ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—ప్యూర్టోరికో
కరేబియా సముద్రం మరియు అట్లాంటికా మహా సముద్రం మధ్య ఐశ్వర్యవంతమైన ఉష్టమండల ద్వీపమైన ప్యూర్టోరికో ఉంది. దాన్ని క్రిస్టఫర్ కొలంబస్ 1493 నందు స్పెయిన్ ప్రాంతమని అన్నాడు మరి బాప్తిస్మమిచ్చు యోహాను పేరట, సాన్ హ్వన్ బటెస్టా అని దానికి నామకరణం చేశాడు. దానిలోని అతి పెద్ద పట్టణాన్ని ఎంతోకాలంగా ప్యూర్టోరికో అని లేక “రిచ్ పోర్ట్” అని పిలిచేవారు. రానురాను ఈ పేరు పూర్తి ద్వీపానికి వచ్చేసింది, అయితే ఆ పట్టణం మాత్రం సాన్ హ్వన్ అని పిలువబడుతుంది.
ప్యూర్టోరికో ఎన్నో రంగాల్లో గొప్ప ఓడ రేవుగా నిరూపించబడింది. స్పానిష్ రాజరికపు తొలి సంవత్సరాల్లో ఎంతో బంగారం యిక్కడనుండి ఓడల ద్వారా రవాణా అయ్యేది. నేడు దాని ఆర్థిక పరిస్థితికి దోహదపడేది ఉత్పాదక మరియు సహాయక కర్మాగారాలైనప్పటికీ, ఇప్పుడు ఆ ద్వీపం చెరకును, కాఫీని, అరటిపండ్లను, మరియు సిట్రస్ పండ్లను ఎగుమతిచేస్తోంది. అయినప్పటికీ, మరి ప్రాముఖ్యమైన భావంలో ప్యూర్టోరికో గొప్ప ఓడరేవు అయ్యింది.
దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త యిక్కడ 1930లలో ప్రకటించబడడం ప్రారంభమైంది. నేడు, ప్యూర్టోరికోలో 25,000 కంటే ఎక్కువమంది సువార్త ప్రచారకులు ఉన్నారు. వాచ్‌టవర్ సంస్థ యొక్క బ్రాంచి నందలి సిబ్బంది 1993 నందు 23 నుండి 100 వరకు పెరిగింది. ఎందుకంటే, స్పానిష్ భాషలోకి బైబిలు ప్రచురణల అనువాదాన్ని పర్యవేక్షించేందుకు గాను ఈ అభివృద్ధి అవసరమైంది, అది 35,00,00,000 మంది స్పానిష్ మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అటువంటి సాహిత్యాలను అందుబాటు చేసింది.
కొత్త ప్రాంతం
బ్రాంచి కార్యాలయం యిలా కూడా నివేదిస్తోంది: “ప్యూర్టోరికో నందు ఒక కొత్త ప్రాంతం తెరవబడింది, ఎందుకంటే రాజ్య వర్తమానాన్ని మేము చెవిటివారికి అందించే ప్రయత్నాలను చేస్తున్నాము. ఒక సహోదరి ఈ క్రింది అనుభవాన్ని చెబుతోంది: ‘నేను చెవిటివారి మధ్య పనిచేస్తున్నాను, మరి యిద్దరు చంటి పిల్లలున్న ఒక మహిళను నేను సందర్శించాను. నేను ఒక సాక్షిని అని ఆమె గ్రహించిన వెంటనే ఆమె వద్దనేసింది. ఎందుకంటే ఆమెలాగే చెవిటివాడైన ఆమె భర్త యెహోవా సాక్షులను యిష్టపడేవాడు కాదు.
“‘కొన్ని నెలల తర్వాత అదే స్త్రీ, సాక్షులతో బైబిలు పఠిస్తున్న ఒక స్నేహితురాలిని సందర్శించింది. ఆమె పఠనంలో కూర్చుని దాన్ని ఎంతగానో యిష్టపడింది. నేను మరలా ఆ స్త్రీని కలిశాను, ఆమె భర్తకు సాక్షులు అంటే యిష్టంలేదని ఆమె మరలా చెప్పింది. అయినప్పటికీ, ఆమెకు బైబిలును అర్థం చేసుకోవాలని ఉంది, మరి ఆమె చర్చివారు ఏమీ బోధించేవారు కాదు కనుక ఆమె విసుగుచెందింది. ఒక కరపత్రం ఉపయోగించి మేము పఠనం ప్రారంభించాము. తన భర్త శనివారం ఉంటాడు కనుక నన్ను ఆ రోజు రమ్మని ఒకరోజు నాతో ఆమె చెప్పింది. “కానీ ఆయనకు మేమంటే యిష్టంలేదనుకుంటాను కదా?” అని నేను అడిగాను. దానికి ఆమె యిలా జవాబు చెప్పింది: “అసలు యిది ఏమిటో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు.”
“‘మరుసటి రోజు వాళ్లిద్దరు నా తలుపు తట్టారు. ఆమె భర్తకు చాలా ప్రశ్నలు ఉండడం వల్ల, బధిరుల కొరకు జరిగే మన కూటాలకు వారిని ఆహ్వానించాను. నేను వెళ్లకముందే ఆయన వచ్చాడు, ఆ నాటి నుండి ఆయన ఎన్నడూ ఒక్క కూటానికి కూడా హాజరుకాకుండా ఉండలేదు. ఆయన యితర బధిరులకు ప్రకటిస్తున్నాడు, సమావేశానికి హాజరయ్యాడు, అంతేకాకుండ బాప్తిస్మము పొందాలని ఎదురుచూస్తున్నాడు.’”
బ్రాంచి నివేదిక యింకా యిలా చెబుతోంది: “ఈ ఏడాది మా జిల్లా సమావేశంలో, కార్యక్రమమంతా కూడా సంజ్ఞ భాషలో అందించబడింది కనుక, ఎంతో మంది బధిరులు తమ కుటుంబాలతో సహా హాజరయ్యారు. చివరి ప్రసంగ సమయంలో బధిరుల మధ్య జరిగే పనిని గూర్చి ప్రస్తావించి, సుమారు 70 మంది హాజరయ్యారని ప్రసంగీకుడు చెప్పినప్పుడు ఎంతో భావోద్రేకమైన సమయం వచ్చింది. ఎంతో పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు, కానీ, ప్రసంగీకుడు చెప్పినట్లుగా బధిరులు దాన్ని వినలేరు. కనుక, బధిరులను ప్రేక్షకులవైపు చూడమని చెబుతూ ప్రసంగీకుడు ‘బధిరులైన మీ సహోదరులు మీ మధ్య యిక్కడ ఉన్నందుకు మీరు ఆనందిస్తున్నారా?’ అన్న ప్రశ్నను మరలా అడిగి, రెండు చేతులు ఊపడం ద్వారా హర్షధ్వానాలు చేయమని ప్రేక్షకులను కోరాడు. తమ చేతులను ఊపడం ద్వారా 11,000 మంది సహోదర సహోదరీలు తమ అంగీకారాన్ని చూపించడం కనుల విందుగా ఉంది. బధిరులైన మన సహోదర సహోదరీలు ఎంతగానో ఆనందించారు, అంతేకాకుండ గొప్ప సహోదరత్వంలో తాము కూడా భాగాన్ని కల్గివున్నామని వారు భావించారు. అనేకులు ఆనంద బాష్పాలను రాల్చారు.”
ప్యూర్టోరికో నందు యెహోవాసాక్షులు కోతపనిలో భాగం వహిస్తుండగా అది నిస్సందేహంగా గొప్ప ఓడ రేవుగా కొనసాగుతుంది. యెహోవా గృహం మహిమతో నిండి ఉండేలా “అన్యజనులందరి యిష్టవస్తువులు” అని తాను పిలిచే దేవుని “గొఱ్ఱెలు” వస్తూనే ఉంటాయి.—యోహాను 10:16; హగ్గయి 2:7.
[9వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1994 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 25,239
నిష్పత్తి: 1 సాక్షికి 139
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 60,252
సగటు పయినీర్ ప్రచారకులు: 2,329
సగటు బైబిలు పఠనాలు: 19,012
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 919
సంఘాల సంఖ్య: 312
బ్రాంచి కార్యాలయం: గ్యానాబొ