ఆయన దైవిక నడిపింపును అంగీకరించాడు
మీ సంరక్షణలో ఒక పరిపూర్ణ పిల్లవాణ్ణి ఉంచి వాన్ని సరైన విధంగా పెంచాలని మీ నుండి అపేక్షించారని అనుకోండి. అది ఎంతటి సవాలుగా ఉంటుంది! ఏ అపరిపూర్ణ మానవుడైనా ఆ పనిని ఎలా చేయగలడు? కేవలం దైవిక నడిపింపును అంగీకరించి, అనుదిన జీవితంలో దాన్ని అనువర్తించడం వల్లనే.
సరిగ్గా ఆ పనినే, యేసును పెంచిన తండ్రియైన యోసేపు చేశాడు. యోసేపును గూర్చిన ఎన్నో వివరాలున్న క్రైస్తవేతర ప్రతులకు విరుద్ధంగా, యేసు జీవితారంభంలో ఆయన వినయశీల పాత్రను గూర్చి బైబిలు చాలా తక్కువగా చెబుతుంది. యోసేపు, ఆయన భార్యయైన మరియ యేసును యితర నలుగురు కుమారులను, కుమార్తెలను కూడా పెంచారని మనకు తెలుసు.—మార్కు 6:3.
యోసేపు, సొలొమోను క్రమంద్వారా ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వంశస్థుడు. ఆయన యాకోబు కుమారుడు, మరి హేలీ అల్లుడు. (మత్తయి 1:16; లూకా 3:23) గలిలయ నందలి నజరేతు పట్టణంలో ఒక వడ్రంగివానిగా, యోసేపు ఆర్థిక పరిస్థితి బాగో లేదు. (మత్తయి 13:55; లూకా 2:4, 24; పోల్చండి: లేవీయకాండము 12:8.) అయితే ఆయన ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు. (సామెతలు 10:22) నిశ్చయంగా, దీనికి కారణం ఆయన దైవిక నడిపింపును అంగీకరించడమే.
నిస్సందేహంగా, యోసేపు దేవుని యందు విశ్వాసము మరియు సరైనది చేయాలన్న కోరిక గల దీనుడునూ సాత్వికుడునైన యూదుడు. లేఖనాల్లో లిఖించబడిన అతని జీవితంలోని కొన్ని సంఘటనలు, ఆయన ఎల్లప్పుడూ యెహోవా ఆజ్ఞలకు విధేయుడని చూపుతున్నాయి. అవి ధర్మశాస్త్రంలో ఉన్నప్పటికీ లేక యోసేపు వాటిని నేరుగా దూతల వద్దనుండి పొందినప్పటికీ వాటిని గైకొన్నాడు.
సమస్యలుగల నీతిమంతుడైన వ్యక్తి
ఒక పెద్ద సమస్య వచ్చినపుడు ఒక దైవిక భక్తిగల వ్యక్తి ఏం చేయాలి? ఏముంది, అతను ‘తన భారాన్ని యెహోవా మీద మోపి,’ దైవిక నడిపింపును అనుసరించాలి! (కీర్తన 55:22) అదే యోసేపు చేశాడు. ఆయనకు మరియతో ప్రధానం జరిగినప్పుడు, “వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.” యోసేపు ‘నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు.’ యోసేపు సంగతులను గూర్చి ఆలోచించుకున్న తర్వాత, యెహోవా దూత ఆయనకు కలలో కనిపించి యిలా చెప్పాడు: “దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.” మేలుకున్న తర్వాత, యోసేపు “ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి, తన భార్యను చేర్చుకొని, ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.” (మత్తయి 1:18-25) యోసేపు దైవిక నడిపింపును అంగీకరించాడు.
కైసరు ఔగుస్తు ప్రజలు తమ స్వంత పట్టణంలో పేర్లను నమోదు చేయించుకోవాలని ఆజ్ఞజారీ చేశాడు. దానికి లోబడినవారై, యోసేపు మరియలు యూదయ నందున్న బేత్లెహేమునకు వెళ్లారు. అక్కడ మరియ యేసుకు జన్మనిచ్చి, వేరే వసతి అందుబాటులో లేనందువల్ల, పశువుల తొట్టిలో ఆయన్ను పడుకోబెట్టింది. ఈ ప్రత్యేకమైన జననాన్ని గూర్చిన దూతల ప్రకటనను విన్న కాపరులు ఆ రోజు రాత్రి ఆ శిశువును చూసేందుకు వచ్చారు. సుమారు 40 రోజుల తర్వాత యోసేపు మరియలు, ఒక అర్పణతో యేసును యెరూషలేము ఆలయంలో ప్రతిష్ఠించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని పాటించారు. యేసు చేయబోయే గొప్ప కార్యాలను గూర్చి వృద్ధ ప్రవక్తైన సుమెయోను ప్రవచనాత్మకమైన మాటలు విని యిద్దరూ ఆశ్చర్యపోయారు.—లూకా 2:1-33; పోల్చండి: లేవీయకాండము 12:2-4, 6-8.
లూకా 2:39లో యోసేపు మరియలు యేసును ఆలయమందు ప్రతిష్ఠించిన వెనువెంటనే నజరేతుకు వెళ్లినట్లుగా సూచించినట్లు అనిపించినప్పటికీ, యిది క్లుప్తీకరించిన వృత్తాంతంలో ఒక భాగము. ఆలయమందు ప్రతిష్ఠించిన చాలా కాలం తర్వాత ప్రాచ్య దేశమునుండి వచ్చిన జ్యోతిష్కులు (జ్ఞానులు) బేత్లెహేము నందలి ఒక యింట్లో మరియను, యేసును సందర్శించినట్లు కనిపిస్తుంది. ఈ సందర్శనం యేసుకు మరణమును తీసుకురాకుండా దైవిక జోక్యం నివారించింది. జ్ఞానులు వెళ్లిపోయిన తర్వాత, యెహోవా దూత యోసేపుకు కలలో కనిపించి, ఆయనకు యిలా చెప్పాడు: “హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు.” ఎప్పటిలాగే, యోసేపు దైవిక నడిపింపును అంగీకరించి తన కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకుని వెళ్లాడు.—మత్తయి 2:1-14.
హేరోదు మరణించినప్పుడు, ఐగుప్తునందు యోసేపుకు ఒక దూత కలలో కనిపించి యిలా చెప్పాడు: “నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము.” హేరోదు కుమారుడైన ఆర్కెలాయు తన తండ్రి స్థానంలో పరిపాలిస్తున్నాడని విన్నప్పుడు, యూదయకు తిరిగి వచ్చేందుకు యోసేపు భయపడ్డాడు. కలలో యివ్వబడిన దైవిక హెచ్చరికను అంగీకరించి, ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్లి, నజరేతు అనే పట్టణంలో స్థిరపడ్డాడు.—మత్తయి 2:15-23.
ఒక ఆత్మీయ వ్యక్తి
యోసేపు, తన కుటుంబం దైవిక ఆజ్ఞలకు విధేయులుగా ఉండేలా అంతేకాకుండ ఆత్మీయంగా పోషించబడుతూ ఉండేలా చూసేవాడు. తనతో పాటు ప్రతి సంవత్సరం యెరూషలేములో పస్కా పండుగను ఆచరించేందుకు తన కుటుంబాన్నంతటినీ తీసుకువెళ్లేవాడు. వీటిలోని ఒక సందర్భంలో, 12 ఏండ్ల యేసు కనిపించడంలేదని వారు కనుగొనేసరికి, యోసేపు మరియలు నజరేతుకు తిరిగి వస్తూ యెరూషలేమునుండి ఒక రోజు ప్రయాణం చేసేశారు. యెరూషలేమునకు తిరిగివెళ్లి, బాగా వెతికారు, మరి చివరికి ఆయన ఆలయం వద్ద బోధకులు చెప్పేవాటిని వింటూ వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్లు కనుగొన్నారు.—లూకా 2:41-50.
కొన్ని విషయాల్లో యోసేపు తన భార్యను చొరవ తీసుకోనిచ్చినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు, వారు యెరూషలేముకు తిరిగి వచ్చి, యేసును ఆలయం వద్ద కనుగొన్నప్పుడు, ఆ విషయాన్ని గూర్చి చిన్నవాడైన తన కుమారునితో మాట్లాడింది మరియనే. (లూకా 2:48, 49) “మరియ కుమారుడైన వడ్లవానిగా” పెరుగుతున్న సమయంలో యేసు ఆత్మీయ బోధను పొందాడు. యోసేపు తన వడ్రంగి పనిని కూడా నేర్పించాడు అందుకే యేసు ‘వడ్లవాని కుమారుడు’ అని పిలువబడేవాడు. (మత్తయి 13:55; మార్కు 6:3 NW) దైవిక తలిదండ్రులు తమ పిల్లలకు ఆత్మీయ శిక్షణనిచ్చే విషయంలో బోధించగల అవకాశాలన్నింటినీ నేడు పూర్తిగా వినియోగించుకోవాలి.—ఎఫెసీయులు 6:4; 2 తిమోతి 1:5; 3:14-17.
యోసేపు ఉత్తరాపేక్షలు
యోసేపు మరణం విషయంలో లేఖనాలు ఏమీ చెప్పడంలేదు. అయితే మార్కు 6:3 యేసును యోసేపు కుమారుడు అని కాకుండ “మరియ కుమారుడు” అని పిలవడం గమనార్హం. అప్పటికే యోసేపు మరణించాడని అది సూచిస్తుంది. అంతేకాకుండ, యోసేపు సా.శ. 33 వరకూ జీవించి ఉంటే మ్రానున వ్రేలాడదీయబడిన యేసు, మరియను చూసుకోమని అపొస్తలుడైన యోహానుకు అప్పజెప్పి ఉండడు.—యోహాను 19:26, 27.
అప్పుడు, మరణించినవారిలో మనుష్య కుమారుని స్వరము విని పునరుత్థానులై వచ్చే వారిలో యోసేపు ఉంటాడు. (యోహాను 5:28, 29) నిత్యజీవం కొరకు యెహోవా చేసిన ఏర్పాటునుగూర్చి తెలుసుకున్నప్పుడు, యోసేపు దాన్ని సంతోషంగా ఉపయోగించుకుంటాడు, 1,900 సంవత్సరాల క్రితం దైవిక నడిపింపును ఎలా అంగీకరించాడో అలాగే గొప్ప పరలోక రాజైన యేసు క్రీస్తుకు విధేయుడైన పౌరునిగా ఉంటాడు.
[31వ పేజీలోని చిత్రం]
యోసేపు, యేసుకు ఆత్మీయ ఉపదేశాన్నిచ్చాడు మరియు వడ్రంగిపనిని కూడా నేర్పించాడు