సాతాను మరియు అతని పనులపై విజయాన్ని సాధించడం
“దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”—యాకోబు 4:7.
1. ‘దుష్టుల చేయి’ నేడు మానవజాతిని ఎలా ప్రభావితం చేసింది?
యోబు యిలా సరిగ్గా పేర్కొన్నాడు: “భూమి దుష్టులచేతికి అప్పగింపబడియున్నది.” (యోబు 9:24) మరి మనం మన మానవ చరిత్రయంతటిలోని అతి క్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నాము. ఎందుకు? ఎందుకంటే యివి సాతాను భూమిపై చేసే పైశాచిక అధికారపు “అంత్యదినాలు.” సాతాను ప్రోద్బలం వల్ల, ‘దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోతున్నారు.’ (2 తిమోతి 3:1, 13) అంతేకాకుండా, హింసలు, అన్యాయాలు, క్రూరత్వాలు, నేరాలు, ఆర్థిక యిబ్బందులు, తీవ్రమైన రోగాలు, వార్థక్యంలో వచ్చే శ్రమలు, భావోద్రేక క్రుంగుదలలు—ఇవన్నీ మరియు వీటికంటే ఎక్కువ మన మీద భారంగా ఉంటాయి.
2. నేడు సాతాను దాడులను మనం ఎలా ఎదుర్కొనగలము?
2 గొప్ప శత్రువైన అపవాదియగు సాతాను, మానవజాతిపై, ప్రత్యేకంగా దేవుని నిజమైన ఆరాధికులపై బలమైన దాడి జరుపుతున్నాడు. యథార్థతను కాపాడుకోబోయే వారిని దేవునికి వ్యతిరేకంగా మరల్చి, తనతోనూ తన దయ్యాలైన దూతలతోనూ నాశనానికి తీసుకురావాలన్నది అతని ఉద్దేశము. అయితే, మనం యథార్థతలో కొనసాగినట్లైతే, అపవాది మననుండి పారిపోతాడనే హామీ మనకుంది. యేసులా, మనం అనుభవించే శ్రమల ద్వారా దేవుని యెదుట ‘విధేయతను నేర్చుకోగలము,’ అంతేకాక ఆయన అపారమైన కృపవల్ల మనం నిత్యజీవాన్ని పొందగలము.—హెబ్రీయులు 5:7, 8; యాకోబు 4:7; 1 పేతురు 5:8-10.
3, 4. (ఎ) పౌలు ఏ బాహ్య శ్రమలను ఎదుర్కొనవల్సి వచ్చింది? (బి) క్రైస్తవ పెద్దగా పౌలు ఏ విషయంలో శ్రద్ధ కల్గివున్నాడు?
3 అపొస్తలుడైన పౌలు కూడా ఎన్నో విధాలుగా పరీక్షించబడ్డాడు. తాను క్రీస్తు పరిచారకుడనేందుకు గల రుజువును పేర్కొంటూ ఆయన యిలా అన్నాడు: “నేనును మరి యెక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలుతింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని.
4 “ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నింటినిగూర్చిన చింతయు కలదు. ఈ భారము దిన దినమును నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?” (2 కొరింథీయులు 11:23-29) ఆ విధంగా, బైటినుండి హింసలనూ శ్రమలనూ ఎదుర్కొన్నప్పుడు పౌలు యథార్థతను కాపాడుకున్నాడు, మరి ఒక క్రైస్తవ పెద్దగా ఆయన సంఘంలోని బలహీనులైన సహోదర సహోదరీలు కూడా యథార్థతను కాపాడుకునేందుకు సహాయపడుతూ వారిని బలపర్చడంలో ఎంతో శ్రద్ధను కల్గివున్నాడు. నేడు క్రైస్తవ పెద్దలకు అది ఎంత చక్కటి మాదిరి!
హింస సమయంలో యథార్థత
5. నేరుగా వచ్చే హింసకు జవాబేమిటి?
