కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 1/15 పేజీలు 15-20
  • యెహోవాను హృదయానందముతో సేవించుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను హృదయానందముతో సేవించుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “హృదయానందంతో” సేవించడం ఎలా?
  • ఆనందం లోపించినప్పుడు
  • ఆనందంతో ఎదురుచూడడం
  • హింస వున్నప్పటికీ ఆనందం
  • “ఆనందముతో యెహోవాను సేవించుడి”
  • మీ నిరీక్షణ యందు ఆనందించుడి
  • సంతోషం-పవిత్రశక్తి పుట్టించే ఒక లక్షణం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • యెహోవాను ఆనందముతో సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 1/15 పేజీలు 15-20

యెహోవాను హృదయానందముతో సేవించుడి

‘ఈ శాపములన్నియు నీమీదికి వచ్చును . . . ఎందుకనగా నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు.’—ద్వితీయోపదేశకాండము 28:45-47.

1. యెహోవాను సేవించేవారు, ఆయనను తాము ఎక్కడ సేవిస్తున్నప్పటికీ, ఆనందంగల వారనడానికి ఏ రుజువున్నది?

యెహోవా సేవకులు తాము పరలోకంలోనైనప్పటికీ లేక భూమిమీదనైనప్పటికీ ఆయన చిత్తాన్ని చేస్తున్నందుకు ఆనందిస్తారు. భూమి స్థాపించబడినప్పుడు దూతలైన “ఉదయనక్షత్రములు” ఆనందంతో పాడారు, వేలాదిమంది పరలోక దూతలు నిస్సందేహంగా ఆనందంతో ‘దేవుని వాక్యమును నెరవేర్చుతున్నారు.’ (యోబు 38:4-7; కీర్తన 103:20) యెహోవా అద్వితీయ కుమారుడు పరలోకంలో ఆనందకరమైన “ప్రధానశిల్పి”గా వున్నాడు, భూమి మీద యేసుక్రీస్తు అను మానవునిగా దైవ చిత్తాన్ని చేయడంలో సంతోషాన్ని కనుగొన్నాడు. అంతేగాక, “తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.”—సామెతలు 8:30, 31; హెబ్రీయులు 10:5-10; 12:2.

2. ఇశ్రాయేలీయులు ఆశీర్వాదాలను పొందారా లేక శాపములు పొందారా అనేదాన్ని ఏది ధృవీకరించింది?

2 ఇశ్రాయేలీయులు దేవున్ని ప్రీతిపర్చినప్పుడు ఆనందం పొందారు. కాని వారు ఆయనకు అవిధేయత చూపించినప్పుడు? వారు యిలా హెచ్చరింపబడ్డారు: “[శాపములు] . . . చిరకాలమువరకు నీమీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు ఆనందముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోను వస్త్ర హీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీమెడమీద ఇనుపకాడి యుంచుదురు.” (ద్వితీయోపదేశకాండము 28:45-48) ఎవరు యెహోవా సేవకులో ఎవరు కాదో, ఆశీర్వాదాలు మరియు శాపములు స్పష్టపర్చేవి. దేవుని సూత్రాలు, సంకల్పాలు అల్పంగా చూడదగినవి కావని, వాటిని తిరస్కరించడం కుదరదని కూడా అలాంటి శాపములు ధృవీకరించాయి. నాశనం మరియు బహిష్కరణలను గూర్చిన యెహోవా హెచ్చరికలను వినడానికి ఇశ్రాయేలీయులు నిరాకరించారు గనుక, యెరూషలేము “భూమిమీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా” తయారైంది. (యిర్మీయా 26:6) కాబట్టి మనం దేవునికి విధేయులమై, ఆయన అనుగ్రహాన్ని పొందుదాము. దైవభక్తిగలవారు అనుభవించే దైవిక ఆశీర్వాదాలలో ఆనందం ఒకటి.

“హృదయానందంతో” సేవించడం ఎలా?

3. సూచనార్థక హృదయం అంటే ఏది?

3 ఇశ్రాయేలీయులు యెహోవాను “ఆనందముతోను, హృదయానందముతోను” సేవించవలసి యుండిరి. దేవుని ఆధునిక దిన సేవకులు కూడా అలాగే చేయాలి. ఆనందించడం అంటే, “ఆనందంగా వుండడం; ఆనందంతో నిండివుండడం.” లేఖనాలలో భౌతిక హృదయం ప్రస్తావించబడినప్పటికీ, అది అక్షరార్థంగా ఆలోచించదు లేక తర్కించదు. (నిర్గమకాండము 28:30) శరీర కణాలకు పోషణనిచ్చే రక్తాన్ని సరఫరా చేయడం దాని ముఖ్యమైన పని. అయితే అనేక సందర్భాలలో, ప్రేమ, ప్రేరణ మరియు జ్ఞానాలకు కేంద్రంకంటే ఎక్కువైనదైన సూచనార్థక హృదయాన్ని బైబిలు ప్రస్తావిస్తుంది. అది “సాధారణంగా కేంద్ర భాగంగా, లోపలి భాగంగా, ఒక వ్యక్తి యొక్క అనేక క్రియలు, అతని కోరికలు, వాత్సల్యాలు, మానసిక భావాలు, మనోవాంఛలు, సంకల్పాలు, అతని ఆలోచనలు, తలంపులు, ఊహలు, అతని వివేకం, జ్ఞానము, నైపుణ్యము, అతని నమ్మకాలు మరియు అతని తర్కాలు, అతని జ్ఞాపకం మరియు అతని మనస్సాక్షి వంటి వాటన్నిటిలో వ్యక్తమయ్యే అతని అంతర్గత వ్యక్తిని సూచిస్తుంది.” (జర్నల్‌ ఆఫ్‌ ది సొసైటీ ఆఫ్‌ బిబ్లికల్‌ లిటరేచర్‌ అండ్‌ ఎక్సెజెసిస్‌, 1882, పేజీ 67) మన సూచనార్థక హృదయంలో ఆనందంతో సహా మన భావనలు, మనోభావాలు కూడా చేరివుంటాయి.—యోహాను 16:22.

4. యెహోవా దేవున్ని హృదయానందంతో సేవించడానికి ఏది మనకు సహాయం చేయగలదు?

4 యెహోవాను హృదయానందంతో సేవించడానికి ఏది మనకు సహాయం చేయగలదు? మన ఆశీర్వాదాలు మరియు దేవుడిచ్చిన ఆధిక్యతల యెడల అనుకూలమైన, మెప్పుతో కూడిన దృక్పథం కలిగివుండడం సహాయం చేయగలదు. ఉదాహరణకు, సత్య దేవునికి ‘పరిశుద్ధ సేవ’ చేసే మన ఆధిక్యతను గూర్చి మనం ఆనందించవచ్చు. (లూకా 1:74) ఆయన సాక్షులుగా యెహోవా నామానికి ప్రాతినిధ్యం వహించే సంబంధిత ఆధిక్యత కూడా వుంది. (యెషయా 43:10-12) దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా మనం ఆయనను ప్రీతిపరుస్తున్నామని తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందాన్ని దీనికి మనం జత చేయవచ్చు. ఆత్మీయ వెలుగును ప్రతిఫలించడం ద్వారా అనేకులు అంధకారంలో నుండి బయటికి రావడానికి వారికి సహాయం చేయడంలో ఎంతటి ఆనందం వుంది!—మత్తయి 5:14-16; 1 పేతురు 2:9 పోల్చండి.

5. దైవిక ఆనందానికి మూలమేది?

