మీరు ఎవరినైనా ఇటీవలనే ప్రోత్సహించారా?
ఎలానాకు అండాశయ క్యాన్సరు ఉందని వైద్యులు కనుగొనే సమయానికి ఆమెకు కేవలం 17 సంవత్సరాలే. ఆమె తల్లి మారీ, ఎలానా అనుభవిస్తున్న అతి తీవ్రమైన నొప్పిని చూడడంవల్ల కలిగే వేదనను ఎదుర్కోవలసివచ్చింది.
చివరికి ఎలానా, కానరీ ద్వీపాల్లోవున్న తమ యింటి నుండి 1,900 కిలోమీటర్ల దూరంలో స్పెయిన్, మాడ్రిడ్ నందలి ఒక ఆసుపత్రికి మార్చబడింది. మాడ్రిడ్‌లో ఒక వైద్యుల బృందం రక్తం ఎక్కించకుండా శస్త్రచికిత్స చేయడానికి అంగీకరించింది. (అపొస్తలుల కార్యములు 15:28, 29) కాని శస్త్రచికిత్స ప్రారంభమైన కొంతసేపటికే, ఎలానా పరిస్థితి క్షీణించిందన్నది స్పష్టమయ్యింది. క్యాన్సరు అప్పటికే ఆమె శరీరమంతటా ప్రాకిపోయింది, శస్త్రవైద్యులు ఏమీ చేయలేకపోయారు. మాడ్రిడ్‌కు వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత ఎలానా మరణించింది.
ఆ భయంకరమైన కష్టాన్ని మారీ ఒంటరిగా ఎదుర్కోవలసి రాలేదు. ఆమె మరియు ఆమె పెద్ద కుమారునితోపాటు ఇద్దరు క్రైస్తవ పెద్దలు తమ స్వంత ఖర్చులు పెట్టుకుని మాడ్రిడ్‌కు వచ్చి, ఎలానా మరణం వరకు అక్కడే వున్నారు. “నేను అంతర్గతంగా అనుభవిస్తున్న శూన్య భావాన్ని ఎదుర్కోడానికి వారు నాకు సహాయం చేశారు. వారు నాకిచ్చిన ప్రోత్సాహాన్ని నేనెన్నడూ మరువలేను. వారి ఆత్మీయ మద్దతు, ఆచరణ యోగ్యమైన సహాయం వెలకట్టలేనివి. వారు నిజంగా ‘గాలికి మరుగైన చోటువలె’ వుండిరి” అని మారీ వివరించింది.—యెషయా 32:1, 2.
తన గొర్రెలను ఆప్యాయతతో కాచే యిటువంటి ప్రేమగల కాపరులను బట్టి యెహోవా ఆనందిస్తాడు. (సామెతలు 19:17; 1 పేతురు 5:2-4) అయితే, ప్రోత్సాహమివ్వడం కేవలం పెద్దల ఆధిక్యత మాత్రమే కాదు. ఆత్మీయ ఉపదేశాన్ని పొందడానికి, ‘ఒకరినొకరు ప్రోత్సహించుకోడానికి’ క్రైస్తవులందరూ కలిసి సమకూడుతారు. (హెబ్రీయులు 10:24, 25) ప్రోత్సాహం క్రైస్తవ సహవాసంలో ఒక ప్రధానమైన భాగం.
ప్రోత్సాహంలో ఏమి యిమిడివుంది?
నీరు లేకపోతే అందమైన పువ్వు ఎలా వాడిపోతుందో, అలాగే—కుటుంబంలోని మరియు సంఘంలోని—వ్యక్తులు ప్రోత్సాహం లోపించడం వల్ల వడలిపోగలరు. మరోవైపున, సమయోచితమైన ప్రోత్సాహం శోధన నెదుర్కొనే వారిని బలపర్చగలదు, బాధలో వున్న వారిని ఉత్సాహపర్చగలదు, దేవున్ని నమ్మకంగా సేవిస్తున్న వారిని శక్తిమంతులను చేయగలదు.
“ప్రోత్సాహం” కొరకు అనువదించబడిన గ్రీకు పదానికి ఓదార్పు, ప్రోత్సాహం, ఊరడింపు అనే తలంపు కూడా వుంది. గనుక, ఎవరికైనా బాగా చేస్తున్నారని చెప్పడం మాత్రమే ప్రోత్సహించడం కాదు. దానిలో ఆచరణ యోగ్యమైన సలహాలను, ఆత్మీయ సహాయాన్ని యివ్వడం కూడా యిమిడివుండవచ్చు.
నిజానికి, “ప్రోత్సాహం” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థకంగా “ఒకరి సాన్నిధ్యానికి ఆహ్వానించబడుట” అని భావము. మన ఆత్మీయ సహోదర సహోదరీలతో కలిసి పయనించడం, ఎవరైనా అలసిపోతే లేక అభ్యంతరపడితే వెంటనే మద్దతు యివ్వడానికి మనకు సహాయం చేస్తుంది. (ప్రసంగి 4:9, 10) ఆసక్తికరంగా, యెహోవా ప్రజలు ‘ఆయనను భుజాలు కలిపి సేవిస్తారు.’ (జెఫన్యా 3:9) అపొస్తలుడైన పౌలు ఒక క్రైస్తవుణ్ణి “నిజమైన సహకారి” అని పిలిచాడు. (ఫిలిప్పీయులు 4:3) భుజాలు కలిపి సేవచేయడం ద్వారా ఒకే కాడి క్రింద కలిసి పనిచేయడం ప్రాముఖ్యంగా, ఆత్మీయంగా బలంగాలేని వారికి భారాన్ని తగ్గిస్తుంది.—మత్తయి 11:29 పోల్చండి.
వారు ప్రోత్సాహాన్నిచ్చారు
ప్రోత్సాహం ఎంతో ప్రాముఖ్యమైనది గనుక, దాని గురించి మనం కొన్ని లేఖనాధార ఉదాహరణలను పరిశీలిద్దాము. దేవుని ప్రవక్తయైన మోషే తన జీవిత అవసాన దశను సమీపిస్తుండగా, యెహోవా యెహోషువను ఇశ్రాయేలీయుల నాయకునిగా నియమించాడు. మోషేకు స్వయంగా బాగా తెలిసినట్లుగా, అది అంత సుళువైన పనికాదు. (సంఖ్యాకాండము 11:14, 15) గనుక, యెహోవా “యెహోషువకు ఆజ్ఞయిచ్చి అతని ధైర్యపరచి దృఢపరచుము” అని మోషేకు చెప్పాడు.—ద్వితీయోపదేశకాండము 3:28.
ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల కాలంలో, యెఫ్తా కుమార్తె యెహోవా ఆలయంలో సేవచేయడానికి తాను కుటుంబాన్ని కలిగివుండగల సాధ్యతను వదులుకోవడం ద్వారా తన తండ్రి ప్రమాణంతో యిష్టపూర్వకంగా ఏకీభవించింది. ఆమె త్యాగం గుర్తించబడకుండా పోయిందా? లేదు, ఎందుకంటే న్యాయాధిపతులు 11:40 యిలా చెబుతుంది: “ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.” స్వయంత్యాగియైన యెఫ్తా కుమార్తెకు అలాంటి సందర్శనాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండివుండవచ్చు.
ప్రోత్సాహమివ్వడానికి కొన్నిసార్లు ధైర్యమవసరమవుతుంది. అపొస్తలుడైన పౌలు మొదటి మిషనరీ యాత్ర సమయంలో, ఆయన ఆసియా మైనరు నందలి అనేక నగరాలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయన అంతియొకయలో నుండి బహిష్కరించబడ్డాడు, ఈకొనియలో హతమార్చబడడాన్ని కొద్దిలో తప్పించుకున్నాడు, లుస్త్రనందు రాళ్లతో కొట్టబడి చనిపోయాడనుకొని విడిచిపెట్టబడ్డాడు. అయితే, కొంతకాలం తర్వాత, పౌలు మరియు అతని సహచరులు ఈ నగరాలకు తిరిగి వచ్చి “శిష్యుల మనస్సులను దృఢపరచి—విశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.” (అపొస్తలుల కార్యములు 14:21, 22) ఈ క్రొత్త శిష్యులను ప్రోత్సహించడానికి పౌలు తన జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు.
అయితే, ప్రోత్సాహం అవసరమయ్యే క్రైస్తవులు, కేవలం క్రొత్త శిష్యులు మాత్రమేకాదు. కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు రోముకు ఒక కష్టతరమైన యాత్ర చేసినప్పుడు, ఆయన ఒక శ్రమను ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన తన గమ్యాన్ని చేరనైయుండగా, ఆయన కొంత అధైర్యపడి ఉండవచ్చు. కాని ఆయన రోముకు ఆగ్నేయంగా 74 కిలోమీటర్లు ప్రయాణించి ఒక స్థలాన్ని చేరినప్పుడు, ఆయన ప్రోత్సహించబడ్డాడు. ఎందుకు? ఎందుకంటే అప్పీయా సంతపేట మరియు త్రిసత్రముల వద్ద ఆయనను కలవడానికి సహోదరులు రోము నుండి వచ్చారు. “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొస్తలుల కార్యములు 28:15) అలాంటి సందర్భాలలో, కేవలం మనం అక్కడ ఉండడం మాత్రమే తోటి విశ్వాసులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండగలదు.
ప్రోత్సాహమివ్వడానికి అవకాశాలను వినియోగించుకోండి
వాస్తవానికి ప్రోత్సాహమివ్వడానికి అనేక అవకాశాలున్నాయి. దైవపరిపాలనా పాఠశాలనందు ఒక సహోదరుడు లేక సహోదరి చక్కని విద్యార్థి ప్రసంగాన్నిచ్చినందుకు మీ హృదయం కదిలింపబడిందా? సంఘంలో ఆత్మీయంగా బలంగావున్న యౌవనస్థులు ఉన్నారని మీరు సంతోషిస్తున్నారా? పెద్దవారి సహనం మిమ్మల్ని ప్రభావితం చేసిందా? ఇంటింటి పరిచర్యలో ఒక పయినీరు బైబిలును ఉపయోగించిన విధానాన్ని మీరు మెచ్చుకుంటున్నారా? అయితే అభినందించి, ప్రోత్సహించేదేదైనా చెప్పండి.
కుటుంబంలో, అలాగే సంఘంలో ప్రోత్సాహం ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. అది, పిల్లలను “ప్రభువు [యెహోవా NW] యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి తల్లిదండ్రులకు సహాయం చేయగలదు. (ఎఫెసీయులు 6:4) నీవు బాగా చేశావని పిల్లవానికి చెప్పడం, ఎందుకు బాగా ఉందో వివరించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండగలదు! యౌవనులు అనేక శోధనలు, ఒత్తిడులు ఎదుర్కొనే యౌవన ప్రాయంలో, తదేకమైన ప్రోత్సాహం అత్యవసరం.
బాల్యదశలో ప్రోత్సాహం లోపించడం ఎంతో హానికరం కాగలదు. నేడు ఒక క్రైస్తవ పెద్దగా వున్న మైకెల్, ఎంతో స్నేహపూరితంగా ఉంటాడు, కాని ఆయనిలా చెబుతున్నాడు: “నేను ఏదైనా బాగా చేశానని మా నాన్న ఎన్నడూ ఒక్కసారి కూడా చెప్పలేదు. కాబట్టి నేను ఆత్మస్థయిర్యంలేని వానిగా ఎదిగాను. . . . నేను యిప్పుడు 50 సంవత్సరాల వాడినైనప్పటికీ, పెద్దగా నేను మంచి పనిని చేస్తున్నానని నా స్నేహితుల చేత ధృవపర్చబడడాన్ని నేను కోరుకుంటాను. . . . ఇతరులకు ప్రోత్సాహాన్నివ్వడం ఎంత ప్రాముఖ్యమో నా స్వంత అనుభవం నాకు నేర్పింది, అది యివ్వడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను.”
ఎవరికి ప్రోత్సాహం అవసరం?
కష్టపడి పనిచేసే క్రైస్తవ పెద్దలు ప్రోతహింపబడడానికి అర్హులు. పౌలు యిలా వ్రాశాడు: “సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము.” (1 థెస్సలొనీకయులు 5:12, 13) పెద్దలు చేసే కష్టమైన పనికి కృతజ్ఞత తెలియజేయకుండా దాని నుండి ప్రయోజనం పొందడం చాలా సుళువే. కాని యథార్థమైన మెప్పు మరియు ప్రోత్సాహాలతో కూడిన మాటలు వారి భారాన్ని తేలిక చేయగలవు.
మన మధ్య కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి కూడా ప్రోత్సాహం అవసరం. “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనియ్యుడి” అని బైబిలు ఉపదేశిస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:14) ఒంటరి తల్లిదండ్రులు, విధవరాండ్రు, యౌవనులు, పెద్దవారు, రోగగ్రస్థులు వంటి వారు అప్పుడప్పుడు నిరాశగా లేక ఆత్మీయంగా బలహీనంగా భావిస్తారు.
మారియా ఒక క్రైస్తవ స్త్రీ, ఆమె భర్త ఒకసారి హఠాత్తుగా ఆమెను విడిచిపెట్టాడు. ఆమె యిలా చెప్పింది: “యోబు వలె, నేను కొన్నిసార్లు చనిపోవాలని కోరుకున్నాను. [యోబు 14:13] అయినా నేను అందుకున్న ప్రోత్సాహాన్నిబట్టి నేను కొనసాగ గలిగాను. నాకు బాగా తెలిసిన యిద్దరు పెద్దలు, పూర్తికాల పరిచర్యలో కొనసాగడం యొక్క విలువను నేను తెలుసుకోడానికి సహాయం చేయడంలో ఎన్నో గంటలు గడిపారు. అర్థం చేసుకునే యిద్దరు సహోదరీలు కూడా, నేను చెప్పేది ఓపికగా వినడం ద్వారా నన్ను ఓదార్చారు. బైబిలును ఉపయోగించడం ద్వారా, విషయాలను యెహోవా దృక్కోణం నుండి చూడడానికి వారు నాకు సహాయం చేశారు. మేము కీర్తన 55:22 ఎన్నిసార్లు చదివామో నాకు తెలియదు, కాని ఈ లేఖనాన్ని అన్వయించుకోవడం ద్వారా నేను నా ఆత్మీయ, మానసిక సమతుల్యాన్ని మెల్లిగా తిరిగి పొందగలిగాను. ఇదంతా 12 సంవత్సరాల క్రితం జరిగింది, యిప్పటి వరకు నేను పూర్తికాల పరిచర్యలో కొనసాగానని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అప్పుడప్పుడూ కలిగే మానసిక బాధ ఉన్నప్పటికీ నా జీవితం ప్రతిఫలదాయకంగా, సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో ప్రోత్సాహం ఒక వ్యక్తి జీవితంలో గొప్ప తేడా చూపించగలదని నేను విశ్వసిస్తున్నాను.”
కొందరు పొరపాట్లు చేసి వాటిని సరిచేసుకోడానికి యిప్పుడు పోరాడుతున్నందున వారికి ప్రోత్సాహం అవసరం. బహుశా వారు ప్రేమపూర్వకమైన గద్దింపును పొందివుండవచ్చు. (సామెతలు 27:6) గద్దింపునిచ్చిన పెద్దలు, యివ్వబడిన లేఖనాధార ఉపదేశం అన్వయించు కోబడడాన్ని చూసినప్పుడు మెచ్చుకోడానికి సిద్ధంగా ఉండవచ్చు. ప్రోత్సాహంతో కూడిన వారి మాటలకు రెండు ప్రయోజనాలు వుంటాయి—తప్పు చేసిన వ్యక్తి “అత్యధికమైన దుఃఖములో” పడిపోకుండా అతని యెడల వారి ప్రేమను బలపర్చడం, ఉపదేశాన్ని అన్వయించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలను అతనికి గుర్తుచేయడం.—2 కొరింథీయులు 2:7, 8.
ఒక పెద్ద ఒక గంభీరమైన తప్పు చేసి, సంఘంలో పర్యవేక్షించే తన ఆధిక్యతను కోల్పోయాడు. ఆయనిలా చెబుతున్నాడు: “పెద్దగా నన్ను తీసివేయడాన్ని గూర్చిన ప్రకటన చేయబడినప్పుడు, నా సహవాసంలో సహోదరులు అసౌకర్యంగా భావిస్తారని నేననుకున్నాను. అయితే, పెద్దలు కారణాన్ని ఎంతో రహస్యంగా ఉంచి, నన్ను ప్రోత్సహించడానికి వారు ఎంతో చేశారు. అలాగే మిగతా సంఘమంతా కూడా ప్రేమ, సహవాసాలను అందజేసింది, అది నా ఆత్మీయ పునరుద్ధరణకు కచ్చితంగా దోహదపడింది.”
ప్రోత్సహించే వారైయుండండి
పనిరద్దీగల మన జీవితాల్లో, ప్రోత్సాహాన్ని సుళువుగా ఉపేక్షించవచ్చు. కాని అది ఎంత ప్రయోజనకరం కాగలదు! ప్రభావవంతమైన ప్రోత్సాహాన్నివ్వడానికి, మీరు రెండు విషయాలు మనసులో ఉంచుకోవాలి. మొదటిది, మీ ప్రోత్సాహం విశేషంగా ఉండేలా, ఏమి చెప్పాలనేదాని గురించి ఆలోచించండి. రెండవది, మెప్పు పొందడానికి అర్హుడైన లేక ప్రోత్సాహం అవసరమైన వ్యక్తిని సమీపించడానికి అవకాశం కొరకు చూడండి.
మీరు యిది ఎంత తరచుగా చేస్తే, అంత సంతోషాన్ని పొందుతారు. యేసు యిలా ధైర్యమిస్తున్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:35) ఇతరులను ప్రోత్సహించడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటారు. ప్రతిరోజు ఎవరినైనా ఒకరికి ప్రోత్సాహాన్ని యివ్వడం మీ గురిగా ఎందుకు చేసుకోకూడదు?