కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 1/1 పేజీలు 20-23
  • పంచుకొనే అమూల్యమైన సంపద

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పంచుకొనే అమూల్యమైన సంపద
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అమ్మ ప్రేరణాత్మకమైన మాదిరి
  • మా సంపదను పూర్తికాలం పంచుకోవడం
  • ఒక లక్ష్యాన్ని సాధించుట
  • మాల్టా మరియు లిబియా
  • ఒక క్రొత్త పని నియామకం
  • కుష్టువ్యాధిగ్రస్థుల కాలనీ
  • సంపదచే బలపర్చబడడం
  • యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • నా సృష్టికర్తను సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ‘అన్నిరకాల ప్రజలకు అన్నివిధముల’ వాళ్లమయ్యాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 1/1 పేజీలు 20-23

పంచుకొనే అమూల్యమైన సంపద

గ్లోరియా మలస్పినా చెప్పినది

సిసిలి తీరం కనుమరుగయ్యాక, నేను నా భర్త మా గమ్యమైన మాల్టా సముద్రతీర ద్వీపంపై మా అవధానాన్ని కేంద్రీకరించాము. అది ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్ష! ఓడ తీరం చేరిన వెంటనే, మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు మాల్టాపై పొందిన అనుభవాన్ని మేము గుర్తుచేసుకున్నాము.—అపొస్తలుల కార్యములు 28:1-10.

అది 1953వ సంవత్సరం, అప్పుడు మాల్టాలో యెహోవాసాక్షుల ప్రకటనాపని చట్టపరంగా గుర్తింపబడలేదు. దానికి మునుపటి సంవత్సరం, మేము వాచ్‌టవర్‌ గిలియడ్‌ బైబిలు పాఠశాల నుండి పట్టభద్రులమై, ఇటలీలో సేవ చేయడానికి నియమించబడ్డాము. కేవలం కొంతకాలం ఇటలీ భాష నేర్చుకున్న తర్వాత, మాల్టాలో మా కొరకు ఏమి వేచివుందో చూడడానికి మేము ఆతురత కలిగివున్నాము.

యౌవనస్థురాలినైన నేను ఒక విదేశీ మిషనరీనెలా అయ్యాను? నన్ను వివరించనివ్వండి.

అమ్మ ప్రేరణాత్మకమైన మాదిరి

మా కుటుంబం 1926లో కెనడా, ఓన్‌టార్యో నందలి ఫోర్ట్‌ ఫ్రాన్సిస్‌లో నివసిస్తున్నప్పుడు, మా అమ్మ ఒక బైబిలు విద్యార్థి (యెహోవా సాక్షులు అప్పుడు అలా పిలువబడే వారు) నుండి ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది యిక ఎన్నటికీ మరణించరు అనే చిన్న పుస్తకాన్ని తీసుకుంది. ఆమె దాన్ని అత్యంతాసక్తితో చదివింది, అదే వారంలో ఆమె కావలికోట పత్రిక నుపయోగించి జరిగే సామూహిక బైబిలు పఠనానికి హాజరయ్యింది. అమ్మ అమితాసక్తిగల బైబిలు పాఠకురాలు, ఆమె దేవుని రాజ్యాన్ని గూర్చిన సమాచారాన్ని తాను వెదుకుతున్న సంపదలా అంగీకరించింది. (మత్తయి 6:33; 13:44) నాన్న నుండి దౌర్జన్యపూరితమైన వ్యతిరేకత వున్నప్పటికీ, శ్రద్ధ తీసుకోవలసిన ముగ్గురు చిన్న చిన్న ఆడపిల్లలు వున్నప్పటికీ, ఆమె తాను నేర్చుకుంటున్న దాన్ని సమర్థించింది.

