యెహోవాను గూర్చిన ఆనందమే మన ఆశ్రయదుర్గం
“ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవాను గూర్చిన ఆనందమే మీకు ఆశ్రయ దుర్గము.”—నెహెమ్యా 8:10 (NW).
1, 2. (ఎ) ఆశ్రయ దుర్గమంటే ఏమిటి? (బి) తాను యెహోవా యందు ఆశ్రయం పొందానని దావీదు ఎలా చూపించాడు?
యెహోవా సాటిలేని ఆశ్రయ దుర్గం. ఆశ్రయ దుర్గమంటే ఏమిటి? అది ఒక రక్షణ స్థలము, భద్రత కలుగజేసే స్థలము లేక తప్పించుకోడానికి ఒక స్థలము. ప్రాచీన ఇశ్రాయేలు కాలంనాటి దావీదు దేవున్ని తన ఆశ్రయ దుర్గంగా భావించాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన “సౌలు చేతిలోనుండియు, అతని శత్రువులందరి చేతిలోనుండియు యెహోవా అతని తప్పించిన దినమున” దావీదు సర్వోన్నతునికి ఆలపించిన యీ గీతాన్ని పరిశీలించండి.—కీర్తన 18, పైవిలాసము.
2 ఆ కదిలించే గీతాన్ని దావీదు యీ మాటలతో ప్రారంభించాడు: “యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.” (కీర్తన 18:1, 2) ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఒక వ్యక్తి తప్పించుకోడానికి రక్షణ స్థలానికి పారిపోవునట్లుగా, రాజైన సౌలుచే అన్యాయంగా సమాజం నుండి బహిష్కరించబడి, తరుమబడిన నీతిమంతుడైన దావీదు యెహోవాయందు ఆశ్రయం పొందాడు.
3. ఎజ్రా దినాలనాటి యూదులు “గొప్ప సంభ్రమము” ఎందుకు పొందారు?
3 యథార్థతను కాపాడుకొనేవారిగా ఆయన మార్గమందు నడుచుకొనేవారికి యెహోవా యిచ్చే ఆనందం విఫలంకాని ఆశ్రయ దుర్గం వంటిది. (సామెతలు 2:6-8; 10:29) దేవుడిచ్చే ఆనందాన్ని పొందాలంటే, ప్రజలు దైవిక చిత్తాన్ని చేయాలి. దీనికి సంబంధించి, సా.శ.పూ. 468లో యెరూషలేమునందు ఏమి జరిగిందో పరిశీలించండి. ధర్మశాస్త్రాన్ని అర్థవంతంగా చదవడం ద్వారా శాస్త్రియైన ఎజ్రా మరి యితరులు అవగాహనను అందజేశారు. తర్వాత ప్రజలు యిలా కోరబడ్డారు: “పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవాను గూర్చిన ఆనందమే మీకు ఆశ్రయ దుర్గము.” యూదులు తాము పొందిన జ్ఞానాన్ని అన్వయించుకొని, ఆనందకరమైన పర్ణశాలల పండుగను ఆచరించడం వలన “గొప్ప సంభ్రమము” కలిగింది. (నెహెమ్యా 8:1-12 NW) ‘యెహోవాను గూర్చిన ఆనందమే తమ ఆశ్రయ దుర్గంగా గలవారు’ ఆయనను ఆరాధించి, ఆయన సేవ చేయడానికి బలం పొందారు. యెహోవాను గూర్చిన ఆనందమే వారి ఆశ్రయ దుర్గం గనుక, నేడు దేవుని ప్రజలు కూడా ఆనందంగా వుండాలని మనం ఎదురుచూడాలి. అయితే, వారు ఆనందించడానికున్న కొన్ని ప్రస్తుతదిన కారణాలు ఏమిటి?
“నిశ్చయముగా సంతోషింపవలెను”
4. యెహోవా ప్రజలకు ఆనందించడానికి ఒక విశేషమైన మూలం ఏమిటి?
4 ఆనందానికి ఒక విశేషమైన కారణం ఏమిటంటే, కలిసి సమావేశం కావడానికి యెహోవా చేసే ఏర్పాటు. ఇశ్రాయేలీయులు జరుపుకున్న వార్షిక పండుగలు వారి హృదయాలకు ఆనందాన్ని కలుగజేసినట్లుగానే, యెహోవాసాక్షుల సమావేశాలు వారికి నేడు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలకు యిలా చెప్పబడింది: “నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు [పర్ణశాలల] పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 16:13-15) అవును, వారు “నిశ్చయముగా సంతోషింపవలెను” అని దేవుడు కోరాడు. క్రైస్తవుల విషయంలోనూ యిదే వాస్తవం, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు తోటి విశ్వాసులను యిలా కోరాడు: “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.”—ఫిలిప్పీయులు 4:4.
5. (ఎ) ఆనందమంటే ఏమిటి, దాన్ని క్రైస్తవులు ఎలా పొందుతారు? (బి) శ్రమలు ఉన్నప్పటికీ మనం ఆనందాన్నెలా పొందవచ్చు?
5 మనం ఆనందంగా వుండాలని యెహోవా కోరుతున్నాడు గనుక, తన పరిశుద్ధాత్మ యొక్క ఫలాలలో ఒకదానిగా ఆయన సంతోషాన్ని (ఆనందాన్ని) మనకు యిస్తాడు. (గలతీయులు 5:22, 23) ఆనందమంటే ఏమిటి? అది, మంచి కొరకు ఎదురుచూడడం ద్వారా లేక పొందడం ద్వారా కలిగే సంతోషకరమైన భావన. ఆనందమంటే నిజమైన ఆనందకరమైన స్థితి, ఉత్సాహము కూడా. దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఈ ఫలం శ్రమలనెదుర్కునేటప్పుడు మనల్ని బలపరుస్తుంది. “ఆయన [యేసు] తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:2) శిష్యుడైన యాకోబు యిలా వ్రాశాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” కాని, ఒక ఫలానా శ్రమ గురించి ఏం చేయాలో మనకు తెలియకపోతే అప్పుడేమిటి? అప్పుడు, దానితో వ్యవహరించడానికి కావలసిన జ్ఞానాన్ని యివ్వమని మనం నమ్మకంగా ప్రార్థించవచ్చు. పరలోక జ్ఞానానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం, సమస్యలను పరిష్కరించుకోడానికి లేక యెహోవాను గూర్చిన ఆనందాన్ని కోల్పోకుండా, విడవని శ్రమలను ఎదుర్కోడానికి మనకు సహాయం చేస్తుంది.—యాకోబు 1:2-8.
6. ఆనందానికి సత్యారాధనకు మధ్య ఏ సంబంధం వుంది?
6 యెహోవా యిచ్చే ఆనందం సత్యారాధనను వృద్ధి చేయడానికి మనల్ని బలపరుస్తుంది. నెహెమ్యా మరియు ఎజ్రా దినాలలో అదే జరిగింది. యెహోవాను గూర్చిన ఆనందం తమ ఆశ్రయ దుర్గంగా గల ఆ కాలంనాటి యూదులు, సత్యారాధన యొక్క ఆసక్తులను కొనసాగించడానికి బలపర్చబడ్డారు. వారు యెహోవా ఆరాధనను వృద్ధి చేస్తుండగా, వారి ఆనందం అత్యధికమైంది. అదే నేడు కూడా వాస్తవమైయుంది. యెహోవా ఆరాధికులుగా, మనం గొప్ప ఆనందాన్ని పొందడానికి కారణమున్నది. మనం ఆనందించడానికున్న అనేక కారణాలలోని మరిన్ని యితర కారణాలను మనం యిప్పుడు పరిశీలిద్దాం.