5 యథార్థతను తునాతునకలు చేసేందుకు సాతాను ఏ ఉపకరణాలను ఉపయోగిస్తాడు? పైన సూచించినట్లుగా, సాతాను ఉపయోగించే అపాయకరమైన ఉపకరణం నేరుగా హింసించడం, అయితే దానికి జవాబు ఉంది. ఎఫెసీయులు 6:10, 11 మనకు యిలాంటి సలహానిస్తుంది: “తుదకు ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను [లేక “కుటిల కార్యాలను,” NW అథఃస్సూచి.] ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.”
6. యెహోవాసాక్షులు ‘అన్నిటిలో అత్యధిక విజేయులుగా’ బైటికి వచ్చారని ఎలా చూపించబడగలదు?
6 తరచూ ఈ అంత్యదినాల్లో, యెహోవాసాక్షులు శ్రమలను ఎదుర్కోవలసి వచ్చింది. కాబట్టి, పౌలుతో సహా మనం యిలా చెప్పవచ్చు: “మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.” (రోమీయులు 8:37) నాజీ తరమైన 1933 మరియు 1945 మధ్య కాలం వరకూ జర్మనీ, ఆస్ట్రియా, పోలండ్ మరియు యుగోస్లావియా నందలి కాన్సన్‌ట్రేషన్ క్యాంపుల్లోనూ, 1945 మరియు 1989 మధ్య కాలంలో ఉత్తర ఐరోపాలోని సామ్యవాద అణచివేత సమయంలోనూ, మరి యిటీవలి కాలాల్లో ఆఫ్రికా లాటిన్ అమెరికా నందలి కొన్ని ప్రాంతాల్లోని హింస సమయంలో యెహోవాసాక్షులు కనపర్చిన యథార్థతల నివేదికల వల్ల యిది నిరూపించబడింది.
7. యథార్థత విషయంలో ఇతియోపియానుండి ఏ ఉన్నత ఉదాహరణలు నివేదించబడ్డాయి?
7 ఇతియోపియా నందలి యెహోవాసాక్షులు, 1974 మరియు 1991 మధ్య కాలంలో యథార్థతకు ఎంతో కదిలించే మాదిరిని ఉంచారు. బందీగా ఉన్న ఒక సహోదరునితో రాజకీయ దృక్పథమున్న బంధించే ఒక వ్యక్తి యిలా అన్నాడు: “మిమ్మల్ని విడిచిపెట్టేకంటే జూలో ఉన్న సింహాలను విడిచిపెట్టడం మేలు!” ఈ క్రూరులైన హింసకులు యెహోవాసేవకులను పీడించారు, కొన్ని సంవత్సరాల తర్వాత అప్పీలు కోర్టు వీరికి మరణ దండనను కూడా విధించింది. హెచ్చరికా మాదిరిగా ఒక సహోదరుని శరీరాన్ని బహిరంగంగా ప్రదర్శించారు. మరణ శిక్ష వద్దని విన్నవించుకున్న యితర సహోదరులు మరీ కఠినం కాని కోర్టుల సహాయంతో విడుదలయ్యారు, అంతేకాకుండ ఈ నమ్మకమైన ‘విజేయులు,’ అడిస్ అబాబా నందు 1994 తొలిభాగంలో జరిగిన “దైవిక బోధ” జిల్లా సమావేశ కార్యక్రమంలో భాగం వహించారు.a—యోహాను 16:33; 1 కొరింథీయులు 4:9 పోల్చండి.
8. “జాతుల నిర్మూలనం” నుండి సాతాను ఎలా లాభాన్నార్జించేందుకు ప్రయత్నించాడు?
8 నేరుగా జరిపిన ముట్టడి ద్వారా అలాంటి యథార్థపరులైన సహోదర సహోదరీల యథార్థతను తునాతునకలు చేయడంలో సాతాను విఫలుడయ్యాడు. కనుక, ఏ యితర కుటిల కార్యాలను అతను చేస్తున్నాడు? ప్రకటన 12:12 ఈ అంత్యదినాలను గూర్చి యిలా చెబుతోంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.” హింసల ద్వారా దేవుని యథార్థమైన ప్రజలను నిర్మూలించే ప్రయత్నంలో విఫలమైనప్పుడు, యితరులతో సహా యెహోవా ప్రజలను సహితం నాశనం చేసే ఆలోచనతో పూర్తి జనాంగాన్ని తన కోపంతో నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ విధంగా జాతుల నిర్మూలనము మునుపటి యుగోస్లావియాలో జరిగించబడ్డాయి అంతేకాక లైబీరియా, బురుండి, రువాండాల్లోని ప్రాంతాలందు జాతి వినాశనాలు చేసే ప్రయత్నాలు జరిగాయి.
9. సాతాను కుతంత్రాలు ఎందుకు తరచూ విఫలమౌతాయి? ఉదాహరణలివ్వండి.
9 అయితే, తరచూ సాతాను తంత్రాలు అతని మీదికే తిరిగి దాడి జరుపుతాయి కారణం, సాతాను తెచ్చే బాధ, యెహోవాసాక్షులు ప్రకటించే దేవుని రాజ్యాన్ని గుర్తించడంలోనే తమ నిరీక్షణ ఉందని యథార్థహృదయులైన ప్రజలు గుర్తించేలా చేస్తుంది. (మత్తయి 12:21) వాస్తవానికి, ఆసక్తిగలవారు రాజ్యంలోకి కోకొల్లలుగా వస్తున్నారు! ఉదాహరణకు, మార్చి 26, 1994 నాడు యేసు మరణ జ్ఞాపకార్థ దినమందు, పోరాటాలతో నిండి ఉన్న బోస్నియా హెర్జిగోవినాలో 1,307 మంది హాజరయ్యారు, అంటే గత సంవత్సరంలోని సంఖ్య కంటే 291 మంది అధికం. సరాజీవో (414), జెనెస్సా (223), టుజ్లా (339) బన్యా ల్యుక (255) మరితర పట్టణాల్లో శిఖరాగ్ర హాజరు నమోదు చేయబడింది. పొరుగు దేశమైన క్రొయేషియాలో 8,326 మందితో కూడిన కొత్త శిఖరాగ్ర హాజరు ఉంది. తమ చుట్టూ జరిగే దౌర్జన్యం, ‘ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుము’ అనే ఆజ్ఞకు లోబడకుండా ఆ దేశాల్లోని యెహోవాసాక్షులను నివారించలేదు.—1 కొరింథీయులు 11:26.
పోరాటాలతో నిండిన రువాండాలో
10, 11. (ఎ) క్రైస్తవ రువాండా అనబడే దానిలో ఏమి సంభంవించింది? (బి) నమ్మకమైన మిషనరీలు తమ్మును తాము ఎలా వ్యక్తపర్చుకున్నారు?
10 రువాండా నందు 1993లో 2,080 మంది రాజ్య ప్రచారకులతో సహా 4,075 మంది “దైవిక బోధ” జిల్లా సమావేశానికి హాజరయ్యారు, అంతేకాకుండ 230 మంది బాప్తిస్మము పొందారు. వీరిలో, 142 మంది వెంటనే సహాయ పయినీర్లుగా సేవ చేయడానికి దరఖాస్తులు పెట్టారు. గృహ బైబిలు పఠనాల సంఖ్య 1994లో 7,655కి పెరిగింది—ఈ పెరుగుదలకు సాతాను సంతోషించడు. జనాబాలోని అధిక సంఖ్యాకులు తాము క్రైస్తవులమని చెప్పుకున్నప్పటికీ, జాత్యంతర హత్యలు ప్రారంభించబడ్డాయి. వాటికన్ యొక్క ల ఒసెర్వేతో రొమానో యిలా అంగీకరించింది: “ఇది పూర్తిగా జాతి విధ్వంసమే, అనుకోని రీతిలో దానికి కాథోలిక్కులు కూడా బాధ్యులు.” సుమారు అయిదు లక్షలమంది స్త్రీపురుషులు, పిల్లలు చనిపోయారు, మరియు సుమారు 20 లక్షలమందికి యిళ్లు లేకుండాపోయాయి లేక పారిపోవల్సివచ్చింది. వారి హింసా రహిత క్రైస్తవ తటస్థతను కాపాడుకుంటూ యెహోవాసాక్షులు కలిసి జీవించడానికి ప్రయత్నించారు. మన సహోదరుల్లో వందలమంది హత్యగావించబడ్డారు. అయితే 13 మంది హత్యగావించబడిన 65 రాజ్య ప్రచారకులు గల ఒక సంఘంలో ఆగస్టు 1993 కల్లా కూటాలకు హాజరయ్యేవారి సంఖ్య 170కి పెరిగింది. ప్రథమంగా వచ్చిన వాటిలో ఇతర దేశాల్లోని సాక్షులనుండి వచ్చిన పునరావాస సామాగ్రి ఉంది. బ్రతికి ఉన్న వారి కొరకు మనం ప్రార్థనలు చేస్తున్నాము.—రోమీయులు 12:12; 2 థెస్సలొనీకయులు 3:1, 2; హెబ్రీయులు 10:23-25.
11 భయంకర పరిస్థితుల నడుమ, రువాండాలోని ముగ్గురు మిషనరీలు తప్పించుకున్నారు. వారు యిలా రాశారు: “ప్రపంచమంతటిలోని మన సహోదరులు యిలాంటి లేక యింతకంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనవల్సి వస్తోందని, మరి అది ఈ దుష్ట విధానాంతానికి సూచన అని మేము గ్రహించాము. ఇంకా, ఒక వ్యక్తి దానిలో వ్యక్తిగతంగా యిమిడి ఉన్నప్పుడు, విషయాలను గూర్చిన వాస్తవ రూపాలను స్పష్టంగా గ్రహిస్తాడు అంతేకాకుండ ఒకడు జీవితపు విలువను గుణగ్రహించేలా అది చేస్తుంది. కొన్ని లేఖనాలు మనకు కొత్త భావాన్నిస్తాయి, మరి గతించిన సంగతులు యిక ఎన్నడూ మన మదిలోకి రాని కాలంకొరకు మనం ఎదురుచూస్తాం. ఈ మధ్య కాలంలో మనం యెహోవా సేవలో పనిరద్దీని కల్గివుండాలని కోరుకుంటాము.”
యథార్థతను కాపాడుకున్న యౌవనులు
12, 13. (ఎ) ఓ యౌవనురాలు యథార్థతను కాపాడుకునే ఏ విధానాన్ని అవలంభించింది? (బి) నేడు మన యౌవనులు ప్రోత్సాహాన్ని ఎక్కడ నుండి పొందగలరు?
12 సత్యం నిమిత్తము కుటుంబ సభ్యులతో సంబంధాన్ని తెంచుకున్నవారికి “నూరంతలు” ప్రతిఫలం దక్కుతుందని యేసు సూచించాడు. (మార్కు 10:29, 30) యెహోవా అన్నది దేవుని పేరు అని విన్న వెంటనే దాన్ని ఎంతగానో ప్రేమించిన ఎన్‌టీల్యా అనే పదేళ్ల ఉత్తర ఆఫ్రికా అమ్మాయి విషయంలో అది నిజం. ఆమె యెహోవాసాక్షులతో పఠించింది, తనను వ్యతిరేకించే తన కుటుంబం ఆమె తిరిగి వచ్చే సరికి యింటి తలుపులను మూసేసినప్పటికీ, ప్రతి సారి 90 నిమిషాలు నడిచి కూటాలకు హాజరయ్యేది. తన 13వ ఏట, ఆమె యింటింట ప్రకటించడం ప్రారంభించింది, కుటుంబ వ్యతిరేకత ఎక్కువయ్యింది. ఒక రోజు బంధువులు ఆమె చేతులు కాళ్లు కట్టేసి, మండే ఎండలో ఏడు గంటలపాటు పడుకోబెట్టి అప్పుడప్పుడు మురికి నీళ్లను మీద పోయించారు. వారు ఆమెను క్రూరంగా కొట్టి, ఒక కంటిని గాయపర్చారు, చివరికి ఆమెను యింటి నుండి తరిమి వేశారు. అయితే, ఆమె ఓ ఆసుపత్రిలో పనిచేసి, ఓ నర్సు అయ్యేందుకు అర్హతను సంపాదించుకుంది. తన 20వ ఏట ఆమె బాప్తిస్మము పొందింది, వెంటనే సహాయ పయినీరుగా చేరింది. ఆమె యథార్థతకు ముగ్ధులైన ఆమె కుటుంబం ఆమెను తమ యింటికి తిరిగి ఆహ్వానించింది, అంతేకాకుండ వారిలో తొమ్మిది మంది గృహ బైబిలు పఠనాన్ని అంగీకరించారు.
13 కీర్తన 116 నుండి ఎన్‌టీల్యా ప్రత్యేకంగా ఆమె మరలా మరలా చదివిన 1-4వ వచనాల నుండి ఎంతో ప్రోత్సాహాన్ని పొందింది: “యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు—యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.” యెహోవా అలాంటి ప్రార్థనలకు జవాబిస్తాడు!
14. పోలిష్ సాక్షులు శ్రేష్ఠమైన యథార్థతను ఎలా కనపర్చారు?
14 యేసు దినాల్లోలా, హింసా జ్వాలను రేపేందుకు మత ఛాందస్సతను సాతాను పూర్తిగా ఉపయోగించుకున్నాడు—అయితే అది నిష్ఫలమైంది. యెహోవాసాక్షుల 1994 వార్షిక పుస్తకం నందు వివరించినట్లుగా పోలండ్ నందలి సహోదరుల మాదిరి ఎంతో విశేషంగా ఉంది. యౌవనులు సహితం తమ యథార్థతను నిరూపించుకోవల్సిన అవసరం ఉంది. అటువంటి వారిలో 1946లో 15 ఏళ్ల ఓ అమ్మాయి ఉంది ఆమెతో యిలా చెప్పారు: “కాథోలిక్‌లు చేసేలా, శిలువ గుర్తు చేస్తే సరిపోతుంది. లేదా నీకొరకు బులెట్ ఎదురు చూస్తోంది!” ఆమెను అడవిలోకి లాక్కెళ్లారు, ఘోరంగా హింసించి, కాల్చి చంపారు, ఆమె తన యథార్థతను కాపాడుకుంది.—మత్తయి 4:9, 10 పోల్చండి.
సాతాను యొక్క యితర కుటిల తంత్రాలు
15, 16. (ఎ) సాతాను పైశాచిక సిద్ధాంతం ఏమిటి, మరి మనం అతన్ని ఎలా ఎదిరించగలము? (బి) మన యౌవనులు తొట్రిల్లవల్సిన అవసరం ఎందుకు లేదు?
15 “పాలించు లేదా నాశనం చేయు!” అన్నదే సాతాను నిజమైన పైశాచిక సిద్ధాంతం. ఉపయోగించేందుకు అతని వద్ద ఎన్నో క్రూరమైన ఆయుధాలున్నాయి. మరి అపొస్తలుడైన పౌలు యిలా హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు: “ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:12, 13) వస్తుపరమైన కోరికలూ నీచమైన వినోదమూ వాణిజ్యము, సాతాను సంబంధిత సంగీతం, పాఠశాలలో సహవాసుల ఒత్తిడి, మాదకద్రవ్య వినియోగమూ మరియు తాగుడు—వీటిలో ఏదైనా మన జీవితాలను నాశనం చేయగలదు. కాబట్టి, అపొస్తలుడు యింకా యిలా సలహానిస్తున్నాడు: “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.”—ఎఫెసీయులు 6:16.
16 సాతాను ఈ లోకాన్ని ముంచుతున్న విపరీతమైన సంగీతం దృష్ట్యా యిది మరి ప్రత్యేకంగా అవసరమనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో యిది సాతాను మతానికి నేరుగా సంబంధం కల్గివుంటుంది. సాన్ డీగో కౌన్‌టీ (అమెరికా) నందలి షెరీఫ్ కార్యాలయంనుండి వెలువడిన నివేదిక యిలా పేర్కొంది: “ఇక్కడ ఒక సంగీత కచేరి జరిగింది, ఆ కచేరిలో 15,000 మంది చిన్నపిల్లలు ‘నుతాసా,’—అంటే, సాతాను అనే మాటను తిరగేసి పలకడం.” “వారు నిరుత్సాహంతోనూ కోపంతోను ఒంటరిగా తిరుగులాడుతున్నారు గనుక,” సాతాను మతం కొందరు పిన్నలు పడిపోయే గోయి అని వర్ణించబడింది. క్రైస్తవ సంఘంలో ఉన్న యౌవనులారా మీరు పడిపోవల్సిన అవసరం లేదు! సాతాను క్షిపణులు ఎన్నడూ చొచ్చుకుపోలేని ఆత్మీయ కవచాన్ని యెహోవా మనకు అందిస్తాడు.—కీర్తన 16:8, 9.
17. భావోద్రేక కృంగుదలను ఎలా ఎదుర్కొనవచ్చు?
17 సాతాను మండే క్షిపణులు భావోద్రేకాలపై పనిచేసేలా రూపొందించబడ్డాయి. శారీరక అనారోగ్యం లేక కృంగిపోయే స్థితి వంటి జీవిత ఒత్తిళ్ల ద్వారా, మన శత్రువు మనలో పనికిరామనే భావనను కల్గిస్తాడు. దేవుని సేవలో అధిక గంటలను వెచ్చించలేకపోవడంవల్ల లేక సంఘ కూటాల్లో కొన్నింటికి హాజరు కాలేకపోవడంవల్ల ఒకరు నిరుత్సాహపడవచ్చు. పెద్దలు యిచ్చే ప్రేమపూర్వక శ్రద్ధ, యితర కరుణాహృదయులైన సహోదర సహోదరీల సహాయం కఠినమైన బాధలను నివారించేందుకు సహాయపడుతుంది. యెహోవా తన నమ్మకమైన సేవకులను ప్రేమిస్తాడని జ్ఞాపకముంచుకోండి. (1 యోహాను 4:16, 19) కీర్తన 55:22 యిలా పేర్కొంటోంది: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”
18. సాతాను తంత్రాల్లోని వేటితో కొందరు పోరాడవల్సి ఉంది?
18 సాతాను కుటిలతతో నిండిన “తంత్రములు” యిటీవల మరో రూపంలోకూడా దర్శనమిచ్చాయి. కొన్ని దేశాల్లో, సాతానుకు సంబంధించిన తెగలు తమను లైంగికంగా భంగపర్చడంవల్ల కల్గిన కలవరపర్చే ముద్రలు కలిగించే ఆలోచనలు తమపై దండెత్తుతున్నట్లుగా అనేకమంది వయోజనులు అనుభవిస్తున్నారు. అలాంటి ఆలోచనలు ఎక్కడనుండి వస్తాయి? విస్తృతమైన పరిశోధనలు జరిపినప్పటికీ, లౌకిక ఆలోచనలు ఎంతో వేరుగా ఉన్నాయి. బహుశ ప్రశ్నార్థకమైన మానసిక వైద్యంవల్ల, అలాంటి ఆలోచనలు ఊహలని కొందరు దృష్టిస్తున్నారు, మరి కొందరు అవి నిజంగా జ్ఞాపకాలేనని అనుకుంటున్నారు. మరి కొందరు చిన్నతనంలో కల్గిన ఏదొక మానసిక వ్యధ వల్ల కలిగిన ఒక రకమైన భ్రమ అని అనుకుంటున్నారు.
19. (ఎ) యోబు ఏ ఆలోచనలను ఎదుర్కొనవల్సి వచ్చింది? (బి) పెద్దలు ఎలీహు మాదిరిని ఎలా అనుసరించగలరు?
19 ఎలీఫజు మరియు జోఫరు ద్వారా సాతాను అందించిన ‘కలవరపర్చే తలంపులను,’ దేవుని సేవకుడైన యోబు ఎదుర్కోవాల్సివచ్చిందని తెలుసుకోవడం ఆసక్తికరం. (యోబు 4:13-18; 20:2, 3) అలా, తన మనస్సుపై దాడిచేసే ‘భీకరకార్యములను’ గూర్చి యోబుకు “దుఃఖము” కల్గడంవల్ల ఆయన “నిరర్థకమైన మాటలు” పలకడంలో పాల్గొన్నాడు. (యోబు 6:2-4; 30:15, 16) ఎలీహు యోబు చెప్పే వాటిని శాంతంగా విని, అన్ని విధాలా జ్ఞానయుక్తమైన రీతిలో యెహోవా విషయాలను ఎలా దృష్టిస్తాడో చూసేలా ఆయనకు యథార్థంగా సహాయపడ్డాడు. అదే విధంగా ఈనాడు, బాధను అనుభవించేవారిపై యింకా అధిక “బరువు” మోపకుండ అలాంటి వారి యెడల తాము శ్రద్ధను కనపరుస్తున్నామని అర్థంచేసుకునే పెద్దలు చూపుతారు. బదులుగా, ఎలీహులా, వారు చెప్పేవాటిని ఓపికతో విని, దేవుని వాక్యంలోని ఉపశమనమునిచ్చే నూనెను పూస్తారు. (యోబు 33:1-3, 7; యాకోబు 5:13-15) నిజమైన లేక ఊహాకల్పితమైన భయాందోళనల వల్ల భావోద్రేకపరంగా వ్యాకులత చెందిన వారు, లేక యోబు వలె, “స్వప్నములవలన . . . దర్శనములవలన . . . భయపడి” ఉన్నవారు సంఘంలో లేఖనాధారమైన ఓదార్పును పొందగలరు.—యోబు 7:14; యాకోబు 4:7.
20. బాధననుభవిస్తున్న క్రైస్తవులు తమ ఆత్మీయ సమతుల్యాన్ని కాపాడుకునేందుకు ఎలా సహాయాన్ని పొందగలరు?
20 ఒక విధంగా కాకపోతే మరో విధంగా ఈ ఘోరమైన ఆలోచనల వెనుక సాతాను ఉన్నాడని క్రైస్తవుడు ప్రస్తుతం నిశ్చయతను కల్గివుండగలడు. సంఘంలోని కొందరు ఈ విధంగా బాధపడుతున్నట్లైతే, భయానకమైన ఈ మానసిక ముద్రలు, వారి ఆత్మీయ సమతుల్యతను పాడుచేసేందుకు సాతాను నేరుగా చేసే ప్రయత్నమే అని గ్రహించేంతటి జ్ఞానులు వారు. వారికి ఓపికతో కూడిన లేఖనాధార మద్దతు అవసరం. ప్రార్థనా పూర్వకంగా యెహోవావైపు మరలడం వల్ల, మరియు ఆత్మీయ కాపుదలనుండి ప్రయోజనం పొందడంవల్ల, బాధను అనుభవించేవారు బలాధిక్యమును బాగుగా ఉపయోగించుకుంటారు. (యెషయా 32:2; 2 కొరింథీయులు 4:7, 8) ఆ విధంగా వారు నమ్మకంగా సహించగల్గి, దాడిచేసే దుష్ట తలంపులు సంఘంలోని శాంతిపై ప్రభావం చూపేందుకు అనుమతించకుండ నిరాకరిస్తారు. (యాకోబు 3:17, 18) అవును, “సాతానా పొమ్ము” అని యేసు అన్నప్పుడు ఏ స్ఫూర్తిని కనపర్చాడో అదే స్ఫూర్తితో అపవాదిని ఎదిరించగలరు.—మత్తయి 4:10; యాకోబు 4:7.
21. సాతాను మోసకరమైన విధానాలను గూర్చి లేఖనాలు ఎలా హెచ్చరిస్తున్నాయి?
21 అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 11:3 నందు హెచ్చరించినట్లుగా మన మనస్సులను ఏదొక రీతిగా పాడుచేయడమే సాతాను గురి అని మనకు తెలుసు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.” దేవుని నుండి వైదొలగిన శరీరులందరి లేక మానవ జాతి అంతటి ప్రస్తుత వినాశనం, నీచమైన ఉధృతులైన నోవహు కాలంలోని సంకరజాతి వారైన “పడినవారి” నైతిక భ్రష్టతను జ్ఞాపకంచేస్తుంది. (ఆదికాండము 6:4, 12, 13, అథఃస్సూచి NW; లూకా 17:26) కనుక, ప్రత్యేకంగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా తన కోపాన్ని చూపించేందుకు ఏదో కుతంత్ర విధానాన్ని ఉపయోగించేందుకు సాతాను పూనుకోవడం ఆశ్చర్యకరం కాదు.—1 పేతురు 5:8; ప్రకటన 12:17.
22. సాతాను అడ్డు తొలగించబడినప్పుడు, ఏ ఆశీర్వాదాలను అపేక్షించగలము?
22 బైబిలు గ్రంథమైన యోబు చివరి అధ్యాయాల్లో సాతాను విషయం ప్రస్తావించబడనే లేదు. మానవులు దేవుని యెడల యథార్థతను నిలుపుకోలేరనే అతని దుష్ట సవాలు యోబు యథార్థత వల్ల అబద్ధమని నిరూపించబడింది. అదే విధంగా, యథార్థతను నిలుపుకునే “గొప్ప సమూహము,” “మహాశ్రమలనుండి బయటికి” వచ్చినప్పుడు సాతానును అగాధంలోకి పడవేయడం జరుగుతుంది. యోబుతో సహా విశ్వాసం గల స్త్రీపురుషులు, ఆ “గొప్ప సమూహమును” చేరి పరదైసు ఆశీర్వాదాలను అనుభవిస్తారు, యోబును ఆశీర్వదించినదానికంటే ఘనంగా ఉంటుంది కదా!—ప్రకటన 7:9-17; 20:1-3, 11-13; యోబు 14:13.
[అధస్సూచీలు]
a గత 1992 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం నందలి 177వ పేజీని చూడండి.
పునఃసమీక్షకుగల ప్రశ్నలు
◻ యోబు, యేసు మరియు పౌలు ఏ చక్కటి యథార్థతా మాదిరిని నిలిపారు?
◻ యథార్థతను కాపాడుకునేవారు సాతానును ఎలా ఎదుర్కొన్నారు?
◻ సాతాను కుతంత్రాలను యౌవనులు ఎలా ఎదుర్కోగలరు?
◻ సాతాను తంత్రాలతో వ్యవహరించేందుకు ఏమి చేయబడగలదు?
[7వ పేజీలోని చిత్రం]
ఇతియోపియా నందు హత్య గావించబడిన తమ తండ్రి మాదిరిని అనుసరిస్తూ ఐస్యాటి మరియు యోలాన్ యిప్పుడు పూర్తికాలసేవను చేస్తున్నారు
[7వ పేజీలోని చిత్రం]
ఎన్‌టీల్యా ఉత్తర ఆఫ్రికా నందలి యథార్థతను కాపాడుకున్న యౌవనురాలు