వలె, ప్రాముఖ్యంగా పర్యవేక్షకులు తాము కూడా అపరిపూర్ణులమేనని గుర్తుంచుకొని సానుభూతితో, దయగా ఉండడం అవసరం. ఉపదేశం ఇవ్వడానికి ముందు వాస్తవాలను తెలుసుకోడానికి, అంశాలను అర్థం చేసుకోడానికి వారు జాగ్రత్తగా వినడం మంచిది. (సామెతలు 18:13) అంతేగాక, బైబిలును, లేఖనాధారిత ప్రచురణలను ఉపయోగించడం ద్వారా, వారు యెహోవా దృక్కోణం పైచేయిగా ఉండేలా చేయగలరు.—రోమీయులు 3:4.

పెద్దలకు ఈ ఆచరణాత్మకమైన పాఠాలను అందజేయడమే కాక, యోబు గ్రంథం మనం సమస్యలను సమతూకమైన రీతిలో ఎలా ఎదుర్కోవచ్చో నేర్పిస్తుంది.

కష్టతరమైన పరిస్థితులలో ప్రవర్తించకూడని విధాలు

తన వేదన చేత నాశనం చేయబడి, తన అబద్ధ ఆదరణకర్తలచేత విసుగు చెంది, యోబు దుఃఖంగా, నిరాశగా అయిపోయాడు. ఆయనిలా మూల్గాడు: “నేను పుట్టిన దినము లేకపోవును గాక . . . నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది.” (యోబు 3:3; 10:1) సాతాను మూలకారకుడని తెలియక అతడు దేవుడే తనకు బాధలు కలిగిస్తున్నాడని భావించాడు. నీతిమంతుడైన తను బాధపడవలసి రావడం ఎంతో అన్యాయంగా అనిపించింది. (యోబు 23:10, 11; 27:3; 30:20, 21) ఇతర విషయాలు గ్రహించకుండా ఈ దృక్పథం యోబుకు గ్రుడ్డితనం కలుగజేసి, మానవజాతితో దేవుని వ్యవహారాలను అతడు విమర్శించడానికి దారితీసింది. యెహోవా ఇలా అడిగాడు: “నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?”—యోబు 40:8.

బహుశా యోబు చేసినట్లుగానే, మనం కష్టాన్ని ఎదుర్కొనప్పుడు మన సత్వర ప్రతిస్పందన ఏమిటంటే, మనం బలి అయినట్లు భావిస్తాము. సాధారణ ప్రతిస్పందన ఏమిటంటే ఇలా అడగటమే, ‘నేనే ఎందుకు అనుభవించాలి? నాకంటే హీనంగా ఉన్న ఇతరులు సమస్యలు లేని జీవితాన్ని ఆనందంగా ఎందుకు అనుభవించాలి? దేవుని వాక్యంపై ధ్యానముంచడం ద్వారా మనం ఈ విధమైన ప్రతికూల తలంపులను ఎదుర్కొనవచ్చు.

యోబు వలె కాకుండా, మనం ఇమిడివున్న గొప్ప అంశాలను గ్రహించుకొనగలిగే స్థితిలో ఉన్నాము. సాతాను “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అన్నది మనకు తెలుసు. (1 పేతురు 5:8) యోబు గ్రంథం తెలియజేస్తున్నట్లుగా, మనకు సమస్యలు తీసుకురావడం ద్వారా మన యథార్థతను పాడుచేయడానికి అపవాది సంతోషిస్తాడు. మనం కేవలం అనుకూల సమయంలో మాత్రమే యెహోవా సాక్షులమనే తన నిందను నిరూపించడానికి దృఢనిశ్చయత కలిగివున్నాడు. (యోబు 1:9-11; 2:3-5) యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చి తద్వారా అపవాది అబద్ధికుడని నిరూపించే ధైర్యం మనకుంటుందా?

యేసు మరియు లెక్కలేనంతమంది విశ్వాసులైన యెహోవా సేవకుల ఉదాహరణలు ఈ విధానంలో ఏదో ఒక విధమైన శ్రమ అనివార్యమేనని మనకు చూపిస్తున్నాయి. తనను అనుసరించాలంటే తన శిష్యులు ‘తమ కాడి నెత్తుకొనే’ వారై ఉండాలని యేసు చెప్పాడు. (లూకా 9:23) మన వ్యక్తిగత “కాడి” అంటే యోబు సహించినలాంటి కష్టాలు—అనారోగ్యం, ప్రియమైన వారి మరణం, వేదన, ఆర్థిక కష్టం, లేక అవిశ్వాసుల నుండి వ్యతిరేకత వంటి ఒకటి లేక అనేకం అయివుండగలవు. మనం ఏ విధమైన సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ, దానికి ఒక అనుకూలమైన అంశం ఉండగలదు. మన పరిస్థితులను మన సహనాన్ని, యెహోవా యెడల గల స్థిరమైన భక్తిని ప్రదర్శించడానికి ఒక అవకాశంగా మనం దృష్టించవచ్చు.—యాకోబు 1:2, 3.

యేసు అపొస్తలులు ఆ విధంగానే ప్రతిస్పందించారు. పెంతెకొస్తు పండుగ అయిన వెంటనే వారు యేసును గురించి ప్రకటించి నందుకు కొట్టబడ్డారు. నిరుత్సాహపడడానికి బదులు, వారు “ఆనందంగా” తమ మార్గాన వెళ్లారు. కేవలం శ్రమ ఉన్నందుకే వారు ఆనందించలేదు గాని, వారు “ఆ నామము [క్రీస్తు యొక్క] కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున” కూడా ఆనందించారు.—అపొస్తలుల కార్యములు 5:40, 41.

మన కష్టాలన్నీ కూడా యెహోవా సేవ చేస్తున్నందుకు మాత్రమే రాకపోవచ్చు. కనీసం కొంతమేరకు మన సమస్యలు స్వయంకృతమైనవి కూడా కావచ్చు. లేదా బహుశా, మన స్వంత తప్పేమి లేకుండానే, సమస్య మన ఆత్మీయ సమతుల్యాన్ని ప్రభావితం చేయవచ్చు. పరిస్థితి ఏదైనప్పటికీ, యోబు వంటి దీన స్వభావం కలిగివుండడం మనం ఎక్కడ పొరపాటు చేశామో తెలుసుకోడానికి సహాయం చేస్తుంది. యోబు యెహోవా యెదుట ఇలా అంగీకరించాడు: “ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని.” (యోబు 42:3) ఈ విధంగా తన పొరపాట్లను గుర్తించే వ్యక్తి, భవిష్యత్తులో అలాంటి కష్టాలు రాకుండా జాగ్రత్త పడగలడు. సామెత చెబుతున్నట్లుగా, “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును.”—సామెతలు 22:3.

మరింత ప్రాముఖ్యంగా, మన సమస్యలు చిరకాలం ఉండవని యోబు గ్రంథం మనకు గుర్తుచేస్తుంది. బైబిలు ఇలా చెబుతుంది: “సహించినవారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొనియున్నారు.” (యాకోబు 5:11) నేడు తన సేవకుల యథార్థతకు కూడా యెహోవా అలాగే ప్రతిఫలమిస్తాడని మనం నమ్మవచ్చు.

“మునుపటి సంగతులు” అంటే, ప్రతివిధమైన సమస్యలు గతించిపోయే కాలం కొరకు మనం కూడా ఎదురుచూస్తాము. (ప్రకటన 21:4) ఆ దినం వచ్చే వరకు, యోబు గ్రంథం మనం సమస్యలను జ్ఞానంతోను, మనస్థైర్యంతోను ఎదుర్కోడానికి మనకు సహాయం చేసే విలువైన నడిపింపుగా పనిచేస్తుంది.

[అధస్సూచీలు]

a “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని బైబిలు తెలియజేస్తుంది, అంటే దీని భావం ఒక వ్యక్తి బాధ దైవిక శిక్ష వల్ల కలిగిందని కాదు. (గలతీయులు 6:7) సాతాను ఆధిపత్యం వహించే ఈ లోకంలో, దుష్టుల కంటే నీతిమంతులు తరచూ ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. (1 యోహాను 5:19) యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 10:22) అనారోగ్యం మరియు ఇతర విధాలైన దురదృష్టాలు దేవుని నమ్మకమైన సేవకులకెవరికైనా సంభవించవచ్చు.—కీర్తన 41:3; 73:3-5; ఫిలిప్పీయులు 2:25-27.

[28వ పేజీలోని చిత్రం]

“నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము.” ఆ విధంగా ఎలీహు, మనుష్యుని మార్గాలకంటే దేవుని మార్గాలు ఉన్నతమైనవని తెలుసుకోడానికి యోబుకు సహాయం చేశాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి