నిజమైన ఆరాధికుల గొప్ప సమూహము—వారు ఎక్కడనుండి వచ్చారు?
“ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి(న), గొప్పసమూహము . . . సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను . . . నిలువబడియుండిరి.”—ప్రకటన 7:9.
1. ప్రకటనలోని ప్రవచనార్థక దర్శనాలు మనకు ఈ నాడు ఎందుకు ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయి?
సా.శ. మొదటి శతాబ్దం అంతానికల్లా, యెహోవా సంకల్పంతో ముడివడిన అద్భుతమైన సంఘటనల దర్శనాలను అపొస్తలుడైన యోహాను చూశాడు. ఆ దర్శనంలో ఆయన చూసిన కొన్ని విషయాలు యిప్పుడు నెరవేరుతున్నాయి. మిగిలినవి సమీప భవిష్యత్తులో నెరవేరబోతున్నాయి. ఇవన్నీ కూడా, సర్వ సృష్టి యెదుట తన నామమును పరిశుద్ధపర్చాలనే యెహోవా దివ్య సంకల్పం యొక్క నాటకీయ నెరవేర్పుచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. (యెహెజ్కేలు 38:23; ప్రకటన 4:11; 5:13) అంతేకాకుండ, మనలోని ప్రతి ఒక్కరి జీవిత ఉత్తరాపేక్షలు అందులో చేరివున్నాయి. అదెలా?
2. (ఎ) అపొస్తలుడైన యోహాను తన నాల్గవ దర్శనంలో ఏమి చూశాడు? (బి) ఈ దర్శనాన్ని గూర్చిన ఏ ప్రశ్నలను మనం పరిశీలించబోతున్నాము?
2 ప్రకటన దర్శనాల పరంపర నందు నాల్గవ దానిలో, “దేవుని దాసుల” నొసళ్లపై ముద్రించేవరకు నాశనకర వాయువులను దూతలు పట్టుకొని ఉండడం యోహాను చూశాడు. ఆ తర్వాత ఆయన ఎంతో ఉప్పొంగింపజేసే పురోభివృద్థియైన—యెహోవాను ఆరాధించడంలో మరియు ఆయన కుమారుని గౌరవించడంలో ఐక్యమైన, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము”ను చూశాడు. వీరు, మహా శ్రమల నుండి వచ్చిన ప్రజలని యోహానుతో చెప్పడం జరిగింది. (ప్రకటన 7:1-17) ‘మన దేవుని దాసులుగా’ వర్ణించబడినవారెవరు? మరి శ్రమలను తప్పించుకున్న “గొప్ప సమూహములో” ఎవరుంటారు? మీరు వారిలో ఒకరై ఉంటారా?
‘మన దేవుని దాసులు’ ఎవరు?
3. (ఎ) యోహాను 10:1-15 నందు తన అనుచరులతో తనకు గల సంబంధాన్ని యేసు ఎలా ఉదహరించాడు? (బి) యేసు తన బలి మరణం ద్వారా తన గొఱ్ఱెలకు ఏమి సాధ్యపర్చాడు?
3 తన మరణానికి సుమారు నాలుగు నెలల క్రితం, యేసు తనను గూర్చి “మంచి కాపరి”గా, ఎవరికైతే తన జీవాన్ని అర్పించాడో ఆ అనుచరులను “గొఱ్ఱెలు”గా చెప్పాడు. సాదృశ్యమైన గొఱ్ఱెల దొడ్డిలో తాను కనుగొన్న గొఱ్ఱెలను గూర్చి మరియు ఆ తర్వాత ఆయన ప్రత్యేకమైన శ్రద్ధనివ్వడం గూర్చి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. (యోహాను 10:1-15)a ప్రేమపూర్వకంగా, వారు తమ పాపమును మరణమునుండి స్వతంత్రులయ్యేందుకు అవసరమైన విమోచనా మూల్యాన్ని అందిస్తూ, యేసు తన గొఱ్ఱెల నిమిత్తం తన ప్రాణాన్ని అప్పగించాడు.
4. యేసు యిక్కడ చెప్పిన దాని ప్రకారంగా గొఱ్ఱెలుగా మొదట సమకూర్చబడిన వారెవరు?
4 అయితే, దాన్ని చేసేముందు మంచి కాపరిగా యేసు తానుగా శిష్యులను సమకూర్చాడు. యేసు ఉపమానంలోని “ద్వారపాలకుడైన” బాప్తిస్మమిచ్చు యోహాను, ఆయనకు మొదటి వారిని పరిచయం చేశాడు. ‘అబ్రాహాము’ సంకీర్ణ ‘సంతానమందు’ భాగమయ్యే అవకాశానికి ప్రతిస్పందించిన ప్రజలకొరకు యేసు చూస్తున్నాడు. (ఆదికాండము 22:18; గలతీయులు 3:16, 29) ఆయన వారి హృదయాల్లో పరలోక రాజ్యం యెడల మెప్పుదలను వృద్ధిచేశాడు, అంతేకాకుండ తన పరలోక తండ్రి యింట వారికొరకు స్థలాన్ని సిద్ధంచేసేందుకు వెళుతున్నానని ఆయన వారికి హామీనిచ్చాడు. (మత్తయి 13:44-46; యోహాను 14:2, 3) ఆయన యుక్తంగా ఇలా చెప్పాడు: “బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.” (మత్తయి 11:12) ఆ గమ్యాన్ని చేరుకునేందుకుగాను ఆయన్ను అనుసరిస్తున్న వీరు, యేసు చెప్పిన గొఱ్ఱెల దొడ్డిలో ఉన్నారని తేలింది.
5. (ఎ) ప్రకటన 7:3-8 నందు సూచించబడిన ‘మన దేవుని దాసులు’ ఎవరు? (బి) ఆత్మీయ ఇశ్రాయేలీయులతో ఆరాధించేందుకు యింకా అనేకులు చేరుతారని ఏది చూపుతుంది?
5 ప్రకటన 7:3-8 నందు, ఆ పరలోక గమ్యాన్ని విజయవంతంగా చేరుకున్నవారు ‘మన దేవుని దాసులు’ అని కూడా సూచించబడ్డారు. (1 పేతురు 2:9, 16 చూడండి.) అక్కడ ప్రస్తావించబడిన 1,44,000 మంది కేవలం సహజ యూదులేనా? యేసు యిచ్చిన ఉపమానంలోని సూచనార్థక గొఱ్ఱెల దొడ్డిలోని వారు కేవలం యూదులేనా? కచ్చితంగా కాదు; వారు దేవుని ఆత్మీయ ఇశ్రాయేలీయ సభ్యులు, మరి వారందరూ అబ్రాహాము ఆత్మీయ సంతానంలో క్రీస్తుతో సహవసిస్తున్నారు. (గలతీయులు 3:28, 29; 6:16; ప్రకటన 14:1, 3) నిస్సందేహంగా, కచ్చితంగా స్థిరపర్చబడిన సంఖ్య పూర్తెయ్యే సమయం చివరికి వస్తుంది. అప్పుడేమి జరుగుతుంది? బైబిలు ప్రవచించినట్లుగానే ఇతరులు—గొప్ప సమూహంలోని వారు—యెహోవాను ఆరాధించడంలో ఈ ఆత్మీయ ఇశ్రాయేలీయులతో చేరుతారు.—జెకర్యా 8:23.
“వేరే గొఱ్ఱెలు”—వారు అన్య క్రైస్తవులా?
6. యోహాను 10:16 ఏ పురోగతిని సూచిస్తుంది?
6 యోహాను 10:7-15 నందు ఒక గొఱ్ఱెల దొడ్డిని గూర్చి ప్రస్తావించిన తర్వాత, యిలా అంటూ యేసు మరొక గుంపును వెలుగులోకి తెచ్చాడు: “ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును.” (యోహాను 10:16) ఆ “వేరే గొఱ్ఱెలు” ఎవరు?
7, 8. (ఎ) వేరే గొఱ్ఱెలు అన్య క్రైస్తవులకు చెందినవారనే ఆలోచన, తప్పుడు విషయాలపై ఆధారపడివుంది? (బి) వేరే గొఱ్ఱెలు ఎవరనే విషయాన్ని మనం అర్థంచేసుకోవడంపై, భూమి కొరకు దేవునికి గల సంకల్పాలను గూర్చిన ఏ వాస్తవాలు ప్రభావం కల్గివుండాలి?
7 క్రైస్తవమత సామ్రాజ్య వ్యాఖ్యాతలు, వేరే గొఱ్ఱెలు అంటే అన్య క్రైస్తవులనీ, ముందు సూచించబడిన గొఱ్ఱెల దొడ్డి ధర్మశాస్త్రనిబంధన క్రిందనున్న యూదులను సూచిస్తుందని, మరి ఆ రెండు గుంపులూ పరలోకానికి వెళతాయనే దృక్పథాన్ని సామాన్యంగా గైకొన్నారు. కానీ, ధర్మశాస్త్ర నిబంధన దానికి రక్షణ గోడలుగా ఉన్న యూదా గొఱ్ఱెల దొడ్డిలోకి ప్రవేశించేందుకు ద్వారాన్ని తెరచే ద్వారపాలకుని అవసరముండే బయటివానిలా యేసు రాలేదు. ఆయన యూదునిగానే జన్మించాడు, అంతేకాకుండ జన్మతః ఆయన ధర్మశాస్త్రనిబంధన క్రింద ఉన్నాడు. (గలతీయులు 4:4, 5) ఇంకా, పరలోక జీవితాన్ని ప్రతిఫలంగా పొందబోయే అన్య క్రైస్తవులుగా వేరే గొఱ్ఱెలను దృష్టించే వారు, దేవుని సంకల్పంలోని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిగణలోకి తీసుకోవడంలో విఫలులౌతున్నారు. యెహోవా మొదటి మానవులను సృజించి, వారిని ఏదేను వనంలో ఉంచినప్పుడు, ఈ భూమి నిండివుండాలనీ అది అంతా ఒక పరదైసుగా ఉండాలనీ, దాని మానవ పరిరక్షకులు—తమ సృష్టికర్తను గౌరవించి, ఆయనకు విధేయులై ఉండాలన్న షరతుపై ఆధారపడి జీవితాన్ని నిరంతరం అనుభవిస్తారనే తన సంకల్పాన్ని ఆయన స్పష్టం చేశాడు.—ఆదికాండము 1:26-28; 2:15-17; యెషయా 45:18.
8 ఆదాము పాపం చేసినప్పుడు, యెహోవా సంకల్పానికి ఏ ఆటంకం కల్గలేదు. ఆదాము ప్రశంసించలేని దాన్ని అనుభవించే అవకాశాన్ని ఆదాము సంతానానికి దేవుడు ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేశాడు. జనాంగాలన్నిటికి ఆశీర్వాదాలను లభ్యపర్చే ఒక విమోచకుడైన సంతానాన్ని కల్గజేస్తానని యెహోవా ప్రవచించాడు. (ఆదికాండము 3:15; 22:18) భూమ్మీద ఉన్న మంచి ప్రజలందరూ పరలోకానికి కొనిపోబడతారని ఆ వాగ్దాన భావం కాదు. యేసు తన అనుచరులకు ఇలా ప్రార్థించాలని నేర్పాడు: “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9, 10) యోహాను 10:1-16 నందు నమోదు చేయబడిన ఉపమానాన్ని చెప్పిన కొద్ది కాలానికి ముందు, తన తండ్రి కేవలం ఒక ‘చిన్నమందకు’ మాత్రమే పరలోక రాజ్యాన్ని ఇచ్చేందుకు అంగీకరించాడని యేసు తన శిష్యులతో చెప్పాడు. (లూకా 12:32, 33) తన గొఱ్ఱెల పక్షంగా తన ప్రాణాన్ని అర్పించుకొన్న ఒక మంచికాపరిగా ఆయనను గూర్చిన ఉపమానాన్ని మనం చదివినప్పుడు, తన పరలోక రాజ్యానికి చెందిన భూసంబంధమైన అనుయాయులయ్యే వారిని, తన ప్రేమపూర్వక శ్రద్ధ క్రిందికి యేసు తీసుకువచ్చే అధికసంఖ్యాకులను మనం పరిగణలోనికి తీసుకోకపోవడం తప్పవుతుంది.—యోహాను 3:16.
9. పద్దెనిమిది వందల ఎనభైనాలుగు తొలినాళ్లలో వేరే గొఱ్ఱెల గుర్తింపును గూర్చి బైబిలు విద్యార్థులు ఏమని అర్థంచేసుకున్నారు?
9 పద్దెనిమిదివందల ఎనభైనాలుగు తొలినాళ్లకల్లా, దేవుని ఆది సంకల్పం నెరవేరే పరిస్థితుల్లో ఈ భూమిపై జీవించే అవకాశం అనుగ్రహింపబడిన ప్రజలుగా వేరే గొఱ్ఱెలను కావలికోట (ఆంగ్లం) గుర్తించింది. యేసు భూ పరిచర్యకు ముందు జీవించి మరణించినవారు ఈ వేరే గొఱ్ఱెల్లో కొందరు ఉంటారని ఆ తొలి బైబిలు విద్యార్థులు గ్రహించారు. అయితే, వారు స్పష్టంగా అర్థంచేసుకోలేని కొన్ని వివరాలున్నాయి. ఉదాహరణకు, అభిషక్తులందరూ తమ పరలోక బహుమానాన్ని పొందిన తర్వాత వేరే గొఱ్ఱెలను సమకూర్చడం జరుగుతుందని వారు భావించారు. అయినప్పటికీ, వేరే గొఱ్ఱెలు కేవలం అన్య క్రైస్తవులు కారని వారు నిశ్చయంగా గ్రహించారు. అన్ని జనాంగాలు, జాతులకు చెందిన ప్రజలయిన అన్యులు మరియు యూదులు, ఇరువురు వేరే గొఱ్ఱెల్లో ఒకరయ్యే అవకాశం తెరవబడింది.—అపొస్తలుల కార్యములు 10:34, 35 పోల్చండి.
10. తన వేరే గొఱ్ఱెలని యేసు నిజంగా దృష్టించే వారిగా మనం ఉండేందుకు మన విషయంలో ఏది వాస్తవమైవుండాలి?
10 యేసు యిచ్చిన వివరణకు సరిపడినట్లుగానే, వేరే గొఱ్ఱెలు, ఏ జాతి లేక ఏ మతం ప్రాతిపదికపై వచ్చిన వారైనప్పటికీ యేసుక్రీస్తును తమ మంచి కాపరిగా గుర్తించే ప్రజలై ఉండాలి. దానిలో ఏమి యిమిడివుంది? గొఱ్ఱెల స్వభావాన్ని తెల్పే లక్షణాలైన దీనత్వాన్ని వారు ప్రదర్శిస్తూ, వాటిలా నడిపింపును అందుకునే యిష్టతను కల్గివుండాలి. (కీర్తన 37:11) చిన్నమంద విషయంలో అది ఎలా వాస్తవమో, అలాగే వారు ‘అతని [మంచికాపరి] స్వరమెరగాలి’ అంతేకాకుండ తమను ప్రభావితం చేయాలనుకునే వారు తమను ప్రక్కకు నడిపేందుకు అనుమతించకూడదు. (యోహాను 10:4; 2 యోహాను 9, 10) యేసు తన గొఱ్ఱెల నిమిత్తం ప్రాణాన్ని యివ్వడంలో ఆయన చేసినదాని ప్రాముఖ్యతను వారు గుణగ్రహించాలి, మరి ఆ ఏర్పాటు నందు పూర్తి విశ్వాసాన్ని ఉంచాలి. (అపొస్తలుల కార్యములు 4:12) యెహోవాకు మాత్రమే పవిత్ర సేవను అందించమని, రాజ్యమును మొదట ఎడతెగక వెదకమని, లోకమునుండి వేరైయుండమని, అలాగే ఒకరియెడల ఒకరు స్వయం త్యాగ ప్రేమను కనపర్చమని మంచి కాపరి ఉద్బోధించినప్పుడు ఆయన స్వరాన్ని ‘వినాలి.’ (మత్తయి 4:10; 6:31-33; యోహాను 15:12, 13, 19) తన వేరే గొఱ్ఱెలు అని యేసు దృష్టించే వారిని గూర్చిన వర్ణనకు మీరు సరిగ్గా సరిపోతారా? మీరలా కావాలని కోరుకుంటారా? నిజంగా యేసు యొక్క వేరే గొఱ్ఱెలు అయ్యేవారికి ఎంత అమూల్యమైన బాంధవ్యం ఏర్పడుతోందో కదా!
రాజ్య అధికారం యెడల గౌరవము
11. (ఎ) తన ప్రత్యక్షత సమయంలోని సూచనల్లో, గొఱ్ఱెలు మేకలనుగూర్చి యేసు ఏమని చెప్పాడు? (బి) యేసు సూచించిన సహోదరులు ఎవరు?
11 పై ఉపమానమునిచ్చిన అనేక నెలల తర్వాత, యేసు మరలా యెరూషలేముకు వచ్చాడు. ఒలీవ కొండ మీద కూర్చుని దిగువనున్న ఆలయ ప్రాంతాన్ని చూస్తూ, ‘తన రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనల’ వివరాలను తన శిష్యులకు అందించాడు. (మత్తయి 24:3) ఆయన గొఱ్ఱెల సమకూర్పును గూర్చి మరలా మాట్లాడాడు. ఇతర విషయాలతో సహా ఆయన యిలా చెప్పాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన యెదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును.” ఈ దృష్టాంతంలో, తన ‘సహోదరులతో’ వ్యవహరించిన విధానమును బట్టి రాజు వారి యెడల అవధానమివ్వడం లేక యివ్వకపోవడంపై ఆధారపడివుంటాయని యేసు కనపర్చాడు. (మత్తయి 25:31-46) ఈ సహోదరులెవరు? వారు ఆత్మవల్ల జన్మించిన క్రైస్తవులు అలా వారు “దేవుని కుమారులు.” యేసు దేవుని ఆది సంభూతుడు. కనుక, వారు క్రీస్తు సహోదరులు. వారు, ప్రకటన 7:3 నందు ప్రస్తావించబడిన “దేవుని దాసులు,” క్రీస్తుతో సహా పరలోక రాజ్యాన్ని పంచుకునేందుకు గాను మానవజాతిలోనుండి ఎన్నుకోబడినవారు.—రోమీయులు 8:14-17.
12. క్రీస్తు సహోదరులతో ప్రజలు వ్యవహరించే విధం ఎందుకు ఎంతో ప్రాముఖ్యత గలది?
12 రాజ్యపు ఈ వారసులతో యితర మానవులు వ్యవహరించే విధానం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు, యెహోవా ఎలా దృష్టిస్తారో మీరూ వారిని అలా దృష్టిస్తారా? (మత్తయి 24:45-47; 2 థెస్సలొనీకయులు 2:13) అభిషక్తుల యెడల ఒక వ్యక్తి దృక్పథం, యేసుక్రీస్తు యెడల విశ్వసర్వాధిపతియైన ఆయన తండ్రి యెడల అతని దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.—మత్తయి 10:40; 25:34-46.
13. బైబిలు విద్యార్థులు 1884 నందు గొఱ్ఱెలు మేకలను గూర్చిన దృష్టాంతాన్ని ఎంతమట్టుకు అర్థంచేసుకున్నారు?
13 ఆగస్టు 1884 సంచికలో, ఈ దృష్టాంతంలోని “గొఱ్ఱెలు” భూమ్మీద పరిపూర్ణజీవితమును అనుభవించే ఉత్తరాపేక్షను తమ ఎదుట కల్గివున్నవారేనని కావలికోట (ఆంగ్లం) సరిగ్గా సూచించింది. క్రీస్తు తన మహిమాన్విత పరలోక సింహాసనమునుండి పరిపాలిస్తున్న సమయానికి కూడా ఈ దృష్టాంతం వర్తిస్తుందని అర్థంచేసుకోవడం జరిగింది. అయినప్పటికీ, అక్కడ వివరించిన వేరుపర్చే పనిని ఆయన ఎప్పుడు ప్రారంభిస్తాడు లేక అది ఎంత కాలంవరకూ కొనసాగుతుంది అన్న విషయాలను ఆ సమయంలో వారు స్పష్టంగా అర్థంచేసుకోలేదు.
14. యేసు ప్రవచనార్థక దృష్టాంతం ఎప్పుడు నెరవేరుతుంది అన్న విషయాన్ని గుణగ్రహించేందుకు 1923 సమావేశము నందు యివ్వబడిన బహిరంగ ప్రసంగం బైబిలు విద్యార్థులకు ఎలా సహాయపడింది?
14 అయితే, 1923లో అప్పటి వాచ్‌టవర్ సొసైటి అధ్యక్షుడైన జె.ఎఫ్. రూథర్‌ఫోర్డ్ ఒక సమావేశ ప్రసంగంలో, గొఱ్ఱెలు మేకల దృష్టాంతం నెరవేరే సమయాన్ని స్పష్టపర్చాడు. ఎందుకు? ఒక కారణమేంటంటే, రాజు సహోదరులు—వారిలో కనీసం కొందరు—యింకా భూమ్మీద ఉంటారు. మానవుల్లో కేవలం ఆత్మవల్ల జన్మించిన ఆయన అనుచరులు మాత్రమే నిజంగా ఆయన సహోదరులని పిలవబడగలరు. (హెబ్రీయులు 2:10-12) యేసు వర్ణించిన రీతుల్లో తమకు మంచి చేసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తూ వీరు వెయ్యేండ్ల పరిపాలన సమయమంతటిలోనూ భూమ్మీద ఉండరు.—ప్రకటన 20:6.
15. (ఎ) యేసు దృష్టాంతంలో గొఱ్ఱెలను సరిగా గుర్తించేందుకు బైబిలు విద్యార్థులకు ఏ పురోభివృద్ధి తోడ్పడింది? (బి) రాజ్యాన్ని గూర్చి తమకు గల మెప్పుదలను గొఱ్ఱెలు ఎలా నిరూపించాయి?
15 పందొమ్మిదివందల యిరవైమూడు నందు యివ్వబడిన ఆ ప్రసంగంలో, ప్రభువు వివరించిన గొఱ్ఱెలు మేకలకు సరిగ్గా సరిపడే వారిని గుర్తించేందుకు ప్రయత్నం చేయడం జరిగింది, అయితే ఆ దృష్టాంతం యొక్క భావమంతా స్పష్టమయ్యే ముందు యితర విషయాలు అర్థంచేసుకోవల్సిన అవసరముంది. తర్వాతి సంవత్సరాల్లో, ఈ ప్రాముఖ్యమైన వివరణలను తన సేవకుల దృష్టికి యెహోవా క్రమంగా తెచ్చాడు. పందొమ్మిదివందల యిరవై ఏడులో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” భూమ్మీదనున్న ఆత్మాభిషక్త క్రైస్తవులందరని స్పష్టంగా అర్థంచేసుకోవడం దీనిలో యిమిడివుంది; అంతేకాకుండ యెహోనాదాబు యెహూతో చేసినట్లుగా 1932లో యెహోవా అభిషక్త సేవకులతో సన్నిహితంగా సహవసిస్తున్నామని ధైర్యంగా ప్రవచించడాన్ని గుణగ్రహించాల్సిన అవసరముంది. (మత్తయి 24:45; 2 రాజులు 10:15) ఆ సమయమందు, ప్రకటన 22:17 ఆధారంగా ప్రత్యేకంగా ఈ గొఱ్ఱెవంటి వారు, రాజ్య వర్తమానాన్ని యితరులకు తీసుకు వెళ్లడంలో భాగంవహించేందుకు ప్రోత్సహించబడ్డారు. మెస్సియా రాజ్యం విషయంలో వారి మెప్పుదల, వారు ప్రభువు అభిషక్తుల యెడల మానవత్వపు కనికరాన్ని కనపర్చడమే కాకుండ, క్రీస్తు ద్వారా తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకుని, ఆయన అభిషక్తులతో సన్నిహితంగా సహవసిస్తూ వారు చేసే పనిలో ఉత్సాహంగా భాగం వహించేందుకు వారిని కదిలిస్తుంది. మీరూ దాన్ని చేస్తున్నారా? అలా చేసేవారితో రాజు యిలా చెబుతాడు: “నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.” ఆ రాజ్య భూపరిధిలో వారి ఎదుట పరిపూర్ణ నిత్యజీవపు గొప్ప ఉత్తరాపేక్ష ఉంటుంది.—మత్తయి 25:34, 46.
“గొప్ప సమూహము”—వారు ఎక్కడికి వెళ్తుతున్నారు?
16. (ఎ) ప్రకటన 7:9 నందు చెప్పిన గొప్ప సమూహమును గూర్చి తొలి బైబిలు విద్యార్థులకు ఏ తప్పుడు అభిప్రాయముండేది? (బి) ఎప్పుడు మరియు దేని ఆధారంగా వారి దృక్పథం సరిచేయబడింది?
16 ప్రకటన 7:9, 10 నందలి గొప్ప సమూహము, యోహాను 10:16 నందున్న వేరే గొఱ్ఱెలకూ మరియు మత్తయి 25:33 నందు పేర్కొనబడిన గొఱ్ఱెలకూ భిన్నమైనదని నమ్మేవారు. ఎందుకంటే వారు ‘సింహాసనము యెదుట నిలువబడివున్నారు’ అని బైబిలు చెబుతోంది కనుక, వారు క్రీస్తుతో సహవారసులుగా సింహాసనాలపైనుండి పరిపాలించకుండ, పరలోకంలో సింహాసనం ఎదుట రెండవ స్థానంలో ఉంటారని భావించబడేది. వారు తక్కువ నమ్మకంగల క్రైస్తవులుగా, నిజమైన స్వయం-త్యాగ స్ఫూర్తిని కనపర్చని వారిగా దృష్టించబడేవారు. ఆ ఆలోచన 1935 నందు సరిచేయబడింది.b మత్తయి 25:31, 32 వంటి వచనాల వెలుగులో ప్రకటన 7:9ని పరిశీలించడం, ఈ భూమ్మీది ప్రజలు “సింహాసనం యెదుట” ఉండగలరని స్పష్టపర్చింది. అంతేకాకుండ నమ్మకంగా ఉండే విషయంలో దేవునికి రెండు విధులు లేవని అది చూపింది. ఆయన అంగీకారంపొందగల ప్రతి ఒక్కరూ ఆయన యెడల తమకు గల యథార్థతను కాపాడుకోవాలి.—మత్తయి 22:37, 38; లూకా 16:10.
17, 18. (ఎ) భూమ్మీది నిత్యజీవాన్ని అనుభవించేందుకు నిరీక్షిస్తున్న వారిలో 1935 నుండి వచ్చిన గొప్ప పెరుగుదలకు ఏది కారణమైంది? (బి) ఏ ప్రాముఖ్యమైన పనిలో గొప్ప సమూహంవారు ఆసక్తిగా పాల్గొంటున్నారు?
17 అనేక సంవత్సరాలుగా, భూమిని గూర్చిన దేవుని వాగ్దానాలను గూర్చి యెహోవా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు. పందొమ్మిది వందల యిరవైలలో జరుగుతుందని అపేక్షించినదాని వల్ల, “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అని ప్రకటించారు. అయితే, ఆ సమయంలో జీవం విషయంలో దేవుని ఏర్పాట్లను గైకొన్న వారు లక్షల్లో లేరు. సత్యాన్ని అంగీకరించిన వారిలో అనేకులకు పరిశుద్ధాత్మ పరలోక జీవిత నిరీక్షణను కల్గించింది. ప్రత్యేకంగా 1935 తర్వాత, ఒక విశేషమైన మార్పు సంభవించింది. అంటే కావలికోట భూమిపైని నిత్యజీవ నిరీక్షణను నిర్లక్ష్యం చేసిందని కాదు. ఎన్నో దశాబ్దాలుగా యెహోవా సేవకులు దీన్ని గూర్చి మాట్లాడారు, మరి బైబిలు వర్ణనలకు సరితూగే వారి కొరకు వెతికారు. అయితే యెహోవా నియామక కాలంలో, వీరు తమను తాము బయల్పర్చుకునేలా ఆయన చూశాడు.
18 అనేక సంవత్సరాలుగా జ్ఞాపకార్థదినానికి హాజరైనవారిలో అనేకులు చిహ్నాల్లో పాలుపంచుకున్నారని లభ్యమవుతున్న నివేదికలు చూపుతున్నాయి. అయితే, 1935 తర్వాత 25 సంవత్సరాల్లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యేవారి సంఖ్య అందులో భాగం వహించేవారికంటే నూరంతలకు అకస్మాత్తుగా పెరిగింది. వీరు ఎవరు? వీరు గొప్ప సమూహములో సభ్యులు కాబోయేవారు. స్పష్టంగా, వారిని సమకూర్చి, రాబోతున్న మహాశ్రమను తప్పించుకునేందుకు వారిని సిద్ధపర్చేందుకు యెహోవా సమయం సమీపించి ఉంది. ముందుగా చెప్పినట్లుగా, వారు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలోనుండియు” వస్తారు. (ప్రకటన 7:9) యేసు ప్రవచించిన పనిలో వారు ఆసక్తిదాయకంగా పొల్గొంటున్నారు. ఆయన ఇట్లనెను: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతర్వాత అంతము వచ్చును.”—మత్తయి 24:14.
[అధస్సూచీలు]
a మే 15, 1946 మరియు జూలై 15, 1980 కావలికోటలను (ఆంగ్లం) చూడండి.
b కావలికోట (ఆంగ్లం) 1935 ఆగస్టు 1, మరియు 15.
మీరేమని వ్యాఖ్యానిస్తారు?
◻ ప్రకటన 7వ అధ్యాయంలోని దర్శనం ఎందుకు ప్రత్యేక ఆసక్తిని కల్గినదై ఉంటుంది?
◻ యోహాను 10:16 నందలి వేరే గొఱ్ఱెలు అన్య క్రైస్తవులకు మాత్రమే ఎందుకు పరిమితం కారు?
◻ వేరే గొఱ్ఱెలను గూర్చిన బైబిలు వివరణకు సరితూగే వారి విషయంలో ఏది నిజమై ఉండాలి?
◻ గొఱ్ఱెలు మేకల దృష్టాంతం రాజ్యాధికారానికి చూపవల్సిన గౌరవాన్ని ఎలా ఉన్నతపరుస్తుంది?
◻ ప్రకటన 7:9 నందలి గొప్ప సమూహమును సమకూర్చేందుకు యెహోవా సమయం ఎప్పుడు సమీపించిందని ఏది చూపుతోంది?