క్రీస్తు ద్వారా దేవునితో సంబంధం
7. యెహోవా గురించి, ఆనందించడానికి క్రైస్తవులకు ఏ కారణం ఉంది?
7 యెహోవాతో మన సన్నిహిత సంబంధం మనం భూమిపై అత్యంత ఆనందకరమైన ప్రజలమయ్యేలా చేస్తుంది. క్రైస్తవులం కాకమునుపు, మనం ‘అంధకారమైన మనస్సుగలవారై, దేవుని వలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన’ అవినీతిపరులైన మానవ సమాజంలో భాగమైవుండే వారము. (ఎఫెసీయులు 4:18) యెహోవా నుండి మనమిక ఎంతమాత్రం వేరుపరచబడి లేనందుకు మనం ఎంతగా ఆనందిస్తాము! నిజమే, ఆయన దయను పొందుతూనే వుండాలంటే ఎంతో ప్రయత్నం అవసరం. మనం “పునాదిమీద కట్టబడినవారమై స్థిరముగా ఉండి, . . . ఈ సువార్తవలన కలుగు నిరీక్షణనుండి తొలగిపోక, విశ్వాసమందు నిలిచి” యుండాలి. (కొలొస్సయులు 1:21-23) “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని చెప్పిన యేసు స్వంత మాటలకు అనుగుణ్యంగా యెహోవా మనల్ని తన కుమారుని యొద్దకు చేర్చినందుకు మనం ఆనందించవచ్చు. (యోహాను 6:44) క్రీస్తు ద్వారా దేవునితో మనకున్న విలువైన సంబంధాన్ని మనం నిజంగా మెచ్చుకుంటే, దాన్ని పాడుచేయగల దేని నుండైనా మనం జాగ్రత్తగా వుంటాము.
8. మన ఆనందకరమైన పరిస్థితికి యేసు ఎలా దోహదపడ్డాడు?
8 యేసు విమోచనా క్రయధనమందు విశ్వాసముంచడం ద్వారా పాపాలకు క్షమాపణ అన్నది ఆనందించడానికి గొప్ప కారణం ఎందుకంటే, దేవునితో మనం సంబంధాన్ని కలిగివుండడాన్ని అదే సాధ్యం చేస్తుంది. ఇష్టపూర్వకంగా పాపం చేయడం ద్వారా మన పితరుడైన ఆదాము మానవజాతి అంతటిపైకి మరణాన్ని తెచ్చాడు. అయితే, అపొస్తలుడైన పౌలు యిలా వివరించాడు: “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” పౌలు యింకా యిలా వ్రాశాడు: “తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.” (రోమీయులు 5:8, 18, 19) అలాంటి ప్రేమపూర్వక ఏర్పాటును వినియోగించుకొనే ఆదాము సంతానాన్ని యెహోవా దేవుడు విడిపించడానికి యిష్టపడుతున్నాడంటే మనం ఎంతగా ఆనందించవచ్చు!
మతసంబంధ స్వాతంత్ర్యం, జ్ఞానాభివృద్ధి
9. మతసంబంధమైన దృక్కోణం నుండి మనం ఎందుకు ఆనందంగా ఉన్నాము?
9 ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నుండి స్వాతంత్ర్యం పొందడం, ఆనందించడానికి మరో కారణం. మనల్ని స్వతంత్రులను చేసింది దైవిక సత్యమే. (యోహాను 8:31, 32) ఈ మత సంబంధ వేశ్య నుండి స్వాతంత్ర్యమంటే మనం దాని పాపాలలో భాగం వహించం, దాని తెగుళ్లను అనుభవించం, దానితోపాటు నాశనం చేయబడము. (ప్రకటన 18:1-8) దానినంతటిని తప్పించుకుంటున్నందుకు ఏమాత్రం బాధపడ నవసరం లేదు!
10. యెహోవా ప్రజలుగా మనం ఏ జ్ఞానాభివృద్ధిని పొందుతాము?
10 దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, జీవితంలో అన్వయించుకోవడం గొప్ప ఆనందాన్ని పొందడానికి కారణాలు. అబద్ధ మత సంబంధ ప్రభావం నుండి స్వాతంత్ర్యం పొంది, “నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా మన పరలోకపు తండ్రి అందజేసే, అంతకంతకూ స్పష్టమయ్యే ఆత్మీయ జ్ఞానాన్ని మనం పొందుతాము. (మత్తయి 24:45-47) భూమి మీద జీవిస్తున్న ప్రజలందరిలో, యెహోవాకు ప్రత్యేకంగా సమర్పించుకున్న వారికి మాత్రమే ఆయన పరిశుద్ధాత్మ, ఆయన వాక్యం మరియు ఆయన చిత్తం యొక్క ఆశీర్వాదకరమైన గ్రహింపు ఉంటుంది. పౌలు చెప్పినట్లుగా అది యిలా వుంది: “మనకైతే దేవుడు వాటిని [ఆయన తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి] తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.” (1 కొరింథీయులు 2:9, 10) “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” అని చెప్పబడిన సామెతలు 4:18 నందలి మాటలలో సూచింపబడిన అంచెలంచెల అవగాహనను మనం పొందుతున్నామని మనం కృతజ్ఞత మరియు ఆనందం కలిగి వుండగలము.
రాజ్య నిరీక్షణ, నిత్యజీవము
11. ఆనందకరమైన రాజ్య నిరీక్షణ యితరులతో ఎలా పంచుకొనబడుతున్నది?
11 మన రాజ్య నిరీక్షణ కూడా మనల్ని ఆనంద భరితులను చేస్తుంది. (మత్తయి 6:9, 10) యెహోవాసాక్షులుగా మనం, మానవజాతంతటికి దేవుని రాజ్యమే ఏకైక నిరీక్షణ అని ఎప్పటి నుండో ప్రకటించాము. ఉదాహరణకు, ప్రపంచవ్యాప్తంగా 51 సమావేశాల్లో ఆనందంగా చేయబడిన స్తుతిలో ఒక తీర్మానం ద్వారా మనం యెహోవాసాక్షులు అనే పేరును పొందిన 1931వ సంవత్సరాన్ని పరిశీలించండి. (యెషయా 43:10-12) ఆ తీర్మానం మరియు (వాచ్‌టవర్ సంస్థ ఆనాటి అధ్యక్షుడు) జె. ఎఫ్. రూథర్‌ఫోర్డ్ యిచ్చిన సమావేశ ప్రసంగం రాజ్యము, ప్రపంచ నిరీక్షణ (ఆంగ్లం) అనే చిన్న పుస్తకంలో ప్రచురించబడ్డాయి. అదే సమావేశంలో తీసుకొనబడిన మరో తీర్మానం కూడా అంటే, క్రైస్తవమత సామ్రాజ్యాన్ని దాని మతభ్రష్టత్వాన్ని బట్టి, యెహోవా ఉపదేశాన్ని తృణీకరించడాన్ని బట్టి నిందిస్తున్న తీర్మానం కూడా అందులో వుంది. అది యింకా యిలా ప్రకటించింది: “ప్రపంచ నిరీక్షణ దేవుని రాజ్యమే, మరో నిరీక్షణ లేదు.” కొన్ని నెలల్లోనే, యెహోవాసాక్షులు ఈ చిన్నపుస్తకం యొక్క 50 లక్షల కంటే ఎక్కువ ప్రతులను భూవ్యాప్తంగా పంచిపెట్టారు. అప్పటి నుండి మనం తరచూ రాజ్యమే మానవజాతి ఏకైక నిరీక్షణ అని రూఢిగా చెబుతున్నాము.
12. యెహోవాను సేవించే వారి యెదుట ఏ ఆనందకరమైన జీవిత ఉత్తరాపేక్షలు ఉంచబడ్డాయి?
12 రాజ్య పరిపాలన క్రింద నిత్యజీవ ఉత్తరాపేక్షను బట్టి కూడా మనం ఆనందిస్తాము. అభిషక్త క్రైస్తవుల ‘చిన్న మంద’ ఆనందకరమైన పరలోక నిరీక్షణను కలిగివుంది. అపొస్తలుడైన పేతురు యిలా వ్రాశాడు: “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.” (లూకా 12:32; 1 పేతురు 1:3, 4) నేడు, యెహోవాసాక్షులలోని ఎక్కువశాతం మంది రాజ్యాధికారం క్రింద పరదైసులో నిత్యజీవం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తారు. (లూకా 23:43; యోహాను 17:3) మన ఆనందకరమైన ఉత్తరాపేక్షలతో పోల్చగల ఏదీ, భూమి మీద మరే ప్రజలకు లేదు. వాటిని మనం ఎంత ప్రియంగా భావించాలి!
ఆశీర్వదించబడిన సహోదరత్వం
13. మనం మన అంతర్జాతీయ సహోదరత్వాన్ని ఎలా దృష్టించాలి?
13 దేవుడు అంగీకరించిన ఏకైక అంతర్జాతీయ సహోదరత్వంలో బాగ మవ్వడం కూడా గొప్ప ఆనందానికి మూలం. సంతోషకరంగా, భూమిపై మనకు ఎంతో యిష్టులైన సహవాసులు ఉన్నారు. యెహోవా దేవుడు మన దినాల వైపు శ్రద్ధను మళ్లిస్తూ, తానే యిలా చెప్పాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.” (హగ్గయి 2:7) నిజమే, క్రైస్తవులందరూ అపరిపూర్ణులే. అయితే, యెహోవా యేసుక్రీస్తు ద్వారా అలాంటి వ్యక్తులను తన యొద్దకు ఆకర్షించుకున్నాడు. (యోహాను 14:6) తాను యిష్టులైనవారిగా భావించే వారిని యెహోవా తన యొద్దకు ఆకర్షించుకున్నాడు గనుక, వారి యెడల మనం సహోదర ప్రేమను చూపిస్తే, వారిని ఉన్నతంగా భావిస్తే, దైవిక విషయాల్లో వారితో సహకరిస్తే, వారి శ్రమల్లో వారికి చేయూత నిస్తే, వారి కొరకు ప్రార్థిస్తే, మన ఆనందం అత్యధికమౌతుంది.
14. మొదటి పేతురు 5:5-11 నుండి మనం ఏ ప్రోత్సాహాన్ని పొందవచ్చు?
14 ఇదంతా మన ఆనందానికి దోహదపడుతుంది. వాస్తవానికి, భూవ్యాప్తంగా మన ఆత్మీయ సహోదరత్వానికి యెహోవాను గూర్చిన ఆనందమే ఆశ్రయ దుర్గం. అవును, మనమందరం హింసను, యితర కష్టాలను ఎదుర్కొంటాము. కాని యిది మనల్ని సన్నిహితం చేసి, భూమిపైనున్న దేవుని ఏకైక నిజమైన సంస్థలో భాగంగా మనలో ఐక్యతా భావాన్ని కలిగించాలి. ఆయన మన కొరకు శ్రద్ధ వహిస్తాడని తెలుసుకుని మనం మన చింత యావత్తు ఆయనపై వేయడం ద్వారా, పేతురు చెప్పినట్లుగా దేవుని బలమైన చేతి క్రింద మనల్ని మనం తగ్గించుకోవాలి. సాతాను మనల్ని మ్రింగాలని ప్రయత్నిస్తాడు గనుక మనం జాగ్రత్త కలిగివుండవలసిన అవసరం వుంది, కాని యిందులో మనం ఒంటరివాళ్లం కాదు, ఎందుకంటే పేతురు యింకా యిలా తెలియజేస్తున్నాడు: “లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” ఈ ఆనందకరమైన అంతర్జాతీయ సహోదరత్వం ఎన్నటికీ అంతం కాదు, ఎందుకంటే ‘కొంచెము కాలము మనం శ్రమపడిన పిమ్మట, దేవుడు మన శిక్షణను ముగించి మనల్ని పూర్ణులనుగాచేసి స్థిరపరుస్తాడనే’ వాగ్దానం మనకుంది. (1 పేతురు 5:5-11) దాని గురించి ఆలోచించండి. మన ఆనందకరమైన సహోదరత్వం నిరంతరం నిలుస్తుంది!
సంకల్పం గల జీవితం
15. యెహోవాసాక్షులు సంకల్పవంతమైన జీవితాన్ని కలిగివున్నారని ఎందుకు చెప్పవచ్చు?
15 మనకు ఒక సంకల్పం గల జీవితం వుంది గనుక, ఈ కష్టాలతో నిండివున్న లోకంలో ఆనందం మనది. మనల్ని, అలాగే యితరులను సంతోషపర్చే పరిచర్య మనకు అప్పగించబడింది. (రోమీయులు 10:10) దేవుని తోటి పనివారిగా వుండడం నిజంగా సంతోషకరమైన ఆధిక్యత. ఈ విషయంలో, పౌలు యిలా చెప్పాడు: “అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసినవాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు.”—1 కొరింథీయులు 3:5-9.
16, 17. యెహోవా ప్రజలకు సంకల్పం గల ఆనందభరితమైన జీవితాలు వున్నాయని నిరూపించడానికి ఏ ఉదాహరణలను మనం చెప్పవచ్చు?
16 యెహోవాను యథార్థంగా సేవించడం ద్వారా మనల్ని ఆనందంతో నింపే సంకల్పం గల జీవితాన్ని కలిగివుండవచ్చునని చూపించడానికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. అలాంటిదే ఈ వ్యాఖ్యానం: “నేను నిండుగావున్న రాజ్యమందిరాన్ని [దాని సమర్పణ కార్యక్రమ దినాన] పరికించినప్పుడు, నేను, నా భార్య, నా ముగ్గురు పిల్లలు వారి వివాహ జతలతో కలిపి మొత్తం నా కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులు అక్కడ వుండడాన్ని చూడగలిగాను. . . . నేను నా భార్య దేవుని సేవలో నిజంగా ఆనందకరమైన, సంకల్పవంతమైన జీవితాన్ని కలిగివున్నాము.”
17 ఒక వ్యక్తి ఏ వయస్సులోనైనప్పటికీ యెహోవా సేవలో నిజమైన సంకల్పంగల ఆనందకరమైన జీవితాన్ని ప్రారంభించ వచ్చునని తెలుసుకోవడం కూడా ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉదాహరణకు, ఒక నర్సింగ్‌హోమ్‌లో బైబిలు సత్యం నేర్చుకున్న ఒక స్త్రీ, 102 సంవత్సరాల వయస్సులో యెహోవాసాక్షులలో ఒకతెగా బాప్తిస్మం తీసుకుంది. ఆమె అలా, ‘సత్యదేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుకొని’ తన జీవితాన్ని ఆనందకరమైన సంకల్పంతో ముగించింది.—ప్రసంగి 12:13.
విఫలంకాని ఆశ్రయ దుర్గం
18. నిరాశను అధిగమించి, మన ఆనందాన్ని అధికం చేసుకోడానికి ఏమి చేయవచ్చు?
18 విశ్వాసులకు యెహోవాను గూర్చిన ఆనందం ఒక విఫలంకాని ఆశ్రయ దుర్గం. అయినా, ఈ ఆనందాన్ని కలిగివుంటామంటే దాని భావం, “నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగియున్నది” అని యేసు గెత్సేమనే తోటలో చెప్పడానికి కదిలింపబడినటువంటి దుఃఖకరమైన ఘడియలు ఎన్నడూ రావని దాని భావం కాదు. (మార్కు 14:32-34) మనం స్వార్థపూరిత గమ్యాల కొరకు మొగ్గుచూపడం వల్ల నిరాశ ఏర్పడిందనుకోండి. అప్పుడు మనం మన జీవన విధానాన్ని మార్చుకుందాము. లేఖనాధార బాధ్యతల బరువైన భారాన్ని మనం నిస్వార్థంగా మోయడం వల్ల మన ఆనందం తగ్గిపోతే, బహుశా ఒత్తిడిని తగ్గించి మన సంతోషకరమైన స్ఫూర్తిని తిరిగి నెలకొల్పే మార్పులను మనం చేసుకోవచ్చు. అంతేగాక, పాపయుక్తమైన శరీరాన్ని, దుష్ట ప్రపంచాన్ని, సాతానును తీవ్రంగా ఎదుర్కోవడం ద్వారా మనం యెహోవాను ప్రీతిపర్చాలని ప్రయత్నిస్తే, యెహోవా మనల్ని ఆనందంతో ఆశీర్వదిస్తాడు.—గలతీయులు 5:24; 6:14; యాకోబు 4:7.
19. దేవుని సంస్థలో మనకున్న ఏ ఆధిక్యతలనైనా మనం ఎలా దృష్టించాలి?
19 మనం చర్చించిన కారణాలను బట్టి, మరితర అనేకమైన వాటిని బట్టి, మనకు గొప్ప ఆనందం వుంది. మనం సంఘ ప్రచారకులమైనప్పటికీ లేక మరితర విధమైన పూర్తికాల పరిచర్యలో భాగం వహిస్తున్నప్పటికీ, మనందరం ప్రభువు కార్యాభివృద్ధి యందు చేయడానికి ఎంతో పని కలిగివుండవచ్చు, తప్పకుండా యిది మన ఆనందానికి దారితీయగలదు. (1 కొరింథీయులు 15:58) యెహోవా సంస్థలో మనకు ఏ ఆధిక్యతలు వున్నప్పటికీ, వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగివుండి, మన ప్రేమపూర్వక, శ్రీమంతుడగు దేవునికి పరిశుద్ధ సేవ చేయడంలో ఆనందంగా కొనసాగుదాము.—1 తిమోతి 1:11.
20. మన అత్యంత గొప్ప ఆధిక్యత ఏమిటి, దేని గురించి మనం నమ్మకం కలిగివుండవచ్చు?
20 ఆయన సాక్షులుగా యెహోవా ఘనమైన నామానికి ప్రాతినిధ్యం వహించే మన ఆధిక్యతను బట్టి కూడా మనం సంతోషించడానికి ప్రత్యేకంగా మనకు కారణం వుంది. అవును, మనం అపరిపూర్ణులం, ఎన్నో శ్రమలను ఎదుర్కొంటాము, కాని యెహోవాసాక్షులుగా మనకున్న అద్భుతమైన ఆశీర్వాదాలను మనం ఎప్పుడూ మనస్సులో ఉంచుకుందాము. మన ప్రియమైన పరలోకపు తండ్రి మనకు ఎన్నడూ నిరాశ కలిగించడని గుర్తుంచుకోండి. యెహోవాను గూర్చిన ఆనందం మన ఆశ్రయ దుర్గంగా వుంటే, మనం ఎల్లప్పుడూ ఆశీర్వదింపబడతామని మనం కచ్చితంగా నమ్మవచ్చు.
మీరెలా సమాధానమిస్తారు?
▫ “యెహోవాను గూర్చిన ఆనందం” అంటే ఏమిటి?
▫ క్రైస్తవులు నిజమైన ఆనందాన్ని ఎలా పొందుతారు?
▫ యెహోవాసాక్షులు ఎందుకు ఆనందంగా వుంటారనే దానికి కొన్ని కారణాలు ఏమిటి?
▫ యెహోవాను గూర్చిన ఆనందం విఫలంకాని ఆశ్రయ దుర్గం ఎందుకైయున్నది?