5 అయినా, యెహోవాను హృదయానందంతో సేవించడమంటే కేవలం అనుకూలమైన ఆలోచనా విధానం కలిగివుండడం మాత్రమే కాదు. అనుకూల దృక్పథం కలిగివుండడం ప్రయోజనకరమే. కాని దైవిక ఆనందమనేది మనం మన గుణలక్షణాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉత్పన్నం చేసుకునేదికాదు. అది యెహోవా ఆత్మ ఫలం. (గలతీయులు 5:22, 23) మనకు అలాంటి ఆనందం లేకపోతే, దేవుని ఆత్మను బాధపర్చే లేఖనరహితమైన విధానంలో ఆలోచించడాన్ని లేక ప్రవర్తించడాన్ని నివారించడానికి మార్పులు చేసుకోవలసిన అవసరత వుండవచ్చు. (ఎఫెసీయులు 4:30) అయితే, యెహోవాకు సమర్పించుకున్నవారిగా మనం, ఎప్పుడో ఒక సందర్భంలో హృదయానందం లేకపోవడం దైవిక అనుగ్రహం లేకపోవడానికి రుజువేమోనని భయపడకుండా వుందాము. మనం అపరిపూర్ణులం, మనకు బాధ, దుఃఖము, కొన్నిసార్లు నిరాశ కూడా కలుగుతాయి, కాని యెహోవా మనల్ని అర్థం చేసుకుంటాడు. (కీర్తన 103:10-14) కాబట్టి, పరిశుద్ధాత్మ ఫలమైన సంతోషం (ఆనందం) దేవుడిచ్చేదని గుర్తుంచుకొని, మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిద్దాం. మన ప్రేమగల పరలోకపు తండ్రి అలాంటి ప్రార్థనలకు సమాధానమిచ్చి, మనం ఆయనను హృదయానందంతో సేవించడానికి సహాయం చేస్తాడు.—లూకా 11:12, 13.

ఆనందం లోపించినప్పుడు

6. మనం దేవునికి చేసే సేవలో ఆనందం లోపించినట్లయితే, మనం ఏమి చేయాలి?

6 మన సేవలో ఆనందం లోపించినట్లయితే, అది చివరికి మనం యెహోవా సేవలో మందగించడానికి లేక ఆయనకు అవిశ్వాసుల మవ్వడానికి కారణం కాగలదు. గనుక, మన ఉద్దేశాలను దీనంగా, ప్రార్థనాపూర్వకంగా పరిశీలించుకొని, అవసరమైన మార్పులు చేసుకోవడం జ్ఞానయుక్తంగా వుంటుంది. దేవుడిచ్చే ఆనందాన్ని పొందడానికి, మనం యెహోవాను ప్రేమతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో పూర్ణమనస్సుతో సేవించాలి. (మత్తయి 22:37) మనం పోటీ దృక్పథంతో సేవ చేయకూడదు, ఎందుకంటే పౌలు యిలా వ్రాశాడు: “మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరి నొకరము వివాదమునకు రేపకయు, ఒకరియందొకరము అసూయపడకయు వృథాగా అతిశయపడకయు ఉందము.” (గలతీయులు 5:25, 26) మనం యితరుల కంటే ఉన్నతంగా వుండాలని లేక స్తుతింపబడాలని సేవ చేస్తున్నట్లయితే మనకు నిజమైన ఆనందం వుండదు.

7. మనం మన హృదయానందాన్ని ఎలా పునరుజ్జీవింపజేసుకోవచ్చు?

7 యెహోవాకు మన సమర్పణను నెరవేర్చడంలో ఆనందం వుంది. మనం దేవునికి క్రొత్తగా సమర్పించుకున్నప్పుడు, మనం క్రైస్తవ జీవిత విధానాన్ని ఆసక్తితో చేపట్టాము. మనం లేఖనాలను చదివి, కూటాలలో క్రమంగా పాల్గొన్నాము. (హెబ్రీయులు 10:24, 25) అది పరిచర్యలో భాగం వహించడానికి మనకు ఆనందాన్నిచ్చింది. అయితే, మన ఆనందం తగ్గిపోతే అప్పుడేమిటి? బైబిలు పఠనం, కూటాలకు హాజరు కావడం, పరిచర్యలో భాగం వహించడం—వాస్తవానికి, క్రైస్తవత్వంలోని ప్రతి అంశంలోను పూర్తిగా భాగం వహించడం—మన జీవితాలకు ఆత్మీయ స్థిరత్వాన్నిచ్చి, మనకు మొదట్లోవున్న ప్రేమను అలాగే మునుపటి హృదయానందాన్ని పునరుజ్జీవింప జేయాలి. (ప్రకటన 2:4) అప్పుడు మనం, ఒకవిధంగా ఆనందంలేనట్లు, తరచూ ఆత్మీయ సహాయం అవసరమైన వారివలె వుండము. పెద్దలు సహాయం చేయడానికి ఆనందిస్తారు, కాని మనం దేవునికి మన సమర్పణను వ్యక్తిగతంగా నెరవేర్చాలి. మనకొరకు దీన్ని మరెవ్వరూ చేయలేరు. కాబట్టి, యెహోవాకు మన సమర్పణను నెరవేర్చి, నిజమైన ఆనందాన్ని పొందడానికి మనం మన సాధారణ క్రైస్తవ క్రమాన్ని అనుసరించడాన్ని మన గురిగా వుంచుకుందాము.