తర్వాతి 20 సంవత్సరాల్లో అమ్మ కలిగున్న దృఢ విశ్వాసం, నేను మరియు తెల్మా, వయొలాలైన మా అక్కలు నీతియుక్తమైన నూతన లోకంలో నిత్యజీవాన్ని గూర్చిన అద్భుతమైన నిరీక్షణ గురించి తెలుసుకొనేలా చేసింది. (2 పేతురు 3:13) ఆమె ఎన్నో కష్టతరమైన శ్రమలను ఎదుర్కొంది, కాని ఆమె ఎన్నుకున్న మార్గం సరైనదా, కాదా అని మేము ఎన్నడూ శంకించలేదు.

నాకు కేవలం పది సంవత్సరాలున్నప్పుడు, 1931లో, మేము అమెరికా నందలి ఉత్తర మిన్నెసొటాలోని పొలం వద్దకు వెళ్లాము. అక్కడ మేము యెహోవాసాక్షులతో క్రమమైన సహవాసం నుండి దూరమైపోయాం కాని అమ్మ యిచ్చే బైబిలు ఉపదేశం నుండి మాత్రం దూరం కాలేదు. కల్‌పోర్టర్‌ లేక పూర్తికాల పరిచారకురాలిగా ఆమె అంకితభావంతో కూడిన సేవ, ఆమెతో పాటు నేను కూడా అదే పనిలో చేరాలని యిష్టపడేలా నన్ను ప్రేరేపించింది. నేను, నా యిద్దరు అక్కలు 1938లో డులుత్‌, మిన్నెసొటా నందలి సమావేశంలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మేము యెహోవాకు సమర్పించుకున్నాము.

నేను 1938లో ఉన్నత పాఠశాల విద్య ముగించిన తర్వాత, పయినీరుగా (కల్‌పోర్టర్‌కు క్రొత్త పేరు) నన్ను నేను పోషించుకోడానికి సహాయకరంగా వుంటుందని వ్యాపార సంబంధ శిక్షణ తీసుకొమ్మని అమ్మ నన్ను ప్రోత్సహించింది. నాన్న మమ్మల్ని విడిచిపెట్టి, తాను వేరుగా వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు గనుక ప్రాముఖ్యంగా అది మంచి సలహాగా నిరూపించబడింది.

మా సంపదను పూర్తికాలం పంచుకోవడం

చివరికి నేను 1947లో కాలిఫోర్నియాకు తరలివెళ్లి, సాన్‌ ఫ్రాన్సిస్‌కోలో పయినీరుపని ప్రారంభించాను. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగే “అన్ని జనాంగాల వ్యాప్తి” అనే సమావేశం కొరకు, సమావేశానికి ముందు చేయవలసిన పనులను చూస్తున్నప్పుడు, నేను ఫ్రాన్సిస్‌ మలస్పినాను కలిశాను. మిషనరీ పనిని గూర్చి మేమిద్దరం ఒకే గమ్యాన్ని కలిగివుండడం ఒక ప్రేమపూర్వక సంబంధాన్ని ప్రారంభించడానికి నడిపింది. మేము 1949లో వివాహం చేసుకున్నాము.

సెప్టెంబరు 1951లో, నేను ఫ్రాన్సిస్‌ 18వ గిలియడ్‌ తరగతికి ఆహ్వానింపబడ్డాము. ఐదు నెలల తీవ్రమైన శిక్షణ తర్వాత, మేము పట్టభద్రులమయ్యే రోజు అంటే 1952 ఫిబ్రవరి 10న, పాఠశాల అధ్యక్షుడైన నేథన్‌ హెచ్‌. నార్‌ మేము పంపబడే దేశాల పేర్లను అక్షర క్రమంలో తెలియజేశాడు. ఆయన “ఇటలీ, సహోదరుడు సహోదరి మలస్పినా,” అని చెప్పినప్పుడు, మేము అప్పటికే మా మనస్సుల్లో ప్రయాణిస్తున్నాము!

కొన్ని వారాల తర్వాత, మేము ఇటలీలోని జెనోవాకు, పది రోజుల ప్రయాణానికి న్యూయార్క్‌లో ఓడ ఎక్కాము. బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయ సభ్యులైన జొవెన్‌నీ డెచెకా మరియు మాక్స్‌ లార్‌సన్‌ మాకు వీడ్కోలు చెప్పడానికి ఓడరేవు దగ్గరికి వచ్చారు. దేశంలోకి ప్రవేశించడానికి ఎదురయ్యే సమస్యల గురించి బాగా ఎరిగున్న మిషనరీలు జెనోవాలో మమ్మల్ని కలిశారు.

మా చుట్టూ జరుగుతున్న దానంతటిని బట్టి ఉత్తేజితులమై, మేము బొలొగ్నాకు వెళ్లడానికి ఒక రైలు ఎక్కాము. మేము చేరిన తర్వాత చూసిన దృశ్యం ఏమిటంటే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వేయబడిన బాంబుల మూలంగా యిప్పటికీ అస్తవ్యస్తంగావున్న నగరం. కాని, కాఫీ గింజలను వేయిస్తుంటే వచ్చే కమ్మన్ని సువాసన, లెక్కలేనన్ని రకాల పాస్తాల కొరకు సిద్ధం చేయబడే అద్భుతమైన కూరల మసాలా వాసనలు నిండివున్న ఉదయ మారుతం వంటి అనేక ఆనందకరమైన విషయాలు కూడా అక్కడ వున్నాయి.

ఒక లక్ష్యాన్ని సాధించుట

మేము బట్టీపట్టిన అందింపు ప్రసంగాలతో మా పరిచర్యను ప్రారంభించి, సమాచారాన్ని అంగీకరించే వరకు లేదా తలుపు మూయబడే వరకు దాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం కొనసాగించేవాళ్లం. మమ్మల్ని మేము వ్యక్తం చేసుకోవాలనే కోరిక మేము పట్టుదలతో భాష నేర్చుకొనేలా పురికొల్పింది. నాలుగు నెలల తర్వాత, మేము నేపల్స్‌లో ఒక క్రొత్త మిషనరీ గృహానికి నియమించబడ్డాము.

ఈ పెద్ద నగరం దాని అద్భుతమైన దృశ్యాలకు పేరుపొందింది. అక్కడ మేము మా సేవలో ఆనందించాము, కాని మళ్లీ మరో నాలుగు నెలల తర్వాత, నా భర్తకు రోము నుండి సిసిలి వరకున్న సంఘాలను దర్శించే పనియైన ప్రయాణకాపరి పని లేదా సర్క్యూట్‌ పని అప్పగించబడింది. కొంతకాలానికి మేము మాల్టాను, అంతేగాక ఉత్తర ఆఫ్రికాలోని లిబియాను కూడా దర్శించాము.

ఆ సంవత్సరాల్లో నేపల్స్‌ నుండి సిసిలీకి చేసే రైలు ప్రయాణాలు శారీరక సహనానికి పరీక్షగా వుండేవి. మేము రద్దీగావున్న రైల్లోకెక్కి, సీట్ల మధ్యనున్న క్రిక్కిరిసివున్న స్థలంలో నిలబడేవాళ్లం, కొన్నిసార్లు ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నిలబడవలసి వచ్చేది. అయినా అది, మా చుట్టూవున్న వారి గురించి తెలుసుకోడానికి మాకు చక్కని అవకాశాన్నిచ్చింది. ఇంట్లో చేసిన మధ్యం నిండివున్న పెద్ద డబ్బా అనేకసార్లు దాని యజమానికి కూర్చునే స్థలంగా ఉపయోగపడేది, కొన్నిసార్లు దూర ప్రయాణంలో తన దాహాన్ని తీర్చుకోడానికి అతడు దాన్ని త్రాగేవాడు కూడా. స్నేహపూరితులైన ప్రయాణీకులు తమ రొట్టెను, మేమెంతో మెచ్చుకున్న మర్యాదపూర్వకమైన, ప్రేమపూర్వకమైన తమ అభివాదాన్ని మాతో పంచుకునేవారు.

సిసిలీలో, కొండపైనున్న సంఘాన్ని చేరడానికి కొండ ఎక్కేందుకు మూడున్నర గంటలసేపు ప్రయాణించవలసి వచ్చేది. మా సూట్‌కేసులను మోసుకెళ్లడానికి స్నేహితులు మాకు ఎదురు వచ్చేవాళ్లు. మన క్రైస్తవ సహోదరుల ప్రేమపూర్వక ఆహ్వానం మేము మా అలసట మరచిపోయేలా చేసింది. కొన్నిసార్లు మేము జాగ్రత్తగా నడిచే కంచరగాడిదలపై ప్రయాణించాము. కాని, కేవలం ఒక్క అడుగు అవి పొరపాటుగా వేసినా మేము పడిపోగల లోతుల్లోకి మేము ఎన్నడూ చూడలేదు. ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ మన సహోదరులు బైబిలు సత్యాల పక్షాన దృఢంగా నిలబడడం మమ్మల్ని బలపర్చింది, మాకు చూపబడిన ప్రేమ మేము వారితో వుండగలిగినందుకు కృతజ్ఞత చూపించేలా చేసింది.

మాల్టా మరియు లిబియా

సిసిలీ నందలి మన సహోదరుల జ్ఞాపకాలను పూర్తిగా నింపుకుని, మేము మాల్టాకు ప్రయాణించాము. అక్కడ అపొస్తలుడైన పౌలు దయగల ప్రజలను కనుగొన్నాడు, అలాగే మేము కూడా కనుగొన్నాము. సెంట్‌ పాల్స్‌ సముద్రశాఖ నందు ఏర్పడిన ఒక తుపాను, మొదటి శతాబ్దంలో చిన్న ఓడలు ఎదుర్కొన్న ప్రమాదాన్ని మేము అర్థం చేసుకోడానికి సహాయం చేసింది. (అపొస్తలుల కార్యములు 27:39–28:10) దాని తర్వాత లిబియా వుంది. మన పని నిషేధింపబడిన ఈ ఆఫ్రికా దేశంలో మేమెలా కొనసాగుతాము?

మళ్లీ ఒకసారి మేము పూర్తిగా వేరైన సంస్కృతిని చవిచూశాము. డౌన్‌టౌన్‌ ప్రాంతంలోని స్తంభాల వరుసలుగల వీధుల్లో మేము నడుస్తుండగా, ట్రిపోలి నగర దృశ్యాలు, శబ్దాలు నన్ను ఆకట్టుకున్నాయి. సహారా ఎడారిలోని కాల్చేసే పగటి ఎండను, రాత్రి చల్లదనాన్ని తట్టుకోడానికి పురుషులు ఒంటె వెంట్రుకలతో నేయబడిన వస్త్రాలు ధరించేవారు. తాము నివసించే ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు తగినట్లు మారే ప్రజల విధానాన్ని, మేము అర్థం చేసుకుని గౌరవించడం నేర్చుకున్నాము.

సహోదరుల జాగ్రత్తతో కూడిన ఆసక్తి, యెహోవాపై ఎక్కువగా ఆధారపడడాన్ని గూర్చి, అలాంటి పరిస్థితులలో ప్రకటించడాన్ని గురించి ఎక్కువగా తెలిసిన వారి సలహాలను పాటించడాన్ని గూర్చి మాకు ఎంతో నేర్పింది. మన క్రైస్తవ సహోదరులు ఎన్నో దేశాలకు చెందినవారు; అయినా యెహోవాకు తాము చేసే సేవలో వారు ఐక్యంగా పనిచేశారు.

ఒక క్రొత్త పని నియామకం

మన ప్రకటనా పనికి వ్యతిరేకత వున్నందున, మేము ఇటలీ విడిచిపెట్టవలసి వచ్చింది, కాని మేము 1957లో బ్రెజిల్‌లో ప్రకటించే క్రొత్త పని నియామకాన్ని సంతోషంగా అంగీకరించాము. ఫ్రాన్సిస్‌ మరియు నేను అక్కడి జీవనానికి, సాంప్రదాయాలకు అలవాటు పడ్డాము, ఎనిమిది నెలల తర్వాత ఫ్రాన్సిస్‌ సర్క్యూట్‌ పని కొరకు పిలువబడ్డాడు. మేము బస్సు ద్వారా, విమానం ద్వారా, కాలినడకన ప్రయాణించాము. ఈ సువిశాల, అందమైన దేశంలో ప్రయాణించడం మాకు ఒక భూగోళశాస్త్ర పాఠంలా వుండేది.

మాకివ్వబడిన మొదటి ప్రాంతంలో, సావ్‌పౌలూ నగరంలోని పది సంఘాలు, అలాగే సావ్‌పౌలూ రాష్ట్ర దక్షిణ సముద్ర తీరం వెంబడి మరియు లోపల వున్న పది చిన్న పట్టణాలు చేరివున్నాయి. ఆ సమయంలో ఆ పట్టణాల్లో సంఘాలు లేవు. మేము వుండడానికి ఒక స్థలాన్ని కనుగొని, అక్కడ స్థిరపడిన తర్వాత రాజ్య వర్తమానంతో యింటింటికి వెళ్లేవాళ్లం. వాచ్‌టవర్‌ సంస్థ విద్యా సంబంధ చిత్రాలలో ఒకదాన్ని చూపించడానికి ఆహ్వానపత్రికలను కూడా యిచ్చేవాళ్లం.

బస్సులో చిత్రాలు, ప్రొజెక్టరు, ట్రాన్స్‌ఫార్మరు, ఫైళ్లు, సాహిత్యం, ఆహ్వానపత్రికలు, చిత్రం ఎక్కడ చూపబడుతుందో ఆ స్థలాన్ని ఆహ్వానపత్రికలపై చేతితో ముద్రించడానికి పరికరాలు, యివన్నీ తీసుకుని వెళ్లడం అంత చిన్నపనేమి కాదు. వీటితో పోల్చినప్పుడు మా బట్టలున్న చిన్నపెట్టె పెద్దవస్తువేమి కాదు. ఎగుడుదిగుడుగావున్న రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు కుదుపులకు పాడైపోకుండా ప్రొజెక్టరును మా ఒడిలో వుంచుకోవలసి వచ్చేది.

చిత్రాన్ని చూపించడానికి స్థలాన్ని కనుగొన్న తర్వాత, మేము యింటింటికి వెళ్లి చిత్ర ప్రదర్శన గురించి ఆహ్వానపత్రికలు అందజేసేవాళ్లం. కొన్నిసార్లు మేము రెస్టారెంట్‌లో లేక ఒక హోటల్‌లో చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతి తీసుకున్నాము. మరికొన్నిసార్లు మేము బహిరంగ స్థలంలో రెండు స్తంభాల మధ్య ఒక దుప్పటి కట్టేవాళ్లం. మునుపెన్నడు చలనచిత్రాన్ని చూడని అనేకమంది ఆసక్తిగల ప్రేక్షకులు, ఫ్రాన్సిస్‌ కథనాన్ని చదువుతుండగా నిలబడి శ్రద్ధగా వినేవాళ్లు. ఆ తర్వాత, మేము బైబిలు సాహిత్యాన్ని పంచిపెట్టేవాళ్లం.

గ్రామాలకు చేరడానికి మేము బస్సులో ప్రయాణించేవాళ్లం. కొన్ని నదులపై వంతెనలు వుండేవి కావు, కాబట్టి బస్సును ఒక పెద్ద తెప్పపై వేసి అవతలి గట్టుకు తరలించేవాళ్లం. మేము బస్సులో నుండి దిగి, బస్సు నదిలో పడిపోతున్నట్లు వుంటే, తెప్ప మునిగిపోకుండా మేము మరో వైపుకు వెళ్లి దాన్ని సమతూకం చేయాలని మాకు సలహా యివ్వబడింది. కృతజ్ఞతాపూర్వకంగా, మా బస్సు ఎన్నడూ నదిలో పడిపోలేదు—మంచి సంగతి, ఎందుకంటే ఆ నది మాంసాహారులైన పిరాన్హా చేపలకు ప్రసిద్ధి చెందింది!

మేము 1958లో న్యూయార్క్‌ నందు అంతర్జాతీయ సమావేశానికి హాజరైన తర్వాత బ్రెజిల్‌కు తిరిగి వచ్చాము, తర్వాత అక్కడ మళ్లీ మేము ప్రయాణ పనిలో కొనసాగాము. దక్షిణాన ఉరుగ్వే సరిహద్దు వరకు, పశ్చిమాన పరాగ్వే వరకు, ఉత్తరాన పెర్నాంబుకో రాష్ట్రం వరకు, బ్రెజిల్‌ యొక్క తూర్పు వైపున అట్లాంటిక్‌ మహాసముద్రం వరకు మేము పనిచేసే ప్రాంతం వుండేది.

కుష్టువ్యాధిగ్రస్థుల కాలనీ

ఒక కుష్టువ్యాధిగ్రస్థుల కాలనీలో సంస్థ చిత్రాలలో ఒకదాన్ని చూపించమని వచ్చిన ఆహ్వానాన్ని 1960వ దశాబ్ద మధ్య భాగంలో మేము అంగీకరించాము. నేను కొంతవరకు భయపడ్డానని ఒప్పుకోవలసిందే. మేము బైబిల్లో దాని గురించి చదివింది తప్ప కుష్టువ్యాధి గురించి మాకు ఎక్కువగా తెలియదు. తెల్లగా సున్నం వేయబడివున్న ఆవరణలోకి ప్రవేశించిన తర్వాత, మమ్మల్ని ఒక పెద్ద హాలు వైపుకు తీసుకువెళ్లారు. దాని మధ్యలో మా కొరకు, మా పరికరాల కొరకు, తాడుతో వేరు చేయబడిన కొంత స్థలాన్ని కేటాయించారు.

మాకు సహాయం చేస్తున్న విద్యుత్‌ కార్మికుడు ఆ కాలనీలో నివసిస్తున్న 40 సంవత్సరాల వ్యక్తి. అతడు తన చేతులను మణికట్టు వరకు కోల్పోయాడు, యింకా అతని శరీరంలోని యితర భాగాలు బాగా దెబ్బతినడం వల్ల అతని రూపం పూర్తిగా పాడైపోయింది. మొదట్లో నేను కంగారుపడ్డాను, కాని అతని మంచి నడవడి, తన పనియందు అతను కలిగున్న నిపుణత నా కంగారు తగ్గేలా చేశాయి. అవసరమైన సిద్ధపాట్లు ముగించే లోపల మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాము. దానిలో నివసిస్తున్న వెయ్యిమంది రోగులలో, రెండువందల కంటే ఎక్కువమంది హాజరయ్యారు. వారు కుంటుతూ లోపలికి వస్తుండగా, వారనుభవిస్తున్న రోగం యొక్క అనేక వేర్వేరు దశలను మేము గమనించాము. మాకు అదెంతటి కదిలించే, కలచివేసే అనుభవం!

“ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ” గలవని ప్రార్థించిన కుష్టువానితో యేసు చెప్పిన మాటల గురించి మేము తలంచాము. ఆ వ్యక్తిని తాకుతూ యేసు, “నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని” అతనికి ధైర్యమిచ్చాడు. (మత్తయి 8:2, 3) కార్యక్రమం ముగిసిన తర్వాత, మేము వచ్చినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అనేకులు మా వద్దకు వచ్చారు, వారి పాడైపోయిన శరీరాలు మానవజాతి గొప్ప వేదనకు సజీవ సాక్ష్యం. తర్వాత, యింకా ఎక్కువ నేర్చుకోవాలని ఆసక్తి వున్నవారితో స్థానిక సాక్షులు బైబిలు పఠనం చేశారు.

మేము 1967లో కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యల గురించి శ్రద్ధ తీసుకోడానికి అమెరికాకు తిరిగివచ్చాము. మేము వీటితో వ్యవహరిస్తుండగా, మళ్లీ మేము సర్క్యూట్‌పనిలో సేవచేసే ఆధిక్యతను పొందాము. తర్వాతి 20 సంవత్సరాల వరకు, నేను ఫ్రాన్సిస్‌తో కలిసి అమెరికానందు ప్రయాణ పనిలో భాగం వహించాను. ఆ సమయంలో ఆయన రాజ్య పరిచర్య పాఠశాలలో కూడా బోధించాడు.

తనకు యివ్వబడిన ఏపని గురించైనా శ్రద్ధ వహించే ప్రేమగల భర్తను, నమ్మకమైన సహవాసిని కలిగివుండడం నాకు ఎంతో ప్రోత్సాహకరంగా వుండేది! మేమిద్దరం కలిసి నాలుగు ఖండాలలోని భాగాలలో బైబిలు సత్య సంపదను పంచుకొనే ఆధిక్యతను పొందాము.

సంపదచే బలపర్చబడడం

తర్వాత, 1924లో బాప్తిస్మం తీసుకున్న డేవిడ్‌ ఈస్టర్‌ అనే నమ్మకమైన సహోదరున్ని అమ్మ 1950లో వివాహం చేసుకుంది. వాళ్లిద్దరు కలిసి పూర్తికాల పరిచర్యలో ఎన్నో సంవత్సరాలు సేవచేశారు. అయితే, అమ్మ జీవితంలోని చివరి కాలంలో, ఆమెకు అల్‌జైమర్‌ అనే వ్యాధి సోకింది. ఆ వ్యాధి వల్ల ఆమె తర్కించే శక్తిని కోల్పోయింది గనుక ఆమె గురించి చాలా శ్రద్ధ తీసుకోవలసి వచ్చేది. మద్దతునిచ్చే మా అక్కలు మరియు డేవిడ్‌ ఆమె గురించి శ్రద్ధ తీసుకొనే బాధ్యతలో భాగం వహించారు, ఎందుకంటే పూర్తికాల పరిచర్య ప్రత్యేకాధిక్యతలను మేము కోల్పోకూడదని వారు ఆశించారు. అమ్మ 1987లో మరణించేంత వరకు ఆమె చూపించిన విశ్వాసంతో కూడిన మాదిరి, జీవితంలో మేము మా గమ్యాలను ఏర్పరచుకోడానికి ఎంతో సహాయం చేసింది, ఆమె కలిగివున్న పరలోకాశీర్వాద నిరీక్షణ మమ్మల్ని ఓదార్చింది.

ఫ్రాన్సిస్‌ 1989 నాటికి మునుపున్నంత బలంగా వుండడం లేదని నేను తెలుసుకున్నాను. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో బాగా వ్యాప్తిచెందిన స్నెయిల్‌ జ్వరం తన ప్రభావాన్ని చూపుతున్నదని మేము తెలుసుకోలేకపోయాము. ఈ కఠోరమైన శత్రువు 1990లో ఆయనను అధిగమించడంతో, యెహోవా సేవలో నేను 40 సంవత్సరాలు కలిసి భాగంవహించిన నా ప్రియమైన భాగస్వామిని కోల్పోయాను.

సర్దుబాట్లు జీవితంలో ఒక భాగం. కొన్ని సుళువుగా వుంటాయి, కొన్ని కష్టంగా వుంటాయి. కాని, బైబిలు సత్యపు అమూల్యమైన సంపదను యిచ్చే యెహోవా నన్ను తన సంస్థ ద్వారా, నా కుటుంబం యొక్క ప్రేమ మరియు ప్రోత్సాహం ద్వారా బలపర్చాడు. నేను విఫలంకాని యెహోవా వాగ్దానాలన్నిటి నెరవేర్పు కొరకు నిరీక్షిస్తుండగా, నేను యిప్పటికీ సంతృప్తి పొందుతున్నాను.

[23వ పేజీలోని చిత్రం]

నేను నా భర్త ఇటలీలో మిషనరీలుగా వున్నప్పుడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి