బలహీనత, దుష్టత్వం మరియు పశ్చాత్తాపాలను నిర్థారించుట
పాపం అంటే క్రైస్తవులు అసహ్యించుకునేది—యెహోవా నీతియుక్తమైన కట్టడల నుండి పడిపోవడం. (హెబ్రీయులు 1:9) దుఃఖకరంగా, మనమందరం అప్పుడప్పుడు పాపం చేస్తూనే వుంటాము. మనమందరం వారసత్వంగా వచ్చిన బలహీనత, అపరిపూర్ణతలతో పోరాడుతుంటాము. అయితే, అనేక సందర్భాలలో, మనం యెహోవా యెదుట మన తప్పులు ఒప్పుకొని, వాటిని మళ్లీ చేయకుండా వుండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే, మనం ఆయనను నిర్మలమైన మనస్సాక్షితో సమీపించవచ్చు. (రోమీయులు 7:21-24; 1 యోహాను 1:8, 9; 2:1, 2) మనకు బలహీనతలున్నప్పటికీ, విమోచన బలి ఆధారంగా, ఆయన మన పరిశుద్ధ సేవను అంగీకరిస్తాడు గనుక మనం యెహోవాకు కృతజ్ఞత తెలియజేస్తాము.
ఎవరైనా శారీరక బలహీనత వల్ల గంభీరమైన పాపంలో పడిపోతే, యాకోబు 5:14-16 నందు యివ్వబడిన ఈ పద్ధతికి అనుగుణ్యంగా తక్షణమే కాపరి అతడిని దర్శించడం అవసరం: “మీలో ఎవడైనను [ఆత్మీయంగా] రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; . . . అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి.”
ఒక సమర్పించుకున్న క్రైస్తవుడు ఎంతో ఘోర పాపం చేసినట్లయితే, యెహోవా యెదుట వ్యక్తిగతంగా ఒప్పుకోవడం కంటే ఎక్కువే అవసరం. సంఘ పరిశుభ్రత లేక సమాధానం ప్రమాదంలో పడుతుంది గనుక పెద్దలు కొన్ని చర్యలు గైకొనాలి. (మత్తయి 18:15-17; 1 కొరింథీయులు 5:9-11; 6:9, 10) పెద్దలు యీ విషయాలు నిర్థారించాలి: ఆ వ్యక్తి పశ్చాత్తాప పడుతున్నాడా? పాపం చేయడానికి ఏది నడిపించింది? అది కేవలం క్షణికమైన బలహీనత యొక్క ఫలితమా? అది పాపం చేసే అలవాటా? ఇలాంటి నిర్థారణ ఎల్లప్పుడూ సుళువైనది లేక స్పష్టమైనది కాదు, దానికి ఎంతో వివేచన అవసరం.
ఆ పాపం చెడు నడవడిని, దుష్ట స్వభావాన్ని కలిగివుండడం వల్ల చేసినదైతే, అప్పుడేమిటి? అప్పుడు పెద్దల బాధ్యత సుస్పష్టం. కొరింథు సంఘంలో ఒక గంభీరమైన విషయంతో వ్యవహరించడానికి నడిపింపునిస్తూ, అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (1 కొరింథీయులు 5:13) క్రైస్తవ సంఘంలో దుర్మార్గులకు ఎంతమాత్రం స్థానం లేదు.
బలహీనత, దుష్టత్వం మరియు పశ్చాత్తాపాలను తూచిచూచుట
ఎవరైనా పశ్చాత్తాప పడుతుంటే పెద్దలు ఎలా తెలుసుకోగలరు?a ఇది సామాన్యమైన ప్రశ్న కాదు. ఉదాహరణకు దావీదు రాజు గురించి ఆలోచించండి. అతడు వ్యభిచారం చేశాడు, తర్వాత దాని ఫలితంగా, హత్య చేశాడు. అయినా, యెహోవా అతడు జీవించివుండడానికి అనుమతించాడు. (2 సమూయేలు 11:2-24; 12:1-15) అననీయ మరియు సప్పీరా గురించి ఆలోచించండి. తాము ఉన్నదానికంటే యింకా ఎంతో ఉదారంగా వున్నట్లు చూపించడానికి కపటముతో ప్రయత్నిస్తూ, వారు అబద్ధమాడుతూ అపొస్తలులను మోసగించడానికి ప్రయత్నించారు. గంభీరమైనదా? అవును. హత్య మరియు వ్యభిచారమంత చెడ్డదా? కాదు! అయినా, అననీయ మరియు సప్పీరా తమ జీవితాలను మూల్యంగా చెల్లించారు.—అపొస్తలుల కార్యములు 5:1-11.
ఎందుకు భిన్నమైన తీర్పులు? శారీరక బలహీనత వల్ల దావీదు గంభీరమైన పాపంలో పడిపోయాడు. తాను చేసినదాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అతడు పశ్చాత్తాప పడ్డాడు, తన కుటుంబంలోని సమస్యలకు సంబంధించి అతడు తీవ్రంగా క్రమశిక్షణ చేయబడినప్పటికీ, యెహోవా అతన్ని క్షమించాడు. అననీయ మరియు సప్పీరా క్రైస్తవ సంఘాన్ని మోసగించడానికి ప్రయత్నిస్తూ, కపటముతో అబద్ధమాడారు. ఫలితంగా ‘పరిశుద్ధాత్మను, దేవున్ని మోసగించి’ పాపం చేశారు. అది ఒక దుష్ట హృదయానికి నిదర్శనంగా రుజువయ్యింది. గనుక, వారు మరింత తీవ్రంగా తీర్పు తీర్చబడ్డారు.
రెండు సందర్భాల్లోను యెహోవా తీర్పుతీర్చాడు, ఆయన హృదయాలను పరీక్షించగలడు గనుక ఆయన తీర్పు సరైనది. (సామెతలు 17:3) మానవ పెద్దలు ఆ పని చేయలేరు. గనుక, ఒక గంభీరమైన పాపం దుష్టత్వానికంటే బలహీనతకు ఎక్కువ నిదర్శనంగా వుందో లేదో పెద్దలు ఎలా గ్రహించగలరు?
వాస్తవానికి, అన్ని పాపాలు దుష్టమైనవే, కాని పాపులందరు దుష్టులుకారు. కొన్ని పాపాలు ఒక వ్యక్తిలోనున్న బలహీనతకు నిదర్శనం కావచ్చు, మరొకరిలో అవే దుష్టత్వానికి నిదర్శనం కావచ్చు. సాధారణంగా పాపం చేయడం పాపి విషయంలో కొంత బలహీనతకు, కొంత దుష్టత్వానికి మూలమై వుండవచ్చు. దాన్ని నిర్థారించడానికి, పాపి తాను చేసినదాన్ని ఎలా దృష్టిస్తున్నాడు, దాని గురించి తాను ఏమి చేయాలను కుంటున్నాడు అనేది మూలం. అతడు పశ్చాత్తాప దృక్పథాన్ని చూపిస్తున్నాడా? యిది గ్రహించడానికి పెద్దలకు వివేకం అవసరం. వారు ఆ వివేకాన్ని ఎలా పొందగలరు? అపొస్తలుడైన పౌలు తిమోతికి యిలా వాగ్దానం చేశాడు: “నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.” (2 తిమోతి 2:7) పౌలు మరియు యితర బైబిలు వ్రాతగాళ్ల ప్రేరేపిత మాటలను పెద్దలు ఎడతెగక “ఆలోచించు” కొంటే, సంఘంలో పాపం చేసేవారిని సరైన విధంగా దృష్టించడానికి కావలసిన వివేకాన్ని వారు పొందగలరు. అప్పుడు, వారి నిర్ణయాలు తమ స్వంత ఆలోచనను కాకుండా, యెహోవా ఆలోచనను ప్రతిబింబిస్తాయి.—సామెతలు 11:2; మత్తయి 18:18.
ఇదెలా జరుగుతుంది? ఒక మార్గం ఏమిటంటే, దుష్టులను బైబిలు ఎలా వర్ణిస్తుందో పరిశీలించి, వ్యవహరించ బడుతున్న వ్యక్తికి ఆ వివరణ సరిపోతుందా అని చూడడం.
బాధ్యత వహించడం, పశ్చాత్తాపపడడం
దుష్టమార్గాన్ని ఎన్నుకొన్న మొదటి మానవులు ఆదాము, హవ్వ. వారు పరిపూర్ణులుగా వున్నప్పటికీ, యెహోవా ఆజ్ఞల గురించి పూర్తి జ్ఞానం కలిగివున్నప్పటికీ, వారు దైవిక సర్వాధిపత్యానికి ఎదురుతిరిగారు. వారు చేసిన దానితో యెహోవా వారిని ఎదుర్కొన్నప్పుడు, వారి ప్రతిస్పందనలు గమనించదగినవి—ఆదాము హవ్వను నిందించాడు, హవ్వ సర్పాన్ని నిందించింది! (ఆదికాండము 3:12, 13) దీన్ని దావీదు మిక్కుటమైన దీనత్వంతో పోల్చండి. ఆయన తన గంభీరమైన పాపాలను ఎదుర్కొన్నప్పుడు, అతడు బాధ్యతను స్వీకరించి, యిలా చెబుతూ, క్షమాపణ కొరకు ప్రార్థించాడు: ‘నేను యెహోవా యెదుట పాపము చేసితిని.’—2 సమూయేలు 12:13; కీర్తన 51:4, 9, 10.
గంభీరమైన పాపాలకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు, ప్రాముఖ్యంగా ఒక పెద్ద వయస్సు వ్యక్తికి సంబంధించినప్పుడు, పెద్దలు ఈ రెండు ఉదాహరణలను పరిగణలోకి తీసుకోవాలి. పాపం చేసిన వ్యక్తి—తన తప్పు గురించి ఒప్పించబడినప్పుడు దావీదు వలె—వెంటనే నిందను అంగీకరించి, పశ్చాత్తాపపడి సహాయం మరియు క్షమాపణ కొరకు యెహోవా వైపు చూస్తాడా, లేక తాను చేసినదాన్ని తగ్గించడానికి, బహుశా యితరులను నిందించడానికి ప్రయత్నిస్తాడా? నిజమే, పాపం చేసిన వ్యక్తి తాను అలా చేయడానికి నడిపించిన క్రియలేమిటో వివరించాలని కోరుకోవచ్చు, అతనికి ఎలా సహాయం చేయాలనేది నిర్ణయించేటప్పుడు పెద్దలు పరిగణలోకి తీసుకోవలసిన అవసరతగల ప్రస్తుత లేక పూర్వపు పరిస్థితులు వుండవచ్చు. (హోషేయ 4:14 పోల్చండి.) కాని పాపం చేసింది తానేనని, యెహోవా యెదుట తానే బాధ్యుడనని అతడు అంగీకరించాలి. గుర్తుంచుకోండి: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”—కీర్తన 34:18.
చెడును అలవాటుగా చేయడం
కీర్తనల గ్రంథంలో, దుష్ట ప్రజలను గూర్చిన అనేక విషయాలు వున్నాయి. ఒక వ్యక్తి నిజంగా దుష్టుడా లేక బలహీనుడా అనేది తెలుసుకోడానికి అలాంటి లేఖనాలు పెద్దలకు మరింత సహాయం చేయగలవు. ఉదాహరణకు, దావీదు రాజు ప్రేరేపిత ప్రార్థనను పరిశీలించండి: “దుష్టులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడుదురు.” (కీర్తన 28:3 NW) దుష్ట ప్రజలు “పాపము చేయువారి”తో సమానంగా పరిగణించబడడం గమనించండి. శారీరక బలహీనత వల్ల పాపంచేసే వ్యక్తి తన తప్పు తెలుసుకున్నప్పుడు వెంటనే దాన్ని మానేస్తాడు. అయితే, ఎవరైనా చెడును తన జీవితంలో ఒక భాగమయ్యేలా ‘అలవాటుగా’ చేస్తున్నట్లయితే, అది దుష్ట హృదయానికి నిదర్శనం కావచ్చు.
ఆ వచనంలో దావీదు దుష్టత్వం యొక్క మరో లక్షణాన్ని తెలియజేశాడు. అననీయ, సప్పీరాలవలె, దుష్టుడు తన నోటితో మంచి విషయాలు మాట్లాడతాడు కాని తన హృదయంలో చెడు విషయాలు కలిగివుంటాడు. యేసు కాలంనాటి, ‘మనుష్యులకు నీతిమంతులుగా కనబడుతూ, లోపల వేషధారణతో, అక్రమంతో నిండి’ వుండిన పరిసయ్యులవలె అతడు వేషధారి అయివుండవచ్చు. (మత్తయి 23:28; లూకా 11:39) యెహోవా వేషధారణను అసహ్యించుకుంటాడు. (సామెతలు 6:16-19) న్యాయనిర్ణయ కమిటీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక వ్యక్తి తన గంభీరమైన పాపాలను నిరాకరించడానికి వేషధారణగా ప్రయత్నిస్తే, లేక యితరులకు యిప్పటికి తెలిసిపోయినదానిని మాత్రమే సణుగుతూ అంగీకరించి, పూర్తిగా ఒప్పుకోడానికి నిరాకరిస్తే, అది నిజంగా దుష్ట హృదయానికి నిదర్శనం కాగలదు.
యెహోవా యెడల గర్వంతో కూడిన నిర్లక్ష్యం
దుష్టుని సూచించే యితర లక్షణాలు కీర్తన 10 నందు చెప్పబడ్డాయి. అక్కడ మనమిలా చదువుతాము: “దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుముచున్నాడు . . . వాడు యెహోవాను అగౌరవపరచెను.” (కీర్తన 10:2, 3, NW) అహంకారియై, యెహోవాను అగౌరవపర్చే సమర్పిత క్రైస్తవున్ని మనం ఎలా దృష్టించాలి? నిజంగా, యివి దుష్ట మానసిక దృక్పథాలు. బలహీనత వల్ల పాపం చేసే వ్యక్తి, తన పాపాన్ని తెలుసుకున్నప్పుడు లేక అది అతని దృష్టికి తేబడినప్పుడు, పశ్చాత్తాపపడి తన జీవన విధానాన్ని మార్చుకోడానికి ప్రయత్నిస్తాడు. (2 కొరింథీయులు 7:10, 11) బదులుగా, ఒక వ్యక్తి ప్రాథమికంగా యెహోవా యెడల అగౌరవంతో పాపం చేస్తే, అతడు పదే పదే ఆ పాపపు విధానానికి మరలకుండా ఏది అతన్ని ఆపుతుంది? దీనత్వంతో ఉపదేశం యివ్వబడినప్పటికీ, అతడు గర్వంగా వున్నట్లయితే, యథార్థంగా, నిజంగా, పశ్చాత్తాప పడడానికి అవసరమైన దీనత్వాన్ని అతడు ఎలా పొందగలడు?
అదే కీర్తనలోని దావీదు యొక్క తర్వాతి మాటలను పరిశీలించండి: “దుష్టుడు యెహోవాను ఎందుకు అగౌరవ పర్చాడు? వాడు తన హృదయంలో యిలా అనుకున్నాడు: ‘నీవు విచారణ చేయవు.’” (కీర్తన 10:13, NW) క్రైస్తవ సంఘ పరిధిలో, దుష్టునికి మంచి చెడుల మధ్యగల తేడా తెలుస్తుంది, కాని తప్పు చేసి కూడా నేను తప్పించుకోగలను అని తలస్తే అతడు తప్పు చేయడానికి వెనుకాడడు. బహిర్గతమౌతుందనే భయం లేనంత వరకు అతడు తన పాపపు తలంపులకు పూర్తిగా అవకాశమిస్తాడు. దావీదు వలెకాక, అతని తప్పులు బయటికి వస్తే, అతడు శిక్షను తప్పించుకోడానికి పథకాలు వేస్తాడు. అలాంటి వ్యక్తి యెహోవాను ఎంతగానో అగౌరవపరుస్తాడు. “వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు. . . . చెడుతనము వానికి అసహ్యము కాదు.”—కీర్తన 36:1, 4.
యితరులకు హాని చేయడం
సాధారణంగా, పాపంవల్ల ఒకరికంటే ఎక్కువమంది ప్రభావితమౌతారు. ఉదాహరణకు, వ్యభిచారం చేసే వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు; అతడు తన భార్యను పిల్లల్ని బాధిస్తాడు; పాపంలో భాగస్వామి వివాహితురాలైతే, అతడు ఆమె కుటుంబాన్ని కూడా బాధిస్తాడు; అతడు సంఘం యొక్క మంచి పేరును కూడా కళంకితం చేస్తాడు. అతడు దానినంతటిని ఎలా దృష్టిస్తాడు? హృదయపూర్వక దుఃఖాన్ని, నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తాడా? లేక “వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడుచున్నారు—యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతము చేయుచున్నారు” అని కీర్తన 94 నందు వివరించబడినటువంటి స్ఫూర్తిని చూపిస్తాడా?—కీర్తన 94:4-7.
అలాగే, సంఘంలో పరిశీలించబడే పాపాలలో హత్య, చంపడాలకు సంబంధించినవి చేరివుండవు. అయినప్పటికీ, యిక్కడ చూపబడిన స్ఫూర్తి—వ్యక్తిగత లాభం కొరకు యితరులను బాధించడానికి సిద్ధపడే స్ఫూర్తి—పెద్దలు ఒక తప్పును పరిశోధిస్తున్నప్పుడు బయటపడవచ్చు. ఇది కూడా గర్వమే, దుష్టుని చిహ్నమే. (సామెతలు 21:4) తన సహోదరుని కొరకు తనను తాను బలి చేసుకోడానికి సిద్ధపడే నిజమైన క్రైస్తవ స్ఫూర్తికి యిది పూర్తిగా విరుద్ధం.—యోహాను 15:12, 13.
దైవిక సూత్రాలను అన్వయించుకోవడం
నడిపింపునిచ్చే ఈ కొన్ని సూత్రాలు కట్టడలు చేయడానికి యివ్వబడినవికావు. అయితే అవి, యెహోవా నిజంగా దుష్టమైనవిగా భావించే వాటిని గూర్చిన ఆలోచననిస్తాయి. చేయబడిన తప్పును గూర్చిన బాధ్యతను అంగీకరించడాన్ని నిరాకరించడం జరుగుతున్నదా? పాపం చేసిన వ్యక్తి యిదే విషయంపై మునుపు యివ్వబడిన ఉపదేశాన్ని కఠినంగా నిరాకరించాడా? గంభీరమైన తప్పును అలవాటుగా చేయడం జరుగుతున్నదా? తప్పుచేసిన వ్యక్తి యెహోవా కట్టడల యెడల కఠినమైన అగౌరవ భావాన్ని ప్రదర్శిస్తున్నాడా? అతడు జరిగిన తప్పును దాచిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలుచేసి, అదే సమయంలో బహుశా యితరులను కూడా కలుషితం చేస్తున్నాడా? (యూదా 4) తప్పు బహిర్గతం అయినప్పుడు అలాంటి ప్రయత్నాలు తీవ్రతరమౌతున్నాయా? తప్పు చేసిన వ్యక్తి తాను యితరులకు, యెహోవా నామానికి కలుగజేసిన హానిని గూర్చి పూర్తిగా అశ్రద్ధ చూపిస్తున్నాడా? ఆయన దృక్పథమెలా వుంది? దయాపూర్వకంగా లేఖనాధార ఉపదేశం యివ్వబడిన తర్వాత, అతడు గర్వంగా, అహంకారంగా వున్నాడా? తప్పును మళ్లీ మళ్లీ చేయడాన్ని హృదయపూర్తిగా నిరాకరించే కోరిక కలిగిలేడా? పశ్చాత్తాప లోపాన్ని కచ్చితంగా సూచించే అలాంటి విషయాలను పెద్దలు గమనిస్తే, చేయబడిన పాపాలు కేవలం శారీరక బలహీనత వల్ల కాదుగాని దుష్టత్వంవల్లనని రుజువుచేస్తున్నాయని వారు నిర్ధారించవచ్చు.
దుష్టమైన భావాలున్నట్లున్న వ్యక్తితో వ్యవహరించేటప్పుడు కూడా, పెద్దలు అతడు నీతిని చేపట్టడానికి ప్రోత్సహించడం మానివేయరు. (హెబ్రీయులు 3:12) దుష్టులైన వ్యక్తులు పశ్చాత్తాపపడి, మారవచ్చు. అలా కాకపోతే, యెహోవా ఇశ్రాయేలీయులను యిలా ఎందుకు కోరాడు: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.” (యెషయా 55:7) బహుశా, న్యాయవిచారణ సమయంలో కూడా, పశ్చాత్తాపం చెందిన దృక్పథాన్ని ప్రతిఫలించే మారిన అతని హృదయ పరిస్థితిని పెద్దలు గుర్తిస్తారు.
ఒక వ్యక్తిని బహిష్కరించేటప్పుడు కూడా పెద్దలు, కాపరుల వలె, అతడిని పశ్చాత్తాప పడమని కోరి, అతడు మళ్లీ యెహోవా అనుగ్రహానికి తిరిగి వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తారు. కొరింథులోని “దుష్టుని” జ్ఞాపకం చేసుకోండి. స్పష్టంగా, అతడు తన మార్గాన్ని మార్చుకున్నాడు, తర్వాత పౌలు అతన్ని తిరిగి సంఘంలోకి తీసుకోవడాన్ని సిఫారసు చేశాడు. (2 కొరింథీయులు 2:7, 8) రాజైన మనష్షే గురించి కూడా పరిశీలించండి. వాస్తవానికి అతడు ఎంతో దుష్టునిగా వున్నాడు, కాని చివరికి అతడు పశ్చాత్తాప పడినప్పుడు, యెహోవా అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు.—2 రాజులు 21:10-16; 2 దినవృత్తాంతములు 33:9, 13, 19.
నిజమే, క్షమించబడని పాపం కూడా వుంది—పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయబడే పాపం. (హెబ్రీయులు 10:26, 27) ఆ పాపం ఎవరు చేశారో యెహోవా మాత్రమే నిర్ణయిస్తాడు. అది నిర్ణయించడానికి మానవులకు అధికారం లేదు. సంఘాన్ని పరిశుభ్రంగా వుంచడం, పశ్చాత్తాపపడే పాపులను పునఃస్థాపించడానికి సహాయం చేయడం పెద్దల బాధ్యత. వారు దాన్ని వివేకం మరియు దీనత్వంతో చేస్తూ, వారి నిర్ణయాలు యెహోవా జ్ఞానాన్ని ప్రతిఫలింపజేయనిస్తే, మందను కాయడంలోని వారి ఈ అంశాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు.
[అధస్సూచీలు]
a మరింత సమాచారం కొరకు, కావలికోట (ఆంగ్లం) సెప్టెంబరు 1, 1981 నందలి 24-6 పేజీలను, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), సంపుటి 2 నందలి 772-4 పేజీలను చూడండి.
[29వ పేజీలోని చిత్రం]
అననీయ సప్పీరాలు కపటముతో పరిశుద్ధాత్మను మోసపుచ్చి, దుష్టహృదయాన్ని కనపర్చారు