8. మనం ఆనందంగా వుండాలంటే స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యం?

8 దేవుని ఆత్మఫలమైన సంతోషాన్ని (ఆనందాన్ని) పొందాలంటే, మనం స్వచ్ఛమైన మనస్సాక్షిని కలిగివుండాలి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు తన పాపాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నించినంతవరకు, ఆయన వేదనననుభవించాడు. వాస్తవానికి, ఆయన జీవిత సారం ఎండిపోయినట్లయ్యింది, ఆయన బహుశా శారీరకంగా అనారోగ్యంగా కూడా అయివుండవచ్చు. పశ్చాత్తాపపడి, పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన ఎంత ఉపశమనాన్ని పొందాడు! (కీర్తన 32:1-5) మనం ఏదైనా గంభీరమైన పాపాన్ని దాచుకున్నట్లయితే, మనం ఆనందంగా వుండలేము. అది మనం వేదనతో కూడిన జీవితాన్ని గడిపేలా చేయగలదు. నిజంగా, ఆనందాన్ని అనుభవించడానికి అది మార్గం కాదు. కాని ఒప్పుకోవడం మరియు పశ్చాత్తాపం ఉపశమనాన్ని కలిగించి, ఆనందకరమైన స్ఫూర్తిని తిరిగి పొందేలా చేస్తాయి.—సామెతలు 28:13.

ఆనందంతో ఎదురుచూడడం

9, 10. (ఎ) అబ్రాహాము ఏ వాగ్దానాన్ని పొందాడు, కాని ఆయన విశ్వాసం మరియు ఆనందం ఎలా పరీక్షించబడి యుండవచ్చు? (బి) మనం అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల ఉదాహరణల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

9 మనం మొదట దైవిక సంకల్పాన్ని నేర్చుకున్నప్పుడు ఆనందంగా వుండడం ఒక విషయమైతే, సంవత్సరాలు గడుస్తుండగా కూడా అలాగే ఆనందంగా వుండగలగడం మరో విషయం. విశ్వాసియైన అబ్రాహాము విషయంలో దీన్ని ఉదహరించవచ్చు. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించబోయిన తర్వాత, ఒక దూత యీ వర్తమానాన్ని తెలియజేశాడు: “నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆదికాండము 22:15-18) నిస్సందేహంగా, అబ్రాహాము ఈ వాగ్దానాన్ని బట్టి ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

10 వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను తీసుకువచ్చే “సంతానం” ఇస్సాకు అయ్యుంటాడని అబ్రాహాము ఎదురుచూసి వుండవచ్చు. కాని సంవత్సరాలు గడుస్తుండగా అద్భుతమైనదేది ఇస్సాకు ద్వారా సాధించబడక పోవడం అబ్రాహాము మరియు అతని కుటుంబం యొక్క విశ్వాసాన్ని, ఆనందాన్ని పరీక్షించి యుండవచ్చు. ఇస్సాకుకు, ఆ తర్వాత యాకోబుకు దేవుడు చేసిన వాగ్దాన ధృవీకరణ, సంతానం రావడం యింకా భవిష్యత్తులో జరుగుతుందని ధైర్యపర్చింది, వారు తమ విశ్వాసాన్ని, ఆనందాన్ని కాపాడుకోడానికి యిది వారికి సహాయం చేసింది. అయితే, అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుడు వారికి చేసిన వాగ్దానాలు నెరవేరడాన్ని చూడకుండానే మరణించారు, కాని వారు ఆనందం లేని యెహోవా సేవకులుగా లేరు. (హెబ్రీయులు 11:13) ఆయన వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ మనం కూడా యెహోవాకు విశ్వాసంతో, ఆనందంతో సేవ చేస్తూ వుండవచ్చు.

హింస వున్నప్పటికీ ఆనందం

11. హింసవున్నప్పటికీ మనం ఎందుకు ఆనందించవచ్చు?

11 మనం హింసలను ఎదుర్కొంటున్నప్పటికీ, యెహోవా సేవకులుగా మనం హృదయానందంతో యెహోవా సేవ చేయవచ్చు. తన కొరకు హింసింపబడేవారు ధన్యులని యేసు తెలియజేశాడు, అపొస్తలుడైన పేతురు యిలా చెప్పాడు: “క్రీస్తు మహిమ బయలుపరచ బడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.” (1 పేతురు 4:13, 14; మత్తయి 5:11, 12) మీరు నీతి కొరకు హింసను, బాధను సహిస్తున్నట్లయితే, మీకు యెహోవా ఆత్మ మరియు అంగీకారము వుంటాయి, అది నిజంగా ఆనందాన్ని అధికం చేస్తుంది.

12. (ఎ) విశ్వాస పరీక్షలను మనం ఆనందంతో ఎందుకు ఎదుర్కోవచ్చు? (బి) బందీగా వున్న ఒక లేవీయుని నుండి ఏ మూల పాఠాన్ని నేర్చుకోవచ్చు?

12 దేవుడు మన ఆశ్రయ దుర్గం గనుక మనం విశ్వాస పరీక్షలను ఆనందంగా ఎదుర్కోగలము. ఇది 42, 43 కీర్తనలలో రుజువు చేయబడింది. ఏదో కారణాన్ని బట్టి ఒక లేవీయుడు దేశబహిష్కరణ చేయబడ్డాడు. దేవుని ఆలయం వద్ద ఆరాధన చేయడాన్ని అతడు ఎంతగా కోరుకున్నాడంటే, అతడు తనను తాను, ఎండిన బీడు ప్రదేశంలో నీటి కొరకు ఆశించే దాహంగల దుప్పి వలె, లేక ఆడ జింక వలె భావించుకున్నాడు. యెహోవా కొరకు, ఆయన ఆలయం వద్ద దేవున్ని ఆరాధించే ఆధిక్యత కొరకు అతడు “తృష్ణగొన్నాడు” లేక అపేక్షించాడు. (కీర్తన 42:1, 2) యెహోవా ప్రజలతో మనం అనుభవించే సహవాసాన్నిబట్టి కృతజ్ఞత కలిగివుండేలా ఈ బహిష్కృతుని అనుభవం మనల్ని కదిలించాలి. హింస మూలంగా అలాంటి నిర్బంధం తాత్కాలికంగా మనం వారితో వుండకుండా మనల్ని నివారించినట్లయితే, గతంలో మనం కలిసి చేసిన పరిశుద్ధ సేవలోని ఆనందాలను గుర్తు చేసుకుని, తన ఆరాధికులతోపాటు క్రమ కార్యక్రమంలో పాల్గొనగలిగేలా చేసేందుకు “దేవుని యందు నిరీక్షణ” వుంచుతూ, సహనం కొరకు మనం ప్రార్థిద్దాము.—కీర్తన 42:4, 5, 11; 43:3-5.

“ఆనందముతో యెహోవాను సేవించుడి”

13. మనం దేవునికి చేసే సేవలో ఆనందం ఒక ప్రముఖ భాగమైయుండాలని కీర్తన 100:1, 2 ఎలా చూపిస్తుంది?

13 మనం దేవునికి చేసే సేవలో ఆనందం ఒక ప్రముఖ భాగమైయుండాలి. ఇది కృతజ్ఞత తెలియజేసే ఒక గీతంలో చూపించబడింది, దాన్ని కీర్తనల గ్రంథకర్త యిలా పాడాడు: “సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఆనందముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.” (కీర్తన 100:1, 2) యెహోవా “ఆనందము గల దేవుడు,” ఆయనకు తమ సమర్పణను నెరవేర్చడంలో తన సేవకులు సంతోషాన్ని పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11, NW) సమస్త దేశాల ప్రజలు యెహోవా యందు ఆనందించాలి, స్తుతిని గూర్చిన మన వ్యక్తీకరణలు, విజయమొందిన సైన్యం యొక్క ‘ఉత్సాహధ్వని’ వలె బలంగా వుండాలి. దేవునికి సేవచేయడం ఉత్సాహాన్నిస్తుంది గనుక, దానితోపాటు ఆనందం వుండాలి. అందుకే, “ఉత్సాహగానము చేయుచు” దేవుని సన్నిధికి రమ్మని కీర్తనల గ్రంథకర్త ప్రజలను కోరాడు.

14, 15. ఆనందభరితులైన యెహోవా ప్రజలకు కీర్తన 100:3-5 నేడు ఎలా వర్తిస్తుంది?

14 కీర్తనల గ్రంథకర్త యింకా యిలా జత చేశాడు: “యెహోవాయే దేవుడని తెలిసికొనుడి [గుర్తించుడి, గ్రహించుడి] ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.” (కీర్తన 100:3) యెహోవా మన సృష్టికర్త గనుక, గొర్రెల కాపరికి తన స్వంత గొర్రెలు చెందునట్లు, మనము ఆయన వారము. ఆయన మన గురించి ఎంతగా శ్రద్ధ వహిస్తాడంటే, మనం ఆయనను కృతజ్ఞతతో స్తుతిస్తాము. (కీర్తన 23) యెహోవా గురించి కీర్తనల గ్రంథకర్త యిలా కూడా పాడాడు: “కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.”—కీర్తన 100:4, 5.

15 నేడు, అన్ని దేశాలలోని ఆనందంగల ప్రజలు కృతజ్ఞత మరియు స్తుతి అందజేయడానికి యెహోవా ఆలయపు ప్రాంగణాలలోకి ప్రవేశిస్తున్నారు. మనం యెహోవా గురించి ఎల్లప్పుడూ మంచిగా మాట్లాడడం ద్వారా, దేవుని నామాన్ని ఆనందంగా ఘనపరుస్తాము, ఆయన ఘనమైన గుణాలు మనం ఆయనను స్తుతించడానికి మనల్ని పురికొల్పుతాయి. ఆయన పూర్తిగా మంచివాడు, తన సేవకుల యెడల ఆయనకు గల కృపాబాహుళ్యము లేక వాత్సల్యము నమ్ముకొనదగినది, ఎందుకంటే అది నిరంతరం కొనసాగుతుంది. తన చిత్తాన్ని చేసే వారి యెడల ప్రేమ చూపించడంలో యెహోవా “తరతరములు” యథార్థంగా వున్నాడు. (రోమీయులు 8:38, 39) గనుక, “ఆనందంతో యెహోవాను సేవించు”టకు మనకు మంచి కారణముంది.

మీ నిరీక్షణ యందు ఆనందించుడి

16. క్రైస్తవులు ఏ నిరీక్షణలు మరియు ఉత్తరాపేక్షలను బట్టి ఆనందించవచ్చు?

16 ‘నిరీక్షణ యందు ఆనందించుడి’ అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 12:12) యేసు క్రీస్తు యొక్క అభిషక్త అనుచరులు, దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పాటు చేసిన అమర్త్యమైన పరలోక జీవం యొక్క మహిమాన్విత నిరీక్షణ యందు ఆనందిస్తారు. (రోమీయులు 8:16, 17; ఫిలిప్పీయులు 3:20, 21) భూమి మీద పరదైసులో నిత్యజీవాన్ని పొందే నిరీక్షణ గల క్రైస్తవులకు కూడా ఆనందించడానికి కారణముంది. (లూకా 23:34) యెహోవా యొక్క నమ్మకమైన సేవకులందరూ రాజ్య నిరీక్షణ యందు ఆనందించడానికి కారణముంది, ఎందుకంటే వారు మహిమాన్విత ప్రభుత్వంలో ఒక భాగం కాగలరు లేక దాని భూపరిపాలనలో జీవించగలరు. ఎంత ఆనందకరమైన దీవెన!—మత్తయి 6:9, 10; రోమీయులు 8:18-21.

17, 18. (ఎ) యెషయా 25:6-8 నందు ఏమి ప్రవచింపబడింది? (బి) యెషయా యొక్క ఈ ప్రవచనం యిప్పుడు ఎలా నెరవేరుతుంది, భవిష్యత్తులో దాని నెరవేర్పు ఎలా వుంటుంది?

17 విధేయులైన మానవజాతి కొరకు యెషయా కూడా ఒక ఆనందభరితమైన భవిష్యత్తును గురించి ప్రవచించాడు. ఆయనిలా వ్రాశాడు: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును. సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనములమీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనులనిందను తీసివేయును ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.”—యెషయా 25:6-8.

18 యెహోవా ఆరాధికులుగా నేడు మనం భాగంవహించే ఆత్మీయ విందు నిజంగా ఆనందకరమైన విందే. వాస్తవానికి, ఆయన నూతన లోకం కొరకు వాగ్దానం చేసిన అక్షరార్థమైన మంచి విషయాల విందు కొరకు ఎదురుచూస్తూ మనం దేవున్ని ఆసక్తితో సేవిస్తే మన ఆనందం పొంగి పొర్లుతుంది. (2 పేతురు 3:13) ఆదాము పాపం మూలంగా మానవజాతిపై పరచబడిన “తెరను” యేసు బలి ఆధారంగా యెహోవా తీసివేస్తాడు. పాపం మరియు మరణం తీసివేయబడడాన్ని చూడడం ఎంత ఆనందకరంగా వుండగలదు! పునరుత్ధానం గావింపబడిన ప్రియమైనవారిని తిరిగి ఆహ్వానించడం, కన్నీళ్లు తీసివేయబడడాన్ని చూడడం, గొప్ప నిందించువాడైన అపవాదియగు సాతానుకు జవాబివ్వడానికి దేవునికి సమాధానమిచ్చిన యెహోవా ప్రజలు యిక నిందించబడని పరదైసు భూమిపై జీవించడం ఎంత ఆనందకరంగా వుంటుంది!—సామెతలు 27:11.

19. యెహోవా తన సాక్షులుగా మన యెదుట వుంచిన ఉత్తరాపేక్షలకు మనం ఎలా ప్రతిస్పందించాలి?

19 యెహోవా తన సేవకులకు ఏమి చేస్తాడనేది తెలుసుకోవడం మిమ్మల్ని ఆనందంతో, కృతజ్ఞతతో నింపదా? వాస్తవానికి, అలాంటి గొప్ప ఉత్తరాపేక్షలు మన ఆనందానికి దోహదపడతాయి! అంతేగాక, మన ఆశీర్వదింపబడిన నిరీక్షణ, ఆనంద ప్రేమలుకలిగి ధారాళంగా యిచ్చే మన దేవుని వైపు మనం యిలాంటి భావాలతో చూసేలా చేస్తుంది: “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని యున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము.” (యెషయా 25:9) మన ప్రకాశమానమైన నిరీక్షణను మన మనస్సులో దృఢంగా వుంచుకుని, యెహోవాను హృదయానందంతో సేవించడానికి మనం ప్రతి ప్రయత్నం చేద్దాము.

మీరెలా సమాధానమిస్తారు?

▫ మనం యెహోవాను “హృదయానందంతో” ఎలా సేవించగలము?

▫ మనం దేవునికి చేసే సేవలో ఆనందం లోపిస్తున్నట్లయితే మనం ఏమి చేయవచ్చు?

▫ హింస ఉన్నప్పటికీ యెహోవా ప్రజలు ఎందుకు ఆనందాన్ని కలిగివుండవచ్చు?

▫ మన నిరీక్షణ యందు ఆనందించడానికి మనకు ఏ కారణాలున్నాయి?

[17వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ జీవితపు అన్ని అంశాలలో భాగం వహించడం మన ఆనందాన్ని అధికం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి